పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/పాషాణ సలిల వర్షంబు

తెభా-10.1-899-వ.
ఇట్లు పర్వతప్రదక్షిణంబు చేసి గోపకులు మాధవసమేతులై మందకుం జని; రంత మహేంద్రుం డంతయు నెఱింగి మహాకోపంబునఁ బ్రళయ ప్రవర్తకంబు లగు సంవర్తకాది మేఘంబులం జీఱి యిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; పర్వత = కొండకు; ప్రదక్షిణంబు = ప్రదక్షిణలు; చేసి = చేసి; గోపకులు = యాదవులు; మాధవ = కృష్ణునితో; సమేతులు = కూడినవారు; ఐ = అయ్యి; మంద = వ్రేపల్లె; కున్ = కు; చనిరి = వెళ్ళిపోయిరి; అంత = అప్పుడు; మహేంద్రుండు = దేవేంద్రుడు; అంతయున్ = సమాచార మంతా; ఎఱింగి = తెలిసి; మహా = మిక్కిలి అధికమైన; కోపంబునన్ = కోపముతో; ప్రళయ = ప్రళయమును; ప్రవర్తకంబులు = కలిగించెడివి; అగు = ఐన; సంవర్తక = సంవర్తకము {సంవర్తకాది, నవమేఘములు - 1సంవర్తకము 2ఆవర్తకము 3పుష్కరము 4ద్రోణము 5కాలము 6నీలము 7అరుణము 8తమస్సు 9వారుణము అనెడి మేఘములు}; ఆది = మున్నగు; మేఘంబులన్ = మేఘములను; చీఱి = పిలిచి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఇలా గిరిప్రదక్షిణలు చేసిన గోపాలురు కృష్ణుడితో పల్లెకు వెళ్ళిపోయారు. అప్పుడు దేవేంద్రుడు జరిగిన దంతా తెలిసి, మిక్కిలి కుపితుడై ప్రళయ భయంకరమైన సంవర్తకము లనే మేఘ సమూహాలను పిలిచి ఇలా అన్నాడు.

తెభా-10.1-900-మ.
"పెరుగుల్ నేతులు ద్రావి క్రొవ్వి, భువి నాభీరుల్ మదాభీరులై
గిరిసంఘాత కఠోరపత్రదళనక్రీడా సమారంభ దు
ర్భ దంభోళిధరుం బురందరు ననుం బాటించి పూజింప క
గ్గిరికిం బూజలు చేసి పోయి రిదిగో కృష్ణుండు ప్రేరేఁపఁగన్.

టీక:- పెరుగుల్ = పెరుగులు {పెరుగు - పాలు తోడుకొనుటచే ఏర్పడును}; నేతులున్ = నెయ్యి లను; త్రావి = తాగి; క్రొవ్వి = మదించి, కొవ్వెక్కి; భువిన్ = భూలోకము నందు; ఆభీరుల్ = గొల్లవాళ్ళు; మద, మత్ = గర్వముచేత, నా ఎడల; అభీరులు = భయము లేనివారు; ఐ = అయ్యి; గిరి = పర్వత; సంఘాత = సమూహముల యొక్క; కఠోర = కఠినమైన; పత్ర = రెక్కలను; దళన = ఖండించు, తెగగొట్టు; క్రీడా = ఆట యందు; సమారంభ = ఆటోపము కలిగిన; దుర్భర = భరింపరాని; దంభోళి = వజ్రాయుధము; ధరున్ = ధరించెవాడను; పురన్ = శత్రువుల పట్టణములను; తరున్ = భేదించువాడను; ననున్ = నన్ను; పాటించి = ఆదరించి; పూజింపకన్ = పూజించకుండా; ఆ = ఆ యొక్క; గిరి = కొండ; కిన్ = కి; పూజలు = పూజలు; చేసి = చేసి; పోయిరి = వెళ్ళిపోయిరి; ఇదిగో = ఇప్పుడే; కృష్ణుండు = కృష్ణుడు; ప్రేరేపగన్ = రెచ్చగొట్టగా.
భావము:- “పెరుగులు నేతులు ద్రావి క్రొవ్వెక్కి పొగరెక్కిన గొల్లలు జంకుగొంకులు లేకుండా పర్వతపంక్తుల కర్కశపు ఱెక్కలు అవలీలగా ముక్కలు చేసే అమోఘ వజ్రాయుధం ధరించిన మహేంద్రుణ్ణి నన్ను, సగౌరవంగా పూజించకుండా కృష్ణుడు ప్రోత్సహిస్తే కొండకు పూజలు చేసి వెళ్ళిపోయారు.

తెభా-10.1-901-క.
గురు దేవ హీను బాలుని
గిరిభూజ ప్రముఖ వాసుఁ గృష్ణు ననీశుం
రిమాణశీల కుల గుణ
విహితుఁ జేపట్టి యింద్రు విడిచిరి గొల్లల్.

