పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/నారయ కృతి ఆరంభంబు


తెభా-2-93-ఉ.
ట్టి యనంతశక్తి జగదాత్ముని నాభిసరోజమందుఁ నేఁ
బుట్టి యజింపఁగా మనసు పుట్టిన యజ్ఞపదార్థజాతముల్
నెట్టన కానరామికి వినిర్మల మైన తదీయ రూపమున్
ట్టిగ బుద్ధిలో నిలిపి కంటి నుపాయము నా మనంబునన్.

టీక:- అట్టి = అటువంటి; అనంత = అంతులేని; శక్తి = శక్తిమంతుని; జగదాత్మునిన్ = భగవంతుని {జగదాత్ముడు- జగత్తు తన స్వరూపమైన వాడు}; నాభి = బొడ్డు; సరోజము = పద్మము {సరోజము - సరస్సున పుట్టునది - పద్మము}; అందున్ = లో; నేన్ = నేను; పుట్టి = జన్మించి; యజింపఁగాన్ = యజ్ఞముచేయ వలనని; మనసు = ఇష్టము; పుట్టిన = ఏర్పడగ; యజ్ఞ = యజ్ఞముచేయుటకు; పదార్థ = వలసిన వస్తువుల; జాతముల్ = సమూహములు; నెట్టన = కొంచమైనను, తప్పక (ఆంధ్ర శబ్ధరత్నాకరము); కానన్ = కనిపించుట; రామిన్ = పోవుటచేత; వినిర్మలము = విశిష్టముగ నిర్మలము; ఐనన్ = అయినట్టి; తదీయ = అతని; రూపమున్ = స్వరూపమున్; గట్టిగన్ = స్థిరముగ; బుద్ధిన్ = మనసు; లోన్ = లోపల; నిలిపి = నిలుపుకొని; కంటిన్ = కనుగొంటిని; ఉపాయమున్ = ఉపాయమును; నా = నా యొక్క; మనంబునన్ = మనసులో.
భావము:- అటువంటి అనంతశక్తి గల విశ్వాత్ముని బొడ్డు తామరలో నేను పుట్టాను. నాకు యజ్ఞం చేయాలనే బుద్ధి పుట్టింది. కాని యజ్ఞాని కవసరమైన పదార్థా లేవీ నాకంటికి కనిపించలేదు. అపుడు అతి స్వచ్ఛమైన ఆ భగవంతుని స్వరూపాన్ని దృఢంగా బుద్ధిలో నిలిపి ధ్యానం చేశాను. అపుడు నా మనస్సులో ఒక ఉపాయం తోచింది.

తెభా-2-94-సీ.
శు యజ్ఞ వాట యూస్తంభ పాత్ర మృ-
ద్ఘట శరావ వసంత కాలములును
స్నేహౌషధీ బహు లో చాతుర్హోత్ర-
త నామధేయ సన్మంత్రములును
సంకల్ప ఋగ్యజుస్సామ నియుక్త వ-
ట్కారమంత్రానురణములును
క్షిణల్ దేవతాధ్యాన తదనుగత-
తంత్ర వ్రతోద్ధేశ రణిసురులు

తెభా-2-94.1-తే.
ర్పణంబులు బోధాయనాది కర్మ
రణి మొదలగు యజ్ఞోపరణసమితి
యంతయును నమ్మహాత్ముని వయవములు
గాఁగఁ గల్పించి విధివత్ప్రకారమునను.

