పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/వికుక్షి చరితము

వికుక్షి చరితము

తెభా-9-157-మ.
గుఁగా కంచు వికుక్షి వేఁటజని ఘోరారణ్యభూమిం దగన్
మృసంఘంబులఁ జంపి బిట్టలసి తా; మే నొల్లఁబో నాకటన్
మై యొక్క శశంబుఁ బట్టి తిని శేషంబైన మాంసంబు శీ
ఘ్రతిం దండ్రికిఁ దెచ్చి యిచ్చె నకలంస్ఫూర్తి వర్ధిల్లగాన్.

టీక:- అగుగాక = అలాగే; అంచున్ = అంటు; వికుక్షి = వికుక్షి; వేటన్ = వేటకు; చని = వెళ్ళి; ఘోర = భయంకరమైన; అరణ్య = అటవీ; భూమిన్ = ప్రదేశమునందు; తగన్ = తగిన విధంగా; మృగ = జంతువుల; సంఘంబులన్ = సమూహములను; చంపి = సంహరించి; బిట్టు = మిక్కిలి; అలసి = అలిసిపోయి; తాన్ = అతను; మేన్ = శరీరము; ఒల్లబోన్ = వాడిపోగా; ఆకటన్ = ఆకలితో; సగము = చిక్కి పోయినవాడు; ఐ = అయ్యి; ఒక్క = ఒక; శశంబున్ = కుందేలును; పట్టి = పట్టుకొని; తిని = భుజించి; శేషంబున్ = మిగలినది; ఐన = అయినట్టి; మాంసంబున్ = మాంసమును; శీఘ్ర = మిక్కిలి వేగవంతముగ; గతిన్ = ప్రయాణించి; తండ్రి = తండ్రి; కిన్ = కి; తెచ్చి = తీసుకెచ్చి; ఇచ్చెన్ = ఇచ్చెను; అకలంక = నిష్కళంకమైనదిగా; స్ఫూర్తి = తలచబడుట; వర్ధిల్లగాన్ = బాగాకలుగునట్లు.
భావము:- అలా వేటకు వెళ్ళిన వికుక్షి భయంకరమైన అడవిలో తగిన జంతువులను వేటాడి బాగా అలిసిపోయాడు. ఆకలికి చిక్కి ఒక కుందేలును పట్టుకొని భుజించాడు. మిగలిన మాంసాన్ని వేగంగా వెళ్ళి పరిశుద్ధమైంది అని చెప్పి తండ్రికి ఇచ్చాడు.

తెభా-9-158-త.
కుగురుండు వసిష్ఠుఁ డంత వికుక్షి కుందెలు దింట లో
నెఱింగి యనర్హ మెంగిలి పైతృకం బొనరింపఁగా
దు వీఁడు దురాత్మకుం డన వాని తండ్రియు వానిఁ జెం
ను జేరఁగనీక దేశము దాఁటి పో నడిచెన్ వడిన్.

టీక:- కులగురుండు = కులగురువు; వసిష్ఠుడు = వసిష్ఠుడు; అంతన్ = అప్పుడు; వికుక్షి = వికుక్షి; కుందెలున్ = కుందేలును; తింటన్ = తినుటను; లోపలన్ = మనసులోపల; ఎఱింగి = తెలిసి; అనర్హము = పనికిరానిది; ఎంగిలి = ఎంగిలిపడినది; పైతృకంబున్ = శ్రాద్ధమును; ఒనరింపగాన్ = చేయుటకు; వలదు = వద్దు; వీడు = ఇతడు; దురాత్మకుండు = మోసగాడు; అనన్ = అనగా; వాని = అతని; తండ్రియున్ = తండ్రి; వానిన్ = అతనిని; చెంతలనున్ = దగ్గరకు; చేరగనీక = రానీయకుండ; దేశమున్ = రాజ్యమును; దాటి = సరిహద్దులుదాటి; పోన్ = పోవునట్టు; అడిచెన్ = వెళ్ళగొట్టెను; వడిన్ = వేగముగ.
భావము:- కులగురువు వసిష్ఠుడు అప్పుడు వికుక్షి కుందేలును తినుట గ్రహించి. ఇది ఎంగిలిపడినది శ్రాద్ధానికి పనికిరాదు, వికుక్షి మోసం చేసాడు అని చెప్పాడు. అతని తండ్రి అతనిని వెంటనే రాజ్యబహిష్కార శిక్ష వేశాడు.