టీక:- గురు, దేవ, హీనున్ = గురువులు దేవుడు లేని (లక్ష్యపెట్టని) వానిని {గురు (తనకంటె పెద్దవాడు), దేవ (తనకు మించిన దైవము) హీనుడు (లేనివాడు)}; బాలుని = చిన్న పిల్లవానిని {బాలుడు - లోకోత్పత్తి కారణమైన ప్రథమ స్ఫురణ రూపమైనవాడు కనుక బాలుడు}; గిరి, భూజ ప్రముఖ వాసున్ = కొండలు, చెట్లు మొదలగువాని యందు మెలగువానిని {గిరిభూజప్రముఖవాసుడు - ససర్వనామా సచ విశ్వరూపా (శ్రుతి) చేత కొండలు చెట్లు మున్నగు సమస్తమును తానైనవాడు}; కృష్ణున్ = కృష్ణుని {కృష్ణుడు - భక్తుల హృదయములు ఆకర్షించువాడు, శ్లో. కృషిర్భూవాచకశ్శబ్దో నశ్చ నిరృతివాచకః, పూర్ణానంద పరబ్రహ్మ కృష్ణ ఇత్యభీయతే., పూర్ణానంద పరబ్రహ్మము కృష్ణుడు}; అనీశున్ = శిక్షకుడు లేనివానిని {అనీశుడు - సర్వనియామకుడు కనుక మరొకరిచే నియమించుట లేనివాడు}; పరిమాణ, శీల, కుల, గుణ విరహితున్ = పరిపక్వత, సరైన నడవడి, మంచి కులం, సుగుణాలు బొత్తిగా లేని వానిని {పరిమాణ విరహితుడు - అణోరణాయాన్మహతో మహీయాన్ (శ్రుతి) చేత ఇంతవాడు అంతవాడు అని నిర్ణయింపరానివాడు}; {శీలవిరహితుడు - నిత్యనిర్మలుడు నిష్కర్ముడు కనుక మంచి చెడు నడవడికలకు అతీతుడు}; {కులవిరహితుడు - సమస్తము తానగుటచేత జాతి విభజన లేనివాడు}; {గుణవిరహితుడు - త్రిగుణాతీతుడు}; చేపట్టి = అనుసరించి, ఆశ్రయించి; ఇంద్రున్ = ఇంద్రుడిని; విడిచిరి = వదలివేసిరి; గొల్లల్ = యాదవులు.
భావము:- 1.గురువులు దేవుడు లేని (లక్ష్యపెట్టని) వానిని, 2.చిన్న పిల్లవానిని, 3.కొండలమ్మట, చెట్లమ్మట తిరిగే వానిని, 5.సరైన శిక్షకుడు లేక కట్టుబాట్లు లేనివానిని, 4.కృష్ణుడిని, దన్నుగా చూసుకుని ఈ గొల్లలు దేవేంద్రుడిని ఐన నన్ను లక్షపెట్టటం లేదు.
శ్లేషార్థంతో నిందాస్థుతి అలంకారం విప్పి చూసుకుంటే – 1.తన కంటె పెద్దవాడు తనకు మించిన దైవము లేనివాడు, 2.లోకోత్పత్తి కారణమైన ప్రథమ స్ఫురణ రూపమైనవాడు, 3.ససర్వనామా సచ విశ్వరూపా (శ్రుతి) చేత కొండలు చెట్లు మున్నగు సమస్తమును తానైనవాడు, 5సర్వనియామకుడు కనుక మరొకరిచే నియమించుట లేనివాడు, అణోరణాయాన్మహతో మహీయాన్ (శ్రుతి) చేత ఇంతవాడు అంతవాడు అని నిర్ణయింప రానివాడు, నిత్యనిర్మలుడు నిష్కర్ముడు కనుక మంచి చెడు నడవడికలకు అతీతుడు, సమస్తము తానగుటచేత జాతి విభజన లేనివాడు, త్రిగుణాతీతుడు, 4.భక్తుల హృదయములు ఆకర్షించువాడు, పూర్ణానంద పరబ్రహ్మము అయిన శ్రీకృష్ణుని ఆశ్రయించి యాదవులు ఇంద్రియాలకు అధిదేవుడైన ఇంద్రుడిని నన్ను వదలివేసిరి.

తెభా-10.1-902-ఆ.
విమల ఘనతరాత్మవిజ్ఞానవిద్యచే
నిగుడలేక యుడుప నిభము లగుచుఁ
ర్మమయములైన క్రతువుల భవ మహా
ర్ణవముఁ గడవఁ గోరినారు వీరు.

టీక:- విమల = నిర్మలమైన; ఘనతర = మిక్కిలి గొప్పదైన {ఘనము - ఘనతరము - ఘనతమము}; ఆత్మవిజ్ఞాన = బ్రహ్మవిద్య, ఆధ్యాత్మవిద్య; విద్య = విజ్ఞానము; చేన్ = వలన; నిగుడ = అతిశయించ; లేక = సమర్థులుకాక; ఉడుప = తెప్పల; నిభముల్ = వంటివి; అగుచున్ = అగుచు; కర్మమయములు = కేవల కర్మ స్వరూపములు; ఐన = అయిన; క్రతువులన్ = యజ్ఞములతో; భవ = సంసారము అనెడి; మహా = గొప్ప; ఆర్ణవమున్ = సముద్రమును; గడవన్ = దాటవలెనని; కోరినారు = ఆశించుచున్నారు; వీరు = వీరు.
భావము:- ఈ గొల్లలు నిర్మలము మిక్కిలి గొప్పది అయిన బ్రహ్మవిద్యను అందుకోలేక, తెప్పలతో సమానము లైన కేవలం కర్మమయము లైన ఇలాంటి యాగాలతో సంసార మనే ఈ మాయా సముద్రాన్ని దాటాలని అనుకుంటున్నారు.

