పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/గర్భస్థకుని విష్ణువు రక్షించుట
తెభా-1-281-ఉ.
"కుయ్యిడ శక్తి లే దుదరగోళములోపల నున్నవాఁడ ది
క్కెయ్యది దా ననాథ నని యెప్పుడుఁ దల్లి గణింప విందు నే
డియ్యిషువహ్ని వాయుటకు నెయ్యది మార్గము నన్నుఁ గావ నే
యయ్య గలండు? గర్భజనితాపద నెవ్వఁ డెఱుంగు దైవమా!
టీక:- కుయ్యడన్ = కుయ్ అని ఏడ్చుటకు; శక్తి = నేర్పు; లేదు = లేదు; ఉదర = కడుపులోని; గోళము = పిండము; లోపలన్ = లోపల; ఉన్నవాఁడన్ = ఉన్నవాడిని; దిక్కు = శరణు; ఎయ్యది = ఏది; అనాథను = దిక్కులేని వాడను; అని = అని; ఎప్పుడున్ = ఎప్పుడు; తల్లి = తల్లి; గణింప = ఎంచుతుండగ; విందున్ = వినుచుందును; నేడు = ఈవేళ; ఈ = ఈ; ఇషు = బాణముయొక్క; వహ్నిన్ = అగ్నిని; పాయుట = దూరము చేయుట; కున్ = కు; ఏయ్యది = ఏది; మార్గము = దారి; నన్నున్ = నన్ను; కావన్ = కాపాడుటకు; ఏ = ఏ; అయ్య = మహాత్ముడు; కలండు = ఉన్నాడు; గర్భ = గర్భములో; జనిత = కలుగుతున్న; ఆపదన్ = ప్రమాదమును; ఎవ్వఁడు = ఎవడు; ఎఱుంగున్ = తెలిసికొనగలవాడు; దైవమా = దేవుడా.
భావము:- "ఏడ్వటానికైనా ఓపిక లేదు; తల్లిగర్భంలో తల్లడిల్లుతున్నాను; దిక్కులేని దీనుణ్ణి; అనాథ నంటు అనుక్షణం అమ్మ ఆక్రందించటం ఆలకిస్తుంటాను; ఈ బాణాగ్ని నివారించే ఉపాయం ఏమిటి; ఈ అపాయంనుంచి నన్ను ఆదుకొనే తండ్రి ఎక్కడ ఉన్నాడో; తల్లి గర్భంలో నేను అనుభవించే ఈ వేదన అర్థంచేసుకొనే దైవ మెవ్వరో ఏమిటో? భగవంతుడా! (తల్లి ఉత్తర గర్భంలో అశ్వత్థామ వేసిన బ్రహ్మశిరోనామకాస్త్ర జ్వాలలకు దందహ్యమాను డగుచున్న పరీక్షిత్తు ఇలా రోదిస్తున్నాడు.)
తెభా-1-282-క.
చిచ్చఱకోలవశంబునఁ
జచ్చి బహిర్గతుఁడఁ గాని సమయమునను దా
నుచ్చలిత గర్భవేదనఁ
జచ్చును మా తల్లి ఘోర సంతాపమునన్.
టీక:- చిచ్చఱ = అగ్నిమయమైన, చిచ్చు+అఱ (ఉకార సంధి); కోల = బాణము; వశంబునన్ = వలన; చచ్చి = చనిపోయి; బహిర్గతుఁడన్ = బయటపడువాడు; కాని = కానట్టి; సమయమునను = సమయములో; తాన్ = తను; ఉచ్చలిత = చెదరిపోయిన; గర్భ = గర్భమువలని; వేదనన్ = బాధతో; చచ్చును = చనిపోవును; మా = మాయొక్క; తల్లి = తల్లి; ఘోర = ఘోరమైన; సంతాపమునన్ = శోకముతో.
