పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/ప్రపంచాది ప్రశ్నంబు


తెభా-2-217-సీ.
"విను శుకయోగికి నుజేశుఁ డిట్లను-
మునినాథ! దేవదర్శము గలుగ
నారదమునికిఁ బంకేరుహభవుఁ డెఱిం-
గించిన తెఱఁగు సత్కృప దలిర్ప
ణుతింప సత్వాదిగుశూన్యుఁ డగు హరి-
మలాక్షు లోకమంళము లైన
థలు నా కెఱిఁగింపు; కైకొని నిస్సంగ-
మైన నా హృదయాబ్జ మందుఁ గృష్ణు

తెభా-2-217.1-తే.
వ్యచరితుని నాద్యంతభావశూన్యుఁ
జిన్మయాకారు ననఘు లక్ష్మీసమేతు
నిలిపి, యస్థిరవిభవంబు నిఖిల హేయ
భాజనంబైన యీ కళేరము విడుతు.

టీక:- విను = వినుము; శుక = శుక; యోగి = యోగి; కిన్ = కి; మనుజ = మానవులకు; ఈశుఁడు = ఫ్రభువు; ఇట్లు = ఆ విధముగ; అను = పలికెను; ముని = మునులలో; నాథ = ప్రభువ; దేవ = దేవుని; దర్శనము = దర్శనము; కలుగన్ = కలిగిన తరువాత; నారద = నారద; ముని = ముని; కిన్ = కి; పంకేరుహభవుఁడున్ = బ్రహ్మదేవుడు {పంకేరుహభవుడు - పంక (బురద) లో ఇరుహ (పుట్టినది, పద్మము) నందు భవ (పుట్టిన) వాడు}; ఎఱింగించినన్ = తెలిపిన; తెఱఁగున్ = విధమును; సత్కృపన్ = మంచిదయ; తలిర్ప = వికసించునట్లు; గణుతింపన్ = ఎంచబడునట్లు; సత్వాదిన్ = సత్వాదులు (త్రిగుణాలు) {సత్వాది - త్రిగుణములు, సత్వ రజో తమో గుణములు}; గుణ = గుణములు; శూన్యుఁడు = లేనివాడు; అగు = అయిన; హరిన్ = హరి {హరి - గుణములను హరించు వాడు, భగవంతుడు}; కమలాక్షున్ = కమలాక్షుని {కమలాక్షుడు - కమలముల వంటి కన్నులు ఉన్నవాడు, భగవంతుడు}; లోక = లోకములకు; మంగళములు = శుభకరములు; ఐన = అయినట్టి; కథలున్ = కథలను; నాకున్ = నాకు; ఎఱిగింపు = తెలుపుము; కైకొని = గ్రహించి; నిస్సంగము = నిస్సంగమము {నిస్సంగమము - సంగము (బంధనాలు) (తగులములు) (వ్యసనములు) లేనిది}; ఐన = అయిన; నా = నా యొక్క; హృదయ = హృదయము అను; అబ్జము = పద్మము {అబ్జము - అప్ (నీరు) లో జ (పుట్టినది), పద్మము}; అందున్ = లోపల; కృష్ణున్ = కృష్ణుని {కృష్ణుడు - నల్లని వాడు};
భవ్య = శుభమైన; చరితునిన్ = ప్రవర్తన కలవానిని; ఆద్యంత = ఆది మరియు అంతముల {ఆద్యంతభావశూన్యుడు - ఆది అంతములను భావములు లేనివాడు, భగవంతుడు}; భావ = భావములు; శూన్యుఁడు = లేవివాడు; చిన్మయ = చిన్మయానందము; ఆకారున్ = తన ఆకారమైన వాడు; అనఘున్ = పాపములు లేనివానిని; లక్ష్మీ = లక్ష్మీదేవితో, సర్వసౌభాగ్యములతో; సమేతున్ = కూడినవాని; నిలిపి = నిలుపుకొని; అస్థిరన్ = అస్థిరమైన; విభవంబున్ = వైభవములు; నిఖిల = సమస్తమైన; హేయ = ఏవగింపు; భాజనంబున్ = కలుగ జేయునవి; ఐన = అయినట్టి; ఈ = ఈ; కళేబరమున్ = శరీరమును; విడుతుఁన్ = విడిచెదను.
భావము:- తరువాత పరీక్షిత్తు శుకమహర్షిని ఇలా అడిగాడు – ఓ మునీశ్వర! బ్రహ్మదేవుడు నారదమునికి భగవత్సాక్షాత్కారం కలగడానికి చెప్పిన ఉపాయం దయతో నాకు చెప్పండి సత్త్వరజస్తమోగుణాలకు అతీతుడు, పద్మనేత్రుడు అయిన శ్రీహరి కథలు లోకానికి మంగళం చేకూరుస్తాయి. అవి నాకు తెలియపరచండి. మీరు చెప్పింది విని సంగరహితమయిన నా హృదయకమలంలో శుభచరిత్రుడు, తుది మొదళ్లు లేనివాడు, చిన్మయస్వరూపుడు, పాపరహితుడు, లక్ష్మీ సహితుడు అయిన కృష్ణుణ్ణి నిలుపుకొంటాను. చంచలము, హేయాలన్నిటికీ నెలవు అయినట్టి ఈ శరీరాన్ని విడిచి పెడతాను.

తెభా-2-218-వ.
