పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/మంథరగిరి ధారణంబు
తెభా-2-187-శా.
సప్తాబ్దంబుల బాలుఁడై నిజభుజాస్తంభంబునన్ లీలమై
సప్తాహంబులు శైలరాజము లసచ్ఛత్త్రంబుగాఁ దాల్చి, సం
గుప్తప్రాణులఁ జేసె మాధవుఁడు గోగోపాలకవ్రాతమున్
సప్తాంభోధి పరీతభూధరున కాశ్చర్యంబె చింతింపఁగన్.
టీక:- సప్త = ఏడు; అబ్దంబులన్ = సంవత్సరాల (వయసున్న); బాలుఁడు = బాలకుడు; ఐ = అయి; నిజ = తన; భుజ = భుజము అను; స్తంభంబునన్ = స్తంభము మీద; లీలమై = లీలతో; సప్త = ఏడు; అహంబులున్ = దినములు; శైల = పర్వతములలో; రాజమున్ = గొప్పదానిని; లసత్ = తళుకుల; ఛత్రంబు = గొడుగు; కాన్ = అయినట్లు, వలె; తాల్చి = ధరించి; సంగుప్త = బాగుగా దాచబడిన; ప్రాణులఁన్ = జీవులను; చేసెన్ = చేసెను; మాధవుఁడు = కృష్ణుడు {మాధవుడు - మాధవి భర్త, భగవంతుడు}; గో = గోవుల; గోపాలక = గోపకుల; వ్రాతమున్ = సమూహములను; సప్త = ఏడు; అంభోధిన్ = సముద్రముల; పరీత = పర్యంతమైన; భూ = భూమిని; ధరున్ = ధరించువాని; కిన్ = కి; ఆశ్చర్యంబె = ఆశ్చర్యకరమైన పనా; చింతింపగన్ = ఆలోచించి చూస్తే.
భావము:- శ్రీకృష్ణుడు ఏడేళ్ళ బాలుడై ఉన్నా ఏడు రోజుల పాటు స్తంభములాంటి తన భుజముపై అలవోకగా శ్రేష్ఠమైన శైలము గోవర్థనగిరిని ఓ ప్రకాశించే గొడుగులాగ ఎత్తి పట్టుకున్నాడు. గోవులను గోపాలకులను దాని మరుగున దాచి అందరి ప్రాణాలను రక్షించాడు. సప్తసముద్రాలతో చుట్టబడి ఉండే భూమి నంతటిని ధరించిన ఆ పరమపురుషునికి ఇది వింత పనేం కాదు.
తెభా-2-188-సీ.
సాంద్రశరచ్చంద్ర చంద్రికా ధవళిత-
విమల బృందావన వీథియందు
రాసకేళీ మహోల్లాసుఁడై యుత్ఫుల్ల-
జలజాక్షుఁ డొక నిశాసమయమునను
దనరారు మంద్ర మధ్యమ తారముల నింపు-
దళుకొత్త రాగభేదములఁ జెలఁగి
ధైవత ఋషభ గాంధార నిషాద పం-
చమ షడ్జ మధ్యమ స్వరము లోలిఁ
తెభా-2-188.1-తే.
గళలు జాతులు మూర్ఛనల్ గలుగ వేణు
నాళ వివరాంగుళన్యాస లాలనమున
మహితగతిఁ బాడె నవ్యక్త మధురముగను
పంకజాక్షుండు దారువు లంకురింప.
టీక:- సాంద్ర = చిక్కటి; శరత్ = శరత్కాల, శరదృతువు; చంద్ర = చంద్రుని; చంద్రికా = వెన్నెలల; ధవళిత = తెల్లనైన; విమల = నిర్మలమైన; బృందావన = బృందావనము యొక్క {బృందావనము - బృందము ఆవనము (రక్షించుట), బృంద (తులసి) వనము (తోట)}; వీథి = దారుల; అందున్ = లో; రాసకేళీ = రాసకేళి వలని {రాసకేళి - ఒకరి చేతులొకరు పట్టుకొని గుండ్రముగ పాటలకు లయబద్దముగ తిరుగు నాట్యవిశేషము}; మహా = గొప్ప; ఉల్లాసుఁడు = ఉల్లాసము కలవాడు; ఐ = అయ్యి; ఉత్ఫుల్ల = బాగుగ విరిసిన; జలజ = పద్మము {జలజ - నీటిలో పుట్టినది - పద్మము}; అక్షుఁన్ = కన్నులవాడు (కృష్ణుడు); ఒక = ఒక; నిశా = రాత్రి; సమయమునన్ = వేళ; తనరారు = అతిశయిస్తున్న; మంద్ర = మంద్ర స్థాయి {మంద్ర - నాభిస్థానమున పలుకుధ్వని, మధ్య - హృదయ స్థానమునపలుకుధ్వని, తారా - మూర్థమునందు పలుకుధ్వని}; మధ్యమ = మధ్యమ స్థాయి; తారములన్ = తారా స్థాయి లు; నింపు = నింపబడుట; తళుకొత్త = సరికొత్త, తళుకులు ఒత్తగ; రాగ = రాగములలోని; భేదములన్ = భేదములతో; చెలఁగి = చెలరేగి; ధైవత = ధైవతము (ద); ఋషభ = ఋషభము (రి); గాంధార = గాంధారము (గ); నిషాద = నిషాదము (ని); పంచమ = పంచమము (ప); షడ్జమ = షడ్జమము (స); మధ్యమ = మధ్యమము (మ); స్వరములు = (సప్త) స్వరములు; ఓలిఁన్ = వరుసలుగ; కళలు = కళలును {కళలు - కాల కాలపరిమాణ విశేషములు};
జాతులు = జాతులును {జాతులు - తాళ భేదములు}; మూర్చనల్ = మూర్చనలును {మూర్చనలు - స్వర సమూహముల భేదములు}; కలుగన్ = కలిగేలాగ; వేణు = వేణువు యొక్క; నాళ = గొట్టపు; వివరన్ = రంధ్రముల పై; అంగుళ = వేళ్ళ; న్యాస = ముద్రల వాడికలోని; లాలనమునన్ = సున్నితత్వముల; మహిత = గొప్ప; గతిన్ = విధానమున; పాడెన్ = పాడెను (పాటలు); అవ్యక్త = వివరించలేనంత; మధురముగను = తీయగా; పంకజ = పద్మము వంటి; అక్షుండు = కన్నులవాడు; దారువులు = మోళ్ళు; అంకురింపన్ = చిగురించునట్లు.
