పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/వాసుదేవాగమన నిర్ణయము


తెభా-10.1-1715-వ.
అని యిట్లు పలికిన బ్రాహ్మణునివలన విదర్భరాజతనయ పుత్తెంచిన సందేశంబును, రూప సౌందర్యాదివిశేషంబులును విని, యవధరించి నిజకరంబున నతని కరంబుఁబట్టి నగుచు న య్యాదవేంద్రుం; డిట్లనియె
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలికిన = చెప్పిన; బ్రాహ్మణుని = విప్రుని; వలన = వలన; విదర్భరాజతనయ = రుక్మిణీదేవి {విదర్భ రాజ తనయ - విదర్భరాజు (భీష్మకుడు) యొక్క పుత్రిక, రుక్మిణి}; పుత్తెంచిన = పంపించిన; సందేశంబున్ = సమాచారము; రూప = చక్కదనము; సౌందర్య = అందము; ఆది = మున్నగు; విశేషంబులున్ = విశిష్టతలను; విని = విని; అవధరించి = సమ్మతించి; నిజ = తన యొక్క; కరంబునన్ = చేతితో; అతని = అతని యొక్క; కరంబున్ = చేతిని; పట్టి = పట్టుకొని; నగుచున్ = నవ్వుతు; ఆ = ఆ యొక్క; యాదవేంద్రుండు = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా పలికిన బ్రాహ్మణుడి ద్వారా రుక్మిణి పంపిన సందేశం, ఆమె చక్కదనాలు అవి గ్రహించి, శ్రీకృష్ణుడు అతని చేతులో చేయ్యేసి నవ్వుతూ ఇలా అన్నాడు.

తెభా-10.1-1716-ఉ.
"న్నియమీఁద నా తలఁపు గాఢము; కూరుకురాదు రేయి నా
కెన్నఁడు; నా వివాహము సహింపక రుక్మి దలంచు కీడు నే
మున్నె యెఱుంగుదున్; బరులమూఁక లడంచి కుమారిఁ దెత్తు వి
ద్వన్నుత! మ్రానుఁ ద్రచ్చి నవహ్నిశిఖన్ వడిఁదెచ్చు కైవడిన్.

టీక:- కన్నియ = కన్యక; మీదన్ = పైన; నా = నా యొక్క; తలపు =కోరిక; గాఢము = దృఢముగా నున్నది; కూరుకు = నిద్ర; రాదు = రాదు; రేయి = రాత్రు లందు; నా = నా; కున్ = కు; ఎన్నడున్ = ఎప్పుడు; నా = నా తోడి; వివాహమున్ = పెండ్లిని; సహింపక = ఓర్వజాలక; రుక్మి = రుక్మి; తలంచున్ = తలపెట్టును; కీడు = చెరుపును; నేన్ = నేను; మున్న = ముందుగనే; ఎఱుంగుదున్ = తెలిసియుంటిని; పరుల = శత్రువుల; మూక = సమూహమును; వధించి = చంపి; కుమారిన్ = కన్యకను; తెత్తున్ = తీసుకు వచ్చెదను; విద్వన్ = విద్వాంసులచేత; నుత = పొగడబడువాడ; మ్రానున్ = కఱ్ఱను; త్రచ్చి = మథించి; నవ = కొత్త; వహ్ని = అగ్ని; శిఖన్ = మంటను; వడిన్ = వేగముగా; తెచ్చు = తీసుకు వచ్చెడి; కైవడిన్ = విధముగ.
భావము:- “విద్వాంసుల ప్రసంశలు గైకొన్న బ్రాహ్మణోత్తమా ! రుక్మిణిపై నాకు గాఢానురక్తి గలదు. ఆమెపైన తలపులవలన నాకు నిద్ర రాదు. ఆమెతో నా వివాహము నోర్చని రుక్మి యొక్క దురాలోచనలు నాకు తెలుసు. శత్రుమూకల నణచి , కట్టెను మథించి దీపశిఖను తెచ్చునట్లు ఆమెను నేను తీసుకువస్తాను.

తెభా-10.1-1717-క.
చ్చెద విదర్భభూమికిఁ;
జొచ్చెద భీష్మకుని పురము; సురుచిరలీలన్
దెచ్చెద బాలన్ వ్రేల్మిడి
వ్రచ్చెద నడ్డంబు రిపులు చ్చినఁ బోరన్."

టీక:- వచ్చెదన్ = వస్తాను; విదర్భ = విదర్భ అనెడి; భూమి = దేశమున; కిన్ = కు; చొచ్చెదన్ = చొరబడెదను; భీష్మకునిపురము = కుండిననగరమునందు; సురుచిర = మనోహరమైన; లీలన్ = విధముగ; తెచ్చెదన్ = తీసుకు వచ్చెదను; బాలన్ = బాలికను; వ్రేల్మిడిన్ = చిటికలో; వ్రచ్చెదన్ = చించెదను; అడ్డంబున్ = అడ్డగించుటకు; రిపులు = శత్రువులు; వచ్చినన్ = వచ్చినచో; పోరన్ = యుద్ధమునందు.
భావము:- విదర్భలోని భీష్మకుని కుండినపురానికి వస్తాను. రుక్మిణీబాలను అలవోకగా తీసుకు వస్తాను. అడ్డం వచ్చే శత్రువులను యుద్ధము చేసి చిటికలో చీల్చి చెండాడుతాను.” అని విప్రునితో అంటున్నాడు శ్రీకృష్ణుడు.