భావము:- అయ్యో ఈ చిచ్చులు చిమ్మే భయంకరబాణం వల్ల నేను చచ్చిపోవటం తథ్యం. కడుపులోని మృతశిశువును కనలేక అతిశయించిన గర్భవేదనతో అల్లాడి, అమ్మకూడా మరణించటం తప్పదు.
తెభా-1-283-క.
చెచ్చెర బాణజ్వాలలు
వచ్చిన విష్ణుండు గావవచ్చు ననుచుఁ దా
ముచ్చటలు సెప్పు సతులకు
నిచ్చలు మాయవ్వ నేఁడు నిజమయ్యెడినో.
టీక:- చెచ్చెర = గబగబా; బాణ = బాణము యొక్క; జ్వాలలు = మంటలు; వచ్చినన్ = వచ్చినచో; విష్ణుండు = హరి; కావన్ = కాపాడుటకు; వచ్చున్ = వచ్చును; అనుచున్ = అంటూ; తాన్ = తను; ముచ్చటలు = కబుర్లు; చెప్పు = చెప్పును; సతులు = చెలికత్తెలు; కున్ = కి; నిచ్చలు = నిత్యమును; మా = మాయొక్క; అవ్వ = తల్లి; నేఁడు = ఈవేళ; నిజము = నిజము; అయ్యెడినో = అవుతుందోలేదో.
భావము:- అమాంతంగా అస్త్ర జ్వాలలు నా పైకి వచ్చి పడినప్పుడు శ్రీహరి కాపాడుటకు వచ్చునని మా అమ్మ అనుదినం అందరితో అంటూ ఉంటుంది. అమ్మ చల్లని మాట యథార్థమౌతుందా?
తెభా-1-284-శా.
రాఁడా చూడ సమస్తభూతములలో రాజిల్లు వాఁ డిచ్చటన్
లేఁడా? పాఱుని చిచ్చఱమ్ముఁ దొలఁగన్ లీలాగతిం ద్రోచి నా
కీఁడా? నేఁ డభయప్రదాన మతఁ డూహింపన్ నతత్రాత ముం
గాఁడా? యెందఱిఁ గావఁ డీ యెడల మత్కర్మంబు దా నెట్టిదో?"
టీక:- రాఁడా = రాకపోతాడా; చూడన్ = చూచుటకు, కాపాడుటకు; సమస్త = అన్ని; భూతముల = జీవుల; లోన్ = లోను; రాజిల్లు = ప్రకాశించే; వాఁడు = వాడు; ఇచ్చటన్ = ఇక్కడ; లేడా = లేకపోతాడా; పాఱుని = బ్రాహ్మణుని; చిచ్చఱ = అగ్నిమయమైన; అమ్మున్ = బాణమును; తొలఁగన్ = తొలగించుటకు; లీలా = లీలతోకూడిన; గతిన్ = విధముగ; త్రోచి = తోసేసి; నాకు = నాకు; ఈఁడా = ఇవ్వడా; నేఁడు = ఇవాళ; అభయ = అభయమును; ప్రదానము = ప్రసాదించుట; అతఁడు = అతడు; ఊహింపన్ = ఆలోచించిన; నతన్ = మ్రొక్కినవారిని; త్రాత = సంరక్షించువాడు; మున్ = ఇంతకు ముందు; కాఁడా = అయి ఉండడా; ఎందఱిన్ = ఎందరిని; కావఁడు = కాపాడలేదు; ఈ = ఈ; ఎడల = విషయములో; మత్ = నాయొక్క; కర్మంబు = కర్మ; తాన్ = తాను; ఎట్టిదో = ఎలాంటిదో.
భావము:- అఖిల ప్రాణులలో అంతర్యామిగా ప్రకాశించే స్వామి నా కష్టాలు వీక్షించలేడా? నన్ను రక్షించటానికి రాడా? నిప్పులు చెరిగే ఈ బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేయడా? ఆపన్నుడనైన నాకు అభయమీయడా? కాపాడమని కైమోడ్చేవాళ్లను ఎందరినో కనికరించి కాచిన కరుణామయుడు నా మొరలాలించి నన్ను లాలించి పాలించడా? ఏమో నా అదృష్టం ఎలా ఉన్నదో?
