పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/ఉద్ధవునికడ గోపికలు వగచుట
తెభా-10.1-1476-వ.
అని మీకుం జెప్పు మని కృష్ణుండు సెప్పె” ననవుడు నుద్ధవునికి గోపికలు సంతసించి యిట్లనిరి.
టీక:- అని = అని; మీ = మీ; కున్ = కు; చెప్పుము = చెప్పుము; అని = అని; కృష్ణుండు = కృష్ణుడు; చెప్పెన్ = చెప్పెను; అనవుడు = అనగా; ఉద్ధవుని = ఉద్ధవుని; కిన్ = కి; గోపికలు = గొల్లస్తీలు; సంతసించి = సంతోషించి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- అని మీకు చెప్పమని శ్రీకృష్ణుడు నాకు చెప్పి పంపాడు” అని ఉద్దవుడు చెప్పాడు. ఆ పలుకులు వినిన గోపికలు సంతోషించి ఆయనతో ఇలా అన్నారు.
తెభా-10.1-1477-ఉ.
"ఇమ్ములనున్నవాఁడె హరి? యిక్కడి కెన్నడు వచ్చు వచ్చి మా
యుమ్మలికంబుఁ బాపునె ప్రియుం డిట వచ్చెదనన్న సైఁతురే?
య మ్మథురాపురీ రమణు లడ్డము వత్తురుగాక చెల్లరే!
మమ్ము విధాత నిర్దయుఁడు మన్మథవేదన పాలు సేసెనే.
టీక:- ఇమ్ములన్ = సుఖముగ; ఉన్నవాడె = ఉన్నాడా; హరి = కృష్ణుడు; ఇక్కడ = ఇక్కడ; కిన్ = కి; ఎన్నడున్ = ఎప్పుడు; వచ్చున్ = వచ్చును; వచ్చి = వచ్చి; మా = మా; ఉమ్మలికంబున్ = పరితాపమును; పాపునె = పోగొట్టునా; ప్రియుండు = కృష్ణుడు; ఇటన్ = ఇక్కడికి; వచ్చెదన్ = వస్తాను; అన్నన్ = అనగా; సైతురే = ఓర్చుకొనుదురా; ఆ = ఆ యొక్క; మథుర = మథుర; పురీ = పట్టణపు; రమణులు = స్త్రీలు; అడ్డము = దారికడ్డముగ; వత్తురు = వచ్చెదరు; కాక = కదా; చెల్లరే = అయ్యో; మమ్మున్ = మమ్ములను; విధాత = బ్రహ్మదేవుడు; నిర్దయుడు = దయలేనివాడు; మన్మథ = మన్మథతాపమువలని; వేదనన్ = వ్యధకు; పాలు = ఆధీనులుగా; చేసెనే = చేసెనుకదా.
భావము:- “శ్రీకృష్ణుడు సుఖంగా ఉన్నాడా? ఆయన ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? వచ్చి మా పరితాపం తీరుస్తాడా? మా ప్రాణేశ్వరుడు ఇక్కడకి వస్తానంటే ఆ మధురానగర అతివలు అడ్డగిస్తారు తప్ప సహిస్తారా? అయ్యయ్యో! దయమాలిన బ్రహ్మ మమ్మల్ని మన్మథ బాధలకు గురిచేసాడు కదా.
తెభా-10.1-1478-చ.
మఱచునొకో మదిం దలఁచి మాధవుఁ డా యమునాతటంబునం
దఱుచగు దివ్యసౌరభ లతా గృహసీమల నేము రాగ; మా
మఱువులనుండి నీడలకు మమ్మెలయించి కలంచి దేహముల్
మఱచినఁ దేల్చి నూల్కొలిపి మన్మథలీలలఁ దేల్చు చందముల్.