తెభా-10.1-1718-వ.
అని పలికి, రుక్మిణీదేవి పెండ్లినక్షత్రంబుఁ దెలిసి, దన పంపున రథసారథి యైన దారకుండు సైబ్య సుగ్రీవ మేఘ పుష్పవలాహకంబు లను తురంగంబులం గట్టి రథమాయత్తంబు చేసి తెచ్చిన నమోఘ మనోరథుండైన హరి తానును, బ్రాహ్మణుండును రథారోహణంబు సేసి యేకరాత్రంబున నానర్తకదేశంబులు గడచి, విదర్భదేశంబునకుఁ జనియె; నందు కుండినపురీశ్వరుండైన భీష్మకుండు కొడుకునకు వశుండై కూఁతు శిశుపాలున కిత్తునని తలంచి, శోభనోద్యోగంబులు చేయించె; నప్పుడు.
టీక:- అని = అని; పలికి = చెప్పి; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి యొక్క; పెండ్లి = వివాహపు; నక్షత్రంబున్ = ముహూర్తమును; తెలిసి = తెలిసికొని; తన = అతని యొక్క; పంపునన్ = ఆజ్ఞ ప్రకారము; రథ = రథమును; సారథి = నడుపువాడు; ఐన = అయిన; దారకుండు = దారకుడు; సైబ్య = సైబ్య; సుగ్రీవ = సుగ్రీవ; మేఘపుష్ప = మేఘపుష్ప; వలాహకంబులు = వలాహకము; అను = అనెడి; తురంగంబులన్ = గుఱ్ఱములను; కట్టి = కట్టి; రథమున్ = రథమును; ఆయత్తంబు = సిద్ధము; చేసి = చేసి; తెచ్చినన్ = తీసుకురాగా; అమోఘ = తిరుగులేని; మనోరథుండు = కోరిక కలవాడు; ఐన = అయిన; హరి = కృష్ణుడు; తానును = అతను; బ్రాహ్మణుండును = విప్రుడు; రథ = రథమును; ఆరోహణంబున్ = ఎక్కుట; చేసి = చేసి; ఏక = ఒకే; రాత్రంబునన్ = రాత్రిలోనే; ఆనర్తకదేశంబులన్ = ఆనర్తకదేశములను {ఆనర్తము – పశ్చిమ సముద్ర తీరమున ద్వారక సమీపమున గల దేశము} గడచి = దాటి; విదర్భదేశంబున్ = విదర్భ అనెడి దేశమున {విదర్భ – ఇప్పటి బీరారు, బీదరు ప్రాంతము}; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అందున్ = అక్కడ; కుండినపుర = కుండిన నగరమునకు; ఈశ్వరుండు = ప్రభువు; ఐన = అయిన; భీష్మకుండు = భీష్మకుడు; కొడుకున్ = పుత్రుని; కున్ = కి; వశుండు = లొంగినవాడు; ఐ = అయ్యి; కూతున్ = కుమార్తెను; శిశుపాలున్ = శిశుపాలుడి; కున్ = కి; ఇత్తున్ = భార్యగా ఇచ్చెదను; అని = అని; తలచి = ఎంచి; శోభన = శుభకార్య; ఉద్యోగంబులు = ప్రయత్నములు; చేయించెన్ = చేయించెను; అప్పుడు = ఆ సమయమునందు.
భావము:- ఇలా చెప్పి, రుక్మిణి పెళ్ళి ముహుర్తం కృష్ణుడు తెలుసు కొన్నాడు. కృష్ణుని ఉత్తర్వు ప్రకారం రథసారథి యైన దారకుడు "సైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము"లనే గుఱ్ఱములు నాలుగింటిని కట్టిన రథం సిద్దం చేసాడు. వాసుదేవుడు బ్రాహ్మణునితోబాటు రథ మెక్కాడు. ఒక్క రాత్రిలోనే ఆనర్తకదేశాలు దాటి కుండినపురం చేరాడు. ఆ సమయములో అక్కడ, కొడుకునకు వశవర్తుడు అయిన భీష్మకుడు కూతుర్ని చైద్యునికి ఇద్దామనుకుంటు పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

తెభా-10.1-1719-సీ.
చ్చలు గ్రంతలు రాజమార్గంబులు-
విపణిదేశంబులు విశదములుగఁ
జేసిరి; చందనసిక్త తోయంబులు-
లయంగఁ జల్లిరి; లువడములు
మణీయ వివిధతోణములుఁ గట్టిరి-
కల గృహంబులు క్కఁ జేసి;
ర్పూర కుంకు మారుధూపములు పెట్టి-
తివలుఁ బురుషులు న్ని యెడల

తెభా-10.1-1719.1-ఆ.
వివిధవస్త్రములను వివిధమాల్యాభర
ణానులేపనముల మరి యుండి
ఖిల వాద్యములు మహాప్రీతి మ్రోయించి
రుత్సవమున నగర మొప్పియుండె.

టీక:- రచ్చలు = రథ్యలు, రథబాటలు; క్రంతలు = చిన్నవీధులు, సందులు; రాజమార్గంబులు = ప్రధానమార్గములు; విపణి = వ్యాపార; దేశంబులున్ = ప్రదేశములు; విశదములుగా = శుభ్రపరచినవిగా; చేసిరి = చేసిరి; చందన = మంచిగంధము; సిక్త = కలిపిన; తోయంబులున్ = నీళ్ళు; కలయన్ = అంతటను, కళ్ళాపి; చల్లిరి = చల్లిరి; కలువడములు = కలువలసరములు {కలువడములు - స్తంభమునకు వేలాడదీసిన కలువపూల దండ}; రమణీయ = అందమైన; వివిధ = నానావిధములైన; తోరణములున్ = తోరణములను; కట్టిరి = కట్టిరి; సకల = ఎల్ల; గృహంబులున్ = గృహములను; చక్కజేసి = బాగుపరచి; కర్పూర = పచ్చకర్పూరము; కుంకుమ = కుంకుమపువ్వు; అగరు = అగరుచెక్కల; ధూపములున్ = పొగధూపములను; పెట్టిరి = పట్టించిరి; అతివలు = ఆడవారు; పురుషులున్ = మగవారు; అన్ని = సర్వ; ఎడలన్ = ప్రదేశములందు.
వివిధ = రకరకముల; వస్త్రములను = బట్టలు; వివిధ = అనేకరకములైన; మాల్య = పూదండలు; ఆభరణ = భూషణములు; అనులేపనములన్ = మైపూతలతో; అమరి = అలంకరించుకొని; ఉండిరి = ఉన్నారు; అఖిల = ఎల్ల; వాద్యములున్ = వాయిద్యములను; మహా = మిక్కిలి; ప్రీతిన్ = ప్రేమతో; మ్రోయించిరి = వాయించిరి; ఉత్సవమునన్ = వేడుకలతో; నగరము = పట్టణము; ఒప్పి = చక్కగానై; ఉండె = ఉండెను.
భావము:- ఆ కుండిన నగర మంతా ఉత్సాహంతో వెలిగిపోతోంది. వీధులు, సందులు, రాజమార్గాలు, బజార్లు అన్ని శుభ్రం చేసారు. మంచి గంధం కలిపిన నీళ్ళు కళ్ళాపి జల్లారు. కలువపూల దండలు మనోహరమైన తోరణాలు కట్టారు. నగరంలోని ఇళ్ళన్ని శుభ్ర పరచారు. సుగంధ ధూపాలు పట్టారు. ప్రతిచోట రకరకాల పూలు, బట్టలు, అలంకారాలు స్త్రీ పురుషులు ధరించారు. ప్రజలు సంతోషంతో మంగళ వాద్యాలు అన్నిటిని గట్టిగా వాయిస్తున్నారు.

