పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/అక్రూరుడు పొగడుట


తెభా-10.1-1503-వ.
మహాత్ములార! మీరు విశ్వాదిపురుషులరు, విశ్వకారణులరు, విశ్వమయులరగుట మీకుఁ గార్యకారణంబులు లే; వధరింపుము. పరమేశ్వరా! నీవు రజోగుణంబున నఖిలంబు సృజియించి కారణరూపంబునఁ దదనుప్రవిష్టుండవై కృతదృష్టకార్యరూప ప్రపంచాకారంబున దీపించుచుందువు; కార్యరూప చరాచర దేహంబులకుం గారణంబులైన భూప్రముఖంబు లనుగతంబులైనఁ గార్యరూప దేహంబులునై ప్రకాశించు చందంబున నొక్కండవుఁ గారణరహితుండవు నాత్మతంత్రుండవునై యుండియు విశ్వాకారంబునఁ బెక్కగుదువు సృష్టి స్థితి లయంబులఁ జేయుచుండియును విజ్ఞానమూర్తి వగుటం బరిభ్రాంతుండైన జీవుని భంగి గుణకర్మబద్ధుండవు కావు; కావున సిద్ధంబు తన్నిమిత్తంబున బంధహేతువు సిద్ధింపదు.
టీక:- మహాత్ములారా = ఓ మహాత్ములు; మీరు = మీరు; విశ్వ = జగత్తునకు; ఆది = మూల; పురుషులు = వ్యక్తరూపులు; విశ్వ = జగత్తు యొక్క; కారణులరు = కారణభూతులైనవారు {కారణభూతులు - సృష్టి స్థితి లయాదులకు కారణమైనవారు}; విశ్వ = జగత్తు; మయులు = స్వరూపముగా కలవారు; అగుటన్ = అగుటచేత; మీ = మీ; కున్ = కు; కార్య = పుట్టుట; కారణంబులు = పుట్టించునవి; లేవు = కలుగగవు; అవధరింపుము = నా మనవి వినుము; పరమేశ్వరా = భగవంతుడా {పరమేశ్వరుడు - సర్వోత్కృష్టమైన మఱియు సర్వుల (బ్రహ్మాది పిపీలక పర్యంతమును) నియమించు వాడు, విష్ణువు}; నీవు = నీవు; రజోగుణంబునన్ = రజస్సుతో; అఖిలంబున్ = జగత్తు సమస్తమును; సృజియించి = సృష్టించి; కారణ = కారణభూత {కారణభూతము - కార్యకారణన్యాయములో కారణము ఐ ఉండునది}; రూపంబునన్ = రూపముతో; తత్ = దాని యందు; అనుప్రవిష్టుండవు = ప్రవేశించినవాడవు; ఐ = అయ్యి; కృత = కల్పింపబడినది; దృష్ట = చూడబడునది; కార్య = జగత్తు అనెడి; రూప = రూపములు కలది; ప్రపంచ = ప్రపంచము యొక్క; ఆకారంబును = స్వరూపము నందు; దీపించుచుందువు = ప్రకాశిస్తుంటావు; కార్య = కార్యము యొక్క; రూప = రూపములోనున్న; చర = జంగమ; అచర = స్థావర; దేహంబుల్ = శరీరముల; కున్ = కు; కారణంబులు = హేతువులు, ఉత్పత్తి కారణములు; ఐన = అయిన; భూప్రముఖంబులు = పంచభూతములు; అనుగతంబులు = అనుసరించి ఏర్పడినవి; ఐన = అయిన; కార్య = కార్యము యొక్క; రూప = రూపమున ఉన్న; దేహంబులును = శరీరములు; ఐ = అయ్యి; ప్రకాశించు = వ్యక్తమగు; చందంబునన్ = విధముగా; ఒక్కండవున్ = ఒంటరివాడవు, అద్వితీయుడవు {ఒక్కండు - ఏకమేవాద్వితీయంబ్రహ్మ (శ్రుతి), సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనివాడు బ్రహ్మ, అద్వితీయుడు}; కారణ = నీ సృష్టాదులకు హేతువు; రహితుండవు = లేనివాడవు; ఆత్మతంత్రుండవును = స్వతంత్రుడవు; ఐ = అయ్యి; ఉండియున్ = ఉన్నప్పటికి; విశ్వాకారంబునన్ = జగద్రూపమున; పెక్కు = అనేక రూపముల వాడవు; అగుదువు = అయ్యెదవు; సృష్టి = బ్రహ్మరూపమున పుట్టించుట; స్థితి = విష్ణురూపమున పాలించుట; లయంబులన్ = రుద్రరూపమున నాశనముచేయుట; చేయుచున్ = చేస్తూ; ఉండియున్ = ఉన్నప్పటికి; విజ్ఞాన = పరబ్రహ్మ, జ్ఞానము; మూర్తివి = స్వరూపముగా కలవాడవు; అగుటన్ = అగుటచేత; పరిభ్రాంతుండు = సంసారములో భ్రమించు వాడు {పరిభ్రాంతుండు - జననమరణములలో తిరుగు తున్నవాడు, సంసారి}; ఐన = అయిన; జీవుని = జీవుని; భంగిన్ = వలె; గుణ = త్రిగుణములచే; కర్మ = జననమరణహేతువులచే; బద్ధుండవు = కట్టబడినవాడవు, జననాదులు కలవాడవు; కావు = కావు; కావున = కనుక; సిద్ధంబు = స్వతసిద్ధముగనే; తత్ = వాని; నిమిత్తంబునన్ = వలన; బంధ = జననమరణబంధ; హేతువు = కారణము; సిద్ధింపదు = కలుగదు.
భావము:- మహానుభావులారా! మీరు విశ్వమునకు మూల పురుషులు; విశ్వమునకు కారణభూతులు; విశ్వమయులు; కావున మీకు కార్యకారణములు లేవు. దేవా! చిత్తగించుము. నీవు రజోగుణముచే సమస్తము సృష్టించి; కారణరూపముతో దాని యందు ప్రవేశిస్తావు కార్యరూపమైన చరాచరశరీరాలకు కారణములైన పృధివ్యాపస్తేజో వాయవ్యాకాశములు {1. పృథివి, 2. జలము, 3. తేజస్సు, 4. వాయువు, 5. ఆకాశము.

