పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/బలరాముడు విజృంభించుట


తెభా-10.1-1563-లవి.
సిత హరినీలనిభ నము విశాలకటి-
మ నయనాద్రి పరిసితమగు మేఘో
ల్లనము వహింపఁ గరకిలయము హేమ మణి-
విర వలయద్యుతులు దెల తుదలందుం
లు గురియంగ సరమున బలుండు దర-
సితము ముఖాబ్జమున నెసఁగ ఘనకాలా
మయ మహోగ్రతర ములము వడిన్ విసరి-
సిమసఁగి శత్రువుల సువులకుఁ బాపెన్.

టీక:- హసిత = నవ్వబడిన; హరినీల = ఇంద్రనీలాలతో; నిభ = సమానమైన; వసనము = బట్ట; విశాల = పెద్దదైన; కటిన్ = నడుమునందు; అసమనయనాద్రి = కైలాసపర్వతముచే {అసమనయనాద్రి - అసమనయనుని (శివుని) అద్రి (పర్వతము), కైలాసపర్వతము}; పరిలసిత = బాగా కాంతివంతమైనది; అగు = ఐన; మేఘ = మేఘము యొక్క; ఉల్లసనమున్ = వికాసమును; వహింపగన్ = పొందగా; కర = చేయి అనెడి; కిసలయము = చిగురాకు యొక్క; హేమ = బంగారపు; మణి = రత్నాల; విసర = సమూహములు కల; వలయ = కడియముల; ద్యుతులు = మెరుపులు; దెసలతుదలు = దిగంతములు; అందున్ = అందు; పసలు = ప్రకాశములు; కురియంగన్ = వెదచల్లబడగా; సరభసమునన్ = హడావిడితో; బలుండు = బలరాముడు; దరహసితము = చిరునవ్వు; ముఖ = ముఖము అనెడి; అబ్జమునన్ = పద్మమునందు; ఎసగన్ = అతిశయించగా; ఘన = పెద్దది; కాలాయ = ఇనుపముతో చేయబడి; సమయ = చంపివేసెడి; మహా = మిక్కిలి; ఉగ్రతర = అతిభయంకరమైన {ఉగ్రము - ఉగ్రతరము - ఉగ్రతమము}; ముసలము = రోకటిని; వడిన్ = వేగముగా; విసరి = విసురుటచేత; కసి = కోపము; మసగి = రేగి; శత్రువులను = విరోధులను; అసువులకుబాపెన్ = చంపెను.
భావము:- బలరాముడి విశాలమైన కటిప్రదేశంలోని ఇంద్రనీల మణితో సమానమైన నీలాంబరం, కైలాసగిరి యందు లెస్సగా ప్రకాశించే మేఘంలా అందగించింది. అతని చిగురుటాకుల వంటి చేతులకు గల కనక ఖచిత రత్న కంకణముల కాంతులు దిగంతములు అంతా ప్రకాశాలు వెదజల్లాయి. బలరాముడు పద్మమువంటి తన మోమున చిరునవ్వు చిందుతుండగా, దృఢమైన ఇనుముతో చేసిన మిక్కిలి భయము కలిగించే రోకలిని మహావేగంతో గిరగిర త్రిప్పుతూ విజృంభించి, విరోధుల ప్రాణాలు హరించాడు.

తెభా-10.1-1564-లవి.
ప్రయసమయాంతకుని చెలువునఁ గటాక్షముల-
ఘు చటులాగ్ని కణములు చెదరఁ గోలా
ముగ సువర్ణమణియ నిచయోజ్జ్వలిత-
ము వడిఁజాఁచి శిరములు నురములు న్ని
ర్దళితములుగన్ శకలములుగ నొనరింపఁ గని-
బెలుకుఱి జరాసుతుని ము రణవీధిన్
లిత దనుజావళికి లికి భయభీత సుర-
లికిఁ ద్రిజగచ్ఛలికి లికిఁ దల డించెన్.

