పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/రుక్మిణీ జననంబు
తెభా-10.1-1686-వ.
అని రా జడిగిన శుకుం డిట్లనియె.
టీక:- అని = అని; రాజు = రాజు; అడిగినన్ = అడుగగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా పరీక్షిత్తు అడుగగా, శుకముని ఇలా చెప్పసాగాడు.
తెభా-10.1-1687-చ.
"వినుము; విదర్భదేశమున వీరుఁడు, కుండినభర్త భీష్మకుం
డను నొక దొడ్డరాజు గలఁ; డాతని కేవురు పుత్రు; లగ్రజుం
డనఘుఁడు రుక్మి నాఁ బరఁగు; నందఱకుం గడగొట్టు చెల్లెలై
మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణినాఁ బ్రసిద్ధయై.
టీక:- వినుము = వినుము; విదర్భ = విదర్భ అను; దేశమునన్ = దేశమునందు; వీరుడు = యోధుడు; కుండిన = కుండిన పట్టణమునకు; భర్త = రాజు; భీష్మకుండు = భీష్మకుడు; అను = అనెడి; ఒక = ఒక; దొడ్డ = గొప్ప; రాజు = రాజు; కలడు = ఉన్నాడు; అతని = అతని; కిన్ = కి; ఏవురు = ఐదుగురు (5); పుత్రుల్ = కొడుకులు; అగ్రజుడు = పెద్దవాడు {అగ్రజుడు - ముందు పుట్టినవాడు, పెద్దవాడు}; అనఘుడు = పుణ్యాత్ముడు; రుక్మినాన్ = రుక్మి అను పేరుతో; పరగున్ = ప్రసిద్ధుడై ఉండెను; అందఱ = అందరిలో; కున్ = కి; కడగొట్టు = కడపటి; చెల్లెలు = చెల్లెలు; ఐ = అయ్యి; మనుజవరేణ్య = రాజా; పుట్టెను = పుట్టెను; ఒక = ఒక; మానిని = స్త్రీ; రుక్మిణినాన్ = రుక్మిణి అనుపేరుతో {రుక్మిణి - రుక్మమస్యాసీతి రుక్మిణి (వ్యుత్పత్తి), సువర్ణి}; ప్రసిద్ధ = ప్రసిద్ధురాలు; ఐ = అయ్యి.
భావము:- “విను. విదర్భ దేశపు కుండిన నగర రాజు భీష్మకుడు గొప్పవాడు. అతనికి ఐదుగురు కొడుకులు {రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులు}. పెద్దవాడు రుక్మి. అందిరికన్న చిన్నది రుక్మిణి వారు ఐదుగురికి చెల్లెలై పుట్టింది.
తెభా-10.1-1688-క.
బాలేందురేఖ దోఁచిన
లాలిత యగు నపరదిక్కులాగున, ధరణీ
పాలుని గేహము మెఱసెను
బాలిక జన్మించి యెదుగ భాసుర మగుచున్.
టీక:- బాలేందురేఖ = నెలవంక {బాలేందురేఖ - నెల మొదటిరోజు (అమావాశ్య వెళ్ళిన పాడ్యమి నాటి) చంద్రబింబము యొక్క వంక, నెలవంక}; తోచినన్ = ఉదయించగా; లాలిత = మనోజ్ఞముగా; అగున్ = అయ్యెడి; అపరదిక్కు = పడమర; లాగునన్ = వలె; ధరణీపాలుని = రాజు యొక్క; గేహము = గృహము, నివాసము {గృహము (ప్ర) - గేహము (వి)}; మెఱసెను = ప్రకాశించెను; బాలిక = ఆడపిల్ల; జన్మించి = పుట్టి; యెదుగన్ = పెరుగుచుండగా; భాసురము = మిక్కిలి ప్రకాశము కలది; అగుచున్ = అగుచు.
భావము:- ఈమె పుట్టిననాటి నుండి ఆ రాజగృహం, చంద్ర రేఖ ఉదయించిన పడమటి ఆకాశంలా, ప్రకాశవంతంగా మెరిసిపోతోంది.
{ఆమె కుటుంబంలో జన్మించింది అనినను, అందరికి పరమైనది కనుక, ఇతరమైనవి అన్నీ అపరములే కనుక. పరాదేవి అపరమైన అంతటిని ప్రకాశంపజేస్తుంది కనుక అపర దిక్కు ప్రయోగించారా?}
తెభా-10.1-1689-వ.
మఱియును దినదినప్రవర్ధమాన యై.
టీక:- మఱియునున్ = ఇంకను; దినదిన = నానాటికి; ప్రవర్ధమాన = పెరుగుచున్నది; ఐ = అయ్యి.
భావము:- అలా రుక్మిణి దినదినప్రవర్థమానంగా ఎదుగుతోంది.
తెభా-10.1-1690-సీ.
పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు-
నబలలతోడ వియ్యంబు లందు;
గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి-
చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి;
రమణీయ మందిరారామ దేశంబులఁ-
బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు;
సదమల మణిమయ సౌధభాగంబుల-
లీలతో భర్మడోలికల నూఁగు;
తెభా-10.1-1690.1-తే.
బాలికలతోడఁ జెలరేగి బంతు లాడు;
శారికా కీర పంక్తికిఁ జదువు సెప్పు;
బర్హి సంఘములకు మురిపములు గఱపు;;
మదమరాళంబులకుఁ జూపు మందగతులు.
టీక:- పేర్వేరన్ = పేరుపేరున; బొమ్మల = ఆయా బొమ్మలకు; పెండ్లిండ్లు = పెళ్ళిళ్ళు; చేయుచున్ = చేస్తూ; అబలల = బాలికల; తోడన్ = తోటి; వియ్యంబులు = సంబంధములు; అందున్ = చేయును; గుజ్జెనగూళులున్ = గుజ్జెనగూళ్ళు {గుజ్జెనగూళ్ళు - పిల్లలు ఆటలందు చిన్నచిన్న గిన్నెలలో తయారుచేసుకొను ఆహారపదార్థములు}; కొమరొప్ప = చక్కగా; వండించి = తయారుచేయించి; చెలుల్ = స్నేహితుల; కున్ = కు; పెట్టించున్ = పెట్టించును; చెలువు = చక్కదనములు; మెఱసి = పెంపొందగా; రమణీయ = అందమైన; మందిర = గృహములందలి; ఆరామ = ఉద్యానవనములోని; దేశంబులన్ = ప్రదేశములందు; పువ్వుతీగెల్ = పూలతీవల; కున్ = కు; ప్రోది = పోషించుట, మొక్కలకు కట్టు గొప్పులు; చేయున్ = చేయును; సదమల = మిక్కిలి నిర్మలమైన; మణి = రత్నాలు; మయ = పొదిగిన; సౌధ = మేడలపై (డాబాల); భాగంబులన్ = భాగముల; లీల = విలాసముల; తోన్ = తోటి; భర్మ = బంగారు; డోలికలన్ = ఊయలలందు; ఊగున్ = ఊగును.
బాలికల = బాలల; తోడన్ = తోటి; చెలరేగి = విజృంభించి; బంతులు = బంతులాటలు; ఆడున్ = ఆడును; శారికా = గోరువంకల; కీర = చిలుకల; పంక్తి = సమూహముల; కిన్ = కు; చదువున్ = పలుకులు పలుకుట; చెప్పున్ = చెప్పును; బర్హి = నెమళ్ళ; సంఘముల్ = సమూహముల; కున్ = కు; మురిపెములున్ = నడకల వయ్యారములు; కరపున్ = నేర్పును; మద = మదించిన; మరాళంబుల్ = హంసల; కున్ = కు; చూపున్ = నేర్పును; మంద = మెల్లని; గతులు = నడకలు.
భావము:- బొమ్మల పెళ్ళిళ్ళు చక్కగా చేసి చెలికత్తెలతో వియ్యాలందే ఆటలాడుతోంది. గుజ్జెన గూళ్లు వండించి పెడుతోంది. అందమైన తోటల్లో పూతీగెలకి గొప్పులు కడుతోంది. సౌధాలలో బంగారపు టుయ్యాలలు ఊగుతోంది. చెలులతో బంతులాట లాడుతోంది. చిలక పలుకులు, నెమలి మురిపాలు, మదగజాల మందగతులతో అతిశయిస్తోంది
తెభా-10.1-1691-వ.