టీక:- పశున్ = యజ్ఞపశువులు; యజ్ఞవాటన్ = యజ్ఞవాటికలు, యజ్ఞశాలలు; యూపస్తంభ = యజ్ఞపశువును కట్టుస్తంభములు; పాత్రన్ = పాత్రలు; మృద్ఘటన్ = మట్టికుండలు; శరావన్ = మూకుడులు; వసంత = వసంత; కాలములున్ = కాలములును; స్నేహ = నెయ్యి; ఓషధీ = ధాన్యాదులు; బహు = అనేకవిధమైన; లోహన్ = లోహములు; చాతుర్హోత్ర = నాలుగు హోతల తంత్రములు {చాతుర్హోత్రలు - బ్రహ్మ, హోత, అధ్వర్యుడు, అగ్నీధ్రుడు}; మతన్ = పద్ధతులు; నామధేయ = పేర్లు; సన్మంత్రములున్ = సరియగు మంత్రములు; సంకల్ప = సంకల్పాదులు; ఋక్ = ఋగ్వేద; యజుస్ = యజుర్వేద; సామన్ = సామవేదములల్; నియుక్త = నియమింపబడిన; వషట్కారన్ = వషట్కారములు {వషట్కారములు - వషట్ అను శబ్దములుండు మంత్రములు}; మంత్ర = మంత్రముల; అనుచరణములునున్ = ప్రయోగ విధములు; దక్షిణలున్ = యజ్ఞసమయపు దక్షిణలు; దేవత = దేవతలను; ధ్యానన్ = ధ్యానించుటలు; తత్ = వాటికి; అనుగత = అనుసరించి; తంత్ర = తంత్రములు; వ్రతన్ = వ్రతములకు; ఉద్దేశ = ఉద్దేశించిన; ధరణీసురులున్ = బ్రాహ్మణులును {ధరణీసురులు - భూమికి దేవతలు - బ్రాహ్మణులు}; అర్పణంబులున్ = నైవేద్యాదులు;
బోధాయన = బోధాయనము; ఆది = మొదలగు (గ్రంధములు, మార్గములు); కర్మ = కర్మముల; సరణి = విధానములు; మొదలగు = మొదలైన; యజ్ఞ = యజ్ఞమునకు; ఉపకరణ = ఉపయోగించు వస్తువుల; సమితిన్ = సమూహములు; అంతయున్ = అంతా; ఆ = ఆ; మహాత్ముని = గొప్పవాని; అవయవములు = అవయవములు; కాఁగన్ = అయినట్లు; కల్పించి = కల్పించుకొని; విధివత్ = పద్దతి; ప్రకారముననున్ = ప్రకారముగను.
భావము:- యజ్ఞపశువులు, యాగశాల, యూపస్తంభము, పాత్రలు, మట్టికుండలు, మూకుళ్లు, యాగానికిక తగిన వసంత ఋతువు, నేయి, వడ్లూ మొదలైన ఓషధులు, కాంచనాదులైన వివిధలోహాలు, నలుగురు హోతలతో గూడిన దర్శపూర్ణిమాసాది కర్మలూ, జ్యోతిష్టోమాది నామాలూ, మంత్రాలూ, సంకల్పమూ, ఋగ్యజుస్సాను వేదాలలోని వషట్కారాలతో గూడిన మంత్రాలూ, యాగదక్షిణలూ, దేవతాధ్యానమూ, దానికి తగిన తంత్రాలూ, వ్రతాలూ, భూసురులూ, దేవతల నుద్దేశించి చేసే కర్మ సమర్పణమూ, బోధాయనాది కల్పగ్రంథాలలోని కర్మక్రమమూ, యజ్ఞానికి కావలసిన ఇతర సంభారాలూ; ఇవన్నీ ఆ పరమేశ్వరుని అవయవాలుగా కల్పించాను. ఆపై శాస్ర్తోక్త విధి ననుసరించాను.

తెభా-2-95-క.
జ్ఞాంగి యజ్ఞఫలదుఁడు
జ్ఞేశుఁడు యజ్ఞకర్తగు భగవంతున్
జ్ఞపురుషుఁగా మానస
జ్ఞముఁ గావించితిం దర్పణ బుద్ధిన్.

టీక:- యజ్ఞాంగిన్ = యజ్ఞస్వరూపుడు; యజ్ఞ = యజ్ఞమునకు; ఫలదుడున్ = ఫలములు ఇచ్చువాడు; యజ్ఞేశుడు = యజ్ఞమునకు ప్రభువు; యజ్ఞ = యజ్ఞమునకు; కర్త = చేయువాడు; అగు = అయిన; భగవంతున్ = విష్ణుమూర్తిని; యజ్ఞ = యజ్ఞ; పురుషుఁగా = స్వరూపునిగా; మానస = మనస్సులో చేయు; యజ్ఞమున్ = యజ్ఞమును; కావించితిన్ = చేసితిని; తత్ = అతనికే; అర్పణ = సమర్పిస్తున్న; బుద్ధిన్ = బుద్ధితో.
భావము:- యజ్ఞం శరీర మైన వాడు, యజ్ఞానికి ఫలితా న్నిచ్చే వాడు, ప్రభువు, కర్తా అయినట్టి ఆ భగవంతుని యజ్ఞ పురుషునిగా చేసుకొన్నాను. ఆ యజ్ఞాన్ని ఆయనకే అర్పించా లనే బుద్ధితో మానసయజ్ఞం చేశాను.
బ్రహ్మదేవుడు నారదునికి విశ్వ ప్రకారం వివరించి చెప్తున్నాడు. ఇది నారయ పూరించిన భాగంలోని దని అంటారు.