తెభా-10.1-1504-సీ.
రఁగ జీవునికైన బంధమోక్షము లంట-
వంటునే పరతత్వమైన నిన్ను
నంటునే యీశ! దేహాద్యుపాధులు నని-
ర్వచనీయములుగాన రుస నీకు
న్మంబు జన్మసంశ్రయ భేదమును లేదు-
కావున బంధమోక్షములు లేవు;
ణుతింప ని న్నులూలబద్ధుఁ డనుటయు-
హిముక్తుఁ డనుటయు స్మదీయ

తెభా-10.1-1504.1-ఆ.
బాలబుద్ధిఁ గాదె? పాషండ ముఖర మా
ర్గములచేత నీ జద్ధితార్థ
మైన వేదమార్గ డఁగిపో వచ్చిన
వతరించి నిలుపు దంబుజాక్ష.

టీక:- పరగన్ = ప్రసిద్ధముగ; జీవుని = జీవుని; కైనన్ = కి అయినను; బంధ = సంసారబంధములు; మోక్షములు = ముక్తి {మోక్షము - సంసారబంధములనుండి విమోచనము, ముక్తి}; అంటవు = సోకవు; అంటునే = సోకునా, సోకవు; పరతత్వము = పరబ్రహ్మము, పరమాత్మ; ఐన = అయిన; నిన్ను = నిన్ను; అంటునే = సోకునా, సోకవు; ఈశ = భగవంతుడా; దేహాది = దేహము మున్నగు; ఉపాధులున్ = ఉపాధులు {ఉపాధులు - 1సమిష్ట వ్యష్టి స్థూల సూక్ష్మ కారణదేహములు 2జాగ్రత్త స్వప్న సుషుప్తి అనెడి మూడవస్థలు 3విశ్వ తైజస ప్రాజ్ఞ విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత నామములు మొదలైన వ్యాపారములు}; అనిర్వచనీయములు = మాయాకల్పితమగుటచేత ఉచ్చరింపదగనివి; కాన = కనుక; వరుసన్ = క్రమముగా; నీ = నీ; కున్ = కు; జన్మంబు = పుట్టుక; జన్మసంశ్రయ = కర్మమముల {జన్మసంశ్రయములు - జన్మపొందుటకు హేతువులైన ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మములు}; భేదమును = భేదము; లేదు = లేదు; కావున = కనుక; బంధ = కట్టుబడుట; మోక్షములు = కట్టువలనివిడుపు; లేవు = లేవు; గణుతింపన్ = ఎంచిచూడ; నిన్నున్ = నిన్ను; ఉలూఖల = రోటికి; బద్ధుడు = కట్టబడినవాడు; అనుటయున్ = అనుట; అహి = (కాళియ) సర్పముచేత; ముక్తుడు = విడువబడినవాడు; అనుటయున్ = అనుట; అస్మదీయ = మా యొక్క;
బాలబుద్ధి = మూఢబుద్ధి; కాదె = కాదా, అవును; పాషండ = వేదనిందచేయుట {పాషండాదులు - పాషండ కాపాలిక బౌద్ధ చార్వాక జైన శైవ శాక్త గాణాపత్యాది మతస్థుల మార్గములు}; ముఖర = మున్నగు; మార్గముల = మతముల; చేతన్ = చేత; ఈ = ఈ యొక్క; జగత్ = లోకములకు; హిత = మేలు; అర్థము = కోసము; ఐన = అయిన; వేద = వేదోక్త; మార్గమున్ = రీతి; అడగిపోన్ = అణగిపోయెడిదశ; వచ్చినన్ = వచ్చినచో; అవతరించి = పుట్టి; నిలుపుదు = నిలబెట్టెదవు ధర్మమును; అంబుజాక్ష = కృష్ణా {అంబుజాక్షుడు - పద్మాక్షుడు, విష్ణువు}.