తెభా-10.1-903-శా.
ద్యత్సంపద నమ్మి నందతన యోద్యోగంబునన్ వెఱ్ఱులై
ద్యాగంబు విసర్జనీయ మని రీ ర్త్యుల్ వడిన్ మీరు మీ
విద్యుద్వల్లులఁ గప్పి గర్జనములన్ వేధించి గోవుల్ జనుల్
ద్యోమృత్యువుఁ బొంద ఱాల్ గురియుఁడీ; శౌర్యం బవార్యంబుగన్.

టీక:- ఉద్యత్ = పెరిగిన; సంపదన్ = కలిమిని; నమ్మి = నమ్మినవారై; నందతనయ = కృష్ణుని {నంద తనయుడు - నందుని కొడుకు, కృష్ణుడు}; ఉద్యోగంబునన్ = పంపువలన; వెఱ్ఱులు = తెలివితక్కువవారు; ఐ = అయ్యి; మత్ = నా యొక్క; యాగంబున్ = క్రతువును; విసర్జనీయము = వదల దగినది; అనిరి = అని నిశ్చయించిరి; ఈ = ఈ యొక్క; మర్త్యుల్ = మానవులు {మర్త్యులు - మరణము కలవారు, మానవులు}; వడిన్ = వేగముతో; మీరు = మీరు; మీ = మీ యొక్క; విద్యుత్ = మెరుపు; వల్లులన్ = తీగలతో; కప్పి = కమ్ముకొని; గర్జనములన్ = ఉరుములచేత; వేధించి = బాధించి; గోవుల్ = పశువులు; జనుల్ = ప్రజలు; సద్యః = తత్క్షణ, ఇప్పుడే; మృత్యువున్ = మరణమును; పొందన్ = పొందునట్లుగా; ఱాల్ = రాళ్ళను; కురియుడీ = వర్షించండి; శౌర్యంబు = శూరత్వము; అవార్యంబు = నిలుపరానిది; కన్ = అగునట్లు.
భావము:- ఓ సంవర్తక మేఘములారా! ఈ వెఱ్ఱిగొల్లలు తమ ధన సంపత్తిని నమ్మి కృష్ణుడి ప్రేరణతో నాయాగం విడచిపెట్టారు. పొండి! మెరుపులతో కనుల మిరుమిట్లు గొలిపి; ఉరుములతో పీడించి; అనివార్యమైన శౌర్యంతో వ్రేపల్లెలోని గోవులు, గోపకులు హఠాన్మరణం పాలయే లాగ రాళ్ళ వాన కురియండి.

తెభా-10.1-904-క.
మీవెంట వత్తు నే నై
రాణనాగంబు నెక్కి య మొప్పంగా
దేగణంబులతోడను
గోవిందుని మంద లెల్లఁ గొందలపెట్టన్. "

టీక:- మీ = మీకు; వెంటన్ = వెనుకనే; వత్తున్ = వచ్చెదను; ఏన్ = నేను; ఐరావణ = ఐరావతము అనెడి; నాగంబు = ఏనుగును; ఎక్కి = అధిరోహించి; రయము = వేగము; ఒప్పంగన్ = ఒప్పునట్లు; దేవ = దేవతల; గణంబుల = సమూహముల; తోడను = తోటి; గోవిందుని = కృష్ణుని; మందలు = పశువుల మందలు; ఎల్లన్ = అన్నిటిని; కొందలపెట్టన్ = బాధపెడుతుంటేగ.
భావము:- గోవిందుడి మందలను మీరు కలత పెడుతుంటే నేను ఐరావతాన్ని అధిరోహించి దేవతా సమూహంతో మీ వెంటే వస్తాను.”

