పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/నారదుని పరిప్రశ్నంబు
తెభా-2-74-శా.
ప్రారంభాది వివేక మెవ్వఁ డొసగుం? బ్రారంభ సంపత్తి కా
ధారం బెయ్యది? యేమి హేతువు? యదర్థం బే స్వరూపంబు? సం
సారానుక్రమ మూర్ణనాభి పగిదిన్ సాగింతు వెల్లప్పుడుం
భారం బెన్నఁడు లేదు; నీ మనువు దుష్ప్రాపంబు వాణీశ్వరా!
టీక:- ప్రారంభన్ = ప్రారంభించుట; ఆదిన్ = మొదలగు; వివేకమున్ = జ్ఞానమును; ఎవ్వఁడు = ఎవడు; ఒసగున్ = ఇచ్చును; ప్రారంభన్ = ప్రారంభించుటకు వలసిన; సంపత్తిన్ = ఐశ్వర్యమున; కిన్ = కు; ఆధారంబున్ = ఆధారమైనది; ఎయ్యదిన్ = ఏది; ఏమి = ఏది; హేతువు = కారణము; యత్ = ఏది; అర్థంబున్ = అర్థము; ఏ = ఏది; స్వరూపంబున్ = స్వరూపము; సంసార = సంసారము యొక్క, ప్రపంచ; అనుక్రమము = సృష్టిక్రమము, ప్రవాహమును; ఊర్ణనాభి = సాలెపురుగు; పగిదిన్ = వలె; సాగింతువు = నడిపెదవు; ఎల్లపుడున్ = సర్వవేళ లందు; భారంబున్ = బరువు (అనుకొనుట); ఎన్నడున్ = ఎప్పుడును; లేదు = లేదు; నీ = నీ; మనుపు = మనుగడ; దుష్ప్రాపంబు = పొందుటకు కష్టమైనది; వాణీ = సరస్వతీ దేవికి; ఈశ్వరా = పతీ, బ్రహ్మదేవా.
భావము:- ఈ జగత్తును సృష్టించటం ప్రారంభించే విజ్ఞానం నీ కెవడు ప్రసాదిస్తున్నాడు? ఆ ప్రారంభ సంపదకు ఆధార మేమిటి? ఈ సృష్టి నిర్మాణానికి హేతు వేమిటి? దీనికి ప్రయోజన మేమిటి? దీని స్వరూప మేమిటి? సాలెపురుగులా ఎడతెగకుండా సృష్టికార్యం సాగిస్తున్నా నీకు శ్రమ అనేది లేకుండా ఉన్నది. నీ జీవనపద్ధతి అందరికీ లభ్యపడేది కాదయ్యా సరస్వతీపతి!
తెభా-2-75-శా.
నాకుం జూడఁగ నీవు రాజ వనుచున్నాఁడన్ యథార్థస్థితిన్
నీకంటెన్ ఘనుఁ డొక్క రాజు గలఁడో? నీ వంతకున్ రాజవో?
నీకే లాభము రాఁదలంచి జగముల్ నిర్మించె? దీ చేతనా
నీకం బెందు జనించు నుండు నడఁగున్? నిక్కంబు భాషింపుమా.
టీక:- నాకున్ = నాకు; చూడఁగన్ = చూస్తే; నీవున్ = నీవే; రాజవు = ప్రభువవు; అనుచున్ = అనుకొనుచు; ఉన్నాడను = ఉన్నాను; యదార్థ = నిజమునకు; స్థితిన్ = ఉన్న స్థితిలో; నీకున్ = నీకు; కంటెన్ = కంటె; ఘనుఁడున్ = గొప్పవాడు; ఒక్క = ఇంకొక; రాజు = ప్రభువు; కలడో = ఉన్నాడా; నీవున్ = నీవే; అంత = సమస్తమును; కున్ = కు; రాజవో = ప్రభువువా; నీకున్ = నీకు; ఏ = ఏ; లాభమున్ = ప్రయోజనము; రాఁదలచి = కావాలని; జగముల్ = లోకములు; నిర్మించెదు = సృష్టించెదవు; ఈ = ఈ; చేతనా = చేతన కలవి, జీవులు; అనీకంబున్ = సమూహమును; ఎందున్ = ఎందునుండి; జనించున్ = పుట్టును; ఉండును = స్థితిలోనుండు, నడచును; అడఁగున్ = లయము అగును; నిక్కంబున్ = నిజమును; భాషింపుమా = చెప్పుము.