తెభా-10.1-1720-వ.
అంత నా భీష్మకుండు విహితప్రకారంబునం బితృదేవతల నర్చించి బ్రాహ్మణులకు భోజనంబులు పెట్టించి, మంగళాశీర్వచనంబులు చదివించి, రుక్మిణీదేవి నభిషిక్తంజేసి వస్త్రయుగళభూషితం గావించి రత్నభూషణంబు లిడంజేసి, ఋగ్యజుస్సామధర్వణ మంత్రంబుల మంగళాచారంబు లొనరించి, భూసురులు రక్షాకరణంబు లాచరించిరి; పురోహితుండు గ్రహశాంతికొఱకు నిగమనిగదితన్యాయంబున హోమంబు గావించె; మఱియు నా రాజు దంపతుల మేలుకొఱకుఁ దిల ధేను కలధౌత కనక చేలాది దానంబులు ధరణీదేవతల కొసంగెను; అయ్యవసరంబున.
టీక:- అంతన్ = అంతట; ఆ = ఆ యొక్క; భీష్మకుండు = భీష్మకుడు; విహిత = పద్దతి; ప్రకారంబునన్ = ప్రకారముగా; పితృదేవతలన్ = పితృ దేవతలను; అర్చించి = పూజించి; బ్రాహ్మణుల్ = విప్రుల; కున్ = కు; భోజనంబులున్ = అన్నములు; పెట్టించి = పెట్టించి; మంగళ = శుభప్రదమైన; ఆశీర్వచనంబులున్ = దీవనల తోడి మంత్రములను; చదివించి = పఠింపజేసి; రుక్మిణీదేవినిన్ = రుక్మిణిని; అభిషిక్తన్ = స్నానమాచరింపబడి నామెగ; చేసి = చేసి; వస్త్ర = వస్త్రముల; యుగళ = జతచేత; భూషితన్ = అలంకరింపబడి నామెగా; కావించి = చేసి; రత్న = రత్నాల; భూషణంబులు = ఆభరణములు; ఇడి = పెట్టి, ధరింపజేసి; ఋక్ = ఋగ్వేద; యజుః = యజుర్వేద; సామ = సామవేద; మంత్రంబులన్ = మంత్రములచేత; మంగళ = శుభ; ఆచారంబులన్ = కార్యములను; ఒనరించి = చేసి; భూసురులు = విప్రులు; రక్షాకరణంబులు = రక్షజేయుటలు; ఆచరించిరి = చేసిరి; పురోహితుండు = ఆస్థాన విప్రుడు; గ్రహశాంతి = నవగ్రహముల శాంతి; కొఱకు = కోసము; నిగమ = వేదములలో; నిగదిత = చెప్పబడిన; న్యాయంబునన్ = ప్రకారముగా; హోమంబు = అగ్నిహోత్రమును; కావించె = నిర్వహించెను; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; రాజు = రాజు; దంపతుల = నవదంపతుల; మేలు = శ్రేయస్సు; కొఱకు = కోసము; తిల = నువ్వులు; ధేను = గోవులు; కలధౌత = రజత (వెండి); కనక = స్వర్ణ (బంగారము); చేలా = వస్త్రములు; ఆది = మున్నగు; దానంబులున్ = దానములను; ధరణీదేవతల్ = బ్రాహ్మణుల; కున్ = కు; ఒసంగెను = ఇచ్చెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.
భావము:- భీష్మకుడు పద్ధతి ప్రకారం పితృదేవతలని పూజించి, విప్రులకి భోజనాలు పెట్టించాడు. ఆశీర్వచనాలు చదివించాడు. రుక్మిణికి స్నానం చేయించి, కొత్తబట్టలు, రత్నాభరణలుతో అలంకరించారు. బ్రాహ్మణులు వేద మంత్రాలతో రక్షాకరణాలు చేసారు. పురోహితుడు వేదాల్లో చెప్పిన విధంగా హోమం చేసాడు. దంపతులకు శుభం కోసం విప్రులకు తిలా, గో, రజత, స్వర్ణ, వస్త్రాది దానాలు చేసాడు. అప్పుడు.
మన సంప్రదాయాలను ఎంతో అలవోకగా వర్ణించిన చక్కటి వచనం యిది. ఏదైనా శుభకార్యం ఆరంభించే సమయంలో, పెద్దలను సన్మానించాలి, విప్రులను తృప్తిపరచాలి, వారి ఆశీర్వచనాలు తీసుకోవాలి, అభ్యంగన స్నానాలు చేయాలి, శుభ్రమైన వస్త్రాలు, సకల శోభనకర అలంకారలు అలంకరించుకోవాలి, శాంతులు పూజలు దానాలు చేయాలి. ఈ సత్సంప్రదాయాలు ఎన్నో శతాబ్దాలనుండి ఆచరణలో ఉన్నాయి. సంకల్ప బల, పారిశుధ్య విలువలతో కూడిన మన సదాచారాలు కాలపరీక్షకు తట్టుకొని నిలబడ్డాయి. కనుక వాటిని వదలరాదు.

