పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ప్రసేనుడు వధింపబడుట

ప్రసేనుడు వధింపబడుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ప్రసేనుడు వధింపబడుట)
రచయిత: పోతన



తెభా-10.2-48-వ.
అనిన విని శుకయోగివర్యుం డిట్లనియె. "సత్రాజిత్తనువాఁడు సూర్యునకు భక్తుండై చెలిమి సేయ, నతనివలన సంతసించి సూర్యుండు శమంతకమణి నిచ్చె; నా మణి కంఠంబున ధరియించి సత్రాజిత్తు భాస్కరుని భంగి భాసమానుం డై ద్వారకానగరంబునకు వచ్చిన; దూరంబున నతనిం జూచి జనులు మణిప్రభాపటల తేజోహృతదృష్టులయి సూర్యుం డని శంకించి వచ్చి; హరి కిట్లనిరి.
టీక:- అనినన్ = అని అడుగగా; విని = విని; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; వర్యుండు = స్తుతింప దగినవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; సత్రాజిత్తు = సత్రాజిత్తు; అను = అనెడి; వాడు = అతను; సూర్యున్ = సూర్యుడి; కున్ = కి; భక్తుండు = భక్తుడు; ఐ = అయ్యి; చెలిమి = స్నేహము; చేయన్ = చేయగా; అతని = అతని; వలన = ఎడల; సంతసించి = తృప్తిచెంది; సూర్యుండు = సూర్యుడు; శమంతక = శమంతకము అను; మణిన్ = రత్నమును; ఇచ్చెన్ = ఇచ్చెను; ఆ = ఆ యొక్క; మణిన్ = రత్నమును; కంఠమునన్ = మెడలో; ధరియించి = వేసుకొని; సత్రాజిత్తు = సత్రాజిత్తు; భాస్కరుని = సూర్యుని; భంగిన్ = వలె; భాసమానుండు = ప్రకాశించువాడు; ఐ = అయ్యి; ద్వారకానగరంబున్ = ద్వారకానగరమున; కున్ = కు; వచ్చినన్ = రాగా; దూరంబునన్ = దూరమునుండి; అతనిన్ = అతనిని; చూచి = చూసి; జనులు = ప్రజలు; మణి = రత్నము యొక్క; ప్రభా = కాంతి; పటల = సమూహముల; తేజః = తేజస్సుచేత; హృత = హరింపబడిన; దృష్టులు = చూపులు కలవారు; అయి = ఐ; సూర్యుండు = సూర్యుడు; అని = అని; శంకించి = సందేహించి; వచ్చి = వచ్చి; హరి = కృష్ణుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- రాజు పరీక్షిత్తు ఇలా అడుగగా శుకయోగి ఈలా చెప్పసాగాడు. ”సత్రాజిత్తు సూర్యుడిని భక్తితో ఆరాధించాడు. సూర్యుడు అతడి భక్తికి మెచ్చి సంతోషించి అతడికి శమంతకమణిని ఇచ్చాడు. ఆ మణిని కంఠంలో ధరించి సత్రాజిత్తు సూర్యునిలా వెలిగిపోతూ ద్వారకకి వచ్చాడు. ద్వారకానివాసులు ఆ మణి కాంతులకు కన్నులుమిరుమిట్లు గొలుపగా సూర్యుడని భ్రాంతిపడి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి ఇలా విన్నవించారు.

తెభా-10.2-49-క.
"నారాయణ! దామోదర!
నీజదళనేత్ర? చక్రి! నిఖిలేశ! గదా
ధాణ! గోవింద! నమ
స్కాము యదుపుత్త్ర! నిత్యల్యాణనిధీ!

