పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కాళియ మర్ధనము

తెభా-10.1-662-శా.
అంతం గృష్ణుఁడు మేను పెంప భుజగుం డావృత్తులం బాసి తా
సంప్తాయతభోగుఁ డై కఱచుటల్ చాలించి నిట్టూర్పుతో
శ్రాంతుండై తల లెత్తి దుర్విషము నాసావీథులం గ్రమ్మ దు
శ్చింతన్ దిక్కులు చూచుచుం దలఁగి నిల్చెన్ ధూమకాష్ఠాకృతిన్.

టీక:- అంతన్ = ఆ తరువాత; కృష్ణుండు = కృష్ణుడు; మేను = శరీరమును; పెంపన్ = పెంచగా; భుజగుండు = ఆ కాళియ సర్పము; ఆవృత్తులను = తన చుట్లను; పాసి = విడిచి; తాన్ = తను; సంతప్త = సంతాపము పొందిన; ఆయత = నిడుపాటి; భోగుడు = దేహము కలవాడు; ఐ = అయ్యి; కఱచుటలు = కరుచుట; చాలించి = ఆపి; నిట్టూర్పు = దీర్ఘశ్వాసల; తో = తో; శ్రాంతుడు = బడలినవాడు; ఐ = అయ్యి; తలలు = పడగలను; ఎత్తి = పైకెత్తి; దుర్ = చెడ్డ; విషమున్ = విషమును; నాసా = ముక్కురంధ్రముల; వీథులన్ = దారిని; క్రమ్మన్ = కమ్ముకొన; దుశ్చింతన్ = చెడు ఆలోచనలతో; దిక్కులున్ = ఇటునటు; చూచుచున్ = చూస్తు; తలగి = తొలగి; నిల్చెన్ = నిలబడెను; ధూమ = పొగతోటి; కాష్ఠ = కొఱవికట్టె; ఆకృతిన్ = లాగ.
భావము:- అప్పుడు కృష్ణుడు చటుక్కున తన శరీరాన్ని బాగా పెంచాడు. కాళీయుడి చుట్టలు జారిపోయాయి. అతని పడగలు వేడెక్కిపోయాయి దేహం కమిలిపోయింది. కరవడం మానేసాడు. పొగచూరిన కట్టెలా తేజస్సుకోల్పోయిన నాగరాజు నిట్టూర్పులు వదుల్తూ బాగా కష్టపడి పడగలు పైకెత్తాడు. విషాన్ని విరజిమ్మే చెడ్డ ఉద్దేశంతో అటునిటు చూస్తు పక్కకి తొలగి నిల్చున్నాడు.

తెభా-10.1-663-చ.
వె మఱలేని మేటి బలువీరుఁడు కృష్ణకుమారుఁ డొక్క చేఁ
చి ఖగేంద్రుచందమునఁ క్కన దౌడలు పట్టి కన్నులం
జొజొఱ దుర్విషానలము జొబ్బిలు చుండఁగ నెత్తి లీలతో
జిజిఱఁ ద్రిప్పి వైచెఁ బరిశేషిత దర్పముఁ గ్రూరసర్పమున్.

టీక:- వెఱ = బెదురు; మఱ = మఱపు, విస్మయము; లేని = లేనట్టి; మేటి = గొప్పవాడు; బలువీరుడు = మహాశూరుడు; కృష్ణకుమారుడు = బాలకృష్ణుడు; ఒక్క = ఒకేఒక్క; చేన్ = చేతితో; చఱచి = కొట్టి; ఖగేంద్రు = గరుత్మంతుని; చందమునన్ = వలె; చక్కన = చక్కగా; దౌడలు = రెండుదౌడలను; పట్టి = పట్టికొని; కన్నులన్ = కళ్ళమ్మట; జొఱజొఱ = జొఱజొఱ మిణుగురులు రాలటంలో ధ్వన్యనుకరణ, అను ధ్వనితో; దుః= చెడ్డ; విష = విషము అనెడి; అనలము = అగ్ని; జొబ్బిలుచుండగన్ = స్రవించుచుండగా; ఎత్తి = పైకెత్తి; లీల = విలాసము; తోన్ = తోటి; జిఱజిఱ = జిఱజఱ త్రిప్పుట యందలి ధ్వన్యనుకరణ, అని ధ్వనితో; త్రిప్పి = తిప్పి; వైచెన్ = విసిరివేసెను; పరిశేషిత = కొద్దిగమిగిలిన; దర్పము = మదము కలది; క్రూర = క్రూరమైన; సర్పమున్ = పామును.
భావము:- నదురు బెదురు లేని గొప్ప మహావీరుడైన బాలకృష్ణుడు ఒక అరచేత్తో కాళియుడి పడగల మీద ఒక చరుపు చరిచాడు. గరుత్మంతుడిలా దౌడలు రెండు పట్టుకొని పైకెత్తి గిరగిర తిప్పి విలాసంగా విసిరికొట్టాడు. కాళీయుని కళ్ళలోంచి దుష్ట విషాగ్నులు బుసుబుస పొంగి జరజర కారాయి. ఆ క్రూర మైన కాళియుడి గర్వమంతా అణగిపోయింది.