అంత.
టీక:- అంతన్ = అంతట.
భావము:- అలా రుక్మిణీదేవి దినదినప్రవర్దమాన అయి ఎదుగుతున్నప్పుడు.
తెభా-10.1-1692-సీ.
దేవకీసుతు కోర్కి తీఁగలు వీడంగ-
వెలఁదికి మైదీఁగ వీడఁ దొడఁగెఁ;
గమలనాభుని చిత్తకమలంబు వికసింపఁ-
గాంతి నింతికి ముఖకమల మొప్పె;
మధువిరోధికి లోన మదనాగ్ని పొడచూపఁ-
బొలఁతికి జనుదోయి పొడవు జూపె;
శౌరికి ధైర్యంబు సన్నమై డయ్యంగ-
జలజాక్షి మధ్యంబు సన్నమయ్యె;
తెభా-10.1-1692.1-ఆ.
హరికిఁ బ్రేమబంధ మధికంబుగాఁ, గేశ
బంధ మధిక మగుచు బాలకమరెఁ;
బద్మనయను వలనఁ బ్రమదంబు నిండార
నెలఁత యౌవనంబు నిండి యుండె.
టీక:- దేవకీసుతు = కృష్ణుని యొక్క {దేవకీసుతుడు - దేవకీదేవి పుత్రుడు, కృష్ణుడు}; కోర్కి = కోరికలు అనెడి; తీగెలు = తీవెలు; వీడంగన్ = కొనసాగగా, వర్ధిల్లగా; వెలది = స్త్రీ; కిన్ = కి; మై = దేహము అనెడి; తీగ = తీవె; వీడన్ = వర్థిల్ల, వికసింప; తొడగెన్ = మొదలెట్టెను; కమలనాభుని = కృష్ణుని యొక్క {కమలనాభుడు - కమలము (బ్రహ్మ పుట్టిన) బొడ్డున కలవాడు, విష్ణువు}; చిత్త = మనసు అనెడి; కమలంబు = పద్మము; వికసింపన్ = వికసించునట్లు; కాంతిన్ = ప్రకాశముతో; ఇంతి = సుందరి; కిన్ = కి; ముఖ = ముఖము అనెడి; కమలము = పద్మము; ఒప్పెన్ = చక్కనయ్యెను; మధువిరోధి = కృష్ణుని {మధువిరోధి - మధుఅనెడి రాక్షసుని శత్రువు, విష్ణువు}; కిన్ = కి; లోనన్ = మనసులో; మదన = మన్మథ; అగ్ని = తాపము; పొడచూపన్ = కనబడగా; పొలతి = సుందరి; కిన్ = కి; చను = స్తనముల; దోయిన్ = ద్వయము; పొడవు = వృద్ధిచెందుట; చూపెన్ = కనబడెను; శౌరి = కృష్ణుని {శౌరి - శూరుని మనుమడు, కృష్ణుడు}; కిన్ = కి; ధైర్యంబు = తాలిమి; సన్నము = తక్కువ; ఐ = అయ్యి; డయ్యంగన్ = పొందగా; జలజాక్షి = సుందరి యొక్క {జలజాక్షి - పద్మముల వంటి కన్నులామె, స్త్రీ}; మధ్యంబు = నడుము; సన్నమున్ = సన్నముగా; అయ్యెన్ = అయినది.
హరి = కృష్ణుని; కిన్ = కి; ప్రేమ = ప్రేమమీద; బంధము = ఆసక్తి; అధికంబు = పెరుగుతున్నది; కాన్ = అగుచుండగా; కేశ = తలవెంట్రుకల; బంధము = సమూహము; అధికము = సమృద్ధి; అగుచున్ = పొందుతు; బాల = బాలిక; కున్ = కు; అమరెన్ = ఒప్పినది; పద్మనయను = కృష్ణుని {పద్మనయనుడు - పద్మాక్షుడు, కృష్ణుడు}; వలన = వైపు; ప్రమదంబు = సంతోషములు; నిండారన్ = సమృద్ధి యగుచుండగ; నెలత = సుందరి; యౌవనంబున్ = ప్రాయము; నిండి = పరిపూర్ణమై; ఉండె = ఉన్నది.
