పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గోపికల విరహపు మొరలు

తెభా-10.1-1038-క.
"నీవు జనించిన కతమున
నో! ల్లభ! లక్ష్మి మంద నొప్పె నధికమై
నీ వెంటనె ప్రాణము లిడి
నీ వా రరసెదరు చూపు నీ రూపంబున్.

టీక:- నీవున్ = నీవు; జనించిన = పుట్టుట; కతమునన్ = వలన; ఓ = ఓ; వల్లభ = ప్రియుడా; లక్ష్మి = సంపదలు; మందన్ = గొల్లపల్లెలో; ఒప్పెన్ = చక్కగా ఉన్నవి; అధికము = అతిశయించినవి; ఐ = అయ్యి; నీ = నీ; వెంటనే = కూడానే; ప్రాణములు = ప్రాణములను, ఆశలను; ఇడి = ఉంచి; నీ = నీకు చెందిన; వారు = వారు; అరసెదరు = వెదుకుతున్నారు; చూపు = చూపించుము; నీ = నీ యొక్క; రూపంబున్ = స్వరూపమును.
భావము:- “నాథా! నీవు పుట్టడంతో, గోకులంలో సిరి సంపదల సమృద్ధితో వర్థిల్లాయి. ప్రాణాలు అరచేత పెట్టుకుని నీవాళ్ళము అయిన మేము నీకోసం వెదుకుతున్నాము. నీ రూపం చూపించు.

తెభా-10.1-1039-క.
శాదకమలోదరరుచి
చోకమగు చూపువలన సుందర! మమ్ముం
గోరి వెల యీని దాసుల
ధీత నొప్పించు టిది వధించుట గాదే?

టీక:- శారద = శరత్కాలపు; కమల = పద్మముల; ఉదర = లోపలి; రుచిన్ = కాంతిని; చోరకము = దొంగిలించినది; అగు = ఐన; చూపు = చూపుల; వలన = చేత; సుందర = అందగాడా; మమ్మున్ = మమ్ములను; కోరి = అపేక్షించి; వెలయీని = జీతములేని; దాసులన్ = బంటులను; ధీరతన్ = ధైర్యముతో; నొప్పించుట = బాధపెట్టుట; ఇది = ఇది; వధించుట = చంపుటయే; కాదే = కాదా, అవును.
భావము:- ఓ అందగాడా! శరత్కాల కమలగర్భంలోని జిగిని దొంగిలించు నీచూపు వలన నిన్ను వలచి జీతబత్తెములు లేని దాసీలము అయ్యాము. అటువంటి మమ్మల్ని ధీరుడవై ఇలా వేధించుకు తినడం నిజంగా చంపడంతో సమానం సుమా.

తెభా-10.1-1040-ఆ.
విషజలంబువలన విషధరదానవు
లన ఱాలవానలన వహ్ని
లన నున్నవానివలనను రక్షించి
కుసుమశరునిబారిఁ గూల్పఁ దగునె?

టీక:- విషజలంబు = విషపూరిత మగు నీటి, (కాళియుని వలన విషపూరితమైన కాళిందీ జలము); వలన = నుండి; విషధర = సర్ప రూప (అఘాసుర); దానవు = రాక్షసుని; వలనన్ = నుండి; ఱాల = రాళ్ళ (వాన); వలనన్ = నుండి; వహ్ని = కార్చిచ్చు; వలనన్ = నుండి; ఉన్న = తక్కిన (ఆపదల); వాని = వాటి; వలనను = నుండి; రక్షించి = కాపాడి; కుసుమశరుని = మన్మథుని {కుసుమశరుడు - పూలబాణము వాడు, మన్మథుడు}; బారిని = బాధలకు దొరకునట్లు; కూల్పన్ = తోయుట; తగునే = యుక్తమేనా, కాదు.
భావము:- యమునానదీ జలాలలో విషం గ్రక్కు కాళీయుని వలన; సర్పరూపు డగు అఘాసురుని వలన; ఇంద్రుడు కురిపించిన రాళ్ళవాన వలన; అడవిలో చెలరేగిన కార్చిచ్చు వలన; ఇంకా ఎన్నో భయాల వలన; మమ్మల్ని కాపాడి, ఇప్పుడు ఇలా మన్మథ బాధలకి గురిచేయడం నీకు న్యాయమా?

తెభా-10.1-1041-ఉ.
నీవు యశోదబిడ్డడవె? నీరజనేత్ర! సమస్తజంతు చే
తో విదితాత్మ; వీశుఁడవు; తొల్లి విరించి దలంచి లోక ర
క్షావిధ మాచరింపు మని న్నుతి చేయఁగ సత్కులంబునన్
భూలయంబుఁ గావ నిటు పుట్టితి గాదె మనోహరాకృతిన్.

