పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/తృణబిందు వంశము

తృణబిందు వంశము

తెభా-9-48-వ.
ఆ దంపతులకు నిలబిల యనుగూఁతురుం జన్మించె; నా కొమ్మను విశ్రవసుండు పొందిన నైలబిలుండనం గుబేరుండు పుట్టె; మఱియు నా తృణబిందునకు విశాలుండును, శూన్యబంధుండును, ధూమ్రకేతుండును ననువారు మువ్వురు గొడుకులు గలిగి రందు విశాలుండు వంశవర్ధనుండయి వైశాలి యను నగరంబు నిర్మించె; నా రాజునకు హేమచంద్రుం, డా నరేంద్రునకు ధూమ్రాక్షుం, డా పుడమిఱేనికి సహదేవుం; డా బలిష్ఠునకుఁ గృశాశ్వుం; డాతనికి సోమదత్తుండు జన్మించె; నతండు.
టీక:- ఆ = ఆ; దంపతుల్ = జంట; కున్ = కి; ఇలబిల = ఇలబిల; అను = అనెడి; కూతురున్ = పుత్రిక; జన్మించెన్ = పుట్టెను; ఆ = ఆ; కొమ్మను = స్త్రీని; విశ్రవసుండు = విశ్రవసుడు; పొందినన్ = పెండ్లిచేసుకోగా; ఐలబిలుండు = ఇలకొడుకు; అనన్ = అనెడి; కుబేరుండు = కుబేరుడు; పుట్టెన్ = పుట్టెను; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; తృణబిందున్ = తృణబిందుని; కున్ = కి; విశాలుండును = విశాలుడు; శూన్యబంధుండును = శూన్యబంధుడు; ధూమ్రకేతుండును = ధూమ్రకేతుడు; అనువారు = అనెడివారు; మువ్వురు = ముగ్గురు (3); కొడుకులు = పుత్రులు; కలిగిరి = పుట్టిరి; అందున్ = వారిలో; విశాలుండు = విశాలుడు; వంశవర్ధనుండు = వంశస్థాపకుడు; అయి = అయ్యి; వైశాలి = వైశాలి; అను = అనెడి; నగరంబున్ = పట్టణమును; నిర్మించెన్ = కట్టెను; ఆ = ఆ; రాజున్ = రాజున; కున్ = కు; హేమచంద్రుండు = హేమచంద్రుడు; ఆ = ఆ; నరేంద్రున్ = రాజు; కున్ = కి; ధూమ్రాక్షుండు = ధూమ్రాక్షుడు; ఆ = ఆ; పుడమిఱేని = రాజు {పుడమిఱేడు - పుడమి (భూమి)కి ఱేడు (ప్రభువు) ,రాజు}; కిన్ = కు; సహదేవుండు = సహదేవుడు; ఆ = ఆ; బలిష్ఠున్ = బలవంతుని; కున్ = కి; కృశాశ్వుండు = కృశాశ్వుడు; ఆతని = అతని; కిన్ = కి; సోమదత్తుండు = సోమదత్తుడు; జనించెన్ = పుట్టెను; అతండు = అతడు.
భావము:- ఆ జంటకి ఇలబిల అనె పుత్రిక పుట్టింది. ఆ స్త్రీని విశ్రవసుడు పెండ్లాడాడు. ఇలబిలకు కుబేరుడు పుట్టాడు. కనుకనే అతనిని ఐలబిలుడు అని కూడ అంటారు. ఇంకను, ఆ తృణబిందునికి విశాలుడు, శూన్యబంధుడు, ధూమ్రకేతుడు అని ముగ్గురు (3) పుత్రులు పుట్టారు. వారిలో విశాలుడు వంశస్థాపకుడు అయ్యి, వైశాలి అనె పట్టణమును కట్టాడు. ఆ రాజునకు హేమచంద్రుడు; ఆ రాజుకి ధూమ్రాక్షుడు; ఆ రాజుకు సహదేవుడు; ఆ బలవంతునికి కృశాశ్వుడు; అతనికి సోమదత్తుడు పుట్టారు. అతడు....

తెభా-9-49-ఆ.
మరవిభుఁడు మెచ్చ శ్వమేధము జేసి
భూరిపుణ్యగతికిఁ బోయె నెలమి;
సోమదత్తుకొడుకు సుమతికి జనమేజ
యుం డనంగఁ గొమరు డుప్పతిల్లె.

టీక:- అమరవిభుడు = దేవేంద్రుడు {అమరవిభుడు అమరుల (దేవతల)కి విభుడు, ఇంద్రుడు}; మెచ్చన్ = శ్లాఘంచునట్లుగ; అశ్వమేధమున్ = అశ్వమేధయాగమును; చేసి = చేసి; భూరి = అతిగొప్ప; పుణ్య = ధన్యమైన; గతికిన్ = లోకమునకు; పోయెన్ = వెళ్ళెను; ఎలమిన్ = అతిశయించి; సోమదత్తు = సోమదత్తుని; కొడుకు = పుత్రుడు; సుమతి = సుమతి; కిన్ = కి; జనమేజయుండు = జనమేజయుడు; అనంగన్ = అనబడెడి; కొమరుడు = పుత్రుడు; ఉప్పతిల్లె = జనించెను;
భావము:- ఆ సోమదత్తుడు, దేవేంద్రుడు మెచ్చుకునేలా అశ్వమేథ యాగం చేసి అతిగొప్ప పుణ్యగతిని పొందాడు. సోమదత్తుని పుత్రుడు సుమతి; అతనికి జనమేజయుడు అను పుత్రుడు జన్మించాడు.