పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/దంతవక్త్రుని వధించుట

దంతవక్త్రుని వధించుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/దంతవక్త్రుని వధించుట)
రచయిత: పోతన


తెభా-10.2-914-వ.
ఇట్లు మాయావి యైన సాల్వుండును సౌభకంబును గృష్ణుచేతం బొలియుటఁ గనుంగొని నిజసఖులగు సాల్వ పౌండ్రక శిశుపాలురకుఁ బారలౌకికక్రియలు మైత్రిం గావించి దంతవక్త్రుం డతి భీషణాకారంబుతో నప్పుడు.
టీక:- ఇట్లు = ఈ విధముగా; మాయావి = మాయలమారి; ఐన = అయినట్టి; సాల్వుండును = సాల్వుడు; సౌభకంబునున్ = సౌభకవిమానము; కృష్ణు = కృష్ణుని; చేతన్ = చేతిలో; పొలియుట = నశించుట; కనుంగొని = చూసి; నిజ = తన; సఖులు = మిత్రులు; అగు = ఐన; సాల్వ = సాల్వుడు; పౌండ్రక = పౌండ్రకవాసుదేవుడు; శిశుపాలుర = శిశుపాలుల; కున్ = కు; పారలౌకికక్రియలు = ఉత్తరక్రియలు; మైత్రిన్ = చెలిమితో; కావించి = చేసి; దంతవక్త్రుండు = దంతవక్త్రుడు; అతి = మిక్కిలి; భీషణ = భయంకరమైన; ఆకారంబు = రూపము; తోన్ = తోటి; అప్పుడు = అప్పుడు;
భావము:- ఆ విధంగా శ్రీకృష్ణుడు సాల్వుడిని సౌభకవిమానాన్నీ ధ్వంసం చేయటం చూసిన దంతవక్త్రుడు తన మిత్రులైన సాళ్వ, పౌండ్రక, వాసుదేవ, శిశుపాలురకు ఉత్తరక్రియలు పూర్తి చేసి; మిక్కిలి భయంకరాకారంతో కృష్ణుడి మీదకు వచ్చాడు.

తెభా-10.2-915-చ.
పె పెటఁ బండ్లు గీఁటుచును బెట్టుగ మ్రోయుచుఁ గన్నుగ్రేవలం
జిచిట విస్ఫులింగములు సింద మహోద్ధతపాదఘట్టన
న్ననిటనై ధరిత్రి వడఁకాడ వడిన్ గద కేలఁ ద్రిప్పుచున్
మిమిట మండు వేసవిని మించు దివాకరుఁ బోలి యుగ్రతన్.

టీక:- పెటపెటన్ = పెటపెట అని శబ్దముతో; పండ్లున్ = దంతములను; గీటుచునున్ = కొరుకుతు; బెట్టుగన్ = అధికముగా; మ్రోయుచున్ = శబ్దము చేయుచు; కన్నుగ్రేవలన్ = కన్నుకొలకులనుండి; చిటచిట = చిటచిటమని; విస్ఫులింగములు = అగ్నికణములు; చిందన్ = రాలగా; మహా = మిక్కిలి; ఉద్ధత = మదముతో; పాద = పాదముల; ఘట్టన = తాకిడులతో; అటనిటన్ = అటునిటు మొగ్గినది; ఐ = అయ్యి; ధరిత్రి = భూమి; వడకాడన్ = వణికిపోగా; వడిన్ = వేగముగా; గదన్ = గదను; కేలన్ = చేతితో; త్రిప్పుచున్ = తిప్పుతు; మిటమిటన్ = మిటమిటమని; మండు = మండుతున్నట్టి; వేసవిని = వేసవికాలమును; మించు = మీరినట్టి; దివాకరున్ = సూర్యుని; పోలి = వలె; ఉగ్రతన్ = భయంకరత్వముతో.
భావము:- పండ్లు పట పట కొరుకుతూ, కళ్ళనుండి నిప్పుకణాలు రాలుస్తూ, పాదఘట్టనలతో భూమివణికేలా అడుగులు వేస్తూ, గద గిరగిర త్రిప్పుతూ, ఎండాకాలపు సూర్యుడిలాగా మండిపడుతూ దంతవక్త్రుడు కృష్ణుడిని వచ్చి తాకాడు.

