పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/అశ్వత్థామని తెచ్చుట


తెభా-1-159-క.
సురాజసుతుఁడు చూపెను
దువధి సుతశోకయుతకు ద్రుపదుని సుతకుం
రిచలితాంగశ్రేణిం
రుష మహాపాశ బద్ధపాణిన్ ద్రౌణిన్.

టీక:- సురరాజసుతుఁడు = అర్జునుడు {సురరాజసుతుడు - ఇంద్రుని కొడుకు, అర్జునుడు}; చూపెను = చూపించాడు; దురవధి = అంతులేని; సుత = పుత్ర; శోక = శోకంతో; యుత = కూడిన ఆమె; కున్ = కు; ద్రుపదునిసుత = ద్రౌపది {ద్రుపదునిసుత – దృపద మహారాజు పుత్రిక, ద్రౌపది}; కున్ = కి; పరిచలిత = వణుకుతున్న; అంగ = అవయవములు; శ్రేణిన్ = సమూహముగల; పరుష = మోటైన; మహా = పెద్దది అయిన; పాశ = త్రాటితో; బద్ధ = కట్టబడిన; పాణిన్ = చేతులుకలవాడు; ద్రౌణిన్ = ద్రోణుని పుత్రుని, అశ్వత్థామని.
భావము:- ఇచ్చిన మాట నెరవేర్చుకొన్న ఇంద్రనందనుడు, గట్టి త్రాళ్లతో కాళ్లూ చేతులూ బిగింపబడి గిలగిల కొట్టుకొంటున్న అశ్వత్థామను, పుత్ర శోకంతో పరితపిస్తున్న ద్రౌపది ముందు తెచ్చి పడేశాడు.

తెభా-1-160-వ.
ఇట్లర్జునుండు దెచ్చి చూపిన, బాలవధ జనిత లజ్జా పరాఙ్ముఖుం డైన కృపి కొడుకుం జూచి మ్రొక్కి, సుస్వభావ యగు ద్రౌపది యిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగా; అర్జునుండు = అర్జునుడు; తెచ్చి = తీసుకొని వచ్చి; చూపిన = చూపించగా; బాల = పిల్లలను; వధ = సంహరించుటచే; జనిత = పుట్టిన; లజ్జా = సిగ్గుచే; పరాన్ = పెడ; ముఖుండు = ముఖము వాడు; ఐన = అయినట్టి; కృపి = కృపి {కృపి - కృపాచార్యుని చెల్లెలు, ద్రోణుని భార్య}; కొడుకున్ = కొడుకుని; చూచి = చూసి; మ్రొక్కి = నమస్కరించి; సు = మంచి; స్వభావ = స్వభావముగలది; అగు = అయినట్టి; ద్రౌపది = ద్రౌపది; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.
భావము:- చిన్న పిల్లల ప్రాణాలు తీసిన తన నీచత్వానికి సిగ్గుతో అశ్వత్థామ ద్రౌపది ముందు తల ఎత్తలేకపోయాడు. సుగుణవతి అయిన ద్రౌపది పరాజ్ముఖుడైన అశ్వత్థామను చూసి, నమస్కరించి, ఇలా అన్నది

తెభా-1-161-మ.
"రఁగన్ మా మగవార లందఱును మున్ బాణప్రయోగోపసం
ణాద్యాయుధవిద్యలన్నియును ద్రోణాచార్యుచే నభ్యసిం
చిరి; పుత్త్రాకృతి నున్న ద్రోణుడవు; నీ చిత్తంబులో లేశముం
రుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపఁగాఁ బాడియే?