భావము:- నా మట్టుకు నేను నీవే ప్రభువని అనుకుంటున్నాను. వాస్తవానికి నీకంటే అధికుడైన ప్రభువు మరొకడున్నాడా? నీవే అందరికి ప్రభుడవా? అయితే యే ప్రయేజనం కాంక్షించి నీ వీ లోకాలు సృష్టిస్తున్నావు? ఈ జీవసముదాయం ఎక్కడినుండి ఉద్భవిస్తున్నది? ఎక్కడ ఉంటున్నది ఎక్కడ లయ మవుతున్నది? సత్యం తెలియ జెప్పవయ్యా! బ్రహ్మయ్యా!
తెభా-2-76-మ.
సదసత్సంగతి నామ, రూప, గుణ, దృశ్యంబైన విశ్వంబు నీ
హృదధీనంబుగదా; ఘనుల్ సములు నీ కెవ్వారలున్ లేరు; నీ
పదమత్యున్నత; మిట్టి నీవు తపముం బ్రావీణ్య యుక్తుండవై
మది నే యీశ్వరుఁ గోరి చేసితివి? తన్మార్గంబు సూచింపవే.
టీక:- సత్ = సత్తు, చైతన్యము, సత్యము; అసత్ = అసత్తు, జడము, అసత్యము; సంగతిన్ = కలయికచే ఏర్పడినది; నామ = పేర్లు; రూప = రూపములు; గుణ = గుణములు గా; దృశ్యంబున్ = చూడబడునది; ఐన = అయినట్టి; విశ్వంబున్ = విశ్వము, జగత్తు; నీ = నీ యొక్క; హృత్ = హృదయమునకు; అధీనంబు = ఆధారపడినదే; కదా = కదా; ఘనుల్ = గొప్పవారు; సములు = సమానమైన వారును; నీకున్ = నీకంటెను; ఎవ్వారలున్ = ఎవరు కూడ; లేరు = లేరు; నీ = నీ యొక్క; పదము = పదవి, స్థితి; అతి = మిక్కిలి; ఉన్నతము = ఉన్నతమైనది, గొప్పది; ఇట్టి = ఇటువంటి; నీవు = నీవు; తపమున్ = తపస్సును, ధ్యానమును; ప్రావీణ్య = నేర్పరితనము; ఉక్తుండవు = కలిగినవాడవు; ఐ = అయి; మదిన్ = మనసులో; ఏ = ఏ; ఈశ్వరున్ = ఈశ్వరుని; కోరి = కొరకు; చేసితివి = చేసేవు; తత్ = ఆ; మార్గంబున్ = విధానమును; సూచింపవే = తెలియజేయుము.
భావము:- సత్తు, అసత్తుల కలయిక వల్ల నామరూపగుణాలతో కనిపిస్తున్న ఈ ప్రపంచం నీ హృదయానికి లోబడిందే కదా! నీ కంటే అధికులు, నీతో సమానులు ఎవ్వరూ లేరు. నీ స్థానం కడు దొడ్డది. ఇలాంటి నీవు ఏ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నేర్పుతో తపస్సు చేశావు? ఆ దారి ఏదో చూపవయ్యా. పద్మసంభవ!
తెభా-2-77-శా.
అంభోజాసన! నీకు నీశుఁడు గలం డంటేనిఁ; దత్పక్షమం
దంభోజాతభవాండ మే విభుని లీలాపాంగ సంయుక్తి చే
సంభూతం బగు; వర్తమాన మగు; సంఛన్నం బగుం; దద్విభున్
సంభాషింపఁగ వచ్చు?నేఁ దలఁప నే చందంబువాఁ డాకృతిన్?
టీక:- అంభోజ = పద్మము; ఆసన = ఆసనముగ కలవాడా - బ్రహ్మ; నీకున్ = నీకు కూడ; ఈశుండున్ = ప్రభువు; కలండున్ = ఉన్నాడు; అంటేని = అంటే; తత్ = ఆ; పక్షమందున్ = లాగునైతే; అంభః = నీటిలో; జాత = పుట్టిన దానిలో (పద్మములో); భవ = పుట్టినవాడు (బ్రహ్మ); అండము = అండము (బ్రహ్మాండము); ఏ = ఏ; విభుని = ప్రభువు; లీలా = విలాసమైన; అపాంగ = కటాక్షము; సంయుక్తి = తోకూడుట, కలుగుట; చేన్ = చేత; సంభూతంబున్ = పుట్టినది (భూతకాలము ఉన్నది); అగున్ = అగును; వర్తమానము = నడుస్తు ఉన్నది (ఇప్పుడు ఉన్నది); అగున్ = అగును; సంఛన్నంబున్ = లయమైనది (మాయము); అగున్ = అగును; తత్ = ఆ; విభున్ = ప్రభువును; సంభాషింపగన్ = గురించి చెప్పుట; వచ్చునేన్ = వీలగునా, సాధ్యమేనా; తలపన్ = ఊహంచుటకు; ఏ = ఏ; చందంబున్ = విధమైన; వాఁడు = వాఁడు; ఆకృతిన్ = ఆకారములో.