భావము:- ఓ కలువకన్నుల కన్నయ్యా! పరమేశ్వరా! బంధమోక్షములు జీవాత్మకే అంటవు అనగా, జ్ఞానస్వరూపుడవు అయిన నీకు అంటుతాయా? దేహాదు లైన ఉపాధులు (కారణ దేహములు, అవస్థలు, వ్యాపారములు మున్నగునవి) మాయాకల్పితములు కనుక ఉచ్చరింపదగినవి కావు. కావున, జీవులకు వలె నీకు జన్మము గాని, జన్మలకు కారణమైన ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మ బేధము గాని లేదు. ఆ కారణం వలన నీకు బంధమోక్షములు లేవు. ఆలోచించి చూస్తే, నువ్వు రోటికి కట్టుబడ్డావు అనీ, యమునా హ్రదంలో కాళీయ సర్పం నుండి బయటపడ్డావు అనీ అనడం మా అవివేకం మాత్రమే కదా. లోకాలకు మేలు కలిగించేది వేదమార్గం అయి ఉండగా, నాస్తిక మార్గముల చేత ఆ ప్రాచీన వేదపథం అణగారిపోయే సమయం వస్తే, నీవు అవతరించి ధర్మమును కాపాడుతావు.

తెభా-10.1-1505-క.
నీవు ధరణిభారము
మానిచి రక్కసుల నెల్ల ర్దించుటకై
యాకదుందుభి యింటను
మాక జన్మించితివి సమంచితకీర్తిన్.

టీక:- ఆ = అట్టి; నీవు = నీవు; ధరణిభారమున్ = భూభారమును; మానిచి = పోగొట్టి; రక్కసులన్ = రాక్షసులను; ఎల్లన్ = అందరిని; మర్దించుట = చంపుట; కై = కోసము; ఆనకదుందుభి = వసుదేవుని {ఆనకదుందుభి - పుట్టినప్పుడు ఆనక (తప్పెట్లు) దుందుభి (భేరీలు) మోగిన వాడు, వసుదేవుడు}; ఇంటను = ఇంటిలో; మానక = తప్పక; జన్మించితివి = పుట్టితివి, అవతరించితివి; సమంచిత = మిక్కిలి చక్కటి; కీర్తిన్ = యశస్సుతో.
భావము:- నీవు భూభారం తొలగించి రాక్షసులను అందరిని మట్టుపెట్టడానికి వసుదేవుడి ఇంట కీర్తిశాలివై పుట్టావు.

తెభా-10.1-1506-మ.
త్రిగత్పావన పాదతోయములచే దీపించి వేదామర
ద్వి ముఖ్యాకృతివైన నీవు కరుణన్ విచ్చేయుటం జేసి మా
నిగేహంబులు ధన్యతం దనరెఁ బో; ని న్నార్యు లర్చింపఁగా
జితత్వంబులు వారి కిత్తు వనుకంపాయత్త చిత్తుండవై.