టీక:- నీవున్ = నీవు; యశోద = యశోదాదేవి యొక్క; బిడ్డడవె = కొడుకువా, అంతే కాదు; నీరజనేత్ర = పద్మాక్షుడా, కృష్ణుడా; సమస్త = సమస్తమైన; జంతు = జీవుల యొక్క; చేతస్ = చిత్తము లందు; విదిత = తెలియబడెడి; ఆత్మవు = పరబ్రహ్మవు; ఈశుడవు = సర్వనియామకుడవు; తొల్లి = ఇంతకు మునుపు; విరించి = బ్రహ్మదేవుడు; తలంచి = ధ్యానించి; లోక = జగత్తును; రక్షా = కాపాడునట్టి; విధమున్ = మార్గమును; ఆచరింపుము = చేయుము; అని = అని; సన్నుతి = స్తోత్రము; చేయగన్ = చేయగా; సత్ = మంచి; కులంబునన్ = వంశము నందు; భూవలయంబున్ = భూమండలమును; కావన్ = కాపాడుటకు; ఇటు = ఈ విధముగ; పుట్టితి = అవతరించితివి; కాదె = కదా; మనోహర = అందమైన; ఆకృతిన్ = రూపముతో.
భావము:- ఓ నలినాక్షా! నీవు కేవలం యశోద కుమారుడవే కాదయ్యా! నిఖిల దేహదారుల బుద్ధికి సాక్షీభూతుడ వైన అంతరాత్మవు పరమేశ్వరుడివి పూర్వం బ్రహ్మదేవుడు నిన్ను స్మరించి విశ్వ రక్షణం కావింపు మని నిన్ను వేడుకోగా భూమండలాన్ని ఉద్ధరించేందుకు ఇలా మనోజ్ఞ రూపంలో మేటి యదువంశంలో జన్మించావు.

తెభా-10.1-1042-ఆ.
రణసేవకులకు సంసార భయమును
బాఁపి శ్రీకరంబు ట్టు గలిగి
కామదాయి యైన రసరోజంబు మా
స్తకముల నునిచి నుపు మీశ!

టీక:- చరణ = పాదములను; సేవకుల = కొలచువారి; కున్ = కి; సంసార = సంసారము వలని; భయమును = భయమును; పాపి = పోగొట్టి; శ్రీ = లక్ష్మీదేవి, శుభములను; కరంబు = చేతిని, కలిగించుటందు; పట్టు = పట్టుకొనుట, పట్టుదల; కలిగి = ఉండి, పూని; కామదాయి = కోరికలుతీర్చునది; ఐన = అయినట్టి; కర = చేయి అనెడి; సరోజంబు = పద్మమును; మా = మా యొక్క; మస్తకములను = తలలపై; ఉనిచి = ఉంచి; మనుపుము = కాపాడుము; ఈశ = స్వామీ.
భావము:- నీపాదాలను కొలిచేవారికి సంసారం వల్ల కలిగే భయాన్ని తొలగించేదీ, లక్ష్మీదేవి హస్తాన్ని చేపట్టేది, అభీష్టములు అందించేది అయిన నీ కరకమలాన్ని మా శిరములపై ఉంచి మమ్మల్ని కాపాడు ప్రభూ!

తెభా-10.1-1043-ఉ.
గోవుల వెంటఁ ద్రిమ్మరుచుఁ గొల్చినవారల పాపసంఘముల్
ద్రోవఁగఁజాలి శ్రీఁ దనరి దుష్ట భుజంగఫణా లతాగ్ర సం
భావితమైన నీ చరణద్మము చన్నులమీఁద మోపి త
ద్భాజ పుష్పభల్ల భవబాధ హరింపు వరింపు మాధవా!

టీక:- గోవుల = ఆవుల; వెంటన్ = వెంబడి; త్రిమ్మరుచున్ = తిరుగుతు; కొల్చిన = నిను సేవించిన; వారలన్ = వారి; పాప = పాపములు; సంఘముల్ = సమూహములను; త్రోవంగన్ = తొలగించ; చాలి = సమర్థుడవై; శ్రీన్ = సంపదచేత; తనరి = చక్కగా ఉండి; దుష్ట = చెడ్డదైన; భుజంగ = సర్పము యొక్క; ఫణా = పడగలు అనెడి; లతా = తీగల; అగ్రమున్ = మీద; సంభావితము = గౌరవింపబడినది; ఐన = అయినట్టి; నీ = నీ యొక్క; చరణ = పాదము అనెడి; పద్మమున్ = పద్మమును; చన్నుల = మా స్తనముల; మీదన్ = పైన; మోపి = ఆనించి; తత్ = ఆ; భావజ = మన్మథుని; పుష్ప = పూల; భల్ల = బాణముల వలన; భవబాధన్ = కలిగెడి బాధను; హరింపు = పోగొట్టుము; వరింపు = మమ్ము ఆదరించుము; మాధవా = కృష్ణుడా.
భావము:- ఓ లక్ష్మీపతీ! ఆవుల వెంట సంచరించునదీ; సేవించు వారి పాపలు సమస్తం పోగొట్టగలిగినదీ; సిరితో ఒప్పునదీ; క్రూరుడైన కాళీయుని పడగలపై నటించేది అయిన నీ పాదపద్మాన్ని మా కుచాల మీద మోపి మాకు మన్మథుని బాణాలవల్ల ప్రాప్తించిన బాధ పరిహరించు. మమ్మల్ని స్వీకరించు.

