పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/పూర్ణి

పూర్ణి

తెభా-9-734-క.
కసుతాహృచ్చోరా!
కవచోలబ్ధవిపిన శైలవిహారా!
కామితమందారా!
కాది మహీశ్వరాతియసంచారా!

టీక:- జనక సుతా హృచ్చోరా = శ్రీరామా {జనక సుతా హృచ్చోరుడు - జనకునిపుత్రిక సీత హృదయము దోచుకొన్నవాడు, రాముడు}; జనక వచోలబ్ధ విపిన శై లవిహారా = శ్రీరామా {జనక వచోలబ్ధ విపిన శైల విహారుడు - తండ్రి మాట జవదాటక కొండకోనలలో తిరిగినవాడు, రాముడు}; జన కామిత మందారా = శ్రీరామా {జన కామిత మందారుడు - ప్రజల కోరికలు తీర్చుటలో కల్పవృక్షము వంటివాడు, రాముడు}; జనకాది మహీశ్వ రాతిశయ సంచారా = శ్రీరామా {జనకాది మహీశ్వ రాతిశయ సంచారుడు - జనకుడు మున్నగు రాజర్షులను మించిన ప్రవర్తన కలవాడు, రాముడు} .
భావము:- జనకమహారాజు పుత్రిక సీతాదేవి మనసు దోచుకున్న ఆదర్శ భర్తవు. తండ్రి మాట నిలబెట్టడం కోసం కొండకోనలలో తిరిగి కష్టాలు అనుభవించిన ఆదర్శ పుత్రుడవు. ప్రజల కోరికలను తీర్చుటలో కల్పవృక్షము వంటి ఉత్తమ పాలకుడవు. జనకమహారాజు లాంటి రాజర్షులను సైతం మించిన గొప్ప నడవడికగల మహారాజువి. అయినట్టి శ్రీరామచంద్రప్రభు! నీకు వందనములు

తెభా-9-735-మాలి.
దవనవిహారీ! త్రులోకప్రహారీ!
సుగుణవనవిహారీ! సుందరీమానహారీ!
వితకలుషపోషీ! వీరవిద్యాభిలాషీ!
స్వగురుహృదయతోషీ! ర్వదా సత్యభాషీ!

టీక:- జగదవనవిహారీ = శ్రీరామా {జగదవనవిహారుడు - లోకముల రక్షణకై సంచరించెడివాడు. రాముడు}; శత్రులోకప్రహారీ = శ్రీరామా {శత్రులోకప్రహారుడు - శత్రువులందరిని దండించెడివాడు, రాముడు}; సుగుణవనవిహారీ = శ్రీరామా {సుగుణవనవిహారుడు - సుగుణములనెడి వనమునందు విహరించువాడు, రాముడు}; సుందరీమానహారీ = శ్రీరామా {సుందరీమానహారుడు - అందగత్తెల అభిమానమును అపహరించువాడు, రాముడు}; విగతకలుషపోషీ = శ్రీరామా {విగతకలుషపోషుడు - విగతకలుష (పుణ్యాత్ములను) పోషించువాడు, రాముడు}; వీరవిద్యాభిలాషీ = శ్రీరామా {వీరవిద్యాభిలాషుడు - వీరత్వము చూపుటందు ఆసక్తికలవాడు, రాముడు}; స్వగురుహృదయతోషీ = శ్రీరామా {స్వగురుహృదయతోషుడు - తన గురువుల మనసులను సంతోషపరచువాడు, రాముడు}; సర్వదాసత్యభాషీ = శ్రీరామా {సర్వదాసత్యభాషి - ఎల్లప్పుడు సత్యమునే పలుకువాడు, రాముడు} .
భావము:- లోకరక్షణకై విహరించువాడ! శత్రువు లందరిని దండించువాడ! సుగుణములనే వనముల యందు విహరించువాడ! అందగత్తెల అభిమానం చూరగొనెడివాడ! పుణ్యాత్ములను పోషించువాడ! వీరత్వం చూపు టందు ఆసక్తి కలవాడ! స్వయంగా గురువుల హృదయాలకు సంతోషం కలిగించువాడ! ఎల్లప్పుడు సత్యమునే పలుకువాడ! శ్రీరామ! నీకు నమస్కారములు.