తెభా-9-159-ఆ.
కొడుకు వెడలఁగొట్టి గుణవంతుఁ డిక్ష్వాకుఁ
డా వసిష్ఠుఁ డేమి యానతిచ్చె
దియుఁ జేసి యోగి యై వనంబునఁ గళే
రము విడిచి ముక్తి దము నొందె.

టీక:- కొడుకున్ = కుమారుని; వెడలగొట్టి = వెళ్లగొట్టి; గుణవంతున్ = సుగుణశీలి; ఇక్ష్వాకుడు = ఇక్ష్వాకుడు; ఆ = ఆ; వసిష్టుడు = వసిష్టుడు; ఏమి = ఏదైతే; ఆనతిచ్చెన్ = చెప్పెనో; అదియ = అదే; చేసి = ఆచరించి; యోగి = ఋషి; ఐ = అయ్యి; వనంబున్ = అడవియందు; కళేబరంబున్ = దేహము; విడిచి = వదలువేసి; ముక్తిపదమున్ = మోక్షమును; ఒందె = పొందెను.
భావము:- అలా వసిష్టుడు చెప్పిన ప్రకారం ఆచరించి కుమారుని వెళ్లగొట్టిన సుగుణశీలి ఇక్ష్వాకుడు, పిమ్మట ఋషి అయ్యి అడవిలో దేహం వదలి మోక్షం పొందాడు.

తెభా-9-160-చ.
కుఁడు ముక్తి కేఁగ నయశాలి వికుక్షి శశాదుఁ డంచు భూ
నులు నుతింప నీ ధరణిక్ర మశేషము నేలి యాగముల్
గొకొని చేసెఁ బ్రీతి హరిఁగూర్చి పురంజయుఁ బుత్రుఁ గాంచెఁ బే
ర్కొనె నమరేంద్ర వాహుఁడుఁ గకుత్స్థుఁడు నంచును వాని లోకముల్.

టీక:- జనకుడు = తండ్రి; ముక్తికేగన్ = మరణించగా; నయశాలి = నీతిమంతుడు; వికుక్షి = వికుక్షి; శశాదుడు = శశాదుడు; అంచున్ = అంటు; భూ = రాజ్యములోని; జనులు = ప్రజలు; నుతింపన్ = కీర్తించుచుండగ; ఈ = ఈ; ధరణిచక్రమున్ = భూమండలమును; అశేషమున్ = మొత్తము; ఏలి = పాలించి; యాగముల్ = యజ్ఞములు; కొనకొని = పూనుకొని; చేసెన్ = ఆచరించెను; ప్రీతిన్ = ఇష్టపూర్తిగా; హరిన్ = విష్ణుమూర్తిని; గూర్చి = గురించి; పురంజయున్ = పురంజయుడిని; పుత్రున్ = కుమారుని; కాంచెన్ = కలిగించెను; పేర్కొనెను = పిలిచిరి; అమరేంద్రవాహుడు = అమరేంద్రవాహుడు {అమరేంద్రవాహుడు - ఇంద్రుని వాహనముగా కలవాడు}; కకుత్స్థుడు = కకుత్స్థుడు {కకుత్స్థుడు - ఎద్దుమూపుపై విహరించు వాడు}; అంచును = అనుచు; వానిన్ = అతనిని; లోకముల్ = ప్రజలు.
భావము:- తండ్రి మరణించాక, వికుక్షి రాజ్యాన్ని చేపట్టాడు. అతను నీతిమంతుడు, శశాదుడు అని ప్రజలు కీర్తించేలా పరిపాలించాడు. విష్ణుమూర్తిని గురించి అనేక యజ్ఞాలు చేసాడు. అతని పుత్రుడు పురంజయుడు. అతనిని ప్రజలు అమరేంద్రవాహుడు, కకుత్స్థుడు అని అనేవారు.