తెభా-10.1-1044-క.
బురంజనియును సూక్తయు
ధురయు నగు నీదు వాణి రఁగించెను నీ
రామృత సంసేవన
విధి నంగజతాప మెల్ల విడిపింపఁ గదే.

టీక:- బుధ = బ్రహ్మజ్ఞానులను; రంజనియునున్ = రంజిల్లచేయునది; సూక్తయున్ = మంచి తెలుపునది; మధురయున్ = ఇంపైనది; అగు = అయినట్టి; నీదు = నీ యొక్క; వాణి = పలుకు; మరగించెను = లాలస పుట్టించెను; నీ = నీ యొక్క; అధరామృత = ముద్దులను; సంసేవన = చక్కగా అనుభవించెడి; విధిన్ = మార్గమున; అంగజ = మన్మథ; తాపము = తాపము; ఎల్లన్ = అంతటిని; విడిపింపగదే = తొలగించుము.
భావము:- పండితులకు ఇంపు గూర్చునదీ, చక్కగా పలుకబడునదీ, తీయనిదీ అయిన నీ పలుకు మమ్మల్ని మరులు కొల్పింది. నీ యధరామృతం జుఱ్ఱిపించి మా మదనతాపమంతా తొలగించు

తెభా-10.1-1045-క.
గువల యెడ నీ క్రౌర్యము
గునే? నిజభక్తభీతిమనుఁడ వకటా!
దు భవద్దాసులకును
గు మొగముం జూపి కావు ళినదళాక్షా!

టీక:- మగువల = స్త్రీల; ఎడన్ = అందు; ఈ = ఇట్టి; క్రౌర్యము = కఠినత్వము; తగునే = యుక్తమైనదేనా, కాదు; నిజ = నీ; భక్త = భక్తుల యొక్క; భీతిన్ = భయమును; దమనుడవు = అణచివేయు వాడవు; అకట = అయ్యో; తగదు = తగినపనికాదు ఇది; భవత్ = నీ యొక్క; దాసుల్ = భక్తుల; కున్ = కు; నగు = చిరునవ్వుతో కూడిన; మొగమున్ = ముఖమును; చూపి = చూపించి; కావు = కాపాడుము; నళినదళాక్షా = కృష్ణా {నళినదళాక్షుడు - నళినదళముల (పద్మపు రేకుల) వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}.
భావము:- ఓ లక్ష్మీపతీ! అయ్యో స్త్రీల పట్ల ఇంత క్రూరత్వము చూప వచ్చునా? నీవు భక్తుల భయం పోకార్చువాడవు కదా. మరి నీ దాసులమైన మాకు నీ నగు మోము చూపించి కాపాడవా.

తెభా-10.1-1046-మ.
లక్ష్మీ యుతమై మహా శుభదమై కామాది విధ్వంసియై
కాది స్తుతమై నిరంతర తప స్సంతప్తపున్నాగ జీ
మై యొప్పెడు నీ కథామృతము ద్రావం గల్గునే భూరి దా
నిరూఢత్వము లేనివారలకు మానారీమనోహారకా!

టీక:- ఘన = సర్వోత్కృష్టమైన; లక్ష్మి = మోక్షసంపదతో; యుతము = కూడినది; ఐ = అయ్యి; మహా = అధికమైన; శుభదము = మేలులను ఇచ్చునది; ఐ = అయ్యి; కామాది = అరిషడ్వర్గములను {కామాది - అరిషడ్వర్గములు, 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు}; విధ్వంసి = నశింపజేయునది; ఐ = అయ్యి; సనకాది = సనకుడుమొదలైనవారిచే {సనకాది - 1సనక 2సనందన 3సనత్సుజాత 4సనత్కుమారుడు అను నలుగురు మహా యోగులు}; స్తుతము = స్తుతింపబడినది; ఐ = అయ్యి; నిరంతర = ఎడతెగని; తపస్ = తపస్సుచేత; సంతప్త = బాగుగాకాగిన; పున్నాగ = పురుషశ్రేష్ఠులకు; జీవనము = జీవిక; ఐ = అయ్యి; ఒప్పెడు = ఒప్పునట్టి; నీ = నీ యొక్క; కథా = కథ లనెడి; అమృతమున్ = అమృతమును; త్రావన్ = తాగుట; కల్గునే = సాధ్యమగునా; భూరి = అతి మిక్కిలి యైన; దాన = దానముచేయవలె ననెడి; నిరూఢత్వము = దృఢ తలపులు; లేనివారల్ = పేదవారి; కున్ = కైనను; మానారీమనోహారకా = కృష్ణా {మానారీమనోహారుడు - మానారీ (లక్ష్మీదేవియొక్క, మా స్త్రీల) మనోహారుడు (మనస్సును దొంగిలించువాడు), విష్ణువు, కృష్ణుడు}.
భావము:- లక్ష్మీదేవి మనసును రంజింప జేయువాడా! కృష్ణా! గొప్పసిరితో కూడినది; శ్రవణ మాత్రమున శుభములు ఇచ్చునది; కామక్రోధాదులను నిర్మూలించునట్టిది; సనకసనందాది యోగీశ్వరులచే కొనియాడబడునది; నిరంతరం తపములచే తపించెడి పురుష పుంగవులకు జీవనము; అయి ఒప్పుచున్న నీ కథాసుధను ఎన్నెన్నో గొప్పదానములు చేసిన వారికి తప్పించి ఇతరులకు గ్రోల సాధ్యమా?