తెభా-2-96-క.
ప్పుడు బ్రహ్మలు దమలోఁ
ప్పక ననుఁ జూచి సముచిక్రియు లగుచు
న్నప్పరమేశున కభిమత
మొప్పఁగఁదగు సప్తతంతు వొగిఁ గావింపన్.

టీక:- అప్పుడు = అప్పటి నుండి; బ్రహ్మలు = బ్రాహ్మణులు; తమలోన్ = తమలో; తప్పకన్ = తప్పకుండగ; ననున్ = నన్ను; చూచి = చూచుకొని; సముచిత = తగు; క్రియులు = కర్మలుచేయువారు; అగుచున్ = అగుచూ; ఆ = ఆ; పరమేశున్ = భగవంతుని {పరమేశ్వరుడు - అత్యున్నత ప్రభువు}; కున్ = కి; అభిమతమున్ = కోరిక; ఒప్పగన్ = తీర్చుటకు; తగు = తగిన; సప్తతంతువు = యజ్ఞము; ఒగిన్ = చక్కగ; కావింపన్ = నిర్వహించగ, చేయగా.
భావము:- అప్పుడు మరీచి మొదలైన ప్రజాపతులు నేను చేసిన యాగం చూసి తాము గూడా ఉత్సుకులై ఆ భగవానునికి ప్రీతి కలగేటట్లు యజ్ఞం చేశారు.

తెభా-2-97-చ.
నువులు, దేవదానవులు, మానవనాథులు, మర్త్యకోటి, దా
యము వారివారికిఁ బ్రియంబగు దేవతలన్ భజించుచున్
తర నిష్ఠ యజ్ఞములఁ గైకొని చేసిరి; తత్ఫలంబుల
య్యనుపమమూర్తి యజ్ఞమయుఁడైన రమావరునందుఁ జెందఁగన్.

టీక:- మనువులు = మునువులు {మనువులు - వైవస్వాదులు 14 మంది - స్వాయంభువుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుసుడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్యుడు, భౌచ్యుడు}; దేవ = దేవతలు; దానవులు = దానవులు; మానవ = మానవులకు; నాధులు = ప్రభువులు; మర్త్యకోటిన్ = మానవ సమూహములు; తారున్ = వారంతా; అనయమున్ = అవశ్యముగ; వారి = వారి; వారికిన్ = వారికి; ప్రియంబున్ = ప్రియము; అగు = అయిన; దేవతలన్ = దేవతలను; భజించుచున్ = పూజించుచు; ఘనతర = మిక్కిలి గట్టి; నిష్ఠన్ = నిష్ఠతో; యజ్ఞములన్ = యజ్ఞములను; కైకొని = చేపట్టి; చేసిరి = చేసిరి; తత్ = దాని; ఫలంబున్ = ఫలితమును; ఆ = ఆ; అనుపమ = సాటిలేని; మూర్తి = స్వరూపుడు; యజ్ఞ = యజ్ఞము; మయుఁడున్ = తానే అయినవాడు; ఐన = అయినట్టి; రమావరున్ = భగవంతుని {రమావరుడు - రమ+వరుడు - లక్మీదేవిభర్త, విష్ణువు}; అందున్ = కి; చెందఁగన్ = చెందునట్లు.
భావము:- అది చూసి స్వాయంభువుడు మొదలైన మనువులూ, దేవతలూ, దానవులూ, రాజులూ, మనుష్యులూ మున్నగు వారు అందరూ, వాళ్ల వాళ్ల కిష్టమైన దేవతలను కొలుస్తూ సాటిలేనివాడూ, యజ్ఞస్వరూపుడూ అయిన లక్ష్మ నాథునకి ఫలం చెందునట్టులగా మహానిష్ఠతో యజ్ఞాలు చేశారు.

తెభా-2-98-క.
సువ్యక్త తంత్రరూపకుఁ
వ్యక్తుఁ డనంతుఁ డభవుఁ చ్యుతుఁ డీశుం
వ్యయుఁడగు హరి సురగణ
సేవ్యుఁడు క్రతుఫలదుఁ డగుటఁ జేసిరి మఖముల్.