టీక:- మఱచునొకొ = మరచిపోయెనేమో; మదిన్ = మనసునందు; తలచి = తలచుకొని; మాధవుడు = కృష్ణుడు; ఆ = ఆ యొక్క; యమునా = యమునానదీ; తటంబునన్ = తీరమునందు; తఱచు = దట్టమైనది; అగు = అయిన; దివ్య = మంచి; సౌరభ = పరిమళములుగల; లతాగృహ = పొదరిండ్ల; సీమలన్ = ప్రదేశములందు; ఏము = మేము; రాగ = వచ్చుటతోనే; మా = మా యొక్క; మఱువుల = మాటుల; నుండి = నుండి; నీడల్ = పొదరిండ్లనీడలలోని; కున్ = కి; మమ్మున్ = మమ్ములను; ఎలయించి = చేర్చి; కలంచి = కలవరపెట్టి; దేహముల్ = ఒళ్ళు; మఱచినన్ = తెలియకపోగా; తేల్చి = పరవశముచేసి; నూల్కొలిపి = పురికొలిపి; మన్మథలీలలన్ = మన్మథక్రీడల యందు; తేల్చు = సంతోషపెట్టు; చందముల్ = విధములను.
భావము:- లక్ష్మీదేవి వలచిన వాడు అయిన శ్రీకృష్ణుడు యమునానది ఒడ్డున దివ్యపరిమళాలు వెదజల్లు పూపొదరిండ్ల నీడలకు మమ్మల్ని జేర్చి, ఎలచి కలచి మేము మైమరపు చెందగా బుజ్జగించి ప్రోత్సహించి మమ్ము మన్మథ క్రీడలలో తేల్చిన ఘట్టాలు మరచెనా ఏమి?
తెభా-10.1-1479-శా.
నీతో నర్మగృహంబులం బలుకునే నే మెల్ల వంశోల్లస
ద్గీత భ్రాంతలమై కళిందతనయా తీరంబునం జేరినం
జేతోజాత సుఖంబులం దనిపి మా చిత్తస్థితుల్ చూడ లీ
లా తంత్రజ్ఞతఁ దాఁగి మెల్లన మదాలాపంబు లాలించుటల్.
టీక:- నీ = నీ; తోన్ = తోటి; నర్మ = ఏకాంత; గృహంబులన్ = గృహములందు; పలుకునే = చెప్పునా; నేము = మేము; ఎల్లన్ = అందరము; వంశ = మురళినుండి; ఉల్లసత్ = వెలువడెడి; గీత = పాటలచే; భ్రాంతలము = భ్రమించిన వారము; ఐ = అయ్యి; కళిందతనయా = యమునానదీ {కళిందితనయ - కళింద పర్వతమునకు పుట్టినది, యమునానది}; తీరంబునన్ = గట్టుమీదకి; చేరినన్ = చేరగా; చేతోజాత = మన్మథక్రీడలవలని; సుఖంబులన్ = సుఖములచేత; తనిపి = తృప్తిపరచి; మా = మా యొక్క; చిత్త = మనసు; స్థితుల్ = రీతులను; చూడన్ = పరీక్షించుటకు; లీలా = విలాసపు; తంత్రజ్ఞతన్ = తంత్రములు తెలియుటచే; దాగి = మఱుగున దాగుకొని; మెల్లన = మెల్లిగా; మదాలాపంబుల్ = అప్పటి మా మాటలను; లాలించుటల్ = ఆదరించుటలను.
భావము:- మేము అంతా వేణుగానం విని విభ్రాంతలమై యమునాతీరానికి రాగా, మమ్మల్ని మదనలీలలలో తనిపాడు. ఆ పైన మా మనోగతులు తెలుసుకోవడానికి విలాస తంత్రజ్ఞుడు కనుక, ఎక్కడో దాగికొని ఉండి మెల్లగా మా మాటలు వినేవాడు. శ్రీకృష్ణుడు నీతో ఏకాంతంలో ఉన్నప్పుడు ఈ వృత్తాంతాలు అన్నీ చెప్తాడా?
తెభా-10.1-1480-క.
ముచ్చట వేళలఁ జెప్పునె
యచ్చుగ మును నేము నోము నప్పుడు జలముల్
సొచ్చిన మా చేలంబులు
మ్రుచ్చిలి యిచ్చిన విధంబు మూలం బెల్లన్.