తెభా-1-285-వ.
అని గతాగతప్రాణుండై భ్రూణగతుండైన శిశువు చింతించు సమయంబున.
టీక:- అని = అని; గత = ఉండినది; అగత = ఉండనిది యైన; ప్రాణుండు = ప్రాణము కలవాడు; ఐ = అయి; భ్రూణ = పిండము; గతుండు = వలె ఉన్నవాడు; ఐన = అయినట్టి; శిశువు = పిల్లవాడు; చింతించు = బాధపడుతున్న; సమయంబునన్ = సమయమున.
భావము:- ఇలా వస్తూపోతూ ఉన్న ప్రాణాలతో ఉత్తర కడుపులో పిండ రూపంలో ఉన్న చిన్నారి ఎన్నో విధాల చింతించసాగాడు.
తెభా-1-286-సీ.
మేఘంబుమీఁది క్రొమ్మెఱుఁగుకైవడి మేని-
పై నున్న పచ్చని పటమువాఁడు;
గండభాగంబులఁ గాంచన మణి మయ-
మకరకుండలకాంతి మలయువాఁడు;
శరవహ్ని నడఁగించు సంరంభమునఁ జేసి-
కన్నుల నునుఁ గెంపు కలుగువాఁడు;
బాలార్కమండల ప్రతిమాన రత్న హా-
టక విరాజిత కిరీటంబువాఁడు;
తెభా-1-286.1-తే.
కంకణాంగద వనమాలికా విరాజ
మానుఁ డసమానుఁ డంగుష్ఠమాత్రదేహుఁ
డొక్క గదఁ జేతఁ దాల్చి నేత్రోత్సవముగ
విష్ణుఁ డావిర్భవించె నవ్వేళ యందు.
టీక:- మేఘంబు = మేఘము; మీఁది = మీద ఉన్న; క్రొమ్మెఱుఁగు = క్రొత్త మెరుపుతీగ; కైవడిన్ = వలె; మేని = శరీరము; పైన్ = మీద; ఉన్న = ఉన్నట్టి; పచ్చని = పచ్చనిరంగు కల; పటమువాఁడు = వస్త్రము కలవాడు; గండభాగంబులన్ = చెక్కిళ్ళయందు; కాంచన = బంగారపు; మణి = రత్నములు; మయ = తాపింపబడిన; మకరకుండల = మకరకుండలములయొక్క; కాంతి = వెలుగు; మలయువాఁడు = పరచబడినవాడు; శర = బాణముల యొక్క; వహ్నిన్ = అగ్నిని; అడఁగించు = అణచివేయు; సంరంభమునన్ = ఆత్రుత, వేగిరిపాటు; చేసి = వలన; కన్నులన్ = కళ్ళలో; నును = చిక్కటి; కెంపు = ఎరుపురంగు; కలుగువాఁడు = కలవాడు; బాల = ఉదయిస్తున్న; అర్క = సూర్యుని; మండల = చక్రమును; ప్రతిమాన = పోలిన; రత్న = రత్నములతోను; హాటక = బంగారముతోను; విరాజిత = వెలుగొందుచున్న; కిరీటంబు = కిరీటము; వాఁడు = కలవాడు;
కంకణ = కంకణములు, మురుగులు; అంగద = భుజకీర్తులు; వనమాలికా = ఆకులు పువ్వులుతో కట్టిన మాలలతో; విరాజమానుడు = ప్రకాశించువాడు; అసమానుడు = సాటిలేనివాడు; అంగుష్ఠ = అంగుళం, ఏస్కుడు (బొటకనవేలు వెడల్పు); మాత్ర = అంతమాత్రమే; దేహుడు = దేహము కలవాడు; ఒక్క = ఒక; గదన్ = గదను; చేతన్ = చేతిలో; దాల్చి = ధరించి; నేత్ర = నేత్రములకు; ఉత్సవముగన్ = పండుగ అగునట్లు; విష్ణుడు = హరి; ఆవిర్భవించెన్ = ప్రభవించెను, పుట్టెను; ఆ = ఆ; వేళ = సమయ; అందున్ = లో.
