పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/క్రేపుల వెదకబోవుట

తెభా-10.1-500-మ.
వినుఁ డో! బాలకులార! క్రేపు లటవీవీధిన్ మహా దూరముం
నియెన్ గోమల ఘాసఖాదన రతోత్సాహంబుతో నెందుఁ బో
యెనొ? యే మయ్యెనొ క్రూరజంతువులచే నే యాపదం బొందెనో?
ని తెత్తుం గుడువుండు చల్ది గొఱఁతల్ గాకుండ మీ రందఱున్.”

టీక:- వినుడు = వినండి; ఓ = ఓహోయ్; బాలకులారా = పిల్లలు; క్రేపులు = దూడలు; అటవీ = అడవి; వీధిన్ = మార్గమువ; మహా = చాలా; దూరమున్ = దూరముగా; చనియెన్ = వెళ్ళినవి; కోమల = లేత; ఘాస = గడ్డిని; ఖాదన = తినవలెననెడి; రతి = ఆసక్తితో; ఉత్సాహంబు = హుషారు; తోన్ = తో; ఎందున్ = ఎక్కడికి; పోయెనో = వెళ్ళినవో; ఏమి = ఏమిటి; అయ్యెనో = జరిగినదో; క్రూరజంతువుల = క్రూరజంతువుల {క్రూర జంతువులు - ఇతర జంతువులను చంపి తినెడి పులి మున్నగు జంతువులు}; చేన్ = వలన; ఏ = ఎట్టి; ఆపదన్ = ప్రమాదము, ఇక్కట్లను; పొందెనో = పొందినవో; కని = చూసి; తెత్తున్ = తీసుకొని వచ్చెదను; కుడువుండు = తినండి; చల్దిన్ = చద్దిభోజనములు; కొఱతలు = తక్కువపడుట; కాకుండన్ = జరుగకుండా; మీరు = మీరు; అందఱున్ = అందరు.
భావము:- “ఓ మిత్రులారా! మన లేగదూడలు లేత పచ్చికల మేతలలో లీనమైపోయి, ఉత్సాహంతో అడవిలో చాలా దూరం వెళ్ళిపోయి నట్లున్నాయి. ఎక్కడకి వెళ్ళాయో యే మయ్యాయో? ఏ క్రూరజంతువుల కైనా చిక్కి ఆపదలో పడ్డాయో? ఏమిటో? నేను వెదకి తీసుకొస్తాను. మీరు కంగారు పడకుండా చల్దులు ఆరగిస్తూ ఉండండి.” అని చెప్పి బయలుదేరాడు

తెభా-10.1-501-వ.
అని చెప్పి,
టీక:- అని = అని; చెప్పి = చెప్పి.
భావము:- ఇలా తన సహచరులకు చల్దులు తింటూ ఉండమని చెప్పిన కృష్ణుడు. . .

తెభా-10.1-502-శా.
ర్ణాలంబిత కాక పక్షములతో గ్రైవేయహారాళితో
స్వర్ణాభాసిత వేత్రదండకముతో త్పింఛదామంబుతోఁ
బూర్ణోత్సాహముతో ధృతాన్నకబళోత్ఫుల్లాబ్జహస్తంబుతోఁ
దూర్ణత్వంబున నేఁగె లేఁగలకునై దూరాటవీవీధికిన్.

