పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/మాయ మింట నుండి పలుకుట

తెభా-10.1-153-వ.
అని పయ్యెదఁ జక్కఁ సవరించుకొనుచుఁ, బలవరించుచు, భ్రాంతిపడి కూఁతున్ గ్రక్కున నక్కునం జక్క హత్తుకొని, చెక్కుచెక్కున మోపి, చయ్యన నుత్తరీయాంచలంబున సంచలతం గప్పి, చప్పుడుగాఁ గుయ్యిడ, నయ్యెడం గ్రయ్యం బడి వాఁడు పోఁడిమి చెడఁ, దోబుట్టువుం దిట్టి, చిట్టిపట్టి నావురని వాపోవఁ, గావరంబున నడుగు లొడిసి తిగిచి, వడిం బెడిసిపడం బుడమిపైం బడవైచిన, న బ్బాలయు నేలంబడక, లీల నెగసి, నవ్య దివ్య మాలికా గంధ బంధుర మణి హారాంబరాద్యలంకార మనోహారిణియు, గదా శంఖ చక్ర పద్మశర చాపాసి శూలధారిణియునై, యెనిమిది కరంబులం గరంబొప్పుచు, సిద్ధ చారణ కిన్నర గరుడ గంధర్వాది వైమానిక నికాయంబు గానికలిచ్చి పొగడ, నెగడుచు, నచ్చరల యాట పాటలకు మెచ్చుచు, మింటనుండి కంటఁబడి, కంటుపడఁ, గంసుని కిట్లనియె.
టీక:- అని = అని; పయ్యెదన్ = కొంగును; చక్కగన్ = చక్కగా; సవరించుకొనుచున్ = సరిచేసుకొనుచు; పలవరించుచున్ = మొత్తుకొనుచుండగా; భ్రాంతిపడి = కలవరపడిపోయి; కూతున్ = పుత్రికను; గ్రక్కునన్ = తటాలున; అక్కునన్ = రొమ్మునందు; చక్కన్ = చక్కగా; హత్తుకొని = చేర్చిపట్టుకొని; చెక్కు = చెంపకు; చెక్కున = చెంపని; మోపి = ఆన్చి; చక్కనన్ = ఒప్పుగా; ఉత్తరీయాంచలంబున = పైటచెఱగుతో; సంచలతన్ = కంగారును; కప్పి = కప్పిపుచ్చుకొని; చప్పుడుగాన్ = గట్టిగా; కుయ్యిడన్ = రోదించగా; ఆ = ఆ; ఎడన్ = సమయమునందు; క్రయ్యంబడి = కలియబడి; వాడు = అతను; పోడిమి = పద్ధతి; చెడన్ = తప్పి; తోబుట్టువున్ = చెల్లెలిని; తిట్టి = దూషించి; చిట్టి = చిన్ని; పట్టిన్ = పాపను; ఆవురు = ఆ...; అని = అని; వాపోవగన్ = ఏడ్చుచుండగా; కావరంబునన్ = గర్వముతో; అడుగులు = కాళ్ళు; ఒడిసి = ఒడిసిపట్టికొని; తిగిచి = లాగిపెట్టి; వడిన్ = వేగముగా; బెడిసిపడన్ = మిడిసిపాటుతో; పుడమి = నేల; పైన్ = మీదకి; పడవైచినన్ = విసిరికొట్టగా; ఆ = ఆ; బాలయున్ = ఆడపిల్ల; నేలన్ = నేలమీద; పడకన్ = పడిపోకుండ; లీలన్ = అద్భుతముగా; ఎగసి = ఎగిరి; నవ్య = సరికొత్త; దివ్య = దివ్యమైన; మాలికా = పూలమాలలతో; గంధ = సువాసన; బంధుర = తరుచైన; మణి = రత్నాల; హార = దండలు; ఆది = మున్నగు; అలంకార = భూషణములతో; మనోహారిణియున్ = అందమైనది; గదా = గద; శంఖ = శంఖము; చక్ర = చక్రము; పద్మ = పద్మము; శర = బాణములు; చాప = విల్లు; అసి = ఖడ్గము; శూల = శూలము; ధారిణియున్ = ధరించినామె; ఐ = అయ్యి; ఎనిమిది = ఎనిమిది (8); కరంబులన్ = చేతులతో; కరంబున్ = మిక్కిలి; ఒప్పుచున్ = ప్రకాశించుచు; సిద్ధ = సిద్ధులు; చారణ = చారణులు; కిన్నర = కిన్నరులు; గరుడ = గరుడులు; గంధర్వ = గంధర్వులు; ఆది = మున్నగు; వైమానిక = దేవయోనివిశేషముల {వైమానికులు - విమానము లందు సంచరించువారు, దేవయోని విశేషములు}; నికాయంబు = సమూహములు; కానికలు = బహుమతులు; ఇచ్చి = సమర్పించి; పొగడన్ = స్తోత్రములు చేయుచుండ; నెగడుచున్ = ప్రకాశించుచు; అచ్చరల = అప్సరసల యొక్క; ఆట = నాట్యములు; పాటల = గానముల; కున్ = కు; మెచ్చుచున్ = మెచ్చుకొనుచు; మింటన్ = ఆకాశము; నుండి = నుండి; కంటబడి = కనిపించి; కంటుపడన్ = విరోధించి; కంసున్ = కంసుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;
భావము:- ఆడపిల్ల కదా రక్షించుకోవచ్చు అని దేవకీదేవి భ్రాంతి పడి, విలపిస్తూ, పలవరిస్తూ పిల్లని ఎత్తుకొని గుండెలకు హత్తుకొని, జారిపోతున్న పైట సర్దుకొంటు, పాప చెక్కిలికి తన చెక్కిలి చేర్చి, పైటకొంగుతో చటుక్కున పిల్లని కప్పింది. పసిపిల్లేమో గట్టిగా ఏడిచింది. వాడప్పుడు రెచ్చిపోయి సిగ్గు, లజ్జ వదిలేసి చెల్లెల్ని తిట్టాడు. కన్నుమిన్ను కానని కావరంతో చిన్నారిపాప కాళ్ళు పట్టుకొని లాగాడు. పాప కెవ్వుమని ఏడ్చింది. అయినా లెక్కచేయక నేల మీదకి విసిరి కొట్టాడు. కాని పాప నేలమీద పడలేదు. రివ్వున ఆకాశానికి ఎగిరింది. ఆమె దేవతాపుష్పాల సువాసనలతో ఘుమఘుమలాడిపోతోంది. మణిమయ హారాలు మొదలైన ఆభరణాలతో మనోహరంగా ఉంది. గద, శంఖం, చక్రం, పద్మం, బాణం, ధనుస్సు, ఖడ్గం, శూలం అనే ఎనిమిది ఆయుధాలు ఎనిమిది చేతులలో చక్కగా ధరించి ఉంది. విమానాల్లో ఆకాశ మార్గంలో పయనించే సిద్ధులు, చారణులు, కిన్నరలు, గంధర్వులు, గరుడులు మొదలైన దేవ గణాలు ఆమెకు కానుకలు సమర్పించి స్తోత్రాలు చేస్తున్నారు. అప్సరసలు నాట్యాలు చేస్తున్నారు. ఆ మాయాదేవి వారిని మెచ్చుకుంటూ, ఆకాశంలో కనబడి, కంసుడిని కర్కశంగా ఇలా హెచ్చరించింది.