తెభా-10.1-905-వ.
అని యిట్లు పలికి జంభవైరి సంరంభంబున దంభోళి జళిపించి, బింకంబున శంకింపక, కిన్కతోడ సంకెలలు విప్పించిన, మహానిలప్రేరితంబులై చని, నందుని మందమీఁద నమోఘంబులైన మేఘంబులు మహౌఘంబులై పన్ని, ప్రచండగతిఁ జండమరీచి మండలంబుఁ గప్పి, దివినిండి, దిశ లావరించి, రోదోంతరాళంబు నిరంతర నీరంధ్ర నిబిడాంధకార బంధురంబుగ నిరోధించి, బలిభంజన ద్వితీయ పాదపల్లవభగ్నంబైన బ్రహ్మాండభాండంబు చిల్లుల జల్లించినఁ, దొరఁగు బహిస్సముద్ర సలిలనిర్ఝరంబుల వడుపున నెడతెగక తోరంబులైన నీరధారలం గురియుచు శిలల వర్షించుచు, బిడుగుల ఱువ్వుచు, మిఱ్ఱుపల్లంబులు సమతలంబులై, యేకార్ణవంబు రూపున చూపిన, నందు దుడు కడఁచుచు వీచుచు, విలయశిఖి శిఖాసంరంభ విజృంభమాణ విద్యుల్లతా విలోకనంబుల మిఱుమిట్లుగొని, సొమ్మసిలంబోవు లేగలును, లేఁగలకు మూతు లడ్డంబులిడి ప్రళయభైరవ భేరీభాంకార భీషణంబు లగు గర్జనఘోషణంబులఁ జెవుడుపడి చిందఱవందఱ లైన డెందంబులం గంది కుంది వ్రాలు ధేనువులును, ధేనువుల వెనుక నిడుకొని దురంత కల్పాంత కాలకేళీ కీలి కరాళ కాలకంఠ కర విశాల గదా ఘాత ప్రభూతంబు లైన నిర్ఘాతపాతంబులకు భీతంబులై హరికి మ్రొక్కి, రక్షరక్షేతి శబ్దంబులు చేయు కైవడి విడువని జడింబడి, సైరింపక శిరంబులు వంచుకొని, గద్గదకంఠంబుల నంభారవంబులు చేయు వృషభంబులును, వృషభాది గోరక్షణంబు చేయుచు దుర్వారఘోర శిలా సారంబుల సారంబులు సెడి శరీరంబులు భారంబులైన మ్రానుపడు గోపకులును, గోపకులం బట్టుకొని దట్టంబైన వానగొట్టునం బెట్టుపడి బడుగు నడుములు నుసులుపడ వడవడ వడంకుచు గోవిందునిం జీరు గోపికలును, గోపికాజన కఠిన కుచ కలశ యుగళంబుల మఱుంగునం దలలు పెట్టుకొని పరవశులైన శిశువులునుం గలిగి, మహాఘోషంబుతోడ నష్టంబైన ఘోషంబుఁ జూచి ప్రబుద్ధులైన గోపవృద్ధులు కొందఱు దీనజనరక్షకుండైన పుండరీకాక్షునకు మ్రొక్కి యిట్లనిరి.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలికి = చెప్పి; జంభవైరి = ఇంద్రుడు; సంరంభంబునన్ = ఆటోపముతో; దంభోళి = వజ్రాయుధము; జళిపించి = ఊపి; బింకంబునన్ = బిగువుతో, పట్టుదలతో; శంకింపకన్ = సంకోచించకుండా; కిన్క = కోపము; తోడన్ = తోటి; సంకెలలు = సంకెళ్ళు; విప్పించినన్ = విడిపించగా; మహా = గొప్ప; అనిల = గాలిచేత; ప్రేరితంబులు = రేపబడినవి; ఐ = అయ్యి; చని = వెళ్ళి; నందుని = నందుడి యొక్క; మంద = గొల్లపల్లె; మీదన్ = పైన; అమోఘంబులు = తిరుగులేనివి; ఐన = అయిన; మేఘంబులు = మేఘములు; మహ = గొప్ప; ఓఘంబులు = గుంపులు, దట్టములు; ఐ = అయ్యి; పన్ని = కమ్ముకొని; ప్రచండ = మిక్కిలి భీకరమైన; గతిన్ = రీతితో; చండమరీచి = సూర్య {చండమరీచి - భయంకరమైన ప్రకాశము కలవాడు, సూర్యుడు}; మండలంబున్ = బింబమును; కప్పి = మరుగుపరచి; దివిన్ = ఆకాశము నందు; నిండి = నిండా వ్యాపించి; దిశల్ = అన్ని దిక్కులు; ఆవరించి = కమ్ముకొని; రోదోంతరాళంబున్ = భూమ్యాకాశముల మధ్య ప్రదేశము; నిరంతర = ఎడతెగని; నీరంధ్ర = సందు విడువని; నిబిడ = దట్టమైన; అంధకార = అంధకారముచేత; బంధురంబుగన్ = దృఢముగా; నిరోధించి = అడ్డగించి; బలిభంజన = వామనుని యొక్క {బలిభంజనుడు - బలిని శిక్షించిన వాడు, వామనుడు}; ద్వితీయ = రెండవ; పాద = అడుగు అనెడి; పల్లవ = చిగురాకుచేత; భగ్నంబు = పగిలినది; ఐన = అయిన; బ్రహ్మాండ = బ్రహ్మాండము అనెడి; భాండంబు = కుండ; చిల్లులన్ = చిల్లులనుండి; చల్లించిన్ = రాల్చగా; తొరగు = కారునట్టి; బహిః = బ్రహ్మాండమునకు బయటి; సముద్ర = సముద్రము యొక్క; సలిల = నీటి; నిర్ఝరంబుల = ప్రవాహముల; వడుపునన్ = వలె; ఎడతెగక = ఆగకుండా; తోరంబులు = లావుగా పడుచున్నవి; ఐన = అయిన; నీర = నీటి; ధారలన్ = ధారలను; కురియుచున్ = వర్షించుచు; శిలలన్ = వడగండ్లను, రాళ్ళను; వర్షించుచున్ = కురియుచు; పిడుగులన్ = పిడుగులను; ఱువ్వుచు = విసరుతు; మిఱ్ఱు = మిట్ట; పల్లంబులు = పల్లములు; సమతలంబులు = సమతలముగా; ఐ = అయ్యి; ఏక = ఒకటే; అర్ణవంబున్ = సముద్రము; రూపున్ = స్వరూపమును; చూపి = కనబడి; అందు = అప్పుడు; దుడుకు = ఉద్ధతిని; అడచుచున్ = అణచివేయుచు; వీచుచున్ = వీస్తూ; విలయ = ప్రళయకాలపు; శిఖి = అగ్ని; శిఖా = మంటల; సంరంభ = చలనములు; విజృంభమాణ = రెచ్చిపోగొట్టబడిన; విద్యుత్ = మెరుపు; లతా = తీగల; విలోకనంబులన్ = కనబడుటలచేత; మిఱుమిట్లుగొని = కళ్ళు చీకట్లు కమ్మి; సొమ్మసిలంబోవు = మూర్ఛపోయెడి; లేగలును = దూడలు; లేగల = దూడల; కున్ = కు; మూతులన్ = ముట్టి లను; అడ్ఢంబు = అడ్డము; ఇడు = పెట్టెడి; ప్రళయ = విలయకాల మందలి; భైరవ = భయంకరమైన; భేరీ = దుందుభుల యొక్క; భాంకార = భం అనెడి శబ్దములచేత; భీషణంబులు = భయంకరము లైనవి; అగు = ఐన; గర్జన = ఉరుముల; ఘోషంబులన్ = గట్టి ధ్వనులచేత; చెవుడుపడి = చెవులు వినిపించక; చిందఱవందఱలు = చికాకుపడినవి; ఐన = అయిన; డెందంబులన్ = మనసు లందు; కంది = తపించిపోయి; కుంది = కుంగిపోయి; వ్రాలు = నేలకు పడునట్టి; ధేనువులును = ఆవులు; ధేనువులన్ = ఆవులను; వెనుకన్ = వెనుకతట్టున; ఇడుకొని = ఉంచుకొని; దురంత = అంతులేని; కల్పాంత = ప్రళయ; కాల = కాలపు; కీలి = మంటలతో కూడిన; విశాల = అధికుడైన; కాలకంఠ = శివుని {కాలకంఠుడు - నల్లని కంఠము కలవాడు, శంకరుడు}; కర = చేతిలోని; విశాల = పెద్దదైన; గదా = గద యొక్క; ఘాత = దెబ్బలవలన; ప్రభూతంబులు = పుట్టినవి; ఐన = అయిన; నిర్ఘాత = పిడుగులు; పాతంబుల్ = పడుటల; కున్ = కు; భీతంబులు = భయపడినవి; ఐ = అయ్యి; హరి = కృష్ణుని; కిన్ = కి; మ్రొక్కి = నమస్కరించి; రక్షరక్షేతి = రక్షింపుము రక్షింపుమని; శబ్దంబులును = శబ్దములను; చేయు = చేయుచున్న; కైవడిన్ = విధముగ; విడువని = వదలని; జడిన్ = వానలో; పడి = చిక్కి; సైరింపక = తట్టుకొనలేక; శిరంబులున్ = తలలు; వంచుకొని = వంచుకొని; గద్గద = డగ్గుతిక చెందిన; కంఠంబులన్ = కంఠస్వరములతో; అంభారవంబులు = అంభా యను శబ్దములు; చేయు = చేయుచున్న; వృషభంబులును = ఆబోతులు; వృషభ = ఆబోతులు; ఆది = మున్నగు; గో = పశువుల; రక్షణంబు = కాచుట; చేయుచు = చేస్తు; దుర్వార = నిలుపరాని; ఘోర = భయంకరమైన; శిలా = రాళ్ళ; సారంబులన్ = వానలచేత; సారంబులు = సత్తువలు; చెడి = నశించి; శరీరంబులు = దేహములు; భారంబులు = బరు వెక్కినవి; ఐనన్ = కాగా; మ్రానుపడు = నిశ్చేష్టు లగునట్టి; గోపకులును = పశులకాపరులు; గోపకులన్ = పశులకాపరులను; పట్టుకొని = పట్టుకొని; దట్టంబు = గట్టిగా పడుతున్నది; ఐన = అయిన; వానన్ = వాన; కొట్టునన్ = దెబ్బచేత; బెట్టుపడి = ఎగిరిపడి , తూలిపోయి; బడుగు = సన్నని; నడుములు = నడుములు; నుసులుపడ = మెదలుతుండగా; వడవడ = వడవడ మని; వడంకుచున్ = వణకిపోతు; గోవిందునిన్ = కృష్ణుని; చీరు = పిలిచెడి; గోపికలును = గొల్లస్త్రీలు; గోపికా = గొల్లస్త్రీ; జన = జనముల; కఠిన = గట్టివైన; కుచ = స్తనములనెడి; కలశ = కుంభముల; యుగళంబులన్ = జంటల; మఱుంగునన్ = చాటునందు; తలలు = శిరస్సులు; పెట్టుకొని = ఉంచుకొని; పరవశులు = స్వాధీనము తప్పినవారు; ఐన = అయిన; శిశువులున్ = పిల్లలు; కలిగి = కలిగి; మహా = గొప్ప; ఘోషంబు = గట్టిచప్పుళ్ళతో; నష్టంబు = చెరుపుపొందినది; ఐన = అయిన; ఘోషంబున్ = గోకులమును; చూచి = చూసి; ప్రబుద్ధులు = బుద్ధిమంతులు; ఐన = అయిన; గోప = గొల్లవారిలో; వృద్ధులు = పెద్దలు; కొందఱు = కొంతమంది; దీన = దీనత్వము పొంది; జన = ప్రజలను; రక్షకుండు = కాపాడువాడు; ఐన = అయిన; పుండరీకాక్షున్ = పద్మాక్షుని, కృష్ణుని; కున్ = కి; మ్రొక్కి = మొరపెట్టుకొని; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- జంభాసురుని సంహరించిన ఇంద్రుడు ఇలా పలికి సరభసంగా వజ్రాయుధాన్ని జళిపించాడు. అతడు బింకం వహించి శంకలేక కినుకతో సంవర్తక మేఘాల సంకెళ్ళు తొలగించాడు. ఆ మేఘాలు పెనుగాలులచే ప్రేరితాలై పెద్ద గుంపులు గట్టి నందగోకులాన్ని ఆవరించాయి; ప్రచండంగా సూర్యమండలాన్ని కప్పాయి; ఆకాశం నిండా కమ్మాయి; దిక్కులలో క్రిక్కిరిసి పోయాయి; నింగికి నేలకు నడుమ ఎడం లేకుండా దట్టంగా కారుచీకట్లు క్రమ్మించాయి; త్రివిక్రముని రెండవ కాలి తాకిడికి పగిలి బ్రద్ద లైన బ్రహ్మాండ భాండం చిల్లులో నుంచి కారుతున్న బహిస్సముద్ర జల ప్రవాహాల లాగ పెద్దపెద్ద జలధారలు విరామం లేకుండా కురిసాయి; ఆ నీలజీమూతాలు వడగండ్లు వర్షించాయి; పిడుగులు రువ్వాయి; మిట్టపల్లాలు సమతలం గావిస్తూ వర్షజలం ఏకార్ణవమైంది; ఆ నీటివెల్లువలో లేగలు ఈదుతూ ప్రళయాగ్ని కీలా విజృంభణం నెలకొల్పుతున్న మెరుపుతీవల్ని చూసి స్తంభించి పోయి ముర్ఛిల్లాయి; ఆ లేగల మూతులు అడ్డంగా ఉంచుకుని ఆవులు ప్రళయకాలంలో భీకరాలైన భేరీభాంకారముల వలె ఘోరమైన ఉరుముల మోతవల్ల చెవులు చీదరగొనగా చిందరవందర లైన డెందాలతో కుందుతూ నేలవాలిపోయాయి; ఆ గోవుల్ని వెనుక ఉంచుకుని ఎద్దులు ప్రళయకాలాగ్ని వలె ప్రచండు డైన రుద్రుని చేతి పెను గదా ప్రహారాల నుంచి ఉప్పతిల్లిన పిడుగుపాట్లకు బెదరి కృష్ణునకు మ్రొక్కి “రక్షించు రక్షించు” అని మొరపెట్టుకుంటున్నవా అన్నట్లు ఎంతకూ వదలని వర్షానికి తట్టుకోలేక మోరలు వంచుకుని గద్గద కంఠంతో “అంబా” అని అరిచాయి; ఎద్దులు మొద లైన తమ పశువులను సంరక్షించుకుంటూ అడ్డగింపరాని ఆ దారుణ శిలావర్షంలో చేవచెడి శరీరాలు భారాలు కాగా గోపబాలురు కొయ్యబారిపోయారు; ఆ గోపకులను పట్టుకుని దట్టమైన వాన దెబ్బకు మిక్కిలి దెబ్బతిని నిరుపేద నడుములు తూలిపోగా గడగడ వణుకుతూ గోపికలు గోవిందుణ్ణి పిలిచారు; గొల్లవనితలు కలశాల వంటి కఠిన స్తనాల మాటున తలలుంచుకుని వారి శిశువులు ఒడలు మరిచారు; ఇలా పెను కోలాహలంతో గగ్గోలు వడిన పల్లెను చూసి వృద్ధులూ ప్రబుద్ధులూ ఐన యాదవులు దుష్టశిక్షకుడూ శిష్టరక్షకుడూ ఐన శ్రీకృష్ణుడికి నమస్కరించి ఇలా అన్నారు.