టీక:- సువ్యక్త = బాగుగ ప్రకటింపబడిన; తంత్రరూపకుఁడు = భగవంతుడు {తంత్రము, సృష్టిస్థితిలయాధికమైన తంతుల సమూహము, తంత్రరూపకుడు, సృష్టిస్థితిలయాధికమైన తంత్రము తన రూపమైన వాడు}; అవ్యక్తుఁడు = భగవంతుడు {అవ్యక్తుడు, చూడ వీలుకానివాడు, భగవంతుడు}; అనంతుఁడు = భగవంతుడు {అనంతుఁడు, అంతము లేనివాడు, భగవంతుడు}; అభవుఁడు = భగవంతుడు {అభవుడు, పుట్టుక లేనివాడు, భగవంతుడు}; అచ్యుతుఁడు = భగవంతుడు {అచ్యుతుఁడు, చ్యుతి లేనివాడు, భగవంతుడు}; ఈశుండు = భగవంతుడు {ఈశుండు, ప్రభువు, భగవంతుడు}; అవ్యయుఁడగు = భగవంతుడు అయిన {అవ్యయుడు, వ్యయము కానివాడు, భగవంతుడు}; హరి = విష్ణువు; సుర = దేవతల; గణ = సమూహముచే; సేవ్యుఁడు = సేవింపబడువాడు; క్రతు = యజ్ఞమునకు; ఫలదుఁడు = ఫలిత మిచ్చువాడు; అగుటన్ = అగుటచేత; చేసిరి = చేసేరు; మఖముల్ = యజ్ఞములు.
భావము:- స్పష్టమైన తంత్రరూపం కలవాడూ, ఇతరులకు వ్యక్తం కానివాడూ, తుది లేనివాడూ, పుట్టుక లేనివాడూ, చ్యుతి లేనివాడూ, జగదీశ్వరుడూ, అవ్యయుడూ అయిన శ్రీహరి దేవతలకు సేవింపదగినవాడూ, యజ్ఞఫలాలను అనుగ్రహించేవాడూ కావడం వల్ల పైన చెప్పిన వారందరూ అయన నుద్దేశించే యజ్ఞాలు చేశారు.

తెభా-2-99-క.
గుణుండగు పరమేశుఁడు
ములఁ గల్పించుకొఱకుఁ తురత మాయా
గుణుం డగుఁ గావున హరి
వంతుం డనఁగఁ బరఁగె వ్యచరిత్రా!

టీక:- అగుణుండు = గుణములు లేనివాడు; అగు = అయిన; పరమేశుఁడు = భగవంతుడు {పరమేశుడు - అత్యున్నత ప్రభువు - భగవంతుడు}; జగములన్ = లోకములను; కల్పించు = సృష్టించు; కొఱకున్ = కోసము; చతురతన్ = మిక్కిలి నేర్పుతో; మాయా = మాయతో కూడిన, నిజముకాని; సగుణుండు = గుణములు కలవాడు; అగున్ = అగును; కావునన్ = అందుచేతనే; హరిన్ = విష్ణువును; భగవంతుండు = భగవంతుడు {భగవంతుడు - వీర్యవంతుడు, ఐశ్వర్యవంతుడు, సృష్టికి మూలస్థానము}; అనఁగన్ = అనుట; పరగె = యుక్తమైనది, తగి ఉన్నది; భవ్య = గొప్ప; చరిత్రా = చరిత్రకలవాడ.
భావము:- నారదా! పవిత్ర చరిత్రుడా! పరమేశ్వరుడు నిర్గుణుడు ఐనా జగత్తులను సృష్టించడానికై నేర్పుతో ఆయన తన మాయా ప్రభావం వల్ల గుణసహితు డవుతున్నాడు. అందువల్లనే ఆయన భగవంతుడు అని చెప్పబడుతున్నాడు.

తెభా-2-100-క.
విశ్వాత్ముఁడు, విశ్వేశుఁడు,
విశ్వమయుం, డఖిలనేత, విష్ణుఁ, డజుం, డీ
విశ్వములోఁ దా నుండును
విశ్వము దనలోనఁ జాల వెలుఁగుచు నుండన్.

టీక:- విశ్వాత్ముఁడున్ = విశ్వమే తానైనవాడు; విశ్వేశుఁడు = విశ్వమునకు ఈశ్వరుడు; విశ్వమయుండు = విశ్వమంతయు నిండి ఉన్నవాడు; అఖిలనేతన్ = సర్వమునకు నడిపించువాడు; విష్ణుఁడు = విష్ణువు; అజుండు = పుట్టుక లేనివాడు; ఈ = ఈ; విశ్వము = జగత్తు; లోన్ = లోపల; తాన్ = తాను; ఉండును = ఉండును; విశ్వము = జగత్తు; తనన్ = తన; లోనన్ = లోపలనే; చాలన్ = మిక్కిలి; వెలుఁగుతున్ = ప్రకాశిస్తూ; ఉండున్ = ఉండును.
భావము:- (పుత్రుడు నారదునికి విష్ణుతత్వాన్ని బ్రహ్మదేవుడు ప్రబోధిస్తున్నాడు) విశ్వమే తానైన వాడు; విశ్వమునకు ప్రభువు; విశ్వ మంతయు నిండి ఉండు వాడు; సర్వమునకు నడిపించు వాడు; విశ్వమును వ్యాపించి యుండువాడు; పుట్టుక లేని వాడు అయిన ఆ విష్ణువు ఈ జగత్తు లోపల ఉండును; జగత్తు సమస్తము ఆ విష్ణుని లోపలనే మిక్కిలి ప్రకాశిస్తూ ఉండును.

