పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గ్రీష్మఋతు వర్ణనము

తెభా-10.1-717-సీ.
దినము లంతంతకు దీర్ఘంబులై యుండ-
దిననాథుఁ డుత్తుర దిశఁ జరించె;
నాఁటినాటికి నెండ వ్యమై ఖర మయ్యె-
వెచ్చని గాడ్పులు విసరఁ జొచ్చె;
మేదినీరేణువుల్ మింట సంకుల మయ్యె-
నేఱులుఁ గొలఁకులు నిగిరిపోయెఁ;
బానీయ శాలలఁ థిక సంఘము నిల్చెఁ-
ప్పరంబుల భోగియము డాఁగెఁ;

తెభా-10.1-717.1-ఆ.
రులఁ గుసుమ చయము ళములతో వాడె;
మిథునకోటికి రతి మెండు దోఁచె;
ఖిలజంతుభీష్మమైన గ్రీష్మము రాకఁ
గీలి యడవులందుఁ గేలి సలిపె.

టీక:- దినములు = పగళ్ళు; అంతకంతకు = అంతటంతటికి; దీర్ఘంబులు = పెద్దవి; ఐ = అగుచు; ఉండన్ = ఉండగా; దిననాథుడు = సూర్యుడు {దిననాథుడు - పగళ్ళకు అధిపతి, సూర్యుడు}; ఉత్తరదిశ = ఉత్తరపువైపు, ఉత్తరాయణమున; చరించెన్ = తిరుగసాగెను; నాటినాటికి = రోజురోజుకి; ఎండ = ఎండ; నవ్యము = కొత్తది; ఐ = అయ్యి; ఖరము = తీక్షణము; అయ్యెన్ = అయినది; వెచ్చని = వేడి; గాడ్పులు = ఉష్ణవాయువులు; విసరన్ = వీచుట; చొచ్చెన్ = మొదలిడెను; మేదినీరేణువు = ధూళిధూసరితములు; మింటన్ = ఆకాశమునందు; సంకులము = రేగినవి; అయ్యెన్ = అయినవి; ఏఱులున్ = కాలువలు; కొలకులున్ = చెరువులు; ఇగిరి = ఎండి; పోయినవి = పోయినవి; పానీయశాలలన్ = మంచినీటి పందిరుల లందు; పథిక = బాటసారులు; సంఘము = సమూహము; నిల్చెన్ = నిలబడిపోతుంటిరి; చప్పరంబులన్ = మంచెపట్టు లందు; భోగి = పాముల; చయమున్ = సమూహములు; డాగి = దాగుకొనెను; తరులన్ = చెట్ల; కుసుమ = పూల.
చయమున్ = గుత్తులు; దళముల = పూరేకుల; తోన్ = తోటి; వాడెన్ = వాడిపోయినవి; మిథున = దంపతుల; కోటి = సమూహములు; కిన్ = కు; రతి = భోగము లందు; మెండు = అధిక్యము; తోచెన్ = కనిపించసాగెను; అఖిల = సమస్తమైన; జీవులకు = జంతువులకు; భీష్మము = భయంకరమైనది; ఐన = అయిన; గ్రీష్మము = గ్రీష్మఋతువు; రాకన్ = వచ్చినప్పుడు; కీలి = కృష్ణుడ; అడవుల = అడవుల; అందున్ = లో; కేలి = క్రీడగా; సలిపెన్ = గడిపెను.
భావము:- అలా గ్రీష్మ ఋతువు రావడంతో పగటి సమయాలు అంతకంతకూ పెరుగుతూ ఉన్నాయి. సూర్యుడు ఉత్తర దిక్కు వైపు సంచరిస్తున్నాడు. ఎండ రోజు రోజుకి తీక్షణం అవుతోంది. వేడి గాడ్పులు విసురుతున్నాయి. భూమి నుండి లేచిన ధూళిరేణువులు గాలిలో ఆకాశమంతా వ్యాపించాయి. సెలయేళ్ళలో కొలనులో నీళ్ళు ఇగిరిపోయాయి. చలివేంద్రశాలలో బాటసారులు చేరుతున్నారు. పాములు ఎండలు భరించలేక పొదలలో దూరిపోయాయి. చెట్లు పూలు ఆకులతో సహా మాడిపోయాయి. సర్వజీవులకూ భయంకరమైన గ్రీష్మ ఋతువు రావడంతో అగ్నిదేవుడు అడవులతో ఆడుకోసాగాడు.