తెభా-10.1-664-వ.
ఇట్లు వేగంబుగ నాగంబు వీచివైచి జగజ్జెట్టియైన నందునిపట్టి రెట్టించిన సంభ్రమంబున.
టీక:- ఇట్లు = ఇలా; వేగంబుగన్ = వడిగా; నాగంబున్ = పామును; వీచివైచి = విసిరేసి; జగత్ = లోకమునకే; జెట్టి = శూరుడు; ఐన = అయిన; నందుని = నందుని యొక్క; పట్టి = కుమారుడు; రెట్టించిన = ద్విగృణీకృతమైన; సంభ్రమంబునన్ = వేగిరపాటుతో.
భావము:- ఈ విధంగా లోకానికే మేటి వీరుడైన శ్రీకృష్ణుడు పామును గిరగిర తిప్పి విసిరికొట్టి రెట్టించిన ఉత్సాహంతో విజృంభించాడు.

తెభా-10.1-665-సీ.
న యమునానదీ ల్లోల ఘోషంబు-
రసమృదంగ ఘోషంబు గాఁగ
సాధు బృందావనర చంచరీక గా-
నంబు గాయక సుగానంబు గాఁగఁ
లహంస సారస మనీయమంజు శ-
బ్దంబులు దాళశబ్దములు గాఁగ
దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది-
నులు సభాసీననులు గాఁగ

తెభా-10.1-665.1-తే.
ద్మరాగాది రత్నప్రభాసమాన
హితకాళియ ఫణిఫణామండపమున
ళినలోచన విఖ్యాత ర్తకుండు
నిత్యనైపుణమునఁ బేర్చి నృత్య మాడె.