టీక:- నారాయణ = కృష్ణుడు {నారాయణుడు - మహాజలము స్థానముగా నుండునట్టి వటపత్రశాయి, నారం విజ్ఞానం తదయసమాశ్రయో యస్యసః నారాయణః (వ్యుత్పత్తి), నారము అనగా విజ్ఞానము దానికి సమాశ్రయుడు నారయణుడు, విష్ణువు}; దామోదర = కృష్ణుడు {దామోదరుడు - వనమాల ఉదరమున కలవాడు, శ్లో. దామాని లోకానామాని తానియస్యోదరాంతరే, తేన దామోదరో దేవశ్శ్రీధరస్త్వం సమాశ్రితః. వ్యాస వచనము, దామములు అనగా లోకములు పదునాలుగు ఉదరమున కలవాడు, విష్ణువు}; నీరజదళనేత్ర = కృష్ణుడు {నీరజదళనేత్రుడు - తామర రేకుల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; చక్రి = కృష్ణుడు {చక్రి - సుదర్శనము అను చక్రాయుధము ధరించినవాడు, కృష్ణుడు}; నిఖిలేశ = కృష్ణుడు {నిఖిలేశుడు - సర్వ లోకములకు ఈశుడు, విష్ణువు}; గదాధారణ = కృష్ణుడు {గదాధారణ - కౌమోదకి అను గదను ధరించువాడు, విష్ణువు}; గోవింద = కృష్ణుడు {గోవిందుడు - వేదములచేత తెలియబడు వాడు, విష్ణువు}; నమస్కారము = నమస్కారము; యదుపుత్ర = కృష్ణుడు {యదుపుత్రుడు - యదువంశమున పుట్టినవాడు, కృష్ణుడు}; నిత్యకల్యాణనిధీ = కృష్ణుడు {నిత్యకల్యాణనిధి - శాశ్వతమైన మేలులకు నిధివంటివాడు, విష్ణువు}.
భావము:- “నారాయణా! దామోదరా! పుండరీకాక్షా! చక్రాయుధా! సర్వేశ్వరా! గదాధారీ! గోవిందా! యదునందనా! నిత్యకల్యాణనిధి! నీకు నమస్కారం.

తెభా-10.2-50-మ.
దివిజాధీశ్వరు లిచ్చగింతురు గదా దేవేశ! నిన్ జూడ యా
వంశంబున గూఢమూర్తివి జగత్త్రాణుండవై యుండఁగా
దీయాకృతిఁ జూడ నేఁడిదె రుచిప్రచ్ఛన్న దిగ్భాగుఁడై
వియో, నీరజగర్భుఁడో యొకఁడు సేరన్ వచ్చె మార్గంబునన్. "

టీక:- దివిజా = దేవతా; అధీశ్వరులు = శ్రేష్ఠులు, ప్రభువులు; ఇచ్చగింతురు = కోరుకొనెదరు; కదా = కదా; దేవేశ = కృష్ణా {దేవేశుడు - దేవతలకు ఈశుడు, విష్ణువు}; నిన్ = నిన్ను; చూడన్ = దర్శించుటకు; యాదవ = యదువు యొక్క; వంశంబునన్ = వంశము నందు; గూఢ = రహస్యమైన; మూర్తివి = స్వరూపము కలవాడవు; జగత్ = లోకములకు; త్రాణుండవు = కాచువాడవు; ఐ = అయ్యి; ఉండగా = ఉండగా; భవదీయ = నీ యొక్క; ఆకృతిన్ = స్వరూపమును; చూడన్ = చూచుటకు; నేడు = ఇవాళ; ఇదె = ఇదిగో; రుచి = ప్రకాశముచేత; ప్రచ్ఛన్న = ఆవరింపబడిన; దిక్ = దిక్కుల; భాగుడు = ప్రదేశములు కలవాడు; ఐ = అయ్యి; రవియో = సూర్యుడో; నీరజగర్భుడో = బ్రహ్మదేవుడు {నీరజగర్భుడు - నీరజ (పద్మమున) గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; ఒకడు = ఒకానొకడు; చేరన్ = చేరువకు; వచ్చెన్ = వచ్చెను; మార్గంబునన్ = దారమ్మట.
భావము:- ఓ దేవాధిదేవా! నీ దర్శనాన్ని దేవతలు సైతం కోరుకుంటారు. యాదవవంశంలో అవతరించి జగద్రక్షుకుడవై ఉన్న నిన్ను సకల దిక్కులలోనూ కాంతులు వెదజల్లుతూ సూర్యుడో, బ్రహ్మదేవుడో, ఎవడో నిన్ను దర్శించడానికి వస్తున్నాడు."