తెభా-9-161-సీ.
కృతయుగాంతంబున దితిసుతామరులకు-
ణ మయ్యె; నందు నా రాక్షసులకు
మర వల్లభుఁ డోడి రితోడఁ జెప్పిన-
లజనేత్రుఁడు పురంయుని యందు
చ్చి నే నుండెద వాసవ! వృషభంబ-
వై మోవు మని పల్క మరవిభుఁడు
గోరాజమూర్తిఁ గకుత్ప్రదేశంబున-
నా పురంజయు మోచె నంత నతఁడు

తెభా-9-161.1-తే.
విష్ణుతేజంబు దనయందు విస్తరిల్ల
దివ్యచాపంబు చేఁబట్టి దీర్ఘ నిశిత
బాణములఁ బూని వేల్పులు ప్రస్తుతింప
నంతఁ గాలాగ్ని చాడ్పున నికి నడచె.

టీక:- కృతయుగ = కృతయుగము; అంతంబునన్ = తీరుసమయమునందు; దితిసుత = రాక్షసులు {దితిసుతులు - దితియొక్క పుత్రులు, రాక్షసులు}; అమరుల్ = దేవతల {అమరులు - మరణము లేని వారు, దేవతలు}; కున్ = కు; రణము = యుద్ధము; అయ్యెన్ = అయినది; అందున్ = దానిలో; ఆ = ఆ; రాక్షసుల్ = రాక్షసుల; కున్ = కు; అమరవల్లభుడు = ఇంద్రుడు {అమరవల్లభుడు - దేవతలనాయకుడు, ఇంద్రుడు}; ఓడి = ఓడిపోయి; హరి = నారాయణుడు; తోడన్ = తోటి; చెప్పినన్ = చెప్పుకొనగా; జలజనేత్రుడు = నారాయణుడు {జలజనేత్రుడు - పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు}; పురంజయుని = పురంజయుని; అందున్ = లో; వచ్చి = చేరి; నేన్ = నేను; ఉండెదన్ = ఉంటాను; వాసవ = ఇంద్రుడా {వాసవుడు - వసువులు కలవాడు, ఇంద్రుడు}; వృషభంబవు = ఆబోతు, ఎద్దు; ఐ = అయ్యి; మోవుము = వాహనముగా ధరించు; అని = అని; పల్కన్ = చెప్పగ; అమరవిభుడు = ఇంద్రుడు {అమరవిభుడు - దేవతలనాయకుడు, ఇంద్రుడు}; గోరాజ = ఆబోతు; మూర్తిన్ = రూపుతో; కకుత్స్థ = మూపురపు; ప్రదేశంబునన్ = ప్రదేశమునందు; ఆ = ఆ; పురంజయున్ = పురంజయుని; మోచెన్ = మోసెను; అంత = అప్పుడు; అతడు = అతడు.
విష్ణు = నారాయణుని; తేజంబున్ = తేజస్సు; తన = తన; అందున్ = లో; విస్తరిల్లన్ = అతిశయించగా; దివ్య = గొప్ప; చాపంబున్ = విల్లును; చేబట్టి = చేతపట్టుకొని; దీర్ఘ = పెద్దవైన; నిశిత = వాడియైన; బాణములన్ = బాణములను; పూని = ధరించి; వేల్పులు = దేవతలు; ప్రస్తుతింపన్ = కీర్తించుచుండగ; అంతకాలాగ్ని = ప్రళయకాలాగ్ని; చాడ్పునన్ = వలె; అని = యుద్ధభూమి; కిన్ = కి; నడచె = వెళ్ళెను.
భావము:- కృతయుగాంత కాలంలో రాక్షసులకు దేవతలకు పెద్ద యుద్ధం జరిగింది. దానిలో ఇంద్రుడు ఓడిపోయి శ్రీహరితో చెప్పుకోగా, “ఇంద్రా! నేను పురంజయునిలో చేరి ఉంటాను. ఎద్దు రూపుడవు అయి అతనికి వాహనంగా ఉండు.” ఆ ప్రకారం ఇంద్రుడు ఎద్దు రూపుడు అయి మూపురం మీద పురంజయుని మోసాడు. అప్పుడు అతడు నారాయణుని తేజస్సుతో గొప్ప విల్లును బాణాలు చేపట్టి దేవతలు కీర్తిస్తుండగ ప్రళయకాలాగ్ని వలె యుద్ధభూమికి వెళ్ళాడు.