తెభా-10.1-1047-క.
నీ గవులు నీ చూడ్కులు
నీ నానావిహరణములు నీ ధ్యానంబుల్
నీ ర్మాలాపంబులు
మాసముల నాటి నేడు గుడవు కృష్ణా!

టీక:- నీ = నీ యొక్క; నగవులున్ = నవ్వులు; నీ = నీ యొక్క; చూడ్కులు = చూపులు; నీ = నీ యొక్క; నానా = నానావిధములైన; విహరణములున్ = విహారములు; నీ = నిన్ను; ధ్యానంబుల్ = ధ్యానించుటలు; నీ = నీ యొక్క; నర్మ = ప్రియములైన; ఆలాపంబులున్ = ముచ్చట్లు; మానసమలన్ = మనస్సులందు; నాటి = అంటి; నేడు = ఇవేళ; మగుడవు = మరపునకురావు; కృష్ణా = కృష్ణుడా.
భావము:- కృష్ణా! నీ నవ్వులు, చూపులు, నీ రకరకాల విహారాలు, నీ ధ్యానములు, నీ పరిహాసపు మాటలు, మా హృదయాలలో నాటుకుని ఉన్నాయి. నేడు వదలి పోవడం లేదు.

తెభా-10.1-1048-ఆ.
ఘోషభూమి వెడలి గోవుల మేపంగ
నీరజాభమైన నీ పదములు
సవు శిలలు దాఁకి డునొచ్చునో యని
లఁగు మా మనములు మలనయన!

టీక:- ఘోషభూమిన్ = వ్రేపల్లెను; వెడలి = బయటకు వచ్చి; గోవులన్ = ఆవులను; మేపంగన్ = కాచుటకు; నీరజ = పద్మములకు; ఆభము = సమానమైనవి; ఐన = అయినట్టి; నీ = నీ యొక్క; పదములు = పాదములు; కసవు = గడ్డి; శిలలున్ = రాళ్ళు; తాకి = తగిలి; కడున్ = బాగా; నొచ్చునో = నొప్పెట్టునేమో; అని = అని; కలగున్ = కలతచెందును; మా = మా యొక్క; మనములు = మనస్సులు; కమలనయన = పద్మాక్షా, కృష్ణా.
భావము:- ఓ కమలాక్షా! నీవు గోవులను మేపుడం కోసం వ్రేపల్లె నుండి బయలుదేరిన దగ్గర నుండి పద్మాలతో సమానమైన నీ పాదములకు గడ్డిమొలకలు, గులకరాళ్ళు తాకి ఎంతో నెప్పి పెడతాయేమో అని మా మనసులు కుందుతుంటాయి.

తెభా-10.1-1049-ఉ.
మాటివేళ నీవు వనధ్యము వెల్వడి వచ్చి గోష్పద
ప్రాపిత ధూళిధూసరిత భాసిత కుంతలమై సరోరుహో
ద్ధీపిత మైన నీ మొగము ధీరజనోత్తమ! మాకు వేడ్కతోఁ
జూపి మనంబులన్ మరునిఁ జూపుదు గాదె క్రమక్రమంబునన్.

