పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/పరీక్షిత్తు దిగ్విజయయాత్ర


తెభా-1-391-వ.
అంత నటం బరీక్షిత్కుమారుండు జాతకర్మవిదులైన కోవిదులు సెప్పిన చందంబున భూసురోత్తమ శిక్షావశంబున మహాభాగవత శేఖరుండై ధరణీపాలనంబు సేయుచు నుత్తరుని పుత్రిక నిరావతి యను మత్తకాశినిం బెండ్లి యయి, జనమేజయ ప్రముఖులైన నలువురు గొడుకుల నుత్పాదించి, గంగాపులినతలంబునఁ గృపాచార్యుండు గురుత్వంబు సేయ యాగభాగంబులకు వచ్చిన దేవతల నీక్షించుచు భూరిదక్షిణంబులుగా మూఁడశ్వమేధంబు లాచరించి, దిగ్విజయ కాలంబున గోమిథునంబుఁ దన్ను శూద్రుండును, రాజచిహ్న ముద్రితుండును నగు కలిం బట్టి నిగ్రహించె"నని చెప్పిన, శౌనకుండు పౌరాణికున కిట్లనియె.
టీక:- అంతన్ = అంతట; అటన్ = అక్కడ; పరీక్షిత = పరీక్షత్తు అను; కుమారుండు = పిల్లవాడు; జాత = ప్రారబ్ద; పుట్టుక వలన వచ్చు; కర్మ = కర్మల గురించిన; విదులు = ;తెలిసిన వారు; ఐన = అయినట్టి; కోవిదులు = విధ్వాంసులు, జ్యోతిష్కులు; చెప్పిన = చెప్పిన; చందంబునన్ = వలె; భూసురోత్తమ = బ్రాహ్మణోత్తములు {భూసురోత్తమ - భూమికి దేవతలు బ్రాహ్మణులలో ఉత్తములు, బ్రాహ్మణోత్తములు}; శిక్షా = విద్యాభ్యాసము; వశంబున = వలన; మహా = గొప్ప; భాగవత = భాగవతులలో {భాగవతులు – భాగవతము పద్ధతిలో వర్తించువారు}; శేఖరుండు = శిఖరము వంటివాడు; ఐ = అయి; ధరణీ = భూమిని; పాలనంబున్ = పరిపాలించట; చేయుచున్ = చేయుచు; ఉత్తరుని = ఉత్తరునియొక్క; పుత్రికన్ = కుమార్తెను; ఇరావతి = ఇరావతి; అను = అను; మత్తకాశినిన్ = సుందరిని {మత్తకాశిని - మదముచేత ప్రకాశించు ఆమె, స్త్రీ}; పెండ్లి = పెండ్లి; అయి = చేసుకొని; జనమేజయ = జనమేజయుడు; ప్రముఖులు = మొదలైన ప్రముఖులు; ఐన = అయినట్టి; నలువురు = నలుగురు; కొడుకులన్ = పుత్రులను; ఉత్పాదించి = పుట్టించి; గంగా = గంగానదియొక్క; పులిన = ఇసుకతిన్నె మీది; తలంబునన్ = సమస్థలమున; కృపాచార్యుండు = కృపాచార్యుండు; గురుత్వంబు = గురువుగా ఉండుట; చేయన్ = చేయగ; యాగ = యజ్ఞము లందలి; భాగంబులు = భాగముల; కున్ = కోసము; వచ్చిన = వచ్చిన; దేవతలన్ = దేవతలను; ఈక్షించుచున్ = చూచుచు; భూరి = అత్యధిక గొప్ప; దక్షిణంబులుగాన్ = దక్షిణలు కలవిగా; మూఁడు = మూడు; అశ్వమేధంబులున్ = అశ్వమేధ యాగములు; ఆచరించి = చేసి; దిక్ = దిక్కులను; విజయ = జయించు; కాలంబునన్ = సమయమున; గోమిథునంబున్ = ఆవు ఎద్దుల జంటను; తన్ను = తన్నుచున్న; శూద్రుండును = శూద్రుడును; రాజ = రాజుల యొక్క; చిహ్న = గుర్తులను; ముద్రితుండును = ధరించినవాడును; అగు = అయినట్టి; కలిన్ = కలిని; పట్టి = పట్టుకొని; నిగ్రహించెన్ = శిక్షించెను – హద్దులలో పెట్టెను; అని = అని; చెప్పినన్ = చెప్పగా; శౌనకుండు = శౌనకుడు; పౌరాణికుడు = సూతున {పౌరాణికుడు - పురాణములు చెప్పువాడు, సూతుడు}; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అక్కడ హస్తినాపురంలో రాజకుమారుడైన పరీక్షిత్తు, ప్రాజ్ఞులైన దైవజ్ఞులు చెప్పిన విధంగా భూసురోత్తముల ఉత్తమమైన శిక్షణ వలన మహాభక్త శిరోమణియై రాజ్యపాలనం చేయసాగాడు. పరీక్షిన్నరేంద్రుడు ఉత్తరుని కుమార్తెయైన ఇరావతి అనే తరుణీమణిని పరిణయమాడాడు. ఆ దంపతులకు జనమేజయుడు మొదలైన నలుగురు కుమారులు జన్మించారు. పరీక్షిత్తు గంగానదీతీరంలో కృపాచార్యుని పర్యవేక్షణలతో కూడిన మూడు అశ్వమేధయాగాలు చేసాడు. ఆ యజ్ఞాలలో దేవతలు ప్రత్యక్షంగా వచ్చి హవిర్భాగాలు అందుకొన్నారు. అనంతరం పరీక్షిన్మహారాజు జైత్రయాత్రకు బయలుదేరి దిక్కులన్నీ జయిస్తూ ఒక్కచోట గోమిథునాన్ని తన్నుతూ రాజచిహ్న ముద్రితుడై శూద్రవేషంలో ఉన్న కలి పురుషుని పట్టుకొని శిక్షించాడు.” అని చెప్పగానే శౌనకుడు సూతునితో ఇలా అన్నాడు.

తెభా-1-392-క.
"భూరరూపుఁడు శూద్రుఁడు
గోవుం దా నేల తన్నెఁ, గోరి పరీక్షి
ద్భూరుఁడు దిశల గెలుచుచు
నే విధిఁ గలి నిగ్రహించె, నెఱిఁగింపఁ గదే.

టీక:- భూవర = రాజు యొక్క {భూవర - భూమికి భర్త, రాజు}; రూపుఁడు = వేషము ధరించిన వాడు; శూద్రుఁడు = శూద్రుడు; గోవున్ = గోవులను; తాన్ = తాను; ఏల = ఎందులకు; తన్నెన్ = తన్నెను; కోరి = కావాలని; పరీక్షిత్ = పరీక్షితుడు అను; భూవరుఁడు = రాజు; దిశలన్ = నలు దిశలందలి రాజ్యములను; గెలుచుచున్ = గెలుచుచు; ఏ = ఏ; విధిన్ = విధముగ; కలిన్ = కలిని; నిగ్రహించెన్ = శిక్షించెను; కట్టుదిట్టము చేసెను; ఎఱిఁగింపఁగదే = తెలుపుము.
భావము:- "అయ్యా! సూతమహర్షీ! రాజవేషంలో ఉన్న శూద్రుడు గోవును ఎందుకు తన్నాడు. జైత్రయాత్ర సాగిస్తున్న పరీక్షిన్నరేంద్రుడు ఆ కలిని ఏ విధంగా నిగ్రహించాడు నాకు వివరంగా చెప్పు.

తెభా-1-393-మ.
విందాక్ష పదారవింద మకరందాసక్తులై యున్న స
త్పురుషశ్రేష్ఠుల వృత్తముల్ వినక దుర్బుద్దిన్ విలంఘించి, దు
ర్నవార్తాకథనప్రపంచములు గర్ణప్రాప్తముల్ సేసి, వా
ముల్ వ్యర్థతఁ దోచుచుండఁ జన దీ సంసారమోహంబునన్.