తెభా-9-162-చ.
చి శరావళిన్ దనుజనాథుల మేనులు చించి కంఠముల్
దొడిఁదొడిఁ ద్రుంచి కాలుపురి త్రోవకుఁ గొందఱఁ బుచ్చి కొందఱన్
డి నురగాలయంబున నివాసము చేయఁగ దోలి యంతనూ
క నిశాచరేంద్రుల పురంబులు గూల్చెఁ బురంజయాఖ్యతన్.

టీక:- నడచి = వెళ్ళి; శరా = బాణముల; ఆవళిన్ = సమూహములతో; దనుజ = రాక్షస; నాథుల = రాజుల; మేనులున్ = దేహములు; చించి = ఖండించి; కంఠముల్ = మెడలను; తొడిదొడిన్ = వెనువెంటనే; త్రుంచి = ఖండించి; కాలుపురి = నరకపు {కాలుపురి - కాలు (యముని) పురి (పట్టణము), నరకము}; త్రోవ = దారి; కున్ = కి; కొందఱన్ = కొంతమందిని; పుచ్చి = పంపించి; కొందఱన్ = కొంతమందిని; వడిన్ = వేగముగ; ఉరగాలయంబునన్ = పాతాళలోకమున {ఉరగాలయము - ఉరగ (పాముల) ఆలయము (నివాసము), పాతాళము}; నివాసముచేయన్ = ఉండుటకు; తోలి = తరిమి; అంతన్ = అంతటితో; ఊఱడక = శాంతించక; నిశాచర = రాక్షస {నిశాచరులు - నిశ (రాత్రులందు) చరించువారు, రాక్షసులు}; పురంబులున్ = నగరములను; కూల్చెన్ = కొలగొట్టెను; పురంజయ = పురంజయుడు; ఆఖ్యాతన్ = పేరుతోను.
భావము:- పురంజయుడు వెళ్ళి తన బాణాలతో రాక్షస రాజులను ఖండించి నరకానికి పంపించాడు. కొంతమందిని పాతాళలోకానికి తరిమాడు. అంతటితో శాంతించక రాక్షస నగరాలను కూలగొట్టాడు.