తెభా-10.1-718-ఆ.
వాఁడిరుచులు గలుగువాని వేఁడిమి గ్రీష్మ
కాలమందు జగము లయఁబడియె
బ్రహ్మ జనులకొఱకు బ్రహ్మాండఘటమున
నుష్ణరసముఁ దెచ్చి యునిచె ననఁగ.

టీక:- వాడి = తీక్షణమైన; రుచులు = కిరణములు; కలుగువాని = ఉండువాని, సూర్యుని; వేడిమి = వేడి; గ్రీష్మకాలము = గ్రీష్మఋతువు; అందున్ = అందు; జగము = లోకమున; కలయబడియె = కమ్ముకొనెను; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; జనుల = ప్రజల; కొఱకున్ = కోసము; బ్రహ్మాండ = బ్రహ్మాండ మనెడి; ఘటమున = భాండమున; ఉష్ణ = వేడి అనెడి; రసమున్ = రసమును; తెచ్చి = తీసుకు వచ్చి; ఉనిచెను = ఉంచెను; అనగ = అన్నట్లుగా.
భావము:- తీవ్రమైన కిరణాలు కల సూర్యుని వేడికి ఆ వేసవికాలంలో లోకమంతా కలవరపడిపోయింది. బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండమనే భాండంలో ఉష్ణ రసాన్ని తెచ్చి ఈ జనులందరి కోసం నింపాడా అన్నట్లు ఉంది.

