పోతన తెలుగు భాగవతము/పంచమ స్కంధము (ప్రథమాశ్వాసము)/ఆగ్నీధ్రాదుల జన్మంబు


తెభా-5.1-16-వ.
ఇట్లు ప్రియవ్రతుండు రాజ్యంబు చేయుచు విశ్వకర్మ ప్రజాపతి పుత్రిక యగు బర్హిష్మతి యనుదానిం బత్నిగాఁ బడసి, యా సతివలన శీల వృత్త గుణ రూప వీర్యౌదార్యంబులం దనకు సమానులైన యాగ్నీధ్రే ధ్మజిహ్వ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేతో, ఘృతపృష్ట, సవన, మేధాతిథి, వీతిహోత్ర, కవు లను నామంబులు గల పుత్రదశకంబును; నూర్జస్వతి యను నొక్క కన్యకను గాంచె; నందుఁ గవి మహావీర సవనులు బాలకులయ్యు నూర్ధ్వరేతస్కులై బ్రహ్మవిద్యానిష్ణాతులై యుపశమనశీలు రగుచుం బారమహంస్యయోగం బాశ్రయించి, సర్వజీవనికా యావాసుండును, భవభీతజనశరణ్యుండును, సర్వాంతర్యామియు, భగవంతుండు నగు వాసుదేవుని చరణారవిందావిరత స్మరణానుగత పరమ భక్తియోగానుభావంబున విశోధితాంతఃకరణు లగుచు నీశ్వరుతాదాత్మ్యంబుఁ బొందిరి; అంత.
టీక:- ఇట్లు = ఈ విధముగ; ప్రియవ్రతుండు = ప్రియవ్రతుడు; రాజ్యంబున్ = రాజ్యమును; చేయుచున్ = చేయుచూ; విశ్వకర్మ = విశ్వకర్మ అనెడి; ప్రజాపతి = ప్రజాపతి యొక్క; పుత్రిక = కుమార్తె; అగు = అయిన; బరిష్మతి = బరిష్మతి; అను = అనెడి; దానిన్ = ఆమెను; పత్ని = భార్య; కాన్ = అగునట్లు; పడసి = పొంది; ఆ = ఆ; సతి = భార్య; వలనన్ = అందు; శీల = శీలము నందు; వృత్త = వర్తనము నందు; గుణ = సుగుణము లందు; రూప = అందము నందు; వీర్య = శౌర్యము నందు; ఔదార్యంబులన్ = ఔదార్యమలు; అందున్ = అందును; తన = తన; కున్ = కు; సమానులు = సరి అగువారు; ఐన = అయిన; ఆగ్నీధ్ర = ఆగ్నీధ్రుడు; ఇధ్మజిహ్వ = ఇధ్మజిహ్వుడు; యజ్ఞబాహు = యజ్ఞబాహువు; మహావీర = మహావీరుడు; హిరణ్యరేతః = హిరణ్యరేతసుడు; ఘృతపృష్ట = ఘృతపృష్టుడు; సవన = సవనుడు; మేధాతిథి = మేధాతిథి; వీతిహోత్ర = వీతిహోత్రుడు; కవి = కవి; ఆను = అనెడి; నామంబులున్ = పేర్లు; కల = కలిగిన; పుత్ర = కుమారుల; దశకంబును = పదిమందిని; ఊర్జస్వతి = ఊర్జస్వతి; అను = అనెడి; ఒక్క = ఒక; కన్యకన్ = పుత్రికను; కాంచెన్ = కనెను; అందున్ = వారిలో; కవి = కవి; మహావీర = మహావీరుడు; సవనులున్ = సవనుడును; బాలకులు = పిల్లవాండ్రు; అయ్యున్ = అయినప్పటికిని; ఊర్ధ్వరేతస్కులు = బ్రహ్మచారులు {ఊర్ధ్వరేతస్కులు - ఊర్ధ్వ (పైకి ప్రసరించెడి) రేతస్కులు (రేతస్సు గలవారు), బ్రహ్మచారులు}; ఐ = అయ్యి; బ్రహ్మవిద్యా = బ్రహ్మవిద్య యందు; నిష్ణాతులు = మిక్కిలి నేర్పరులు; ఐ = అయ్యి; ఉపశమన = శాంతించిన; శీలురు = స్వభావములు గలవారు; అగుచున్ = అగుచూ; పారమహంస్య = పరమహంసలకు చెందిన; యోగంబున్ = యోగమును; ఆశ్రయించి = ప్రాపును పొంది; సర్వ = అఖిలమైన; జీవ = ప్రాణుల; నికాయ = సమూహమున; వాసుండునున్ = నివసించెడివాడు; భవ = సంసారము ఎడ; భీత = భయము చెందిన; జన = వారికి; శరణ్యుండునున్ = శరణము ఇచ్చువాడు; సర్వ = అఖిలమైన జీవుల; అంతర్యామియున్ = లోపలను ఉండెడివారు; భగవంతుడును = మహాత్మ్యము గలవాడును; అగు = అయిన; వాసుదేవునిన్ = విష్ణుమూర్తి యొక్క; చరణ = పాదములు యనెడి; అరవిందా = పద్మములను; ఆవిరత = విరామములేని; స్మరణ = ధ్యానము నందు; అనుగత = అనుసరించెడి; పరమ = అత్యధికమైన; భక్తియోగ = భక్తియోగము నందు; అనుభావంబునన్ = అనుభవపూర్వకముగా; విశోధిత = పరిశుద్ధిచేయబడిన; అంతఃకరణులు = మనసులు గలవాడు; అగుచున్ = అగుచు; ఈశ్వరున్ = భగవంతుని ఎడల; తాదాత్మ్యంబున్ = అది తానే అగుటను; పొందిరి = పొందిరి; అంతన్ = అంతట.
భావము:- ఈ విధంగా ప్రియవ్రతుడు రాజ్యం చేస్తూ విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె అయిన బర్హిష్మతి అనే యువతిని పెళ్ళాడి ఆమెవల్ల శీలంలోను, ప్రవర్తనలోను, గుణంలోను, రూపంలోను, పరాక్రమంలోను, ఔదార్యంలోను తనతో సమానులైన ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనే పదిమంది కొడుకులను, ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు. వారిలో కవి, మహావీరుడు, సవనుడు అనేవారు చిన్నవారైనా బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మవిద్యా నిష్ణాతులై శాంతమే స్వభావంగా గలవారై పరమహంస యోగాన్ని పొందినారు. సమస్త జీవులకు ఆవాసమైనవాడు, సంసార భయ భ్రాంతులకు శరణ్యమైనవాడు, సర్వాంతర్యామి, భగవంతుడు అయిన వాసుదేవుని పాదపద్మాలను సర్వదా స్మరించడం వల్ల లభించిన భక్తియోగం ప్రభావంతో మనస్సు మరింత పరిశుద్ధం కాగా ఈశ్వర తాదాత్మ్యం పొందారు.

తెభా-5.1-17-సీ.
సుధేశ! యా ప్రియవ్రతుఁ డొండు కాంత యం-
ధికుల మన్వంతరాధిపతుల
ఱియు నుత్తముఁడు తాసుఁడు రైవతుఁ డను-
సుతులను బుట్టించె సుమహితులను;
మున్ను జన్మించిన మువ్వురు పుత్రులు-
వ్యయ పదవికి రుగుటయును
నంతఁ బ్రియవ్రతుఁ ఖిల శాత్రవకోటిఁ-
న బాహుబలముచేను జయించి

తెభా-5.1-17.1-తే.
తఁడు బర్హిష్మతీ కాంతయందుఁ బ్రీతి
లిగి యౌవన లీలా వికాస హాస
హేలనాదులఁ జిత్తంబు గీలుకొల్పి
త వివేకుండుబోలె భోములఁ బొందె.

టీక:- వసుధేశ = రాజా {వసుధేశుడు - వసుధ (భూమికి) ఈశుడు (ప్రభువు), రాజు}; ఆ = ఆ; ప్రియవ్రతుడు = ప్రియవ్రతుడు; ఒండు = మరియొక; కాంత = భార్య; అందున్ = అందు; అధికులన్ = గొప్పవారిని; మన్వంతర = మన్వంతరములకు; అధిపతులన్ = ప్రభువులను; మఱియున్ = ఇంకను; ఉత్తముండు = ఉత్తముడు; తామసుడు = తామసుడు; రైవతుడున్ = రైవతుడు; అను = అనెడి; సుతులన్ = పుత్రులను; పుట్టించెన్ = పొందెను; సుమహితులను = చాలగొప్పవారిని; మున్ను = ముందు; జన్మించిన = పుట్టిన; మువ్వురు = ముగ్గురు; పుత్రులున్ = కుమారులును; అవ్యయ = శాశ్వతమైన; పదవి = స్థితి (ముక్త్తి); కిన్ = కి; అరగుటయున్ = వెళ్లుట; అంతన్ = అంతట; ప్రియవ్రతుండున్ = ప్రియవ్రతుడు; అఖిల = సర్వమైన; శాత్రవ = శత్రువుల; కోటిన్ = సమూహమును; తన = తన యొక్క; బాహుబలము = భుజబలము; చేతను = వలన; జయించి = జయించి.