టీక:- అరవిందాక్ష = కృష్ణుని {అరవిందాక్షః - అరవిందములవంటి కన్నులున్నవాడు, విష్ణువు, కృష్ణుడు, విష్ణుసహస్రనామాలు 347వ నామం}; పద = పాదములు అను; అరవింద = పద్మముల; మకరంద = తేనె యందు; ఆసక్తులు = ఆసక్తి కలవారు; ఐ = అయి; ఉన్న = ఉన్నట్టి; సత్ = మంచి; పురుష = పురుషులలో; శ్రేష్ఠుల = శ్రేష్ఠమైనవారి యొక్క; వృత్తముల్ = వృత్తాంతములు; వినక = వినక; దుర్బుద్ధిన్ = దుర్బుద్ధితో; విలంఘించి = దూకి; దుర్నర = చెడ్డ మానవుల; వార్తా = వృత్తాంతములు కల; కథన = కథల; ప్రపంచములున్ = మొత్తములను; కర్ణ = చెవులలో; ప్రాప్తముల్ = పడునట్లు; చేసి = చేసి; వాసరముల్ = రోజులు; వ్యర్థతన్ = వ్యర్థముగా; తోచుచు = గడుపుతూ; ఉండన్ = ఉండుట; చనదు = చేయరాదు, తగదు; ఈ = ఈ; సంసార = సంసార మందలి; మోహంబునన్ = మోహముతో.
భావము:- నందనందన పాదారవింద మకరంద పానంచేత పరవశులైన ఉత్తమ పురుషుల పవిత్ర చరిత్రలు వినకుండా పెచ్చు పెరిగిన మచ్చరంతో దుశ్చరిత్రులకు చెవులొగ్గి. సంసారబంధాలకు లోబడి, పరమార్థాన్ని విస్మరించి, వ్యర్థంగా కాలం గడపరాదు.

తెభా-1-394-సీ.
నుట నిత్యము గాదు రణంబు నిజ మని-
యెఱిఁగి మోక్షస్థితి నిచ్చగించు
ల్పాయువు లగు మా న్యదుర్జన చరి-
త్రములోలిఁ గర్ణరంధ్రములఁ బెట్టి
బంగారు వంటి యీ బ్రతికెడు కాలంబుఁ-
బోనాడఁ గానేల పుణ్యచరిత!
మాధవపదపద్మ కరందపానంబు-
సేయింపవే యేము సేయునట్టి

తెభా-1-394.1-ఆ.
త్రయాగమునకు న్మునీంద్రులు సీర
వాఁడె దండధరుఁడు చ్చెఁ జూడు
చంపఁ డొకనినైన న్న మయ్యెడుదాక,
వినుచు నుండుఁ దగిలి విష్ణుకథలు.

టీక:- మనుట = జీవించుట; నిత్యమున్ = శాశ్వతము; కాదు = కాదు; మరణంబు = మరణము; నిజము = తధ్యము; అని = అని; ఎఱిఁగి = తెలిసికొని; మోక్షస్థితిన్ = మొక్షమును; ఇచ్చగించు = వాఛించు; అల్ప = స్వల్పమై మిగిలిన; ఆయువులు = జీవిత కాలము కలవారు; అగు = అయిన; మాకు = మాకు; అన్య = ఇతర; దుర్జన = చెడ్డవారి; చరిత్రముల్ = వృత్తాంతములు; ఓలిన్ = వరుసగా; కర్ణ = చెవుల; రంధ్రములన్ = కన్నములలో; పెట్టి = పెట్టి; బంగారు = బంగారము; వంటి = వంటి; ఈ = ఈ; బ్రతికెడు = బ్రతికి ఉండే; కాలంబున్ = కాలమును (కూడా); పోనాడఁగాన్ = పోగొట్టుకొనుట; ఏల = ఎందులకు; పుణ్య = పుణ్య వంతమైన; చరిత = ప్రవర్తనము కలవాడా; మాధవ = భగవంతుని; పద = పాదములు అను; పద్మ = పద్మముల; మకరంద = తేనెను; పానంబు = తాగుట; సేయింపవే = చేయించుము; ఏము = మేము; సేయునట్టి = చేయుచున్నట్టి;
సత్ర = సత్ర అను; యాగము = యజ్ఞము; కున్ = కు; సత్ = మంచి; ముని = మునులలో; ఇంద్రులన్ = ఇంద్రులు; చీరన్ = పిలువగా; వాఁడె = అతడే; దండధరుఁడు = యమధర్మరాజు {దండధరుఁడు - దండమును ధరించువాడు, యమధర్మరాజు}; వచ్చెన్ = వచ్చెను; చూడు = చూడుము; చంపఁడు = చంపడు; ఒకనిన్ = ఒక్కని; ఐన = అయినను; జన్నము = యజ్ఞము; అయ్యెడు = అయ్యే; దాకన్ = వరకు; వినుచున్ = వినుచును; ఉండున్ = ఉండును; తగిలి = (ఆసక్తితో) తగులుకొని; విష్ణు = విష్ణువుమూర్తి; కథలు = కథలు.
