పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/మోక్షప్రదుండు శ్రీహరి
తెభా-2-39-క.
కామింపకయును సర్వముఁ
గామించియునైన ముక్తిఁ గామించి తగన్
లో మించి పరమపురుషుని
నేమించి భజించుఁ దత్త్వనిపుణుం డధిపా!
టీక:- కామింపకయునున్ = దేనిని కోరకుండగను; సర్వమున్ = సమస్తమును; కామించియున్ = కోరుకొనియును; ఐనన్ = ఉన్నప్పటికిని; ముక్తిన్ = ముక్తిని; కామించి = కోరుకొని; తగన్ = తప్పకుండగ; లోన్ = లోపల, అంతకరణలోనుంచి; మించి = అతిశయించి; పరమ = పరమోత్కృష్ట; పురుషునిన్ = పురుషుని యందు; నేమించి = నియమముల నేర్పరుచుకొని; భజించున్ = ఆరాధించును; తత్త్వ = తత్త్వములో; నిపుణుండున్ = నైపుణ్యమున్నవాడు; అధిపా = గొప్పవాడా, మహారాజా.
భావము:- రాజశేఖర! పై చెప్పిన వాటి నన్నింటినీ కోరిన, కోరకపోయిన తత్త్వం తెలిసినవాడు మోక్షం మాత్రం తప్పక కోరుతాడు. హృదయంలో పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి భజిస్తాడు.
తెభా-2-40-మ.
అమరేంద్రాదులఁ గొల్చుభంగి జనుఁడా యభ్జాక్షు సేవింపఁగా
విమలజ్ఞాన విరక్తి ముక్తు లొదవున్, వేయేల భూనాథ! త
త్కమలాధీశ కథాసుధారస నదీకల్లోలమాలా పరి
భ్రమ మెవ్వారికినైనఁ గర్ణయుగళీపర్వంబు గాకుండునే?"
టీక:- అమర = దేవతలలో; ఇంద్ర = ఇంద్రుడు; ఆదులన్ = మొదలగువారిని; కొల్చు = ఆరాధించు; భంగిన్ = విధముగనే; జనుడు = మానవుడు; ఆ = ఆ; అబ్జాక్షున్ = పద్మనయనుని, విష్ణువుని; సేవింపగన్ = ఆరాధించగా; విమల = నిర్మలమైన; జ్ఞాన = జ్ఞానమును; విరక్తిన్ = విరక్తియును; ముక్తుల్ = ముక్తులు; ఒదవున్ = కలుగును; వేయేలన్ = వెయ్యి మాటలెందులకు; భూ = భూమికి; నాథ = ప్రభువా, మహారాజా; తత్ = ఆ; కమల = లక్ష్మీదేవి; అధీశ = పతి; కథా = కథలు అను; సుధా = అమృతపు; రస = రసము; నదీ = నది యందలి; కల్లోల = అలల; మాలా = దొంతర్లలో; పరిభ్రమము = తిరుగుటచేత; ఎవ్వారికిన్ = ఎవరికి; ఐనన్ = అయినప్పటికిని; కర్ణ = చెవుల; యుగళీ = జంటకు; పర్వంబున్ = పండుగ; కాక = కాకుండా; ఉండునే = ఉంటుందా, ఉండదు.
భావము:- పృథ్వీపతి! ఇలాంటి భౌతికమైన కోరికలతో ఇంద్రుడు మొదలైన వారిని సేవించినట్లే పద్మ నేత్రుడైన విష్ణుని భజిస్తే నిర్మలమైన జ్ఞానము, వైరాగ్యము, మోక్షము సిద్ధిస్తాయి. పలుమాట లెందుకు ఆ లక్ష్మీనాథుని కథా ప్రసంగాలనే నదీతరంగాలలో ఓలలాడటం కంటే అదృష్ట మేముంటుంది. శ్రీహరి కథలు ఎవరికైనా చెవుల పండువు చేయకుండా ఉంటాయా.”
తెభా-2-41-వ.
అని యిట్లు రాజునకు శుకుండు సెప్పె"ననిన విని శౌనకుండు సూతున కిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; రాజున్ = రాజు; కున్ = కి; శుకుండున్ = శుకుడు; చెప్పెన్ = చెప్పెను; అనిన = అనగ; విని = విని; శౌనకుండున్ = శౌనకుడు; సూతున్ = సూతున; కిన్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఇలా పరీక్షిన్మహారాజుకు శుకయోగి చెప్పా” డని సూతడు పలుకగా విని శౌనకుడు సూతునితో ఈ విధంగా అన్నాడు.