తెభా-2-101-చ.
ని నియుక్తిఁ జెంది సచరాచర భూతసమేతసృష్టి నే
వితముగా సృజింతుఁ బ్రభవిష్ణుఁడు విష్ణుఁడు ప్రోచుఁ బార్వతీ
తి లయమొందఁ జేయు; హరి పంకరుహోదరుఁ డాదిమూర్తి య
చ్యుతుఁడు త్రిశక్తియుక్తుఁ డగుచుండును నింతకుఁ దానమూలమై.

టీక:- అతని = అతని యొక్క; నియుక్తినిన్ = నియమమును; చెంది = అనుసరించి; సచర = కదులునవి (జంతు, పక్షి జాతులు); అచర = కదల లేనివి (చెట్లు, చేమలు); భూత = జీవరాశులతో; సమేత = కూడిన; సృష్టిన్ = సృష్టిని; ఏన్ = నేను; వితతముగన్ = వికసించునట్లు; సృజింతున్ = సృష్టింతును; ప్రభవిష్ణుఁడు = అవతారములెత్తువాడు; విష్ణుఁడు = విష్ణుమూర్తి; ప్రోచున్ = రక్షించును; పార్వతీపతిన్ = శివుడు {పార్వతీపతి - పార్వతికి భర్త - శివుడు}; లయమున్ = అంతము; ఒందన్ = పొందునట్లు; చేయున్ = చేయును; హరి = భగవంతుడు; పంకరుహోదరుఁడు = భగవంతుడు {పంకరుహోదరుడు - పంకరుహ(పద్మము) ఉదరుడు - విష్ణువు}; ఆదిమూర్తి = భగవంతుడు {ఆదిమూర్తి - సృష్టికి ఆదిన ఉన్నవాడు}; అచ్యుతుఁడు = భగవంతుడు {అచ్యుతః – చ్యుతి లేనివాడు, స్వరూప సామర్ద్యముల యందు పతనము లేనివాడు, ఎట్టి వికారములు లేనివాడు, విష్ణుసహస్రనామములు శ్రీశంకరభాష్యంలో 100వ నామం, 318వ నామం}; త్రి = మూడు; శక్తిన్ = శక్తుల {త్రిశక్తులు - సృష్టి, స్థితి, లయములను మూడు శక్తులు}; యుక్తుఁడున్ = కూడినవాడు; అగుచున్ = అగుచూ; ఇంతకున్ = ఇంతకు; తానన్ = తానే; మూలము = మూలము; ఐ = అయి.
భావము:- ఆ దేవదేవుని ఆనతిని అనుసరించి, చరాచరప్రాణులతో గూడిన ఈ సృష్టిని నేను విస్తారంగా సృజిస్తున్నాను. ప్రభావసంపన్నుడైన విష్ణువు దీనిని పోషిస్తున్నాడు. పార్వతీనాథుడైన శివుడు దీనిని లయింప జేస్తున్నాడు. పద్మనాభుడు, మొదటి వేలుపు, అచ్యుతుడు అయిన శ్రీహరి సృష్టి స్థితిలయాల కన్నిటికి మూలహేతువై ఆ మూడు విధాలైన శక్తులతోనూ కూడి వుంటాడు.

తెభా-2-102-క.
విను వత్స! నీవు నన్నడి
గి ప్రశ్నకు నుత్తరంబు కేవలపరమం
బును బ్రహ్మంబీ యఖిలం
బు కగు నాధార హేతుభూతము సుమ్మీ.

టీక:- విను = వినుము; వత్స = కుమారా; నీవున్ = నీవు; నన్నున్ = నన్ను; అడిగిన = అడిగినట్టి; ప్రశ్న = ప్రశ్న; కున్ = కు; ఉత్తరంబున్ = ఉత్తరము; కేవల = కేవలము; పరమంబునున్ = అత్యుత్తమును; బ్రహ్మంబు = బ్రహ్మము; ఈ = ఈ; అఖిలంబున = సమస్తమున; కున్ = కు; అగున్ = అగును; ఆధార = ఆధారమునకు; హేతు = కారణ; భూతము = అయినట్టిది; సుమ్మీ = సుమీ.
భావము:- నీవు నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాను, విను. కుమారా! ఈ సమస్త విశ్వానికి ఆధారభూత మైనది పరబ్రహ్మము ఒకటే సుమా.