టీక:- మాపటి = సాయంకాలపు; వేళన్ = సమయము నందు; నీవున్ = నీవు; వన = అడవి; మధ్యము = నడిమినుండి; వెల్వడి = బయలుదేరి; వచ్చి = వచ్చి; గోస్ = ఆవుల; పద = కాళ్ళనుండి; ప్రాపిత =పొందబడిన; ధూళి = దుమ్ముచేత; ధూసరిత = మాసిన; భాసిత = ప్రకాశించెడి; కుంతలము = ముంగురులు కలది; ఐ = అయ్యి; సరోరుహ = పద్మములవలె; ఉద్ధీపితము = వెలుగునట్టిది; ఐన = అయినట్టి; నీ = నీ యొక్క; మొగమున్ = ముఖమును; ధీరజనోత్తమ = కృష్ణా {ధీరజనోత్తముడు - ధీర (మహాశౌర్యవంతమైన) జన (వారిలో) ఉత్తముడు (శ్రేష్ఠుడు), కృష్ణుడు}; మా = మా; కున్ = కు; వేడ్కన్ = కుతూహలము; తోన్ = తోటి; చూపి = చూపించి; మనంబులన్ = మా మనసుల యందు; మరుని = మన్మథుని; చూపుదు = చూపుచుందువు; కాదే = కదా; క్రమక్రమంబునన్ = వరుసగా.
భావము:- ధీరులలో శ్రేష్ఠుడవైన కృష్ణా! నీవు రాత్రివేళ బృందావనం లోపలి నుండి వచ్చి, గోధూళి సోకి ధూసర వర్ణం పొందిన ముంగురులుతో కూడి పద్మంవలె భాసిల్లే నీ ముఖం మాకు ప్రీతితో కనపరచి మా చిత్తాలలో అంత కంతకు మరులు హత్తుకొలుపుతూ ఉంటావు కదా.

తెభా-10.1-1050-ఆ.
క్తకామదంబు బ్రహ్మ సేవిత మిలా
మండనంబు దుఃఖర్దనంబు
ద్రకరమునైన వదంఘ్రియుగము మా
యురములందు రమణ! యునుపఁదగదె?

టీక:- భక్త = భక్తుల; కామదంబు = కోరికలు ఇచ్చునది; బ్రహ్మ = బ్రహ్మదేవునిచే; సేవితము = కొలువబడునది; ఇలా = భూమండలమునకు; మండనంబు = అలంకారమైనది; దుఃఖ = దుఃఖములను; మర్దనంబు = అణచివేయునది; భద్రకరము = శుభము కలిగించునది; ఐన = అయినట్టి; భవత్ = నీ యొక్క; అంఘ్రి = పాద; యుగము = ద్వయము; మా = మా యొక్క; ఉరముల్ = హృదయముల; అందున్ = లో; రమణ = కృష్ణా {రమణుడు - మనోజ్ఞమైన వాడు, కృష్ణుడు}; ఉనుపదగదె = ఉంచరాదా.
భావము:- భక్తులకు అభీష్టము లిచ్చునదీ; బ్రహ్మదేవునిచే కొలువబడునదీ; పుడమికి భూషణమైనది; దుఃఖములను అణచునది; శుభము లొసంగి కాపాడునదీ; అయిన నీ పాదములు రెంటినీ మా వక్షములపై చక్కగా ఉంచుము!

తెభా-10.1-1051-ఆ.
సు రతవర్ధనంబు శోకాపహరణంబు
స్వనిత వంశనాళ సంగతంబు
న్యరాగజయము నైన నీ మధురాధ
రామృతమునఁ దాప మార్పు మీశ!

టీక:- సు = మంచి, మిక్కిలి; రతవర్ధనంబు = ఆసక్తిని వృద్ధి చేయునది; శోక = శోకమును; అపహరణంబు = పోగొట్టునది; స్వనిత = మోగుతున్న; వంశనాళ = పిల్లనగ్రోవితో; సంగతంబు = కూడి ఉన్నది; అన్య = ఇతరమైన; రాగ = అనురాగములను; జయమున్ = గెలిచెడిది; ఐన = అయినట్టి; నీ = నీ యొక్క; మధుర = తీయనైన; అధర = పెదవి యొక్క; అమృతమున్ = అమృతముచేత; తాపమున్ = మా తాపమును; ఆర్పుము = చల్లార్చుము; ఈశా = భగవంతుడా;
భావము:- ప్రభూ! మంచి ఆసక్తిని (రతిసౌఖ్యము) పెంచునదీ, దుఃఖములను హరించునదీ; మ్రోగునట్టి పిల్లనగ్రోవితో కూడి ఉండేదీ; ఇతర అనురాగములను జయించునదీ; అయిన నీ తీయని కెమ్మోవి సుధలచే (పలుకులు?) మా తాపం చల్లార్చు.

తెభా-10.1-1052-ఉ.
నీడవిం బగల్ దిరుగ నీ కుటిలాలకలాలితాస్య మి
చ్ఛావిధిఁ జూడకున్న నిమిషంబులు మాకు యుగంబులై చనుం
గావున రాత్రు లైన నినుఁ న్నుల నెప్పుడుఁ జూడకుండ ల
క్ష్మీర! ఱెప్ప లడ్డముగఁ జేసె నిదేల? విధాత క్రూరుఁడై

