పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/ఆత్మారాముడై రమించుట
తెభా-10.1-1000-సీ.
ఈ పంచబాణాగ్ని నేమిట నార్తుము-
నీ మంజువాగ్వృష్టి నెగడదేని?
నీ మన్మథాంభోధి నే త్రోవఁ గడతుము-
నీ దృష్టి నావ యై నిలువదేని?
నీ చిత్తజధ్వాంత మే జాడఁ జెఱుతుము-
నీ హాసచంద్రిక నిగుడదేని?
నీ దర్పకజ్వర మే భంగి నడఁతుము-
నీ నవాధరసుధ నింపవేని?
తెభా-10.1-1000.1-ఆ.
నెట్లు నిర్వహింతు? మేలాగు మాలాగు;
కరుణ చేయ వేనిఁ గదియ వేని
మరుఁడు నిర్దయుండు మన నిచ్చునే? యశో
దా కుమార! యువతి ధైర్య చోర!
టీక:- ఈ = ఈ యొక్క; పంచబాణ = మన్మథ; అగ్నిన్ = తాపమును; ఏమిటన్ = దేనిచేత; ఆర్తుము = ఉపశమింపగలము; నీ = నీ యొక్క; మంజు = మనోజ్ఞమైన; వాక్ = పలుకుల; వృష్టి = జల్లు; నెగడదేనిన్ = మిక్కిలిగా పడని ఎడల; ఈ = ఈ యొక్క; మన్మథ = మన్మథమోహము అనెడి; అంభోధిన్ = సముద్రమును; ఏ = ఏ; త్రోవన్ = రీతిగా; గడతుము = దాటగలము; నీ = నీ యొక్క; దృష్టి = దయావీక్షణము; నావ = తెప్ప; ఐ = అయ్యి; నిలువదేనిన్ = ఉండని ఎడల; ఈ = ఈ యొక్క; చిత్తజ = మన్మథమోహము అనెడి; ధ్వాంతము = అంధకారమును; ఏ = ఏ; జాడన్ = విధముగ; చెఱతుము = తొలగించగలము; నీ = నీ యొక్క; హాస = చిరునవ్వు లనెడి; చంద్రిక = వెన్నెల; నిగుడదేనిన్ = చక్కగా ప్రసరించనిచో; ఈ = ఈ యొక్క; దర్పక = మన్మథ; జ్వరమున్ = వేదనను; ఏ = ఏ; భంగిన్ = విధముగ; అడతుము = అణచివేయగలము; నీ = నీ యొక్క; నవ = నవ్యమైన; అధర = పెదవుల; సుధ = అమృతముతో; నింపవేనిన్ = నిండింపనిచో; ఎట్లు = ఏ విధముగ.
నిర్వహింతుము = తట్టుకొనగలము; ఏలాగు = ఏమిటి; మాలాగు = మాగతి; కరుణన్ = దయ; చేయవేని = చూపనిచో; కదియవేని = దగ్గరకుతీయనిచో; మరుడు = మన్మథుడు; నిర్దయుండు = దయలేనివాడు; మననిచ్చునే = మమ్ము బతకనిచ్చునా; యశోదాకుమార = కృష్ణా; యువతి = యౌవనస్త్రీల; ధైర్య = తాలిమిని, నిబ్బరమును; చోర = దొంగిలించువాడ.
భావము:- మానినీమానసచోరా! యశోదాకుమారా! ఓ కృష్ణా! నీ ఇంపైన పలుకులనే వానకురియక పోతే ఈ మన్మథాగ్నిని దేనితో చల్లార్చగలం? నీ చూపులనే తెప్ప లేకుండా ఈ మదన సాగరాన్ని ఏవిధంగా దాటగలం? నీ నవ్వనే వెన్నెల లేకుంటే ఈ కామాంధకారాన్ని ఎలా పారదోలగలం? నీ నిత్య నూతనమైన అధరామృతం చిలకకపోతే ఈ స్మరజ్వరాన్ని ఎట్లా శమింపచేయగలం? నీవు కరుణించి హత్తుకోకుంటే అసలే దయమాలినవాడు మన్మథుడు మమ్మల్ని బ్రతకనిస్తాడా?
తెభా-10.1-1001-క.
అమరులఁ గాచిన హరిక్రియఁ
గమలేక్షణ! నీవు నేడు కరుణ నభయహ
స్తము మా యురముల శిరములఁ
బ్రమదంబున నిడుము మూర్ఛ పాల్పడకుండన్.
