పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కంసుని మంత్రాలోచన

తెభా-10.1-1151-వ.
మఱియు నలుక దీఱక కంసుండు దేవకీవసుదేవుల లోహపాశ బద్ధులంజేసి కేశియనువానిం బిలిచి రామకేశవులం జంపుమని పంపి మంత్రి భట గజారోహక చాణూర ముష్టిక సాల్వ కోసల ప్రముఖుల రావించి యిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను, దానితో; అలుక = కోపము; తీఱక = తీరకపోవుటచేత; కంసుండు = కంసుడు; దేవకీ = దేవకీదేవి; వసుదేవులన్ = వసుదేవులను; లోహ = ఇనప; పాశ = గొలుసులతో; బద్ధులన్ = కట్టబడినవారిగా; చేసి = చేసి; కేశి = కేశి; అను = అనెడి; వానిన్ = వాడిని; పిలిచి = పిలిచి; రామ = బలరాముడు; కేశవులన్ = కృష్ణులను; చంపుము = చంపివేయుము; అని = అని; పంపి = నియమించి; మంత్రి = మంత్రులు; భట = సైనికులు; గజారోహక = ఏనుగుమావటీడు; చాణూర = చాణూరుడు; ముష్టిక = ముష్టికుడు; సాల్వ = సాల్వభూపతి; కోసల = కోసలరాజు; ప్రముఖులన్ = మొదలగువారిని; రావించి = రప్పించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అంతటితో కంసుడికి అలక తీరలేదు. అతడు దేవకీ వసుదేవులను ఇనప సంకెళ్ళతో బంధించాడు. కేశి అనేవాణ్ణి పిలచి, గోకులానికి వెళ్ళి రామకృష్ణులను చంపి రమ్మని పంపించాడు. తరువాత మంత్రులను, భటులను, మావటివాళ్ళను, చాణూరుడు ముష్టికుడు అనే జెట్టీలనూ, సాల్వుడు కోసలుడు మొదలైన ముఖ్యులనూ పిలిపించి వారితో ఇలా అన్నాడు.

తెభా-10.1-1152-శా.
"ఎందున్ నన్నెదిరించి పోరుటకు దేవేంద్రాదులుం జాల రీ
బృందారణ్యము మంద నిప్పుడు మదాభీరార్భకుల్ రామ గో
విందుల్ వర్ధిలుచున్న వారఁట రణోర్విం గంసుని ద్రుంతు మం
చున్ ర్పంబులు పల్కుచుందు రఁట యీ చోద్యంబులన్ వింటిరే?

టీక:- ఎందున్ = ఎన్నడు; నన్ను = నన్ను; ఎదిరించి = ఎదిరించి; పోరుట = యుద్ధమున; కున్ = కు; దేవేంద్ర = దేవేంద్రుడు; ఆదులున్ = మొదలగువారు కూడ; చాలరు = సమర్థులు కారు; ఈ = ఇక్కడి; బృందారణ్యమున్ = బృందావనములోని; మందన్ = గొల్లపల్లెలో; ఇప్పుడు = ఇప్పుడు; మద = మదమెక్కిన; ఆభీర = గొల్ల; అర్భకుల్ = పిల్లలు; రామ = బలరాముడు; గోవిందుల్ = కృష్ణులు; వర్ధిల్లుచున్నవారు = పెరుగుతున్నారు; అట = అట; రణ = యుద్ధ; ఉర్విన్ = భూమి యందు; కంసున్ = కంసుడిని; నొప్పింతుము = దెబ్బతీసెదము; అంచున్ = అని; దర్పంబులున్ = గర్వపుమాటలు; పల్కుచుందురు = చెప్పుచుందురు; అట = అట; ఈ = ఈ; చోద్యంబులన్ = విచిత్రములను; వింటిరే = విన్నారా.
భావము:- “ఎక్కడైనా, ఇంద్రాదులకు సైతం నన్ను ఎదిరించి పోరాడా లంటే శక్తి చాలదు. అలాంటిది, బలరామకృష్ణులు అనే మదించిన గొల్లపిల్లలు ఇప్పుడు బృందావనంలో పెరుగుతున్నారుట. “కదనభూమిలో కంసుణ్ణి చంపుతా” మంటూ బీరాలు పలుకుతున్నారుట. మీరు ఈ వింత మాటలు విన్నారా?

తెభా-10.1-1153-క.
ట్టణజనములు చూతురు
ట్టంబుగ మల్లరంగల పార్శ్వములం
బెట్టింపుఁడు తమగంబులు
పుట్టింపుఁడు వీట మల్లుపో రను మాటన్.

టీక:- పట్టణ = నగరములోని; జనములు = ప్రజలు; చూతురు = చూసెదరు; దట్టంబుగన్ = గట్టిగా; మల్ల = కుస్తీపోటీ జరిగెడి; రంగ = రంగస్థలము; తలపార్శ్వములన్ = ముందుప్రక్క; పెట్టింపుడు = పెట్టించండి; తమగంబులున్ = మంచెలను; పుట్టింపుడు = కలుగ జేయండి; వీటన్ = పట్టణము నందు; మల్లుపోరు = కుస్తీపోటీ; అను = అనెడి; మాటన్ = మాటను.
భావము:- మల్లజెట్టీ పోటీ ఏర్పాటు చేయండి. మల్ల రంగానికి ముందువైపుల మంచెలు అమర్చండి. పుర ప్రజలు చూస్తారు. నగరం నలుమూలల చాటింపు వేయించండి.