తెభా-10.1-906-ఉ.
"క్కట! వానఁ దోగి వ్రజ మాకుల మయ్యెఁ గదయ్య! కృష్ణ! నీ
వెక్కడనుంటి? వింత తడవేల సహించితి? నీ పదాబ్జముల్
దిక్కుగ నున్న గోపకులు దీనత నొంద భయాపహారివై
గ్రక్కునఁ గావ కిట్లునికి కారుణికోత్తమ! నీకుఁ బాడియే?

టీక:- అక్కట = అయ్యో; వానన్ = వర్షములో; తోగి = తడిసిపోయి; వ్రజము = గోకులము అంతయు; ఆకులము = వ్యాకులము; అయ్యెన్ = అయిపోయినది; కద = కదా; అయ్య = నాయనా; కృష్ణ = కృష్ణా; నీవు = నీవు; ఎక్కడన్ = ఎక్కడ; ఉంటివి = ఉన్నావు; ఇంత = ఇంత ఎక్కువగా; తడవు = ఆలస్యము చేయుట; ఏల = ఎందుకు; సహించితి = ఓర్చుకొంటివి; నీ = నీ యొక్క; పద = పాదములు అనెడి; అబ్జముల్ = పద్మములు; దిక్కుగన్ = అండగా; ఉన్న = ఉన్నట్టి; గోపకులు = గొల్లవారు; దీనతన్ = దైన్యమును; ఒందన్ = పొందగా; భయాపహారివి = భయము పోగొట్టువాడవు; ఐ = అయ్యి; గ్రక్కున = శీఘ్రముగ; కావకన్ = కాపాడకుండా; ఇట్లు = ఇలా; ఉనికి = ఉండుట; కారుణిక = దయగలవారిలో; ఉత్తమ = శ్రేష్ఠుడా; నీ = నీ; కున్ = కు; పాడియే = తగునా, కాదు.
భావము:- “కృష్ణా! దయావంతులలో మేటియైన వాడా! అయ్యో! జడివానలో తడిసి గోకులమంతా ఆకులపాటు చెందింది కదయ్యా! ఇంతసేపు నీవెక్కడున్నావయ్యా! ఎందుకు ఆలసిస్తున్నావయ్యా! నీ చరణారవిందాలు శరణాలుగా నమ్మి ఉన్న ఈ గోపకులు దైన్యంపాలు కాగా వారి భయం పోగొట్టి వెంటనే రక్షించకుండా ఇలా చూస్తూ ఊరుకోవడం నీకు న్యాయమటయ్యా!