తెభా-10.1-719-వ.
ఇట్లాభీలంబైన నిదాఘకాలంబు వర్తింప బృందావనంబు రామ గోవింద మందిరంబైన కతంబున నిదాఘకాల లక్షణంబులం బాసి, నిరంతర గిరినిపతిత నిర్ఝర శీకర పరంపరా భాసిత పల్లవిత కుసుమిత తరులతం బయ్యును, దరు లతా కుసుమ పరిమళ మిళిత మృదుల పవనం బయ్యును, బవనచలిత కమల కల్హార సరోవర మహాగభీర నదీహ్రదం బయ్యును, నదీహ్రద కల్లోల కంకణ ప్రభూత పంకం బయ్యును, బంక సంజనిత హరితాయమాన తృణనికుంజ బయ్యును, జనమనోరంజనంబయిన వసంతకాల లక్షణంబులు గలిగి లలితమృగపక్షి శోభింతంబై యొప్పుచుండె; మఱియు నందు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; ఆభీలంబు = భయంకరమైనది; ఐన = అయినట్టి; నిదాఘకాలంబు = వేసవికాలము; వర్తింపన్ = రాగా; బృందా = బృంద యనెడి; వనంబు = అడవి; రామ = బలరాముడు; గోవింద = కృష్ణుడు; మందిరంబు = నివాసము; ఐన = అయినట్టి; కతంబునన్ = కారణముచేత; నిదాఘకాల = వేసవికాలపు; లక్షణంబులన్ = లక్షణములను; పాసి = విడిచి; నిరంతర = ఎడతెగని; గిరి = కొండలనుండి; నిపతిత = పడునట్టి; నిర్ఝర = సెలయేళ్ళ యందలి; శీకర = తుంపుర్ల యొక్క; పరంపరా = జల్లుచే; భాసిత = ప్రకాశించెడి; పల్లవిత = చిగురించిన; కుసుమిత = పుష్పించిన; తరు = చెట్లు గలది; లతంబు = లతలు కలది; అయ్యున్ = అయ్యి; తరు = వృక్షములు; లతా = తీగలు యొక్క; కుసుమ = పూల; పరిమళ = సువాసనలు; మిళిత = కలిసిన; మృదుల = మిక్కిలి సున్నితమైన; పవనంబు = గాలులు కలది; అయ్యున్ = అయ్యి; పవన = గాలిచేత; చలిత = కదలింపబడిన; కమల = తామర; కల్హార = ఎఱ్ఱ కలువలు కల; సరోవర = చెరువులు; మహా = మిక్కిలి; గభీర = లోతైన; నదీ = నది యందలి; హ్రదంబున్ = మడుగు కలది; అయ్యున్ = అయ్యి; నదీ = నది యందలి; హ్రద = మడుగు యొక్క; కల్లోల = పెద్ద అలలవలని; కంకణ = నీటితుంపురలవలన; ప్రభూత = బాగా ఏర్పడిన; పంకంబు = బురద కలది; అయ్యున్ = అయ్యి; పంక = బురద యందు; సంజనిత = మొలచిన; హరితాయమాన = పచ్చగా నగుచున్న; తృణ = గడ్డి; నికుంజంబు = పొదలు కలది; అయ్యున్ = అయ్యి; జన = ప్రజల; మనః = మనసులకు; రంజనంబు = ఇంపును పుట్టించునది; అయిన = అయినట్టి; వసంతకాల = వసంత ఋతువు యొక్క; లక్షణంబులున్ = లక్షణములను; కలిగి = ఉండి; లలిత = మనోహరమైన; మృగ = జంతువులు; పక్షి = పక్షులతో; శోభితంబు = ప్రకాశించునది; ఐ = అయ్యి; ఒప్పుచున్ = అందగించి; ఉండెన్ = ఉండెను; మఱియున్ = ఇంకను; అందున్ = దానిలో.
భావము:- ఇలా భయంకరమైన వేసవికాలం నడుస్తూ ఉంటే, బృందావనం మాత్రం బలరామకృష్ణులు నివసిస్తూ ఉండటంతో చల్లగా ఉంది. వేసవికాలపు లక్షణాలు అక్కడ కనిపించడం లేదు. కొండల మీద నుండి ఎప్పుడూ ప్రవహిస్తూ ఉన్న సెలయేళ్ళ నుండి నీటితుంపరలు తెరలు తెరలుగా వస్తూ ఉంటే అక్కడి చెట్లు తీగలు చిగిర్చి, పూలు పూస్తున్నాయి. ఆ పూల నుండి వెలువడే సువాసనలు గాలిలో తేలి తేలి వస్తున్నాయి. అక్కడ కొలనులలో నదులలో మడుగులలో కలువపూవులు తామరపూవులు మందమారుతాలకు కదలి ఊయల లూగుతున్నాయి. బురదల్లో పచ్చని పచ్చిక గుబుర్లు పుట్టి పెరుగుతున్నాయి. ఆ బృందావనం ప్రజల మనస్సులను సంతోషపరుస్తూ వసంతకాలపు లక్షణాలలో అందమైన మృగాలతో పక్షులతో చాలా మనోహరంగా ఉంది. ఇంకా అక్కడ. . . .
ఇలా ముక్తగ్రస్తంతో అలంకరించి చెప్పడంలో భగద్భక్తి ఎన్నిసార్లు చేజార్చుకున్నా మరల మరల పట్టుకుంటూనే ఉండాలని కవిబ్రహ్మ భావమేమో.
[. . . తరులతం . . , దరు లతా . . . పవనం . . . బవన . . . . నదీహ్రదం , , నదీహ్రద , , , పంకం . . బంక . . . ]

తెభా-10.1-720-క.
పిముల కోలాహలమును,
శుసంఘము కలకలంబు, సుభగ మయూర
ప్రరము కేకారవ, మళి
నిరము రొదయును జెలంగె నెఱి నయ్యడవిన్.