టీక:- పరఁగన్ = ప్రసిద్ధముగా; మా = మా యొక్క; మగవారలు = భర్తలు; అందఱును = అందరూ; మున్ = పూర్వము; బాణ = బాణములను; ప్రయోగ = ప్రయోగించుట; ఉపసంహరణ = మరల్చుట; ఆది = మొదలగు; ఆయుధ = అస్త్ర; విద్యలు = విద్యలు; అన్నియును = అన్నీ; ద్రోణ = ద్రోణుడు అను; ఆచార్యు = గురువు; చేన్ = వలన; అభ్యసించిరి = నేర్చుకొంటిరి; పుత్త్ర = పుత్రుని యొక్క; ఆకృతిన్ = రూపముతో; ఉన్న = ఉన్నటువంటి; ద్రోణుడవు = ద్రోణుడవు; నీ = నీ; చిత్తంబు = మనసు; లోన్ = లో; లేశమున్ = కొంచెము కూడా; కరుణ = దయ యొక్క; సంగము = స్పర్శ; లేక = లేకుండా; శిష్య = శిష్యుల యొక్క; సుతులన్ = పుత్రులను; ఖండింపఁగాన్ = చంపడం; పాడియే = న్యాయమా.
భావము:- “ఇంతకుముందు గురువర్యులు ద్రోణాచార్యులవారి సన్నిధిలోనే కదా మా మగవాళ్ళు అందరూ బాణాలు ప్రయోగించటం ఉపసంహరించటం మొదలైన యుద్ధవిద్యలు అన్నీ అభ్యసించారు. అశ్వత్థామా! నీవు పుత్రరూపంలో ఉన్న ద్రోణాచార్యుడవు కదా. అలాంటి నీకు హృదయంలో కనికరం అన్నది ఇసుమంతైనా లేకుండా ఇలా శిష్యుల సంతానాన్ని చంపడం న్యాయమా చెప్పు? నాయనా!

తెభా-1-162-క.
భూసురుఁడవు, బుద్ధిదయా
భాసురుఁడవు, శుద్ధవీరటసందోహా
గ్రేరుఁడవు, శిశుమారణ,
మాసురకృత్యంబు ధర్మ గునే? తండ్రీ!

టీక:- భూసురుఁడవు = బ్రాహ్మణుడవు; బుద్ధి = బుద్ధియందు; దయా = దయతో; భాసురుఁడవు = ప్రకాశించువాడవు; శుద్ధ = చక్కటి; వీర = వీరుల; భట = భటుల; సందోహ = సమూహములో; అగ్రేసరుఁడవు = పెద్దనాయకుడవు; శిశు = పిల్లలను; మారణము = సంహరించుట; అసుర = రాక్షసపు; కృత్యంబు = పని; ధర్మ = న్యాయము; అగునే = అవుతుందా; తండ్రీ = అయ్యా.
భావము:- తండ్రీ! దివ్యమైన బ్రాహ్మణుడివి కదయ్యా; వివేక, దయాదాక్షిణ్యాలతో ప్రకాశించేవాడివి కదయ్యా; వీరాధివీరులందరిలో ఎన్నదగ్గ వాడివి కదయ్యా; అలాంటి నువ్వు బాలుర ప్రాణాలు తీసే ఇలాంటి రాక్షసకృత్యానికి పాల్పడడం ధర్మమా? చెప్పు.

తెభా-1-163-శా.
ద్రేకంబున రారు, శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కిం
చిద్రోహంబును నీకుఁ జేయరు, బలోత్సేకంబుతోఁ జీఁకటిన్
ద్రాకారులఁ, బిన్నపాఁపల, రణప్రౌఢక్రియాహీనులన్,
నిద్రాసక్తుల సంహరింప నకటానీ చేతు లెట్లాడెనో?