టీక:- ఘన = గొప్ప; యమునా = యమున అనెడి; నదీ = నది యొక్క; కల్లోల = పెద్ద అలల; ఘోషంబు = పెద్ద ధ్వని; సరస = రస యుక్తమైన; మృదంగ = మద్దెల; ఘోషంబు = ధ్వని; కాగన = అగుతుండగ; సాధు = చక్కని; బృందావన = బృందావనము నందు; చర = మెలగెడి; చంచరీక = తుమ్మెదల; గానంబు = పాట; గాయక = గాయకుల; సు = మంచి; గానంబున్ = పాటలు; కాగన్ = అగుచుండగ; కలహంస = కలహంసల; సారస = బెగ్గురుపక్షుల; కమనీయ = మనోజ్ఞమైన; మంజు = ఇంపైన; శబ్దంబులు = ధ్వనులు; తాళ = పక్క తాళము వేయువారి; శబ్దములు = ధ్వనులు; కాగన్ = అగుచుండగ; దివి = ఆకాశము; నుండి = నుండి; వీక్షించు = చూచెడి; దివిజ = దేవతలు; గంధర్వ = గంధర్వులు; ఆది = మొదలైన; జనులు = ప్రజలు; సభ = సభ యందు; ఆసీన = కూర్చున్న; జనులు = వారు; కాగన్ = అగుచుండగ.
పద్మరాగ = కెంపులు; ఆది = మొదలైన; రత్న = రత్నములచేత; ప్రభాసమాన = మిక్కిలి వెలుగుచున్న; మహిత = గొప్ప; కాళియ = కాళియుడు అనెడి; ఫణి = పాము; ఫణా = పడగ లనెడి; మండపమునన్ = వేదికపైన; నళినలోచన = పద్మాక్షుడు, కృష్ణుడు (అను); విఖ్యాత = ప్రసిద్ధుడైన; నర్తకుండు = నృత్యము చేయువాడు; నిత్య = శాశ్వతమైన; నైపుణమునన్ = నేర్పుచేత; పేర్చి = అతిశయించి; నృత్యము = నాట్యములు; ఆడెన్ = చేసెను.
భావము:- ఆ కాళీయుని పడగలు అనే విశాల మండపంమీద బాలకృష్ణుడు అనే ప్రఖ్యాత నర్తకుడు ఎక్కి నిలబడి, బహు నైపుణ్యంతో నృత్యం చేసాడు. ఆ పాముపడగల మండపం పద్మరాగాలు మొదలైన రత్నాలు చేత ప్రకాశిస్తున్నది. ఆ నృత్యావికి సహకారం అందిస్తున్నట్లు యమునానదిలో కదిలే తరంగాల ధ్వనులు చక్కని మృదంగ ధ్వనులుగా ఉన్నాయి. ఆ బృందావనంలో తిరుగుతున్న తుమ్మెదల మధుర సంగీతం, గాయకుల గానంలా వినబడుతున్నది. కలహంసలు, సారసపక్షులు చేస్తున్న శ్రావ్యమైన శబ్దాలు చక్కని తాళధ్వనులను సంతరించుకున్నాయి. ఆకాశంలోనుండి చూస్తూ ఉన్న దేవతలు, గంధర్వులు మొదలైనవారు సభలో ఆసీనులై ఉన్న ప్రేక్షకుల వలె ఉన్నారు. మొత్తం మీద అదొక గొప్ప నాట్య కచేరీలా ఉంది.

తెభా-10.1-666-శా.
కుక్షిన్ లోకములున్న గౌరవముతో గోపాకృతి న్నున్న యా
క్షోహంత వడిన్ మహాఫణిఫణారంగప్రదేశంబుపై
క్షీణోద్ధత నాడుఁ; బాడుఁ; జెలఁగున్; హాసంబుతోడం బద
ప్రక్షేపంబులు జేయుఁ గేళిగతులం బ్రాణైకశేషంబుగన్.

టీక:- కుక్షిన్ = కడుపులో; లోకములు = చతుర్దశ భువనములు; ఉన్న = ఉన్నట్టి; గౌరవము = భారము; తోన్ = తోటి; గోప = గొల్లవాని; ఆకృతిన్ = ఆకారముతో; ఉన్న = ఉన్న; ఆ = ఆ ప్రసిద్ధుడైన; రక్షోహంత = కృష్ణుడు {రక్షోహంత - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు}; వడిన్ = వేగముగా; మహా = గొప్ప; ఫణి = పాము; ఫణా = పడగ లనెడి; రంగ = వేదికా; ప్రదేశంబు = స్థలము; పైన్ = మీద; అక్షీణ = అధికమైన; ఉద్ధతన్ = అతిశయముతో; ఆడున్ = నాట్యమాడును; పాడున్ = పాటలుపాడును; చెలగున్ = విజృంభించును; హాసంబు = నవ్వుల; తోడన్ = తోటి; పద = అడుగులు; ప్రక్షేపంబులు = వేయుట; చేయున్ = చేయును; కేళీ = లీలా; గతులన్ = రీతులతో; ప్రాణ = ప్రాణము; ఏక = ఒకటిమాత్రమే; శేషంబు = మిగిలినది; కన్ = అగునట్లు.
భావము:- గోపబాలకుని రూపంలో ఉన్న రాక్షస సంహారకుడైన శ్రీకృష్ణుడి కడుపులో లోకాలన్నీ ఉన్నాయి. ఆ బరువుతో సహా కాళియుడి పడగలనే మండపంమీద మిక్కిలి ఉల్లాసంగా వేగంగా నృత్యం చేసాడు. పాటలు పాడాడు. చెలరేగి నవ్వుతు గంతులు వేసాడు. పాదాలతో బలంగా తొక్కుతు ఆటలాడాడు. కాళియుడి తల ప్రాణాలు తోక్కొచ్చాయి.