టీక:- నీవు = నీవు; అడవిన్ = అడవిలో; పగలు = పగటిపూట; తిరుగన్ = సంచరించుచుండగా; నీ = నీ యొక్క; కుటిల = ఉంగరాలు తిరిగిన; అలక = ముంగురులతో; లాలిత = మనోజ్ఞమైన; ఆస్యమున్ = ముఖమును; ఇచ్చావిధిన్ = ఇష్టమైన విధముగా; చూడక = చూడకుండా; ఉన్న = ఉన్నట్టి; నిమిషంబులు = నిమిష మాత్రపు కాలములు; మా = మా; కున్ = కు; యుగంబులు = యుగ ప్రమాణము లైనవి; ఐ = అయ్యి; చనున్ = గడచును; కావునన్ = కనుక; రాత్రులు = రాత్రివేళ లందు; ఐనన్ = అయినను; నినున్ = నిన్ను; కన్నులన్ = కళ్ళారా; ఎప్పుడున్ = ఎడతెగకుండా; చూడకుండన్ = చూచుటకు వీలులేనట్టు; లక్ష్మీవర = లక్ష్మీపతి, కృష్ణా; ఱెప్పలు = కనురెప్పలను; అడ్డముగ = అడ్డము వచ్చునట్లుగ; చేసెన్ = చేసెను; ఇది = ఇలా; ఏల = ఎందుకు; విధాత = బ్రహ్మదేవుడు; క్రూరుడు = కఠినాత్ముడు; ఐ = అయ్యి.
భావము:- రమాపతీ! నీవు పగలు బృందావనంలో తిరుగుతూ ఉండటం వలన, ఉంగరాలు తిరిగిన ముంగురులతో అందాలు చిందే నీ వదనం తృప్తితీరేలా తిలకించలేక పోతున్నాము. అందువల్ల మాకు క్షణాలు యుగాలుగా నడుస్తాయి. పోనీ రాత్రుళ్ళు అయినా కన్నులనిండా నిన్ను విడువకుండా చూసుకుందా మనుకుంటే క్రూరుడైన బ్రహ్మదేవుడు కండ్లకు ఈ రెప్పలడ్డంగా సృష్టించాడాయె.

తెభా-10.1-1053-ఉ.
క్కట! బంధులున్ మగలు న్నలుఁ దమ్ములుఁ బుత్రకాదులున్
నెక్కొని రాత్రిఁ బోకుఁడన నీ మృదుగీతరవంబు వీనులన్
వెక్కసమైన వచ్చితిమి వేగమె మోహము నొంది నాథ! నీ
వెక్కడ బోయితో? యెఱుఁగ మీ క్రియ నిర్దయుఁ డెందుఁ గల్గునే?

టీక:- అక్కట = అయ్యో; బంధులున్ = బంధువులు; మగలున్ = భర్తలు; అన్నలున్ = అన్నలు; తమ్ములున్ = తమ్ముళ్ళు; పుత్రక = కొడుకులు; ఆదులున్ = మున్నగువారు; నెక్కొని = అడ్డగించి, పూని; రాత్రిన్ = రాత్రివేళ లందు; పోకుడు = పోకండి; అనన్ = అనగా; నీ = నీ యొక్క; మృదు = సున్నితమైన; గీత = పాట యొక్క; రవంబు = ధ్వని; వీనులన్ = చెవు లందు; వెక్కసము = అతిశయించినది; ఐనన్ = కాగా; వచ్చితిమి = వచ్చాము; వేగమె = శీఘ్రముగ; మోహము = మోహమును, లాలస; ఒంది = పొంది; నాథ = ప్రభూ; నీవు = నీవు; ఎక్కడన్ = ఎక్కడికి; పోయితో = వెళ్ళితివో; ఎఱుగము = తెలియము; ఈ = ఈ; క్రియన్ = విధమైన; నిర్దయుడు = దయలేనివాడు; ఎందున్ = ఎక్కడ; కల్గునే = ఉండునా, ఉండడు.
భావము:- ప్రభూ! కృష్ణా! చుట్టాలు, భర్త, అన్నలు, తమ్ములు, కొడుకులూ మొదలైన వారంతా “రాత్రిపూట ఇల్లు వదలి వెళ్ళవ” ద్దని చెబుతున్నాప్పటికీ నీ మెత్తని పాట సవ్వడి చెవులలో పడగానే మోహితులమై పరుగు పరుగున మేము వస్తే; అయ్యో, నీ వెక్కడకి వెళ్ళిపోయావో తెలియటం లేదు. నీ లాంటి జాలిమాలిన వాడు ఎక్కడైనా ఉంటాడా?

తెభా-10.1-1054-తే.
దనుఁ డార్వంగ నీ వాడు మంతనములు
వరసాలోకనంబగు గుమొగంబు
మల కిరవైన మహితవక్షస్థలంబు
మా మనంబుల లోఁగొని రపెఁ గృష్ణ!