భావము:- పుణ్యచరిత్రా! బ్రతుకు శాశ్వతం కాదు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. అన్న సత్యాన్ని గుర్తించి మోక్షాన్ని కాంక్షించే అల్పాయుష్కులం మేము. అటువంటి మాకు అపవిత్రాలైన అల్పుల చరిత్రాలు చెవులొగ్గి ఆలకిస్తూ, బంగారం వంటి జీవిత కాలాన్ని పాడుచేసుకోవటం యుక్తం కాదు. అందువల్ల గోవింద పవిత్ర పదారవింద మకరందధారలు మాకు అనుగ్రహించు, మహానుభావా! మేము సాగిస్తున్న ఈ సత్ర్తయాగానికి మునీంద్రులు ఆహ్వానించగా యమధర్మరాజు విచ్చేసాడు చూశావా? ఈ యజ్ఞం పూర్తయ్యేదాకా ఆయన ఏ ఒక్కని ప్రాణం కూడా తీయకుండా, మైమరచి ఆసక్తితో వాసుదేవుని కథలు ఆలకిస్తున్నాడు.

తెభా-1-395-క.
మందునకు, మందబుద్ధికి,
మందాయువునకు, నిరర్థమార్గునకును, గో
వించరణారవింద మ
రంము గొనఁ దెఱపి లేదు రాత్రిందివముల్."

టీక:- మందున = చురుకు లేనివాని; కున్ = కి; మంద = మందమైన; బుద్ధి = బుద్ధి కలవాని; కిన్ = కి; మంద = తక్కవగా ఉన్న; ఆయువున = జీవితకాలము కలవాని; కున్ = కి; నిరర్థ = ప్రయోజనము లేని; మార్గున = జీవన మార్గము కలవాని; కును = కిని; గోవింద = కృష్ణుని స; చరణ = పాదములు అను; అరవింద = పద్మముల యొక్క; మరందమున్ = తేనె; కొనన్ = తీసుకొనుటకు, ఆస్వాదించుటకు; తెఱపి = సమయము; లేదు = లేదు; రాత్రిన్ = రాత్రులందును; దివముల్ = పగళ్ళందును, ఎప్పుడును.
భావము:- మందబుద్ధి, సోమరిపోతుతనం, అల్పాయుష్షు, పనికిమాలిన మార్గాలలో పయనించుట కల వానికి హరిచరణ కమల సుధాధారలను చవిచూడటానికి రాత్రింబవళ్లు తీరిక (సమయమే) దొరకదు.”
గమనిక:-   పారీక్షిత్త భాగవతం వివరించమని సూతుని అడుగుతు శౌనకుడు కలియుగపు మానవుల గురించి పలికిన పలుకులు. కలి ప్రభావం వల్ల మానవులు మందబుద్ధులు అల్పతరాయువులు అవుతారని తెలిసే వ్యాసభగవానుడు భాగవత రచనకి ఉపక్రమించాడు కదా.

తెభా-1-396-వ.