టీక:- ప్రళయసమయ = ప్రళయకాల; అంతకున్ = యముని; చెలువునన్ = వలె; కటాక్షముల = కడకండ్లనుండి; అలఘు = మిక్కుటమైన; చటుల = తీక్ష్ణమైన; అగ్ని = నిప్పు; కణములు = రవ్వలు; చెదరన్ = ఎగిరిపడుతుండగా; కోలాహలముగన్ = కలకలధ్వనితో; సువర్ణ = బంగారపు; మణి = రత్నాలుపొదిగిన; వలయ = కట్ల యొక్క; నిచయ = సమూహముచే; ఉజ్జ్వలిత = మెరుస్తున్న; హలమున్ = నాగలి ఆయుధమును; వడిన్ = విసురుగా; చాచి = సాగించి; శిరములున్ = తలలు; ఉరములున్ = వక్షస్థలములు; నిర్దళితములుగన్ = బద్దలైనవిగా; శకలములుగన్ = ముక్కలుముక్కలుగా; ఒనరింపన్ = చేయగా; కని = చూసి; పెలుకుఱి = విహ్వలులై; జరాసుతుని = జరాసంధుని యొక్క; బలమున్ = సైన్యము; రణవీధిన్ = యుద్ధభూమి యందు; చలిత = చెదరగొట్టబడిన; దనుజ = రాక్షసుల; ఆవళి = సమూహము కలవాని; కిన్ = కి; బలి = బలవంతున; కిన్ = కు; భయ = భయముచేత; భీత = బెదిరిన; సుర = దేవతలకు; ఫలి = ప్రయోజనకారి; కిన్ = కి; త్రిజగత్ = ముల్లోకములలోను; చలి = చరించుట కలవాని; కిన్ = కి; హలి = బలరాముని {హలి - హలాయుధము కలవాడు, బలరాముడు}; కిన్ = కి; తలడించెన్ = లొంగిపోయెను.
భావము:- రాక్షసులగుంపును కలవరపెట్టువాడు; ప్రబలమైన బలము కలవాడు; భయత్రస్తులకు కల్పవృక్షమువంటి వాడు; ముల్లోకాలను గడగడలాడించేవాడు; హాలము ఆయుధముగా ధరించువాడు అయిన బలరాముడు ప్రళయకాల యముని వలె ప్రకాశించాడు. అతడి కడకన్నులందు మిక్కిలి భయంకరములైన నిప్పురవ్వలు గుప్పుగుప్పున వెలువడ్డాయి. కనకరత్న ఖచితములైన కడియాల పట్టీలతో శోభిల్లు తన ఇనుపనాగలిని వేగంగా విసురుతూ అతడు విరోధుల తలలు, రొమ్ములు చీల్చి ముక్కలు చేసాడు. అది చూసిన జరాసంధుడి సైన్యం భయంతో విలవిలలాడుతూ రణరంగంలో తల్లడిల్లాయి.

తెభా-10.1-1565-శా.
రోషోద్రేకకళాభయంకర మహారూపంబుతో నొక్క చే
నీషాదండము సాఁచి లాంగలము భూమీశోత్తమగ్రీవలన్
భూషల్ రాలఁ దగిల్చి రాఁదిగిచి సంపూర్ణోద్ధతిన్ రోఁకటన్
వేషంబుల్ చెడమొత్తె రాముఁడు రణోర్విన్ నెత్తురుల్ జొత్తిలన్.

టీక:- రోష = కోపము యొక్క; ఉద్రేక = అతిశయముఅను; కళా = కళచేత; భయంకర = వెఱుపు పుట్టించుచున్న; మహా = గొప్ప; రూపంబు = రూపము; తోన్ = తోటి; ఒక్క = ఒకానొక; చేన్ = చేతితో; ఈషా = నాగేటి, నాగలి ఆయుధము; దండము = పట్టుకొనెడి పొడుగు కఱ్ఱ; సాచి = చాచి {చాచు (ప్ర) - సాచు (వి)}; లాంగలమున్ = నాగేటి ఆయుధమును; భూమీశ = రాజ; ఉత్తమ = శ్రేష్ఠుల; గ్రీవలన్ = మెడ లందు; భూషల్ = ఆభరణములు; రాలన్ = రాలిపోవునట్లు; తగిల్చి = తగుల్కొనునట్లుచేసి; రాదిగిచి = దగ్గరకు లాగి; సంపూర్ణ = పూర్తి; ఉద్ధతిన్ = శక్తితో; రోకటన్ = ముసలముతో; వేషంబుల్ = వస్త్రాది అలంకారాములు; చెడన్ = చెడిపోవునట్లు; మొత్తెన్ = కొట్టెను; రాముడు = బలరాముడు; రణ = యుద్ధ; ఉర్విన్ = భూమిని; నెత్తురుల్ = రక్తములు; జొత్తిలన్ = స్రవించగా .
భావము:- బలరాముడు విజృంభించిన కోపముతో, మహా భయంకర రూపంతో విలసిల్లాడు. ఒక చేతితో చర్నాకోల సాచి, నగలురాలి పడేలా నాగలిని ఆ రాజశ్రేష్ఠుల మెడకు తగిలించి దగ్గరకు లాగి, అమిత దర్పంతో మరొక చేతిలోని రోకలితో వారి వేషాలు చెదరేలా రణరంగంలో నెత్తురుపారేలా మొత్తాడు.