టీక:- పికముల = కోకిలల; కోలాహలమును = కలకలారావము; శుక = చిలుకల; సంఘము = సమూహము యొక్క; కలకలంబున్ = కలకలధ్వని; సుభగ = అందమైన; మయూర = నెమళ్ళ; ప్రకరము = సమూహము యొక్క; కేకా = కేకల; రవము = అరుపులు; అళి = తుమ్మెదల; నికరము = గుంపు; రొదయును = ఝంకారధ్వని; చెలగె = చెలరేగెను; నెఱిన్ = నిండుదనముతో; ఆ = ఆ యొక్క; అడవిన్ = అడవి యందు.
భావము:- కోకిలల కోలాహలము; చిలుకల కలకల ధ్వనులు; నెమళ్ళ కేకలు; తుమ్మెదల రొదలు తోకూడి ఆ అడవిలో చక్కని వాతావరణం నెలకొల్పింది.

తెభా-10.1-721-క.
త యమునా సరసీ
జా తరంగాభిషిక్త లరుహ గంధో
పేతానిల మడఁచె నిదా
ఘాత దావాగ్నిపీడ వ్వనమందున్.

టీక:- ఆతత = విస్తారమైన; యమునా = యమునానది యందలి; సరసీ = చెరువులందు; జాత = పుట్టిన; తరంగ = అలల లందు; అభిషిక్త = స్నానముచేసిన; జలరుహ = పద్మమముల; గంధ = పరిమళములచే; ఉపేత = కూడుకున్న; అనిలము = గాలి; అడచెన్ = అణచివేసెను; నిదాఘ = వేసవికాలపు; ఆతత = విస్తారమైన; దావగ్ని = కార్చిచ్చువంటి; పీడన్ = బాధను; ఆ = ఆ యొక్క; వనము = అడవి; అందున్ = అందు.
భావము:- అగ్నిని వాయువు రెచ్చకొట్టడం సహజం. కాని యమున మడుగులోని కెరటాలు తామరపూలను తడుపుతూ ఉంటే, ఆ సువాసనలను మోసుకొస్తున్న అక్కడి తడిసిన చల్లని గాలి వలన అడవిలోని వేసవి కాలపు దావాగ్ని వలన కలిగే తాపం అణిగిపోతోంది.