అతడు = అతడు; బరిష్మతీ = బరిష్మతి యనెడు; కాంత = భార్య; అందున్ = ఎడల; ప్రీతిన్ = ఇష్టమున; కలిగి = కలిగుండి; యౌవన = యౌవన; లీలా = క్రీడలందు; వికాస = వికసించుటలు; హాస = నవ్వులు; హేలన = ఆనందించుటలు; ఆదులన్ = మొదలగువానియందు; చిత్తంబున్ = మనసును; కీలుకొల్పి = ప్రేరేపించుకొని; గత = నశించిన; వివేకుండును = వివేకముగలవాడు; పోలెన్ = వలె; భోగములన్ = భోగములను; పొందె = పొందెను.
భావము:- రాజా! ఆ ప్రియవ్రతుడు మరొక భార్యవల్ల ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనే ముగ్గురు కుమారులను కన్నాడు. వారు చాలా గొప్పవారు. మనువులై మన్వంతరాలకు అధిపతులయ్యారు. ముందు పుట్టిన కవి, మహావీరుడు, సవనుడు నాశనం లేని మోక్షపదాన్ని అందుకున్నారు. తరువాత ప్రియవ్రతుడు తన బాహుబలంతో సమస్త శత్రుసమూహాన్ని ఓడించాడు. బర్హిష్మతి మీద అతిశయించిన అనురాగంతో యౌవన వికాసాలైన హాసలీలావిలాసాలలో మనస్సును లగ్నం చేసి వివేకం కోల్పోయిన వానివలె అఖండ భోగాలను అనుభవించాడు.

తెభా-5.1-18-వ.
ఇట్లు ప్రియవ్రతుం డేకాదశార్బుద పరివత్సరంబులు రాజ్యంబు చేసి యొక్కనాడు మేరునగ ప్రదక్షిణంబు చేయు సూర్యునకు నపరభాగంబునం బ్రవర్తించు నంధకారంబు నివర్తింపంబూని భగవదుపాసనా జనితాతిపురుష ప్రభావుండై సవితృ రథసదృక్ష వేగంబు గలిగి తేజోమయం బైన రథంబు నారోహణంబు చేసి రాత్రుల నెల్ల దినంబు లొనర్తు నని సప్తరాత్రంబులు ద్వితీయ తపనుండునుం బోలె నరదంబు పఱపుటయు నా రథనేమి మార్గంబులు సప్తసముద్రంబులును, నా మధ్య భూసంధులు సప్తద్వీపంబులు నయ్యె; నందు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; ప్రియవ్రతుండు = ప్రియవ్రతుడు; ఏకాదశ = పదకొండు (11); అర్బుద = అర్బుదముల {అర్బుదము -వెయ్యి కోట్లు, 1 తరువాత 10 సున్నాలు}; పరివత్సరంబులు = సంవత్సరములు; రాజ్యంబున్ = రాజ్యము; చేసి = చేసి; ఒక్క = ఒక; నాడు = దినమున; మేరు = మేరువు అనెడి; నగ = పర్వతమును; ప్రదక్షిణంబున్ = చుట్టు తిరుగుట; చేయు = చేసెడి; సూర్యున్ = సూర్యుని; కున్ = కి; అపరభాగంబునన్ = వెనుక భాగము, రాత్రులందు; ప్రవర్తించు = కలిగెడి; అంధకారంబున్ = చీకట్లను; నివర్తింపన్ = పోగొట్టుటను; పూని = స్వీకరించి; భగవత్ = భగవంతుని; ఉపాసనా = సేవించుటచే; జనిత = పుట్టిన; అతిపురుష = మానవాతీతమైన; ప్రభావుండున్ = ప్రభావము గలవాడు; ఐ = అయ్యి; సవితృ = సూర్యుని; రథ = రథమునకు; సదృక్ష = సమానమైన; వేగంబున్ = వేగము; కలిగి = కలిగి; తేజస్ = తేజస్సుతో; మయంబున్ = నిండినది; ఐన = అయిన; రథంబున్ = రథమును; ఆరోహణంబు = ఎక్కుట; చేసి = చేసి; రాత్రులన్ = రాత్రులను; ఎల్లన్ = అన్నిటిని; దినంబులున్ = పగళ్ళు వలె; ఒనర్తును = చేసెదను; అని = అని; సప్త = ఏడు (7); రాత్రంబులున్ = రాత్రుళ్ళు; ద్వితీయ = రెండవ; తపనుండునున్ = సూర్యుని {తపనుండు – తపింప జేయువాడు, సూర్యుడు}; పోలెన్ = వలె; అరదంబున్ = రథమును; పఱపుటయున్ = పరుగెత్తించుటయు; ఆ = ఆ; రథ = రథచక్రముల; నేమి = చాళ్ళ యొక్క; మార్గంబులున్ = దారులలో; సప్త = ఏడు (7); సముద్రంబులునున్ = సముద్రములును {సప్తసముద్రములు - 1క్షార(కారపు సముద్రము) 2ఇక్షురస(చెరకురసముసముద్రము) 3సుర(సురాసముద్రము) 4ఆజ్య(నెయ్యిసముద్రము) 5క్షీర(పాలసముద్రము) 6దధి(పెరుగుసముద్రము) 7ఉదకంబులు(నీటిసముద్రము)}; ఆ = వాని; మధ్య = మధ్యభాగ మందలి; భూసంధులు = భూభాగములు; సప్త = ఏడు (7); ద్వీపంబులున్ = ద్వీపములును {సప్తద్వీపములు - 1జంబూ(జంబూద్వీపము) 2ప్లక్ష(ప్లక్షద్వీపము) 3శాల్మలిద్వీప(శాల్మలీద్వీపము) 4కుశ(కుశద్వీపము) 5క్రౌంచ(క్రౌంచద్వీపము) 6శాక(శాకద్వీపము) 7పుష్కరములు(పుష్కరద్వీపములు)}; అయ్యెన్ = అయినవి; అందున్ = వానిలో.
భావము:- ఈ విధంగా ప్రియవ్రతుడు పదకొండు అర్బుద సంవత్సరాలు రాజ్యం చేసాడు. ఒకనాడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్న సూర్యునికి ఆవలి భాగంలో కనిపించే చీకటిని రూపుమాపాలని అనుకున్నాడు. భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించడం వల్ల కలిగిన శక్తితో సూర్యుని రథంతో సమానమై తేజోమయమైన రథం ఎక్కి రాత్రులను పగళ్ళుగా మారుస్తానంటూ రెండవ సూర్యునిలాగా వెలిగిపోతూ ఏడుమార్లు సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేసాడు. అప్పుడు ప్రియవ్రతుని రథచక్రాలు గాళ్ళ వలన పడిన దారులు సప్త సముద్రా లయ్యాయి. ఆ గాళ్ళకు నడుమ ఉన్న భూమిపై సప్తద్వీపాలు ఏర్పడ్డాయి.

తెభా-5.1-19-సీ.
రస జంబూ ప్లక్ష శాల్మలిద్వీప కు-
క్రౌంచ శాక పుష్కరము లనఁగ
లరు నా ద్వీపంబులందు జంబూద్వీప-
మొరంగ లక్షయోము లయ్యె;
ట యుత్తరోత్తరాత సంఖ్యఁ దాద్విగు-
ణి మయి యొండొంటి తిశయిల్లు
క్షారేక్షురస సు రాజ్యక్షీర దధ్యుద-
కంబులు గలుగు సారము లేడు

తెభా-5.1-19.1-తే.
ద్వీప పరిమాణములు గల్గి విస్తరిల్లు
సంధి సంధిని బరిఖల చందమునను
గ్రమము దప్పక యొండొంటిఁ లయకుండు
కల జీవుల కెల్ల నాశ్చర్యముగను.

