పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/వసుదేవ నందుల సంభాషణ
తెభా-10.1-206-క.
నీ కాంతయొద్ద నీవును
నీ కాంతయు గారవింప, నినుఁ దండ్రిగ నా
లోకించుచు నీ మందను
నా కొడు కున్నాఁడె? నంద! నందాన్వితుఁడై."
టీక:- నీ = నీ యొక్క; కాంత = భార్య; ఒద్దన్ = దగ్గర; నీవునున్ = నువ్వు; నీ = నీ యొక్క; కాంతయున్ = భార్య; గారవింపన్ = గారాబము చేయుచుండగ; నినున్ = నిన్ను; తండ్రిగన్ = కన్నతండ్రిగా; ఆలోకించుచున్ = భావించుచు; నీ = నీ యొక్క; మందను = పల్లె యందు; నా = నా యొక్క; కొడుకున్ = పుత్రుడు; ఉన్నాడె = పెరుగుతున్నాడా; నంద = నందుడా; నంద = ఆనందముతో; ఆన్వితుడు = కూడినవాడు; ఐ = అయ్యి.
భావము:- నందా! నీవూ నీభార్య ప్రేమగా చూస్తూ ఉంటే యశోదవద్ద నాకొడుకు ఆనందంగా ఉన్నాడా? నిన్ను తండ్రిగా చూస్తూ నీ ప్రేమలు అందుకుంటూ వ్రేపల్లెలో క్షేమంగా ఉన్నాడు కదా!”
తెభా-10.1-207-వ.
అనిన నందుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; నందుండు = నందుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా అడిగిన వసుదేవుడుతో నందుడు ఇలా అన్నాడు
తెభా-10.1-208-శా.
"నీకున్ దేవకికిన్ జనించిన సుతానీకంబుఁ దోడ్తోడ ము
న్నీకంసుండు వధించె; మీ సుతఁ దుదిన్ హింసింపఁ, జే తప్పి, తా
నాకాశంబున కేగె; బాల యిది; దైవాధీనమాపద్దశన్
శోకంబందునె తజ్ఞుఁ; డూఱడిలు! నా సూనుండు నీ సూనుఁడే."
టీక:- నీ = నీ; కున్ = కు; దేవకి = దేవకీదేవి; కిన్ = కి; జనించిన = పుట్టినట్టి; సుతా = పుత్రులను; అనీకంబున్ = అందరను; తోడ్తోడన్ = వరుసగా; మున్ను = ఇంతకు ముందే; ఈ = ఈ; కంసుండు = కంసుడు; వధించెన్ = చంపివేసెను; మీ = మీ యొక్క; సుతన్ = పుత్రికను; ; తుదన్ = చివరకు; హింసింపన్ = చంపబోగా; చేన్ = చేతులోనుండి; తప్పి = తప్పించుకొని; తాన్ = ఆమె; ఆకాశంబున్ = ఆకాశమున; కున్ = కు; ఏగెన్ = ఎగిరిపోయెను; బాల = చిన్నపిల్ల; ఇది = ఇట్టి స్థితి; దైవాధీనమున్ = విధివశాత్తు జరిగినది; ఆపత్ = ఆపదలు కలిగెడి; దశన్ = కాలము నందు; శోకంబున్ = దుఃఖమును; అందునె = పొందునా, పొందడు; తజ్ఞుడు = వివేకి; ఊరడిలు = ఊరుకొనుము; నా = నా యొక్క; సూనుండు = పుత్రుడు; నీ = నీకును; సూనుడే = పుత్రుడే.
భావము:- “వసుదేవా! నీకూ దేవకీదేవికి పుట్టిన కొడుకులు అందరినీ పుట్టిన వెంటనే ఆ కంసుడు వధించాడు. పాపం చివరికి మీ కూతురిని కూడా హింసించబోతే ఆపాప ఆకాశానికి ఎగిరిపోయింది. మొత్తంమీద నీకు బిడ్డలు లేకుండా పోయారు. జగత్తు అంతా దైవాధీనంకదా. ఈసంగతి తెలిసినవాడు ఆపదలు వచ్చినప్పుడు దుఃఖపడతాడా. కనుక ఊరడిల్లుము నా కొడుకే నీ కొడుకు అనుకో.”
తెభా-10.1-209-వ.
అనిన వసుదేవుండు నందునికి మఱియు నిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; వసుదేవుండు = వసుదేవుడు; నందున్ = నందుని; కిన్ = కి; మఱియున్ = ఇంకా; ఇట్లు = ఈ విధముగ; అనియె = చెప్పెను.