తెభా-10.1-667-క.
తర సుషిరానంద
స్వములతో సిద్ధ సాధ్య చారణ గంధ
ర్వ నిలింప మునిసతులు చ
య్య గురిసిరి విరులవాన లాడెడు హరిపై.

టీక:- ఘనతర = మిక్కిలి గొప్పదైన {ఘనము - ఘనతరము - ఘనతమము}; సుషిర = ఒక రకమైన మురళి యొక్క; ఆనంద = సంతోషకరమైన; స్వనముల = శబ్దముల; తోన్ = తోటి; సిద్ధ = సిద్ధుల; సాధ్య = సాధ్యుల; చారణ = చారణుల; గంధర్వ = గంధర్వుల; నిలింప = దేవతల; ముని = మునుల; సతులు = భార్యలు; చయ్యన = శీఘ్రముగా; కురిసిరి = కురిపించిరి; విరుల = పూల; వానలు = వానలను; ఆడెడి = నాట్యము చేయుచున్న; హరి = కృష్ణుని; పై = మీద.
భావము:- ఆ కాళియమర్దనునిపై ఆకాశంమీద నుండి సిద్ధులు, సాధ్యులు, చారణులు, గంధర్వులు, దేవతలు, దేవర్షులు వారి భార్యలు పూలవానలు కురిసారు. అమృతం తాగిన అధికతర ఆనందం వెల్లివిరిసే కంఠాలతో జయజయ ధ్వానాలు చేసారు.

తెభా-10.1-668-వ.
ఇట్లు దుష్టజనదండధరావతారుండైన హరి వడి గలిగిన పడగల మీఁదఁ దాండవంబు సలుప, బెండుపడి యొండొండ ముఖంబుల రక్తమాంసంబు లుమియుచుఁ గన్నుల విషంబు గ్రక్కుచు నుక్కుచెడి చిక్కి దిక్కులుచూచుచుఁ గంఠగతప్రాణుండై ఫణీంద్రుండు తన మనంబున.
టీక:- ఇట్లు = ఇలాగున; దుష్ట = చెడ్డ; జన = వారి యెడల; దండధర = యముని; అవతారుండు = రూపుదాల్చినవాడు; ఐన = అయిన; హరి = కృష్ణుడు; వడి = బిగువు; కలిగిన = ఉన్న; పడగల = పాముపడగల; మీదన్ = పైన; తాండవంబు = ఉధృతమైన నాట్యమును; సలుపన్ = చేయుచుండగా; బెండుపడి = నిస్సారుడై; ఒండొండ = క్రమముగా; ముఖంబులన్ = ముఖములనుండి; రక్త = రక్తము; మాంసంబులు = మాంసములు; ఉమియుచున్ = కక్కుతు; కన్నులన్ = కన్నులనుండి; విషంబున్ = విషమును; క్రక్కుచున్ = కక్కుతు; ఉక్కుచెడి = బలహీనపడి; చిక్కి = కృశించి; దిక్కులు = ఇటునటు; చూచుచున్ = చూస్తు; కంఠ = కుత్తుక యందు; గత = ఉన్న; ప్రాణుండు = ప్రాణములు కలవాడు; ఐ = అయ్యి; ఫణీంద్రుడు = సర్పరాజు; తన = తన యొక్క; మనంబున = మనసులో.
భావము:- ఈ విధంగా దుర్మార్గుల పాలిటి కాలయముడైన కృష్ణుడు కాళియుడి బిగువైన పడగలపై ప్రచండ తాండవం చేసాడు; దానితో కాళియుడు బలహీనుడైపోయాడు. ఒక్కొక్క నోటినుండి రక్తమాంసాలు కక్కుతున్నాడు. కళ్ళల్లోంచి విషం ఉబుకుతోంది. పౌరుషం చెడిపోయింది. బాగా నీరసించిపోయాడు. ప్రాణాలు గొంతులోకి వెళ్ళుకొచ్చేశాయి. దిక్కులు చూస్తు కాళియుడు తనలో తాను ఇలా అనుకొన్నాడు.