టీక:- సరస = చక్కటి; జంబూ = జంబూద్వీపము; ప్లక్ష = ప్లక్షద్వీపము; శాల్మలిద్వీప = శాల్మలీద్వీపము; కుశ = కుశద్వీపము; క్రౌంచ = క్రౌంచద్వీపము; శాక = శాకద్వీపము; పుష్కరములు = పుష్కరద్వీపములు; అనగన్ = అనగా; అలరు = అలరారెడి; ఆ = ఆ; ద్వీపంబులున్ = ద్వీపములు {సప్తద్వీపములు - 1జంబూ(జంబూద్వీపము) 2ప్లక్ష(ప్లక్షద్వీపము) 3శాల్మలిద్వీప(శాల్మలీద్వీపము) 4కుశ(కుశద్వీపము) 5క్రౌంచ(క్రౌంచద్వీపము) 6శాక(శాకద్వీపము) 7పుష్కరములు(పుష్కరద్వీపములు)}; అందున్ = అందు; జంబూద్వీపమున్ = జంబూద్వీపము; ఒనరంగన్ = చక్కగా; లక్ష = లక్ష (100000); యోజనములున్ = యోజనములు {యోజనములు - యోజనము రెండు రకములు. చిన్న యోజనము 4.6 మైళ్ళకు సమానము. పెద్ద యోజనము సుమారు 8.59 మైళ్ళకు సమానం.}; అయ్యెన్ = అయినది; అట = దానికి; ఉత్తరోత్తర = ఒకదానికంటెనొకటి; ఆయత = విస్తారమైన; సంఖ్యన్ = కొలతలలో; తాన్ = తాను; ద్విగుణితము = రెట్టింపు; అయి = అయ్యి; ఒండొంటి = ఒకదానికొకటి; కిన్ = కి; అతిశయిల్లు = అధికమైన; క్షార = కారపు సముద్రము; ఇక్షురస = చెరకురసముసముద్రము; సుర = సురాసముద్రము; ఆజ్య = నేయ్యిసముద్రము; క్షీర = పాలసముద్రము; దధి = పెరుగుసముద్రము; ఉదకంబులు = నీటిసముద్రము; కలుగు = ఉండెడి; సాగరములు = సముద్రములు {సప్తసముద్రములు - 1క్షార(కారపు సముద్రము) 2ఇక్షురస(చెరకురసముసముద్రము) 3సుర(సురాసముద్రము) 4ఆజ్య(నేయ్యిసముద్రము) 5క్షీర(పాలసముద్రము) 6దధి(పెరుగుసముద్రము) 7ఉదకంబులు(నీటిసముద్రము)}; ఏడున్ = ఏడు (7).
ద్వీప = ద్వీపముల {సప్తద్వీపములు - 1జంబూ(జంబూద్వీపము) 2ప్లక్ష(ప్లక్షద్వీపము) 3శాల్మలిద్వీప(శాల్మలీద్వీపము) 4కుశ(కుశద్వీపము) 5క్రౌంచ(క్రౌంచద్వీపము) 6శాక(శాకద్వీపము) 7పుష్కరములు(పుష్కరద్వీపములు)}; పరిమాణములు = కొలతలు; కల్గి = కలిగుండి; విస్తరిల్లు = విస్తరించును; సంధిసంధిని = ప్రతి కలయికయొక్క; పరిఖల = కందకముల; చందముననున్ = వలె; క్రమమున్ = పద్దతి; తప్పకన్ = తప్పకుండగ; ఒండొంటిన్ = ఒకదానిలోనొకటి; కలయకుండున్ = కలిసిపోకుండనుండును; సకల = అఖిలమైన; జీవుల్ = ప్రాణుల; కిన్ = కి; ఎల్లన్ = అందరకును; ఆశ్చర్యముగనున్ = ఆశ్చర్యకరముగా.
భావము:- జంబూద్వీపం, ప్లక్షద్వీపం, శాల్మలీద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం, శాకద్వీపం, పుష్కరద్వీపం అనేవి సప్తద్వీపాలు. వాటిలో జంబూద్వీపం ఒక లక్ష యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇలాగే ఒకదాని కొకటి రెట్టింపు వైశాల్యం కలిగి వరుసగా ఏడు ద్వీపాలు ఉన్నాయి. వాటి నడుమ ఉప్పు సముద్రం, చెరకు సముద్రం, మద్యసముద్రం, ఘృతసముద్రం, పాల సముద్రం, పెరుగు సముద్రం, మంచినీటి సముద్రం ఏడు సముద్రాలు ఉన్నాయి. ఒక ద్వీపంతో మరొక ద్వీపం కలిసిపోకుండా ఉండడానికి సముద్రాలు ఏర్పడ్డాయి. అవి ద్వీపాల చుట్టూ అగడ్తల లాగా ఉన్నాయి. ఈ ద్వీప సముద్ర నిర్మాణాలు సకల జీవులకు ఆశ్చర్య జనకాలు.

తెభా-5.1-20-వ.