తెభా-9-163-వ.
ఇవ్విధంబున శశాదపుత్రుండు రాక్షసుల పురంబులు జయించిన కతనం బురంజయుండును, వృషభరూపుండైన యింద్రుండు వాహనంబగుటం జేసి యింద్రవాహనుండును, నతని మూఁపురం బెక్కి రణంబు చేసిన కారణంబునఁ గకుత్థ్సుండును నన నీ మూఁడు నామంబులం బ్రసిద్ధికెక్కి, దైత్యుల ధనంబుల నింద్రున కిచ్చె నప్పురంజయుని పుత్రుం డనేనసుం, డతని పుత్రుండు పృథుండు; పృథుని కొడుకు విశ్వగంధుండు; విశ్వగంధునకు నందనుండు చంద్రుండు; చంద్రుసుతుండు యవనాశ్వుండు; యవనాశ్వతనూభవుండు శవస్తుం; డతడు శావస్తి నామ నగరంబు నిర్మించె; శవస్త తనయుండు బృహదశ్వుండు; బృహదశ్వతనూజుండు గువలయాశ్వుండా నరేంద్రుండు.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = రకముగా; శశాద = శశాదుని; పుత్రుండు = కుమారుడు; రాక్షసుల = రాక్షసులయొక్క; పురంబులున్ = పట్టణములను; జయించిన = జయించినట్టి; కతనన్ = కారణముచేత; పురంజయుండును = పురంజయుడును; వృషభ = ఆబోతు; రూపుడు = రూపముధరించినవాడు; ఐన = ఐనట్టి; ఇంద్రుండు = ఇంద్రుడు; వాహనంబు = వాహనము; అగుటన్ = అగుట; చేసి = వలన; ఇంద్రవాహనుండు = ఇంద్రవాహనుడు; అతని = అతనియొక్క; మూపురంబున్ = మూపురమును; ఎక్కి = అధిరోహించి; రణంబున్ = యుద్ధము; చేసిన = చేసినట్టి; కారణంబునన్ = కారణముచేత; కకుత్స్థుండును = కకుత్స్థుడు; అనన్ = అనెడి; ఈ = ఈ; మూడు = మూడు (3); నామంబులన్ = పేర్లతోను; ప్రసిద్దికెక్కి = పేరుపొంది; దైత్యుల = రాక్షసుల; ధనంబులన్ = సంపదలను; ఇంద్రున్ = ఇంద్రుని; కిన్ = కి; ఇచ్చెన్ = ఇచ్చెను; ఆ = ఆ; పురంజయుని = పురంజయుని; పుత్రుండు = కొడుకు; అనేనసుండు = అనేనసుడు; అతని = అతని; పుత్రుండు = పుత్రుడు; పృథుండు = పృథువు; పృథుని = పృథునియొక్క; కొడుకు = పుత్రుడు; విశ్వగంధుండు = విశ్వగంధుడు; విశ్వగందున్ = విశ్వగంధున; కున్ = కు; నందనుండు = పుత్రుడు; చంద్రుండు = చంద్రుడు; చంద్రు = చంద్రుని; సుతుండు = కుమారుడు; యవనాశ్వుండు = యవనాశ్వుండు; యవనాశ్వ = యవనాశ్వుని; తనూభవుండు = పుత్రుడు; శవస్తుండు = శవస్తుడు; అతడు = అతను; శావస్తి = శావస్తి; నామ = అనెడి పేరుతో; నగరంబున్ = నగరమును; నిర్మించెన్ = కట్టెను; శవస్త = శవస్తుని; తనయుండు = పుత్రుడు; బృహదశ్వుండు = బృహదశ్వుడు; బృహదశ్వ = బృహదశ్వుని; తనూజుండు = పుత్రుడు; కువలయాశ్వుండు = కువలయాశ్వుడు; ఆ = ఆ; నరేంద్రుండు = రాజు.
భావము:- ఈ విధంగా శశాదుని కుమారుడు రాక్షసుల పురాలను జయించుటచే పురంజయుడు అని, ఆబోతు రూపుడైన ఇంద్రుడుని ఎక్కి రాక్షసుల జయించుట వలన ఇంద్రవాహనుడు అని; అతని మూపురంను ఎక్కి యుద్ధం చేసినందు వలన కకుత్స్థుడు అని మూడు (3) పేర్లతోను పేరుపొందాడు. అలా జయించిన రాక్షసుల సంపదలను ఇంద్రుడికి ఇచ్చాడు. ఆ పురంజయుని కొడుకు అనేనసుడు. అతని పుత్రుడు పృథువు. పృథుని పుత్రుడు విశ్వగంధుడు. విశ్వగంధుని పుత్రుడు చంద్రుడు. చంద్రుని కుమారుడు యవనాశ్వుడు. యవనాశ్వుని పుత్రుడు శవస్తుడు. అతను శావస్తి అనెడి పేరుతో నగరము నిర్మించాడు. శవస్తుని పుత్రుడు బృహదశ్వుడు. బృహదశ్వుని పుత్రుడు కువలయాశ్వుడు. ఆ రాజు....