భావము:- కృష్ణుడి కోరికలు విప్పారేలా, రుక్మిణి మేని మెరుపులు విరిసాయి. మనస్సు వికసించేలా, ముఖపద్మం వికసించింది. మదనతాపం కలిగేలా, స్తనసంపద ఉదయించింది. ధైర్యం సన్నగిల్లేలా, నడుం సన్నబడింది. ప్రేమ పెరిగి పొంగేలా, శిరోజాలు చక్కగా వృద్ధిచెందేయి. కృష్ణుడికి సంతోషం కలిగించేలా, రుక్మిణికి నిండు యౌవనం తొణకిస లాడుతోంది.
ప్రజల నాలుకలపై నానుతుండే ఒక వృత్తాంతము చూద్దాము. పోతన గారు ఈ పద్యం వ్రాస్తూ, “బాల కమరె” వరకు వ్రాసారుట. అదే సమయంలో వారి , ఇంట్లో ఆడుకుంటున్న చిన్నపిల్ల, నిప్పులపై పడిందిట. జుట్టు కాలుతుందని అందరూ కంగారు పడుతున్నారట. (కమరె అంటే కాలు అనే అర్థం ఉంది కదా.) ఇంతలో, ఇదేమీ తెలియని పోతనగారు తన సహజధోరణిలో “బద్మనయను వలనఁ బ్రమదంబు నిండార నెలఁత యౌవనంబు నిండి యుండె”. అని పూరించగానే ఏ ఇబ్బంది లేకుండ పిల్ల నిప్పులనుంచి బయటపడిందట.
తెభా-10.1-1693-వ.
ఇట్లు రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రు లను నేవురకుం జెలియలైన రుక్మిణీదేవి దన యెలప్రాయంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగ; రుక్మి = రుక్మి; రుక్మరథ = రుక్మరథుడు; రుక్మబాహు = రుక్మబాహువు; రుక్మకేశ = రుక్మకేశుడు; రుక్మనేత్రులు = రుక్మనేత్రుడులు; అను = అనెడి; ఏవురు = ఐదుగుర (5); కున్ = కు; చెలియలి = చెల్లెలు; ఐన = అయినట్టి; రుక్మిణీ = రుక్మిణి అనెడి; దేవి = దేవి; తన = తన యొక్క; యెల = లేత; ప్రాయంబునన్ = యౌవనమునందు.
భావము:- ఇలా రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులనే ఐదుగురికి ముద్దుల చెల్లెలైన రుక్మిణి నవ యౌవనంలో ప్రవేశించింది.
తెభా-10.1-1694-క.
తన తండ్రి గేహమునకుం
జనుదెంచుచు నున్న యతిథిజనులవలనఁ గృ
ష్ణుని రూప బల గుణాదులు
విని, "కృష్ణుఁడు దనకుఁ దగిన విభుఁ"డని తలఁచెన్.
టీక:- తన = తన యొక్క; తండ్రి = తండ్రి యొక్క; గేహమున్ = ఇంటి; కున్ = కి; చనుదెంచుచున్ = వస్తూ; ఉన్న = ఉన్నట్టి; అతిథి = అతిథులుగావచ్చు; జనుల = వారి; వలనన్ = ద్వారా; కృష్ణుని = కృష్ణుని యొక్క; రూప = రూపసౌందర్యము; బల = శక్తిసామర్థ్యములు; గుణ = సుగుణములు; ఆదులున్ = మొదలగువాటిని; విని = విని; కృష్ణుడు = కృష్ణుడు; తన = ఆమె; కున్ = కు; తగిన = సరిపడు; విభుడు = భర్త; అని = అని; తలచెన్ = ఎంచెను.
భావము:- తన పుట్టింటికి వచ్చే పోయే వాళ్ళ వల్ల కృష్ణుడి అందం, బలం, సుగుణాలు తెలిసి భర్తగా వరించింది.
తెభా-10.1-1695-క.