టీక:- అమరులన్ = దేవతలను; కాచిన్ = పాలించిన; హరి = విష్ణుమూర్తి; క్రియన్ = వలె; కమలేక్షణ = పద్మాక్ష, కృష్ణ; నీవు = నీవు; నేడు = ఈ దినము; కరుణన్ = దయతో; అభయ = అభయప్రదానమైన; హస్తమున్ = నీ చేతిని; మా = మా యొక్క; ఉరములన్ = వక్షస్థలము లందు; శిరములన్ = తలలపైన; ప్రమదంబునన్ = సంతోషము కలుగునట్లు; ఇడుము = పెట్టుము; మూర్ఛ = తెలివి తప్పుట; పాలన్ = చెందుటను; పడకుండన్ = పొందకుండగా.
భావము:- కమలాలవంటి కన్నులు గల కృష్ణా! శ్రీమహావిష్ణువు దేవతలను రక్షించిన విధంగా దయతో నీ అభయహస్తాన్ని, మేము మూర్ఛల పాలుకాకుండా, ఇప్పుడే మా రొమ్ముల మీదా తలల మీదా ప్రీతితో ఉంచు.
తెభా-10.1-1002-క.
కట్టా తలమునకలునై
దట్టపు విరహాగ్ని శిఖలు తరుణుల నేఁపన్
నెట్టుం బలుకవు చూడవు
కట్టిఁడివి గదా కుమార! కరుణోదారా!"
టీక:- కట్టా = అయ్యో; తలమునకలున్ = తలకు మించినవి; ఐ = అయ్యి; దట్టపు = చిక్కటి; విరహ = ఎడబాటు అనెడి; అగ్ని = అగ్ని; శిఖలున్ = మంటలు; తరుణులన్ = యువతులను; ఏపన్ = వేగించుచుండగా; ఎట్టున్ = ఏ విధముగను; పలుకవు = మాట్లాడవు; చూడవు = చూడవు; కట్టిడివి = కఠినుడవు; కదా = కదా; కరుణోదారా = దయ మిక్కిలి కలవాడ.
భావము:- దయామయా! యశోదపుత్ర! అయ్యయ్యో! గాఢవియోగ మనెడు మంటలు దట్టంగా చెలరేగి మమ్మల్ని యువతులను కాలుస్తున్నా ఏమీ మాటాడటం లేదు కన్నెత్తి చూడటం లేదు. నీవు చాలా కఠినుడవు కదయ్యా!”
తెభా-10.1-1003-వ.
అని యిట్లు కుసుమశరుని శరపరంపరా పరవశలై యోపికలు లేక పలికిన గోపికల దీనాలాపంబులు విని, నవ్వి యోగీశ్వరేశ్వరుండైన కృష్ణుం డాత్మారాముండై వారలతో రమించె నప్పుడు.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; కుసుమశరుని = మన్మథుని; శర = బాణముల; పరంపరా = ఎడతెగక తాకుటచే; పరవశలు = స్వాధీనత తప్పినవారు; ఐ = అయ్యి; ఓపికలు = నిబ్బరములు; లేక = లేక; పలికిన = పలికినట్టి; గోపికల = గొల్లభామల; దీనాలాపంబులు = మొరలు; విని = వినినను; నవ్వి = నవ్వి; యోగీశ్వరేశ్వరుండు = కృష్ణుడు {యోగీశ్వ రేశ్వరుడు - మునిశ్రేష్ఠులకు ప్రభువు, విష్ణువు}; ఐన = అయిన; కృష్ణుండు = కృష్ణుడు; ఆత్మన్ = మనసులను; రాముండు = సంతోషపెట్టువాడు; ఐ = అయ్యి; వారల = వారి; తోన్ = తోటి; రమించెన్ = కలిసెను; అప్పుడు = అప్పుడు.
భావము:- ఈవిధంగా పుష్పబాణుని బాణపరంపరలకు విహ్వలత్వం పొంది తట్టుకోలేక పోతున్న వ్రజ సుందరీమణులు పల్కిన దీనవచనాలు విని యోగేశ్వరేశ్వరుడూ ఆత్మారాముడూ అయిన శ్రీకృష్ణుడు నవ్వి వారితో రమించాడు. అప్పుడు. . .
తెభా-10.1-1004-మ.
కరుణాలోకములం బటాంచల కచాకర్షంబులన్ మేఖలా
కర బాహు స్తన మర్శనంబుల నఖాంకవ్యాప్తులన్, నర్మవా
క్పరిరంభంబుల మంజులాధర సుధాపానంబులం గాంతలం
గరగించెన్ రతికేళిఁ గృష్ణుడు గృపం గందర్పుఁ బాలార్చుచున్.