అట్టి ద్వీపంబుల యందుఁ బరిపాలనంబునకుం బ్రియవ్రతుం డాత్మభవులు నాత్మసమాన శీలురునైన యాగ్నీధ్రేధ్మజిహ్వ యజ్ఞబాహు హిరణ్యరేతో ఘృతపృష్ఠ మేధాతిథి వీతిహోత్రుల నొక్కొక్కని నొక్కొక ద్వీపంబునకుం బట్టంబుగట్టి యూర్జస్వతి యను కన్యకను భార్గవున కిచ్చిన, నా భార్గవునకు నూర్జస్వతి యందు దేవయాని యను కన్యారత్నంబు జనించె; నట్టి బలపరాక్రమవంతుం డైన ప్రియవ్రతుండు విరక్తుండై యొక్కనాఁడు నిజ గురువగు నారదుని చరణానుసేవాను పతిత రాజ్యాది ప్రపంచ సంసర్గంబుఁ దలంచి యిట్లనియె.
టీక:- అట్టి = అటువంటి; ద్వీపంబులన్ = ద్వీపములు; అందున్ = లోను; పరిపాలనంబున్ = పరిపాలించుట; కున్ = కు; ప్రియవ్రతుండు = ప్రియవ్రతుడు; ఆత్మ = తనకు; భవులున్ = పుట్టినవారిని; ఆత్మ = తనకు; సమాన = సమానమైన; శీలురున్ = ప్రవర్తనలు కలవారును; ఐన = అయిన; ఆగ్నీధ్ర = ఆగ్నీధ్రుడు; ఇధ్మజిహ్వ = ఇధ్మజిహ్వుడు; యజ్ఞబాహు = యజ్ఞబాహుడు; హిరణ్యరేతః = హిరణ్యరేతసుడు; ఘృతపృష్ట = ఘృతపృష్టుడు; మేధాతిథి = మేధాతిథి; వీతిహోత్రులన్ = వీతిహోత్రులను; ఒక్కొక్కని = ఒక్కొక్కని; కిన్ = కి; ఒక్కొక్క = ఒక్కొక్క; ద్వీపంబున్ = ద్వీపమున; కున్ = కు; పట్టంబుగట్టి = పట్టాభిషేకముచేసి; ఊర్జస్వతి = ఊర్జస్వతి; అను = అనెడి; కన్యకనున్ = పుత్రికను; భార్గవున్ = భార్గవుని; కిన్ = కి; ఇచ్చినన్ = ఇవ్వగా; ఆ = ఆ; భార్గవున్ = భార్గవుని; కున్ = కి; ఊర్జస్వతి = ఊర్జస్వతి; అందున్ = అందు; దేవయాని = దేవయాని; అను = అనెడి; కన్యా = ఆడపిల్లలో; రత్నంబున్ = రత్నమువంటి మె; జనించె = పుట్టెను; అట్టి = అటువంటి; బల = బలము; పరాక్రమవంతుండున్ = పరాక్రమములు గలవాడు; ఐన = అయిన; ప్రియవ్రతుండు = ప్రియవ్రతుడు; విరక్తుండు = వైరాగ్యము గలవాడు; ఐ = అయ్యి; ఒక్కనాడు = ఒక దినమున; నిజ = తన; గురువు = గురువు; అగు = అయినట్టి; నారదుని = నారదుని; చరణ = పాదములు; అనుసేవ = సేవించుటచే; అనుపతిత = లభించిన; రాజ్య = రాజ్యము; ఆది = మొదలగు; ప్రపంచ = ప్రపంచ; సంసర్గమునున్ = సృష్టిని; తలంచి = భావించుకొని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అటువంటి ద్వీపాలలో ప్రియవ్రతుడు తనంతటివారైన ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, మేధాతిథి, వీతిహోత్రుడు అనే కుమారులకు పట్టం కట్టించాడు. ఊర్జస్వతి అనే కన్యను భర్గుని కుమారుడైన శుక్రునికి ఇచ్చి పెళ్ళి చేసాడు. ఆ దంపతులకు దేవయాని అనే కన్యారత్నం పుట్టింది. ఆ తరువాత మహా పరాక్రమవంతుడైన ప్రియవ్రతుడు విరక్తుడై ఒకనాడు తన గురువైన నారదుని పాదసేవవల్ల ప్రాప్తించిన రాజ్యసంపదలను, సంసార బంధాలను తలచుకొని ఇలా అనుకున్నాడు.