తెభా-10.1-1566-క.
లిహలహృత కరికుంభ
స్థ ముక్తాఫలము లోలిఁ నరెఁ గృషిక లాం
మార్గ కీర్ణ బీజా
లి కైవడి నద్భుతాహక్షేత్రమునన్.

టీక:- హలి = బలరాముడు; హల = నాగేటి ఆయుధముతో; హృత = హరింపబడిన; కరి = ఏనుగుల; కుంభస్థల = కుంభస్థల మందలి; ముక్తాఫలముల్ = ముత్యములు; ఓలిన్ = క్రమముగా; తనరెన్ = ఒప్పినవి; కృషిక = సేద్యగాని, రైతు; లాంగల = నాగలి; మార్గ = చాళ్ళందు; కీర్ణ = చల్లబడిన; బీజ = విత్తనముల; ఆవలి = సమూహముల; కైవడిన్ = వలె; అద్భుత = ఆశ్చర్యకరమైన; ఆవహ = యుద్ధ; క్షేత్రమునన్ = భూమి యందు.
భావము:- అపూర్వమైన ఆ యుద్ధభూమిలో బలరాముడి నాగలిచే బద్దలుకొట్టబడిన ఏనుగు కుంభస్థలముల లోని ముత్యాలు నేలరాలి కర్షకుల నాగటిచాళ్ళలో చల్లబడిన విత్తనాల లాగ విలసిల్లాయి.

తెభా-10.1-1567-క.
ఱిమి హలి హలము విసరుచు
నెఱిఁ గదిసిన బెగడి విమతనికరము లెడలై
వెఱఁగుపడు నొదుఁగు నడఁగును
ఱుపడుఁ జెడు మడియుఁ బొరలు రలుం దెఱలున్.

టీక:- తఱిమి = వెంటబడి; హలి = బలరాముడు; హలమున్ = నాగలి ఆయుధమును; విసరుచున్ = విసురుగా వేయుచు; నెఱిన్ = క్రమముగా; కదిసినన్ = దగ్గరకురాగా; బెగడి = వెరచి; విమత = శత్రువుల; నికరములు = సమూహములు; ఎడలు = చెదిరినవి; ఐ = అయ్యి; వెఱగుపడున్ = ఆశ్చర్యపోవును; ఒదుగున్ = ముడుచుకొనును; అడగును = ఆణగిపోవును; మఱుపడు = దాగును; చెడున్ = అంగవిహీనతచెందును; మడియున్ = చచ్చును; పొరలు = పొర్లెదరు; మరలున్ = వెనుదిరుగును; తెఱలున్ = పారిపోవును.
భావము:- బలభద్రుడు తరుముతూ తన నాగలిని త్రిప్పుతూ సమీపించగా శత్రుసమూహాలు భయపడి దూరంగా పారిపోతాయి; ఆశ్చర్య పోతాయి; ప్రక్కకు తొలగుతాయి; లోబడుతాయి; చాటుకు పోతాయి; చెడిపోతాయి; చనిపోతాయి; నేలబడి పొర్లుతాయి; వెనుదిరిగి పారిపోతాయి; కలతచెందుతాయి.

తెభా-10.1-1568-క.
రి తిగ్మగోశతంబుల
రిదంతర మెల్లఁ గప్పు నాకృతిఁ గడిమిన్
రి తిగ్మగోశతంబుల
రిదంతర మెల్లఁ గప్పె తిభీకరుఁడై.

టీక:- హరి = సూర్యుడు; తిగ్మ = తీక్ష్ణములైన; గో = కిరణముల; శతంబులన్ = సమూహములచే; హరిత్ = దిక్కుల; అంతరము = నడిమిప్రాంతము; ఎల్లన్ = అంతటిని; కప్పు = ఆవరించడి; ఆకృతిన్ = విధముగనే; కడిమిన్ = శౌర్యముచేత; హరి = కృష్ణుడు; తిగ్మ = తీక్ష్ణములైన; గో = బాణముల; శతంబులన్ = సమూహములచేత; హరిత్ = దిక్కుల; అంతరము = నడిమిప్రాంతము; ఎల్లన్ = అంతటిని; కప్పెన్ = నింపెను; అతి = మిక్కిలి; భీకరుడు = భయంకరుడు; ఐ = అయ్యి.
భావము:- సూర్యుడు వందలకొలది వాడికిరణాలచే దిగంతాలను కప్పేసే విధంగా, పరాక్రమశాలి అయిన శ్రీకృష్ణుడు మిక్కిలి భయంకరుడై వందలకొలది వాడి అమ్ములతో దిగంతాలను కప్పివేశాడు.