భావము:- అది ఒక శరత్కాలపు రాత్రి. పండువెన్నెలలో బృందావన మంతా తెల్లగా మెరిసిపోతోంది. విరబూచిన తామరలవంటి కన్నులు గల కృష్ణుడు ఆ వనంలో రాసకేళికి ఉపక్రమించాడు. ఆ క్రీడోల్లాసంతో పిల్లనగ్రోవి చేత బట్టాడు. దాని రంధ్రాలపై వ్రేళ్లూనుతు ఇంపుగా అనేక రాగాలను ఆలపించాడు. వాటిలో మంద్రస్థాయినీ, మధ్యమస్థాయినీ, తారస్థాయినీ వినిపించాడు. షడ్జమం, ఋషభం, గాంధారం, మధ్యమం, పంచమం, ధైవతం, నిషాదం అనే స్వరాలు, కళలు, జాతులు, ఆరోహణావరోహణ క్రమాలు తేటపడేటట్టుగా అవ్యక్త మధురంగా గానం చేసాడు. ఆ గానానికి మ్రోళ్లు చివురించాయి.
తెభా-2-189-మ.
హరివేణూద్గత మంజులస్వరనినాదాహూతలై గోప సుం
దరు లేతేర ధనాధిపానుచరగంధర్వుండు గొంపోవఁ ద
త్తరుణుల్ గుయ్యిడ శంఖచూడుని భుజాదర్పంబు మాయించి తాఁ
బరిరక్షించిన యట్టి కృష్ణుని నుతింపన్ శక్యమే యేరికిన్?
టీక:- హరి = కృష్ణుడు; వేణు = వేణువు నుండి; ఉద్గత = వెలువడిన; మంజుల = మనోహరమైన; స్వర = స్వరముల; నినాద = చక్కటి నాదముచే; ఆహుతులు = పిలువ బడినవారు; ఐ = అయి; గోప = గోపికా; సుందరులు = సుందరీమణులు; ఏతేర = రాగా; ధనాధిప = కుబేరుడు {ధనాధిపుడు - ధనమునకు అధికారి - కుబేరుడు}; అనుచర = అనచరుడైన; గంధర్వుండున్ = గంధర్వుడు; కొంపోవఁన్ = పట్టుకొని పోగా; తత్ = ఆ; తరుణుల్ = స్త్రీలు; కుయ్యిడన్ = మొరపెట్టగా; శంఖచూడునిన్ = శంఖచూడుడుని; భుజా = (తన) భుజముల; దర్పంబున్ = బలముతో; మాయించి = ఓడించి; తాఁన్ = తాను; పరిరక్షించినన్ = కాపాడిన; అట్టి = అటువంటి; కృష్ణుని = కృష్ణుని; నుతింపన్ = స్తుతించుట; శక్యమే = అలవి అగునా ఏమి; ఏరికిన్ = ఎవరికైనా సరే.
భావము:- మధుర స్వరాల పిలుపులు శ్రీహరి వేణువు నుండి వెలువడి ఆకర్షిస్తున్నాయి. దానితో గోపికలు పరుగెత్తుకు వచ్చారు. అప్పుడు కుబేరుని అనుచరుడైన శంఖచూడుడనే గంధర్వుడు వాళ్ల నెత్తుకుపోయాడు, వాళ్ళు “కృష్ణా!, కృష్ణా!” అంటూ మొరపెట్టుకొన్నారు. వెంటనే మాధవుడు శంఖచూడుని భుజగర్వం పోకార్చి ఆ రమణీమణులను రక్షించాడు. అలాంటి వనమాలిని కొనయాడడం ఎవరికి శక్యం కాదు.
తెభా-2-190-చ.
నరక మురప్రలంబ యవనద్విప ముష్టికమల్ల కంసశం
బర శిశుపాల పంచజన పౌండ్రక పల్వల దంతవక్త్ర వా
నర ఖర సాల్వ వత్స బక నాగ విదూరథ రుక్మి కేశి ద
ర్దుర వృష ధేనుక ప్రముఖ దుష్ట నిశాటులఁ ద్రుంచె వ్రేల్మిడిన్.