టీక:- కర్ణా = చెవులమీద; ఆలంబిత = వేళ్ళాడుచున్న; కాకపక్షముల = జులపాల; తోన్ = తోటి; గ్రైవేయ = మెడలోవేసుకొన్న; హార = దండల; ఆళి = వరుసల; తోన్ = తోటి; స్వర్ణ = బంగారము; ఆభాసిత = ప్రకాశించెడు; వేత్రదండకము = బెత్తంకఱ్ఱ; తోన్ = తోటి; సత్ = మంచి; పింఛ = నెమలిపింఛముల; దామంబు = మాల; తోన్ = తోటి; పూర్ణ = నిండు; ఉత్సాహము = పూనిక; తోన్ = తోటి; ధృత = ధరింపబడిన; అన్న = అన్నపు; కబళ = ముద్ద కలిగిన; ఉత్ఫుల్ల = విరిసిన; అబ్జ = పద్మమువంటి; హస్తంబు = చేతి; తోన్ = తోటి; తూర్ణత్వంబునన్ = తొందర కలిగి; ఏగెన్ = వెళ్ళెను; లేగలు = దూడలు; కున్ = కోసము; ఐ = అయ్యి; దూర = దూరము నందలి; అటవీ = అడవి; వీధికిన్ = మార్గమున.
భావము:- జులపాల జుట్టు చెవులదాకా వేళ్ళాడుతూ ఉంది. మెడలో హారాలు మెరుస్తున్నాయి. బంగరంలా మెరిసే కఱ్ఱ చేతిలో ఉంది. చక్కటి నెమలి పింఛం తలపై ధరించాడు. ఎఱ్ఱటి అర చేతిలో తెల్లటి అన్నం ముద్ద మెరిసి పోతూ ఉంది. ఇలా గోపాల కృష్ణుడు ఉత్సాహంతో లేగదూడలను వెదకడానికి అడవిలో ఎంతో దూర ప్రాంతాలకి వెళ్ళాడు.

తెభా-10.1-503-వ.
ఇ ట్లేగుచు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; ఏగుచున్ = వెళ్తు.
భావము:- అలా దూడల జాడలకై వెళ్తూ. .

తెభా-10.1-504-క.
"ఇచ్చోఁ బచ్చిక మేసిన;
విచ్చోఁ ద్రావినవి తోయ; మేగిన విచ్చో;
నిచ్చోట మంద గొన్నవి;
యిచ్చోఁ బాసినవి; జాడ యిదె యిదె" యనుచున్.

టీక:- ఈ = ఈ; చోన్ = చోటునందు; పచ్చిక = పచ్చిగడ్డి; మేసినవి = తిన్నాయి; ఈ = ఈ; చోన్ = చోటునందు; త్రావినవి = తాగినవి; తోయము = నీళ్ళు; ఏగినవి = వెళ్ళిపోయినవి; ఈ = ఈ; చోన్ = చోటునందు; ఈ = ఈ; చోటన్ = చోటునందు; మందగొన్నవి = గుంపుకట్టినవి; ఈ = ఈ; చోన్ = ప్రదేశమునందు; పాసినవి = విడిపోయినవి; జాడ = ఆనమాళ్ళు; ఇదెయిదె = తప్పక ఇదే; అనుచున్ = అనుచు.
భావము:- అలా వెళ్తూ కృష్ణుడు లేగల జాడ కనిపెట్టసాగాడు. “ఇవిగో ఇక్కడ పచ్చిక మేసాయి. ఇక్కడ నీరు త్రాగాయి. ఇదిగో ఇక్కడ మళ్లీ బయలుదేరాయి. ఇక్కడ ఒక్కచోటికి మందగా చేరాయి. ఇదిగో ఇక్కడ మంద విడిపోయాయి.”

తెభా-10.1-505-క.
కందళాక్షుఁడు వెదకెను
గొంక లేఁగల నపార గురుతృణవనికా
పుంజంబుల భీకర మృగ
కుంజంబుల దరుల గిరులఁ గొలఁకుల నదులన్.

టీక:- కంజదళాక్షుడు = పద్మాక్షుడు, కృష్ణుడు; వెదకెన్ = అన్వేషించెను; కొంజక = వెనుదీయక; లేగలన్ = దూడలను; అపార = అమితమైన; గురు = గొప్ప; తృణ = గడ్డిగల; వనికా = అడవుల; పుంజంబులన్ = సమూహము లందు; భీకర = భయంకరమైన; మృగ = జంతువులు కల; కుంజంబులన్ = పొదలలో; దరులన్ = గుహలలో; గిరులన్ = కొండలలో; కొలకులన్ = చెరువులలో; నదులన్ = ఏర్లుయందు.
భావము:- ఇలా చూసుకుంటూ కృష్ణుడు వెనుదీయకుండా లేగలను వెదుకసాగాడు. దట్టమైన అడవిలో పచ్చిక గుబురులలోనూ; భయంకర మృగాలుండే చెట్ల గుంపుల లోనూ; చెట్లవెనుక; పర్వతాలపైనా; కొలనుల చెంత; నదుల దగ్గర అంతటా వెదికాడు.

తెభా-10.1-506-వ.
అంత.
టీక:- అంత = అప్పుడు.
భావము:- అప్పుడు