తెభా-10.1-1721-మ.
సంఘంబులతో రథావళులతో ద్రేభయూథంబుతోఁ
టువేగాన్విత ఘోటకవ్రజముతో బంధుప్రియశ్రేణితోఁ
టుసంరంభముతో విదర్భతనయం గైకొందు నంచున్ విశం
వృత్తిం జనుదెంచెఁ జైద్యుఁడు గడున్ ర్వించి య వ్వీటికిన్.

టీక:- భటసంఘంబుల్ = పదాతిదళముల; తోన్ = తోటి; రథా = రథముల; ఆవళుల్ = దళముల; తోన్ = తోటి; భద్ర = భద్రజాతి {భద్రము - శుభకార్యములందు పురప్రచార యోగ్యమైనది ఈ జాతి ఏనుగు}; ఇభ = గజ {త్రివిధగజజాతులు - 1భద్రము 2మందము 3మృగము}; యూథంబు = దళముల; తోన్ = తోటి; పటు = మిక్కుటమైన; వేగ = వేగముగా పోవుట; ఆన్విత = కలిగిన; ఘోటక = అశ్వ; వ్రజము = దళముల; తోన్ = తోటి; బంధు = బంధువుల; ప్రియ = ఇష్టుల; శ్రేణి = సమూహముల; తోన్ = తోటి; కటు = అధికమైన; సంరంభము = ఆటోపము; తోన్ = తోటి; విదర్భతనయన్ = రుక్మిణిని {విదర్భతనయ - విదర్భరాజు కుమార్తె, రుక్మిణి}; కైకొందున్ = చేపట్టెదను; అంచున్ = అని; విశంకటవృత్తిన్ = గొప్పగా; చనుదెంచెన్ = వచ్చెను; చైద్యుడు = శిశుపాలుడు; కడున్ = మిక్కిలి; గర్వించి = అహంకరించి; ఆ = ఆ యొక్క; వీటి = ఊరున, కుండినగరమున; కిన్ = కు.
భావము:- విదర్భ రాకుమారి రుక్మిణిని పెళ్ళాడతానంటు శిశుపాలుడు ఎంతో గర్వంగా చతురంగ బలాలతో, ఎందరో కాల్బంటులుతో, రథాల వరుసలుతో, భద్రగజాల సమూహంతో, మిక్కిలి వేగవంతమైన గుఱ్ఱాల సైన్యంతో, బంధువులతో, చెలికాళ్ళతో గొప్ప అట్టహాసంగా ఆ కుండిన నగరానికి వచ్చాడు.

తెభా-10.1-1722-ఉ.
"బంధులఁ గూడి కృష్ణబలద్రులు వచ్చినఁ బాఱదోలి ని
ర్మంర వృత్తిఁ జైద్యునికి మానినిఁ గూర్చెద"మంచు నుల్లస
త్సింధుర వీర రథ్య రథ సేనలతోఁ జనుదెంచి రా జరా
సంధుఁడు దంతవక్త్రుఁడును సాల్వ విదూరక పౌండ్రకాదులున్.

టీక:- బంధులన్ = బంధువులతో; కూడి = కలిసి; కృష్ణ = కృష్ణుడు; బలభద్రులున్ = బలరాములు; వచ్చినన్ = వచ్చినచో; పాఱదోలి = తరిమి వేసి; నిర్మంథర = త్వరగా పోవు {నిర్మంథరము - మంథరము (మెల్లగా సాగుట) లేకుండునది}; వృత్తిన్ = విధానములో; చైద్యున్ = శిశుపాలుని; కున్ = కి; మానిని = వనితను; కూర్చెదము = కలిపెదము; అంచున్ = అని; ఉల్లసత్ = ఉత్సహించుచున్న; సింధుర = ఏనుగుల; వీర = శూరులైన భటుల; రథ్య = అశ్వ; రథ = రథ; సేనల = సైనికదండు; తోన్ = తోటి; చనుదెంచిరి = వచ్చిరి; ఆ = ఆ యొక్క; జరాసంధుడు = జరాసంధుడు; దంతవక్త్రుడును = దంతవక్త్రుడు; సాల్వ = సాల్వుడు {సాల్వుడు - సాల్వదేశాధీశుడు}; విదూరక = విదూరకుడు; పౌండ్రక = పౌండ్రకవాసుదేవుడు; ఆదులున్ = మొదలగువారు.
భావము:- జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, విదూరకుడు, పౌండ్రకుడు మొదలైన వాళ్ళంతా “బలరామ కృష్ణులు బంధువు లందరను తోడు తెచ్చుకొని వచ్చినా సరే తరిమేస్తాం. శిశిపాలుడికి బాలికను ఇచ్చి ఏ ఇబ్బంది లేకుండా కట్ట బెడతాం.” అంటూ చతురంగబలాలతో వచ్చారు.

తెభా-10.1-1723-వ.
మఱియు నానాదేశంబుల రాజు లనేకు లేతెంచి; రందు శిశుపాలు నెదుర్కొని పూజించి భీష్మకుం డొక్కనివేశంబున నతని విడియించె; నంతఁ దద్వృత్తాంతంబు విని.
టీక:- మఱియున్ = ఇంకను; నానా = పెక్కు; దేశంబుల = దేశములకు చెందిన; రాజులు = ఏలికలు; అనేకులు = అనేకమంది; ఏతెంచిరి = వచ్చిరి; అందున్ = వారిలో; శిశుపాలున్ = శిశుపాలుని; ఎదుర్కొని = ఎదురువెళ్ళి; పూజించి = గౌరవించి; భీష్మకుండు = భీష్మకుడు; ఒక్క = ఒకానొక; నివేశంబునన్ = నివాసమునందు; అతనిన్ = అతనిని; విడియించెన్ = విడిదిలో ఉంచెను; అంతన్ = తరువాత; తత్ = ఆ యొక్క; వృత్తాంతంబు = విషయము; విని = విని.
భావము:- ఇంకా వివిధదేశాలనుండి అనేకమంది రాజులు వచ్చారు. భీష్మకుడు వారిలో శిశుపాలుడికి ఎదుర్కోలు మొదలైన మర్యాదలు చేసి తగిన విడిది ఏర్పాటు చేసాడు. ఈ విషయాలు తెలిసి.