తెభా-10.1-722-వ.
ఇట్లామని కందువ తెఱంగు గలిగి సుందరంబైన బృందావనంబునకు బలకృష్ణులు గోవుల రొప్పికొని చని, గోపకులుం దారును నొండొరులతో నగుచుఁ, దెగడుచుఁ, జెలంగుచుఁ, దలంగుచు. జిఱజిఱందిరుగుచుఁ, దరులసందుల కరుగుచు, దాఁగిలిమూత లాడుచు, గీతంబులు బాడుచు, వేణునాదంబులు ఘటియించుచు, నటియించుచు, గతులు దప్పినక్రియ నొఱఁగుచుఁ, గుప్పల కుఱుకుచుఁ జప్పటలుగొట్టుచుఁ, గందుకంబులఁ దట్టుచు నుప్పరం బెగసి దర్దురంబుల చందంబున దాఁటుచు, నామలకబిల్వాది ఫలంబుల మీఁటుచుఁ, గుటవిటపంబులుఁ గదల్చుచు, మృగంబుల నదల్చుచుఁ, బెరల రేఁపుచు, మధుమక్షికలఁ జోపుచుఁ, దేనియలు ద్రావుచు, సొమ్మసిలం బోవుచు, గురుశిష్య కల్పనంబులం బనులు చేయుచుఁ, గాకపక్షధరులై ముష్టియుద్ధంబుల డాయుచుఁ, బన్నిదంబులు చఱచుచుఁ, బులుగుల భంగి నఱచుచు, బహురూపంబులు పన్నుచు, నెగిరి తన్నుచు, సేవ్యసేవక మిత్రామిత్ర భావంబులు వహించుచు, నుత్సహించుచు మఱియు ననేకవిధంబులఁ గ్రీడించి; రందు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; ఆమని = వసంత; కందువన్ = ఋతువు; తెఱంగు = విధము; కలిగి = ఉండి; సుందరంబు = అందమైనది; ఐన = అయిన; బృందావనంబున్ = బృందావనమున; కున్ = కు; బల = బలరాముడు; కృష్ణులు = కృష్ణుడు; గోవులన్ = పశువులను; రొప్పికొని = తోలుకొని; చని = వెళ్ళి; గోపకులున్ = పశువుల కాపరులు; తారును = వారు; ఒండొరులతోన్ = ఒకరితో నొకరు; నగుచున్ = నవ్వుకొనుచు; తెగడుచున్ = తిట్టుకొనుచు; చెలంగుచున్ = చెలరేగిపోతూ; తలంగుచున్ = తప్పించుకొంటు; జిఱజిఱన్ = గిరగిర; తిరుగుచన్ = తిరుగుతు; తరుల = చెట్ల; సందులన్ = మధ్యకి; అరుగుచు = వెళుతు; దాగిలిమూతలు = దాగుడుమూతలు; ఆడుచున్ = ఆడుకొనుచు; గీతంబులున్ = పాటలు; పాడుచున్ = పాడుతు; వేణు = మురళీ; నాదంబులు = రవములు; ఘటియించుచు = చేయుచు; నటియించుచున్ = నాట్యములు చేయుచు; గతులు = తెలివి; తప్పిన = తప్పుతున్న; క్రియన్ = వలె; ఒఱగుచున్ = వాలిపోతూ; కుప్పల = గుట్టలమీద; కున్ = కు; ఉఱుకుచు = దుముకుచు; చప్పటలున్ = చప్పట్లు; కొట్టుచున్ = చరచుచు; కందుకంబులన్ = బంతులను, చెండ్లను; తట్టుచున్ = కొడుతు; ఉప్పరంబు = మీదికి; ఎగసి = ఎగిరి; దర్దురంబుల = కప్పల; చందంబునన్ = వలె; దాటుచున్ = గెంతుతు; ఆమలక = ఉసిరిక; బిల్వ = మారేడు; ఆది = మున్నగు; ఫలంబులన్ = పండ్లను; మీటుచున్ = రాల్చుచు; కుట = చెట్ల; విటపంబులన్ = కొమ్మలను; కదల్చుచున్ = ఊపుతు; మృగంబులన్ = జంతువులను; అదల్చుచున్ = బెదిరించుచు; పెరలన్ = తేనెపట్టులను; రేపుచు = రేగగొట్టుచు; మధుమక్షికలన్ = తేనెటీగలను; జోపుచున్ = చెదరగొట్టుచు; తేనియల్ = తేనెలను; త్రావుచున్ = తాగుతు; సొమ్మసిలంబోవుచు = మూర్ఛిల్లుతు; గురు = గురువులు; శిష్య = శిష్యులు అని; కల్పనంబులన్ = ఏర్పరచుకొనుచు; పనులున్ = గురువులు చెప్పిన పనులు; చేయుచు = చేస్తు; కాకపక్షధరులు = పిలకలు కలవారు, ఉత్తుత్తి మిత్ర శత్రు పక్షములు కల్పించుకున్నవారు; ఐ = అయ్యి; ముష్టియుద్ధంబులన్ = కుస్తీపట్లకు; డాయుచున్ = చేరుచు; పన్నిదంబులు = పందెములు; చఱచుచున్ = వేసికొనుచు; పులుగుల = పక్షులతో; భంగిన్ = వలె; అఱచుచున్ = కూయుచు; బహు = అనేకమైన; రూపంబులున్ = బొమ్మలు; పన్నుచున్ = చేయుచు; ఎగిరి = ఎగిరి; తన్నుచున్ = తన్నుతు; సేవ్య = కొలవబడువాని; సేవక = కొలచెడివాని; మిత్ర = స్నేహపు; అమిత్ర = శత్రత్వపు; భావంబులున్ = అనురీతులను; వహించుచున్ = ధరించుచు; ఉత్సహించుచున్ = పూనుతు; మఱియున్ = ఇంకను; అనేక = బహు; విధంబులన్ = విధములుగా; క్రీడించిరి = విహరించిరి; అందున్ = వానిలో.
భావము:- వసంతఋతువు ఆవరించి ఉన్నట్లు అందంగా ఉన్న బృందావనానికి బలరామకృష్ణులు గోవులను తోలుకుని వెళ్ళారు. గోపకులు తాము ఒకరి నొకరు హాస్యాలాడుకుంటూ, నెట్టుకుంటూ, ఎగురుతూ, తిరుగుతూ, చెట్ల సందులలో పరిగెడుతూ, నాట్యాలు చేస్తూ, వేణువులు వాయిస్తూ, కుప్పలమీదకు దూకుతూ, చప్పట్లు చరుస్తూ, బంతు లాడుతూ, కప్పల్లా గెంతుతూ, ఉసిరిక మారేడు పండ్లను ఎగురవేస్తూ, చెట్లు ఊపుతూ, జంతువులను తోలుతూ, తేనెటీగలను దూరంగా తరుముతూ, తేనెలు తాగుతూ, గురు శిష్యుల ఆటలాడుతూ, ముష్టి యుద్ధాలు చేస్తూ, పందాలు కాస్తూ, పక్షుల వలె అరుస్తూ, రకరకాల వేషాలు వేస్తూ, సేవకుడు యజమాని మిత్రుడు శత్రువు మొదలైన భావాలు కల్పించుకుంటూ, ఉత్సాహంతో ఇంకా ఎన్నో విధాలుగా ఆటలు ఆడుకున్నారు.