తెభా-10.2-51-వ.
అని యిట్లు పలికిన మూఢజనులఁ జూచి గోవిందుండు నగి మణి సమేతుండైన సత్రాజితుండుగాని సూర్యుండు గాఁడని పలికె; నంత సత్రాజితుండు శ్రీయుతంబయి మంగళాచారంబైన తన గృహంబునకుం జని, మహీసురులచేత నిజదేవతా మందిరంబున నమ్మణి శ్రేష్ఠంబు ప్రవేశంబు సేయించె; నదియును బ్రతిదినంబు నెనిమిది బారువుల సువర్ణంబు గలిగించు చుండు.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలికినన్ = అనగా; మూఢ = తెలియని; జనులన్ = వారిని; చూచి = చూసి; గోవిందుండు = కృష్ణుడు; నగి = నవ్వి; మణి = రత్నము; సమేతుండు = కలిగినవాడు; ఐన = అయిన; సత్రాజితుండు = సత్రాజిత్తు; కాని = తప్పించి; సూర్యుండు = సూర్యుడు; కాడు = కాడు; అని = అని; పలికెన్ = చెప్పెను; అంతన్ = అప్పుడు; సత్రాజితుండు = సత్రాజిత్తు; శ్రీయుతంబు = కలిమితో కూడినది; అయి = అయ్యి; మంగళా = శుభ; ఆచారంబు = కార్యాచరణములు కలది; ఐన = అయిన; తన = తన యొక్క; గృహంబున్ = ఇంటి; కున్ = కి; చని = వెళ్ళి; మహీసురుల = బ్రాహ్మణుల {మహీసురులు - భూమికి దేవతలు, విప్రులు}; చేత = చేత; నిజ = తన యొక్క; దేవతా = దేవుడి; మందిరంబునన్ = స్థానము నందు; ఆ = ఆ యొక్క; మణిన్ = రత్నములలో; శ్రేష్ఠంబున్ = ఉత్తమమైన దానిని; ప్రవేశంబు = లోనుంచుట; చేయించి = చేయించెను; అదియున్ = అది; ప్రతి = ప్రతి యొక్క; దినంబున్ = రోజుల; ఎనిమిది = ఎనిమిది (8); బారువుల = బారువుల {బారువ - ఇరవై (20) మణుగుల బరువు, మణుగు - ఎనిమిది వీశల బరువు}; సువర్ణంబు = బంగారమును; కలిగించుచుండున్ = ఇచ్చుచుండును.
భావము:- అని తనకు చెప్తున్న అమాయకుల మాటలకు నవ్వి శ్రీకృష్ణుడు “అతడు సత్రాజిత్తు మణిని ధరించి వస్తున్నాడు. అంతే తప్ప, సూర్యుడు కాదు” అని చెప్పాడు. అనంతరం సత్రాజిత్తు మంగళ ఆచారాలతో శ్రీమంతమైన తన ఇంటికి వెళ్ళి, దేవతామందిరంలో శమంతకమణిని బ్రాహ్మణుల చేత ప్రవేశపెట్టించాడు. ఆ మణి రోజుకి ఎనిమిది బారువుల చొప్పున ప్రతి రోజు బంగారాన్ని ఇస్తూ ఉంటుంది.

తెభా-10.2-52-క.
రా జేలెడు వసుమతి
నా త్నము పూజ్యమానగు నక్కడ రో
గారిష్ట సర్వ మాయిక
మారీ దుర్భిక్ష భయము మాను; నరేంద్రా!

టీక:- ఏ = ఏ; రాజు = రాజు; ఏలెడు = పరిపాలించెడి; వసుమతిన్ = రాజ్యము నందు; ఆ = ఆ యొక్క; రత్నము = శమంతకమణి; పూజ్యమానంబు = పూజింపబడుచుండునో; అక్కడ = అక్కడ; రోగ = వ్యాధులు; అరిష్ట = పీడలు; సర్వ = సమస్తమైన; మాయిక = వంచకుల; మారీ = క్షుద్రశక్తుల; దుర్భిక్ష = కరువు; భయము = భయము; మానున్ = తొలగిపోవును; నరేంద్రా = రాజా.
భావము:- ఓ పరీక్షన్మహారాజా! ఏ ప్రభువు పరిపాలించే దేశంలో ఆ శమంతక రత్నం పూజింపబడుతూ ఉంటుందో ఆ రాజ్యంలో, రోగాలు, అరిష్టాలూ, కరువుకాటకాలూ ఉండవు.

తెభా-10.2-53-క.
మ్మణి యాదవ విభునకు
నిమ్మని హరి యడుగ నాతఁ డీక ధనేచ్ఛం
బొమ్మని పలికెను, జక్రికి
నిమ్మణి యీకున్న మీఁద నేమౌ ననుచున్.

టీక:- ఆ = ఆ యొక్క; మణి = శమంతకమణిని; యాదవవిభున్ = ఉగ్రసేనున; కున్ = కు; ఇమ్ము = ఇమ్ము; అని = అని; హరి = కృష్ణుడు; అడుగన్ = అడగగా; ఆతడు = అతను; ఈక = ఇవ్వకుండ; ధన = ధనముమీది; ఇచ్ఛన్ = ఆపేక్షచేత; పొమ్ము = పొమ్ము; అని = అని; పలికెను = పలికెను; చక్రి = కృష్ణుని; కిన్ = కి; ఈ = ఈ యొక్క; మణిన్ = రత్నమును; ఈక = ఇయ్యక; ఉన్నన్ = పోయినచో; మీదన్ = తరువాత; ఏమి = ఏమి; ఔను = అవుతుంది; అనుచున్ = అంటు.
భావము:- శమంతకమణిని యాదవుల ప్రభువైన ఉగ్రసేన మహారాజునకు ఇమ్మని శ్రీకృష్ణుడు సత్రాజిత్తును అడిగాడు. ధనం మీది లాలసతో సత్రాజిత్తు శ్రీకృష్ణునకు ఈ మణిని ఇవ్వకపోయినా ఏం కాదులే అని నిరాకరించాడు.