టీక:- నరక = నరకాసురుడు {నరకాసురుడు - భూమాత పుత్రుడు, సత్యభామ చేత హతుడు అయిన అసురుడు}; ముర = ముర {ముర - ముర అను అసురుడు వీనిని సంహరించి కృష్ణుడు మురారి అను పేరు బడెను}; ప్రలంబ = ప్రలంబుడు {ప్రలంబుడు - ఒక అసురుడు}; యవన = కాల యవనుడు {కాలయవనుడు - కృష్ణనిచే ప్రేరేపితుడై అతని వెన్నంటి ముని చూపు వలని అగ్నిలో మరణించినవాడు}; ద్విప = ద్విప అను మదపుటేనుగు {ద్విప - కంసుని ఆస్థానమందలి మదపుటేనుగు, రెంట త్రావుడు, 2 రకముల తాగునది}; ముష్టిక = ముష్టికుడు {ముష్టికుడు - కంసుని ఆస్థాన మల్లయోధులు}; మల్ల = మల్లుడు {మల్లుడు - కంసుని ఆస్థాన మల్లయోధుడు}; కంస = కంసుడు {కంసుడు - కృష్ణని మేనమామ}; శంబర = శంబరుడు {శంబరుడు - ఒక అసురుడు}; శిశుపాల = శిశుపాలుడు {శిశుపాలుడు - కృష్ణుని మేనల్లుడు}; పంచజన = పంచజనుడు {పంచజనుడు - కృష్ణుడు పంచజనుని చంపి అతని నుండి పాంచజన్యము అను శంఖమును ధరించెను}; పౌండ్రక = పౌండ్రక వాసుదేవుడు {పౌండ్రక వాసుదేవుడు - పౌండ్రక దేశ అధిపతి తనే వాసుదేవుని అసలు అవతారమని విఱ్ఱవీగినవాడు}; పల్వల = పల్వలుడు {పల్వలుడు - ఇల్వలుడు అను రాక్షసుని కొడుకు పల్వలుడు, బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మునుల కోరిక మేర పల్వలుని సంహరించాడు}; దంతవక్త్ర = దంతవక్త్రుడు {దంతవక్త్రుడు - శిశుపాలుని తమ్ముడు}; వానర = వానరుడు {వానరుడు – వానర రూపమున వచ్చి పాచికలాడుతున్న బలరాముని చికాకు పరచిన అసురుడు}; ఖర = ఖరుడు {ఖరుడు - గాడిదరూపి అసురుడు}; సాల్వ = సాల్వుడు {సాల్వుడు - సాల్వ దేశ రాజు}; వత్స = వత్సాసురుడు {వత్సాసురుడు - గోవత్స రూపమున బాలకృష్ణుని అలమందలో చేరిన అసురుడు}; బక = బకాసురుడు {బకాసురుడు - అతి పెద్ద బకము (కొంగ) రూపమున బాల కృష్ణుని వధించవచ్చిన వాడు}; నాగ = ఆఘాసురుడు {నాగ - పాము రూపమున వచ్చిన అఘాసురుడు}; విదూరథ = విదూరథుడు; రుక్మి = రుక్మి {రుక్మి - రుక్మిణి అన్న గారు}; కేశి = కేశి {కేశి - కంశుని తమ్ముడు, భీకర గుఱ్ఱము రూపంలో వచ్చి కృష్ణునిచే సంహరింపబడినవాడు}; దర్దుర = దర్దురుడు; వృష = వృషభాసురుడు {వృషభాసురుడు - ఎద్దు రూపమున ఉన్న వృషభాసురుడు}; ధేనుక = ధేనుకుడు {ధేనుకాసురుడు - గాడిద రూపమున ఉన్న ధేనుకాసురుడు}; ప్రముఖ = మొదలైన ప్రముఖ; దుష్ట = దుష్టులైన; నిశాటులఁన్ = రాక్షసులను {నిశాటులు - నిశ (చీకటి, చెడు) లో ప్రవర్తించు వారు}; త్రుంచెన్ = సంహరించెను; వ్రేల్మిడిన్ = చిటికెలో.
భావము:- ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నరకాసురుడు, మురాసురుడు, ప్రలంబుడు, కాలయవనుడు, కువలయాపీడము అనే ఏనుగు, ముష్టికుడు చాణూరుడు మొదలైన మల్లురు, కంసుడు, శంబరుడు, శిశుపాలుడు, పౌండ్రక వాసుదేవుడు, పల్వలుడు, దంతవక్ర్తుడు, ద్వివిదుడు అనే వానరుడు, గర్దభాసురుడు, సాల్వుడు, వత్సాసురుడు, బకాసురుడు, విదూరథుడు, రుక్మి, కేశి, దర్దురుడు, వృషభాకారాలు గల ఏడుగురు దనుజులు, ధేనుకుడు మొదలైన పెక్కుమంది రక్కసులను ఒక్క త్రుటిలో రూపుమాపాడు.
(భూభారం ఉడుపుటకైన వీరందరి సంహారముల కారకుడు కృష్ణుడే అని తాత్పర్యముగా గ్రహించనోపును.)
తెభా-2-191-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకను.