టీక:- త్రిజగత్ = లోకత్రయమును {లోకత్రయము - ముల్లోకములు, 1స్వర్గలోకము 3మర్త్యలోకము 3పాతాళలోకములు}; పావన = పవిత్రము చేయువాడ; పాద = పాదములు కడిగిన; తోయముల్ = నీళ్లు; చేన్ = చేత; దీపించి = ప్రకాశించి; వేద = వేదములు; అమర = దేవతలు {అమరులు - మరణము లేని వారు, దేవతలు}; ద్విజ = బ్రాహ్మణులు {ద్విజులు - జన్మ ఉపనయన యనెడి రెండు (2) జన్మలు కలవారు, విప్రులు}; ముఖ్య = ప్రధానమైన; ఆకృతివి = స్వరూపముగా గలవాడవు; ఐన = అయిన; నీవు = నీవు; కరుణన్ = దయతో; విచ్చేయుటన్ = వచ్చుట; చేసి = వలన; మా = మా యొక్క; నిజ = స్వంత; గేహంబులున్ = ఇండ్లు; ధన్యతన్ = కృతార్థత్వమున; తనరెబో = చక్కగా చెందినవి; నిన్నున్ = నిన్ను; ఆర్యులు = పెద్దవారు; అర్చింపగాన్ = పూజించగా; అజిత = ఇంద్రియములచే జయింపబడకుండెడి; తత్వంబులున్ = స్థితులను; వారి = వారల; కిన్ = కు; ఇత్తువు = ఇచ్చెదవు; అనుకంపాయత్త = కరుణ కలిగిన, దయామయ మైన; చిత్తుండవు = మనసు కలవాడవు; ఐ = అయ్యి.
భావము:- నీ పాదజలములు ముల్లోకాలను పవిత్రీకరిస్తాయి, నీవు దేవ, బ్రాహ్మణ, వేదాది స్వరూపుడవు. అటువంటి నీవు కృపతో విచ్చేయడం వలన మా గృహాలు పావనం అయ్యాయి. నిన్ను పెద్దలు పూజించగా దయాపూరిత మనస్కుడవై వారికి జయశీలతను అనుగ్రహిస్తావు.

తెభా-10.1-1507-శా.
పుణ్యాతిశయప్రభావముననో యీ జన్మమం దిక్కడన్
నీ పాదంబులు గంటి నిన్నెఱిఁగితిన్ నీవుం గృపాళుండవై
నాపై నర్మిలిఁజేసి మాన్పఁ గదవే నానా ధనాగార కాం
తా పుత్రాదులతోడి బంధనము భక్తవ్రాతచింతామణీ!"

టీక:- ఏ = ఏ; పుణ్య = పూర్వజన్మ పుణ్యముల; అతిశయ = గొప్పదనము యొక్క; ప్రభావముననో = మహిమవలననో; ఈ = ఈ యొక్క; జన్మము = జన్మ; అందున్ = లో; ఇక్కడన్ = ఇచ్చట; నీ = నీ యొక్క; పాదంబులున్ = పాదములను; కంటిన్ = చూడగలిగితిని; నిన్నున్ = నిన్ను; ఎఱిగితిని = తెలిసికొంటిని; నీవున్ = నీవు; కృపా = దయాగల; అళుండవు = శీలము కలవాడవు; ఐ = అయ్యి; నా = నా; పైన్ = మీద; అర్మిలిన్ = కృప; చేసి = చూపి; మాన్పగదవే = పోగొట్టుము; నానా = వివిధములైన; ధన = సంపదలు; ఆగార = ఇండ్లు; కాంతా = స్త్రీలు; పుత్రా = కుమారుల; ఆదుల = మున్నగువాని; తోడి = తోటి; బంధనమున్ = తగులమును; భక్తవ్రాతచింతామణీ = శ్రీకృష్ణా {భక్త వ్రాత చింతామణి - అనన్య భక్తుల సమూహమునకు చింతామణి (తలచిన కోరికలు తీర్చెడి మణి) వంటివాడు, విష్ణువు}.
భావము:- భక్తుల పాలిటి చింతామణివైన శ్రీకృష్ణా! ఏ మహా పుణ్య మహిమ వలననో ఈ జన్మలో ఇక్కడ నీ పాదపద్మాలు దర్శించగలిగాను; నిన్ను తెలుసుకోగలిగాను. నీవు దయాస్వభావుడవై నా పై ఆపేక్ష చూపి; విత్త, గృహ, దార, సుతాదుల మీద నాకు మోహ పాశమును తొలగించు”