టీక:- కరుణా = దయతోకూడిన; ఆలోకములన్ = చూపులచేతను; పటాంచలన్ = పమిటచెంగులను; కచ = శిరోజముల; ఆకర్షంబులన్ = లాగుటలచేత; మేఖలా = నడుముల; కర = చేతుల; బాహు = భుజముల; స్తన = కుచములను; మర్శనంబులన్ = స్పృశించుటచేత; నఖాంక = గోటితో పెట్టు గుర్తుల; వ్యాప్తులన్ = పరచుటచేత; నర్మ = పరిహాసపు; వాక్ = సంభాషణలు; పరిరంభంబులన్ = ఆలింగనములచేత; మంజుల = మనోజ్ఞమైన; అధరసుధాపానంబులన్ = చుంబనములచేతను {అధర సుధా పానము – పెదవు లందలి అమృతమును తాగుట, చుంబనము}; కాంతలన్ = స్త్రీల; కరగించెన్ = మనసులు ద్రవింప జేసెను; రతికేళిన్ = మన్మథక్రీడ యందు; కృపన్ = దయతో; కందర్పున్ = మన్మథుని; పాలార్చుచున్ = ఉపేక్షిస్తూ, తిరస్కరించుచు.
భావము:- శ్రీకృష్ణుడు దయతో కూడిన చూపులతో చేలాంచల కేశాకర్షణలతోనూ; పిరుదులు, భుజములు, స్తనాలు స్పృశించుటతోనూ; నఖక్షతాలు ఉంచుటతోనూ; మేళము లాడుటతోనూ; ఆలింగనములు సల్పుటతోనూ; మధురమైన అధరామృతాలు అందించుటతోనూ; కందర్పుని గర్వ మణుస్తూ, గోపికలను కరుణతో కామకేళిలో కరగించాడు.
తెభా-10.1-1005-క.
మక్కువ వికసిత వదనలు
చక్కఁగఁ దనుఁ గొల్వ హాసచంద్రికతోడన్
మిక్కి లి మెఱసెను గృష్ణుఁడు
చుక్కలగమి నడిమి పూర్ణసోముని భంగిన్.
టీక:- మక్కువన్ = ప్రీతితో; వికసిత = వికసించిన; వదనలు = ముఖములు కలవారు; చక్కగన్ = బాగుగా; తనున్ = అతనిని; కొల్వ = సేవించగా; హాస = చిరునవ్వు లనెడి; చంద్రిక = వెన్నెల; తోడన్ = తోటి; మిక్కిలి = బాగా; మెఱసెను = ప్రకాశించెను; కృష్ణుడు = కృష్ణుడు; చుక్కల = నక్షత్రముల; గమిన్ = సమూహము; నడిమిన్ = మధ్యన; పూర్ణ = నిండు; సోముని = చంద్రుని; భంగిన్ = వలె.
భావము:- అనురాగంతో విప్పారిన మోములు కల ఆ గోపాంగనలు చుట్టుచేరి తన్ను కొలుస్తుండగా, నక్షత్ర సమూహాల నడుమ నిండు జాబిలి మెరిసే విధంగా, కృష్ణుడు చిరునవ్వు వెన్నెలలతో ఎంతో చక్కగా ప్రకాశించాడు.
తెభా-10.1-1006-ఆ.
సతులు దన్నుఁ బాడ సంప్రీతి నాడుచు
నఱుత నున్న వైజయంతితోడ
వనజలోచనుండు వనభూషణుం డయ్యె
యువతిజన శతంబు లోలిఁ గొలువ
టీక:- సతులు = స్త్రీలు; తన్ను = అతనిని; పాడన్ = కీర్తించుచుండగా; సంప్రీతిన్ = మిక్కిలి ఇష్టముతో; ఆడుచున్ = నాట్యములు చేయుచు; అఱుతన్ = మెడలో; ఉన్న = ఉన్నట్టి; వైజయంతి = వైజయంతి అనెడి మాల; తోడన్ = తోటి; వనజలోచనుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; వన = అడవికి; భూషణుండు = అలంకార మైనవాడు; అయ్యెన్ = అయ్యెను; యువతి = యౌవనస్త్రీల; శతంబు = నూర్గురు (అనేకులు); ఓలిన్ = వరుసగా; కొలువన్ = సేవింపగా.
భావము:- వందలాది తరుణులు తనను కొలుస్తుండగా; యువతులు తనను గురించి పాటలు పాడుతుండగా; సంతోషంతో ఆడుతూ; మెడలో వైజయంతి అనే వనమాలతో; పద్మాక్షుడు ఆ బృందావనానికి సరికొత్త అలంకారంగా భాసించాడు.
తెభా-10.1-1007-ఉ.
చిక్కక యీశుఁడై యెదిరిఁ జిక్కులఁ బెట్టెడు మాయలానికిం
జిక్కి కృతార్థలై మరుని చిక్కులఁ జొక్కి లతాంగు లుండగా
మక్కువ శాంతి చేయుటకు మన్ననఁ జేసి ప్రసన్నుఁ డౌటకుం
జక్కన నా విభుండు గుణశాలి తిరోహితుఁడయ్యె న య్యెడన్.
