పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము/ప్రళయ విశేషంబులును
←కల్పప్రళయ ప్రకారంబు | తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము) రచయిత: నారయ |
తక్షకదష్ఠుడైన పరీక్షిన్మృతి→ |
తెభా-12-24-వ.
శత హాయనంబులు ధారాధరంబులు మహాఘోషంబుతోడం గరికరోపమానంబు లయిన నీరధారల నిఖిలజగంబును శంబరమయంబు చేసిన బ్రహ్మాండంబెల్ల జలమయం బగుటంజేసి, భూమి హృతగంధ గుణంబయి కబంధంబున లీనంబగు; నన్నీరంబు జీర్ణరసగుణంబై తేజంబున నడంగు; నా తేజంబు వాయువందు నష్టరూపంబయి కలయు; నా పవనుండు గతస్పర్శగుణుండై నభంబున సంక్రమించు; నా యాకాశంబు విగతశబ్దంబయి భూతాదిం బ్రవేశించుఁ; దైజసంబైన మహద్రూపం బనహంకారంబై వైకారికగుణసమేతంబై, యింద్రియంబుల లయించు; నహంకారంబును సత్త్వాదిగుణంబులు గ్రసియించు; నవి కాలచోదితం బైన ప్రకృతి యందడంగు; నా ప్రకృతి యనాదియు నిత్యంబు నవ్యయంబు నవాఙ్మానసగోచరంబునై సత్త్వరజస్తమోగుణ రహితంబయి, మహదాది సన్నివేశంబు లేక స్వప్నాద్యవస్థారహితంబయి, పృథివ్యాదిహీనంబై యప్రతర్క్యంబగు; దానిని మూలభూతంబయిన పదంబని చెప్పుచుందురు, కాలవిపర్యయం బయి, పురుషావ్యక్తులు విలీనం బగునది ప్రాకృత ప్రళయం బనంబడు” నని చెప్పి “మఱియు నొక విశేషంబు వినుము; బుద్ధీంద్రియార్థరూపంబులచే జ్ఞానంబు తదాశ్రయం బయి వెలుంగు; దృశ్యత్వాద్వ్యతిరేకంబులచే నది యాద్యంతంబులు గలదై యుండుఁ; దేజంబునకు దీపచక్షూరూపంబులు వేఱు గానియట్లు బుద్ధీంద్రియార్థంబులు పరార్థమూర్తికి నన్యంబులు గానేరవు; బుద్ధిసంభవంబు ప్రధానంబు; జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థాబేధం బాత్మమయంబై, బుద్ధియుక్తంబైన యోగంబునం బరిణమించుఁ; బ్రాణిజాతం బీశ్వరునందు లయోదయంబులు వొందుచుండు; సర్వంబు నన్యోన్యాపాశ్రయంబై యాద్యంతవంతంబగుట, నవస్తువై వర్తించు; నొక్క తేజంబు బహురంధ్రంబులం గానంబడు వడువున నొక్క పరమాత్మ పెక్కువిధంబుల భావింపంబడు; హాటకంబు పెక్కురూపంబులం గలదైన, నేకంబయిన తెఱంగునఁ బరమాత్మ నేకంబుగా భావింపవలయు; నేత్రంబులకు మేఘావరణంబు దలంగి నప్పుడు భాస్కరమండలంబు గనిపించు కరణి బంధహేతువైన యహంకారం బాత్మజ్ఞానంబునం దిరస్కృతంబైన యప్పుడే పరమాత్మ నిర్మలంబయి తోఁచు; నా పరమాత్మను నిరంతరంబును దలంచుచు, యోగులు తదేకాయత్తచిత్తులై యుందురు; కాలవేగంబున సర్వప్రపంచంబునకు నవస్థాంతరంబులు గల్గుచుండుఁ; బరమేశ్వర మూర్తి యైన కాలంబున నభంబునం బగలు తారకంబులు గానరాని కరణిం గానంబడక, కల్పావస్థలు చరించు; నిత్య నైమిత్తిక ప్రాకృతికాత్యంతికంబు లని ప్రళయంబు చతుర్విధంబులై పరఁగు; నందులంగలుగు నారాయణుని లీలావతారంబులఁ గమలభవ భవాదులయిన వచింపనోపరు; నే నెఱింగినయంతయుం జెప్పితి; సంసారసాగరంబు దాఁట హరి కథ యనెడు నావయ సహాయంబు గాని వేఱొకటి లే” దని చెప్పి.