అదియునుంగాక, యెవ్వండేని శ్రద్ధాభక్తియుక్తుండై కృష్ణగుణకీర్తనంబులు వినుచుం బలుకుచు నుండు నట్టివాని హృదయపద్మంబు నందుఁ గర్ణరంధ్ర మార్గంబులం బ్రవేశించి కృష్ణుండు విశ్రమించి సలిలగతంబైన కలుషంబును శరత్కాలంబు నివారించు చందంబున నాత్మగతంబైన మాలిన్యంబు నపకర్షించుఁ గావున.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండ; ఎవ్వండు = ఎవడు; ఏనిన్ = అయినను; శ్రద్ధ = శ్రద్ధ; భక్తి = భక్తులతో; ఉక్తుండు = కూడినవాడు; ఐ = అయి; కృష్ణ = కృష్ణుని; గుణ = గుణములను; కీర్తనంబులున్ = కీర్తనలు, స్తుతులు; వినుచున్ = వింటూ; పలుకుచున్ = స్తోత్రము చేస్తూ; ఉండునట్టి = ఉండే; వాని = వాని; హృదయ = హృదయము అను; పద్మంబున్ = పద్మము; అందున్ = లో; కర్ణ = చెవుల; రంధ్ర = రంధ్రముల; మార్గంబులన్ = దారిలో; ప్రవేశించి = ప్రవేశించి; కృష్ణుండున్ = కృష్ణుడు; విశ్రమించి = విశ్రమించి; సలిల = నీటిలో; గతంబున్ = ఉన్నట్టిది; ఐన = అయిన; కలుషంబును = కల్మషమును; శరత్ = శరత్; కాలంబున్ = రుతువు; నివారించున్ = పోగొట్టు; చందంబునన్ = విధముగ; ఆత్మ = మనసులో; గతంబున్ = ఉన్నట్టివి; ఐనన్ = అయిన; మాలిన్యంబున్ = మలినములను; అపకర్షించున్ = తొలగించును; కావునన్ = కనుక;
భావము:- అంతేకాక, ఎవడు కృష్ణుని గుణగణాలను ఇతరులు కీర్తిస్తుంటే శ్రద్ధా భక్తులు కలిగి వింటాడో, తాను స్వయంగా కీర్తిస్తాడో, అలాంటి వాని హృదయకమలం లోకి శ్రవణ కుహరాల ద్వారా కృష్ణుడు ప్రవేశిస్తాడు. అక్కడ విశ్రమిస్తాడు. నీటిలోని మాలిన్యాన్ని శరదృతువు తొలగించినట్లు మనస్సులోని మాలిన్యాన్ని తొలగిస్తాడు, కనుక.

తెభా-2-219-మ.
రితోదగ్రనిదాఘతప్తు డగు నప్పాంథుం డరణ్యాది సం
ణక్లేశసముద్భవం బగు పిపాసం జెంది యాత్మీయ మం
దిముం జేరి గతశ్రముం డగుచు నెందేనిం జనంబోని భం
గి మాధీశుపదారవిందయుగ సంగీభూతుఁడై మానునే?

టీక:- భరిత = చెలరేగిన; ఉదగ్ర = భయంకరమైన; నిదాఘ = ఎండ వేడిమిచేత; తప్తుడు = తపించిపొతున్న వాడు; అగు = అయిన; ఆ = ఆ; పాంథుండు = బాటసారి; అరణ్య = అరణ్యములు; ఆది = మొదలైన వానిలో; సంచరణ = తిరుగుతున్న; క్లేశ = శ్రమ; సముద్భవంబున్ = కలిగినది; అగు = అయిన; పిపాసన్ = దాహమును; చెంది = పొంది; ఆత్మీయ = స్వంత; మందిరమున్ = ఇంటిని; చేరి = చేరి; గత = పోయిన; శ్రముండు = శ్రమ కలవాడు; అగుచున్ = అవుతు; ఎందు = ఎక్కడకు; ఏని = అయినాసరే; చనంబోని = వెళ్ళని; భంగిన్ = విధముగ; రమాధీశు = లక్ష్మీపతి {రమాధీశుడు - రమ (లక్ష్మీదేవి) అధీశుడు (భర్త), విష్ణువు}; పద = పాదములు అను; అరవింద = పద్మముల; యుగ = జంట; సంగీ = సంబంధము; భూతుఁడు = కలిగినవాడు; ఐ = అయి; మానునే = వదలుతాడా ఏమిటి.
భావము:- అడవులందు సంచరిస్తు, వేసవి మండుటెండల తాపానికి పరితాపం చెందిన బాటసారి బడలి దాహంతో చివరికి తన యిల్లు చేరుకొంటాడు. అక్కడ హాయిగా అలసట తీర్చుకొంటాడు. అక్కడినుండి మళ్ళీ ఎక్కడికీ కదలడు. అలాగే రమాకాంతుని చరణకమల ద్వంద్వంతో సంబంధం కలిగి ఆ ఆనందం చవి చూచినవాడు మళ్లీ దాన్ని వదలడు.

తెభా-2-220-వ.
అదియునుంగాక సకలభూతసంసర్గశూన్యంబైన యాత్మకు భూతసంసర్గం బే ప్రకారంబునం గలిగె; నది నిర్నిమిత్తత్వంబునం జేసియో కర్మంబునం జేసియో యాక్రమంబు నా కెఱింగింపుము.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండ; సకల = సమస్త (మహా); భూత = భూతములతోను; సంసర్గ = సంబంధము; శూన్యంబున్ = లేనిది; ఐన = అయిన; ఆత్మ = ఆత్మ; కున్ = కు; భూత = భూతములతో; సంసర్గంబున్ = సంబంధము; ఏ = ఏ; ప్రకారంబునన్ = విధముగ; కలిగెన్ = కలిగెను; అది = అది; నిర్నిమిత్త = అకారణ; తత్వంబునన్ = లక్షణము; చేసియో = వలననో; కర్మంబునన్ = కర్మల కారణము; చేసియో = వలననో; ఆ = ఆ; క్రమంబున్ = విధమును; నాకున్ = నాకు; ఎఱింగింపుము = తెలుపుము.
భావము:- అంతేకాదు, సమస్త భూతాలతోటి కలయిక లేని ఆత్మకు అసలు ఆ భూతాలతో సాంగత్యం ఎలా కలిగింది. అది అకారణంగా కలిగిందా? లేక, కర్మవల్ల కలిగిందా? ఆ వైనం నాకు వివరించు.

తెభా-2-221-సీ.
వ్వని నాభియం దెల్ల లోకాంగ సం-
స్థానకారణపంకజంబు వొడమె
నం దుదయించి సర్వావయవస్ఫూర్తిఁ-
నరారునట్టి పితామహుండు
డఁగి యెవ్వని యనుగ్రహమున నిఖిల భూ-
ముల సృజించె నుత్కంఠతోడ
ట్టి విధాత యే నువున సర్వేశు-
రూపంబు గనుఁగొనె రుచిర భంగి

తెభా-2-221.1-తే.
నా పరంజ్యోతి యైన పద్మాక్షునకును
లినజునకుఁ బ్రతీకవిన్యాసభావ
తులవలనను భేదంబు లదె? చెపుమ;
తిదయాసాంద్ర! యోగికులాబ్ధిచంద్ర!