తెభా-10.1-1724-చ.
"రి యొకఁ డేగినాఁడు మగధాదులు చైద్యహితానుసారులై
పతు లెందఱేనిఁ జనినారు కుమారికఁ దెచ్చుచోట సం
మగుఁ దోడు గావలయుఁ గంసవిరోధికి"నంచు వేగఁ దా
రిగె హలాయుధుండు గమలాక్షుని జాడ ననేక సేనతోన్.

టీక:- హరి = కృష్ణుడు; ఒకడు = ఒక్కడే; ఏగినాడు = వెళ్ళాడు; మగధ = జరాసంధుడు; ఆదులున్ = మున్నగువారు; చైద్య = శిశుపాలునికి; హితానుసారులు = మేలుకోరువారు; ఐ = అయ్యి; నరపతులు = రాజులు; ఎందఱేని = ఎంతోమంది; చనినారు = వెళ్ళిరి; కుమారికన్ = కన్యకను; తెచ్చుచోటన్ = తీసుకువచ్చే టప్పుడు; సంగరము = యుద్ధము; అగున్ = జరుగును; తోడు = సహాయము; కావలయున్ = అవసర మగును; కంసవిరోధి = కృష్ణుని; కిన్ = కి; అంచున్ = అని; వేగన్ = వేగముగా; తాన్ = అతను; అరిగెన్ = వెళ్ళెను; హలాయుధుండు = బలరాముడు {హలాయుధుడు - హల (నాగలి) ఆయుధము కలవాడు, బలరాముడు}; కమలాక్షుని = పద్మాక్షుని, కృష్ణుని; జాడన్ = దారిని, వెనుకనే; అనేక = పెక్కు; సేన = సేనల; తోన్ = తోటి.
భావము:- బలరాముడు “అయ్యో! కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడు జరాసంధుడు మున్నగువారు శిశుపాలునికి సాయంగా వెళ్ళారు; బాలికను తెచ్చేటప్పుడు యుద్ధం తప్పదు; కృష్ణుడికి సాయం అవసరం” అంటూ బలరాముడు కృష్ణుడు వెళ్ళిన దారి వెనుక సైన్యం తీసుకొని వెళ్ళాడు.

తెభా-10.1-1725-క.
లోపల నేకతమున
నాలోలవిశాలనయన గు రుక్మిణి ద
న్నా లోకలోచనుఁడు హరి
యాలోకము చేసి కదియఁ ని శంకితయై.

టీక:- ఆలోపలన్ = ఆ సమయమునందు; ఏకతమునన్ = ఏకాంతముగ; ఆలోల = చలించెడి; విశాల = పెద్దపెద్ద; నయన = కనులు గలామె; అగు = ఐన; రుక్మిణి = రుక్మిణీదేవి {రుక్మిణి - రుక్మము (బంగారము) కలిగినామె}; తన్నున్ = ఆమెను; ఆ = ఆ ప్రసిద్ధుడైన; లోకలోచనుడు = కృష్ణుడు {లోకలోచనుడు - లోకప్రకాశకులైన సూర్య చంద్రులు కన్నులుగా కలవాడు, విష్ణువు}; హరి = కృష్ణుడు; ఆలోకము = చూసి; కదియడు = సమీపించడు; అని = అని; శంకిత = సంశయము కలది; ఐ = అయ్యి.
భావము:- ఇంతట్లో చలించుతున్న పెద్ద పెద్ద కళ్ళున్న ఆ రుక్మిణీదేవి తనలోతాను తన ఏకాంతమందిరంలో “సూర్యచంద్రులు కన్నులుగా ఉండుట వల్ల లోకాలకు చూసే శక్తిని ఇచ్చేవాడైన కృష్ణుడు ఏకారణంచేతనైనా తన మీద దృష్టిపెట్టి తనను చేరరాడేమో” నని బెంగపెట్టుకుంది. ఇంకా ఇలా అనుకోసాగింది . . .

తెభా-10.1-1726-శా.
"గ్నం బెల్లి; వివాహముం గదిసె, నేలా రాఁడు గోవిందుఁ? డు
ద్విగ్నం బయ్యెడి మానసంబు; వినెనో వృత్తాంతమున్? బ్రాహ్మణుం
గ్నిద్యోతనుఁ డేటికిం దడసె? నా త్నంబు సిద్ధించునో?
గ్నంబై చనునో? విరించికృత మెబ్భంగిన్ బ్రవర్తించునో?

టీక:- లగ్నంబున్ = ముహూర్తము; ఎల్లి = రేపు; వివాహమున్ = పెండ్లిసమయము; కదిసెన్ = దగ్గరైనది; ఏలా = ఎందుకు; రాడు = రాలేదు; గోవిందుడు = కృష్ణుడు {గోవిందుడు - గోవులకు ఒడయుడు, కృష్ణుడు}; ఉద్విగ్నంబు = కలవరపడినది; అయ్యెడిన్ = అగుచున్నది; మానసంబున్ = మనస్సు; వినెనో = విన్నాడో లేదో; వృత్తాంతమున్ = సమాచారమును; బ్రాహ్మణుండు = విప్రుడు; అగ్నిద్యోతనుడు = అగ్నిద్యోతనుడు; ఏటికి = ఎందుచేత; తడసెన్ = ఆలస్యము చేసెను; నా = నా యొక్క; యత్నంబున్ = ప్రయత్నము; సిద్ధించునో = ఫలించునో లేదో; భగ్నంబై = చెడిపోయినది; ఐచనునో = అయిపోవునేమో; విరించి = బ్రహ్మదేవుని {విరించి - వివరముగా రచించువాడు, బ్రహ్మ}; కృతము = వ్రాసిపెట్టినది; ఎబ్భంగి = ఏ విధముగ; ప్రవర్తించునో = నడచునో.
భావము:- “నా మనసు ఉద్విగ్నంగా ఉంది. లగ్నం రేపే. ముహూర్తము దగ్గరకు వచ్చేసింది. వాసుదేవుడు ఇంకా రాలేదు ఎందుకో? నా మాట విన్నాడో లేదో? బ్రాహ్మణుడు అగ్నిద్యోతనుడు ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు? నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో? బ్రహ్మదేవుడు ఏం రాసిపెట్టాడో? – (అంటు రుక్మిణి డోలాయమాన మనసుతో సందేహిస్తోంది.)