తెభా-9-736-గ.
ఇది శ్రీపరమేశ్వరకరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతం బను మహాపురాణంబు నందు సూర్యవంశారంభంబును, వైవస్వతమనువు జన్మంబును, హైమచంద్రకథనంబును, సుద్యుమ్నాదిమను సూనుల చరిత్రంబును, మరుత్తు, తృణబిందు, శర్యాతి, కకుద్మి, సగర, నాభాగ ప్రముఖుల చరిత్రంబులును, నంబరీషుని యందుఁ బ్రయోగింపబడిన దుర్వాసుని కృత్యనిరర్థక యగుటయు, నిక్ష్వాకు వికుక్షి మాంధాతృ పురుకుత్స హరిశ్చంద్ర సగర భగీరథ ప్రముఖుల చరిత్రంబులును, భాగీరథీప్రవాహ వర్ణనంబును, గల్మాషపాద ఖట్వాంగ ప్రముఖుల వృత్తాంతంబును, శ్రీరామచంద్ర కథనంబును, దదీయ వంశపరంపరా గణనంబును, నిమికథయును, జంద్రవంశారంభంబును, బుధ పురూరవుల కథయును, జమదగ్ని పరశురాముల వృత్తాంతంబును, విశ్వామిత్ర నహుష యయాతి పూరు దుష్యంత భరత రంతిదేవ పాంచాల బృహద్రథ శంతను భీష్మ పాండవ కౌరవ ప్రముఖుల వృత్తాంతంబును, ఋశ్యశృంగ వ్రతభంగంబును, ద్రుహ్యానుతుర్వసుల వంశంబును, యదు కార్తవీర్య శశిబిందు జామదగ్న్యాదుల చరిత్రంబును, శ్రీకృష్ణావతార కథాసూచనంబును నను కథలుగల నవమ స్కంధము సంపూర్ణము.
టీక:- ఇది = ఇది; శ్రీ = శ్రీ; పరమేశ్వర = పరమేశ్వరుని యొక్క; కరుణా = కృపవలన; కలిత = లభించిన; కవితా = కవిత్వముచెప్పుటలో; విచిత్ర = విచిత్రము కలిగిన; కేసనమంత్రి = కేసనమంతి యొక్క; పుత్ర = కుమారుడు; సహజ = సహజసిద్ధమైన; పాండిత్య = పాండిత్యముకలిగిన; పోతనా = పోతన అనెడి; అమాత్య = శ్రేష్ఠునిచే; ప్రణీతంబున్ = చేయబడినట్టిది; ఐనన్ = అయినట్టి; శ్రీ = శుభకరమైన; మహా = మహా; భాగవతంబున్ = భాగవతము; అను = అనెడి; మహా = గొప్ప; పురాణంబున్ = పురాణము; అందున్ = లో; సూర్యవంశ = సూర్యవంశము యొక్క; ఆరంభంబునున్ = ప్రారంభము; వైవస్వతమనువు = వైవస్వతమనువు; జన్మంబును = పుట్టుక; హైమచంద్ర = హైమచంద్రుని; కథనంబునున్ = వృత్తాంతము; సుద్యుమ్న = సుద్యుమ్నుడు; ఆది = మొదలగు; మను = మనువు యొక్క; సూనుల = పుత్రుల; చరిత్రంబును = చరితములు; మరుత్త = మరుత్తుడు; తృణబిందు = తృణబిందు; శర్యాతి = శర్యాతి; కకుద్మి = కకుద్మి; సగర = సగరుడు; నాభాగ = నాభాగుడు; ప్రముఖుల = ముఖ్యుల; చరిత్రంబులును = చరిత్రలు; అంబరీషుని = అంబరీషుని; అందున్ = ఎడల; ప్రయోగింపబడిన = ప్రయోగించిన; దుర్వాసుని = దుర్వాసుని; కృత్య = కృత్య; నిరర్థకము = వ్యర్థము; అగుటయున్ = అగుట; ఇక్ష్వాకు = ఇక్ష్వాకుని; వికుక్షి = వికుక్షి; మాంధాతృ = మాంధాత యొక్క; పురుకుత్స = పురుకుత్సుని; హరిశ్చంద్ర = హరిశ్చంద్రుని; సగర = సగరుని; భగీరథ = భగీరథుని; ప్రముఖల = మున్నగు ముఖ్యుల; చరిత్రంబులును = చరిత్రలు; భాగీరథీ = గంగా; ప్రవాహ = ప్రవాహము; వర్ణనంబున్ = వర్ణించుట; కల్మాషపాద = కల్మాషపాదుని; ఖట్వాంగ = ఖట్వాంగుని; ప్రముఖుల = మున్నగు ముఖ్యుల; వృత్తాంతంబును = వృత్తాంతములు; శ్రీరామచంద్ర = శ్రీరామచంద్రుని; కథనంబునున్ = కథ; తదీయ = అతని; వంశ = వంశస్థుల; పరంపారా = పరంపర; ఆగణనంబును = ఎంచుట; నిమి = నిమి యొక్క; కథయునున్ = కథ; చంద్రవంశ = చంద్రవంశము; ఆరంభంబునున్ = ప్రారంభము; బుధ = బుధుడు; పురూరవుల = పురూరవుల; కథయునున్ = కథ; జమదగ్ని = జమదగ్ని; పరశురాముల = పరశురాముడుల; వృత్తాంతంబును = వృత్తాంతములు; విశ్వామిత్ర = విశ్వామిత్రుడు; నహుష = నహుషుడు; యయాతి = యయాతి; పూరు = పూరువు; దుష్యంత = దుష్యంతుడు; భరత = భరతుడు; రంతిదేవ = రంతిదేవుడు; పాంచాల = పాంచాలుడు; బృహద్రథ = బృహద్రథుడు; శంతను = శంతనుడు; భీష్మ = భీష్ముడు; పాండవ = పాండవులు; కౌరవ = కొరవుల; ప్రముఖుల = మున్నగు ముఖ్యుల; వృత్తాంతంబును = వృత్తాంతములు; ఋశ్యశృంగ = ఋశ్యశృంగుని; వ్రత = వ్రతము; భంగంబును = భిన్నమగుట; ద్రుహ్య = ద్రుహ్యుడు; అనుతుర్వసుల = అనుతుర్వసుల; వంశంబును = వంశములు; యదు = యదువు; కార్తవీర్య = కార్తవీర్యుడు; శశిబిందు = శశిబిందుడు; జామదగ్న = జామదగ్నుడు; ఆదుల = మున్నగు వారి; చరిత్రంబును = చరిత్రలు; శ్రీకృష్ణా = శ్రీకృష్ణుని; అవతార = అవతరించు; కథా = కథ; సూచనంబునున్ = సూచిచంచుట; అను = అనెడి; కథలు = కథలు; కల = కలిగిన; నవమ = తొమ్మిదవ; స్కంధము = స్కంధము; సంపూర్ణము = సంపూర్ణము.
భావము:- ఇది పరమేశ్వరుని దయ వలన కలిగిన కవితావైభవం కలవాడు, సహజసిద్ధమైన పాండిత్యం కలవాడు, కేసన మంత్రి పుత్రుడు అయిన పోతనామాత్యునిచే రచింపబడిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణంలో సూర్యవంశ ఉద్భవం; వైవస్వతమనువు పుట్టుక; సుద్యుమ్నుడు మొదలగు మనువు పుత్రుల చరితములు; మరుత్తుడు, తృణబిందు, శర్యాతి, కకుద్మి, సగరుడు, నాభాగాదుల చరిత్రలు; అంబరీషుని ఎడల ప్రయోగించిన దుర్వాసుని కృత్య వ్యర్థం అగుట; ఇక్ష్వాక, వికుక్షి, మాంధాత, పురుకుత్సుత, హరిశ్చంద్ర, సగర, భగీరథాది చరిత్రలు; గంగా ప్రవాహ వర్ణిన; కల్మాషపాద, ఖట్వాంగాదుల వృత్తాంతాలు; శ్రీరామచంద్రుని కథ; అతని వంశ పరంపర; నిమి కథ; చంద్రవంశ ప్రారంభం; బుధ పురూరవుల కథలు; జమదగ్ని, పరశురాముల వృత్తాంతాలు; విశ్వామిత్ర, నహుష, యయాతి, పూరు, దుష్యంత, భరత, రంతిదేవ, పాంచాల, బృహద్రథ, శంతన, భీష్మ, పాండవ, కౌరవాదుల వృత్తాంతాలు; ఋశ్యశృంగుని వ్రతం భిన్నమగుట; ద్రుహ్య అనుతుర్వసుల వంశాలు; యదు, కార్తవీర్య, శశిబిందు, జామదగ్నాదుల చరిత్రలు; శ్రీకృష్ణావతార కథా సూచన అనెడి కథలు కలిగిన తొమ్మిదవ స్కంధము సంపూర్ణము.


ఓం నమో భగవతే వాసుదేవాయ!!
ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వే జనా స్సుఖినో భవతు!!