టీక:- ఎవ్వని = ఎవని; నాభిన్ = బొడ్డు; అందున్ = అందు; ఎల్లన్ = సమస్త; లోకన్ = లోకముల; అంగన్ = భాగముల; సంస్థాన = స్థితికి; కారణన = కారణము అయిన; పంకజంబున్ = పద్మము {పంకజము - పంక (బురద) లో జ (పుట్టినది), పద్మము}; ఒడమెన్ = పుట్టినదో; అందున్ = దానిలో; ఉదయించి = పుట్టి; సర్వ = అన్ని; అవయవ = అవయవములు; స్ఫూర్తిన్ = వ్యక్తమగుచు; తనరారునట్టి = ఒప్పి ఉన్నట్టి; పితామహుడు = తాత, బ్రహ్మ; కడఁగి = సంకల్పించి; ఎవ్వని = ఎవని; అనుగ్రహంబునన్ = దయ వలన; నిఖిల = సమస్తమైన; భూతములన్ = జీవులను; సృజించెన్ = సృష్టంచెనో; ఉత్కంఠన్ = ఉత్సాహము; తోడన్ = తో; అట్టి = అటువంటి; విధాతన్ = బ్రహ్మ; ఏ = ఏ; అనువునన్ = సులువున; సర్వేశున్ = విష్ణుని {సర్వేశుడు - సర్వమునకు అధిపతి, భగవంతుడు}; రూపంబున్ = ఆకారమును; కనుఁగొనెన్ = చూడగలిగెనో; రుచిర = ప్రకాశము; భంగి = వంటి; ఆ = ఆ;
పరంజ్యోతి = ఉత్కృష్టజ్యోతిస్వరూపము; ఐన = అయిన; పద్మాక్షున్ = పద్మాక్షున {పద్మాక్షుడు - పద్మా (పద్మమముల) వంటి అక్షుడు) కన్నులున్న వాడు, విష్ణువు}; కున్ = కు; నలినజున్ = పద్మసంభవున {నలినజుడు - నలిన (పద్మము) నందు జుడు (పుట్టిన వాడు), బ్రహ్మ}; కున్ = కు; ప్రతీక = ఆకారమును; విన్యాస = ప్రవర్తనలు; భావ = భావములు; గతులన్ = విధానములు; వలననున్ = విషయములో; భేదంబున్ = తేడా; కలదే = ఉన్నదా; చెపుమ = తెలుపుము; అతి = మిక్కిలి; దయ = కృప; సాంద్ర = దట్టముగ కలవాడా; యోగి = యోగుల; కులన్ = సమూహము అను; అబ్ధి = సముద్రమునకు; చంద్ర = చంద్రుని వంటి వాడా.
భావము:- పరంజ్యోతి స్వరూపుడైన పద్మాక్షుడి నాభిలో సమస్తలోకాల ఉనికికీ హేతువైన పద్మం పుట్టింది, ఆ పద్మంలో, ప్రభవించి సర్వాంగ సుందరంగా ప్రకాశించే బ్రహ్మ ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఔత్సుక్యంతో సమస్త ప్రాణులనూ సృష్టించాడు. మరి ఆ బ్రహ్మ సర్వేశ్వరుని స్వరూపాన్ని ఏ విధంగా సాక్షాత్కరింప జేసుకొన్నాడు? అలాంటి పద్మాక్షుడికీ, బ్రహ్మదేవునికి అవయవ నిన్యాసంలోను, భావగతిలోను భేదమున్నదా? ఓ పరమకరుణాసాంద్ర! యోగికుల జలధిచంద్ర! నాకు తెలియజెప్పవయ్యా.

తెభా-2-222-వ.
మఱియును భూతేశ్వరుం డయిన సర్వేశ్వరుం డుత్పత్తిస్థితి లయకారణంబైన తన మాయను విడిచి మాయానియామకుండై యేయే ప్రదేశంబుల శయనంబు సేసె; నదియునుంగాక పురుషావయవంబులచేఁ బూర్వకాలంబున లోకపాల సమేతంబులైన లోకంబు లెత్తఱంగునం గల్పితంబు లయ్యె; నదియునుంగాక మహా కల్పంబులును, నవాంతర కల్పంబులును, భూతభవిష్యద్వర్తమాన కాలంబులును, దేహాభిమానులై జనియించిన దేవ పితృ మనుష్యాదులకుం గలుగు నాయుః ప్రమాణంబులును, బృహత్సూక్ష్మ కాలానువర్తనంబులును, యే యే కర్మంబులంజేసి జీవు లేయే లోకంబుల నొందుదురు? మఱియు నేయే కర్మంబులం జేసి దేవాది శరీరంబులం బ్రాపింతు రట్టి కర్మమార్గ ప్రకారంబును సత్త్వాది గుణంబుల పరిణామంబులగు దేవాది రూపంబులం గోరు జీవులకు నేయే కర్మసముదాయం బెట్టు సేయందగు నెవ్వనికి నర్పింపం దగు? నవి యెవ్వనిచేత గ్రహింపంబడు? భూ పాతాళ కకుబ్వ్యోమ గ్రహ నక్షత్ర పర్వతంబులును సరిత్సముద్రంబులును ద్వీపంబులును నే ప్రకారంబున సంభవించె? నా యా స్థానంబులగల వారి సంభవంబు లేలాటివి వియత్బాహ్యాభ్యంతరంబులం గలుగు బ్రహ్మాండప్రమాణం బెంత? మహాత్ముల చరిత్రంబు లెట్టివి వర్ణాశ్రమ వినిశ్చయంబులును, ననుగతంబులై యాశ్చర్యావహంబు లగు హరియవతార చరిత్రంబులును, యుగంబులును, యుగ ప్రమాణంబులును, యుగ ధర్మంబులునుఁ, బ్రతియుగంబునందును మనుష్యుల కేయే ధర్మంబు లాచరణీయంబు లట్టి సాధారణధర్మంబులును, విశేషధర్మంబులును, జాతివిశేషధర్మంబులును రాజర్షిధర్మంబులును, నాపత్కాల జీవన సాధన భూతంబు లగు ధర్మంబులును, మహదాది తత్త్వంబుల సంఖ్యయును, సంఖ్యాలక్షణంబును, నా తత్త్వంబులకు హేతుభూతలక్షణంబులును, భగవత్సమారాధన విధంబును, అష్టాంగయోగ క్రమంబును, యోగీశ్వరుల యణిమాద్యైశ్వర్య ప్రకారంబును, వారల యర్చిరాదిగతులును, లింగశరీరభంగంబులును, ఋగ్యజుస్సామాథర్వ వేదంబులును, నుపవేదంబులైన యాయుర్వేదాదులును, ధర్మశాస్త్రంబులును, నితిహాస పురాణంబుల సంభవంబును, సర్వ భూతంబుల యవాంతరప్రళయంబును, మహాప్రళయంబును, నిష్ఠాపూర్తంబులును, యాగాది వైదిక కర్మ జాలంబును, వాపీకూప తటాక దేవాలయాది నిర్మాణంబులును, నన్నదానం బారామ ప్రతిష్ట మొదలగు స్మార్తకర్మంబులును, కామ్యంబులైన యగ్ని హోత్రంబుల యనుష్ఠాన ప్రకారంబును, జీవసృష్టియు, ధర్మార్థ కామంబు లనియెడు త్రివర్గంబుల యాచరణ ప్రకారంబును, మలినోపాధిక పాషండ సంభవంబును, జీవాత్మ బంధమోక్ష ప్రకారంబును, స్వరూపావస్థాన విధంబును, సర్వస్వతంత్రుండైన యీశ్వరుం డాత్మమాయం జేసి సర్వకర్మసాక్షి యయ్యు, నమ్మాయ నెడఁ బాసి యుదాసీనగతిని విభుండై క్రీడించు తెఱంగును, గ్రమంబునఁ బ్రపన్నుండ నైన నాకు నెఱింగింపుము; బ్రాహ్మణశాపంబునం జేసి శోకవ్యాకుల చిత్తుండవై యనశన వ్రతుండవైన నీవు వినుట యెట్లని సందేహింప వలదు; త్వదీయ ముఖారవింద వినిస్స్రుత నారాయణ కథామృత పాన కుతూహలి నైన నాకు నింద్రియంబులు వశంబులై యుండు; నదిగావున నే నడిగిన ప్రశ్నంబులకు నుత్తరంబులు సవిస్తరంబులుగా నానతిచ్చి కృతార్థునిం జేయఁ బరమేష్టితుల్యుండవగు నీవ పూర్వసంప్రదాయానురోధంబున నర్హుండ వగుదు వని విష్ణురాతుండయిన పరీక్షిన్నరేంద్రుండు బ్రహ్మరాతుండైన శుకయోగి నడిగిన నతండు బ్రహ్మనారద సంవాదంబును నేక సంప్రదాయానుగతంబును గతానుగతిక ప్రకారంబునునై తొల్లి సర్వేశ్వరుండు బ్రహ్మకల్పంబున బ్రహ్మ కుపదేశించిన భాగవతపురాణంబు వేదతుల్యంబు నీ కెఱింగింతు విను"మని చెప్పె” నని సూతుండు శౌనకాది మహామునులకుం జెప్పి; "నట్లు శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.
టీక:- మఱియును = ఇంకను; భూతేశ్వరుండు = జీవులకధిపతి {భూతేశ్వరుడు - భూతములు (మహాభూతములు, జీవులు) కి ఈశ్వరుడు (ప్రభువు)}; అయిన = అయినట్టి; సర్వేశ్వరుండు = సర్వేశ్వరుడు {సర్వేశ్వరుడు - సర్వమునకు ఈశ్వరుడు (ప్రభువు)}; ఉత్పత్తి = సృష్టి; స్థితి = స్థితి; లయన్ = లయములకు; కారణంబున్ = కారణము; ఐన = అయిన; తన = తన యొక్క; మాయను = మహిమను; విడిచిన్ = వదలివేసి; మాయా = మహిమచేత; నియామకుండున్ = నియమింపబడు వాడుగ; ఐ = అయి; ఏఏ = ఏఏ; ప్రదేశంబులన్ = ప్రదేశములలో; శయనంబున్ = వసించుట; చేసెన్ = చేసెను; అదియునున్ = అంతే; కాక = కాకుండ; పురుష = విరాట్పురుషుని; అవయవంబులన్ = అవయవములు; చేన్ = వలన; పూర్వము = సృష్టాది; కాలంబునన్ = సమయములో; లోక = లోకములను; పాల = పాలించు వాని; సమేతంబులు = కూడినవి; ఐనన్ = అయిన; లోకంబులున్ = లోకములు; ఏ = ఏ; తెఱంగునన్ = విధముగ; కల్పితంబులున్ = కల్పింప బడినవి; అయ్యెన్ = ఆయెను; అదియునున్ = అంతే; కాక = కాదు; మహాకల్పంబులునున్ = మహాకల్పాలు {1. మహాకల్పము - బ్రహ్మ ఉదయము నుండి అస్తమయము వరకు గల కాలపరిమాణము, ఒక సృష్టి మొత్తము (చక్రము) యొక్క కాలపరిమాణ పరిణామములు. 2. అవాంతర మహాకల్పము - మహాప్రళయము, బ్రహ్మ అస్తమయము నుండి ఉదయము వరకు గల కాలపరిమాణము, రెండు మహాకల్పముల నడిమి కాలము. 3. కల్పములు, ప్రళయములు - 14 మనువుల కాలములు (మన్వంతరములు) జరిగిన బ్రహ్మకు ఒక పగలు, అదే కల్పము (సృష్టి) అంతే కాలము బ్రహ్మకు రాత్రి, అదే అవాంతర ప్రళయము. రెండును కలిపిన ఒక బ్రహ్మదినము. అటువంటి 360 బ్రహ్మ దినముల కాలము బ్రహ్మోదయము నుండి బ్రహ్మాస్తమయము (మహాకల్పము) వరకుపట్టును.