తెభా-10.1-154-ఉ.
"తెంరివై, పొరిం బొరిని, దేవకిబిడ్డలఁ జిన్నికుఱ్ఱలం
జంపితి, వంతనైన నుపశాంతి వహింపక, ఱాలమీఁద నొ
ప్పింపితి, విస్సిరో! యిదియు బీరమె? నా సరసన్ జనించి నిన్
జంపెడు వీరుఁ డొక్క దెస త్కృతి నొందెడువాడు; దుర్మతీ!"

టీక:- తెంపరివి = తెంపరితనం కలవాడవు; ఐ = అయ్యి; పొరింబొరిని = వరుసగా; దేవకి = దేవకి యొక్క; బిడ్డలన్ = పుత్రులను; చిన్ని = చంటి; కుఱ్ఱలన్ = పిల్లవాళ్ళను; చంపితివి = వధించావు; అంతన్ = అంతటితో; ఐననున్ = అయిన; ఉపశాంతి = ఓర్పు; వహింపక = పట్టకుండ; ఱాల = రాళ్ళ; మీదన్ = పైన; నొప్పింపితి = కొట్టితివి; ఇస్సిరో = ఛీ; ఇదియున్ = ఇదికూడ; బీరమె = మగతనమేనా, కాదు; నా = నాకు; సరసన్ = తోడనే; జనించి = పుట్టి; నిన్ = నిన్ను; చంపెడు = వధించెడి; వీరుడు = శూరుడు; ఒక్క = ఒకానొక; దెసన్ = పక్కన; సత్కృతిన్ = సమ్మానములను, మంచిగ చూడబడుట; ఒందెడున్ = పొందుచున్నాడు; వాడు = అతను; దుర్మతీ = చెడ్డబుద్ధి గలవాడా.
భావము:- "దుర్మార్గుడా! తెంపరితనంతో దేవకీదేవి బిడ్డలను వరసపెట్టి ఆరుగురిని వధించావు. అంతటితో శాంతించక పసిబిడ్డను ఆడపిల్లను నన్ను విసిరి కొట్టావు; ఛీ!ఛీ! ఇదేనా నీ వీరత్వం? నిన్ను చంపే మహా వీరుడు ఒకడు నాతో పాటే పుట్టి మరో చోట గొప్ప గౌరవాలు పొందుతున్నాడులే."

తెభా-10.1-155-వ.
అని పలికి.
టీక:- అని = అని; పలికి = చెప్పి.
భావము:- ఇలా హెచ్చరించి అదృశ్యమైంది.

తెభా-10.1-156-క.
నీయ గుణాస్పదయై,
హిలో నా దేవి జనము న్నింపంగా,
హు నామ నివాసంబుల,
హునామములం జరించె ద్రాత్మికయై.

టీక:- మహనీయ = మిక్కిలి గొప్పదైన; గుణ = సుగుణములకు; ఆస్పద = ఉనికిపట్టు; ఐ = అయ్యి; మహి = భూలోకము; లోన్ = అందు; ఆ = ఆ; దేవి = దేవత; జనము = ప్రజలు; మన్నింపంగా = పూజించుచుండగా; బహు = అనేకమైన; నామ = పేర్లు కల; నివాసంబులన్ = స్థలము లందు; బహు = అనేకమైన; నామములన్ = పేర్లతో; చరించెన్ = వర్తిల్లెను; భద్రాత్మిక = శుభముల నిచ్చునది; ఐ = అయ్యి.
భావము:- ఆ దేవి భూలోకంలో అనేక చోట్ల ప్రజలచే పూజింపబడుతున్నది. ఒక్కొక్కచోట ఒక్కొక్క పేరుతో ఒక్కో మహాగుణం ప్రధానంగా వివిధ నామాలతో విలసిల్లుతూ ఉన్నది. ఏ ఊరైనా, ఏ పేరైనా రక్షించడమే ఆమె ముఖ్య లక్షణమై ఉంటుంది.

తెభా-10.1-157-వ.
అంత నాబోటి పలికిన కలికి పలుకులు ములుకులై, చెవులఁ జిలికిన, నులికిపడి, జళుకు గదిరిన మనంబున, ఘనంబుగ వెఱఁగంది, కంది, కుందెడు దేవకీవసుదేవుల రావించి, యాదరంబున సంభావించి, చేరి, వారితో నిట్లనియె.
టీక:- అంతన్ = అంతట; ఆ = ఆ; బోటి = ఆమె; పలికిన = చెప్పిన; కలికి = చతురమైన; పలుకులు = మాటలు; ములుకులు = బాణములు; ఐ = అయ్యి; చెవులన్ = చెవుల యందు; చిలికినన్ = సోకగా; ఉలికిపడి = అదిరిపోయి; జళుకు = దిగులు; కదిరిన = పుట్టిన; మనంబునన్ = మనసుతో; ఘనంబుగా = మిక్కిలి అధికముగా; వెఱగంది = బెదిరిపోయి; కంది = సంతాపించి; కుందెడు = దుఃఖించెడి; దేవకీ = దేవకి; వసుదేవులన్ = వసుదేవులను; రావించి = పిలిపించి; ఆదరంబునన్ = ఆత్మీయతతో; సంభావించి = మన్నించి; చేరి = దగ్గరకుపోయి; వారి = వారల; తోన్ = తోటి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అప్పుడు ఆ యోగమాయ పలుకులు బాణాలై చెవులో దూరి కలతపెట్టాయి. అతడు ఉలిక్కిపడ్డాడు. చెదరిన మనస్సుతో బాగా భయపడ్డాడు. దుఃఖంతో కుంగిపోతున్న దేవకీవసుదేవులను పిలిపించి, ఆదరించి, గౌరవించాడు. దగ్గరకు చేరి వారితో ఇలా అన్నాడు.