టీక:- శత = వంద (100); హాయనంబులు = సంవత్సరములు పాటు; ధారాధరంబులు = మేఘములు; మహా = గొప్ప; ఘోషంబు = ధ్వని; తోడన్ = తోటి; కరి = ఏనుగు; కర = తొండాలను; ఉపమానంబులు = పోలునవి; అయిన = ఐన; నీర = నీటి; ధారలన్ = ధారలతో; నిఖిల = సకల; జగంబునున్ = లోకములను; శంబర = నీటితో; మయంబు = నిండినదిగ; చేసినన్ = చేస్తాయి; బ్రహ్మాండంబు = బ్రహ్మాండము; ఎల్లన్ = అంతా; జల = నీటితో; మయంబు = నిండినది; అగుటన్ = కావడం; చేసి = వలన; భూమి = భూమి; హృత = పోగొట్టుకొన్న; గంధ = గంధ; గుణంబున్ = తన్మాత్రకలది; అయి = అయ్యి; కబంధంబునన్ = నీటిలో; లీనంబు = కలిసిపోయినది; అగున్ = అయిపోతుంది; ఆ = ఆ యొక్క; నీరంబు = నీరు; జీర్ణ = నశించిన; రస = రస; గుణంబున్ = తన్మాత్రకలది; ఐ = అయ్యి; తేజంబునన్ = తేజస్సులో; అడంగున్ = కలసిపోవును; ఆ = ఆ; తేజంబు = తేజస్సు; వాయువు = వాయువు; అందున్ = లో; నష్ట = పోయిన; రూపంబు = రూపతన్మాత్ర కలది; అయి = ఐ; కలయున్ = కలసిపోవును; పవనుండు = వాయువు; గత = పోయిన; స్పర్శ = స్పర్శ; గుణుండు = తన్మాత్రకలది; ఐ = అయ్యి; నభంబునన్ = ఆకాశమునందు; సంక్రమించున్ = కలసిపోవును; ఆ = ఆ; ఆకాశంబు = ఆకాశము; విగత = పోయిన; శబ్దంబు = శబ్దతన్మాత్ర కలది; అయి = అయ్యి; భూతాదిన్ = ఆదిభూతమునందు; ప్రవేశించున్ = కలసిపోవును; తైజసంబు = తేజోమయము; ఐన = అయిన అది; మహద్రూపంబు = బహుగొప్పరూపము; అనన్ = అనగా; అహంకారంబు = అహంకారముకలది; ఐ = అయ్యి; వైకారిక = వికారముకలిగిన; గుణ = గుణములుతో; సమేతంబు = కూడినది; ఐ = అయ్యి; ఇంద్రియంబులన్ = ఇంద్రియములందు; లయించున్ = కలిసిపోవును; అహంకారంబును = అహంకారమును; సత్త్వాదిగుణంబులు = గుణత్రయము {గుణత్రయము - సత్త్వము రజస్సు తమస్సు అనెడి మూడు గుణములు}; గ్రసియించున్ = తమలో కలిపేసుకొంటాయి; అవి = అవి; కాల = కాలముచేత; చోదితంబు = ప్రేరేపింపబడినది; ఐన = అయిన; ప్రకృతి = ప్రకృతి; అందున్ = లో; అడంగున్ = కలిసిపోవును; ఆ = ఆ; ప్రకృతి = ప్రకృతి; అనాదియు = అనాదినుండి ఉన్నది; నిత్యంబున్ = శాశ్వతమైనది; అవ్యయంబు = నాశములేనిది; అవాఙ్మానసగోచరంబున్ = మాటలకు ఊహకు అందనిది; ఐ = అయ్యి; సత్త్వరజస్తమోగుణ = గుణత్రయము; రహితంబు = లేనిది; అయి = అయ్యి; మహదాది = మహత్తు మున్నగువానితో; సన్నివేశంబు = కలయిక; లేక = లేనిదై; స్వప్నాద్యవస్థా = అవస్థాత్రయము {అవస్థాత్రయము - 1జాగ్రత్తు, 2స్వప్నము, 3సుషుప్తి}; రహితంబు = లేనిది; అయి = ఐ; పృథివ్యాది = పంచభూతమలు {పంచభూతముల - 1పృథివి 2జలము 3తేజస్సు 4వాయువు 5ఆకాశము}; హీనంబు = లేనిది; ఐ = అయ్యి; అప్రత్యర్కంబు = తర్కానికి అందనిదై; అగున్ = ఉంటుంది; దానిని = దానిని; మూలభూతంబు = మూలభూతము; అయిన = ఐన; పదంబు = పదార్థము; అని = అని; చెప్పుచుందురు = చెప్తుంటారు; కాల = కాలము; విపర్యయంబు = విపరిమాణముచెందినది; అయి = ఐ; పురుష = పురుషుడు; అవ్యక్తులు = అవ్యక్తుడు; విలీనంబు = ఒకరితోనొకరు లీనమగుట; అగున్ = జరుగును; అది = దానిని; ప్రాకృతప్రళయంబు = ప్రాకృతప్రళయము; అనంబడును = అనబడును; అని = అని; చెప్పి = తెలిపి; మఱియునొక = ఇంకొక; విశేషంబు = సంగతి; వినుము = వినుము; బుద్ధి = బుద్ధి; ఇంద్రియార్థరూపంబులు = ఇంద్రియాలు ఇంద్రియార్థమైన విషయాలు; చేన్ = చేత; జ్ఞానంబు = జ్ఞానము; తత్ = వానిని; ఆశ్రయంబు = ఆశ్రయించుకొన్నది; అయి = అయ్యి; వెలుంగున్ = ప్రకాశించును; దృశ్యత్వ = గోచరంకావడం; తద్వతిరేకంబులు = కాకపోవడం అనే లక్షణాల; చేన్ = చేత; అది = అది; ఆద్యంతంబులు = మొదలు చిగురులు; కలది = ఉన్నది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; తేజంబున్ = కాంతి; కున్ = కి; దీప = దీపము; చక్షు = కన్ను; రూపంబు = వస్తురూపములు; వేఱు = వేరైనవి; కాని = కాని; అట్లు = విధముగ; బుద్ధీ = బుద్ధి; ఇంద్రియార్థంబులు = ఇంద్రియాలు విషయాలు; పరార్థమూర్తి = పరమాత్మ; కిన్ = కి; అన్యంబులు = వేరైనవి; కానేరవు = కాలేవు; బుద్ధి = బుద్ధి యందు; సంభవంబు = పుడుతుంది; ప్రధానంబు = ప్రధానము; జాగ్రత్ = మెలకువగా ఉండుట; స్నప్న = కలలుకనుట; సుషుప్తి = గాఢనిద్రపోవుట; అవస్థాబేధంబులు = అవస్థాత్రయము; బుద్ధి = బుద్ధితో; యుక్తంబు = కలిసినవి; ఐన = అయినచో; యోగంబునన్ = యోగముగా; పరిణమించున్ = మారుతుంది; ప్రాణి = జీవ; జాతంబు = జాలములు; ఈశ్వరున్ = భగవంతుని; అందున్ = లో; లయ = లీనమగుట; ఉదయంబులు = పుట్టుట; పొందుచున్ = పొందుతూ; ఉండున్ = ఉంటాయి; సర్వంబున్ = సమస్తము; అన్యోన్య = ఒకదానితోనొకటి; అపాశ్రయంబు = సంభందములేనివి; ఐ = అయ్యి; ఆది = మొదలు/పుట్టుక కలవి; అంతంబున్ = చివర/నశించుట కలవి; అగుటన = ఐ ఉండుటచేత; వస్తువు = వస్తువు; ఐ = అయ్యి; వర్తించున్ = ప్రవర్తిస్తుంది; ఒక్క = ఒకే ఒక; తేజంబు = వెలుగు; బహు = అనేకమైన; రంధ్రంబులన్ = కన్నములందు; కానంబడు = కనబడెడి (అనేకమువలె); వడువునన్ = విధముగనే; ఒక్క = ఒకే ఒక; పరమాత్మ = భగవంతుడు; పెక్కు = అనేక; విధంబులన్ = విధములుగ; భావింపంబడు = భావింపబడును; హాటకంబు = బంగారము; పెక్కు = అనేక; రూపంబులన్ = ఆకారములలో; కలది = ఉన్నది; ఐనన్ = అయినను; ఏకంబు = ఒకటే; అయిన = ఐనట్టి; తెఱంగునన్ = విధముగా; పరమాత్మన్ = భగవంతుని; ఏకంబు = ఏకము; కాన్ = అయినట్లు; భావింపవలయు = గ్రహించాలి; నేత్రంబులు = కన్నుల; కున్ = కు; మేఘ = మేఘములు; ఆవరణంబు = అడ్డుగా కమ్ముకొనుట; తలంగిన = తొలగిపోయిన; అప్పుడు = అప్పుడు; భాస్కరమండలంబు = సూర్యమండలము; కనిపించున్ = కనబడెడి; కరణిన్ = విధముగనే; బంధ = తగులములకు; హేతువు = కారణభూతము; ఐన = అగు; అహంకారంబు = అహంకారము; ఆత్మజ్ఞానంబునన్ = ఆత్మజ్ఞానమువలన; తిరస్కృతంబు = తొలగింపబడినది; ఐన = అయిన; అప్పుడే = అప్పుడు మాత్రమే; పరమాత్మ = పరమాత్మ; నిర్మలంబు = స్వచ్ఛమైనదిగా; అయి = అయ్యి; తోచున్ = కనబడును; పరమాత్మను = భగవంతుని; నిరంతరంబు = ఎల్లప్పుడు; తలంచుచున్ = స్మరించుచు; యోగులు = యోగులు; తదేకాయత్త = కేంద్రీకరించిన; చిత్తులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; ఉందురు = ఉంటారు; కాల = కాలము యొక్క; వేగంబునన్ = గమనప్రభావము; సర్వ = అఖిల; ప్రపంచంబున్ = లోకాలు; అవస్థా = దశలలో; అంతరంబు = భిన్నత్వములు; కల్గుచుండున్ = కలుగుతుంటాయి; పరమాత్మ = భగవంతుని; మూర్తి = స్వరూపము; ఐన = అయిన; కాలంబున = కాలమునందు; నభంబునన్ = ఆకాశములో; పగలు = పగటిపూట; తారకంబులు = నక్షత్రాలు; కానరాని = కనిపించని; కరణిన్ = విధముగనే; కానంబడక = తెలియరాకుండా; కల్ప = కల్పములందలి; అవస్థలు = వివిధ దశలు; చరించున్ = మారుతుంటాయి; నిత్య = నిత్య ప్రళయము {నిత్యప్రళయము - నిత్యము ప్రాణులకు కలుగుతుండెడి నిద్ర మరణము}; నైమిత్తిక = నైమిత్తిక ప్రళయము {నైమిత్తిక ప్రళయము - బ్రహ్మ పగలు వచ్చునది, మరియొక విధముగ బ్రహ్మ పగలు తరువాత వచ్చెడి సర్వనాశనము}; ప్రాకృతిక = ప్రాకృతిక ప్రళయము {ప్రాకృతిక ప్రళయమప - బ్రహ్మ రాత్రి వచ్చునది, మరియొక విధముగ బ్రహ్మ జీవితకాలాంతమున జరుగు మహా ప్రళయము ప్రకృతి సృష్టి సమస్తము నాశనమగుట}; ఆత్యంతికంబులు = ఆత్యంతిక ప్రళయములు {ఆత్యంతిక ప్రళయము - మోక్షము దీని తరువాత జీవికి జననమరణాలుండవు జీవి పరమాత్మలో ఐక్యమగును కనుక}; అని = అని; ప్రళయంబులు = ప్రళయములు; చతుర్ = నాలుగు (4); విధంబులు = రకములు; ఐ = అయ్యి; పరగున్ = ప్రసిద్ధములు; అందున్ = ఆయా సమయాలలో; కలుగు = సంభవించెడి; నారాయణుని = విష్ణుమూర్తి యొక్క; లీల = లీలలు; అవతారంబులన్ = అవతారములను; కమలభవ = బ్రహ్మదేవుడు {కమలభవ - పద్మమున భవ (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; భవ = పరమశివుడు {భవుడు - సమస్తము తానే యైనవాడు, శివుడు}; ఆదులు = మున్నగువారు; అయిన = అయినప్పటికి; వచింపన్ = చెప్పుటకు; ఓపరు = సరిపడరు; నేన్ = నేను; ఎఱింగిన = తెలిసికొనగలది; అంతయున్ = అంతటిని; చెప్పితిన్ = తెలిపితిని; సంసార = సంసారము అనెడి; సాగరంబున్ = సముద్రమును; దాటన్ = తరించుటకు, దాటుటకు; హరి = విష్ణుమూర్తి యొక్క; కథ = కథలు; అనెడు = అను; నావయ = పడవ మాత్రమే; సహాయంబు = సాయపడగలిగినది; కాని = అది తప్పించి; వేఱు = మరి; ఒకటి = ఒకటి; లేదు = లేదు; అని = అని; చెప్పి = చెప్పి;
భావము:- నూరు సంవత్సరాలపాటు మేఘాలు మహాధ్వని చేస్తూ ఏనుగుతొండాల నుండి పడే ధారల వంటి జలధారలు కురిసి, బ్రహ్మాండం అంతా జలమయం చేసివేస్తాయి.