తెభా-10.1-723-క.
"మా పాలికి బలకృష్ణులు
భూపాలకు"లంచు నెగిరి బొబ్బ లిడుచు నా
గోపాలురు మోతురు ప్రమ
దాపాదకు లగుచు వల్లికాందోళికలన్.

టీక:- మా = వారల; పాలికి = మట్టుకు; బల = బలరాముడు; కృష్ణులు = కృష్ణుడు; భూపాలకులున్ = రాజులు; అంచున్ = అని; ఎగిరి = ఉత్సాహముచెంది; బొబ్బలు = కేకలు; ఇడుచున్ = పెట్టుచు; ఆ = ఆ యొక్క; గోపాలురు = గోపాలకులు; మోతురు = మోయుదురు; ప్రమద = మిక్కిలి సంతోషమును; ఆపాదకులు = పొందినవారు; అగుచున్ = ఔతు; వల్లికా = తీగల; ఆందోళికలన్ = అందలము లందు.
భావము:- “మా పాలిటికి బలరామకృష్ణులే రాజులు” అని జేజేలు కొడుతూ ఆ గోపాలకులు తీగలతో అల్లిన పల్లకీలలో వారిని కూర్చుండబెట్టి మోస్తూ, ఎంతో సంతోషంతో ఉన్నారు.

తెభా-10.1-724-క.
గోకు లందఱు నాడుచు
దీపింపఁగ రామవాసుదేవుల వెనుకం
బై డి పాఠక గాయక
రూపంబులఁ బొగడుదురు నిరూఢాత్మకులై.

టీక:- గోపకులు = గొల్లవాళ్ళు; అందఱున్ = ఎల్లరు; ఆడుచున్ = నృత్యములు చేయుచు; దీపింపగన్ = ప్రకాశించునట్లుగా; రామ = బలరాముడు; వాసుదేవుల = కృష్ణుడు {వాసుదేవుడు - వసుదేవుని పుత్రుడు, కృష్ణుడు}; వెనుకన్ = వెంబడిని; పైపడి= కవియుచు; పాఠక = వంది {పాఠకుడు - వంశావళి వర్ణించుచు జీవించువాడు, వంది}; గాయక = మాగధుల {గాయకుడు - బిరుదులను ఉగ్గడించి కీర్తించుచు జీవించువాడు, గాయకుడు, మాగధుడు}; రూపంబులన్ = వలె; పొగడుదురు = స్తుతింతురు; నిరూఢ = మిక్కిలి దృఢమైన; ఆత్మకులు = మనసు కలవారు; ఐ = అయ్యి.
భావము:- అలా అటలలో గోపబాలకులు అందరూ ఉత్సాహంతో బలరామకృష్ణుల వెనుక నడుస్తూ స్తోత్ర పాఠకుల లాగ మంచి మనస్సులతో పొగడుతూ ఉండేవారు.