తెభా-10.1-1508-వ.
అని పలికిన నగుచు నక్రూరునికి మాటలవలన సంసారబంధం బగు మోహంబును గీలుకొలుఁపుచు హరి యిట్లనియె.
టీక:- అని = అని; పలికినన్ = స్తుతించగా; నగుచున్ = నవ్వుతు; అక్రూరుని = అక్రూరుడిని; కిన్ = కి; మాటల = పలుకుల; వలన = వలన; సంసార = సంసారముతోటి; బంధంబు = తగులములు; అగు = ఐన; మోహంబును = అజ్ఞానమును; కీలుకొలుపుచున్ = కూర్చుచు; హరి = శ్రీకృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని అక్రూరుడు మోహ విచ్ఛేదము చేయమని అడుగగా, నవ్వుతూ తన మాటలతో సంసార సంబంధం అయిన వ్యామోహమును నెలకొల్పుతూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

తెభా-10.1-1509-క.
"బంధుండవు సద్ద్యోహిత
సంధుండవు వావిఁ జూడ నకుఁడవు కృపా
సింధుండ వెల్ల గుణముల
నంధుండవుగావు ప్రోవ ర్హుండ వెందున్.

టీక:- బంధుండవు = చుట్టమైనవాడవు; సద్యత్ = వెంటనే, తత్క్షణమే; హిత = మేలు; సంధుండవు = కూర్చెడి వాడవు; వావిన్ = బంధుత్వ వరుసకి; చూడన్ = చూచినచో; జనకుడవు = తండ్రివి; కృపా = దయకు; సింధుడవు = సముద్రమువంటి వాడవు; ఎల్ల = సర్వ; గుణములన్ = సుగుణము లందును; అంధుండవు = గుడ్డివాడవు; కావు = కావు; ప్రోవన్ = కాపాడుటకు; అర్హుండవు = తగినవాడవు; ఎందున్ = ఎక్కడైన సరే.
భావము:- “నీవు మా బంధుడవు; మాకు తక్షణమే మేళ్ళు కలిగిస్తావు; వరుసకు పినతండ్రివి; దయా సముద్రుడవు; సుగుణ దర్శనుడవు; మమ్మల్ని కాపాడటానికి సమర్ధుడవు.

తెభా-10.1-1510-చ.
కొలుతురు మర్త్యు లిష్టములు గోరి శిలామయ దేవసంఘమున్
మయ తీర్థసంఘమును సంతతము న్నటు వారు గొల్వఁగా
దన రాదుగాక భగత్పద భక్తులరైన మీ క్రియన్
సొయక దేవతీర్థములు చూచిన యంతనె కోర్కు లిచ్చునే.

టీక:- కొలుతురు = సేవించెదరు; మర్త్యులు = లోకములోని మానవులు; ఇష్టములున్ = కోరికలు తీరవలెనని; కోరి = తలచెడివారై; శిలామయ = శిలాప్రతిమరూప; దేవ = దేవతల; సంఘమున్ = సమూహములను; జలమయ = నీటిరూపమున ఉండు; తీర్థ = పుణ్యతీర్థ; సంఘమును = సమూహములను; సంతతమున్ = ఎల్లప్పుడు; అటు = ఆ విధముగా; వారు = వారు; కొల్వగా = సేవించుచుండగా; వలదు = వద్దు; అనరాదు = అని చెప్పరాదు; కాక = కాని; భగవత్ = భగవంతుని; పద = పాదముల యందలి; భక్తులరు = భక్తి గలవారు; ఐన = అయిన; మీ = మీ; క్రియన్ = వలె; సొలయక = వెనుదీయక; దేవ = దేవాలయములు; తీర్థములున్ = పుణ్యతీర్థములను; చూచినన్ = దర్శించిన; అంతనె = అంతమాత్రముచేతనే; కోర్కులు = కోరికలు తీరుటను; ఇచ్చునే = ఇచ్చునా, ఇవ్వలేవు.
భావము:- మానవులు కోరికలు సాధించుకోవాలని కోరి రాతితో చేసిన దేవతాప్రతిమలనూ; పవిత్ర జలాలు కల గంగాది పుణ్యతీర్ధములనూ నిరంతరం సేవిస్తుంటారు. వారలా సేవిస్తుంటే వద్దని చెప్పడం పాడి గాదు. కాని, నిజానికి భగవత్పాద భక్తులైన మీవంటి వారు దర్శన మాత్రము చేతనే తక్షణము అభీప్సితార్థములు అనుగ్రహించగలరు. దేవతా విగ్రహారాధనము, పుణ్యతీర్ధ సేవనము అలా చేయగలవా?