తెభా-10.2-916-చ.
డిఁ జనుదేరఁ జూచి యదుల్లభుఁ డుల్లము పల్లవింప న
ప్పుడు గదఁ గేలఁబూని రథమున్ రయమొప్పఁగ డిగ్గి యుగ్రతం
డఁగి విరోధికిన్నెదురుగాఁ జన వాఁ డతినీచవర్తియై
రుచు నట్టహాసముఖుడై వలచే గదఁ ద్రిప్పుచున్ హరిన్.

టీక:- వడిన్ = వేగముగా; చనుదేరన్ = రాగా; చూచి = చూసి; యదువల్లభుడు = కృష్ణుని; ఉల్లమున్ = మనసు; పల్లవింపన్ = వికాసమును పొందగా; అప్పుడు = అప్పుడు; గదన్ = గదను; కేలన్ = చేతితో; పూని = ధరించి; రథమున్ = రథమును; రయము = వేగము; ఒప్పన్ = కనబడునట్లు; డిగ్గి = దిగి; ఉగ్రతన్ = భయంకరత్వముతో; కడగి = పూని; విరోధి = శత్రువున; కిన్ = కు; ఎదురుగాన్ = ఎదురుగా; చనన్ = వెళ్ళగా; వాడు = అతడు; అతి = మిక్కిలి; నీచ = అధమమైన; వర్తి = వర్తించువాడు; ఐ = అయ్యి; అడరుచున్ = అదిరిపడుతు; అట్టహాస = బిగ్గరగా నవ్వుతున్న; ముఖుడు = ముఖము కలవాడు; ఐ = అయ్యి; వల = కుడి; చేన్ = చేతితో; గదన్ = గదను; త్రిప్పుచున్ = తిప్పుతు; హరిన్ = కృష్ణుని.
భావము:- ఆ విధంగా తన మీదకి వస్తున్న దంతవక్త్రుడిని చూసిన శ్రీకృష్ణుడు వికసించిన హృదయంతో గద చేత పట్టి రథం దిగాడు. పూని ఉగ్రంగా విరోధికి ఎదురు నడిచాడు. దంతవక్త్రుడు అట్టహాసంగా గద త్రిప్పుతూ నీచంగా మురారిని.....