టీక:- ఉద్రేకంబున = ఉద్రేకముతో; రారు = రారు; శస్త్ర = శస్త్రములు; ధరులు = ధరించినవారు; ఐ = అయి; యుద్ధ = రణ; అవనిన్ = భూమిలో; లేరు = లేరు; కించిత్ = కొంచెముకూడా; ద్రోహంబును = ద్రోహమును; నీకున్ = నీకు; చేయరు = చేయరు; బల = బలమువలని; ఉత్సేకంబు = ఉద్రేకము; తోన్ = తో; చీకటిన్ = చీకట్లో; భద్ర = బంగారములాంటి; ఆకారులన్ = రూపమున్న వారిని; పిన్న = చిన్న; పాఁపల = పిల్లలను; రణ = యుద్ధము; ప్రౌఢ = నేర్పుగా; క్రియా = చేయుట; హీనులన్ = రానివారిని; నిద్ర = నిద్రపోవుటందు; ఆసక్తులన్ = ఆసక్తితో ఉన్నవారిని; సంహరింపన్ = చంపుటకు; అకటా = అయ్యో; నీ = నీ యొక్క; చేతులు = చేతులు; ఎట్లు = ఎలా; ఆడెనో = వచ్చాయో.
భావము:- ఉద్రేకంతో నీ పైకి దూకలేదే; యుద్ధరంగంలో ఆయుధపాణులై ఎదురు నిలువలేదే; లవలేకం కూడా నీకు అపకారం చేయలేదే; అటువంటి చిన్నవాళ్లను, అందాలు చిందే పిన్నవాళ్లను, యద్ధవిద్యలు ఇంకా సరిగా నేర్వని వాళ్లను, నిద్రలో ఆదమరచి ఉన్న వాళ్లను కారుచీకటిలో, వీరావేశంతో వధించటానికి అయ్యో! నీకు చేతు లెలా వచ్చాయయ్యా?

తెభా-1-164-ఉ.
క్కట! పుత్త్ర శోక జనితాకులభార విషణ్ణచిత్తనై
పొక్కుచు నున్న భంగి నినుఁ బోరఁ గిరీటి నిబద్ధుఁ జేసి నేఁ
డిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత, నేఁ
డెక్కడ నిట్టి శోకమున నేక్రియ నేడ్చుచుఁ బొక్కుచున్నదో?"

టీక:- అక్కట = అయ్యో; పుత్త్రశోక = పుత్రులు పోయిన దుఃఖం వలన; జనిత = పుట్టిన; ఆకుల = బాధ యొక్క; భార = భారముతో; విషణ్ణ = దుఃఖ పడిన; చిత్తన్ = మనసు కల దానను; ఐ = అయి; పొక్కుచున్ = కుమిలిపోతూ; ఉన్న = ఉన్నట్టి; భంగిన్ = విధంగానే; నినున్ = నిన్ను; పోరన్ = యుద్ధములో; కిరీటి = అర్జునుడు; నిబద్ధున్ = బంధింపబడిన వానిగా; చేసి = చేసి; నేఁడు = ఇవాళ; ఇక్కడ = ఇక్కడ; కున్ = కు; ఈడ్చి = లాక్కొంటూ; తెచ్చుటన్ = తీసుకొచ్చుటను; సహింపనిది = ఓర్చుకో లేనిది; ఐ = అయి; భవదీయ = మీ యొక్క; మాత = తల్లి; నేఁడు = ఇవాళ; ఎక్కడన్ = ఎక్కడ; ఇట్టి = ఇలాంటి; శోకమున = దుఃఖముతో; ఏ = ఏ; క్రియన్ = విధంగా; ఏడ్చుచున్ = ఏడుస్తూ; పొక్కుచు = కుమిలిపోతూ; ఉన్నదో = ఉన్నదోకదా.
భావము:- పుత్రశోకంతో బరువెక్కి వ్యాకుల మైన చిత్తంతో నేను ఇక్కడ ఏడుస్తు ఉన్నాను. అలాగే పోరాటంలో అర్జునుడు నిన్ను కట్టేసి ఈడ్చుకొచ్చాడన్న విషయం తెలిసి, అయ్యయ్యో! అశ్వత్థామా! అక్కడ మీ అమ్మ కూడా తట్టుకోలేక ఎంతటి దుఃఖంతో కుమిలి పోతూ ఉంటుందో కదా.”