తెభా-9-164-క.
లావు మెఱసి యిరువది యొక
వేవురు నందనులుఁ దాను వీరుఁ డతఁడు భూ
దేవుఁ డుదంకుడు పనుప దు
రాహుఁడై చంపె దుందు మరాబంధున్.

టీక:- లావు = శక్తి సామర్థ్యములు; మెఱసి = ప్రకటమొగునట్లు; ఇరువదియొక = ఇరవైయొక్క; వేవురు = వేయిమంది; నందనులున్ = పుత్రులు; తానున్ = అతను; వీరుడు = శూరుడు; భూదేవుడు = బ్రాహ్మణుడు; ఉదంకుడు = ఉదంకుడు; పనుప = ఆజ్ఞాపించగా, నియోగించగా; దురావహుడు = సహింపరానివాడు; ఐ = అయ్యి; చంపెన్ = సంహరించెను; దుందున్ = దుందుని {దుందు = కాష్ఠదీపిక, చక్రారారపు దివిటీ, సూర్యారాయాంద్ర నిఘంటువు} (ధుంధువు అని పాఠ్యంతరం, ధుంధుమారము అంచే ఆరుద్ర పురుగు అని నిఘంటువు); అమరాబంధున్ = రాక్షసుని {అమరాబంధుడు - అమర (దేవతల) అబంధుడు (శత్రువు), రాక్షసుడు}.
భావము:- కువలయాశ్వుడు ఇరవైయొక్క వేయి మంది పుత్రులుతో కలిసి వెళ్ళి ఉదంకుడు అనే బ్రాహ్మణుడు ఆజ్ఞాపించగా దుందుడు (ధుంధువు అని పాఠ్యంతరం) అనే రాక్షసుడిని సంహరించాడు.