తెభా-10.1-158-ఉ.
"పాపుఁడ; బాలఘాతకుఁడ; బంధు విరక్తుఁడ; దుష్ట చిత్తుఁడన్;
గోనుఁడన్; జరన్మృతుఁడఁ; గ్రూరుఁడ; బ్రాహ్మణహంత భంగి మీ
పాల జంపితిన్; బయలి ల్కుల నమ్మితి; సాధులార! నా
పాము లుగ్గడింపక, కృపాపరులై కనరే! శమింపరే!

టీక:- పాపుడన్ = పాపము చేసిన వాడను; బాల = శిశువులను; ఘాతకుడన్ = చంపిన వాడను; బంధు = చుట్టములపై; విరక్తుడన్ = ప్రేమ లేనివాడను; దుష్టచిత్తుడన్ = చెడ్డబుద్ధి గలవాడను; కోపనుడన్ = అధిక కోపము కలవాడను; చరత్ = తిరుగుతున్న; మృతుడన్ = శవముతో సమానుడను; క్రూరుడన్ = కఠినుడును; బ్రాహ్మణహంత = బ్రహ్మహత్య చేసెడివాని; భంగిన్ = వలె; మీ = మీ యొక్క; పాపలన్ = పిల్లలను; చంపితిన్ = వధించితిని; బయలి = ఆకాశవాణి; పల్కులన్ = మాటలను; నమ్మితిన్ = విశ్వసించితిని; సాధులారా = సజ్జనులులారా; నా = నా యొక్క; పాపములున్ = పాపపు పనులను; ఉగ్గడింపక =ప్రకటించక; కృపాపరులు = దయ గలవారు; ఐ = అయ్యి; కనరే = చూడండి; శమింపరే = శాంతించండి.
భావము:- "శాంతమూర్తులారా! మహాపాతకుడను. నేను బయలు మాటలు నిజమని నమ్మి బ్రహ్మహత్య చేసే పాతకుడులా మీ పురిటి కందులను చంపాను. బంధువులపై కత్తిగట్టిన దుష్ట బుద్ధిని. క్రోధం నా కళ్ళుకప్పివేసింది. నేను బ్రతికున్న చచ్చిన వాడితో సమానం. మహాక్రూరుడిని. మహాపాపిని. నా తప్పులు, పాపాలు లెక్కించకుండ దయాస్వభావంతో నన్ను కరుణించి క్షమించండి.

తెభా-10.1-159-ఉ.
క్కెడఁ బ్రాణులందఱు నిజోచితకర్మము లోలిఁ ద్రిప్పగా,
నొక్కొక మేనితో బొడమి, యొక్కొక త్రోవను రాకపోకలం
జిక్కులఁ బొందుచుండుదురు; చెల్మిని సంసృతితోడఁ బాయ, రే
నెక్కడి హంత? మీ శిశువు లెక్కడి హన్యులు? దూఱనేటికిన్?