తెభా-10.1-669-ఉ.
"వేలుపులైన లావుచెడి వేదనఁ బొందుచు నా విషానల
జ్వాలు సోఁకినంతటన త్తురు; నేడిది యేమి చోద్య? మా
భీవిషాగ్ని హేతిచయపీడకు నోర్చియుఁ గ్రమ్మఱంగ నీ
బాలుఁడు మత్ఫణాశతము గ్నముగా వెసఁ ద్రొక్కి యాడెడున్.

టీక:- వేలుపులు = దేవతలు; ఐనన్ = అయినను; లావు = శక్తి; చెడి = నశించి; వేదనన్ = సంకటమును; పొందుచున్ = పొందుచు; నా = నా యొక్క; విష = విషము అనెడి; అనల = అగని; జ్వాలలు = మంటలు; సోకినన్ = తాకిన; అంతటనన్ = మాత్రముచేతనే; చత్తురు = చనిపోయెదరు; నేడు = ఇవాళ; ఇది = ఇది; ఏమి = ఏమిటి; చోద్యము = విచిత్రము; ఆభీల = భయంకరమైన; విష = విషమనెడి; అగ్ని = అగ్నిచేత; హేతి = దెబ్బల; చయ = అనేకము యొక్క; పీడ = బాధ; కున్ = కు; ఓర్చియున్ = తట్టుకొనుటేకాక; క్రమ్మఱంగ = మరల; ఈ = ఈ యొక్క; బాలుడు = చిన్నపిల్లవాడు; మత్ = నా యొక్క; ఫణా = పడగల; శతమున్ = నూటిని, సమూహమును; భగ్నము = నలిగిపోయినవి; కాన్ = అగునట్లు; వెసన్ = వేగముగా; త్రొక్కి = తొక్కి; ఆడెడున్ = నృత్యము చేస్తున్నాడు.
భావము:- “నా విషాగ్ని జ్వాలలు సోకితే చాలు, దేవతలైనా సరే శక్తి నశించిపోయి గిలగిలకొట్టుకొని చచ్చిపోతారు. అలాంటిది ఇవేళ ఈ బాలుడు క్రూరమైన నావిషాగ్ని జ్వాలల తాకిడి ధాటికి తట్టుకొన్నాడు. పైగా నా నూరు పడగలను చితకతొక్కేస్తూ నాట్యం చేసేస్తున్నాడు కూడ. ఇదేమి విచిత్రమో?

తెభా-10.1-670-క.
తఁడు సర్వచరాచర
భూతేశుండైన పరమపురుషుఁడు సేవా
ప్రీతుఁడు శ్రీహరి యగు"నని
భీతిన్ శరణంబు నొందె బిట్టలసి నృపా!

టీక:- ఈతడు = ఇతను; సర్వ = సమస్తమైన; చర = చరించ గల; అచర = చరించ లేని; భూత = జీవులకు; ఈశుండు = ప్రభువు; ఐన = అగు; పరమపురుషుడు = పరమాత్మ; సేవా = భక్తుల యందు; ప్రీతుడు = ప్రీతి గలవాడు; శ్రీహరి = విష్ణుమూర్తి {హరి - సుషుప్తి మరియు ప్రళయ కాలములందు సర్వమును తన యందు లయము చేసుకొని సుఖరూపమున నుండువాడు, విష్ణువు}; అగును = అగును; అని = అని; భీతిన్ = భయముతో; శరణంబు = శరణు; ఒందెన్ = చొచ్చెను; బిట్టు = మిక్కిలి; అలసి = అలసిపోయి; నృపా = రాజా.
భావము:- రాజా! విష్ణుమూర్తి సమస్త చరాచర జీవులకు ప్రభువు, పరమ పురుషుడు, భక్తితో సేవిస్తే సంతోషించేవాడు. ఈ పిల్లవాడు ఆ శ్రీహరే అయ్యి ఉంటాడు.” అనుకున్నాడు కాళియుడు. మిక్కిలి భయంతో, అలసటతో అతడు కృష్ణుని శరణు కోరాడు.