తెభా-10.2-917-వ.
కనుంగొని పరిహాసోక్తులుగా నిట్లనియె, “నీవు మదీయభాగ్యంబునం జేసి నేఁడు నా దృష్టిపథంబునకు గోచరుండవైతివి; మిత్రద్రోహివైన నిన్ను మాతులేయుండ వని మన్నింపక దేహంబు నందు వర్తించు నుగ్రవ్యాధి నౌషధాదిక్రియల నివర్తింపఁజేయు చికిత్సకుని చందంబున బంధురూపశాత్రవుండవు గావున నిన్ను దంభోళి సంరంభ గంభీరంబైన మదీయ గదాదండహతిం బరేత నివాసంబున కనిచి మున్ను నీచేత నిహతులైన నాదు సఖుల ఋణంబుఁ దీర్తు” నని దుర్భాషలాడుచు డగ్గఱి.
టీక:- కనుంగొని = చూసి; పరిహాస = ఎగతాళి; ఉక్తులగాన్ = మాటలుగా; ఇట్లు = ఇలా; అనియె = పలికెను; నీవు = నీవు; మదీయ = నా యొక్క; భాగ్యంబునన్ = అదృష్టము; చేసి = వలన; నేడు = ఇవాళ; నా = నా యొక్క; దృష్టిపథంబున్ = కంటి ఎదురున; కున్ = కు; గోచరుండవు = కనబడినవాడవు; ఐతివి = అయ్యావు; మిత్ర = మిత్రునికి; ద్రోహివి = ద్రోహము చేసినవాడవు; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; మాతులేయుండవు = మేనమామకొడుకువు; అని = అని; మన్నింపకన్ = గౌరవించకుండ; దేహంబునన్ = శరీరము; అందున్ = అందు; వర్తించు = ఉన్నట్టి; ఉగ్ర = క్రూరమైన; వ్యాధిన్ = వ్యాధిని; ఔషధ = మందులువేయుట; ఆది = మున్నగు; క్రియలన్ = పనులతో; నివర్తింపన్ = తొలగునట్లు; చేయు = చేసెడి; చికిత్సకుని = వైద్యుని; చందంబునన్ = వలె; బంధు = బంధువు అను; రూప = స్వరూపముతో; శాత్రవుండవు = శత్రువవు; కావునన్ = కాబట్టి; నిన్నున్ = నిన్ను; దంభోళి = వజ్రాయుధము యొక్క; సంరంభ = ఆటోపమువంటి; గంభీరంబు = గంభీరమైనది; ఐన = అగు; మదీయ = నా యొక్క; గదాదండ = గదాయుధము యొక్క; ఆహతిన్ = దెబ్బతో; పరేత = చచ్చినవారుండు; నివాసంబున్ = చోటున; కున్ = కు; అనిచి = పంపించి; మున్ను = మునుపు; నీ = నీ; చేతన్ = చేత; నిహతులు = చచ్చిపోయినవారు; ఐన = అయిన; నాదు = నా యొక్క; సఖుల = మిత్రుల; ఋణంబున్ = ఋణమును; తీర్తును = తీర్చెదను; అని = అని; దుర్భాషలు = నీచపుమాటలు; ఆడుచున్ = పలుకుతు; డగ్గఱి = దగ్గరకుచేరి.
భావము:- ఎగతాళి చేస్తూ ఇలా అన్నాడు. “ఓ కృష్ణా! ఈనాడు నీవు నా భాగ్యవశం వలన నాకు ఎదురుగా కనపడ్డావు. నువ్వు బంధువు రూపంలో ఉన్న విరోధివి. శరీరంలో ప్రవేశించిన భయంకరవ్యాధిని మందులతో పోగొట్టే వైద్యుడిలా, మేనమామ కొడుకువు అనే అభిమానం లేకుండా వజ్రాయుధం లాంటి నా గదాయుధంతో మిత్రద్రోహివైన నిన్ను యమలోకానికి పంపిచేస్తాను. నిన్ను చంపి నీవు చంపిన నా మిత్రుల ఋణాన్ని తీర్చుకుంటాను.” అంటూ దంతవక్త్రుడు శ్రీకృష్ణుణ్ణి దుర్భాషలాడుతూ దగ్గరకు వచ్చి..

తెభా-10.2-918-చ.
పెనుగదఁ బూన్చి కృష్ణుతల బెట్టుగ మొత్తిన నంకుశాహతిం
లెడి గంధసింధురముకైవడి సింధురభంజనుండు పెం
పు పవిభాసమానగదఁ బూని మహోగ్రతఁ ద్రిప్పి దంతవ
క్త్రుని యురముంబగిల్చినఁగుదుల్కొనుచున్రుధిరంబు గ్రక్కుచున్

టీక:- పెను = పెద్ద; గదన్ = గదను; పూన్చి = పట్టుకొని; కృష్ణు = కృష్ణుని యొక్క; తలన్ = తలమీద; బెట్టుగన్ = గట్టిగా; మొత్తినన్ = కొట్టగా; అంకుశా = అంకుశముతో; ఆహతిన్ = పోటుచేత; కనలెడి = కోపించునట్టి; గంధసింధురము = మదపుటేనుగు; కైవడిన్ = వలె; సింధురభంజనుడు = కృష్ణుడు { సింధురభంజనుడు – సింధుర (కువలయాపీడం అను ఏనుగును) భంజనుడు సంహరించినవాడి, కృష్ణుడు}; పెంపునన్ = అతిశయముతో; పవి = వజ్రాయుధమువలె; భాసమాన = ప్రకాశవంతమైన; గదన్ = గదను; పూని = ధరించి; మహా = మిక్కిలి; ఉగ్రతన్ = భీకరముగా; త్రిప్పి = తిప్పి; దంతవక్త్రుని = దంతవక్త్రుడు యొక్క; ఉరమున్ = వక్షస్థలమును; పగిల్చినన్ = పగులునట్లు కొట్టగా; కుదుల్కొనుచు = లుంగచుట్టుకొని తూలిపడిపోతూ; రుధిరంబు = రక్తము; క్రక్కుచున్ = కక్కుకొంటు.
భావము:- దంతవక్త్రుడు తన గదాదండంతో కృష్ణుడి తలమీద మోదాడు. అంకుశం పోటుకి కోపించెడి మదగజంలా, శ్రీకృష్ణుడు ఆగ్రహించి వజ్రాయుధంలాంటి గదతో వాడి వక్షస్థలాన్ని పగులకొట్టడంతో, వాడు రక్తం కక్కుతూ నేలకూలాడు.