తెభా-10.1-1727-మ.
ను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో?
విని, కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం
నుకూలింపఁ దలంచునో తలఁపడో? యార్యామహాదేవియున్
ను రక్షింప నెఱుంగునో? యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?"

టీక:- ఘనుడు = గొప్పవాడు; ఆ = ఆ యొక్క; భూసురుడు = విప్రుడు; ఏగెనో = వెళ్ళాడో లేదో; నడుమన్ = మధ్యలో; మార్గ = ప్రయాణపు; శ్రాంతుడు = బడలిక చెందినవాడు; ఐ = అయ్యి; చిక్కెనో = చిక్కుబడిపోయెనేమో; విని = విన్నవాడై; కృష్ణుండు = కృష్ణుడు; అది = దానిని; తప్పు = తప్పు; కాన్ = అయినట్లు; తలచెనో = భావించెనేమో; విచ్చేసెనో = వచ్చెనేమో; ఈశ్వరుండు = భగవంతుడు; అనుకూలింపన్ = అనుకూలించవలెనని; తలంచునో = ఎంచునో; తలపడో = ఎంచకుండునో; ఆర్యామహాదేవియున్ = పార్వతీదేవి {ఆర్య - శ్రేష్ఠురాలు, పార్వతి, మహాదేవి - పార్వతి}; ననున్ = నన్ను; రక్షింపన్ = కాపాడవలెనని; ఎఱుంగునో = గుర్తించినదో; ఎఱుగదో = గుర్తించలేదో; నా = నా యొక్క; భాగ్యము = అదృష్టము; ఎట్లున్నదో = ఎలా ఉందో.
భావము:- ఆ బ్రాహ్మణుడు అసలు వెళ్ళాడో లేదో? లేకపోతే దారిలో ఎక్కడైనా చిక్కుకు పోయాడేమో? నా సందేశం విని కృష్ణుడు తప్పుగా అనుకున్నాడేమో? పార్వతీదేవి నన్ను కాపాడలనుకుందో లేదో? నా అదృష్టమెలా ఉందో?”
అంటు ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్రాహ్మణుని పంపిన రుక్మిణీదేవి, డోలాయమాన స్థితి పొందుతోంది. ఆ స్థితికి తగ్గ ఈ పద్యం చెప్పిన మన పోతన్నకి ప్రణామములు.

తెభా-10.1-1728-వ.
అని వితర్కించుచు.
టీక:- అని = అని; వితర్కించుచున్ = తనలోతాను అనుకొనుచు.
భావము:- అంటు రుక్మిణి డోలాయమాన మనసుతో సందేహిస్తూ ఇంకా ఇలా అనుకోసాగింది.

తెభా-10.1-1729-ఉ.
"పోఁ"ను "బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి; వాసుదేవుఁడున్
"రాఁ" ను;"నింకఁ బోయి హరి మ్మని చీరెడి యిష్టబంధుడున్
"లేఁ" ను;"రుక్మికిం దగవు లే, దిటఁ జైద్యున కిత్తు నంచు ను
న్నాఁ" ను;"గౌరి కీశ్వరికి నావలనం గృపలేదు నే"డనున్.

టీక:- పోడు = వెళ్ళి ఉండడు; అనున్ = అనును; బ్రాహ్మణుండు = విప్రుడు; యదుపుంగవు = కృష్ణుని {యదుపుంగవుడు - యాదవ వంశస్థులలో శ్రేష్ఠుడు, కృష్ణుడు}; వీటి = నగరమున; కిన్ = కు; వాసుదేవుడున్ = కృష్ణుడు {వాసుదేవుడు - వసుదేవుని కొడుకు, కృష్ణుడు}; రాడు = వచ్చుటలేదు; ఇంకన్ = ఇంకను; పోయి = వెళ్ళి; హరిన్ = కృష్ణుని; రమ్ము = రావలసినది; అని = అని; చీరెడు = పిలిచెడు; ఇష్ట = ఆప్తుడైన; బంధుడున్ = మేలుకోరువాడు; లేడు = ఎవడు లేడు; అనున్ = అనును; రుక్మి = రుక్మి {రుక్మి - రుక్మిణి పెద్దన్న}; కిన్ = కి; తగవు = న్యాయము; లేదు = లేదు; ఇటనే = ఇక్కడ; చైద్యున్ = శిశుపాలుని; కిన్ = కి; ఇత్తున్ = ఇస్తాను; అంచున్ = అనుచు; ఉన్నాడు = ఎంచి ఉన్నాడు; అనున్ = అనును; గౌరి = పార్వతీదేవి {గౌరి - గౌరవర్ణము కలామె, పార్వతి}; కిన్ = కి; ఈశ్వరి = పరమేశ్వరి; కిన్ = కి; నా = నా; వలనన్ = ఎడల; కృప = దయ; లేదు = లేదు; నేడు = ఇవాళ; అనున్ = అనును.
భావము:- “మాధవుని మథురకి బ్రాహ్మణుడు అసలు వెళ్ళే వెళ్ళి ఉండడు. వాసుదేవుడు ఇంక రాడు. పిలుచుకు వచ్చే ప్రియ బాంధవుడు ఇంకొకడు లేడు. అన్న రుక్మికి అడ్డేం లేదు. శిశుపాలుడికి ఇచ్చేస్తానంటున్నాడు. ఇవాళ పార్వతీదేవికి నామీద దయలేదు కాబోలు” అని రకరకాలుగా మథనపడుతోంది.