భావము:- అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్ర తాపానికి ఇలా కనలుతుండగా. శ్రీకృష్ణుడు ఉత్తర ప్రార్థన మన్నించి అంగుళమంంత వానిగా గదాధారియై ఆవిర్భవించి, గర్భస్త బాలకుడిని కాపాడేడు. మేఘంమీద మెరుపుతీగలా, నల్లని దేహం మీద పచ్చని చేలం ధరించినవాడు, చెక్కిళ్ళపై మణులు పొదిగిన మరకకుండలాల పసిడికాంతుల ప్రసరించేవాడు, ఆ బ్రహ్మాస్త్ర అగ్ని జ్వాలల్ని చల్లార్చే సంరంభం వల్ల కళ్ళు రవ్వంత జేవురించిన వాడు, ఉదయిస్తున్న సూర్యబింబాన్ని పోలిన రత్నఖచిత సువర్ణ కిరీటం తలపై దాల్చినవాడు, కంకణాలతో, భుజకీర్తులతో, వనమాలికలతో విరాజిల్లేవాడు, అంగుష్ఠమాత్ర దేహుడు అయిన శ్రీమహావిష్ణువు గదాధరుడై కన్నులపండువుగా ఆ సమయంలో గర్భంలోని అర్భకుని ముందు అవిర్భవించాడు.
తెభా-1-287-వ.
ఇట్లు భక్తపరాధీనుం డయిన పరమేశ్వరుం డావిర్భవించి మంచు విరియించు మార్తాండు చందంబున శిశువునకు దశదిశలం దనచేతి యఖండిత మహోల్కాసన్నిభంబైన గదాదండంబు మండలాకారంబుగ జిఱజిఱం ద్రిప్పి విప్రుని చిచ్చఱమ్ము వేఁడిమి పోఁడిమిఁజెఱచి డింభకుని పరితాపవిజృంభణంబు నివారించి గర్భంబు గందకుండ నర్భకునికి నానందంబు గల్పించిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; భక్త = భక్తుల; పర = పరముగ; ఆధీనుండు = లొంగి ఉండువాడు; అయిన = అయినట్టి; పరమేశ్వరుండు = హరి; ఆవిర్భవించి = ప్రభవించి; మంచు = మంచును; విరియించు = విరిచేసే; మార్తాండు = సూర్యుని; చందంబునన్ = వలె; శిశువు = శిశువు; కున్ = కు; దశదిశలన్ = పది దిక్కులను {దశదిశలు - 4దిక్కులు 4మూలలు కింద పైన మొత్తం 10, తూర్పుదిక్కు, ఆగ్నేయమూల, దక్షిణదిక్కు, నైరృతిమూల, పడమరదిక్కు, వాయవ్యమూల, ఉత్తరదిక్కు, ఈశాన్యమూల, అథో, ఊర్థ్వములు}; తన = తనయొక్క; చేతి = చేతి; అఖండిత = అఖండమైన; మహా = మిక్కిలి పెద్దదైన; ఉల్కా = ఉల్కతో; సన్నిభంబు = సమానమైనట్టిది; ఐన = అయినట్టి; గదాదండంబున్ = గదాదండము; మండల = గుండ్రని; ఆకారంబుగన్ = ఆకారముగా; జిఱజిఱన్ = మిక్కిలి వేగముగ; త్రిప్పి = తిప్పి; విప్రుని = బ్రాహ్మణుని; చిచ్చఱ = నిప్పులు చిమ్మే; అమ్ము = బాణముయొక్క; వేఁడిమిన్ = తాపముయొక్క; పోఁడిమిన్ = ఉద్రిక్తతను; చెఱచి = చెదరగొట్టి; డింభకుని = పిల్లవాని; పరితాప = పరితాపముయొక్క; విజృంభణంబు = చెలరేగుటను; నివారించి = అరికట్టి; గర్భంబున్ = గర్భమును; కందకుండన్ = కందిపోకుండగ; అర్భకుని = పసిబిడ్డ; కిన్ = కు; ఆనందంబున్ = ఆనందమును; కల్పించినన్ = కలుగజేయగా.