టీక:- మదనుడు = మన్మథుడు; ఆర్వంగన్ = పలుకునట్లు; నీవు = నీవు; ఆడు = చెప్పెడి; మంతనములు = రహస్యపుమాటలు; నవరసా = నవరసములు {నవరసములు - 1శృంగారము 2వీరము 3కరుణము 4అద్భుతము 5హాస్యము 6భీభత్సము 7భయనకము 8రౌద్రము 9శాంతము అనెడి తొమ్మిది రసములు}; ఆలోకనంబు = కనబడునవి; అగు = ఐన; నగు = నవ్వు; మొగంబున్ = ముఖము; కమల = లక్ష్మీదేవి; కిన్ = కి; ఇరవు = ఉనికిపట్టులు; ఐనన్ = అయినట్టి; మహిత = గొప్ప; వక్షస్థలంబు = ఉరము; మా = మా యొక్క; మనంబులన్ = మనసులను; లోగొని = ఆకర్షించి; మరపెన్ = మాలిమి కలిగించెను; కృష్ణ = కృష్ణా.
భావము:- కృష్ణా! నీవు పలికే వలపు లొలికే పలుకులూ, నవరసములు జాలువారే నీ చూపులూ, నీ నగు మొగమూ, సిరికాటపట్టయిన నీ విశాలవక్షమూ, కామోద్దీపనకరములై మా మనసులను ఆకర్షించి, మమ్మల్ని మురిపించాయి.

తెభా-10.1-1055-మ.
విందంబులకంటెఁ గోమలములై యందంబులై యున్న నీ
ణంబుల్ కఠినంబులై మొనయు మా న్నుంగవల్ మోవఁగా
నెఱియంబోలు నటంచుఁ బొక్కుదుము నీ యీ కర్కశారణ్య భూ
రిసంచారము కృష్ణ! నీ ప్రియలకుం బ్రాణవ్యధం జేయదే?

టీక:- అరవిందంబుల = పద్మముల; కంటెన్ = కంటె; కోమలములు = మృదువైనవి; ఐ = అయ్యి; అందంబులు = చక్కటివి; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; నీ = నీ యొక్క; చరణంబుల్ = పాదములు; కఠినంబులు = బాగా గట్టివి; ఐ = అయ్యి; మొనయు = అతిశయించెడి; మా = మా యొక్క; చన్నులన్ = స్తనముల; కవల్ = ద్వయము నందు; మోవగా = తగల్చగా; నెఱియం బోలునట = బీటలువారునేమో; అంచున్ = అని; పొక్కుదుము = దుఃఖించెదము; అయ్యో = అయ్యో; కర్కశ = కఠినమైన; అరణ్య = అటవీ; భూ = ప్రదేశము లందు; పరి = మిక్కిలియైన; సంచారము = మెలగుట; కృష్ణ = కృష్ణా; నీ = నీ యొక్క; ప్రియలు = ప్రియురాండ్ర; కున్ = కు; ప్రాణవ్యధన్ = ప్రాణము పోవునంత బాధ; చేయదే = కలిగించదా, కలిగించును.
భావము:- కృష్ణా! తామరపూల కంటే సుకుమారంగా సుందరంగా ఉండి ఒప్పుతున్న నీ పాదాలు బిరుసైన మా కుచాల ఒత్తిడికి కందిపోతాయని బాధపడతాము. అటువంటి పాదాలతో కఠినములైన అటవీ భూములలో నీవు సలిపే సంచారం నీ ప్రియురాండ్ర మైన మాకు ప్రాణాంతక మైనంత బాధ కలిగిస్తోంది.

తెభా-10.1-1056-క.
ట్టా! మన్మథు కోలలు
నెట్టన నో నాఁట బెగడి నీ పాదంబుల్
ట్టికొనఁగ వచ్చిన మము
ట్టడవిని డించి పోవ న్యాయమె? కృష్ణా!

టీక:- కట్టా = అయ్యో; మన్మథు = మన్మథుని యొక్క; కోలలున్ = బాణములు; ఎట్టననో = ఎలాగో, చాలాగట్టిగా; నాటన్ = తగులగా; బెగడి = భయపడిపోయి; నీ = నీ యొక్క; పాదంబుల్ = పాదములను; పట్టికొనగన్ = పట్టుకొనుటకు; వచ్చిన = వచ్చినట్టి; మమున్ = మమ్ము; నట్టడవినిన్ = అడవిమధ్యలో; డించి = వదలిపెట్టి; పోవన్ = వెళ్ళిపోవుట; న్యాయమె = న్యాయమేనా, కాదు; కృష్ణా = కృష్ణా.
భావము:- కృష్ణా! మన్మథుని బాణాలు తప్పక తగిలి మమ్మల్ని పీడించగా, బెదిరి నీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాము, అలాంటి మమ్మల్ని నట్టడలిలో ఇలా వదలిపెట్టి వెళ్ళడం నీకు ధర్మమా?

తెభా-10.1-1057-క.
హృయేశ్వర! మా హృదయము
మృదుతరముగఁ జేసి తొల్లి మిక్కిలి కడ నీ
హృయము కఠినము చేసెను
దీయ సౌభాగ్య మిట్టి మందము గలదే?