భావము:- అంతేకాదు.
తెభా-2-192-మ.
బలభీమార్జున ముఖ్య చాపధర రూపవ్యాజతం గ్రూరులన్
ఖలులన్ దుష్టధరాతలేశ్వరుల సంగ్రామైక పారీణ దో
ర్బలకేళిం దునుమాడి సర్వధరణీభారంబు మాయించి సా
ధుల రక్షించిన యట్టి కృష్ణుని ననంతుం గొల్తు నెల్లప్పుడున్.
టీక:- బల = బలరాముడు; భీమ = భీముడు; అర్జున = అర్జునుడు; ముఖ్య = ముఖ్యమైన; చాప = విల్లు; ధర = ధరించిన వారి; రూప = రూపముల; వ్యాజతం = వంకతో; క్రూరులన్ = క్రూరమైన వారిని; ఖలులన్ = నీచులను; దుష్ట = దుర్మార్గులైన; ధరాతల = భూమండలాల; ఈశ్వరులన్ = రాజులను; సంగ్రామ = యుద్ధము అనే; ఏక = ముఖ్య; పారీణ = కార్యముగ; దోర్బల = భుజబల; కేళిన్ = క్రీడలతో; తునుమాడి = సంహరించి; సర్వ = సమస్త; ధరణీ = భూమి; భారంబున్ = భారములను; మాయించి = పోగొట్టి; సాధులన్ = మంచి వారిని; రక్షించినన్ = కాపాడిన; అట్టి = అట్టి; కృష్ణుని = కృష్ణుని {కృష్ణుడు - నల్లని వాడు}; అనంతున్ = కృష్ణుని {అనంతుడు - అంతము లేని వాడు, భగవంతుడు}; కొల్తున్ = సేవింతును; ఎల్లప్పుడున్ = ఎల్లప్పుడును.
భావము:- బలరాముడు, భీముడు, అర్జునుడు మొదలైన విలుకాండ్ర రూపాలతో అవతరించి కఠినులు, నీచులు, దుర్మార్గులు అయిన రాజులను రణరంగంలో ఆరితేరిన భుజబలక్రీడతో శ్రీకృష్ణుడు హతమార్చాడు. సమస్త భూభారాన్ని తొలగించాడు. సజ్జనులను రక్షించాడు. అట్టి అనంతుణ్ణి నేను అనుక్షణమూ ఆరాధిస్తాను.
తెభా-2-193-వ.
అట్టి లోకోత్కృష్టుండైన కృష్ణుని యవతారమహాత్యం బెఱింగించితి నింక వ్యాసావతారంబు వినుము.
టీక:- అట్టి = అటువంటి; లోక = లోకములకు; ఉత్కృష్టుండు = ఉత్తమమైన వాడు; ఐన = అయిన; కృష్ణుని = కృష్ణుని; అవతార = అవతార; మహాత్యంబున్ = గొప్పతనమును; ఎఱింగించితిన్ = తెలియజేసితిని; ఇంకన్ = ఇంక; వ్యాస = వ్యాసుని; అవతారంబున్ = అవతారమును; వినుము = వినుము.
భావము:- అటువంటి సర్వలోకశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుని అవతారాన్ని ప్రభావాన్ని చెప్పాను. మరిక వ్యాసావతారం చెప్తాను వినుము.
తెభా-2-194-చ.
ప్రతియుగమందు సంకుచితభావులు నల్పతరాయువుల్ సుదు
ర్గతికులునైన మర్త్యుల కగమ్యములున్ స్వకృతంబులున్ సుశా
శ్వతములునైన వేదతరుశాఖలు దా విభజించినట్టి స
న్నుతుఁడు పరాశరప్రియతనూజుఁడు నా హరి పుట్టె నర్మిలిన్.
టీక:- ప్రతి = ప్రతి ఒక్క; యుగము = యుగము; అందున్ = లోను; సంకుచిత = అల్ప; భావులు = బుద్ధులు; అల్పతర = మిక్కిలి తక్కువ; ఆయువుల్ = ఆయువు కలవారు; సుదుర్గతికులున్ = మిక్కిలి అధోగతికి చెందువారు; ఐన = అయినట్టి; మర్త్యులన్ = మానవులు {మర్త్యులు - మృత్యువు తప్పని నరజన్మ ఎత్తినవారు, నరులు}; కున్ = కు; అగమ్యములున్ = బోధపడనివి {అగమ్యములు - దారి చిక్కనివి, అర్థము చేసికొనుటకు లొంగనివి, బోధపడనివి, వేదములు}; స్వకృతంబులున్ = తమంత తామే పుట్టినవి {స్వకృతంబులు - అపౌరుషేయములు - స్వతః కృతి చేయబడినవి, వేదములు}; సుశాశ్వతములున్ = ఎల్లప్పుడును ఉండునవి {సుశాశ్వతములు - ఎల్లప్పుడును మంచి కలవి, వేదములు}; ఐన = అయినట్టి; వేదన్ = వేదములు అను; తరు = వృక్షమునకు; శాఖలున్ = కొమ్మలు; తాన్ = తను; విభజించినన్ = విభాగములుగ ఏర్పరచిన; అట్టి = అటువంటి; సన్నుతుఁడున్ = మంచివారిచే స్తుతింపబడిన వాడు; పరాశరన్ = పరాశరునకు; ప్రియ = ప్రియమైన; తనూజుఁడు = పుత్రుడు; నా = గా; హరి = విష్ణువు; పుట్టెన్ = పుట్టెను; నర్మిలిన్ = ఇష్టపూర్వకముగా.