భావము:- ఈ విధంగా సాక్షాత్కరించి భక్తపరాధీనుడైన భగవానుడు భానుడు మంచును పటాపంచలు గావించినట్లు మండుతున్న ఉల్కవంటి గదాదండాన్ని మండలాకారంగా శిశువు దశదిశలా గిరగిర త్రిప్పుతూ, సెగలు పొగలు గ్రక్కే బ్రహ్మాస్త్ర ప్రతాపాన్ని శాంతింపజేశాడు. కడుపు కసుకందకుండా పసికందు పరితాపాన్ని ఉపశమింపజేసి అపరిమితానందం కలిగించాడు.
తెభా-1-288-మ.
"గదఁ జేఁబట్టి పరిభ్రమించుచు గదాఘాతంబులం దుర్భయ
ప్రదమై వచ్చు శరాగ్నిఁ దుత్తుమురుగా భంజించి రక్షించు నీ
సదయుం డెవ్వఁడొకో?" యటంచు మదిలోఁ జర్చించుచున్ శాబకుం
డెదురై చూడ నదృశ్యుఁ డయ్యె హరి సర్వేశుండు విప్రోత్తమా!
టీక:- గదన్ = గదను; చేన్ = చేతితో; పట్టి = పట్టుకొని; పరిభ్రమించుచున్ = వేగముగ తిరుగుతూ; గదా = గదయొక్క; ఘాతంబులన్ = దెబ్బలచేత; దుర్భయ = మహచెడ్డభయమును; ప్రదము = పుట్టించునది; ఐ = అయి; వచ్చు = వచ్చుచున్న; శర = బాణమువలని; అగ్నిన్ = అగ్నిని; తుత్తుమురుగా = తుమురు+తుమురుగ, చిన్నచిన్నతునకలుగా; భంజించి = విరిచేసి; రక్షించు = రక్షించుచున్న; ఈ = ఈ; సదయుండు = మంచి దయ కలవాడు; ఎవ్వఁడొకో = ఎవరో; అటంచు = అనుకొనుచు; మది = మనసు; లోన్ = లోపల; చర్చించున్ = తర్కించుకొనుచు; శాబకుండు = శిశువు; ఎదురు = ఎదురుగ; ఐ = అయి; చూడన్ = చూడబోగా; అదృశ్యుఁడు = మాయమైనవాడు; అయ్యెన్ = ఆయెను; హరి = హరి; సర్వేశుండు = సమస్తమునకు ఈశ్వరుడు, కృష్ణుడు; విప్ర = బ్రాహ్మణులలో; ఉత్తమా = ఉత్తముడా.
భావము:- అరే ఎవరీ కరుణామూర్తి గదాహస్తుడై పరిభ్రమిస్తూ, భయంకరంగా పైనబడి బాధిస్తున్న బాణాగ్ని జ్వాలల్ని పటాపంచలు చేసి, నన్ను కటాక్షించి రక్షించిన ఈ దాక్షిణ్యమూర్తి ఎవరు అంటూ తర్కించుకొంటూ గర్భస్థశిశువు పరీక్షించేలోగా భగవంతుడు అంతర్హితుడైనాడు.