భావము:- ఓ పద్మాసనా! ఒకవేళ నీకు ఒక ప్రభువున్నాడు అంటావేమో. అట్లైతే ఈ బ్రహ్మాండం ఏ ప్రభువు కటాక్ష విలాసంతో పుట్టుతున్నదొ, పెరుగుతున్నదొ, గిట్టుతున్నదొ ఆ ప్రభువు గూర్చి ముచ్చటించుకోవచ్చునా. ఆయన స్వరూప మెలాంటిది.
తెభా-2-78-క.
తోయజసంభవ నా కీ
తోయము వివరింపు, చాలఁ దోఁచిన నే నా
తోయము వారికి నన్యుల
తోయములం జెందకుండ ధ్రువ మెఱిఁగింతున్.
టీక:- తోయన్ = నీటిలో; జ = పుట్టినదానిలో (పద్మమున); సంభవ = పుట్టినవాడ (బ్రహ్మ); నాకున్ = నాకు; ఈ = ఈ; తోయమున్ = వృత్తాంతమును; వివరింపు = వివరముగ చెప్పు; చాలన్ = సరిపడ; తోచినన్ = గోచరించినచో, తెలిసినచో; నేన్ = నేను; నా = నా యొక్క; తోయము = తోటి, వంటి; వారన్ = వారల; కిన్ = కి; అన్యుల = ఇతరుల; తోయములన్ = పద్ధతులలో, మార్గములో; చెందక = పడకుండగ; ఉండన్ = ఉండునట్లు; ధ్రువమున్ = నిశ్చయమైనదిగ; ఎఱిఁగింతున్ = తెలియజేయుదును.
భావము:- ఓ బ్రహ్మ దేవుడా! నాకు ఈ విషయం బాగా అర్థమయ్యేలా వివరించు. నన్ను అనుసరించేవాళ్ళకి, ఈ సత్యం తెలియజెప్పి, ఇతర మార్గాలకు పోకుండా గట్టిగా బోధిస్తాను.
నారదుడు బ్రహ్మ దేవుని నీవే కదా అధిదేవుడివి. నీవు ఎవరిని ధ్యానిస్తున్నావు అని అడుగుతున్న సందర్భంలోది ఈ పద్యం. దీంట్లో తోయము అనే పదానికి ఉన్న నీరు, విధము, పరివారము, తెగ అనే నానా అర్థాలు వాడిన పోతన గారి పలుకుల చమత్కృతి చక్కగా ఉంది.
తెభా-2-79-వ.
దేవా భూతభవిష్యద్వర్తమానంబు లగు వ్యవహారంబులకు నీవ వల్లభుండవు; నీ యెఱుంగని యర్థం బొండెద్దియు లేదు; విశ్వప్రకారంబు వినిపింపు"మనిన విని వికసితముఖుండై విరించి యిట్లనియె
టీక:- దేవా = (బ్రహ్మ) దేవా; భూత = జరిగిపోయినది, పూర్వము; భవిష్యత్ = జరగబోవు, పరము; వర్తమానంబున్ = జరుగుచున్నది, ప్రస్తుతము; అగు = అయినవి (అన్ని); వ్యవహారంబులున్ = వృత్తాంతములు, విషయములు; కున్ = కు; నీవ = నీవే; వల్లభుండవు = ప్రభువువి; నీ = నీవు; ఎఱుంగని = తెలియని; అర్థంబున్ = విషయము; ఒండు = ఒకటైన; ఎద్దియున్ = ఏదీ; లేదు = లేదు; విశ్వ = విశ్వము యొక్క; ప్రకారంబున్ = విధమును; వినిపింపుము = చెప్పుము; అనిన్ = అనగ; విని = విని; వికసిత = వికసించిన; ముఖుండున్ = ముఖములు కలవాడు; ఐ = అయి; విరించి = బ్రహ్మ, {విరించి - వివరముగ రచించువాడు}; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- బ్రహ్మదేవుడా! తండ్రీ! జరిగిన, జరుగనున్న, జరుగుతున్న వ్యవహారా లన్నిటికీ నీవే కర్తవు. నీకు తెలియని విషయమంటూ ఏదీ లేదు. ఈ ప్రపంచవిధానం నాకు తెలియజెప్పుము” అని నారదుడు ప్రశ్నించాడు. అందుకు విప్పారిన వదనంతో విధాత ఇలా అన్నాడు.