అని శౌనకుండు వలికిన సూతుం డిట్లనియెఁ ”బరీక్షిన్నరేంద్రుండు నిజవాహినీసందోహ సురక్షితంబగు కురుజాంగలదేశంబునం గలి ప్రవేశంబు నాకర్ణించి, యుద్ధకుతూహలత నంగీకరించి, యొక్కనాఁడు సముల్లాసంబున బాణాసనంబు గైకొని, నీల నీరద నిభ తురంగ నివహ యోజితంబును, ఫలిత మనోరథంబును నైన రథంబు నారోహణంబు సేసి, మృగేంద్ర ధ్వజంబు వెలుఁగ రథ, కరి, తురంగమ, సుభట, సంఘటితంబగు వాహినీచక్రంబు నిర్వక్రంబుగం గొలువ, దిగ్విజయార్థంబు వెడలి పూర్వ దక్షిణ పశ్చిమోత్తర సముద్ర లగ్నంబు లయిన యిలావృత, రమ్యక, హిరణ్మయ, హరివర్ష, కింపురుష, భద్రాశ్వ, కేతుమాల, భారతవర్షంబులు, నుత్తరకురు దేశంబులును, జయించి, పుష్కల ధన ప్రదానపూర్వికలగు సపర్యల నభ్యర్చితుండై తత్తద్దేశవాసు లిచ్చిన కానుకలు గైకొనుచు, మంగళ పాఠక సంఘాత జేగీయమాన పూర్వరాజ వృత్తాంతంబు లాకర్ణించుచుఁ, బాఠకపఠిత పద్యంబుల వలనం బాండవులకు భక్తవత్సలుండైన పుండరీకాక్షుం డాచరించిన సారథ్య, సఖ్య, సాచివ్య, సభాపతిత్వ, వీరాసనత్వ, దూతభావాది కర్మంబులు, నశ్వత్థామాస్త్ర తేజంబు వలనఁ దన్ను రక్షించుటయు, యాదవ పాండవు లందలి స్నేహానుబంధంబును, వారలకుఁ గలిగిన భగవద్భక్తి విశేషంబును విని, విశ్వంభరుని భక్త వాత్సల్యంబునకు నాశ్చర్యంబు నొందుచు, వందిబృందంబులకు న్మహార్ఘంబులగు హారాంబరాభరణాది సందోహంబుల నొసంగుచుఁ, బద్మనాభ పాద పద్మభజనపరతంత్ర పవిత్ర మానసుండై యుండె; నయ్యెడ వృషభరూపంబున నేక పాదంబున సంచరించు ధర్మదేవుండు దన సమీపంబున లేఁగలేని లేఁగటికుఱ్ఱి చందంబున హతప్రభయై నేత్రంబుల సలిలంబులు గురియుచు గోరూపయై యున్న ధాత్రి కిట్లనియె.
టీక:- అని = అని; శౌనకుండు = శౌనకుండు; పలికినన్ = పలుకగా; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; నరేంద్రుడు = రాజు; నిజ = తన; వాహినీ = సేనల {వాహిని - ఒక వాహిని అనే సేనావిశేషమునకు 81 రథములు 81 ఏనుగులు 243 గుఱ్ఱములు 405 కాల్బలము}; సందోహ = సమూహముచేత; సురక్షితంబు = సురక్షితముగ చేయబడినది; అగు = అయినట్టి; కురు = కురు రాజ్యములో; జాంగల = పల్లపు; దేశంబునన్ = ప్రదేశములో; కలి = కలియొక్క; ప్రవేశంబున్ = ప్రవేశించుటను; ఆకర్ణించి = విని; యుద్ధ = యుద్ధము నందు; కుతూహలతన్ = కుతూహలమును; అంగీకరించి = సమ్మతించి; ఒక్క = ఒక; నాఁడు = రోజు; సముల్లాసంబునన్ = చక్కటి ఉత్సాహముతో; బాణాసనంబున్ = విల్లును; కైకొని = చేతపట్టి; నీల = నల్లని; నీరద = మబ్బులు; నిభ = వంటి; తురంగ = గుఱ్ఱముల; నివహ = గుంపు; యోజితంబును = పూన్చబడినది; ఫలిత = ఫలింపజేయబడిన; మనోరథంబును = కోరిక కలది {మనోరథము - కోరిక, మనస్సును అటు ఇటు తీసుకుపోయే రథము}; ఐన = అయినట్టి; రథంబున్ = రథమును; ఆరోహణంబు = ఎక్కుట; చేసి = చేసి; మృగేంద్ర = సింహము గుర్తున్న {మృగములలో ఇంద్రుడు – సింహము}; ధ్వజంబు = పతాకము; వెలుఁగన్ = ప్రకాశించగ; రథ = రథములు; కరి = ఏనుగులు; తురంగమ = గుఱ్ఱములు; సుభట = మంచి కాలిబంట్లు – యోధులు; సంఘటితంబు = కూడుకొన్నది; అగు = అయిన; వాహినీ = సేనా; చక్రంబు = సమూహము; నిర్వక్రంబుగన్ = లోపాలు లేకుండగ; కొలువన్ = కొలుచుచుండగ; దిగ్విజయ = దిగ్విజయము {దిగ్విజయము - దిక్కులను కల రాజ్యములను జయించుటకు చేయునది}; అర్థంబు = కోసము; వెడలి = బయలుదేరి; పూర్వ = తూర్పు; దక్షిణ = దక్షిణ; పశ్చిమ = పశ్చిమ; ఉత్తర = ఉత్తర దిక్కులందు; సముద్ర = సముద్రముచే; లగ్నంబులు = చుట్టబడి ఉన్నవి; అయిన = అయినట్టి; ఇలావృత = ఇలావృతము; రమ్యక = రమ్యకము; హిరణ్మయ = హిరణ్మయము; హరివర్ష = హరివర్షము; కింపురుష = కింపురుషము; భద్రాశ్వ = భద్రాశ్వము; కేతుమూల = కేతుమూలము; భారత = భారత; వర్షంబులున్ = వర్షములును; ఉత్తర = ఉత్తర దిక్కున; కురు = కురు భూములలో ఉన్న; దేశంబులును = దేశములను; జయించి = నెగ్గి; పుష్కల = సమృద్ధమైన; ధన = ధనము; ప్రదాన = ప్రకృష్ట దానము (గొప్ప ఈవి); పూర్వికలు = ముందుండునది; అగు = అయినట్టి; సపర్యలన్ = సేవలచే; అభ్యర్చితుండు = చక్కగ పూజింపబడినవాడు; ఐ = అయి; తత్తత్ = ఆయా; దేశ = దేశములందు; వాసులు = వసించు వారు; ఇచ్చిన = ఇచ్చినటువంటి; కానుకలు = కానుకలు; కైకొనుచు = చేకొనుచూ; మంగళ = మంగళ కరమైన; పాఠక = చదువరుల {పాఠకులు – పద్యములు చదువు వారు}; సంఘాత = సంఘములచేత; జేగీయమాన = కొనియాడబడుచున్న; పూర్వ = పూర్వకాలపు; రాజ = రాజుల; వృత్తాంతంబులు = చారిత్రములు; ఆకర్ణించుచున్ = వినుచూ; పాఠక = చదువరులుచేత {పాఠకులు – పద్యములు చదువు వారు}; పఠిత = చదవబడిన; పద్యంబుల = పద్యముల; వలనన్ = వలన; పాండవుల = పాండవుల {పాండవులు - పాండురాజుపుత్రులు}; కున్ = కి; భక్త = భక్తులయందు; వత్సలుండు = వాత్సల్యము కలవాడు; ఐన = అయిన; పుండరీకాక్షుండు = కృష్ణుడు {పుండరీకాక్షుడు - పుండరీకముల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; ఆచరించిన = చేసిన; సారథ్య = రథము నడపుటలు; సఖ్య = స్నేహములు; సాచివ్య = మంత్రిత్వములు; సభాపతిత్వ = సభాపతిగా ఉండుటలు; వీరాసనత్వ = వీరాసనమున ఉండుటలు; దూతభావ = దూతగా చేయుటలు; ఆది = మొదలగు; కర్మంబులున్ = పనులును; అశ్వత్థామ = అశ్వత్థామ యొక్క; అస్త్ర = అస్త్రముల; తేజంబు = అగ్ని; వలనన్ = వలన; తన్ను = తనను; రక్షించుటయున్ = కాపాడుటయును; యాదవ = యాదవులు {యాదవ వంశస్థులగు వారు - యాదవులు}; పాండవులు = పాండవులు {పాండురాజు పుత్రులు - పాండవులు}; అందలి = మధ్యనున్న; స్నేహ = స్నేహమును; అనుబంధంబునున్ = అనుబంధంమును; వారలు = వారల; కున్ = కు; కలిగిన = సంభవించిన; భగవత్ = భగవంతుని యందలి; భక్తి = భక్తియొక్క; విశేషంబును = ప్రత్యేకతలును; విని = విని; విశ్వంభరుని = కృష్ణుని {విశ్వంభరుడు - విశ్వమును భరించువాడు, విష్ణువు}; భక్త = భక్తులయెడ కల; వాత్సల్యంబు = వాత్సల్యము; కున్ = కు; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యమును; ఒందుచు = పొందుచు; వంది = వంశస్తోత్రము చేయు వారి {వంది - వంశమును స్తోత్రము చేయువాడు}; బృందంబులు = బృందములు; కున్ = కు; మహా = గొప్ప; అర్ఘంబులు = వెలగలవి; అగు = అయిన; హార = హారములు; అంబర = వస్త్రములు; ఆభరణ = అలంకారములు; ఆది = మొదలగు; సందోహంబులన్ = సమూహములను; ఒసంగుచున్ = ఇచ్చుచున్; పద్మనాభ = కృష్ణుని {పద్మనాభుడు - పద్మము నాభి యందు కలవాడు, హరి}; పాద = పాదములు అను; పద్మ = పద్మముల ఎడల; భజన = భక్తియందు; పరతంత్ర = పరాధీనమైన; పవిత్ర = పవిత్ర; మానసుండు = మనసు కలవాడు; ఐ = అయి; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ; ఎడ = సమయమున; వృషభ = ఎద్దు; రూపంబునన్ = రూపములో; ఏక = ఒకే; పాదంబున = పాదముతో; సంచరించు = తిరుగుతున్న; ధర్మదేవుండు = ధర్మదేవుడు; తన = తనకు; సమీపంబునన్ = దగ్గరలో; లేఁగలేని = లేవలేని; లేఁగటి = కొత్తగా ఈనిన; కుఱ్ఱి = ఆవు; చందంబునన్ = వలె; హత = దెబ్బతిన్న; ప్రభ = తేజస్సుకలది; ఐ = అయి; నేత్రంబులన్ = కన్నులవెంట; సలిలంబులు = కన్నీరు; కురియుచున్ = కార్చుచు; గో = గోవు; రూప = రూపములో ఉన్నది; ఐ = అయి; ఉన్న = ఉన్నట్టి; ధాత్రి = భూదేవి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఈ విధంగా పలికిన శౌనకుని మాటలు నివి సూతుడు ఇలా చెప్పసాగాడు-"మునీంద్రా పరీక్షిన్నరేంద్రుడు తన సేనా సమూహం చేత రక్షించబడుతున్న కురు జాంగలదేశంలో కలిపురుషుడు ప్రవేశించాడని విన్నాడు. ఒకనాడు కదన కుతూహలం కలవాడై ఉప్పొంగే ఉల్లాసంతో విల్లు చేబట్టాడు. నీలమేఘాలవంటి గుఱ్ఱాలను కట్టిన సఫల మనోరథమైన రథాన్ని అధిరోహించాడు, సింహధ్వజం కాంతులు వెదజల్లుతుండగా రథ గజ తురగ పదాతి సంఘటిత అయి ముందుకు సాగే అపారసేనా వాహినితో విజయ యాత్రకు బయలుదేరాడు. తూర్పున, దక్షిణాన పశ్చిమాన, ఉత్తరాన ఉన్న సాగర తీరాలలోని ఇలావృత్తం. రమ్యకం, హిరణ్మయం, హరివర్షం, కింపురుషం, భద్రాశ్వం, కేతుమాలు, భారతవర్షం అనే దేశాలనూ ఉత్తర కురుదేశాలనూ జయించి. ఆయా దేశవాసులు కొనివచ్చి యిచ్చిన కానుకలు అందుకొన్నాడు వందిమాగధ బృందాలచే గానం చేయబడుతున్న పూర్వభూపతుల వృత్తాంతాలను ఆకర్ణించాడు. స్తోత్ర పాఠకులు పఠించిన పద్యాలవల్ల భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు పాండవులకు సారథిగా, ఇష్టసఖుడుగా, సచివుడుగా, సభాపతిగా, సంరక్షకుడుగా, దూతగా ఆచరించిన కృత్యాలన్నీ అర్థం చేసుకున్నాడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం విరజిమ్మే అగ్నిజ్వాలల నుంచి తనను రక్షించిన వృత్తాంతం తెలుసుకొన్నాడు. యాదవులకూ పాండవులకూ ఉన్న పరస్పర స్నేహానుబంధాన్నీ, వారికి గల శ్రీకృష్ణ భక్తినీ గ్రహించాడు. విశ్వంభరుని భక్తవాత్సల్యానికి పరమాశ్చర్య భరితుడైనాడు. స్తుతి పాఠకులకు బహుమూల్యాలైన హారాలూ, వస్త్రాలూ, అభరణాలూ బహూకరించాడు. పద్మనాభుని పాదపద్మారాధనంలో పరవశమై పవిత్రమైన మానసంతో ఉన్నాడు. ఆ సమయంలో వృషభాకారం ధరించి ఒంటికాలితో సంచరిస్తున్న ధర్మదేవుడు, దూడను వీడిన పాడి ఆవు మాదిరిగా కాంతి కోల్పోయి కన్నీళ్లు కారుస్తూ గోరూపధారిణి అయిన భూదేవితో ఇలా అన్నాడు.