బ్రహ్మాండమంతా జలమయం కావడం చేత పృథ్వి తన తన్మాత్ర అయిన గంధగుణాన్ని పోగొట్టుకుని నీళ్ళలో లీనమయిపోతుంది; నీరు తన తన్మాత్ర అయిన రసగుణాన్ని పోగొట్టుకుని కాంతిలో అనగా తేజస్సులో అణగిపోతుంది; తేజస్సు తన తన్మాత్ర అయిన రూపగుణాన్ని పోగొట్టుకుని వాయువులో కలుస్తుంది; వాయువు తన తన్మాత్ర అయిన స్పర్సగుణాన్ని పోగొట్టుకుని ఆకాశంలో చేరుతుంది; ఆకాశం తన తన్మాత్ర అయిన శబ్దగుణాన్ని పోగొట్టుకుని ఆదిభూతంలో ప్రవేశిస్తుంది; అది తేజోమయమైన మహత్తు రూపంతో అహంకారం కలదై వికార గుణములు కలదై ఇంద్రియాలను లీనం చేసుకుంటుంది; అహంకారాన్ని సత్త్వాది గుణాలు తమలో లీనం చేసుకుంటాయి; ఆ సత్త్వాది గుణాలు తిరిగి కాలంచేత ప్రేరేపించబడిన ప్రకృతిలో లీనమైపోతాయి.
ప్రకృతి అనేది అనాదిగా ఉంది; అది శాశ్వతమైనది; దానికి నాశనం కాని, మార్పు కానీ లేదు; మాటలకు, మనస్సుకూ కాని గోచరం కాక సత్త్వమూ రజస్సూ తమస్సు అనే గుణత్రయము లేనిదై మహత్తు మొదలయిన వానితో కూడిక లేనిదై స్వప్నాది అవస్థాత్రయం లేనిదై పృథివ్యాది పంచభూతాలు లేనిదై తర్కానికి అందనిదై ఉంది; దానిని మూలభూత పదార్ధంగా చెబుతారు. కాలం విపరిణామం చెందినపుడు పురుషుడు, అవ్యక్తుడు, ఒకరిలో ఒకరు లీనమవుతారు. ఆ స్థితిని “ప్రాకృత ప్రళయం” అంటారు.
ఇంకొక సంగతి ఉంది, దానిని కూడా విను. బుద్ధి, ఇంద్రియాలు, ఇంద్రియార్ధాలైన విషయాలు ఈ మూడింటినీ ఆశ్రయించుకుని జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది; గోచరం కావడం అనే లక్షణం కలిగి విరుద్ధం కాకపోవడ మనే లక్షణం కలిగి ఆది, అంతం కలదై ఈ జ్ఞానం ఉంటుంది; కాంతికంటే దీపమూ, నేత్రమూ వస్తురూపమూ వేరు కావు; అదేవిధంగా బుద్ధీ ఇంద్రియాలు విషయాలూ పదార్ధమూర్తి అయిన పరమాత్మ కంటే భిన్నమైనవి కావు.
ప్రధాన మనేది బుద్ధి యందు పుడుతుంది; మెలుకవగా ఉండుట అనే జాగ్రదవస్థ, కలలు కనుట అనే స్వప్నావస్థ, గాఢనిద్రపోవుట అనే సుషుప్తి అవస్థ అనే ఈ మూడు విధాలైన అవస్థలు ఆత్మమయాలై బుద్ధితో కలసినట్లయితే అదే యోగం అనిపించుకుంటుంది.