తెభా-1-165-వ.
అని కృష్ణార్జునులం జూచి యిట్లనియె.
టీక:- అని = అని పలికి; కృష్ణ = కృష్ణ; అర్జునులన్ = అర్జునులను; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = అన్నది.
భావము:- ఈ విధంగా అశ్వత్థామతో పలికి ద్రౌపది కృష్ణార్జునులను చూసి ఇలా అన్నది-

తెభా-1-166-ఉ.
"ద్రోణునితో శిఖింబడక ద్రోణకుటుంబిని యున్న దింట, న
క్షీతనూజ శోకవివశీకృతనై విలపించుభంగి నీ
ద్రౌణిఁ దెరల్చి తెచ్చుటకు దైన్యము నొందుచు నెంత పొక్కునో?
ప్రావియుక్తుఁడైన నతిపాపము బ్రాహ్మణహింస మానరే.

టీక:- ద్రోణుని = ద్రోణుని; తోన్ = తో; శిఖిన్ = అగ్నిలో; పడక = పడకుండా; ద్రోణ = ద్రోణునియొక్క; కుటుంబిని = భార్య; ఉన్నది = ఉన్నది; ఇంటన్ = ఇంటిలో; అక్షీణ = తరుగని; తనూజ = పుత్ర; శోక = శోకమున; వివశీకృతను = కలతచెందినబుద్ధి గలదానను; ఐ = అయి; విలపించు = ఏడ్చుచున్న; భంగిన్ = విధముగా; ఈ = ఈ; ద్రౌణిన్ = ద్రోణుడి పుత్రుని; తెరల్చి = మరల్చి; తెచ్చుట = తీసుకొని వచ్చిన; కున్ = అందుకు; దైన్యమున్ = దీనత్వమును; ఒందుచున్ = పొందుతూ; ఎంత = ఎంతగా; పొక్కునో = కుమిలి పోవునో; ప్రాణ = ప్రాణములు; వియుక్తుఁడు = విడిచినవాడు; ఐన = అయినచో; అతి = మిక్కిలి; పాపము = పాపము; బ్రాహ్మణ = బ్రాహ్మణులను; హింసన్ = హింసించుటను; మానరే = మానండి.
భావము:- “ఆచార్య ద్రోణునితో సహగమనం చేయకుండా ఆచార్యుని పత్ని అయిన కృపి ఇంకా బ్రతికే ఉంది. ఇలా ఒంటరి జీవితం గడుపుతున్న ఆ యిల్లాలు తన ఏకైక పుత్రుణ్ణి బంధించి పట్టుకు వెళ్లారని విని భరింపరాని పుత్రశోకంతో నాలాగే గుండెలు పగిలేటట్లు ఎంత అక్రోశిస్తున్నదో? మీరు ఈ అశ్వత్థామను హింసించటం మానండి. పాపం ఇతడు ప్రాణాలు కోల్పోతే మనకు మహాపాపం చుట్టుకుంటుంది.

తెభా-1-167-క.
భూపాలకులకు విప్రుల
గోపింపం జేయఁ దగదు కోపించినఁ, ద
త్కోపానలంబు మొదలికి
భూపాలాటవులఁ గాల్చు భూకంపముగన్."

టీక:- భూపాలకులు = రాజుల; కున్ = కి; విప్రులన్ = బ్రాహ్మణులను; కోపింపన్ = కోపించుట; చేయన్ = చేయుటకు; తగదు = తగినది కాదు; కోపించినన్ = కోపము చేసినచో; తత్ = ఆ యొక్క; కోప = కోపము అనే; అనలంబు = అగ్ని; మొదలి = మొదలకి; కిన్ = అంటా; భూపాల = రాజులు అను; అటవులన్ = అడవులను; కాల్చు = కాల్చివేయును; భూ = భూమి; కంపముగన్ = కంపించునట్లుగా.
భావము:- ప్రజాపాలకులగు క్షత్రియులు బ్రాహ్మణులకు కోపం తెప్పించేలా చేయరాదు. అలా చేస్తే, విప్రుల కోపాగ్ని జ్వాల కార్చిచ్చులా భూకంపంలా వారి వంశాల నాశనానికి దారితీస్తుంది.”