తెభా-10.2-54-వ.
అంత.
టీక:- అంతన్ = పిమ్మట.
భావము:- అలా మహారాజుకి ఇవ్వకుండా సత్రాజిత్తు శమంతక మణిని తన ఇంటికి తీసుకుపోయిన అనంతరం....

తెభా-10.2-55-చ.
రెడు వేడ్కఁ గంఠమున మ్మణిఁ దాల్చి, ప్రసేనుఁ డొక్క నాఁ
వికి ఘోరవన్యమృగయారతి నేగిన, వానిఁ జంపి పైఁ
డి మణిఁ గొంచు నొక్క హరి పాఱఁగ, దాని వధించి డాసి యే
ర్పడఁ గనె జాంబవంతుఁడు ప్రభాత్తదిగంతము నా శమంతమున్.

టీక:- అడరెడు = అతిశయించెడి; వేడ్కన్ = కుతూహలముతో; ఆ = ఆ యొక్క; మణిన్ = రత్నమును; తాల్చి = ధరించి; ప్రసేనుడు = ప్రసేనుడు {ప్రసేనుడు -సత్రాజిత్తు తమ్ముడు}; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; అడవి = అరణ్యమున; కిన్ = కు; ఘోర = భయంకరమైన; వన్య = అడవి; మృగయా = జంతువుల వేట యందు; రతిన్ = ఆసక్తిచేత; ఏగినన్ = వెళ్ళగా; వానిన్ = అతనిని; చంపి = సంహరించి; పైన్ = మీద; పడి = పడి; మణిన్ = రత్నమును; కొంచున్ = తీసుకొని; ఒక్క = ఒకానొక; హరి = సింహము; పాఱగన్ = పారిపోగా; దానిన్ = దానిని; వధించి = చంపి; డాసి = సమీపించి; ఏర్పడగన్ = ప్రకాశముగా; జాంబవంతుడు = జాంబవంతుడు; ప్రభా = కాంతులచేత; ఆత్త = పొందబడిన; దిక్ = దిక్కుల; అంతమున్ = కొనలవరకు కలదానిని; ఆ = ఆ ప్రసిద్ధమైన; శమంతకమున్ = శమంతకమణిని.
భావము:- ప్రసేనుడు సత్రాజిత్తు తమ్ముడు. అతను ఎంతో కుతూహలంతో శమంతకమణిని కంఠమున ధరించి క్రూరమృగాలను వేటాడే నిమిత్తం అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో ఒక సింహం ప్రసేనుడిని చంపి, ఆ మణిని నోట కరచుకుని వెళ్తుండగా జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి సకల దిక్కులను వెలుగులు నింపుతున్న ఆ మణిని చూసాడు

తెభా-10.2-56-క.
ని జాంబవంతుఁ డా మణిఁ
గొనిపోయి సమీప శైలగుహఁ జొచ్చి ముదం
బునఁ దన కూరిమిసుతునకు
కేళీకందుకంబుగాఁ జేసె, నృపా!

టీక:- కని = చూసి; జాంబవంతుడు = జాంబవంతుడు; ఆ = ఆ యొక్క; మణిన్ = రత్నమును; కొనిపోయి = తీసుకుపోయి; సమీప = దగ్గరలోని; శైల = కొండ; గుహన్ = గుహను; చొచ్చి = ప్రవేశించి; ముదంబునన్ = ప్రీతితో; తన = తన యొక్క; కూరిమి = ఇష్ట; సుతున్ = కుమారుని; కున్ = కి; ఘన = గొప్ప; కేళీ = ఆడుకొనెడు; కందుకంబు = బంతి; కాన్ = అగునట్లు; చేసి = చేసెను; నృపా = రాజా.
భావము:- జాంబవంతుడు ఆ మణి మెఱుగులు చూసి తీసుకుని దగ్గరలో నున్న కొండగుహ లోనికి వెళ్ళి అక్కడ ఉన్న తన ప్రియకుమారునికి ఆటబంతిగా ఆనందంగా ఆ మణిని అమర్చాడు.