టీక:- ముచ్చట = వేడుకమాటల; వేళలన్ = సమయము లందు; చెప్పునే = చెప్పుతాడా; అచ్చుగన్ = విశదముగా; మును = మునుపు; నేము = మేము; నోమున్ = నోమునోచెడి; అప్పుడు = సమయము నందు; జలముల్ = నీళ్ళలో; చొచ్చినన్ = దిగగా; మా = మా యొక్క; చేలంబులు = బట్టలు; మ్రుచ్చిలి = దొంగిలించి; ఇచ్చినన్ = తిరిగి యిచ్చిన; విధంబున్ = విధమునకు; మూలంబు = కలకారణము; ఎల్లన్ = అంతటిని.
భావము:- కాత్యాయనీ వ్రతం కావించుటకు మేము వివస్త్రలమై స్నానార్థం నీళ్ళలో ప్రవేశించినప్పుడు మా వలువలు దొంగిలించి మళ్ళీ మా ప్రార్థనలపై చీరలు ఇచ్చిన విషయం గురించి, శ్రీకృష్ణుడు నీతో ముచ్చటాడే వేళలలో చెప్తుంటాడా?
తెభా-10.1-1481-శా.
ఏకాంతంబున నీదుపైఁ నొరగి తా నేమేని భాషించుచో
మా కాంతుండు వచించునే రవిసుతా మధ్యప్రదేశంబునన్
రాకాచంద్ర మయూఖముల్ మెఱయఁగా రాసంబు మాతోడ నం
గీకారం బొనరించి బంధనియతిం గ్రీడించు విన్నాణముల్.
టీక:- ఏకాంతంబునన్ = ఒంటరిగా ఉన్నప్పుడు; నీదు = నీ; పైన్ = మీదకు; ఒరగి = వాలి; తాను = అతను; ఏమేని = ఏదైనా; భాషించుచో = మాట్లాడు నప్పుడు; మా = మా యొక్క; కాంతుండు = ప్రియుడు, కృష్ణుడు; వచించునే = చెప్పునా; రవిసుతా = యమునానదీ {రవిసుత - సూర్యుని పుత్రిక, యమున}; మధ్య = నడిమి; ప్రదేశంబునన్ = స్థలము లందు; రాకా = నిండుపున్నమినాటి; చంద్ర = చంద్రుని యొక్క; మయూఖముల్ = కిరణములు; మెఱయగా = మెరుస్తుండగా; రాసంబున్ = రాసక్రీడను; మా = మా; తోడన్ = తోటి; అంగీకారంబు = చేయనొప్పుకొనుట; ఒనరించి = చేసి; బంధ = రాసబంధముల; నియతిన్ = నియమముల ప్రకారము; క్రీడించు = ఆడిన; విన్నాణముల్ = నేర్పులు.
భావము:- నీతో కృష్ణుడు ఒంటరిగా ఉన్నప్పుడు, నీ మీదకి ఒరగి నీతో ముచ్చట్లు చెప్తున్నప్పుడు, పున్నమి వెన్నెల రాత్రి యమునానది మధ్యభాగంలో మాతో రాసక్రీడలు నెరపుతూ బంధరతు లొనర్చిన నేర్పులు అతడు చెప్తుంటాడా.
తెభా-10.1-1482-సీ.
తనుఁబాసి యొక్కింత తడవైన నిటమీఁద-
నేలపై మేనులు నిలువ వనుము
నేలపై మేనులు నిలువక యట మున్న-
ధైర్యంబు లొక్కటఁ దలగు ననుము
ధైర్యంబు లొక్కటఁ దలఁగిన పిమ్మటఁ-
జిత్తంబు లిక్కడఁ జిక్క వనుము
చిత్తంబు లిక్కడఁ జిక్కక వచ్చినఁ-
బ్రాణంబు లుండక పాయు ననుము
తెభా-10.1-1482.1-తే.
ప్రాణములుపోవ మఱి వచ్చి ప్రాణవిభుఁడు
ప్రాణిరక్షకుఁ డగు తన్నుఁ బ్రాణులెల్లఁ
జేరి దూఱంగ మఱి యేమి సేయువాఁడు
వేగ విన్నప మొనరింపవే మహాత్మ!