తెభా-2-103-క.
రి భగవంతుఁ డనంతుఁడు
రుణాంబుధి సృష్టికార్యకారణహేతు
స్ఫుణుం డవ్విభుకంటెం
రుఁ డెవ్వఁడు లేడు తండ్రి! రికింపంగన్.

టీక:- హరి = భగవంతుడు {హరి - పాపములను హరించువాడు}; భగవంతుఁడు = భగవంతుడు; అనంతుఁడు = భగవంతుడు {అనంతుడు – అంతము లేనివాడు}; కరుణాంబుధి = దయాసముద్రుడు; సృష్టి = సృష్టించు; కార్య = పనికి; కారణ = కారణమునకు; హేతు = కారణభూతుడై; స్పురణుండు = మెలగువాడు; ఆ = ఆ; విభు = ప్రభువు; కంటెన్ = కంటెను; పరుడు = ఇతరుడు; ఎవ్వఁడున్ = ఎవడును; లేడున్ = లేడు; తండ్రీ = నాయనా; పరికింపన్ = పరిశీలనగ చూసినచో.
భావము:- ఫుత్రా! శ్రీహరి భగవానుడు, అంతము లేనివాడు, దయాసముద్రుడు, సృష్టి అనే కార్యానికి కారణభూత మైనవాడు. ఆలోచించి చూచినచో ఆ ప్రభుని కంటే శ్రేష్ఠుడైనవాడు ఇంకొక డెవ్వడూ లేడు.

తెభా-2-104-సీ.
ది యంతయును నిక్క మే బొంక నుత్కంఠ-
తిఁ దద్గుణధ్యానహిమఁ జేసి
రికింప నే నేమి లికిన నది యెల్ల-
త్యంబ యగు బుధస్తుత్య! వినుము;
ధీయుక్త! మామకేంద్రియములు మఱచియుఁ-
బొరయ వసత్యవిస్ఫురణ మెందు;
దిగాక మత్తను వామ్నాయ తుల్యంబు-
మరేంద్ర వందనీయంబు నయ్యెఁ;

తెభా-2-104.1-తే.
విలి యా దేవదేవుని వమహాబ్ధి
తారణంబును మంగళకారణంబు
ఖిల సంపత్కరంబునై లరు పాద
నజమున కే నొనర్చెద వందనములు.

టీక:- ఇది = ఇది; అంతయున్ = అంతాకూడ; నిక్కము = నిజమైనది; ఏన్ = నేను; బొంకన్ = అబద్దమాడుటలేదు; ఉత్కంఠ = కుతూహలమైన; మతిన్ = మనసుతో; తత్ = అతని; గుణన్ = గుణములు; ధ్యాన = ధ్యానము యొక్క; మహిమన్ = మహిమ; చేసి = వలన; పరికింపన్ = చూడగా; నేన్ = నేను; ఏమి = ఏమి; పలికినన్ = పలికితే; అదిన్ = అది; ఎల్ల = అంతయును; సత్యంబ = నిజమే; అగున్ = అగును; బుధ = బుద్ధిమంతులచే; స్తుత్య = కీర్తింపబడువాడా; వినుము = వినుము; ధీ = బుద్ధిశక్తి; యుక్త = కలిగినవాడా; మామక = నా యొక్క; ఇంద్రియములు = ఇంద్రియములు; మఱచియున్ = మరచిపోయికూడ; పొరయువున్ = పొందవు; అసత్య = అబద్దము; విస్ఫురణమున్ = స్ఫురించుటమాత్రమైన; ఎందున్ = ఎక్కడైన; అదిన్ = అదే; కాక = కాకుండగ; మత్ = నా యొక్క; తనువున్ = శరీరము; ఆమ్నాయ = వేదములకు; తుల్యంబున్ = సమానమైనది; అమరేంద్ర = దేవేంద్రునిచే; వందనీయంబున్ = నమస్కరించదగ్గది; అయ్యెన్ = అయినది; తవిలి = పట్టుదలగ;
ఆ = ఆ; దేవ = దేవతలకే; దేవుని = దేవుడైనవానికి; భవ = సంసారమను; మహాబ్ధి = మహాసముద్రము; తారణంబునున్ = తరింపజేయునది; మంగళ = శుభములకు; కారణంబున్ = కారణమును; అఖిల = సమస్త; సంపత్కరంబున్ = సంపదలను ఇచ్చునది; ఐ = అయ్యి; అలరు = శోభిల్లు; పాద = పాదములు అను; వనజమున్ = పద్మమున; కున్ = కు; ఏన్ = నేను; ఒనర్చెదన్ = చేసెదను; వందనములు = నమస్కారములు.
భావము:- ఇప్పుడు నేను చెప్పినదంతా నిజం. నేను అసత్యమాడను. పండిత స్తుతి పాత్రుడవైన ఓ నారదా! విను. కోరి ఆ భగవంతుని గుణాలను ధ్యానించడం వల్ల కలిగిన ప్రభావంతో, నే నేమి పలికినా అదంతా నిజమే అవుతుంది. ఓ బుద్ధిమంతుడా! నా ఇంద్రియాలు ఏ సందర్భంలో గానీ పొరపాటునగూడ అసత్యం వైపు ప్రసరించవు. అంతే కాదు. నా శరీరం వేదంతో సమానం. దేవేంద్రునికి గూడ ఇది నమస్కరింపదగిన దయింది. సంసార సాగరాన్ని దాటించేది, శుభాలకు హేతువై నది, సమస్తసంపదలను సమకూర్చేది అయిన ఆ దేవాదిదేవుని పాదపద్మ యుగళానికి నేను భక్తి భావంతో ప్రణామాలు చేస్తున్నాను.