భావము:- ప్రతి యుగంలో అల్పబుద్ధులు, అల్పాయుష్కులు, దుర్గతి పాలయ్యేవారు అయిన మానవు లుంటారు. వాళ్లకు భగవంతుడు నిర్మించినవి, శాశ్వతములు అయిన వేదాలు బోధపడవు. అలాంటి వాళ్లను అనుగ్రహించాలనే బుద్ధితో శ్రీహరి సజ్జనస్తుతి పాత్రుడై పరాశర మహర్షి ప్రియపుత్రుడైన వ్యాసుడుగా అవతరించి ఆ వేదవృక్షాన్ని శాఖలు శాఖలుగా విభజించాడు.
తెభా-2-195-వ.
మఱియు బుద్ధావతారంబు వినుము.
టీక:- మఱియున్ = ఇంక; బుద్ధ = బుద్ధుని; అవతారంబున్ = అవతారమును; వినుము = వినుము.
భావము:- ఇంక బుద్ధావారమును తెలుపుతాను ఆలకించు.
తెభా-2-196-మ.
అతిలోలాత్ములు సూనృతేతరులు భేదాచార సంశీలురు
ద్ధత పాషాండమ తౌపధర్మ్యులు జగత్సంహారు లైనట్టి యా
దితి సంజాతు లధర్మవాసనల వర్తింపం దదాచార సం
హతి మాయించి హరించె దానవులఁ బద్మాక్షుండు బుద్ధాకృతిన్.
టీక:- అతి = మిక్కిలి; లోలా = చంచల; ఆత్ములున్ = స్వభావులును; సూనృత = సత్యమార్గమునకు; ఇతరులు = తప్పించి వర్తించు వారు; భేద = భేదమైన, దారితప్పిన; ఆచార = ఆచారములను; సంశీలురు = అనుసరించు వారు; ఉద్ధతన్ = చెలరేగిన; పాషాండ = పాషాండము అను {పాషాండ మతములు - బండరాయి లాంటి చలనము లేని మతములు}; మత = మతము లందలి; ఔప = అభాస, చిల్లర {ఔప - అభాస, సత్యమనిపించు అసత్యపువి}; ధర్ములున్ = ధర్మములను అనుసరించు వారును; జగత్ = లోకులను; సంహారులున్ = సంహరించు వారు; ఐనట్టి = అయినట్టి; ఆ = ఆ; దితి = దితి అంశలతో; సంజాతులు = కూడి పుట్టిన వారు; అధర్మ = అధర్మమైన; వాసనలన్ = సంస్కారములతో; వర్తింపన్ = తిరుగు చుండగ; తత్ = ఆ; ఆచార = అలవాట్ల, సంస్కారముల; సంహతిన్ = పరంపరలను; మాయించి = మానిపించి; హరించెన్ = తొలగించెను; దానవులన్ = రాక్షసులను; పద్మాక్షుండున్ = విష్ణువు {పద్మాక్షుడు - పద్మముల వంటి కన్నులు ఉన్నవాడు - హరి}; బుద్ధ = బుద్ధుని; ఆకృతిన్ = స్వరూపముతో.
భావము:- మిక్కిలి చపలస్వభావులు, అసత్యవాదులు, భేదాచారపరాయణులు చెలరేగి శుద్ధ పాషండ మతమనే అభాస ధర్మములు పాటించువారు అయిన దైత్యులు అధర్మంగా ప్రవర్తిస్తుంటే. పుండరీకాక్షుడు బుద్ధుడుగా అవతరించి ఆ రక్కసులను ఆ దురాచారాలతోపాటు నిర్మూలించాడు.
తెభా-2-197-వ.
మఱియుం గల్క్యవతారంబు వినుము.
టీక:- మఱియున్ = ఇంక; కల్కి = కల్కి యొక్క {కల్కి - కలి (క అన చెడు, పాపము కారణభూతుడు) ని చెడుపు వాడు}; అవతారంబున్ = అవతారమును; వినుము = వినుము.
భావము:- మరియు కల్క్యవతారము గురించి వినుము.
తెభా-2-198-మ.
వనజాక్షస్తవశూన్యులై మఱి వషట్స్వాహాస్వధావాక్య శో
భనరాహిత్యులు, సూనృతేతరులునుం, బాషండులున్నైన వి
ప్రనికాయంబును శూద్రభూపులుఁ గలింబాటిల్లినం గల్కియై
జననంబంది యధర్మమున్నడఁచు సంస్థాపించు ధర్మం బిలన్."