టీక:- తనున్ = అతనిని; పాసి = విడిచి; ఒక్కింత = కొద్దిగానైన; తడవు = ఆలస్యము; ఐనన్ = అయినను; ఇట = ఇక; మీద = పిమ్మట; నేల = భూమి; పైన్ = మీద; మేనులు = దేహములు; నిలువవు = ఉండవు; అనుము = అని చెప్పుము; నేల = భూమి; పైన్ = మీద; మేనులు = దేహములు; నిలువక = ఉండకపోయిన; అటమున్నన్ = దానికిముందే; ధైర్యంబులు = స్థైర్యములు, తాలిమి; ఒక్కటన్ = మొత్తముగా; తలగున్ = తొలగిపోవును; అనుము = అని చెప్పుము; ధైర్యంబులు = తాలుములు; ఒక్కటన్ = మొత్తంఅంతా; తలగినన్ = తొలగిపోయిన; పిమ్మటన్ = తరువాత; చిత్తంబులు = మనసులు; ఇక్కడన్ = ఇచ్చట; చిక్కవు = నిలబడవు; అనుము = అని చెప్పుము; చిత్తంబులు = మనసులు; ఇక్కడన్ = ఇచ్చట; చిక్కకన్ = నిలబడని దశ; వచ్చినన్ = రాగ; ప్రాణంబులు = ప్రాణములు; ఉండక = దేహముననుండకుండ; పాయును = తొలగును; అనుము = అని చెప్పుము.
ప్రాణములు = ప్రాణములు; పోవన్ = పోయినచో; మఱి = ఇక; వచ్చి = ఇక్కడకు వచ్చి; ప్రాణవిభుడు = మనోనాయకుడు,కృష్ణుడు; ప్రాణి = ఎల్ల ప్రాణులను; రక్షకుడు = రక్షించెడివాడు; అగు = ఐన; తన్ను = అతనిని; ప్రాణులు = జీవులు; ఎల్లన్ = అందరు; చేరి = కూడి; దూఱంగన్ = దూషించుచుండగా; మఱి = పిమ్మట; ఏమి = ఏమిటి; చేయువాడు = చేయగలడు; వేగన్ = శీఘ్రమే; విన్నపము = మనవి; ఒనరింపవే = చేయుము; మహాత్మా = గొప్పవాడా.
భావము:- ఓ ఉద్ధవా! మహానుభావా! మా మాటలుగా ప్రాణేశ్వరుడికి ఇలా విన్నవించు “తనను విడచి ఇక మీద కొంచం సేపైన మా దేహములు భూమ్మీద ఉండ వని చెప్పుము. నేలపై మా శరీరములు నిలువకుండపోవుటకు మునుపే ఒక్కసారిగా మా మనోధైర్యములు తొలగిపోతా యని చెప్పుము. మా మనోధైర్యాలు ఒక్కసారిగా తొలగిపోయిన పిదప మా మనసులు ఇక్కడ ఉండ వని చెప్పుము. ఇక్క డ మనసులు నిలువక పోగా మా ప్రాణములు ఎగిరిపోవు నని చెప్పుము. మా ప్రాణములు ఎగిరిపోయిన పిమ్మట ప్రాణేశ్వరు డగు తాను వచ్చిననూ జీవరక్షకు డగు తనను జీవులు అందరూ గుమికూడి నిందింపగా ఏమి చేయగలడు? నీ వీ సంగతి వెంటనే అతనికి విజ్ఞప్తి చేయుము.
తెభా-10.1-1483-క.
తగులరె మగలను మగువలు?
దగులదె తను మున్ను కమల? తగవు విడిచియుం
దగిలిన మగువల విడుచుట
దఁగ దని తనుఁ దగవు బలుకఁ దగుదువు హరికిన్.
