పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/జమదగ్ని వృత్తాంతము
జమదగ్ని వృత్తాంతము
తెభా-9-423-సీ.
సత్యవతిని గాధిజాతను గన్యను-
విప్రుఁడు ఋచికుండు వేఁడికొనిన
గాధియు సుత కీడు గాఁడని తెల్లని-
నవకంపు మేనులు నల్లచెవులు
గల గుఱ్ఱములు వేయి కన్యకు నీ వుంకు-
విచ్చినఁ గూతు నే నిత్తు ననిన
వసుధామరుండును వరుణుని కడ కేఁగి-
హరులఁ దెచ్చినఁ గూతు నాఁత డిచ్చె
తెభా-9-423.1-ఆ.
నా మహాత్ము సతియు నత్తయుఁ గొడుకులఁ
గోరి యడుగ నియ్యకొని యతండు
విప్రరాజ మంత్రవితతుల వేల్పించి
చరువు చేసి క్రుంక నరిగె నదికి.
టీక:- సత్యవతిని = సత్యవతిని; గాధి = గాధికి; జాతనున్ = పుట్టినామెను; కన్యను = అవివాహితను; విప్రుడు = బ్రాహ్మణుడు; ఋచికుండు = ఋచికుడు; వేడికొనినన్ = అర్థించగా; గాధియున్ = గాధి; సుత = పుత్రిక; కున్ = కు; ఈడు = ప్రాయము; కాడు = సరిపోలడు; అని = అని; తెల్లని = తెల్లటి; నవకంపు = మృదువైన; మేనులు = శరీరములు; నల్ల = నల్లటి; చెవులు = చెవులు; కల = కలిగిన; గుఱ్ఱములున్ = గుఱ్ఱములను; వేయి = వెయ్యి (1000); కన్య = పెళ్ళికూతురు; కున్ = కు; నీవున్ = నీవు; ఉంకువు = కన్యాశుల్కము; ఇచ్చినన్ = ఇచ్చినచో; కూతున్ = పుత్రికను; నేన్ = నేను; ఇత్తున్ = ఇచ్చెదను; అనిన్ = అనగా; వసుధామరుండును = బ్రాహ్మణుడు {వసుధామరుడు - భూమికి దేవత, విప్రుడు}; వరుణుని = వరుణుని; కడ = వద్ద; కున్ = కు; ఏగి = వెళ్ళి; హరులన్ = గుఱ్ఱములను; తెచ్చినన్ = తీసుకురాగా; కూతున్ = కమార్తెను; ఆతడు = అతడు; ఇచ్చెన్ = ఇచ్చెను; ఆ = ఆ .
మహాత్మున్ = గొప్పవానిని; సతియున్ = భార్య; అత్తయున్ = భార్యతల్లి; కొడుకులన్ = పుత్రులు; కోరి = కావాలని; అడుగగా = అర్థించగా; ఇయ్యకొని = అంగీకరించి; అతండున్ = అతను; విప్ర = బ్రాహ్మణపు; రాజ = క్షత్రియపు; మంత్ర = మంత్రముల; వితతులన్ = సమూహములను; వేల్పించి = హోమముచేసి; చరువున్ = హవిస్సును; చేసి = తయారుచేసి; క్రుంకన్ = స్నానముచేయుటకు; అరిగెన్ = వెళ్ళెను; నది = కాలువ; కిన్ = కు .
భావము:- ఆ గాధిరాజు పుత్రిక సత్యవతీ కన్యను బ్రాహ్మణుడైన ఋచికుడు కోరాడు. తన పుత్రికకు అతనికి ఈడు కాదని భావించి, గాధి తెల్లటి మృదు శరీరాలు నల్లటి చెవులు కల వెయ్యి గుఱ్ఱాలను కన్యాశుల్కంగా ఇస్తే పుత్రికను ఇస్తాను అన్నాడు. ఆ బ్రాహ్మణుడు వరుణుని అడిగి అలాంటి గుఱ్ఱాలను తీసుకురాగా, కూతురుని ఇచ్చాడు. అతని తల్లి, భార్య ఇద్దరూ కొడుకులు కావాలని కోరారు. అంగీకరించిన అతను బ్రాహ్మణ మంత్రాలుతో, క్షత్రియ మంత్రాలుతో విడివిడిగా హోమంచేసి హవిస్సులు చేసి నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు.
తెభా-9-424-వ.
అయ్యెడం దల్లి యడిగిన, సత్యవతి బ్రహ్మమంత్రంబులఁ దనకు వేల్పించిన చరువు దల్లి కిచ్చి క్షాత్రమంత్రంబులం దల్లికి వేల్పించిన చరువు దా నందుకొని యుండ నా ముని చనుదెంచి చరువు వీడ్వడుట యెఱింగి భార్య కిట్లనియె.
టీక:- ఆ = ఆ; ఎడన్ = సమయము నందు; తల్లి = తల్లి; అడిగిన = అడుగుగా; సత్యవతి = సత్యవతి; బ్రహ్మ = బ్రాహ్మణపు; మంత్రంబులన్ = మంత్రములతో; తన = ఆమె; కున్ = కోసము; వేల్పించిన = వేల్చినట్టి; చరువున్ = హవిస్సును; తల్లి = తల్లి; కిన్ = కి; ఇచ్చి = ఇచ్చి; క్షాత్ర = రాజధర్మపు; మంత్రంబులన్ = మంత్రములతో; తల్లి = తల్లి; కిన్ = కోసము; వేల్పించిన = వేల్చినట్టి; చరువున్ = హవిస్సును; తాన్ = ఆమె; అందుకొని = తీసుకొని; ఉండన్ = ఉండగా; ఆ = ఆ; ముని = ఋషి; చనుదెంచి = వచ్చి; చరువు = హవిస్సు; వీడ్వడుట = తారుమారగుట; ఎఱింగి = తెలిసికొని; భార్య = భార్య; కిన్ = కి; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:- అప్పుడు తల్లి అడిగిందని సత్యవతి బ్రాహ్మణపు మంత్రాలతో వ్రేల్చిన హవిస్సు తల్లికి ఇచ్చింది. రాజధర్మపు మంత్రములతో వ్రేల్చిన హవిస్సును తాను తీసుకుంది. స్నానం చేసి వచ్చి, ఋషి హవిస్సులు తారుమారు కావడం తెలిసి భార్యతో ఇలా అన్నాడు.
తెభా-9-425-ఆ.
"తల్లి చరువు నీవు దాల్చి నీ చరు వేల
తల్లిపాల నిడితి తరళనేత్ర!
కొమ్మ! యింక నీకుఁ గ్రూరుఁడు పుట్టు మీ
యమ్మ బ్రహ్మవిదుని ననఘుఁ గాంచు."
టీక:- తల్లి = తల్లి యొక్క; చరువు = హవిస్సు; నీవున్ = నీవు; దాల్చి = ధరించి; నీ = నీ యొక్క; చరువున్ = హవిస్సును; ఏలన్ = ఎందుకు; తల్లి = తల్లి; పాలన్ = వశమున; ఇడితి = పెట్టితివి; తరళనేత్ర = సుందరి {తరళేక్షణ - చలించెడి కన్నులు కలామె, స్త్రీ}; కొమ్మ = వనిత; ఇంక = మరి; నీ = నీ; కున్ = కు; క్రూరుడు = క్రూరమైనవాడు; పుట్టున్ = జన్మించును; మీ = మీ యొక్క; అమ్మ = తల్లి; బ్రహ్మవిదునిన్ = బ్రహ్మజ్ఞానిని; అనఘున్ = పుణ్యుని; కాంచున్ = పొందును.
భావము:- ఓ సుందరీ! తల్లి హవిస్సు నీవు తీసుకున్నావు. నీ హవిస్సు మీ తల్లి తీసుకుంది, అందుచేత నీకు క్రూరుడు అయిన కొడుకు పుడతాడు. మీ తల్లికి పుణ్యవంతుడు బ్రహ్మజ్ఞాని పుడతాడు.”
తెభా-9-426-వ.
అనిన నయ్యింతి వెఱచి మ్రొక్కి వినయంబులాడినం బ్రసన్నుండై "నీ కొడుకు సాధువై, నీ మనుమండు క్రూరుం డగుంగాక" యని ఋచికుం డనుగ్రహించిన నా సత్యవతికి జమదగ్ని సంభవించె; సత్యవతియుం గౌశకీనది యై లోకపావని యై ప్రవహించె; నా జమదగ్నియు రేణువు కూఁతురయిన రేణుకను వివాహంబై వసుమనాది కుమారులం గనియె; నందు.
టీక:- అనిన్ = అనగా; ఆ = ఆ; ఇంతి = యువతి; వెఱచి = బెదిరిపోయి; మ్రొక్కి = నమస్కరించి; వినయంబులాడిన = ప్రాధేయపడగా; ప్రసన్నుండు = సంతుష్టుడు; ఐ = అయ్యి; నీ = నీ యొక్క; కొడుకు = పుత్రుడు; సాధువు = సాధువు; ఐ = అయ్యి; నీ = నీ యొక్క; మనుమండు = మనుమడు; క్రూరుండు = క్రూరస్వభావి; అగుంగాక = అవుతాడు; అని = అని; ఋచికుండు = ఋచికుడు; అనుగ్రహించినన్ = అనుగ్రహించగా; ఆ = ఆ; సత్యవతి = సత్యవతి; కిన్ = కి; జమదగ్ని = జమదగ్ని; సంభవించెన్ = పుట్టెను; సత్యవతియున్ = సత్యవతి; కౌశకీ = కౌశకీ యనెడి; నది = నది; ఐ = అయ్యి; లోక = లోకములను; పావని = పవిత్రము చేయునది; ఐ = అయ్యి; ప్రవహించెన్ = ప్రవహించినది; ఆ = ఆ; జమదగ్నియున్ = జమదగ్ని; రేణువు = రేణువు యొక్క; కూతురు = పుత్రిక; ఐయిన = ఐన; రేణుకను = రేణుకను; వివాహంబై = పెళ్ళిచేసికొని; వసుమన = వసుమనుడు; ఆది = మున్నగు; పుత్రులన్ = కొడుకులను; కనియెన్ = పుట్టించెను; అందు = వారిలో.
భావము:- ఇలా ఋచికుడు చెప్పగా ఆమె బెదిరిపోయింది. మ్రొక్కి ప్రాధేయపడగా సంతుష్టుడు అయ్యి “నీ పుత్రుడు సాధువు అయి, నీ మనుమడు క్రూరస్వభావి అవుతాడు.” అని ఋచికుడు అనుగ్రహించాడు. అలా సత్యవతికి జమదగ్ని పుట్టాడు. సత్యవతి కౌశకీ నది అయ్యి లోకాలను పవిత్రం చేస్తోంది. ఆ జమదగ్ని రేణువు పుత్రిక రేణుకను పెళ్ళిచేసికొని వసుమనుడు మున్నగు కొడుకులను పుట్టించాడు.