తెభా-10.1-1730-ఉ.
చెప్పదు తల్లికిం దలఁపు చిక్కు; దిశల్ దరహాస చంద్రికం
ప్పదు; వక్త్రతామరసగంధ సమాగత భృంగసంఘమున్
రొప్పదు; నిద్ర గైకొన; దురోజ పరస్పర సక్త హారముల్
విప్పదు; కృష్ణమార్గగత వీక్షణపంక్తులు ద్రిప్ప దెప్పుడున్.

టీక:- చెప్పదు = తెలుపదు; తల్లి = తల్లి; కిన్ = కి; తలపుచిక్కు = మనసులోని విచారమును; దిశల్ = దిక్కు లందు; దరహాస = చిరునవ్వుల; చంద్రికం = వెన్నెలను; కప్పదు = ఆవరింపజేయదు; వక్త్ర = ముఖము అనెడి; తామరస = పద్మము యొక్క; గంధ = సువాసనచే; సమాగత = చేరిన; భృంగ = తుమ్మెదల; సంఘమున్ = సమూహమును; రొప్పదు = అదిలించదు; నిద్రన్ = నిద్రపోవుట; కైకొనదు = చేయదు; ఉరోజ = వక్షస్థలమునందు; పరస్పర = ఒకదానితో నొకటి; సక్త = చిక్కుకొన్న; హారముల్ = దండలను; విప్పదు = విడదీసుకొనదు; కృష్ణ = కృష్ణుని; మార్గ = వచ్చుదారి యందు; గత = లగ్నమైన; వీక్షణ = చూపుల; పంక్తులున్ = వరుసలను; త్రిప్పెదు = మరలింపదు; ఎప్పుడున్ = క్షణకాలమైన.
భావము:- రుక్మిణీ దేవి, ముకుందుని రాకకై ఆతృతగా ఎదురు చూస్తూ అటునుండి చూపులు తిప్పడం లేదు. తన మనసు లోని వేదనలు తల్లికి కూడ చెప్పటం లేదు. చిరునవ్వులు చిందించటం లేదు. ముఖపద్మానికి మూగిన తుమ్మెదలని తోలటం లేదు. వక్షస్థలం మీది గొలుసుల చిక్కులను విడదీయటం లేదు.

తెభా-10.1-1731-చ.
తుడువదు కన్నులన్ వెడలు తోయకణంబులు; కొప్పు చక్కఁగా
ముడువదు; నెచ్చెలిం గదిసి ముచ్చటకుం జన; దన్న మేమియుం
గుడువదు; నీరముం గొనదు; కూరిమిఁ గీరముఁ జేరి పద్యముం
నొడువదు; వల్లకీగుణవినోదము సేయదు; డాయ దన్యులన్.

టీక:- తుడువదు = తుడుచుకొనదు; కన్నులన్ = కళ్ళమ్మట; వెడలు = కారెడి; తోయకణంబులున్ = నీటిబిందువులను; కొప్పు = జుట్టుముడిని; చక్కగా = సరిగా; ముడువదు = చుట్టుకొనదు; నెచ్చెలిన్ = స్నేహితురాలిని; కదిసి = చేరి; ముచ్చట = కబుర్లు ఆడుట; కున్ = కు; చనదు = వెళ్ళదు; అన్నము = భోజనము; ఏమియున్ = ఏ కొంచెము కూడ; కుడువదు = తినదు; నీరమున్ = నీళ్ళైనా; కొనదు = తాగదు; కూరిమిన్ = ప్రీతితో; కీరమున్ = చిలుకను; చేరి = వద్దకు వెళ్ళి; పద్యమున్ = పద్యములను; నొడువదు = చెప్పదు; వల్లకీ = వీణ యొక్క; గుణ = తీగలను మీటెడి; వినోదమున్ = వేడుకలు; చేయదు = చేయదు; డాయదు = సమీపించదు; అన్యులన్ = ఇతరులను.
భావము:- తనను తీసుకుపోవడానికి శ్రీకృష్ణుడు వస్తున్నాడో లేదో అని మథనపడుతున్న రుక్మిణీదేవి, కన్నీరు తుడుచుకోటం లేదు. జుట్టు సరిగా ముడవటం లేదు. నెచ్చెలులతో ముచ్చటలు చెప్పటం లేదు. అన్నపానీయాలు తీసుకోవటం లేదు. ఇష్టమైన చిలుకకి పద్యాలు చెప్పటం లేదు. వీణ వాయించటం లేదు. ఎవ్వరి దగ్గరకు పోటం లేదు.
రుక్మిణి ఇంత గాఢంగా కృష్ణుని ప్రేమిస్తోంది కనుకనే తనను తీసుకు వెళ్ళి రాక్షస వివాహం చేసుకో మని సందేశం పంపించింది. అష్టవిధ వివాహాలలో రాక్షసం ఒకటి. దీనిలో ఉన్న రాక్షసం కన్య పెద్దల అంగీకారంతో సంబంధంలేకుండా, అంగీకరించిన కన్యను ఎత్తుకు వచ్చి వివాహమాడుట వరకు. కన్య అంగీకారంతో కూడ సంబంధలేకుండా చేసేది పైశాచికం.

తెభా-10.1-1732-సీ.
మృగనాభి యలఁదదు మృగరాజమధ్యమ-
లకము లాడదు లజగంధి;
ముకురంబుఁ జూడదు ముకురసన్నిభముఖి-
పువ్వులు దుఱుమదు పువ్వుఁబోఁడి;
నకేళిఁ గోరదు నజాతలోచన-
హంసంబుఁ బెంపదు హంసగమన;
తలఁ బోషింపదు తికా లలిత దేహ-
తొడవులు తొడువదు తొడవు తొడవు;

తెభా-10.1-1732.1-ఆ.
తిలకమిడదు నుదుటఁ దిలకినీతిలకంబు;
మలగృహముఁ జొరదు మలహస్త;
గారవించి తన్నుఁ రుణఁ గైకొన వన
మాలి రాఁడు తగవుమాలి"యనుచు.