}; అవాంతర = లోపలిది, నడిమిది; కల్పంబులునున్ = కల్పములును; భూత = భూతాలలో కలసినది; భవిష్య = పుట్టబోవునది; వర్తమాన = జీవిస్తున్నది, వర్తిస్తున్నది; కాలంబులునున్ = (అయిన) కాలములును; దేహ = శరీరములు అందు; అభిమానులు = ఆధారపడ్డ వారు; ఐ = అయి; జనియించిన = పుట్టిన; దేవ = దేవతలు; పితృ = పితృ దేవతలు; మనుష్య = మానవులు {మనుష్యులు - మనసుతో బ్రతుకు జీవులు}; ఆదులకున్ = మొదలగు వారికి; కలుగున్ = ఉండే; ఆయుస్ = జీవిత కాలము; ప్రమాణంబులునున్ = ప్రమాణములును; బృహత్ = పెద్ద {బృహత్కాలము - దినములోని భాగములు సూక్ష్మకాలములు, వాటికి పెద్దవి బృహత్కాలములు}; సూక్ష్మ = చిన్ని {సూక్ష్మకాలము - దినములోని భాగములు సూక్ష్మకాలములు, వాటికి పెద్దవి బృహత్కాలములు}; కాల = కాలమానములను; అనువర్తనములు = అనుసరించు నవియును; ఏ = ఏ; ఏ = ఏ; కర్మంబులన్ = కర్మములను {కర్మములు - కార్యము (ఫలితము, పని) వలని కారణము (కారణము, పని)}; చేసి = చేసి; జీవులు = జీవులు {జీవులు - జీవనము (జ - పుట్టుక, న -మరణములకు మధ్య కాలము) కలవారు}; ఏ = ఏ; ఏ = ఏ; లోకంబులన్ = లోకములను; పొందుదురు = పొందుతారు; మఱియున్ = ఇంకను; ఏ = ఏ; ఏ = ఏ; కర్మంబులన్ = కర్మమములను; చేసి = చేయుట వలన; దేవ = దేవతలు; ఆది = మొదలగు; శరీరంబులన్ = శరీరములను; ప్రాపింతురు = పొందుతారు; అట్టి = అటువంటి; కర్మమార్గ = కర్మమార్గము; ప్రకారంబునున్ = విధానములును; సత్వాది = త్రిగుణముల {సత్వాది - త్రిగుణములు, సత్వ రజో తమో గుణములు}; గుణంబులన్ = గుణముల యొక్క; పరిణామంబులున్ = పరిణామాలు; అగు = అయిన; దేవ = దేవతలు {దేవాదులు - కర్మమములు గుణములును అనుసరించి కలుగు ఉన్నత అధమ ధారణములు ఐన శరీరములు కలవారు}; ఆది = మొదలగు; రూపంబులన్ = స్వరూపములను; కోరు = కోరుకొను; జీవులున్ = జీవుల; కున్ = కు; ఏ = ఏ; ఏ = ఏ; కర్మ = కర్మముల; సముదాయంబున్ = సమూహములను; ఎట్టున్ = ఏ విధముగ; సేయన్ = చేయ; తగు = తగున్, వచ్చును; ఎవ్వనిన్ = ఎవని; కిన్ = కి; అర్పింపన్ = అర్పించ; తగున్ = వచ్చును; అవి = అవి; ఎవ్వనిన్ = ఎవని; చేతన్ = చేత; గ్రహింపంబడున్ = స్వీకరింపబడును; భూ = భూమి; పాతాళ = పాతాళము; కకుబ్ = దిక్కులు; వ్యోమ = ఆకాశము; గ్రహ = గ్రహములు; నక్షత్ర = నక్షత్రములు; పర్వతంబులునున్ = పర్వతములు; సరిత్ = నదులును; సముద్రంబులునున్ = సముద్రములు; ద్వీపంబులునున్ = ద్వీపములు; ఏ = ఏ; ప్రకారంబునన్ = విధముగ; సంభవించెన్ = పుట్టినవి; ఆ = ఆ; ఆ = ఆ; స్థానంబులన్ = స్థానములలో; కల = ఉండే; వారి = వారి; సంభవంబులు = పుట్టుకలు; ఏలాటివి = ఎలాంటివి; వియత్ = ఆకాశము యొక్క; బాహ్య = వెలుపలలు; అభ్యంతరంబులన్ = లోపలలు; కలుగు = సంభవించు; బ్రహ్మాండ = బ్రహ్మాండముల; ప్రమాణంబున్ = ప్రమాణమును; ఎంత = ఎంత; మహాత్ముల = మహాత్ముల యొక్క; చరిత్రంబులున్ = చరితములు; ఎట్టివి = ఎలాంటివి; వర్ణ = బ్రాహ్మణాదుల {బ్రాహ్మణాదులు - చతుర్వర్ణములు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములు}; ఆశ్రమ = బ్రహ్మచర్యాదుల {బ్రహ్మచర్యాది - చతురాశ్రమములు, బ్రహ్మచర్య గృహస్త వానప్రస్త సన్యాస ఆశ్రమములు}; వినిశ్చయంబులునున్ = నిర్ణయింపబడ్డ విధానములు; అనుగతంబులు = పొందబడినవి, అవధరములు; ఐ = అయి; ఆశ్చర్య = ఆశ్చర్యమును; ఆవహంబున్ = కలిగించునవి; అగు = అయిన; హరి = విష్ణుని; అవతార = అవతారముల యొక్క; చరిత్రంబులునున్ = చరిత్రలును; యుగంబులునున్ = యుగములును; యుగ = యుగముల; ప్రమాణంబులునున్ = పరిమాణమును; యుగ = యుగముల; ధర్మంబులునున్ = ధర్మములు; ప్రతి = ప్రతీ ఒక్క; యుగంబున్ = యుగము; అదునున్ = లోను; మనుష్యులున్ = మానవులు; కున్ = కి; ఏ = ఏ; ఏ = ఏ; ధర్మంబులున్ = ధర్మములును; ఆచరణీయంబులున్ = ఆచరింపదగ్గవి; అట్టి = లాంటి; సాధారణ = సాధారణమైన; ధర్మంబులున్ = ధర్మములును; విశేష = విశేషమైన; ధర్మంబులున్ = ధర్మములును; జాతి = జాతులకు ప్రత్యేకమైన; విశేష = విశేషమైన; ధర్మంబులునున్ = ధర్మములును; రాజర్షి = రాజర్షులకు ప్రత్యేకమైన; ధర్మంబులునున్ = ధర్మములును; ఆపత్కాల = ఆపదలప్పటి, అంత్యకాలపు; జీవన = జీవితము; సాధన = సాగించుటకు, సాఫల్యమునకు; భూతంబులు = అవసరములు; అగు = అయిన; ధర్మంబులునున్ = ధర్మములును; మహదాది = మహత్తు మొదలగు {మహదాదితత్త్వములు - పంచవిశంతి తత్త్వంబులు}; తత్త్వంబుల = తత్వముల యొక్క; సంఖ్యయును = గణనయును; సంఖ్యా = సంఖ్యా శాస్త్రములందలి; లక్షణంబులునున్ = లక్షణములును; ఆ = ఆ; తత్త్వంబులన్ = తత్వముల; కున్ = కు; హేతుభూత = కారణభూతములైన; లక్షణంబులునున్ = లక్షణములును; భగవత్ = భగవంతునికి చేయు; సమారాధన = సమారాధనమునకు; విధంబునున్ = విధానములును; అష్టాంగయోగ = అష్టాంగయోగము {అష్టాంగయోగ మార్గములు - యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అని ఎనిమిది (8)}; క్రమంబునున్ = పద్ధతులును; యోగి = యోగులలో; ఈశ్వరుల = శ్రేష్ఠుల యొక్క; అణిమాది = అణిమాదులైన {అణిమాది - అష్టసిద్ధులు - అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అను ఎనిమిది (8). 1 అణిమ - అణువుగ సూక్ష్మత్వము నందుట, 2 మహిమ - పెద్దగ అగుట, 3 గరిమ - బరువెక్కుట, 4 లఘిమ - తేలికగనౌట, 5 ప్రాప్తి - కోరినది ప్రాప్తించుట, 6 ప్రాకామ్యము - కోరిక తీర్చుట, 7 ఈశత్వము - ప్రభావము చూపగలుగుట, 8 వశిత్వము - వశీకరణము చేయగలుగుట}; ఐశ్వర్యములున్ = ఐశ్వర్యముల; ప్రకారంబునున్ = విధానములును; వారల = వాటి కొరకు వలసిన; అర్చిరాదిన్ = ఆర్చిరాది; గతులునున్ = మార్గములును; లింగశరీర = లింగశరీరము యొక్క {లింగశరీరము - ప్రజ్ఞా మాత్రమగు సుక్ష్మ శరీరము}; భంగంబులునున్ = భంగమును {లింగశరీర భంగము - లింగశరీరము కల్పాంత ప్రళయమున పరబ్రహ్మములో లీనమగుట}; ఋక్ = ఋక్కు; యజుస్ = యజురము; సామ = సామము; అథర్వ = అథర్వము; వేదంబులునున్ = వేదములును; ఉపవేదంబులున్ = ఉపవేదములు; ఐన = అయిన; ఆయుర్వేద = ఆయుర్వేదము {ఆయుర్వేదాదులు - ఉపవేదములు - ఋగ్వేదమునకు ఆయుర్వేదము, యజుర్వేదమునకు ధనుర్వేదము, సామవేదమునకు గాంధర్వము, అధర్వణవేదమునకు స్థాపత్య శస్త్ర వేదములు ఉపవేదములు}; ఆదులునున్ = మొదలగునవియిను; ధర్మ = దర్మములును; శాస్త్రంబులునున్ = శాస్త్రములును; ఇతిహాస = ఇతిహాసములును {ఇతిహాసములు - భారత రామాయణాదులు - జరిగిన విషయము నకు సంబంధించిన కథలు (చరిత్రలు)}; పురాణంబుల = పురాణముల {పురాణములు - పూర్వము నుండి వచ్చినవి, ఇవి బ్రహ్మాది పద్దెనిమిది (18), బ్రహ్మ, పద్మ, వైష్ణవ, శైవ, భాగవత, నారదీయ, మార్కండేయ, ఆగ్నేయ, భవిష్యత్తు, బ్రహ్మకైవర్త, లింగ, వరాహ, స్కాంధ, వామన, కూర్మ, మత్య, గరుడ మరియు బ్రహ్మాండ పురాణములు. పురాణమునకు పంచలక్షణములు - సర్గము, విసర్గము, వంశము, మన్వంతరము, రాజవంశానుచరితము}; సంభవమునున్ = పుట్టుకలును; సర్వ = సర్వమైన; భూతంబుల = జీవుల; అవాంతర = అవాంతర {అవాంతర ప్రళయము - రెండు కల్పముల నడిమి కాలము}; ప్రళయంబునున్ = ప్రళయములును; మహా = మహా {మహాప్రళయము - రెండు మహాకల్పముల నడిమి కాలము}; ప్రళయంబునున్ = ప్రళయములును; ఇష్ట = ఇష్టము {ఇష్టము - అగ్నిహోత్రాదికర్మము}; పూర్తంబులున్ = పూర్తములు {పూర్తములు - వాపీ (నడబావి) కూప (బావి) తటాక (చెరువు) ఆరామ (ఉపవనము) దేవాలయ (గుడి) నిర్మాణములు మరియు అన్నదానము (ధర్మసత్రము)}; యాగ = యాగము; ఆది = మొదలగు; వైదిక = వేదమున చెప్పబడిన; కర్మ = కర్మల; జాలాంబునున్ = సమూహములును; వాపీ = దిగుడుబావులు; కూప = బావులు; తటాక = చెరువులు; దేవాలయ = గుళ్ళు; ఆది = మొదలగు; నిర్మాణంబులును = నిర్మాణాలు; అన్నదానము = అన్నదానము; ఆరామ = ఉపవనము, విహారస్థలము; ప్రతిష్ట = ప్రతిష్టించుటలు; మొదలగు = మొదలైన; స్మార్త = స్మార్త; కర్మంబులునున్ = కర్మములును; కామ్యంబులు = కోరికలకై చేయునవి,; ఐన = అయిన; అగ్నిహోత్రంబుల = అగ్నిహోత్రముల; అనుష్ఠాన = నిర్వర్తించు; ప్రకారంబునున్ = విధములును; జీవ = జీవముల; సృష్టియు = సృష్టియును; ధర్మ = ధర్మము; అర్థ = అర్థము; కామంబులు = కామములు; అనియెడు = అనే; త్రివర్గంబులన్ = మూడు పురుషార్థములను; ఆచరణ = ఆచరించు; ప్రకారంబునున్ = విధములును; మలిన = మలినములైన {మలినోపాధులు - చెడ్డవృత్తులు -ఉదా. దొంగతనము, వేశ్యావృత్తి, వడ్డీవ్యాపారము మొదలైనవి}; ఉపాధిక = జీవనోపాధులును; పాషాండ = పాషాండమత; సంభవములును = పుట్టుకలును; జీవాత్మ = జీవాత్మ యొక్క; బంధ = సంసార బంధనములు; మోక్ష = మోక్షము చేరు; ప్రకారంబులునున్ = విధానములును; స్వరూప = స్వరూప మైన ఆత్మ లో; అవస్థాన = స్థిరముగ ఉండు; విధంబునున్ = విధానమును; సర్వ = సర్వవిధముల; స్వతంత్రుడు = స్వతంత్రుడు; ఐన = అయిన; ఈశ్వరుండు = భగవంతుడు; ఆత్మ = తన యొక్క; మాయన్ = మాయ; జేసి = వలన; సర్వ = సమస్తమైన; కర్మ = కర్మములను; సాక్షి = చూచుచున్న వాడు; అయ్యు = అయినప్పటికిని; ఆ = ఆ; మాయన్ = మాయను; ఎడఁబాసి = వదలి, దూరమై; ఉదాసీన = కల్పించు కొనని; గతిన్ = విధమున; విభుండు = ప్రభువు; ఐ = అయి; క్రీడించు = వినోదించు; తెఱంగునున్ = విధమును; క్రమంబునన్ = క్రమముగ; ప్రపన్నుండను = శరణు చొచ్చిన వాడను; ఐన = అయిన; నాకున్ = నాకు; ఎఱింగింపుము = తెలుపుము; బ్రాహ్మణ = బ్రాహ్మణుని; శాపంబునన్ = శాపము; చేసి = వలని; శోక = శోకముచేత; వ్యాకుల = చీకాకు పడుతున్న; చిత్తుండవు = మనస్సు కలవాడవు; ఐ = అయి; అనశన = నిరాహార; వ్రతుండవు = వ్రతమున ఉన్నవాడవు; ఐన = అయినట్టి; నీవు = నీవు; వినుట = వినుట; ఎట్లు = ఎలాగ; అని = అని; సందేహింపన్ = అనుమానింప; వలదు = వద్దు; త్వదీయ = నీ యొక్క; ముఖ = ముఖము అను; అరవింద = పద్మమము నుండి; వినిస్స్రుతన్ = చక్కగ వినబడుతున్న, వెలువడు; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; కథా = కథలు అను; అమృత = అమృతమును; పాన = తాగ వలెనను; కుతూహలిని = కుతూహలము కలవానిని; ఐన = అయిన; నాకున్ = నాకు; ఇంద్రియంబులున్ = ఇంద్రియములు; వశంబులు = వశములు; ఐ = అయి; ఉండున్ = ఉండును; అదిగావున = అందుచేత; నేన్ = నేను; అడిగిన = అడిగిన; ప్రశ్నంబులన్ = ప్రశ్నల; కున్ = కు; ఉత్తరంబులున్ = సమాధానములు; సవిస్తరంబులుగాన్ = విపులముగ; ఆనతిచ్చి = చెప్పి; కృతార్థునిన్ = కృతార్థుని; చేయన్ = చేయుటకు; పరమేష్టి = బ్రహ్మదేవుడు {పరమేష్ఠి - అత్యున్నతమైన సంకల్పశక్తుడు}; తుల్యుండవు = సమానుడవు; అగు = అయిన; నీవ = నీవే; పూర్వ = పూర్వ; సంప్రదాయ = సంప్రదాయమున; అనురోధంబునన్ = తెలిసిన నేర్పుతో; అర్హుండవు = అర్హత ఉన్నవాడవు; అగుదువు = అయి వున్నావు; అని = అని; విష్ణురాతుండు = విష్ణువుచే కొనిరాబడిన వాడు {విష్ణురాతుడు - విష్ణువు చే కొనిరాబడిన వాడు, పరీక్షితుడు}; అయిన = అయిన; పరీక్షిన్నరేంద్రుండున్ = పరీక్షిన్మహారాజు; బ్రహ్మరాతుండు = బ్రహ్మచే కొనిరాబడిన వాడు { బ్రహ్మరాతుండు = బ్రహ్మచే కొనిరాబడిన వాడు, శుకబ్రహ్మ}; ఐన = అయిన; శుకయోగిని = శుకయోగిని; అడిగిన = అడిగిన; అతండు = అతడు; బ్రహ్మ = బ్రహ్మ; నారద = నారద; సంవాదంబునున్ = సంవాదమును; ఏక = ఒకే; సంప్రదాయ = సంప్రదాయమును; అనుగతంబునున్ = అనుసరించి నదియును; గతా = గతమును, ముందు వారి; అనుగతిక = అనుసరించునది; ప్రకారంబునన్ = విధము కలది; ఐ = అయి; తొల్లి = పూర్వము; సర్వేశ్వరుండు = భగవంతుడు; బ్రహ్మ = బ్రహ్మ; కల్పంబునన్ = కల్పములో; బ్రహ్మ = బ్రహ్మ; కున్ = కు; ఉపదేశించిన = తెలియజేసిన; భాగవత = భాగవతము అను; పురాణంబున్ = పురాణము; వేద = వేదము తో; తుల్యంబున్ = సమానమైనది; నీకున్ = నీకు; ఎఱింగింతు = తెలిపెదను; వినుము = వినుము; అని = అని; చెప్పెన్ = చెప్పెను; అని = అని; సూతుండు = సూతుడు; శౌనక = శౌనకుడు; ఆది = మొదలగు; మహా = గొప్ప; మునులున్ = మునుల; కున్ = కు; చెప్పినట్లు = చెప్పినట్లు; శుక = శుక; యోగి = యోగులలో; ఇంద్రుండు = శ్రేష్టుడు; పరీక్షిత్ = పరీక్షిత; నరేంద్రున్ = మహారాజున; కున్ = కు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.