తెభా-9-165-వ.
అది కారణంబుగా దుందుమారుం డన నెగడె నయ్యసురముఖానలంబునఁ గువలయాశ్వకుమారు లందఱు భస్మంబై; రందు దృఢాశ్వుండును, గపిలాశ్వుండును, భద్రాశ్వుండును ననువారలు ముగ్గురు చిక్కి; రందు దృఢాశ్వునకు హర్యశ్వుండును, హర్యశ్వునకు నికుంభుండును, నికుంభునకు బర్హిణాశ్వుండును, బర్హిణాశ్వునకుఁ గృతాశ్వుండును, గృతాశ్వునకు సేనజిత్తును, సేనజిత్తునకు యువనాశ్వుండును, జనించి; రయ్యువనాశ్వుండు గొడుకులు లేక నూర్వురు భార్యలుం దానును నివ్వెఱ పడియుండ నా రాజునకు మునులు గృపచేసి యింద్రుని గూర్చి సంతతికొఱకు నైంద్రయాగంబు చేయించిరి; అందు.శ్వునకుఁ గృతాశ్వుండును, గృతాశ్వునకు సేనజిత్తును, సేనజిత్తునకు యువనాశ్వుండును, జనించి; రయ్యువనాశ్వుండు గొడుకులు లేక నూర్వురు భార్యలుం దానును నివ్వెఱ పడియుండ నా రాజునకు మునులు గృపచేసి యింద్రుని గూర్చి సంతతికొఱకు నైంద్రయాగంబు చేయించి; రందు.
టీక:- అది = ఆ; కారణంబుగా = కారణముచేత; దుందుమారుండు = దుందుమారుడు (ధుంధుమారుడు అని పాఠ్యంతరం); అనన్ = అనగా; నెగడెన్ = ప్రసిద్ధిచెందెను; ఆ = ఆ; అసుర = రాక్షసుడు; ముఖ = అనెడి; అనలంబునన్ = అగ్నికి; కువలయాశ్వ = కువలయాశ్వుని; కుమారులు = పుత్రులు; అందఱున్ = అందరు; భస్మంబున = బూడిద; ఐరి = అయిపోతిరి; అందున్ = వారిలో; దృఢాశ్వుండును = దృఢాశ్వుడు; కపిలాశ్వుండును = కపిలాశ్వుడు; భధ్రాశ్వుండును = భద్రాశ్వుడు; అను = అనెడి; వారలు = వారు; ముగ్గురు = ముగ్గురు (3); చిక్కిరి = తప్పించుకొనిరి; అందున్ = అప్పుడు; ధృఢాశ్వున్ = దృఢాశ్వుని; కున్ = కి; హర్యశ్వవుండును = హర్యశ్వుడు; హర్యశ్వున్ = హర్యశ్వుని; కున్ = కి; నికుంభుండును = నికుంభుడు; నికుంభున్ = నికుంభుని; కున్ = కి; బర్హిణాశ్వుండును = బర్హిణాశ్వుడు; బర్హిణాశ్వున్ = బర్హిణాశ్వుని; కున్ = కు; కృతాశ్వుండును = కృతాశ్వుడు; కృతాశ్వున్ = కృతాశ్వుని; కున్ = కి; సేనజిత్తును = సేనజిత్తు; సేనజిత్తున్ = సేనజిత్తుని; కున్ = కి; యువనాశ్వుండును = యువనాశ్వుడు; జనించిరి = పుట్టిరి; ఆ = ఆ; యవనాశ్వుండు = యవనాశ్వుడు; కొడుకులు = పుత్రులు; లేక = లేకపోవుటచేత; నూర్వురు = వందమంది (100); భార్యలున్ = భార్యలు; తానును = అతను; నివ్వెఱపడి = నిశ్చేష్టులై; ఉండన్ = ఉండగా; రాజున్ = రాజున; కు = కు; మునులు = ఋషులు; కృపజేసి = కరుణజూపి; ఇంద్రుని = ఇంద్రుని; గూర్చి = గురించి; సంతతి = పిల్లల; కొఱకున్ = కోసము; ఐంద్ర = ఇంద్రునిగూర్చిచేసెడి; యాగంబున్ = యజ్ఞమును; చేయించిరి = ఆచరింపజేసిరి; అందున్ = దానిలో.
భావము:- అలా దుందుని (ధుంధువు అని పాఠ్యంతరం) సంహరించుటచే, దుందుమారుడు (ధుంధుమారుడు అని పాఠ్యంతరం) అని పేరుపొందాడు. ఆ రాక్షసుడి నోటి నుండి వెలువడిన అగ్నికి కువలయాశ్వుడి పుత్రులు అందరు బూడిద అయిపోయారు. వారిలో దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అను ముగ్గురు (3) మాత్రమే తప్పించుకొన్నారు. అప్పుడు దృఢాశ్వునికి హర్యశ్వుడు. హర్యశ్వునికి నికుంభుడు. నికుంభునికి బర్హిణాశ్వుడు. బర్హిణాశ్వునికి కృతాశ్వుడు, కృతాశ్వునికి సేనజిత్తు. సేనజిత్తునికి యువనాశ్వుడు, పుట్టారు. ఆ యవనాశ్వుడు అతని వందమంది (100) భార్యలు పుత్రులు లేక విచారిస్తుంటే ఋషులు కరుణించి ఇంద్రుని గురించి పుత్రకామేష్ఠి అను యాగం చేయించారు. ఆ యాగంలో....