ఆ లలన రూపు, బుద్ధియు,
శీలము, లక్షణము, గుణముఁ జింతించి తగన్
"బాలారత్నముఁ దన కి
ల్లాలుగఁ జేకొందు"ననుచు హరియుం దలఁచెన్.
టీక:- ఆ = ఆ యొక్క; లలన = సుందరి యొక్క; రూపు = రూపసౌందర్యము; బుద్ధియున్ = చక్కటి ప్రజ్ఞ; శీలము = నడవడిక; లక్షణము = మంచి లక్షణములు; గుణమున్ = సుగుణములు; చింతించి = విచారించి; తగన్ = తగినట్లు; బాలా = బాలికలలో; రత్నమున్ = శ్రేష్ఠురాలిని; తన = అతని; కిన్ = కి; ఇల్లాలుగన్ = భార్యగా; చేకొందును = చేపట్టెదను; అనుచున్ = అని; హరియున్ = కృష్ణుడు కూడ; తలచెన్ = భావించెను.
భావము:- ఆ సుందరి అందచందాలు, మంచిబుద్ధి, శీలం, నడవడిక, సుగుణాలు, తెలిసి కృష్ణుడు కూడా రుక్మిణీ కన్యకా రత్నాన్ని పెళ్ళి చేసుకుందా మనుకొన్నాడు.
తెభా-10.1-1696-వ.
అంత.
టీక:- అంత = అప్పుడు.
భావము:- అలా రుక్మిణి యౌవనంలో ప్రవేశిస్తున్న ఆ సమయంలో
తెభా-10.1-1697-ఉ.
బంధువు లెల్లఁ "గృష్ణునకు బాలిక నిచ్చెద"మంచు శేముషీ
సింధువులై విచారములు చేయఁగ, వారల నడ్డపెట్టి దు
స్సంధుఁడు రుక్మి కృష్ణునెడఁ జాల విరోధముఁ జేసి "మత్త పు
ష్పంధయవేణి నిత్తు శిశుపాలున"కంచుఁ దలంచె నంధుఁడై.
టీక:- బంధువులు = చుట్టములు; ఎల్లన్ = అందరు; కృష్ణున్ = కృష్ణుని; కున్ = కి; బాలికను = కన్యకను, రుక్మిణిని; ఇచ్చెదము = పెండ్లిచేయుదము; అంచున్ = అని; శేముషీ = సద్బుద్ధి; సింధువులు = సముద్రమంత కలవారు; ఐ = అయ్యి; విచారములు = ఆలోచనలు; చేయగన్ = చేయుచుండగా; వారలన్ = వారిని; అడ్డపెట్టి = అడ్డుకొని; దుస్సంధుడు = చెడ్డ ప్రతిజ్ఞ కలవాడు; రుక్మి = రుక్మి; కృష్ణున్ = కృష్ణుని; ఎడన్ = అందు; చాల = అధికముగా; విరోధమున్ = శత్రుత్వము; చేసి = పెట్టుకొని; మత్త = మదించిన; పుష్పంధయ = తుమ్మెదలవంటి {పుష్పంధయము - పూలలోని మధువును గ్రోలునది, తుమ్మెద}; వేణిన్ = జడ కలామెను, రుక్మిణిన్; ఇత్తున్ = వివాహమున ఇచ్చెదను; శిశుపాలున్ = శిశుపాలుని; కిన్ = కి; అంచున్ = అని; తలచెన్ = ఎంచెను; అంధుడు = కన్నుగానని వాని వలె; ఐ = అయ్యి.
భావము:- రుక్మిణిని బంధువు లంతా మిక్కిలి సద్భుద్దితో కృష్ణుడి కిద్దాం అనుకుంటున్నారు; కాని దుష్టులతో స్నేహంపట్టి జ్ఞానహీనుడైన రుక్మి వారిని కాదని, కృష్ణుడి యందు యెంతో విరోధం పెట్టుకొని, మూర్ఖంగా చేదిదేశపు రాజు శిశుపాలుడికి గండుతుమ్మెదల పిండు వలె నల్లని శిరోజాలు గల సుందరవేణి అయిన తన చెల్లెలు రుక్మిణిని ఇస్తానంటున్నాడు.