టీక:- చిక్కక = దొరకకుండ; ఈశుడు = వ్యాపకుడు; ఐ = అయ్యి; ఎదిరి = ఎదుటివారిని; చిక్కులన్ = ఇబ్బందులను; పెట్టెడు = పెట్టునట్టి; మాయలాని = మాయలు చేయువాని; కిని = కి; చిక్కి = లొంగిపోయి; కృతార్థలు = ధన్యులు; ఐ = అయ్యి; మరుని = మన్మథుని; చిక్కులన్ = తబ్బిబ్బు లందు; చొక్కి = పరవశలై; లతాంగులు = పడతులు {లతాంగి - లత వంటి దేహముకలామె, స్త్రీ}; ఉండగా = ఉండగా; మక్కువన్ = ప్రేమోద్రేకమును; శాంతి = ఉపశమింప; చేయుట = చేయుట; కున్ = కు; మన్నన = ఆదరించుట; చేసి = చేసి; ప్రసన్నుడు = అనుగ్రహించువాడు; ఔట = అగుట; కున్ = చేత; చక్కనన్ = చక్కగా; ఆ = ఆ; విభుండు = ప్రభువు; గుణశాలి = మంచి గుణముల వాడు; తిరోహితుడు = కానరానివాడు; అయ్యెన్ = అయ్యెను; అయ్యెడన్ = అప్పుడు.
భావము:- పరమేశ్వరుడై ఎవరికీ చిక్కక ఎదుటివారిని చిక్కుల్లో ముంచే మాయల వాడికి దక్కి ధన్యురాండ్రై ఆ గోపాంగనలు మదనకేళిలో సొక్కి సోలిపాయారు. ఆ సమయంలో వారి కామోత్కంఠకు శాంతి కలిగించే టందుకూ, అనంతరం ఆదరంతో అనుగ్రహించే టందుకూ, కల్యాణగుణ పరిపూర్ణుడైన ఆ పరమాత్ముడు అదృశ్యమైపోయాడు.
తెభా-10.1-1008-వ.
ఇట్లు హరి కనుమొఱంగి చనినఁ గరిం గానక తిరుగు కరేణువుల పెల్లున నుల్లంబులు దల్లడిల్ల వల్లవకాంతలు తదీయ గమన హాస విలాస వీక్షణ విహార వచన రచనానురాగంబులం జిత్తంబులు గోల్పడి, వివిధ చేష్టలకుం బాల్పడి, తదాత్మకత్వంబున నేన నేన కృష్ణుండ నని కృష్ణాగుణావేశంబులం జరియించుచు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; హరి = కృష్ణుడు; కనుమొఱంగి = అంతర్థానమై; చనినన్ = వెళ్ళిపోగా; కరిన్ = మగ ఏనుగును; కానక = కనుగొనలేక; తిరుగు = సంచరించెడి; కరేణువుల = ఆడ ఏనుగుల; పెల్లున = వలె; ఉల్లంబులు = మనసులు; తల్లడిల్ల = చలించిపోగా; వల్లవ = గోపికా; కాంతలు = స్త్రీలు; తదీయ = అతని; గమన = నడవడిచేత; హాస = చిరునవ్వులచేత; విలాస = ఒయ్యారముచేత; వీక్షణ = చూపులచేత; విహార = వేడుక సంచారములచేత; వచన = మాటలచేత; రచన = కూర్పులచేత; అనురాగంబులన్ = ప్రేమచేత; చిత్తంబులున్ = మనసులు; కోల్పడి = పరాయత్తములై; వివిధ = నానావిధములైన; చేష్టలు = వర్తనలకు; కున్ = కు; పాల్పడి = పూనుకొని; తత్ = అతడే; ఆత్మకత్వంబునన్ = తాననుకొనుటచేత; నేననేన = ఎవరికివారు నేనే; కృష్ణుండను = కృష్ణుడను; అని = అని; కృష్ణ = కృష్ణుని యొక్క; గుణ = గుణములను; ఆవేశంబులన్ = ఆపాదించుకొనుటలవలన; చరియించుచు = సంచరించుచు.
భావము:- ఆవిధంగా మాధవుడు మాయ మైపోగా ఆయనను కనుగొనలేక మగ ఏనుగును బాసి సంచరించే ఆడ ఏనుగుల వలె హృదయాలు సంచలింపగా గోపికలు నందనందనుడి గమనలీలలూ, హాసవిలాసాలూ, చూపులూ, విహారాలూ, ఆటలూ, మాటలు మొదలైన వాటిమీద అనురాగంతో తమ మనస్సులు మనస్సులలో లేక పలు చేష్టలకు పాల్పడ్డారు. తన్మయత్వంతో “నేనే కృష్ణుడిని”, “నేనే మాధవుడిని” అంటూ గోవిందుని గుణ చేష్టితాలు అనుకరిస్తూ మెలగసాగారు.