తెభా-1-168-వ.
అని యిట్లు ధర్మ్యంబును, సకరుణంబును, నిర్వ్యళీకంబును, సమంజసమును, శ్లాఘ్యంబునుంగాఁ బలుకు ద్రౌపది పలుకులకు ధర్మనందనుండు సంతసిల్లె; నకుల, సహదేవ, సాత్యకి, ధనంజయ, కృష్ణులు, సమ్మతించిరి; సమ్మతింపక భీముం డిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధంగా; ధర్మ్యంబును = ధర్మమునకు అనుకూలముగానూ; సకరుణంబును = దయతో కూడినవిగానూ; నిర్వ్యళీకంబును = కపటములేనివిగానూ; సమంజసమును = న్యాయబద్దముగానూ; శ్లాఘ్యంబునున్ = పొగడతగినదిగానూ; కాఁన్ = అగునట్లు; పలుకు = పలికే; ద్రౌపది = ద్రౌపది {ద్రౌపది - దృపదుని కూతురు}; పలుకులు = మాటలు; కున్ = కి; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుడు - ధర్మదేవతకొడుకు, ధర్మరాజు}; సంతసిల్లెన్ = సంతోషించెను; నకుల = నకులుడు; సహదేవ = సహదేవుడు; సాత్యకి = సాత్యకి; ధనంజయ = అర్జున; కృష్ణులు = కృష్ణులు; సమ్మతించిరి = ఒప్పుకొన్నారు; సమ్మతింపక = ఒప్పుకొనక; భీముండు = భీముడు; ఇట్లు = ఈ విధంగా; అనియెన్ = అన్నాడు.
భావము:- "ఇలా ద్రౌపది ధర్మసమ్మతంగా, దాక్షిణ్యసహితంగా నిష్కపటంగా, నిష్పక్షపాతంగా, న్యాయంగా, ప్రశంసనీయంగా పలికింది; ఆ పాంచాలి పలుకులకు ధర్మరాజు సంతోషించాడు; నకుల సహదేవులు, సాత్యకి, కృష్ణార్జునులు సమ్మతించారు; భీమసేనుడు మాత్రం తన అసమ్మతి ప్రకటిస్తూ ఇలా అన్నాడు

తెభా-1-169-చ.
"కొడుకులఁ బట్టి చంపె నని కోపము నొందదు; బాలఘాతుకున్
విడువు మటంచుఁ జెప్పెడిని వెఱ్ఱిది ద్రౌపది, వీఁడు విప్రుఁడే?
విడువఁగ నేల? చంపుఁ డిటు వీనిని మీరలు సంపరేని నా
పిడికిటిపోటునన్ శిరము భిన్నము సేసెదఁ జూడుఁ డిందఱున్."

టీక:- కొడుకులన్ = కొడుకులను; పట్టి = పట్టుకొని; చంపెన్ = చంపేసాడు; అని = అని; కోపమున్ = కోపం; ఒందదు = పొందదు; బాల = పిల్లలను; ఘాతుకున్ = సంహరించిన వానిని; విడువుము = వదిలిపెట్టండి; అటంచున్ = అంటూ; చెప్పెడిని = చెప్తోంది; వెఱ్ఱిది = వెఱ్ఱిబాగులది; ద్రౌపది = ద్రౌపది; వీఁడు = ఇతడు; విప్రుఁడే = బ్రాహ్మణుడా; విడువఁగన్ = వదలిపెట్టుట; ఏల = ఎందుకు; చంపుఁడు = చంపండి; ఇటు = ఇలా; వీనిని = ఇతనిని; మీరలు = మీరు; సంపరేని = చంపకపోతే; నా = నాయొక్క; పిడికిటి = పిడికిలి; పోటునన్ = పోటుతో; శిరము = తల; భిన్నము = బద్దలు; సేసెదన్ = కొడతాను; చూడుఁడు = చూడండి; ఇందఱున్ = మీరు అందరూ.
భావము:- “తన కన్నకొడుకులను చంపేసాడు అని తెలిసినా కూడ ఈ శిశుహంతకుడు అశ్వత్థామ మీద ఈ ద్రౌపది కోపం తెచ్చుకోటం లేదు; పైగా వదిలిపెట్టమంటోంది; ఎంత పిచ్చిదో చూడండి; బ్రాహ్మణుడు కదా వదలేయండి అంటోంది; ఇంతటి కసాయితనం చూపే వీడు బ్రాహ్మణుడా? చెప్పండి. వీడిని వదలవలసిన అవసరం ఏమీ లేదు; చంపెయ్యండి; మీరు కనుక చంపకపోతే నేనే ఓగుద్దు గుద్ది వీడి బుఱ్ఱబద్దలుకొట్టేస్తాను; మీరంతా చూస్తూ ఉండండి.”