టీక:- ఒక్క = ఒకానొక; ఎడన్ = చోట; నిజ = తమకు; ఉచిత = తగిన; కర్మముల్ = పనులను; ఓలిన్ = క్రమముగా; త్రిప్పగా = నడిపించుతుండగా; ఒక్కొక్క = ఒకటి తరువాత ఒకటి; మేని = దేహముల; తోన్ = తోటి; పొడమి = పుట్టి; ఒక్కొక్క = వేరువేరు విధముల; త్రోవను = దారు లందు; రాకపోకలన్ = జననమరణము లందు; చిక్కులన్ = ఇక్కట్లను; పొందుచుండుదురు = అనుభవించెదరు; చెల్మిని = స్నేహభావముతో; సంసృతి = సంసార లంపటము; తోడన్ = నుండి; పాయలేరు = విడివడలేరు; ఏన్ = నేను; ఎక్కడి = ఎక్కడి; హంత = చంపినవాడను; మీ = మీ యొక్క; శిశువుల్ = పిల్లలు; ఎక్కడి = ఎక్కడి; హన్యులు = హత్య చేయబడినవారు; దూఱన్ = దూషించుట; ఏటికిన్ = ఎందుకు.
భావము:- వారి వారి కర్మలే జీవులను నడిపిస్తుంటాయి. అలా వారి కర్మలే కారణంగా, ఎన్నోరకాల జీవులు వారికి అనుకూలమైన దేహాంతో ఒక్కొచోట జన్మిస్తారు. అందరు తలోవైపునుంచి వచ్చి ఒకచోట చేరతారు, జీవిస్తారు, ఎవరిదారిన వారు వెళ్ళిపోతారు. ఈ రాక పోకలలో చిక్కులు పడుతుంటారు. ఒకచోట ఏర్పడిన స్నేహాలు అక్కడ వదలి వెళ్ళిపోతారు. ఇలా ఉండగా, చంపేవాడు ఎవడు? చనిపోయేవాడు ఎవడు? మీ బిడ్డలను చంపినవాడను నేను కాదు. వారు నాచే చంపబడ్డవారు అనటం కూడా సరి కాదు. ఇంక ఒకరి నేరాలొకరు ఎంచడం ఎందుకు?

తెభా-10.1-160-క.
తురఁ జెఱిచితి ననియును,
తురచేఁ జెడితి ననియు, బాలుఁడు తలఁచున్;
చెలుములు లే వాత్మకుఁ
చెలుముల కీలు కర్మబంధము సుండీ!"

టీక:- పగతురన్ = శత్రువులను; చెరచితిన్ = వధించితిని; అనియునున్ = అని; పగతుర = వైరుల; చేన్ = వలన; చెడితిని = పాడైపోతిని; అనియున్ = అని; బాలుడు = తెలివితక్కువవాడు; తలచున్ = భావించును; పగ = శత్రుత్వము; చెలుములు = స్నేహములు; లేవు = ఉండవు; ఆత్మ = ఆత్మ; కున్ = కి {బగచెలుములకీలు కర్మబంధము సుండీ.}; పగ = శత్రుత్వము; చెలుముల = మిత్రత్వముల; కీలు = మర్మము, సంబంధము; కర్మ = చేసికొన్న కర్మలకు; బంధము = సంబంధించినవి; సుండీ = సుమా.
భావము:- తాను శత్రువులను బాధించానని. తన్ను శత్రువులు బాధించారని అమాయకుడు మాత్రమే అనుకుంటాడు. సత్యం తెలుసుకొని ఆలోచిస్తే, ఆత్మకు స్నేహ విరోధాలు అంటూ లేవు. ఆ శత్రుత్వ మిత్రత్వాల మధ్య సంబంధం కేవలం తమ కర్మల బంధం మాత్రమే సుమా.”