తెభా-2-42-క.
"వర తాత్పర్యముతో నిటు
భరతాన్వయవిభుఁడు శుకుని పలుకులు విని స
త్వరతాయుతుఁడై శ్రేయ
స్కరతామతి నేమి యడిగె? గణుతింపఁ గదే;
టీక:- వర = శ్రేష్ఠమైన; తాత్పర్యము = భావము; తోన్ = తో; ఇటు = ఇక్కడ; భరత = భరత; అన్వయ = వంశోద్భవ; విభుఁడు = ప్రభువు (పరీక్షిత్తు); శుకుని = శుకుని; పలుకులు = భాషణములు; విని = విని; సత్వరత = ఆతురతతో; ఆయుతఁడు = కూడినవాడు; ఐ = అయి; శ్రేయస్ = శుభములు; కరతా = కలిగించు; మతిన్ = బుద్ధితో; ఏమి = ఏమి; అడిగెన్ = అడిగెను; గణుతింపన్ = ఎంచి వచింప; కదే = వలసినది.
భావము:- “శుకబ్రహ్మ ఈ విధంగా చెప్పిన మాటలు శ్రద్ధగా విన్న పరీక్షిత్తు, శ్రేయోభిలాషియై ఆతృతతో యేమని ప్రశ్నించాడో వివరంచవయ్య సూతా!
తెభా-2-43-క.
ఒప్పెడి హరికథ లెయ్యవి
సెప్పెడినో యనుచు మాకుఁ జిత్తోత్కంఠల్
గుప్పలుగొనుచున్నవి; రుచు
లుప్పతిలన్ నీ మనోహరోక్తులు వినగన్."
టీక:- ఒప్పెడిన్ = చక్కటి; హరి = విష్ణుని; కథలు = కథలు; ఎయ్యవి = ఏవి+ఏవి, ఏవేవి; చెప్పెడినో = చెప్పునో; అనుచున్ = అనుచు; మాకున్ = మాకు; చిత్ = మనస్సున; ఉత్కంఠల్ = కుతూహలము; కుప్పలుగొనుచున్ = ఎక్కువగా కలుగుతు; ఉన్నవి = ఉన్నవి; రుచులు = కోరికలు; ఉప్పతిలన్ = ఉద్భవించగ; ఈ = నీ; మనోహర = మనోహరమైన; ఉక్తులు = పలుకులు; వినగన్ = వినవలెనని.
భావము:- చవులూరించే మనోజ్ఞమైన నీ మాటలు వింటుంటే ఇంకా ఎలాంటి మంచి మంచి హరికథలు చెపుతాడో అని మా మనస్సులో ఉబలాటం పెల్లుబుకుతున్నది.”
తెభా-2-44-వ.
అనిన విని సూతుం డిట్లనియె.
టీక:- అనిన = అనగా; విని = విని; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- శౌనకుని ఈ పలుకులు వినిన సూతమహర్షి ఇలా చెప్పాడు.
తెభా-2-45-క.
"తూలెడి కూఁకటితోడను
బాలురతో నాడుచుండి బాల్యమున మహీ
పాలుఁడు హరిచరణార్చన
హేలాలసుఁ డగుచు నుండె నెంతయు నియతిన్.
టీక:- తూలెడి = ఊగెడి; కూకటి = ముంగురులు; తోడను = తోను; బాలుర = పిల్లల; తోన్ = తోను; ఆడుచున్ = ఆడుతూ; ఉండి = ఉండి; బాల్యమునన్ = బాల్యము నందు; మహీ = భూమికి; పాలుఁడు = పాలకుడు (పరీక్షిత్తు); హరి = విష్ణువు యొక్క; చరణ = పాద; అర్చన = అర్చించు; హేలా = విలాసముల; లాలసుఁడు = లాలస కలవాడు, కోరిక కలవాడు; అగుచున్ = అగుచూ; ఉండెన్ = ఉండెను; ఎంతయున్ = మిక్కిలి; నియతిన్ = నియమానుసారుడై.
భావము:- “మునులార! ఆ పరీక్షిన్మహారాజు బాల్యంలో తూలిపడే జులపాల జుట్టుతో, తోటి బాలురతో ఆడుకుండే రోజుల్లోకూడ శ్రద్ధతో శ్రీహరి పాదాలను అర్చించేవాడు.