తెభా-1-170-వ.
అని పలికిన, నశ్వత్థామకు ద్రౌపది యడ్డంబు వచ్చె; భీముని సంరంభంబు సూచి, హరి చతుర్భుజుం డయి, రెండు చేతుల భీముని వారించి, కడమ రెంటను ద్రుపద పుత్రికను దలంగించి, నగుచు భీముని కిట్లనియె
టీక:- అని = అని; పలికినన్ = పలుకగా; అశ్వత్థామ = అశ్వత్థామ; కున్ = కి; ద్రౌపది = ద్రౌపది; అడ్డంబు = అడ్డం; వచ్చె = వచ్చింది; భీముని = భీముని యొక్క; సంరంభంబు = వేగిరిపాటు; సూచి = చూసి; హరి = కృష్ణుడు; చతుర్ = నాలుగు; భుజుండు = భుజములుగలవాడు; అయి = అయి; రెండు = రెండు; చేతుల = చేతులతో; భీముని = భీముడిని; వారించి = ఆపి; కడమ = మిగిలిన; రెంటను = రెండింటితోను; ద్రుపదపుత్త్రికనున్ = ద్రౌపదిని; తలంగించి = తప్పించి; నగుచు = నవ్వుతూ; భీముని = భీముని; కిన్ = కి; ఇట్లు = ఈ విధంగా; అనియె = చెప్పాడు.
భావము:- భీముడు అన్నంత పనీ చేస్తాడనే భయంతో పాంచాలి అశ్వత్థామకు అడ్డం వచ్చింది. భీముని తొందరపాటు చూసి శ్రీకృష్ణుడు తన చతుర్భుజత్వం సార్థకంగా ఈ ప్రక్క రెండు చేతులతో భీముణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. ఆ ప్రక్క రెండు చేతులతో పాంచాలిని ప్రక్కకు తప్పిస్తూ భీమునితో నవ్వుతూ ఇలా చెప్పాడు.

తెభా-1-171-ఉ.
"వ్యుఁడు గాఁడు వీఁడు, శిశుహంత, దురాత్మకుఁ, డాతతాయి, హం
వ్యుఁడు, బ్రహ్మబంధుఁ డగుఁ ప్పదు నిక్కము ”బ్రాహ్మణో నహ
న్తవ్య" యటంచు వేదవిదితం బగుఁ గావున, ధర్మ దృష్టిఁ గ
ర్తవ్యము వీనిఁ గాచుట; యథాస్థితిఁ జూడుము, పాండవోత్తమా!"