జీవులు ఈశ్వరునిలో ఉదయించుట, లయించుట పొందుతూ ఉంటారు; ఒకదానికొకటి ఆధారంకానిదై, సమస్తము, ఆది అంతము కలదై ఉండడం వలన అవస్తువై (వస్తువు కానిదై) ప్రవర్తిస్తుంది; ఒక తేజం అనేక రంధ్రాలలో నుంచి అనేక తేజములుగా గోచరించునట్లు, ఒకే భగవంతుడు అనేక విధాలుగా భావించబడుతూ ఉన్నాడు. నగల భేదాన్ని బట్టి అనేక రీతులుగా కనిపించినప్పటికీ బంగారం ఒకటిగానే భావించినట్లుగానే, పరమాత్మను ఒకటిగానే భావించాలి. కళ్ళకు అడ్డుగా నిలచిన మబ్బుతెర తొలగిపోయినప్పుడు సూర్యబింబం కనిపించినట్లుగా, ఆత్మజ్ఞానం వలన అహంకారం తొలగిపోయినపుడు పరమాత్మ స్వచ్ఛంగా కనిపిస్తుంది. అహంకారం బంధన కారణం అందువల్లనే అడ్డు నిలుస్తుంది. యోగులు పరమాత్మనే ఎల్లప్పుడూ తలుస్తూ పరమాత్మ యందే మనస్సును నిలుపుకుని ఉంటారు.
కాలగమనంచేత ప్రపంచానికి భిన్నభిన్నమైన దశలు కలుగుతుంటాయి. పరమాత్మ యొక్క స్వరూపమే కాలం. ఆకాశంలో పగటిపూట చుక్కలు కనిపించని విధంగా, కాలంలో కల్పావస్థలు కనిపించకుండా సంచరిస్తుంటాయి. “నిత్య ప్రళయం”, “నైమిత్తిక ప్రళయం”, “ప్రాకృతిక ప్రళయం”, “ఆత్యంతిక ప్రళయం” అని ప్రళయాలు నాలుగు విధాలు. ఆయా సమయాల్లో సంభవించే నారాయణుని లీలలనూ అవతారాలనూ బ్రహ్మదేవుడు కాని, పరమశివుడు కాని తదితరులు కాని చెప్పలేరు. నేను నాకు తెలిసినంతవరకూ చెప్పాను. సంసారమనే మహాసముద్రాన్ని దాటడానికి విష్ణుకథ అనే నావ ఒక్కటే సాధనం. మరొకటేదీ సాధనం కాలేదు. సహాయపడలేదు.
తెభా-12-25-ఉ.
"ఏను మృతుండ నౌదు నని యింత భయంబు మనంబులోపలన్
మానుము; సంభవంబు గల మానవకోట్లకుఁ జావు నిత్యమౌఁ;
గాన హరిం దలంపు; మికఁ గల్గదు జన్మము నీకు ధాత్రిపై;
మానవనాథ! పొందెదవు మాధవలోకనివాససౌఖ్యముల్.
టీక:- ఏను = నేను; మృతుండను = చనిపోయినవాడను; ఔదున్ = అయిపోతాను; అని = అని; ఇంత = ఇంత అధికమైన; భయంబున్ = భయమును; మనంబు = మనసు; లోపలన్ = లో; మానుము = విడిచిపెట్టుము; సంభవంబు = పుట్టుట; కల = కలిగిన; మానవ = మానవులు; కోట్లు = అందరి; కున్ = కి; చావు = చచ్చిపోవుటన్నది; నిత్యము = శాశ్వతమైన ధర్మము; ఔన్ = అయి ఉన్నది; కాన = కనుక; హరిన్ = విష్ణుమూర్తిని; తలంపుము = స్మరించుము; ఇక = ఈ పైన; కల్గదు = సంభవించదు; జన్మము = పుట్టుక; నీ = నీ; కున్ = కు; ధరిత్రి = భూలోకము; పైన్ = అందు; మానవనాథ = రాజా; పొందెదవు = పొందుతావు; మాధవలోక = వైకుంఠమునందు {మాధవలోకము - విష్ణుమూర్తి యొక్క పదము, వైకుంఠము}; నివాస = నివసించెడి; సౌఖ్యముల్ = సుఖములను.
భావము:- ఓ మహారాజా! నేను చనిపోతాను అన్న భయాన్ని పూర్తిగా మనసులోంచి తుడిచెయ్యి. జన్మించిన మానవు లందరికి మరణించటం అన్నది శాశ్వతమైన తప్పనిసరి ధర్మం. కనుక హరిని ధ్యానంచేసుకో. దీనివల్ల మళ్ళా ఈ భూలోకంలో జన్మించటం జరుగదు. మాధవలోక మైన వైకుంఠంలో నివసించి, అక్కడ సౌఖ్యాలు అనుభవించే యోగం కలుగుతుంది.