తెభా-10.1-1569-సీ.
దుగురేగురు దీర్ఘబాణము ల్గాఁడిన-
గుదులు గ్రుచ్చిన భంగిఁ గూలువారుఁ;
లలు ద్రెవ్విన మున్ను దారు వీక్షించిన-
వారల నొప్పించి వ్రాలువారుఁ;
దములు దెగిబడ్డ బాహులఁ బోరి ని-
ర్మూలిత బాహులై మ్రొగ్గువారు;
క్షతముల రుధిరంబు ల్లింప నిర్ఝర-
యుత శైలములభంగి నుండువారు;

తెభా-10.1-1569.1-ఆ.
భ్రాతృ పుత్ర మిత్ర బంధువుల్ వీఁగిన
డ్డమరుగుదెంచి డఁగువారు;
వాహనములు దెగిన డి నన్యవాహనా
ధిష్ఠులగుచు నెదిరి ద్రెళ్ళువారు.

టీక:- పదుగురు = పదేసి (10); ఏగురు = ఐదేసి (5); దీర్ఘ = పొడవైన; బాణముల్ = బాణములు; కాడినన్ = నాటుకొనగా; గుదులు = గుత్తగా, కలిపి; గ్రుచ్చిన = గుచ్చిన; భంగిన్ = విధముగా; కూలు = చనిపోవు; వారున్ = వారు; తలలు = తలకాయలు; త్రెవ్వినన్ = తెగిపోగా; మున్ను = అంతకుముందు; తారు = వారు; వీక్షించిన = చూసిన; వారలన్ = వారిని; నొప్పించి = కొట్టి; వ్రాలు = ఒరుగు; వారున్ = వారు; బదములు = కాళ్ళు; తెగి = తెగుటచేత; పడ్డ = పడిపోయిన; బాహులన్ = చేతులతో; పోరి = పోరాడి; నిర్మూలిత = మొదలంటానరకబడిన; బాహులు = చేతులు కలవారు; ఐ = అయ్యి; మ్రొగ్గు = వాలిపోవు; వారున్ = వారు; క్షతముల = గాయములనుండి; రుధిరంబు = రక్తము; జల్లింపన్ = అధికముగా కారగా; నిర్ఝర = సెలయేళ్ళతో; యుత = కూడి ఉన్న; శైలముల = పర్వతముల; భంగిన్ = వలె; ఉండు = ఉండెడి; వారున్ = వారు.
భాతృ = సోదరులు; పుత్ర = కొడుకులు; మిత్ర = స్నేహితులు; బంధువుల్ = చుట్టములు; వీగినన్ = చలించినచో; అడ్ఢము = అడ్డముగా; అరుగుదెంచి = వచ్చి; అడుగు = అణగు; వారున్ = వారు; వాహనములున్ = వాహనములు; తెగినన్ = చెడిపోయినచో; వడిన్ = వేగముగా; అన్య = ఇతరమైన; వాహనా = వాహనములను; అధిష్ఠులు = ఎక్కినవారు; అగుచున్ = అగుచు; ఎదిరిన్ = ఎదిరించి; త్రెళ్ళు = చనిపోవు; వారు = వారు;
భావము:- పొడవైన బాణములు నాటగా పదేసి మంది, ఐదేసి మంది వంతున గుదులు గుచ్చినట్లుగా కూలుతున్నారు. కొందరు తలలు తెగిపడగా పూర్వం తాము చూసినవారిని బాధించి మరికొందరు వ్రాలుతున్నారు. వేరొక కొందరు కాళ్ళు తెగిపడి నప్పటికీ చేతులతో పోరాడి, అవి కూడా తెగిపోగా మ్రొగ్గుతున్నారు. ఇంకొందరు గాయాల నుండి నెత్తురు చిందుతుండగా సెలయేళ్ళతో కూడిన శైలాలవలె ఉన్నారు. కొందరు సోదరులు పుత్రులు స్నేహితులు చుట్టాలు ఓడిపోగా అడ్డు వచ్చి హతం అవుతున్నారు. మరికొందరు గుఱ్ఱములు తెగిపడిపోతే, వెంటనే ఇంకో గుఱ్ఱం ఎక్కివచ్చి ఎదిరించి, మరణిస్తున్నారు.