తెభా-10.1-671-వ.
ఇట్లు క్రూరంబులయిన హరిచరణ ప్రహరంబులం బడగ లెడసి నొచ్చి చచ్చినక్రియం బడియున్న పతిం జూచి నాగకాంతలు దురంతంబయిన చింతాభరంబున నివ్వటిల్లెడు నెవ్వగల నొల్లొంబోయి పల్లటిల్లిన యుల్లంబుల.
టీక:- ఇట్లు = ఈ విధముగా; క్రూరంబులు = కఠినమైనవి; అయిన = ఐన; హరి = కృష్ణుని; చరణ = పాదముల; ప్రహరంబులన్ = తాకిడిచే; పడగలు = పడగలు; ఎడసి = భగ్నమై; నొచ్చి = నొప్పిని పొందినవాడై; చచ్చిన = చనిపోయినవాని; క్రియన్ = వలె; పడియున్న = పడి ఉన్నట్టి; పతిన్ = భర్తను; చూచి = చూసి; నాగకాంతలు = ఆ కాళియుని భార్యలు; దురంతంబు = అంతులేనిది; అయిన = ఐనట్టి; చింత = విచారము యొక్క; భరంబునన్ = అతిశయముచేత; నివ్వటిల్లెడు = కలిగిన; నెఱ = మిక్కిలి; వగలన్ = దుఃఖముతో; ఒల్లంబోయి = తపించి; పల్లటిల్లిన = తడబడిన, కలవరపడిన; ఉల్లంబుల = మనసులతో.
భావము:- ఈ విధంగా తాండవకృష్ణుడి దారుణమైన పాదాలతాకిడికి పడగలన్ని చితికిపోయి, చచ్చిపోయినవాడిలా పడి ఉన్న తమ భర్త కాళియుని చూసి, అతని భార్యలు ఎంతో శోకించారు. భరించలేని ఆ శోకభారంతో వారి మనస్సులు కలవరపడ్డాయి.

తెభా-10.1-672-మ.
బంధంబులు వీడ భూషణము లాకంపింపఁ గౌఁదీవియల్
కుయుగ్మంబుల వ్రేగునం గదలఁ బైకొంగుల్ వడిన్ జాఱఁగాఁ
బ్రచురభ్రాంతిఁ గలంగి ముందట రుదద్బాలావళిం గొంచు స్రు
క్కుచు, భక్తింజని కాంచి రా గుణమణిన్ గోపాలచూడామణిన్.

టీక:- కచబంధంబలు = జుట్టుముళ్ళు; వీడన్ = విడిపోతుండగ; భూషణములు = ఆభరణములు; ఆకంపింపన్ = అంతటను చలించగా; కౌన్ = నడుములు అనెడి; తీవియల్ = లతలు; కుచ = స్తనములు; యుగ్మంబులు = జంటల; వ్రేగునన్ = బరువునకు; కదలన్ = చలింపగా; పైకొంగులు = పైటకొంగులు; వడిన్ = వేగముచేత; జార = తొలగుచుండగా; ప్రచుర = అధికమైన; భ్రాంతిన్ = విభ్రమముచే, నివ్వెరపాటుచేత; కలంగి = కలత నొంది; ముందట = ఎదురుగా; రుదత్ = ఏడ్చుచున్న; బాల = పిల్లల; ఆవళిన్ = సమూహమును; కొంచున్ = తీసుకొనుచు; స్రుక్కుచు = నొచ్చుకొనుచు; భక్తిన్ = భక్తితో; చని = వెళ్ళి; కాంచిరి = దర్శనము చేసికొనిరి; గుణమణిన్ = మంచి గుణములు కలవానిని; గోపాల = యాదవులలో; చూడామణిన్ = శిరోమణివంటి వానిని.
భావము:- వారు వస్తున్న వేగానికి కాళియుని భార్యల కొప్పుముడులు జారిపోతున్నాయి. వారి ఆభరణాలు చెదిరిపోతున్నాయి. స్తనాల బరువుకు తీగలాంటి నడుములు అల్లాడిపోతున్నాయి. పైటకొంగులు జారి పోతున్నాయి. దిక్కు తోచని భ్రాంతితో కలవర పడిపోతున్నారు. గొల్లున ఏడుస్తున్న పిల్లలను ముందు పెట్టుకొని సుగుణాలశ్రేష్ఠుడు గోపాలశేఖరుడు అయిన కృష్ణుని చేరి వారు భక్తిపూర్వకంగా దర్శనం చేసుకొన్నారు.