తెభా-10.1-907-క.
యుఱుములు నీ మెఱుములు
నీ శనీఘోషణములు నీ జలధారల్
నీ యాన తొల్లి యెఱుఁగము
కూయాలింపం గదయ్య! గుణరత్ననిధీ!

టీక:- ఈ = ఈ యొక్క; ఉఱుములున్ = ఉరుములు; ఈ = ఈ యొక్క; మెఱుపులున్ = మెరుపులు; ఈ = ఈ యొక్క; అశనీ = పిడుగుల; ఘోషణములున్ = భీకర శబ్దములు; ఈ = ఈ యొక్క; జల = నీటి; ధారల్ = ధారలు; నీయాన = నీమీద ఒట్టు; తొల్లి = ఇంతకుముందు; ఎఱుగము = కనివిని యెరుగము; కూయ్ = మా మొరలు; ఆలింపగద = వినుము; అయ్య = నాయనా; గుణరత్ననిధి = కృష్ణా {గుణరత్ననిధి – సుగుణము లనెడి మణులకు నిధి వంటి వాడవు, కృష్ణుడు}.
భావము:- శ్రేష్ఠమైన గుణములకు నిధి వంటి వాడవు. నీమీద ఒట్టు వేసి చెప్తున్నాము. ఈ ఉరుములు, మెరుపులు, పిడుగుల మ్రోతలు, నీటిధారలు ఇంతకు మునుపు మేమెరుగము మా మొరాలకించవయ్యా!

తెభా-10.1-908-క.
వారి బరు వయ్యె మందల
వారికి; నిదె పరులు లేరు వారింపంగా;
వారిద పటల భయంబును
వారిరుహదళాక్ష! నేడు వారింపఁగదే. "

టీక:- వారి = నీరు; బరువయ్యెన్ = భరింపరానిదైపోయెను; మందలన్ = గొల్లపల్లెలలో ఉండెడి; వారి = వారల; కిన్ = కి; ఇదె = ఇదిగో; పరులు = ఇతరులు ఎవరును; లేరు = లేరు; వారింపంగా = తొలగించుటకు; వారిద = మేఘముల; పటల = సమూహములవలని; భయంబును = భయమును; వారిరుహదళాక్షా = కృష్ణా {వారిరుహ దళాక్షుడు - వారిరుహ (పద్మముల) దళా (రేకులవంటి) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు}; నేడు = ఇప్పుడు; వారింపగదే = పోగొట్టుము.
భావము:- ఓ నీరజనయనా! కృష్ణా! గోపకులకు ఈ వర్షం నీరు దుర్భరంగా ఉందయ్యా. ఈ బాధ నివారించే వారు నీవు తప్ప మరెవరున్నారు. మేఘాల గుంపుల వలన కలిగిన భీతిని తొలగించు."

తెభా-10.1-909-వ.
అనిన విని సర్వజ్ఞుండైన కృష్ణుం డంతయు నెఱింగి.
టీక:- అనినన్ = అనగా; విని = విని; సర్వజ్ఞుండు = సమస్తము తెలిసినవాడు; ఐన = అయిన; కృష్ణుండు = కృష్ణుడు; అంతయున్ = జరిగిన దంతా; ఎఱింగి = తెలుసుకొని.
భావము:- పెద్దవారైన గోపకుల మాటలు విని, సర్వజ్ఞుడైన శ్రీ కృష్ణుడు, అదంతా దేవేంద్రుడి పని అని గ్రహించాడు.

తెభా-10.1-910-ఉ.
న్నొక యింతగైకొనరు; ప్పిరి; యాగము చేసి రంచుఁ దా
మిన్నుననుండి గోపకులమీఁద శిలల్ గురియించుచున్న వాఁ
డున్నత నిర్జరేంద్ర విభవోద్ధతి గర్వనగాధిరూఢుడై
న్నులఁ గానఁ డింద్రుఁ డిటు; ర్వపరుం డొరుఁ గాన నేర్చునే?

టీక:- తన్ను = అతనిని; ఇంతన్ = కొంచెముకూడ; కైకొనరు = లక్ష్యపెట్టరు; తప్పిరి = వాడుక తప్పించిరి; యాగము = యాగము; చేసిరి = చేసితిరి; అంచున్ = అని; తాన్ = అతను; మిన్నునన్ = ఆకాశము నందు; ఉండి = ఉండి; గోపకుల = గొల్లవారి; మీదన్ = పైన; శిలల్ = రాళ్ళను; కురియించుచున్ = వర్షించుచు; ఉన్నవాడు = ఉన్నాడు; ఉన్నత = ఉన్నతమైన; నిర్జరేంద్ర = దేవేంద్ర పదవీ; విభవ = వైభవము అనే; ఉద్ధతి = గొప్పదనంతో కలిగిన; గర్వ = గర్వము అనెడి; నగ = పర్వతము; అధిరూఢుడు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; కన్నుల గానడు = కళ్ళు కనిపించుట లేదు; ఇంద్రుడు = ఇంద్రుడు; ఇటు = ఈ విధముగ; గర్వపరుండు = గర్వించినవాడు; ఒరున్ = ఇతరులను; కానన్ = చూడ; నేర్చునే = నేర్చునా, నేరడు.
భావము:- ఉన్నతమైన అమరాధిపత్యం అందిందని దేవేంద్రుడు పర్వతం అంత గర్వం ఎక్కి ఉన్నాడు. ఇలాంటి కన్నులు కనిపించని అహంకారం గలవాడు ఇతరులను ఎలా కనగలడు. గోపకులు తన్ను తృణీకరించి ఇంద్రయాగం చేయడం మానివేశారని ఆకాశం నుండి ఇలా శిలావర్షం కురిపిస్తున్నాడు.