తెభా-10.1-1570-శా.
కాయంబులఁ బాసినంతటనె మా కెగ్గేమి? జేతృత్వమున్
నీకుం జెల్లదు కృష్ణ! నిర్జరులమై నిన్నోర్తు మీమీఁదటన్
వైకుంఠంబున నంచుఁ బల్కు క్రియ దుర్వారాస్త్ర భిన్నాంగులై
యాకంపింపక గొందఱాడుదురు గర్వాలాపముల్ గృష్ణునిన్.

టీక:- ఈ = ఈ యొక్క; కాయంబులన్ = దేహములను; పాసిన = విడిచిన; అంతటనే = అంతమాత్రముచేత; మా = మా; కున్ = కు; ఎగ్గు = కీడు; ఏమి = ఏమిటి; జేతృత్వమునన్ = జయశీలత్వము; నీ = నీ; కున్ = కు; చెల్లదు = అందదు; కృష్ణ = కృష్ణా; నిర్జరులము = దేవతలము, జర లేని వారము; ఐ = అయ్యి; నిన్నున్ = నిన్ను; ఓర్తుము = గెలుచుకొందుము; ఈమీదటన్ = ఇకపైన; వైకుంఠంబునన్ = వైకుంఠమునందు; అంచున్ = అని; పల్కు = పలుకుతున్న; క్రియన్ = విధముగ; దుర్వార = వారింపరాని; అస్త్ర = అస్త్రములచే; భిన్న = తెగిన; అంగులు = అవయవములు కలవారు; ఐ = అయ్యి; ఆకంపింపకన్ = వెరవక; కొందఱు = కొంతమంది; ఆడుదురు = పలికెదరు; గర్వా = గర్వపు; మాటల్ = మాటలను; కృష్ణునిన్ = కృష్ణుని గురించి.
భావము:- ఇంకా మరికొందరు “కృష్ణా ఈ శరీరాలు విడచినంత మాత్రాన మాకు కలిగే కీడు ఏమీ లేదులే. నీకు విజయం లభించడం కల్ల. ఎందుకంటే, మేము చచ్చాక అమరులమై వైకుంఠంలో నిన్ను గెలుస్తాము” అంటూ వారింపరాని శస్త్రాలచే ఛేదించబడిన కాయములు కలవారై ఏమాత్రం చలింపక కొందరు శ్రీకృష్ణుడితో దంభాలు పలికారు.

తెభా-10.1-1571-వ.
ఇ వ్విధంబున.
టీక:- ఈ = ఈ; విధంబున = విధముగ.
భావము:- ఆ విధంగా బలరాముడు శ్రీకృష్ణుడూ శత్రుసైన్యంతో యుద్ధం చేసే సమయంలో. . .

తెభా-10.1-1572-క.
తీశ! యేమిచెప్పుదు?
ణితలయవార్ధి భయదమై మూఁగిన య
మ్మధేశు బలము నెల్లను
దెగఁ జూచిరి హరియు హలియుఁ దీవ్రక్రీడన్.

టీక:- జగతీశ = రాజా; ఏమి = ఏమని; చెప్పుదున్ = చెప్పగలను; అగణిత = ఎంచరాని; లయ = ప్రళయకాల మందలి; వార్ధి = సముద్రమువలె {వార్ధి - నీటికి నిధి, కడలి}; భయదము = భయంకరమైనది; ఐ = అయ్యి; మూగిన = చుట్టుముట్టిన; ఆ = ఆ యొక్క; మగధీశు = జరాసంధుని; బలమున్ = సైన్యమును; ఎల్లన్ = అంతటిని; తెగజూచిరి = చంపిరి {తెగజూచు - తెగునట్లు (చనిపోవునట్లు) చూచు, చంపు}; హరియున్ = కృష్ణుడు; హలియున్ = బలరాముడు; తీవ్ర = తీవ్రమైన; క్రీడన్ = విధముగ.
భావము:- పరీక్షన్మహారాజా! ఏమని చెప్పేది ప్రళయకాలసాగరం వలె భయంకరంగా చుట్టుముట్టిన ఆ మగధరాజు యొక్క లెక్కించలేనంత సైన్యం అంతటినీ బలరాముడూ కృష్ణుడూ తీక్షణంగా చీల్చిచెండాడి మట్టుబెట్టారు.