తెభా-10.2-919-వ.
తత్‌క్షణంబ పర్వతాకారంబగు దేహంబుతో నొఱలుచు నేలంగూలి కేశపాశంబులు సిక్కువడఁ దన్నుకొనుచుఁ బ్రాణంబులు విడిచె; నప్పుడు నిఖిల భూతంబులు నాశ్చర్యంబు వొందఁ దద్గాత్రంబున నుండి యొక్క సూక్ష్మతేజంబు వెలువడి గోవిందునిదేహంబుఁ బ్రవేశించె; నయ్యవసరంబున నగ్రజు మరణంబు గనుంగొని కుపితుండై కనుఁగవల నిప్పులుప్పతిల్ల విదూరథుండు గాలానల జ్వాలాభీలకరాళంబైన కరవాలంబును బలకయుం గేలందాల్చి దామోదరు దెసకుఁ గవయుటయుం గనుంగొని.
టీక:- తత్క్షణంబ = వెంటనే; పర్వత = పర్వతము వంటి; ఆకారంబు = ఆకారము కలది; అగు = ఐన; దేహంబున్ = శరీరమును; తోన్ = తోటి; ఒఱలుచున్ = మొరపెట్టుచు; నేలన్ = నేలమీద; కూలి = పడిపోయి; కేశపాశంబులు = జుట్టుముడి; చిక్కుపడన్ = చిక్కుపడిపోగా; తన్నుకొనుచున్ = తన్నుకొంటు; ప్రాణంబుల్ = జీవములను; విడిచెన్ = వదలిపెట్టెను; అప్పుడు = అప్పుడు; నిఖిల = సర్వ; భూతంబులున్ = ప్రాణులు; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యమును; ఒందన్ = పొందగా; తత్ = అతని; గాత్రంబు = దేహము; నుండి = నుండి; ఒక్క = ఒకానొక; సూక్ష్మ = సూక్ష్మమైన; తేజంబు = తేజస్సు; వెలువడి = బయటకువచ్చి; గోవిందుని = కృష్ణుని; దేహంబు = శరీరములో; ప్రవేశించెన్ = ప్రవేశించినది; ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు; అగ్రజు = అన్న యొక్క; మరణంబున్ = చావును; కనుంగొని = చూసి; కుపితుండు = కోపించినవాడు; ఐ = అయ్యి; కనుగవలన్ = రెండు కన్నుల నుండి; నిప్పులు = అగ్నికణములు; ఉప్పతిల్ల = పుట్టగా; విదూరథుండు = విదూరథుడు; కాలా = ప్రళయకాలపు; అనల = అగ్ని; జ్వాలా = మంటల; ఆభీల = భయంకరమైన; కరాళంబు = పెద్దది భయంకరమైనది; ఐన = అయినట్టి; కరవాలంబునున్ = కత్తిని; పలకయున్ = డాలు; కేలన్ = చేతి అందు; తాల్చి = ధరించి; దామోదరు = కృష్ణుని; దెస = వైపున; కున్ = కు; కవయుటయున్ = సమీపించుటను; కనుంగొని = చూసి.
భావము:- తక్షణమే పర్వతంవంటి దేహంతో దంతవక్త్రుడు నేలపడి శిరోజాలు విడివడి చిక్కులు పడేలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచాడు. అప్పుడు, వాడి దేహం లోంచి ఒక సూక్ష్మతేజం వెలువడి శ్రీకృష్ణుడి శరీరంలో ఐక్యం అయింది. సకల జీవులూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో విదూరథుడు అను వాడు అన్న మరణం చూసి అతి కోపంతో ప్రళయకాలపు అగ్నిజ్వాలవంటి భయంకరమైన కత్తి, డాలు ధరించి శ్రీకృష్ణుడి పైకి దూకాడు. చక్రి అది చూసి.....