టీక:- వనజాక్షన్ = భగవంతుని {వనజాక్షుడు - వన (నీట) జ (పుట్టునది) పద్మము వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; స్తవ = స్తుతించుటలు; శూన్యులు = లేని వారు; ఐ = అయిపోయి; మఱి = మరి ఇంకా; వషట్ = వషట్కార మంత్ర; స్వాహా = స్వాహా మంత్ర; స్వధా = స్వధా మంత్ర; వాక్య = వాక్యముల వలని; శోభన = శుభకరములు; రాహిత్యులున్ = లేని వారును {రాహిత్యులు - రహితములు కలవారు, లేనివారు}; సూనృత = సత్య; ఇతరులునున్ = దూరులును; పాషాండులున్ = పాషాండులును; ఐనన్ = అయినట్టి; విప్ర = బ్రాహ్మణ; నికాయంబునున్ = సమూహములును; శూద్ర = శూద్రులు అయిన; భూపులున్ = ప్రభువులును; కలిన్ = కలికాలమున {కలి - కలికాలపురుషుడు, కలి - కలికాలము, పాపము కలిగంచుటకు కారణభూతము ఐన కాలము}; వాటిల్లినన్ = సంభవించగ; కల్కి = కల్కి {కల్కి - కలికై}; ఐ = అయి; జననంబున్ = పుట్టుక; అంది = పొంది; అధర్మమున్ = అధర్మమును; అడఁచున్ = అణచివేయును; సంస్థాపించున్ = చక్కగ స్థాపించును; ధర్మంబున్ = ధర్మమును; ఇలన్ = భూమి మీద.
భావము:- కలియుగంలో బ్రాహ్మణులు భగవంతుని వినుతించరు. వేదవిహితమైన యజ్ఞయాగాది కర్మలు ఆచరించరు. వాళ్ల నోటినుండి “వషట్”, “స్వాహా”, “స్వధా” అనే మంగళ వచనాలు వినిపించవు. వాళ్ళు సత్యం పాటించరు. నాస్తికులై ప్రవర్తిస్తారు. శూద్రులు రాజు లవుతారు. ఇలాంటి పరిస్థితి సంభవించినప్పుడు భగవంతుడు కల్కిగా అవతరిస్తాడు. అధర్మం తొలగిస్తాడు. భూతలంలో ధర్మం స్థాపిస్తాడు."
తెభా-2-199-వ.
అని మఱియుఁ బితామహుండు నారదున కిట్లనియె "మునీంద్రా! పుండరీకాక్షుం డంగీకరించిన లీలావతార కథావృత్తాంతంబు నేను నీకు నెఱింగించు నింతకు మున్న హరి వరాహాద్యవతారంబు లంగీకరించి తత్ప్రయోజనంబులఁ దీర్చె; మన్వంతరావతారంబు లంగీకరించినవియు నంగీపరింపఁగలవియునై యున్నయవి; వర్తమానంబున ధన్వంతరి పరశురామావతారంబులు దాల్చి యున్నవాడు; భావికాలంబున శ్రీరామాద్యవతారంబుల నంగీకరింపం గలవాఁ; డమ్మహాత్ముండు సృష్ట్యాది కార్యభేదంబులకొఱకు మాయా గుణావతారంబు లందు బహుశక్తి ధారణుండైన భగవంతుఁడు సర్గాదినిఁ దపస్సులును, నేనును, ఋషిగణంబులును, నవప్రజాపతులునునై యవతరించి విశ్వోత్పాదనంబు గావించుచుండు; ధర్మంబును విష్ణుండును యజ్ఞంబులును మనువులును నింద్రాది దేవగణంబులును ధాత్రీపతులును నయి యవతరించి జగంబుల రక్షించుచుండు; నధర్మంబును రుద్రుండును మహోరగంబులును రాక్షసానీకంబులునునై యవతరించి విలయంబు నొందించుచుండు; ని త్తెఱంగునం బరమేశ్వరుండును సర్వాత్మకుండును నైన హరి విశ్వోత్పత్తి స్థితి లయ హేతుభూతుండై విలసిల్లు; ధరణీరేణువుల నయిన గణుతింప నలవి యగుంగాని యమ్మహాత్ముని లీలావతారాద్భుతకర్మంబులు లెక్కవెట్ట నెవ్వరికి నశక్యంబై యుండు; నీకు సంక్షేపరూపంబున నుపన్యసించితి సవిస్తారంబుగా నెఱింగింప నాకుం దరంబు గాదనిన నన్యులం జెప్పనేల? వినుము.