టీక:- హృదయేశ్వర = మనోనాయక, కృష్ణ; మా = మా యొక్క; హృదయమున్ = మనస్సును; మృదుతరముగన్ = మిక్కిలి మృదువుగా {మృదువు - మృదుతరము - మృదుతమము}; చేసి = చేసి; తొల్లి = ఇంతకుముందు; మిక్కిలికడన్ = చివరకు; నీ = నీ యొక్క; హృదయమున్ = మనసును; కఠినమున్ = కఠినమైనదిగా; చేసెను = చేసెను; మదీయ = మా యొక్క; సౌభాగ్యము = అదృష్టము; ఇట్టి = ఇటువంటి; మందమున్ = దురదృష్టమైనది; కలదే = ఉన్నదా, లేదు.
భావము:- ఓ ప్రాణేశ్వరా! మా చిత్తాలను మిక్కిలి మెత్తనైనవిగా చేసి, నీ మనసును కడకు కర్కశం కావించిన ఇలాంటి మా మందభాగ్యం వంటిది ఎక్కడైనా ఉంటుందా?

తెభా-10.1-1058-ఉ.
క్రమ్మి నిశాచరుల్ సురనికాయములన్ వడిఁదాఁకి వీఁక వా
మ్ముల తెట్టెలన్ పఱవ డ్డము వచ్చి జయింతు వండ్రు నిన్
మ్మిన ముగ్ధలన్ రహితనాథల నక్కట! నేఁడు రెండు మూఁ
మ్ముల యేటుకాఁ డెగువ డ్డము రాఁ దగదే కృపానిధీ!

టీక:- క్రమ్మి = ఆక్రమించి; నిశాచరుల్ = రాక్షసులు {నిశాచరులు - రాత్రి సంచరించువారు, రాక్షసులు}; సుర = దేవతల; నికాయములన్ = సమూహములను; వడిన్ = వేగముగా; తాకి = ఎదుర్కొని; వీకన్ = గర్వముతో; వాలమ్ములన్ = వాడిఅమ్ముల; తెట్టెలన్ = సమూహములతో; పఱవన్ = తరుముతుండగా; అడ్డమువచ్చి = అడ్డపడి; జయింతువు = గెలిచెదవు; అండ్రు = అంటారు; నిన్ = నిన్ను; నమ్మిన = నమ్ముకొన్న; ముగ్ధగ్దలన్ = అమాయకురాళ్ళను; రహితనాథలన్ = విడువబడిన నాథులు గలవారిని, దిక్కులేనివారిని; అక్కట = అయ్యో; నేడు = ఇవాళ; రెండుమూడు = ఐదు {రెండుమూ డమ్ముల యేటుకాడు - ఐదు (2+3) బాణముల వాడు, పంచబాణుడు, మన్మథుడు}; అమ్ముల = బాణముల; ఏటుకాడు = వేటగాడు; ఎగువన్ = తరుముతుండగా; అడ్డము = అడ్డపడుటకు; రాదగదే = రారాదా, రమ్ము; కృపానిధీ = దయాసాగరా.
భావము:- ఓ దయామయా! కృష్ణా! రాక్షసులు ఒక్కపెట్టున చెలరేగి దేవతాసమూహాలను ఎదిరించి పట్టుదలగా వారిపై వాడి బాణాలు గుప్పిస్తుంటే, అడ్డుపడి రాక్షసులను శిక్షిస్తావని పెద్దలంటారే. మరి, మేము నిన్ను నమ్ముకున్న ముగ్ధలం, నీ కోసం భర్తలను వదలి వచ్చిన భామలం. ఇలాంటి మమ్మల్ని పంచబాణుడైన మన్మథుడు వేటాడుతుంటే అయ్యో! అడ్డుపడ వెందుకు?

తెభా-10.1-1059-క.
తియ్యవిలుకాఁడు డీకొని
వ్రయ్యలుగాఁ దూఱనేసె నితల మనముల్
నియ్యాన యింక నైనం
గుయ్యాలింపం గదయ్య! గోవింద! హరీ!"

టీక:- తియ్యవిలుకాడు = మన్మథుడు {తియ్యవిలుకాడు - తియ్యని (చెరకుగడ) విల్లుగా కలవాడు, మన్మథుడు}; డీకొని = తాకి; వ్రయ్యలుగాన్ = ముక్క లగునట్లు; తూఱన్ = బాణములను; ఏసె = వేసెను; వనితల = స్త్రీల; మనముల్ = మనస్సులను; నీ = నీమీద; ఆన = ఒట్టు; ఇంకనైనన్ = ఇప్పటికైనా; కుయ్యి = మొర; ఆలింపగదయ్య = వినుము; గోవింద = కృష్ణా {గోవిందుడు - వేదవాక్కులచే ఎరుగదగిన వాడు, విష్ణువు}; హరీ = కృష్ణా.
భావము:- ఓ గోవిందా! ముకుందా! కృష్ణా! తియ్యని బాణాలు వేసే మన్మథుడు మా మగువల నెదిరించి గుండెలు పగిలేలా బాణాలు వేసాడు. అవును నిజంగానే వేసాడు. ఇకనైనా మా మొరాలకించవయ్యా!”