టీక:- తగులరె = మోహింపరా; మగలను = మగవారిని; మగువలు = స్త్రీలు; తగులదె = మోహింపలేదా; తనున్ = అతనిని; మున్ను = పూర్వము; కమల = లక్ష్మీదేవి; తగవు = తమ సంసార ధర్మమును; విడిచియున్ = వదలి; తగిలిన = మోహించినట్టి; మగువలన్ = స్త్రీలను; విడుచుట = విడుచుట; తగదు = తగినపని కాదు; అని = అని; తనున్ = ఆ కృష్ణునికి; తగవున్ = న్యాయము; పలుకన్ = చెప్పుటకు; తగుదువు = తగినవాడవు; హరి = కృష్ణుని; కిన్ = కి.
భావము:- పడతులు పురుషులను ప్రేమించరా? లక్ష్మి మునుపు తనను ప్రేమించలేదా? న్యాయము విడిచి మరీ ప్రేమించే రమణీమణులను విడిచిపెట్టడం తగదు అనే న్యాయమును కృష్ణుడికి చెప్పడానికి నీవే తగిన వాడవు.
తెభా-10.1-1484-సీ.
విభుఁడు మా వ్రేపల్లె వీధుల నేతేరఁ-
జూతుమే యొకనాడు చూడ్కు లలరఁ?
బ్రభుఁడు మాతో నర్మభాషలు భాషింప-
విందుమే యొకనాఁడు వీను లలరఁ?
దనువులు పులకింప దయితుండు డాసినఁ-
గలుగునే యొకనాఁడు కౌఁగలింపఁ?
బ్రాణేశు! మమ్మేల పాసితి వని దూఱఁ-
దొరకునే యొకనాఁడు తొట్రుపడఁగ?
తెభా-10.1-1484.1-తే.
వచ్చునే హరి మే మున్న వనముఁ జూడఁ?
దలఁచునే భర్త మాతోడి తగులు తెఱఁగుఁ?
దెచ్చునే విధి మన్నాథుఁ దిట్టువడక?
యెఱుఁగ బలుకు మహాత్మ! నీ కెఱుఁగ వచ్చు."
టీక:- విభుడు = కృష్ణుడు; మా = మా యొక్క; వ్రేపల్లె = గొల్లపల్లెలోని; వీధులన్ = వీధులలో; ఏతేరన్ = వచ్చుచుండగ; చూతమే = చూడగలమా; ఒకనాడున్ = ఏదినమునకైన; చూడ్కుల = కన్నులు; అలరన్ = ఆనందించగా; ప్రభుడు = కృష్ణుడు; మా = మా; తోన్ = తో; నర్మ = ప్రియమైన; భాషలు = మాటలు; భాషింపన్ = పలుకగా; విందుమే = వినగలమా; ఒకనాడున్ = ఏరోజుకైన; వీనులు = చెవులు; అలరన్ = ఆనందించగా; తనువులు = శరీరములు; పులకింపన్ = గగుర్పాటు చెందగా; దయితుండు = ప్రియుడు; డాసినన్ = దరిచేరగా; కలుగునే = లభించునా; ఒకనాడున్ = ఏదినమునకైన; కౌఁగిలింపన్ = ఆలింగనము చేసికొనుట; ప్రాణేశున్ = మనోవిభుని; మమ్మున్ = మమ్ము; ఏల = ఎందుకు; పాసితివి = ఎడబాసితివి; అని = అని; దూఱన్ = దూషించుట; దొరకునే = లభించునా; ఒకనాడున్ = ఏదినమునకైన; తొట్రుపడగన్ = తడబడునట్లుగా.
వచ్చునే = కలుగునా; హరి = కృష్ణుడు; మేము = మేము; ఉన్న = ఉన్నట్టి; వనమున్ = అడవిని; చూడన్ = చూచుటకు; తలచునే = గుర్తుచేసుకొనునా; భర్త = ప్రభువు; మా = మా; తోడి = తోటి; తగులు = కల సంబంధము యొక్క; తెఱగున్ = వివరమును; తెచ్చునే = తీసుకు వస్తాడా; విథి = బ్రహ్మదేవుడు; మత్ = మా యొక్క; నాథున్ = విభున్; తిట్టువడక = తిట్టగలుగుట; ఎఱుగన్ = తెలియ; పలుకు = చెప్పుము; మహాత్మా = గొప్పమనసు కలవాడ; నీ = నీ; కున్ = కు; ఎఱుగవచ్చు = తెలిసుండవచ్చును.