టీక:- మృగనాభి = కస్తూరి; అలదదు = రాసుకొనదు; మృగరాజ = సింహమువంటి; మధ్యమ = నడుము కలామె; జలకములాడదు = స్నానము చేయదు; జలజ = పద్మములవంటి; గంధి = సువాసన కలామె; ముకురంబున్ = అద్దములో; చూడదు = చూసుకొనదు; ముకుర = అద్దము; సన్నిభ = లాంటి; ముఖి = మోము కలామె; పువ్వులున్ = పూలను; తుఱుమదు = తలలోపెట్టుకోదు; పువ్వు = పూలవంటి; పోడి = దేహము కలామె; వన = వనములలో; కేళిన్ = విహారములను; కోరదు = ఇష్టపడదు; వనజాత = పద్మము వంటి; లోచన = కన్నులు కలామె; హంసంబున్ = హంసలను; పెంపదు = సాకదు; హంస = హంసవంటి; గమన = నడక కలామె; లతలన్ = తీగలను; పోషింపదు = పెంచదు; లతికా = తీగవలె; లలిత = మనోజ్ఞమైన; దేహ = దేహము కలామె; తొడవులు = ఆభరణములను; తొడువదు = తొడుగుకొనదు, ధరించదు; తొడవు = భూషణములకే; తొడవు = భూషణప్రాయమైనామె.
తిలకము = తిలకముబొట్టు; ఇడదు = పెట్టుకొనదు; నుదుటన్ = నుదురుమీద; తిలకినీ = స్త్రీలలో {తిలకిని - తిలకము ధరించునామె, స్త్రీ}; తిలకంబు = ఉత్తమురాలు; కమలగృహమున్ = చెరువులందు {కమలగృహము - పద్మములకు నిలయము, సరస్సు}; చొరదు = ప్రవేశింపదు; కమల = పద్మరేఖ; హస్త = చేతిలో కలామె; గారవించి = మన్నించి; తన్నున్ = ఆమెను; కరుణన్ = దయతోటి; కైకొనన్ = చేపట్టుటకు; వనమాలి = కృష్ణుడు {వనమాలి - వనమాల ధరించువాడు, కృష్ణుడు}; రాడు = వచ్చుటలేదు; తగవు = న్యాయము; మాలి = లేనివాడై; అనుచున్ = అని.
భావము:- అన్యాయంగా కృష్ణుడు తనను ప్రేమతో కరుణించ డానికి రావటం లేదు అన్న తలపుల పరధ్యాన్నంలో పడి, ఆ సింహపు నడుము చిన్నది కస్తూరి రాసుకోడం లేదట. పద్మగంధం లాంటి మేని సువాసనలు గల పద్మగంధి జలకా లాడటం లేదట. అద్దం లాంటి మోముగల సుందరి అద్దం చూట్టం లేదట. పువ్వులాంటి సుకుమారి పువ్వులే ముడవటం లేదట. పద్మాల్లాంటి కళ్ళున్న పద్మాక్షి జలక్రీడకి వెళ్ళటం లేదట. హంస నడకల చిన్నది హంసలను చూట్టం లేదట. లత లాంటి మనోజ్ఞమైన కోమలి లతలని చూట్టం లేదుట. అలంకారాలకే అలంకారమైన అందగత్తె అలంకారాలు చేసుకోవటం లేదుట. చక్కటిచుక్క లాంటి వనితాశిరోమణి బొట్టు పెట్టుకోటం లేదట. కమలాల లాంటి చేతులున్న సుందరి సరోవరాలలోకి దిగటం లేదట.

తెభా-10.1-1733-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంతేకాకుండా.
భావము:- ఇంతేకాకుండా.

తెభా-10.1-1734-మ.
లఁగున్ మెల్లని గాలికిం; బటునటన్మత్త ద్విరేఫాలికిం
లఁగుం; గోయల మ్రోఁతకై యలఁగు; నుద్యత్కీరసంభాషలం
లఁగున్; వెన్నెలఁవేడిమి న్నలఁగు; మాకందాంకురచ్ఛాయకుం
దొలఁగుం; గొమ్మ మనోభవానలశిఖా దోధూయ మానాంగియై.

టీక:- మలగున్ = చలించును; మెల్లని = మెల్లగా వీచెడి; గాలి = గాలి; కిన్ = కి; పటు = మిక్కిలి; నటత్ = చరించుచున్న; మత్త = మత్తుగొన్న; ద్విరేఫా = తుమ్మెదల {ద్విరేఫము - తన పేరైన భ్రమరమునందు రెండు రేఫలు (రకారలు) కలది, రేఫ (రకారము) వంటి రెక్కలు రెండు కలది, తుమ్మెద}; ఆళి = సమూహమున; కిన్ = కు; తలగున్ = తప్పుకొనును; కోయిల = కోకిల; మ్రోత = కూతల; కై = వలన; అలగున్ = చిరాకుపడును; ఉద్యత్ = పుట్టుచున్న; కీర = చిలుకల; సంభాషలం = పలుకులకు; కలగున్ = కలతపడును; వెన్నెల = వెన్నెల యొక్క; వేడిమిన్ = తాపమునకు; నలగున్ = బడలికచెందును; మాకంద = తియ్యమామిడి; అంకుర = చిగుర్ల; ఛాయకున్ = నీడకు; తొలగున్ = తప్పించుకొనిపోవును; కొమ్మ = ఇంతి; మనోభవ = మన్మథ {మనోభవ - మనసునందు పట్టువాడు, మన్మథుడు}; అనల = అగ్ని యొక్క; శిఖా = మంటలచేత; దోధూయమాన = చలింపజేయబడిన; అంగి = దేహము కలామె; ఐ = అయ్యి.
భావము:- మన్మథతాపాగ్నిలో వేగిపోతున్న మగువ పిల్లగాలికి అలసి పోతుంది. దోగాడే తుమ్మెదలకి తొలగిపోతుంది. కోయిల కూసినా చిరాకు పడుతుంది. చక్కటి చిలక పలుకులకి ఉలికి పడుతుంది. వెన్నెల వేడికి వేగిపోతుంది. మామిడి చెట్టు నీడకి తప్పుకుంటుంది.