భావము:- భూతాలకు అధినాథుడైన సర్వేశ్వరుడు ఉత్పత్తికి, స్థితికి, లయానికి హేతువైన తన మాయను వదలి మాయానియామకుడై ఏయేస్థలాలలో శయనించాడు? అంతేకాక, పూర్వం విరాట్పురుషుని అవయవాలతో ఇంద్రుడు మొదలైన లోకపాలకులతో కూడిన లోకాలు ఎలా సృష్టింపబడ్డాయి? ఇంకా మహాకల్పాలు, అవాంతరకల్పాలు, భూతభవిష్యద్వర్తమాన కాలాలు, శరీరాభిమానంతో జన్మించే దేవతలు, పితరులు, మానవులు మొదలగువారికి కలిగే ఆయుఃప్రమాణాలు నాకు చెప్పు. మహాకాలాన్నీ, సూక్ష్మకాలాన్నీ అనువర్తించి జీవులు ఏ యే కర్మలు చేసి ఏ యే లోకాలకు ప్రయాణం సాగిస్తారు. ఏయే కర్మలవల్ల వాళ్లకు దేవతాశరీరాలు వస్తాయి. అట్టి కర్మమార్గపద్ధతి నాకు వివరించు. ఇంకా సత్త్వాది గుణాలకు ఫలములైన దేవాది స్వరూపాలు కోరే జీవులు ఏ యే కర్మలు ఏ విధంగా చేయాలి? ఆ కర్మలను ఎవరికి సమర్పించాలి? వాటిని ఎవరు స్వీకరిస్తారు? భూమి, పాతాళం, దిక్కులు, అకాశం, గ్రహాలు, నక్షత్రాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, దీవులు ఎలా ఉద్భవించాయి? ఆయా చోట్ల ఉండే జీవుల జన్మలు ఎలాంటివి? వెలుపల, లోపల బ్రహ్మాండం కొలత ఎంత? మహాత్ముల చరిత్రలు ఎటువంటివి? వర్ణాశ్రమ నియమాలు, క్రమంగా ఏర్పడి ఆశ్చర్యం కల్గించే శ్రీమన్నారాయణుని అవతారకథలు, నాలుగు యుగాలు, ఆ యుగాల ప్రమాణాలు, యుగధర్మాలు, ప్రతియుగంలోనూ మానవులు పాటించవలసిన సాధారణధర్మాలు, విశేషధర్మాలు, ఆయా జాతులకు సంబంధించిన ధర్మాలు, రాజర్షుల ధర్మాలు, జీవనసాధనాలైన ఆపద్ధర్మాలు, మహత్తు మొదలైన తత్త్వాలసంఖ్య, వాటి లక్షణము ఆ తత్త్వాలకు హేతువులయిన లక్షణాలు, భగవానుని ఆరాధించే వద్ధతి, యమనియమాదులైన అష్టాంగాలతో కూడిన యోగక్రమము, యోగిశ్రేష్ఠులైన వారి అణిమ, మహిమ మొదలగు అష్టసిద్ధుల స్వరూపం, అర్చిరాది మార్గాలలో ఆ యోగులు పయనించే తీరు, లింగశరీరాలు వినాశము, ఋక్కు, యజుస్సు, సామము, అధర్వం అనే నాలగు వేదాలు, అయుర్వేదం మొదలైన ఉపవేదాలు, ధర్మాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు ఆవిర్భివించిన పద్ధతి, అన్ని భూతాలకు ఏర్పడే అవాంతర ప్రళయము, వాటిస్థితి, మహాప్రళయము, ఇష్టాపూర్తాలు, యజ్ఞాది వైదిక కర్మలు, బావులు, మడుగులు, చెరువులు, దేవాలయాలు మొదలగు వాటి నిర్మాణం, అన్నదానం, ఆరామప్రతిష్ఠ మొదలైన స్మృతుల్లో చెప్పిన కర్మలు, కామ్య కర్మలైన అగ్నిహోత్రాదులు నిర్వర్తించే విధానం, జీవుల సృష్టి ధర్మం, అర్ధం, కర్మం అనే మతమార్గాలను ఆచరించే తీరు, మలిన శరీరులైన పాషండుల పుట్టుక, జీవాత్ముడు బంధింపబడే రీతి, ఆపై మోక్షం పొందే పద్ధతి, స్వస్వరూపంలో నెలకొనే ప్రకారము, దేనికీ లోబడక అన్నిటా స్వతంత్రుడైన ఈశ్వరుడు తన మాయతో సమస్త కర్మలకు సాక్షిగా ఉంటూనే ఆ మాయకు అతీతుడై ఉదాసీనుని లాగా ప్రభువై క్రీడించే పద్ధతి. మున్నగు సంగతులన్నీ ప్రపన్నుడనైన నాకు వివరించు. నీవు బ్రాహ్మణ శాపం వల్ల దుఃఖిస్తున్నావు, నీ మనస్సు కలత జెంది ఉంది. పైగా నిరాహార దీక్షలో ఉన్నావు. నేను చెప్పే ఈ విషయాలు ఎలా వినగలవు. అని సంశయించవద్దు, నేను మీ ముఖపద్మం నుండి వెలువడే శ్రీమన్నారాయణ కథాసుధను తనివిదీరా త్రాగాలన్న కుతూహలంతో ఉన్నాను. అట్టి నాకు యింద్రియాలు స్వాథీనంలోనే ఉన్నాయి. కాబట్టి నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు సవిస్తరంగా ఆనతిచ్చి నన్ను కృతార్థుణ్ణి కావించు. ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి, అందుకు తగినవాడవు నీవే. నీవు బ్రహ్మతో సమానుడవు.” ఈ విధంగా విష్ణురాతుడైన (విష్ణువుచే రక్షితుడైన) పరీక్షిన్మహారాజు బ్రహ్మరాతుడైన (బ్రహ్మచే వ్యాసునికి పుత్రుడుగా అనుగ్రహింపబడిన) శుకమహాయోగిని అడిగాడు. అప్పుడు శుకమహర్షి “రాజా! బ్రహ్మ నారదుల సంవాదరూపము, ప్రథాన సంప్రదాయానికి చెందినది, క్రమపద్ధతిలో పరంపరగా వస్తున్నది, అయిన భాగవత మనే మహాపురాణ మున్నది. అది వేదంతో సమానం. దానిని పూర్వం సర్వేశ్వరుడు బ్రహ్మకల్పంలో బ్రహ్మకు ఉపదేశించాడు. అది నీకు తెలియ పరుస్తాను. విను” అని చెప్పి పరీక్షిత్తుతో ఇలా చెప్పసాగాడు.