భావము:- మా ప్రియతముడు వ్రేపల్లె వీధులకు రాగా కనులపండువగా మేము ఒకరోజైనా చూడగల్గుతామా? మా ప్రభువు మాతో ప్రియంగా మాట్లాడే మాటలను ఒకనాడైనా వీనులవిందుగా వినగలుగుతమా? వల్లభుడు చెంతకు రాగా ఒక రోజు అయినా ఒడలు గగుర్పొడిచేలా కౌఁగిలించుకొనే భాగ్యము మాకు కలుగుతుందా? ఓ ప్రాణనాయకా! మమ్మల్నెందుకు దూరం పెట్టావు అని తొట్రుపడతూ తనను దూషించడానికి ఏరోజైనా అవకాశం ఏర్పడుతుందా? కృష్ణుడు ఎప్పటికైనా మేమున్న ఈ బృందావనము చూడ్డానికి వస్తాడా? మా మనోవల్లభుడు అయిన శ్రీకృష్ణుడు తనకు మాతో కల సంబంధమును స్మరిస్తుంటాడా. మా చేత తిట్లు తినక ముందే బ్రహ్మదేవుడు మా నాధుని మాదగ్గరకు తీసుకొస్తాడా? ఓ మహాత్మా! ఇన్నియు నీకు తెలిసి ఉండవచ్చును. కనుక, మాకు వివరముగా చెప్పు.
తెభా-10.1-1485-వ.
అని “దుఃఖార్ణవమగ్నంబయిన గోపకులంబు నుద్ధరింపుము రమానాథ” యని గోపికలు వగచి తదనంతరంబ మఱియు నుద్ధవ నిగదితంబు లయిన కృష్ణసందేశంబులవలన విరహవేదనలు విడిచి యుద్ధవునిం బూజించి; రిట్లు కృష్ణలీలావర్ణనలు చేయుచు వ్రేపల్లె నుద్ధవుండు గొన్ని నెల లుండి నందాదుల వీడ్కొని మరలి రథారూఢుండై చనిచని.
టీక:- అని = అని; దుఃఖ = దుఃఖము అనెడి; అర్ణవము = సముద్రమున {అర్ణవము - నీటికి నిలయమైనది, సాగరము}; మగ్నంబు = మునిగినది; అయిన = ఐన; గోప = గొల్లవారి; కులంబునున్ = వంశమును; ఉద్ధరింపుము = కాపాడుము; రమానాథ = కృష్ణుడా {రమానాథుడు - లక్ష్మీదేవికి భర్త, విష్ణువు}; అని = అని; గోపికలు = గొల్లస్త్రీలు; వగచి = శోకించి; తదనంతరంబ = అటు పిమ్మట; మఱియున్ = ఇంకను; ఉద్ధవ = ఉద్ధవునిచే; నిగదితంబులు = చెప్పబడినవి; అయిన = ఐన; కృష్ణ = కృష్ణుని యొక్క; సందేశంబులు = సమాచారములు; వలన = వలన; విరహ = ఎడబాటు వలని; వేదనలు = తాపములను; విడిచి = వదలి; ఉద్ధవునిన్ = ఉద్ధవుని; పూజించిరి = అర్చించిరి; ఇట్లు = ఈ విధముగ; కృష్ణ = కృష్ణుని యొక్క; లీలా = లీలలను; వర్ణనలు = వర్ణించుటలు; చేయుచున్ = చేయుచు; వ్రేపల్లెన్ = వ్రేతల పల్లెలో; ఉద్ధవుండు = ఉద్ధవుడు; కొన్ని = కొద్ది; నెలలు = మాసములు; ఉండి = ఉండి; నంద = నందుడు; ఆదులన్ = మున్నగువారిని; వీడ్కొని = సెలవుతీసుకొని; మరలి = వెనుతిరిగి; రథా = రథముపై; ఆరూఢుండు = అధిరోహించినవాడు; ఐ = అయ్యి; చనిచని = శీఘ్రమే పోయి.