తెభా-10.1-725-క.
ప్రీతిన్ గోపకు లందఱు
గీతంబులు పాడఁ దరుల క్రిందను నగుచుం
జేతులు ద్రిప్పుచు వెడవెడ
పార లాడును యశోదపాపం డడవిన్.

టీక:- ప్రీతిన్ = ఇష్టముగా; గోపకులు = యాదవులు; అందఱున్ = ఎల్లరు; గీతంబులున్ = పాటలు; పాడన్ = పాడుచుండగా; తరుల = చెట్ల; క్రిందను = కింద; నగుచున్ = నవ్వుతు; చేతులున్ = చేతులను; త్రిప్పుచున్ = తిప్పుతూ; వెడవెడన్ = మృదువుగా; పాతరలు = నాట్యములు; ఆడును = చేయును; యశోదపాపండు = కృష్ణుడు {యశోదపాపడు - యశోదాదేవి పిల్లవాడు, కృష్ణుడు}; అడవిన్ = అడవి యందు.
భావము:- గోపబాలకులు అందరూ చెట్ల క్రింద చేరి, ఎంతో ప్రీతిగా పాటలు పాడుతూంటే, కృష్ణుడు నవ్వుతూ చేతులు త్రిప్పుతూ మృదువుగా నాట్యం చేస్తూ ఉండేవాడు.

తెభా-10.1-726-మ.
జాక్షుండును రాముఁడున్ నటనముల్ల్పంగ గోపాల మూ
ర్తుతో వారలఁ గొల్చు నిర్జరులు సంతోషించి, వేణుస్వనం
బులుగావించుచుఁ గొమ్ములూదుచు శిరంబుల్ద్రిప్పుచుం బాడుచున్
నొప్పన్ వినుతించి రప్పుడు నటుల్ ర్ణించు చందంబునన్.

టీక:- జలజాక్షుండును = పద్మాక్షుడు, కృష్ణుడు; రాముడున్ = బలరాముడు; నటనముల్ = నృత్యములు; సల్పంగన్ = చేయుచుండగా; గోపాల = గొల్లవాళ్ళ; మూర్తుల్ = రూపముల; తోన్ = తోటి; వారలన్ = వారిని; కొల్చు = సేవించెడి; నిర్జరులున్ = దేవతలు {నిర్జరులు - జర (ముసలితనము లేనివారు), దేవతలు}; సంతోషించి = ఆనందించి; వేణు = పిల్లనగ్రోవి; స్వనంబులు = రవములు; కావించుచున్ = ఊదుతు; కొమ్ములున్ = కొమ్ముబూరాలు; ఊదుచున్ = ఊదుతు; శిరంబుల్ = తలలు; త్రిప్పుచున్ = ఆడించుచు; పాడుచున్ = పాటలు పాడుతు; వలనొప్పన్ = అందగించునట్లుగ; వినుతించిరి = స్తోత్రములు చేసిరి; అప్పుడు = ఆ సమయము నందు; నటుల్ = నాటకులు; వర్ణించు = వర్ణించెడి; చందంబునన్ = విధముగ.
భావము:- బలరామకృష్ణులు నాట్యాలు చేస్తుంటే, వారి చుట్టూ గోపాలకులుగా ఉంటూ ఉన్న దేవతలు సంతోషించేవారు. వేణుగానాలు చేస్తూ, కొమ్ముబూరలు ఊదుతూ, తలలు తిప్పుతూ, పాటలు పాడుతూ, చక్కగా స్తోత్రాలు చేసేవారు. నటులు ఏవిధంగా నటనలు చేస్తూ, వర్ణనలు చేస్తుంటారో, అలాగే వీరూ ఆడుతూ పాడుతూ ఉండేవారు.