తెభా-10.1-1154-శా.
విన్నాణంబులఁ బోరనేర్తురు మహావీర్యప్రతాపాది సం
న్నుల్ మీరలు మేటి మల్లుగములం బ్రఖ్యాతులై పెంపుతో
న్నా రా బలకృష్ణులం బెనఁకువన్ ర్దించి మత్ప్రీతి కా
న్నుల్ గండు పురీజనుల్ పొగడ నో! చాణూర! యో! ముష్టికా!

టీక:- విన్నాణంబులన్ = మల్లబంధములతో; పోరన్ = యుద్ధము చేయుట; నేర్తురు = నేర్పు కలిగినవారు; మహా = గొప్ప; వీర్య = శూరత్వము; ప్రతాప = పరాక్రమము; ఆది = మున్నగునవి; సంపన్నులు = అధికముగా కలవారు; మీరలు = మీరు; మేటి = అధిపుల; మల్లుగములన్ = మల్ల వీరు లందరిలోనూ; ప్రఖ్యాతంబులు = ప్రసిద్ధమైన వారు; ఐ = అయ్యి; పెంపు = గొప్పదనము; తోన్ = తోటి; మన్నారు = జీవించారు; ఆ = ఆ యొక్క; బలభద్రుండును = బలరాముని; కృష్ణులన్ = కృష్ణుని; పెనుకువన్ = మల్లయుద్ధము నందు; మర్దించి = చంపి; మత్ = నా యొక్క; ప్రీతి = ప్రీతి; కిన్ = కి; ఆసన్నులు = సమీపించినవారు; కండు = అవ్వండి; పురీ = నగరములోని; జనుల్ = ప్రజలు; పొగడన్ = పొగడునట్లుగ; ఓ = ఓ; చాణుర = చాణూరుడా; ఓ = ఓ; ముష్టికా = ముష్టికుడా.
భావము:- ఓ చాణూర ముష్టికులారా! మీరు మిక్కిలి నేర్పుగా మల్ల యుద్ధం సలుప గల దిట్టలు. గొప్ప శౌర్య ప్రతాపాలు కల వారు జెట్టీలలో జగజెట్టీలుగా పేరుపొందిన వారు. పట్టణ ప్రజలు ప్రశంసించేలా మల్లయుద్ధంలో ఆ రామకృష్ణులను మట్టుపెట్టి నాకు ప్రీతిపాత్రులు కండు.

తెభా-10.1-1155-శా.
రారా హస్తిపకేంద్ర! గండమదధారాగంధలోభాంధ గం
భీరాళివ్రజమైన మత్కువలయాపీడద్విపేంద్రంబు మ
ద్వారోదంచిత దేహళీపరిసరస్తంభంబు డాయంగ నా
భీరుల్ రా నదలించి డీకొలుపుమీ బీరంబు తోరంబుగన్.

టీక:- రారా = రమ్ము; హస్తిపక = మావటీలలో; ఇంద్ర = శ్రేష్ఠుడా; గండ = చెక్కిళ్ళ యందలి; మద = మదజలపు; ధారా = ధారల యొక్క; గంధ = వాసన యందు; లోభ = లాలసచేత; అంధ = కళ్ళు కానని; గంభీర = గంభీరమైన; అళి = తుమ్మెదల; వ్రజము = సమూహము కలది; ఐన = అయినట్టి; మత్ = నా యొక్క; కువలయాపీడ = కువలయాపీడము అనెడి; ద్విప = ఏనుగు {ద్విపము - తొండము నోరు రెంటితోను పానము చేయునది, ఏనుగు}; ఇంద్రంబు = శ్రేష్ఠమును; మత్ = నా యొక్క; ద్వార = వాకిలి, గుమ్మము నందు; ఉదంచిత = మిక్కిలి చక్కగా ఉన్న; దేహళీ = గడప; పరిసర = సమీపము నందలి; స్తంభంబున్ = స్తంభమును; డాయంగన్ = సమీపించుటకు; ఆభీరులు = గోపకబాలురు; రాన్ = రాగా; అదలించి = అదలించి; డీకొలుపుమీ = డీకొట్టునట్లు చేయుము; బీరంబు = వీరత్వము; తోరంబుగన్ = అతిశయించునట్లు.
భావము:- ఓరీ మావటీ! ఇలా రా! ఆ గోపాలకులు మన భవన ద్వార సమీపంలో ఉన్న స్తంభం దగ్గరకు రాగానే నీ ప్రతాపం ప్రదర్శించు. చెక్కిళ్ళ మీది మదజల ధారల సౌరభాల చేత గండుతుమ్మెదలకు ఆశగొలిపి ఆకర్షించే కువలయాపీడము అనే మన గజరాజాన్ని అదలించి వారి మీదకు డీకొలుపు.