పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/భీష్ముని వృత్తాంతము
భీష్ముని వృత్తాంతము
తెభా-9-666-క.
భాతిగ శంతనునకు గం
గాతటికిని వైష్ణవాగ్రగణ్యుఁడు ఘోరా
రాతినయననీలోత్పల
భీతికరగ్రీష్ముఁడైన భీష్ముఁడు పుట్టెన్.
టీక:- భాతిగన్ = ప్రాకాశవంతముగ; శంతనున్ = శంతనున; కున్ = కు; గంగాతటి = గంగానది; కినిన్ = కి; వైష్ణవ = విష్ణుభక్తులలో; అగ్రగణ్యుడు = ముందు లెక్కింపబడేవాడు; ఘోర = ఘోరమైన; ఆరాతి = శత్రువుల; నయన = కళ్ళు అనెడి; నీల = నీలపు; ఉత్పల = కలువలకు; భీకర = భయంకరమైన; గ్రీష్ముడు = సూర్యుడు; ఐన = అయినట్టి; భీష్ముడు = భీష్ముడు; పుట్టెన్ = జన్మించెను.
భావము:- శంతనునకు గంగాదేవి యందు విష్ణుభక్తాగ్రజుడు, శత్రు భయంకరుడు అయిన భీష్ముడు జన్మించాడు.
తెభా-9-667-ఆ.
పరశురాముతోడఁ బ్రతిఘటించి జయింప
నన్యు నొకనిఁ గాన మతనిఁ దక్క
వీరయూథపతి వివేకధర్మజ్ఞుండు
దివిజనది సుతుండు దేవసముఁడు.
టీక:- పరశురామున్ = పరశురాముని; తోడన్ = తోటి; ప్రతిఘటించి = ఎదిరించి; జయింపన్ = గెలుచుటకు; అన్యున్ = ఇతరలు; ఒకనిన్ = ఒకడినైనను; కానము = చూడలేము; అతనిన్ = అతనిని; తక్క = తప్పించి; వీర = గొప్ప; యూథపతి = సేనానాయకుడు; వివేక = వివేకము కల; ధర్మజ్ఞుండు = ధర్మము తెలిసినవాడు; దివిజనది = గంగానది; సుతుండున్ = పుత్రుడు; దేవ = దేవతలతో; సముడు = సమానమైనవాడు.
భావము:- భీష్ముడు తప్పించి, పరశురాముడిని ఎదిరించి గెలువగల శూరుడిని లోకంలో ఎక్కడా చూడలేము. అంతే కాదు, ఆ గంగాపుత్రుడైన భీష్ముడు చాలా గొప్పవాడు. ఆయన మహారథికుడు, మంచి వివేకశీలి, ధర్మాత్ముడు, దేవసముడు.
తెభా-9-668-వ.
ఆ శంతనునకు దాశకన్యక యైన సత్యవతి యందుఁ జిత్రాంగద విచిత్రవీర్యులు పుట్టి; రందుఁ జిత్రాంగదుండు గంధర్వులచే నిహతుండయ్యె మఱియును.
టీక:- ఆ = ఆ; శంతనున్ = శంతనున; కున్ = కు; దాశ = దాశరాజు యొక్క; కన్యక = పుత్రిక; ఐన = అయిన; సత్యవతి = సత్యవతి; అందున్ = తో; చిత్రాంగద = చిత్రాంగదుడు; విచిత్రవీర్యులున్ = విచిత్రవీర్యుడు; పుట్టిరి = జన్మించిరి; అందున్ = వారిలో; చిత్రాంగదుండు = చిత్రాంగదుడు; గంధర్వుల్ = గంధర్వుల; చేన్ = చేత; నిహతుండు = మరణించినవాడు; అయ్యెన్ = అయ్యెను; మఱియునున్ = ఇంకను.
భావము:- ఆ శంతనునకు దాశరాజు పుత్రిక సత్యవతితో చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు పుట్టారు. వారిలో చిత్రాంగదుడు గంధర్వుల చేతిలో మరణించాడు. ఇంక.
తెభా-9-669-ఉ.
సత్యవతీవధూటి మును శంతనుపెండ్లముగాని నాఁడు సాం
గత్యమునం బరాశరుఁడు గర్భముజేసిన బాదరాయణుం
డత్యధికుండు శ్రీహరికళాంశజుఁడై ప్రభవించె నిత్యముల్
సత్యములైన వేదముల సాంగములన్ విభజింపఁ దక్షుఁడై.
టీక:- సత్యవతీ = సత్యవతి; వధూటి = ఇల్లాలు; మును = ఇంతకు పూర్వము; శంతనున్ = శంతనుని; పెండ్లామున్ = భార్య; కాని = ఔటకు ముందు; నాడు = వేళ; సాంగత్యమునన్ = కలియుట ద్వారా; పరాశరుడు = పరాశరముని; గర్భమున్ = కడుప; చేసినన్ = చేయగా; బాదరాయణుండు = వ్యాసుడు {బాదరాయణుడు - బదరీ (రేగి పళ్ళ) వనమును నివాసముగా కలవాడు, వ్యాసమహాముని}; అత్యధికుండు = బహుగొప్పవాడు; శ్రీహరి = విష్ణుమూర్తి యొక్క; అంశజుడు = అంశతో పుట్టినవాడు; ఐ = అయ్యి; ప్రభవించెన్ = జన్మించెను; నిత్యముల్ = శాశ్వతమైనవి; సత్యముల్ = సత్యములైనవి; ఐన = అయినట్టి; వేదములన్ = వేదములను; సాంగమునలన్ = వేదాంగములతోపాటు {షడంగములు - 1శిక్ష 2వ్యాకరణము 3ఛందస్సు 4నిరుక్తము 5జ్యోతిషము 6కల్పము}; విభజింపన్ = విభజించుటకు; దక్షుడు = సమర్థుడు; ఐ = అయ్యి.
భావము:- సత్యవతి శంతనుని ఇల్లాలు కాక ముందు పరాశర మునిని కలియుట ద్వారా వ్యాసుడు పుట్టాడు. ఆయన బహుగొప్పవాడు విష్ణుమూర్తి అంశతో పుట్టినవాడు. ఆ వ్యాసుడు శాశ్వత సత్యాలైన వేదాలను వేదాంగాలతోపాటు విభజించిన మహానుభావుడు.
తెభా-9-670-ఆ.
బాదరాయణుండు భగవంతుఁ డనఘుండు
పరమగుహ్యమైన భాగవతము
నందనుండ నయిన నాకుఁ జెప్పెను శిష్య
జనుల మొఱఁగి యేను జదువుకొంటి.
టీక:- బాదరాయణుండు = వ్యాసమహర్షి; భగవంతుడు = మహిమాన్వితుడు; అనఘుడ = పుణ్యుడు; పరమ = అతి; గుహ్యము = గోప్యము; ఐన = అయిన; భాగవతమున్ = భాగవతమును; నందనుండన్ = పుత్రుడను; అయిన = ఐన; నా = నా; కున్ = కు; చెప్పెను = తెలిపెను; శిష్యజనులన్ = ఇతర శిష్యులను; మొఱగి = అతిక్రమించి; ఏను = నేను; చదువుకొంటిన్ = చదువుకొన్నాను.
భావము:- వ్యాసమహర్షి మహిమాన్వితుడు, మహా పుణ్యుడు. అతి గోప్యం అయిన భాగవతాన్ని పుత్రుడనైన నాకు చెప్పాడు. రహస్యంగా నేను చదువుకొన్నాను.