తెభా-10.1-1573-క.
భున జనుస్థితవిలయము
లీలం జేయు హరికి రినాశన మెం
విషయమైన మనుజుఁడై
మొందుటఁ జేసి పొగడఁ డియెం గృతులన్.

టీక:- భువన = లోకముల యొక్క; జనుః = పుట్టుక; స్థిత = ఉనికి, సంరక్షణము; విలయములున్ = నాశనములను; అవలీలన్ = సుళువుగా; చేయు = చేసెడి; హరి = కృష్ణుని; కిన్ = కి; అరి = శత్రువుల; నాశనము = నాశముచేయుట; ఎంత = ఏపాటి; విషయము = పని; ఐనన్ = అయినను; మనుజుడు = మానవునిగా; ఐ = అయ్యి; భవమున్ = పుట్టుక; ఒందుట = పొందుట; చేసి = వలన; పొగడబడియెన్ = కీర్తింపబడెను; కృతులన్ = కావ్యము లందు.
భావము:- లోకములను అవలీలగా పుట్టించనూ, పెంచనూ, గిట్టించనూ సమర్థుడైన నారాయణునకు, శత్రునాశనము చేయుట ఒక లెక్క లోనిది కాదు. అయినా, మానవుడై పుట్టినందున కావ్యము లందు అలా శ్లాఘింపబడ్డాడు.

తెభా-10.1-1574-వ.
ఆ సమయంబున.
టీక:- ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు.
భావము:- ఆ సమయంలో. . . .

తెభా-10.1-1575-శా.
అంహఃకర్ములు దల్లడిల్ల భయదాహంకారుఁడై సీరి దో
రంహం బొప్ప హలాహతిన్ రథ ధనూథ్యంబులం గూల్చి త
త్సంహారస్పృహఁ జొచ్చి పట్టెను జరాసంధున్ మదాంధున్ మహా
సింహంబుం బ్రతిసింహముఖ్యము బలశ్రీఁ బట్టు నేర్పేర్పడన్.

టీక:- అంహస్సు = పాపము; కర్ములు = కర్మములు చేయువారు; తల్లడిల్లన్ = చలించగా; భయద = భయంకరమైన; అహంకారుడు = అహంకారము కలవాడు; ఐ = అయ్యి; సీరి = బలరాముడు {సీరి - సీర (నాగలి) ఆయుధమును ధరించివాడు, బలరాముడు}; దోః = భుజబలము యొక్క; అహంబు = గర్వము; ఒప్పన్ = ఒప్పునట్లుగా; హల = నాగేటి; ఆహతిన్ = దెబ్బతో; రథ = రథములను; ధనుః = విల్లులను; రథ్యంబులన్ = గుఱ్ఱములను; కూల్చి = పడగొట్టి; తత్ = అతనిని; సంహార = చంపుట యందలి; స్పృహన్ = ఇచ్చచేత; చొచ్చి = చొరబడి; పట్టెను = పట్టుకొనెను; జరాసంధున్ = జరాసంధుడిని; మదా = గర్వముచేత; అంధున్ = గుడ్డివాడైన వానిని; మహా = గొప్ప; సింహంబు = సింహము; ప్రతి = ప్రతిపక్ష; సింహ = సింహ; ముఖ్యమున్ = శ్రేష్ఠమును; బల = బలము యొక్క; శ్రీన్ = సంపదచేత; పట్టు = పట్టుకొను; నేర్పు = ప్రావీణ్యము; ఏర్పడన్ = తెలియబడునట్లుగ.
భావము:- పాపకర్ములు తల్లడిల్లేలా హలధారి బలరాముడు విరోధులకు వెరపు కలిగించే దర్పంతో బహు వేగమైన నాగటిపోటులతో రథాలనూ, ధనస్సులనూ, గుఱ్ఱాలనూ కూల్చివేశాడు. మహాసింహ మొకటి ప్రత్యర్ధి అయిన మరో సింహాన్ని పట్టుకునే శక్తి సామర్థ్యాలు కనబరుస్తూ, శత్రుసంహార కాంక్షతో బలరాముడు కావరంతో కన్నుగానని జరాసంధుణ్ణి చొరబడి పట్టుకున్నాడు

తెభా-10.1-1576-వ.
ఇట్లు పట్టుకొని.
టీక:- ఇట్లు = ఈ విధముగ; పట్టుకొని = పట్టుకొని.
భావము:- హలుడు అలా మాగధుడిని పట్టుకుని. . .