తెభా-2-105-ఉ.
ళినాక్షు నందనుఁడ య్యుఁ, బ్రజాపతి నయ్యు, యోగ వి
ద్యా నిపుణుండ నయ్యునుఁ, బదంపడి మజ్జననప్రకారమే
యేను నెఱుంగ, నవ్విభుని యిద్ధమహత్త్వ మెఱుంగ నేర్తునే?
కానఁబడున్ రమేశపరిల్పితవిశ్వము గొంతకొంతయున్.

టీక:- ఆ = ఆ; నళినాక్షున్ = విష్ణుమూర్తికి {నళినాక్షుడు - పద్మముల వంటి కళ్ళు ఉన్నవాడు}; నందనుండన్ = పుత్రుడను; అయ్యున్ = అయినప్పటికిని; ప్రజాపతిన్ = ప్రజాపతిని {ప్రజాపతి - ప్రజల సృష్టికి అధికారి}; అయ్యున్ = అయినప్పటికిని; యోగ = యోగ; విద్యా = విద్య యందు; నిపుణుండన్ = నేర్పరిని; అయ్యున్ = అయినప్పటికిని; పదంపడి = మరి; మత్ = నా యొక్క; జనన = పుట్టుక; ప్రకారమే = విధానమే; ఏను = నేను; ఎఱుంగన్ = తెలిసుకొనలేను; ఆ = ఆ; విభుని = ప్రభువు యొక్క; ఇద్ధ = పరిశుద్ధమైన; మహత్వము = గొప్పతనము; ఎఱుంగన్ = తెలిసుకొనుట; నేర్తునే = చేయగలనా; కానన్ = కనిపిస్తుంటుంది; రమేశ = భగవంతునిచే {రమేశుడు - రమ యొక్క భర్త - విష్ణువు}; పరికల్పిత = సృష్టింపబడిన; విశ్వము = జగత్తు; కొంత = కొంచెము; కొంతయున్ = కొంచెముగను.
భావము:- నేను ఆ పద్మలోచనుని కుమారుడనే, ప్రజాపతినే, యోగవిద్యలో నేర్పరినే అయినను, నా పుట్టుక ఎలా జరిగిందో నేనే తెలుసుకోలేకున్నాను. ఇక ఆ ప్రభుని ప్రదీప్త ప్రభావం ఎలా తెలుసుకోగలను ఆ లక్ష్మీనాథుడు కల్పించిన ఈ ప్రపంచం కొంచెం కొంచెం నాకు గోచరిస్తున్నది.

తెభా-2-106-మ.
విను వేయేటికిఁ; దాపసప్రవర! యివ్విశ్వాత్ముఁ డీశుండు దాఁ
మాయామహిమాంతముం దెలియఁగాఁ థ్యంబుగాఁ జాలడ
న్నను, నే నైనను మీరలైన సురలైనన్ వామదేవుండు నై
ను నిక్కం బెఱుఁగంగఁ జాలుదుమె జ్ఞాప్రక్రియాయుక్తులన్.