భావము:- అలా అన్న నందుడితో వసుదేవుడు ఇలా అన్నాడు.
తెభా-10.1-210-క.
"జనపతి కరి యిడితివి; మముఁ
గనుఁగొంటివి; మేము నిన్నుఁ గంటిమి; మే ల
య్యెను; బొమ్మింకను గోకుల
మున నుత్పాతములు దోఁచు మునుకొనవలయున్. "
టీక:- జనపతి = రాజున; కిన్ = కు; అరి = కప్పము; ఇడితివి = కట్టితివి; మమున్ = మమ్ములను; కనుగొంటివి = చూచితివి; మేమున్ = మేముకూడ; నిన్నున్ = నిన్ను; కంటిమి = చూచితిమి; మేలు = బాగుగనే; అయ్యెన్ = జరిగినది; పొమ్ము = వెళ్ళిపొమ్ము; ఇంకను = వెంటనే; గోకులమునన్ = మంద యందు; ఉత్పాతములన్ = ఆపదలు తోపించుట; తోచున్ = కనబడుచున్నది; మునుకొనవలయున్ = ఎదుర్కొనవలెను.
భావము:- “కంసుడికి పన్నులు చెల్లించావు; మమ్మల్ని చూడటానికి వచ్చావు; మేమూ నిన్ను చూసాము; మంచిది. గోకులంలో ఉత్పాతాలు సంభవించే సూచనలు ఉన్నాయి. ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే బయలుదేరు.”
తెభా-10.1-211-వ.
అని పలికి వసుదేవుండు నందాదులైన వల్లవుల వీడ్కొలిపిన వారలు గొబ్బున వడిగల గిబ్బలం బూనిన శకటంబులు ప్రకటంబులుగ నెక్కి, తమతమ పల్లెల త్రోవలుపట్టి చని; రా నందుండు ప్రతీతంబులైన యుత్పాతంబులు ముందరఁ బొడగని "శౌరి తనతోఁ బలికిన పలుకులు తప్ప"వనుచుఁ దలంచుచుం జనియె; నంత.
టీక:- అని = అని; పలికి = హెచ్చరించి; వసుదేవుండు = వసుదేవుడు; నంద = నందుడు; ఆదులైన = మొదలైన; వల్లవులన్ = గోపకులను; వీడ్కొలిపినన్ = సెలవియ్యగా; వారలు = వారు; గొబ్బునన్ = వెంటనే; వడి = వేగముగా పోవుటకు; కల = సమర్థము లైన; గిబ్బలన్ = ఎద్దులను; పూనిన = కట్టినట్టి; శకటంబులున్ = బళ్ళను; ప్రకటంబులుగన్ = ప్రసిద్ధముగా; ఎక్కి = అధిరొహించి; తమతమ = వారివారి; పల్లెల = మందల యొక్క; త్రోవలున్ = దారులను; పట్టి = పడి; చనిరి = వెళ్ళిపోయిరి; ఆ = ఆ; నందుండున్ = నందుడుకూడ; ప్రతీతంబులు = ఎరుకపడుచున్నవి; ఐన = అయిన; ఉత్పాతంబులున్ = ఆపద సూచకములను; ముందరన్ = ఎదురుగా; పొడగని = కనుగొని; శౌరి = వసుదేవుడు {శౌరి - శూరుని పుత్రుడు, వసుదేవుడు}; తన = అతని; తోన్ = తోడ; పలికిన్ = హెచ్చరించిన; పలుకులు = మాటలు; తప్పవు = తప్పిపోవుటలేదు; అనుచున్ = అని; తలంచుచున్ = భావించుచు; చనియెన్ = వెళ్ళిపోయెను; అంతన్ = అప్పుడు.
భావము:- ఇలా చెప్పి వసుదేవుడు నందుడు మొదలైన గోపకులకు వీడ్కోలు చెప్పి పంపించాడు. వాళ్ళు కూడా త్వరత్వరగా పోయే గిత్తలను పూన్చిన బళ్ళు ఎక్కి తమ తమ పల్లెలకు ప్రయాణమై వెళ్ళిపోయారు. నందుడు తన ఎదురుగా స్పష్టమైన ఉత్పాతాలను చూసాడు. “వసుదేవుడు చెప్పిన మాటలు తప్పవేమో” అనుకుంటూ వేగంగా ప్రయాణం సాగించాడు.