టీక:- అని = అని చెప్పి; మఱియున్ = మరల; పితామహుండు = తాత (బ్రహ్మదేవుడు) {పితామహుడు - తండ్రికి తండ్రి - తాత}; నారదున్ = నారదున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా (నారద మునీశ్వర); పుండరీకాక్షుండున్ = విష్ణువు {పుండరీకాక్షుడు - పుండరీకములు (తామరాకులు) వంటి కన్నులు ఉన్నవాడు}; అంగీకరించిన = ఒప్పుకున్నట్టి; లీలా = లీలలు అయిన; అవతార = అవతారముల యొక్క; కథా = కథల, ప్రవర్తనా విశేషముల; వృత్తాంతంబున్ = వివరములను; నేనున్ = నేను; నీకున్ = నీకు; ఎఱింగించు = తెలియజేయుటకు; ఇంతకున్ = అంతకంటె; మున్న = ముందే, పూర్వమే; హరి = విష్ణువు {హరి - దుఃఖములను హరించు వాడు, భగవంతుడు}; వరాహ = వరాహ; ఆది = మొదలగు; అవతారంబులున్ = అవతారములందు; అంగీకరించి = ధరించి; తత్ = ఆయా; ప్రయోజనంబులఁన్ = ప్రయోజనములను; తీర్చెన్ = సిద్ధింపజేసెను; మన్వంతర = (వివిధ) మన్వంతరములలో; అవతారంబులున్ = అవతారములను; అంగీకరించినవియున్ = ధరించినవి; అంగీకరింపఁన్ = ధరింప; కలవియున్ = వలసినవియును; ఐ = అయి; ఉన్నయవి = ఉన్నాయి; వర్తమానంబునన్ = ప్రస్తుతము; ధన్వంతరి = ధన్వంతరి; పరశురామ = పరశురామ; అవతారంబులున్ = అవతారములను; తాల్చి = ధరించి; ఉన్నవాడు = ఉన్నాడు; భావి = రాబోవు; కాలంబునన్ = కాలములో; శ్రీరామ = శ్రీరాముడు; ఆది = మొదలగు; అవతారంబులన్ = అవతారములను; అంగీకరింపన్ = ధరించ; కలవాడు = కలడు, పోవుచున్నాడు; ఆ = ఆ; మహాత్ముఁడు = గొప్ప ఆత్మ కలవాడు; సృష్టి = సృష్టికి; ఆది = మొదలగు (సృష్టి స్థితి లయములు); కార్య = పనుల, బాధ్యతల; భేదంబులన్ = రకముల; కొఱకున్ = కోసము; మాయా = మాయతో కూడిన, అభాస {మాయా - అభాస, అసత్యమై సత్యము వలె భాసించునవి}; గుణ = గుణములు కల; అవతారంబులున్ = అవతారములు; అందున్ = లో; బహు = అనేకమైన; శక్తి = శక్తులను; ధారణుండున్ = ధరించిన వాడు; ఐన = అయినట్టి; భగవంతుఁడు = హరి; సర్గ = సృష్టికి; ఆదిని = మొదటిలో; తపంబున్ = తపస్సును; నేనును = బ్రహ్మనైన నేను, అహంకారమును; ఋషి = ఋషుల; గణంబులును = సమూహములును; నవ = తొమ్మిది మంది; ప్రజాపతులునున్ = ప్రజాపతులును {నవ ప్రజాపతులు - భృగువు, పులస్థ్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, మరీచి}; ఐ = అగునట్లు; అవతరించి = అవతరించి; విశ్వ = జగత్తును; ఉత్పాదనంబున్ = సృష్టి; కావించుచున్ = చేయుచు; ఉండున్ = ఉండును; ధర్మంబునున్ = ధర్మమును; విష్ణుండునున్ = విష్ణువును; యజ్ఞంబులునున్ = యజ్ఞములును; మనువులునున్ = మనువులును; ఇంద్ర = ఇంద్రుడు; ఆది = మొదలైన; దేవ = దేవతల; గణంబులునున్ = సమూహములును; ధాత్రీ = భూమికి; పతులును = భర్తలును (రాజులును); అయి = అగునట్లు; అవతరించి = అవతరించి; జగంబులన్ = లోకములను; రక్షించుచున్ = రక్షిస్తూ; ఉండున్ = ఉండును; అధర్మంబునున్ = అధర్మమును; రుద్రుండునున్ = రుద్రుడును; మహా = గొప్ప; ఉరగంబులున్ = పాములును; రాక్షస = రాక్షసులును; అనీకంబులునున్ = యుద్ధములును; ఐ = అగునట్లు; అవతరించి = అవతరించి; విలయంబున్ = విశిష్టమైన లయమును; ఒందించున్ = కలుగజేయుచు; ఉండున్ = ఉండును; ఈ = ఈ; తెఱంగునన్ = విధముగ; పరమ = అత్యున్నతమైన; ఈశ్వరుండునున్ = ప్రభువును (భగవంతుడు); సర్వ = సర్వమునకును; ఆత్మకుండునున్ = ఆత్మగా ఉన్నవాడును (భగవంతుడు); ఐన = అయినట్టి; హరి = విష్ణువు; విశ్వ = జగత్తునకు; ఉత్పత్తి = సృష్టి; స్థితి = స్థితి; లయ = లయములకు; హేతు = కారణ; భూతుండున్ = భూతము; ఐ = అయి; విలసిల్లున్ = ప్రకాశించును; ధరణీ = భూమి, ఇసుక; రేణువులన్ = రేణువులను; అయినన్ = అయినా; గణుతింపన్ = లెక్కించుటకు; అలవి = సాధ్యము; అగున్ = అగును; కాని = కాని; ఆ = ఆ; మహాత్మునిన్ = గొప్పవాని; లీల = లీలలైన; అవతార = అవతారముల యొక్క; అద్భుత = ఆశ్చర్యకరమైన; కర్మంబులున్ = పనులను; లెక్కవెట్టన్ = లెక్కించుటకు; ఎవ్వరికిన్ = ఎవరికైనను; అశక్యంబు = అసాధ్యము; ఐ = అయి; ఉండున్ = ఉండును; నీకున్ = నీకు; సంక్షేప = సంగ్రహ; రూపంబునన్ = రూపములో; ఉపన్యసించితిన్ = చెప్పితిని; సవిస్తారంబుగాన్ = పూర్తిగా విస్తరించి; ఎఱింగింపన్ = తెలుపుటకు; నాకున్ = నా; తరంబున్ = తరము; కాదు = కాదు; అనినన్ = అంటే; అన్యులన్ = ఇతరులను; చెప్పన్ = చెప్పుట; ఏలన్ = ఎందులకు; వినుము = వినుము.