టీక:- అవ్యుఁడు = రక్షింప తగ్గవాడు; కాఁడు = కాడు; వీఁడు = ఇతడు; శిశు = పిల్లలను; హంత = చంపినవాడు; దురాత్మకుడు = చెడ్డబుద్ధికలవాడు; ఆతతాయి = హత్యలుచేసేవాడు{ఆతతాయి - ఇంటికి నిప్పెట్టేవాడు, విషము పెట్టేవాడు, కత్తి పట్టుకొని నరికేవాడు, ధనము దోచుకొనే వాడు, నేల నపహరించువాడు, ఇతరుల భార్యను చెరపట్టేవాడు వీరు ఆరుగురుని ఆతతాయి అంటారు}; హంతవ్యుఁడు = చంపదగినవాడు; బ్రహ్మబంధుఁడు = భ్రష్టబ్రాహ్మణుడు {బ్రాహ్మబంధువు - భ్రష్టుడైన బ్రాహ్మణునకు జాతీయము}; అగున్ = అగును; తప్పదు = తప్పదు; నిక్కము = నిజము; బ్రాహ్మణోనహన్తవ్య = బ్రాహ్మణులను చంపరాదు; అటంచు = అని అంటూ; వేద = వేదములలో; విదితంబు = తెలుపబడినది; అగున్ = అయ్యున్నది; కావున = అందుచేత; ధర్మ = ధర్మమునకు తగిన; దృష్టిన్ = దృష్టితో; కర్తవ్యము = చేయవలసినది; వీనిన్ = ఇతడిని; కాచుట = కాపాడుట; యథాస్థితిన్ = ఉన్నపరిస్థితిని; చూడుము = చూడు; పాండవ = పాండవులలో; ఉత్తమా = ఉత్తముడా (భీమా).
భావము:- “పాండుకుల భూషణా! భీమా! శిశు ఘాతకుడు, దుష్టుడు, ఆతతాయి (ఇంటికి నిప్పెట్టేవాడు, విషము పెట్టేవాడు, కత్తి పట్టుకొని నరికేవాడు, ధనము దోచుకొనే వాడు, నేల నపహరించువాడు, ఇతరుల భార్యను చెరపట్టేవాడు వీరు ఆరుగురుని ఆతతాయి అంటారు) అయిన ఈ అశ్వత్థామ చంపదగినవాడే కాని రక్షింపదగినవాడు కానేకాదు. ఇది ముమ్మాటికీ సత్యం. అయితే”బ్రాహ్మణో న హంతవ్యః” అనే వేదవాక్యం వినవస్తున్నది. ఈ ధర్మసూక్ష్మం ప్రకారం ఇతణ్ణి రక్షించటమే న్యాయంగా తోస్తున్నది. యథార్థం నీవే ఆలోచించు” అన్నాడు.

తెభా-1-172-వ.
అని సరసాలాపంబులాడి, పవన నందను నొడంబఱచి యర్జునుం జూచి ”ద్రౌపదికి, నాకు, భీమసేనునకు సమ్మతంబుగ మున్ను నీ చేసిన ప్రతిజ్ఞయు సిద్ధించునట్లు, నా పంపు సేయు"మని నారాయణుం డానతిచ్చిన నర్జునుండు నారాయణానుమతంబున.
టీక:- అని = అని; సరస = సరసములైన; ఆలాపంబులు = మాటలు; ఆడి = చెప్పి; పవననందనున్ = భీముని {పవననందనుడు - వాయుదేవుని పుత్రుడు, భీముడు}; ఒడంబఱచి = ఒప్పించి; అర్జునున్ = అర్జుడిని; చూచి = చూసి; ద్రౌపది = ద్రౌపది; కిన్ = కిని; నాకు = నాకును; భీమసేనుడు = భీముడు; కున్ = కి; సమ్మతంబుగ = అంగీకారం అయ్యేటట్లుగా; మున్ను = ఇంతకుముందు; నీ = నీవు; చేసిన = చేసినట్టి; ప్రతిజ్ఞయు = ప్రతిజ్ఞకూడా; సిద్ధించున్ = నెరవేరే; అట్లు = విధంగా; నా = నా; పంపు = ఆజ్ఞ ప్రకారము; సేయుము = చెయ్యి; అని = అని; నారాయణుండు = కృష్ణుడు; ఆనతి = ఆదేశము; ఇచ్చిన = ఇవ్వగా; అర్జునుండు = అర్జునుడు; నారాయణ = కృష్ణుని; అనుమతంబున = సమ్మతితో.
భావము:- ఈ విధంగా చతురోక్తులతో, భీముడిని చల్లపరచి, శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి చూసి ”అర్జునా! ద్రౌపదికి, నాకు, భీముడికి సమ్మతమయ్యేలాగా, నీ ప్రతిజ్ఞ నెరవేరేలాగా ఈ విధంగా చెయ్యి.” అని కర్తవ్యం సూచించాడు; అర్జునుడు కృష్ణుని ఆజ్ఞ ప్రకారంగా. .