తెభా-10.1-911-క.
దేత లందఱు నన్నునె
సేవింతురు; రాజ్యమదముఁ జెందరు; చెఱుపం
గా లదు; మానభంగముఁ
గావింపఁగ వలయు శాంతి లిగెడుకొఱకై."

టీక:- దేవతలు = దేవతలు; అందఱున్ = ఎల్లరు; నన్నునె = నన్ను మాత్రమే; సేవింతురు = కొలచెదరు; రాజ్య = పాలనాధికారము వలని; మదమున్ = గర్వమును; చెందరు = పొందరు; చెఱుపంగా = నశింపజేయుట; వలదు = అక్కరలేదు; మాన = గర్వమును; భంగము = అణచివేయుట; కావింపగవలయున్ = చేయవలెను; శాంతి = శాంతి; కలిగెడు = నెలకొనుట; కొఱకు = కోసము; ఐ = అయ్యి.
భావము:- దేవతలు అందరూ నన్ను భక్తితో కొలుస్తారు. వారికి రాజ్యమదం లేదు. కనుక, వారికి చెరుపు చేయరాదు. వారి అహంకారం అణగిపోయేటట్లు, వారికి గర్వభంగం చెయ్యాలి.

తెభా-10.1-912-వ.
అని చింతించి శిలావర్షహతులై శరణాగతులైన ఘోషజనుల రక్షించుట తగవని, సకలలోక రక్షకుండైన విచక్షణుండు.
టీక:- అని = అని; చింతించి = ఆలోచించి; శిలా = రాళ్ళ; వర్ష = వానచేత; హతులు = కొట్టబడినవారు; ఐ = అయ్యి; శరణాగతులు = శరణు కోరువారు; ఐన = అయినట్టి; ఘోష = గొల్లపల్లె; జనులన్ = ప్రజలను; రక్షించుట = కాపాడుట; తగవు = తగిన పని; అని = అని; సకల = సమస్తమైన; లోక = జగత్తునకు; రక్షకుండు = పాలించువాడు; ఐన = అయిన; విచక్షణుండు = వివేకి.
భావము:- అని ఆలోచించిన గోపాలకృష్ణుడు శిలావర్షం వలన ఆపన్నులై తన్ను శరణుజొచ్చిన గోకులవాసులను రక్షించడం న్యాయమని ఆ సమస్త భువనాలనూ కాపాడే వాడు నిశ్చయించాడు .

తెభా-10.1-913-చ.
"లఁగకుఁడీ వధూజనులు; కంపము నొందకుఁడీ వ్రజేశ్వరుల్;
లఁగకుఁడీ కుమారకులు; క్కినవారలు ఱాలవానచే
యకుఁడీ; పశువ్రజము క్కడ నక్కడ నిల్వనీకుఁడీ;
మెలుపున మీకు నీశ్వరుఁడు మేలొసఁగుం గరుణార్ద్రచిత్తుఁడై."

టీక:- కలగకుడీ = కలత చెందకండి; వధూజనులు = స్త్రీలు; కంపమునొందకుడీ = భీతితో వణకి పోకండి; వ్రజ = గొల్లల; ఈశ్వరుల్ = నాయకులు; తలగకుడీ = తొలగిపోకండి; కుమారకులు = చిన్నపిల్లలు; తక్కినవారలు = ఇతరులు ఎవరును; ఱాల = రాళ్ళ; వానన్ = వర్షము; చేన్ = వలన; అలయకుడీ = సంకట పడకండి; పశు = పశువుల; వ్రజమున్ = సమూహములను; అక్కడక్కడ = విడివిడిగా; నిల్వనీకుడీ = నిలబడ నీయకండి; మెలుపునన్ = మెలకువతో; మీ = మీ; కున్ = కు; ఈశ్వరుండు = భగవంతుడు; మేలు = మంచిని, శుభమును; ఒసగున్ = కలిగించును; కరుణ = దయారసముచేత; ఆర్ద్ర = కరిగిన; చిత్తుడు = మనసు కలవాడు; ఐ = అయ్య.
భావము:- “ఓ వనితలారా! కలతచెందకండి ఓ గొల్ల నాయకులారా! కంగారు పడకండి. బాలకులారా! పరుగులు పెట్టకండి. మిగతా వాళ్ళందరూ శిలావర్షానికి వగవకండి. ముందు పసుల మందలను అక్కడక్కడ కాక ఒక్క చోటికి చేర్చండి. దయామయ హృదయంతో పరమేశ్వరుడు మీకు మేలు చేస్తాడు.”