భావము:- ఆ విధంగా, “ఓ లక్ష్మీపతి! దుఃఖసముద్రములో మునిగిపోయిన గోకులాన్ని ఉద్ధరింపుమా” అంటూ, ఉద్ధవుడి ముందు గోపికలు శోకించారు. అటుపిమ్మట, ఉద్ధవుడు తెలియజేసిన శ్రీకృష్ణ సందేశం విని వారు విరహవేదనలు విడిచి అతడిని పూజించారు. ఆ విధంగా శ్రీకృష్ణ లీలలు వర్ణిస్తూ ఉద్ధవుడు కొన్నిమాసాలు వ్రేపల్లెలో గడిపాడు. పిదప నందాది యదుపుంగవులను వీడ్కొని మధురకు బయలుదేరి రథం మీద వెళ్ళాడు.
తెభా-10.1-1486-క.
సారమతిఁ బ్రణుతి సేయుచు
నారయ నుద్ధవుఁడు గాంచె నఘసంహారిన్
హారిన్ మథురానగర వి
హారిన్ రిపుజన మదాపహారిన్ శౌరిన్.
టీక:- సారమతి = మంచిబుద్ధితో; ప్రణుతి = స్తోత్రము; చేయుచున్ = చేయుచు; ఆరయన్ = కనుగొని; ఉద్ధవుడు = ఉద్ధవుడు; కాంచెను = చూసెను; అఘ = పాపములను, అఘాసురుని; సంహారిన్ = నశింపజేయువానిని, సంహరించిన వానిని; హారిన్ = హారములు కలవానిని; మథురా = మథుర అనెడి; నగర = పట్టణములో; విహారిన్ = విహరించువానిని; రిపు = శత్రువులైన; జన = వారి; మద = గర్వమును; అపహారిన్ = అణచువానిని; శౌరిన్ = కృష్ణుని.
భావము:- ఆ విధంగా స్థిరచిత్తంతో శ్రీహరి సంకీర్తనలు చేస్తూ వెళ్ళిన ఉద్ధవుడు పాపాలను పోగొట్టే వాడు, అఘాసురుని సంహరించిన వాడు, శత్రువుల అందరి గర్వాన్ని అణిచేవాడు, మధురానగరంలో విహరించేవాడు అయిన శ్రీకృష్ణ భగవానుడిని దర్శించాడు.
తెభా-10.1-1487-వ.
కని యథోచితంబుగా భాషించుచుఁ దనచేత నందాదులు పుత్తెంచిన కానుకలు బలకృష్ణులకు నుగ్రసేనునికి వేఱువేఱ యిచ్చె” నని చెప్పి శుకుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.
టీక:- కని = చూసి; యధోచితముగా = అప్పటికి తగినట్లుగా; భాషించుచున్ = మాట్లాడుతూ; తన = అతని; చేత = ద్వారా; నంద = నందుడు; ఆదులు = మున్నగువారు; పుత్తెంచిన = పంపిన; కానుకలున్ = బహుమతులను; బల = బలరాముడు; కృష్ణుల్ = కృష్ణుల; కున్ = కు; ఉగ్రసేనుని = ఉగ్రసేనుని; కిన్ = కి; వేఱువేఱ = విడివిడిగా; ఇచ్చెను = ఇచ్చెను; అని = అని; చెప్పి = చెప్పి; శుకుండు = శుకుడు; పరీక్షిత్ = పరీక్షిత్తు; నరేంద్రున్ = మహారాజున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా కృష్ణుని దర్శించుకొనిన ఉధ్ధవుడు అతడితో తగు రీతి మాటలాడుతూ తన ద్వారా నందుడు మున్నగువారు పంపించిన బహుమానములు కృష్ణ బలరాములకు, ఉగ్రసేన మహారాజుకు వేర్వేరుగా సమర్పించాడు.” అని పలికి శుకయోగీంద్రుడు మళ్ళీ పరీక్షన్మహారాజుతో ఇలా అన్నాడు.