భావము:- ఇలా చెప్పి బ్రహ్మదేవుడు మళ్లీ నారదునితో ఇలా చెప్పసాగాడు. ఓ నారద మునిశ్రేష్ఠా! శ్రీ మన్నారాయణుడు స్వీకరించిన లీలావతారకథా విశేషాలు నే నిప్పుడు నీకు చెప్పాను. ఇంతకు ముందే శ్రీహరి ఆదివరాహం మొదలైన అవతారాలు స్వీకరించి చేయవలసిన పనులన్నీ చేసాడు. మన్వంతరములు సంబంధమైన అవతారాలు ఇంతవరకూ జరిగినవీ ఉన్నాయి. ఇక జరగబోయేవీ ఉన్నాయి. వర్తమాన కాలంలో ఆయన ధన్వంతరి, పరశురామావతారాలు ధరించి ఉన్నాడు. భవిష్యత్తులో శ్రీరాముడు మొదలైన అవతారాలు తాల్చ గలడు. ఆ మహాత్ముడు సృష్టి మొదలైన వివిధ కార్యాలు నెరవేర్చడానికి మాయాగుణంతో నిండిన అవతారాలు స్వీకరిస్తాడు. అనేకశక్తులతో కూడిన ఆ భగవంతుడు సృష్ట్యాదిలో తపస్సుగా, నేనుగా, ఋషులుగా, తొమ్మిదిమంది ప్రజాపతులుగా అవతరించి లోకాన్ని సృష్టిస్తూ ఉంటాడు. ధర్మ, విష్ణవు, యజ్ఞాలు, మనువుల, ఇంద్రుడు మొదలైన దేవతల రూపాలతో, రాజుల రూపాలతో అవతరించి లోకాలను రక్షిస్తూ ఉంటాడు. అధర్మము, రుద్రుడు, భీకరసర్పాలు, రాకాసి మూకలుగా అవతరించి విశ్వాన్ని సంహరిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు, సర్వస్వరూపుడు అయిన శ్రీహరి ఈ విధంగా ఈ విశాల విశ్వం సృష్టికి, స్థితికి, లయానికి హేతువై ప్రకాశిస్తాడు. భూమిలోని ధూళికణాల నయినా లెక్క పెట్టవచ్చుగాని ఆ భగవంతుని లీలావతారాలలోని అద్భుత కృత్యాలను లెక్కపెట్టడం ఎవ్వరికీ అలవికాదు. నీకు సంగ్రహంగా చెప్పాను. సువిస్తరంగా చెప్పడం నాకే సాధ్యం కాదు. ఇక ఇతరుల మాట చెప్పడ మెందుకు ఇంకా విను.
తెభా-2-200-చ.
అమరఁ ద్రివిక్రమస్ఫురణ నందిన యమ్మహితాత్ముపాద వే
గమున హతంబులైన త్రిజగంబుల కావల వెల్గు సత్యలో
కము చలియించినం గరుణఁ గైకొని కాచి ధరించు పాదప
ద్మము తుది నున్న యప్రతిహతం బగు శక్తి గణింప శక్యమే?
టీక:- అమరన్ = చక్కగా ఉండే; త్రివిక్రమ = త్రివిక్రమమును {త్రివిక్రమము - మూడు లోకములు విశిష్టముగ ఆక్రమించినది}; స్ఫురణన్ = రూపమును; అందినన్ = పొందినట్టి; ఆ = ఆ; మహిత = గొప్ప; ఆత్మున్ = వాని; పాద = పాదముల; వేగమునన్ = వేగమునకు; హతంబులున్ = దెబ్బతిన్నవి; ఐన = అయిన; త్రి = మూడు (3); జగంబులన్ = లోకముల; కున్ = కును; ఆవల = అవతల; వెల్గున్ = వెలుగుచుండు; సత్యలోకమున్ = సత్యలోకము; చలియించినన్ = చలించిపోగా; కరుణఁన్ = దయను; కైకొనిన్ = స్వీకరించి; కాచి = రక్షించి; ధరించున్ = (భర్తృత్వమును) స్వీకరించు వాని; పాద = పాదములు అను; పద్మము = పద్మముల; తుదిన్ = చివరన; ఉన్న = ఉన్నట్టి; అప్రతిహతంబున్ = ఎదురులేనిది; అగు = అయిన; శక్తిన్ = శక్తిని; గణింప = ఎంచుటకు; శక్యమే = శక్యమా ఏమిటి.
భావము:- ఆ మహాత్ముడు త్రివిక్రమావతారం ధరించాడు. ఆయన పాదాల విసురుకు ముల్లోకాలూ తల్లడిల్లాయి. అంతేకాదు. ఆ ముజ్జగాలకు ఆవల వెలుగొందే సత్యలోకం గూడా వణకిపోయింది. అప్పుడు దయతలచి కాపాడి, రక్షించే ఆ పాదపద్మాల కుండే అప్రతిహతమైన శక్తి ఇంతింతని వర్ణించడం ఎవరికీ శక్యం కాదు.