తెభా-10.1-161-వ.
అని పలికి, కన్నీరు నించి, వగచి, వెఱచుచు, దేవకీవసుదేవుల పాదంబులఁ బట్టుకొని, సంకెలలు విప్పించి, మిక్కిలి యక్కఱ గల వాక్యంబుల నైక్యంబులు నెఱపిన, వారును బరితప్తుం డైన కంసునిఁ జూచి, రోషంబును బాసి; రంత నా వసుదేవుండు బావ కిట్లనియె.
టీక:- అని = అని; పలికి = చెప్పి; కన్నీరు = కన్నీటిని; నించి = కార్చి; వగచి = విచారించి; వెఱచుచున్ = బెదురుతూ; దేవకీ = దేవకి; వసుదేవుల = వసుదేవుల యొక్క; పాదంబులన్ = కాళ్ళు; పట్టుకొని = పట్టుకొని; సంకెలలన్ = సంకెళ్ళను; విప్పించి = ఊడదీయించి; మిక్కిలి = అధికమైన; అక్కఱ = ప్రీతి; కల = కలిగిన; వాక్యంబులన్ = మాటలతో; ఐక్యంబులు = దగ్గరి తనములు; నెఱపినన్ = నడపగా; వారును = వారు; పరి = మిక్కిలి; తప్తుండు = పశ్చాత్తాపము పడువాడు; ఐన = అయినట్టి; కంసునిన్ = కంసుని; చూచి = కనుగొని, ఉద్దేశించి; రోషంబునున్ = కోపమును; పాసిరి = విడిచి పెట్టారు; అంతన్ = అంతట; ఆ = ఆ; వసుదేవుండు = వసుదేవుడు; బావ = భార్యకి అన్న; కిన్ = తోటి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;
భావము:- కంసుడు ఇలా పలికి, దుఃఖించి, కన్నీరు పెట్టుకున్నాడు. బెదురు బెదురుగా దేవకీవసుదేవుల కాళ్ళు పట్టుకొని వేడుకున్నాడు. వారి సంకెళ్ళు ఊడదీయించాడు. చాలా ప్రేమ కురిసే మాటలతో ఐకమత్యాలు చూపించాడు. వారు కూడ పశ్చాత్తాపం పడుతున్న కంసుని చూసి శాంతించారు. అప్పుడు వసుదేవుడు కంసుడితో ఇలా అన్నాడు.

తెభా-10.1-162-శా.
"బావా! నీ వచనంబు నిక్కము సుమీ; ప్రాణుల్ గతజ్ఞాను లై
నీవే నంచును లోభ మోహ మద భీ నిర్మిత్రతామోద శో
కావేశంబుల నొండొరుం బొడుతు రేకాకారుఁడై సర్వరూ
పావిష్టుండగు నీశ్వరుం దెలియలే న్యోన్యవిభ్రాంతులై"

టీక:- బావా = బావా; నీ = నీ యొక్క; వచనంబు = మాట; నిక్కము = నిజమే; సుమీ = సుమా; ప్రాణుల్ = జీవులు; గత = పోయిన; జ్ఞానులు = విజ్ఞానము కలవారు; ఐ = అయ్యి; నీవు = నీవు; ఏను = నేను; అంచునున్ = అనుచు; లోభ = లోభము; మోహ = మోహము; మద = మదము; భీ = భీతి; నిర్మిత్రతామోద = స్నేహాంగీకార రాహిత్యము; శోక = దుఃఖము; ఆవేశంబులన్ = ఆవేశములతో; ఒండొరున్ = ఒకరినొకరు; పొడుతురు = చంపెదరు; ఏకాకారుడు = అఖండ స్వరూపుడు; ఐ = అయ్యి; సర్వ = సమస్తమైన; రూప = రూపముల జీవు లందు; ఆవిష్టుండు = ఉన్నవాడు; అగు = ఐన; ఈశ్వరున్ = భగవంతుని; తెలియ = తెలిసికొన; లేరు = లేరు; అన్యోన్య = ఒకిరిపై నొకరు; విభ్రాంతలు = నమ్మలేనివారు; ఐ = అయ్యి.
భావము:- "బావా! కంసమహారాజా! నీవు చెప్పిన మాట నిజమే సుమా! ప్రాణు లందరు అహంకారంచేత జ్ఞానాన్ని నష్టపోతారు. లోభం, మోహం, మదం, భయం, శత్రుత్వం, ఇష్టం, దుఃఖం, ఆవేశం మొదలైనవాటికి లోనై నువ్వా, నేనా అంటు ఒకరినొకరు వధించుకుంటూ ఉంటారు. అంతేగాని, ఉన్నది పరమాత్మ ఒకడే అనీ, అతనే అనేక రూపాలలో ఉంటాడని తెలుసుకోలేక, ఇతరులు వేరు తాము వేరు అనుకుంటూ భ్రాంతిలో పడుతూ ఉంటారు."