టీక:- విను = వినుము; వేయి = వేయి వివరణలు; ఏటికిన్ = ఎందులకు; తాపస = తాపసులలో; ప్రవర = శ్రేష్ఠుడ; ఈ = ఈ; విశ్వాత్ముఁడు = భగవంతుడు {విశ్వాత్మ - విశ్వము తన రూప మైనవాడు}; ఈశుండున్ = భగవంతుడు; తాన్ = తాను; తన = తన యొక్క; మాయా = మాయ తోకూడిన; మహిమా = మహిమ యొక్క; అంతమున్ = మొత్తమంతా; తెలియఁగాన్ = తెలియుటకు; తథ్యంబుగాన్ = నిజముగా; చాలడు = సరిపడడు; అన్నను = అనగా; నేన్ = నేను; ఐననున్ = అయినను; మీరలు = మీరు; ఐనన్ = అయినను; సురలు = దేవతలు; అనను = అయినను; వామదేవుండు = శివుడు; ఐనను = అయినను; నిక్కంబున్ = నిజమునకు; ఎఱుగంగన్ = తెలియుటకు; చాలుదుమె = సరిపడుతామా; జ్ఞాన = (ఎన్ని) జ్ఞాన; ప్రక్రియా = విధానముల; యుక్తులన్ = యుక్తులు వలనైన.
భావము:- ఓ మునివరా! వేయి మాట లెందుకు ఇది విను. విశ్వస్వరూపుడైన ఈ పరమేశ్వరుడు తన మాయావైభవాన్ని కడముట్టా తానే గ్రహించలేడు ఇది వాస్తవం. అలాంటప్పుడు నేను గానీ, మీరు గానీ, ఇంద్రాది దేవతలు గానీ, కడకు శివుడు గానీ, మన జ్ఞానంతోటి, క్రియలతోటి ఉపాయాలతోటి సత్యంగా తెలిసికోనుట సాధ్యామా?

తెభా-2-107-వ.
అ మ్మహాత్ముం డైన పుండరీకాక్షుండు సర్వజ్ఞుం డంటేని.
టీక:- ఆ = ఆ; మహాత్ముడు = మహాత్ముడు; ఐన = అయిన; పుండరీకాక్షుండు = భగవంతుడు {పుండరీకాక్షుడు - పుండరీకములు (పద్మములు) వంటి కన్నులు ఉన్నవాడు}; సర్వజ్ఞుండు = సర్వమును తెలిసినవాడు; అంటేనిన్ = అన్నట్లయితే.
భావము:- ఆ మహాత్ముడైన పద్మనేత్రుడు సర్వజ్ఞుడు గదా. తన మహిమ అయన కెందుకు తెలియదు అని నీవు ప్రశ్నించవచ్చు. ఆ విషయం వివరిస్తాను, విను.

తెభా-2-108-క.
నము దన కడపలఁ దాఁ
నెఱుగని కరణి విభుఁడు దా నెఱుఁగఁ డనన్
నప్రసవము లే దన
గునే సర్వజ్ఞతకును హాని దలంపన్.

టీక:- గగనము = ఆకాశము; తన = తన యొక్క; కడపలన్ = చివరలను; తాన్ = తాను; తగన్ = తగినట్లు; ఎఱుఁగని = తెలియని; కరణిన్ = విధముగ; విభుఁడు = భగవంతుడు {విభుడు - ప్రభువు}; తాన్ = తాను; ఎఱుఁగన్ = తెలియడు; అనన్ = అనుట వలన; గగన = ఆకాశము; ప్రసవము = పుట్టుట; లేదు = లేదు; అనన్ = అన్నట్లుగ; అగునే = వీలగునా ఏమి; సర్వజ్ఞతకున్ = సర్వజ్ఞత్వమునకు; హాని = నష్టము; తలంపన్ = ఆలోచించినట్లైతే.
భావము:- ఆకాశం తన సరిహద్దులను తెలుసుకోలేదు. అదే విధంగా భగవంతుడు తన సమగ్రతను తానే ఎరుగలేడు. సరిహద్దుల నెరుగదు అన్నంత మాత్రాన ఆకాశ సర్వ వ్యాప్తిత్వాన్ని కాదన లేము కదా. అలాగే తన అంతు తనకే తెలియదు అన్నంత మాత్రాన భగవంతుని సర్వజ్ఞత్వానికి లోటు వాటిల్లదు.
బ్రహ్మదేవుడు నారదునికి భగవత్తత్వం ఉపదేశించే సందర్భంలో ఇలా చెప్తున్నాడు. భగవంతుడు సర్వజ్ఞుడు కనుక తన పరిధి, వ్యాప్తుల పరిమితులు తెలియవు అనడంలో అసంభవం ఏమి లేదు.