తెభా-10.2-920-చ.
రుహలోచనుండు నిజసాధనమై తనరారు చక్రమున్
నుగఁ బూన్చి వైవ నది వారక వాని శిరంబు ద్రుంచె న
బ్బలియుఁడు సౌభ సాల్వ శిశుపాల సహోదర తత్సహోదరా
లుల వధించి తత్కులము వారి ననేకులఁ ద్రుంచె నీ గతిన్.

టీక:- జలరుహలోచనుండు = కృష్ణుడు; నిజ = తన యొక్క; సాధనము = ఆయుధము; ఐ = అయ్యి; తనరారు = విలసిల్లు; చక్రమున్ = చక్రమును; వలనుగన్ = తగినట్టు; పూన్చి = ధరించి; వైవన్ = వేయగా; అది = అది; వారక = వదలక; వాని = అతని; శిరంబున్ = తలను; త్రుంచెన్ = నరికివేసెను; ఆ = ఆ యొక్క; బలియుడు = బలవంతుడు, కృష్ణుడు; సౌభ = సౌభకము; సాల్వ = సాల్వుడు; శిశుపాల = శిశుపాలును; సహోదర = తోడబుట్టినవారు; తత్ = వాని; సహోదర = తోడబుట్టినవారు; ఆవలులన్ = సమూహములను; వధించి = సంహరించి; తత్ = వారి; కులమున్ = వంశము; వారిన్ = వారిని; అనేకులన్ = పెక్కుమందిని; త్రుంచెన్ = చంపెను; ఈ = ఈ; గతిన్ = విధముగ.
భావము:- కృష్ణుడు తన చక్రాయుధం పూని వేయడంతో, అది వాని శిరస్సును ఖండించింది. అలా బలవంతుడైన శ్రీకృష్ణుడు సౌభకంతో పాటు, సాల్వుణ్ణీ, శిశుపాలుణ్ణీ, వాని తమ్ముడు విదూరథుణ్ణీ, వారి సోదరులతో సహా సంహరించాడు. ఇంతేకాక, వారి వంశం వారిని చాలా మందిని చంపాడు.

తెభా-10.2-921-వ.
అయ్యవసరంబున.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు.
భావము:- అలా సాల్వాదులను అంతమొందించిన సమయంలో.....

తెభా-10.2-922-క.
ముని యోగి సురాసుర
రుడోరగ సిద్ధ సాధ్య గంధర్వ నభ
శ్చ కిన్నర కింపురుషులు
రిమహిమ నుతించి రద్భుతానందములన్.

టీక:- నర = మానవులు; ముని = మునులు; యోగి = యోగులు; సుర = దేవతలు; అసుర = దానవులు; గరుడ = గరుడులు; ఉరగ = సర్పములు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; గంధర్వ = గంధర్వులు; నభశ్చర = ఖేచరులు; కిన్నర = కిన్నరలు; కింపురషులు = కింపురుషులు; హరిన్ = కృష్ణుని; మహిమన్ = గొప్పదనమును; నుతించిరి = కీర్తించిరి; అద్భుత = ఆశ్చర్యమును; ఆనందములన్ = ఆనందములతో.
భావము:- మానవులు, మునులు, యోగులు, దేవతలు, రాక్షసులు, గరుడులు, నాగులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, ఖేచరులు మొదలైన వారంతా ఆశ్చర్యానందాలతో శ్రీకృష్ణుని ప్రభావాన్ని స్తుతించారు.

తెభా-10.2-923-వ.
మఱియు నప్సరోజనంబులు నృత్యంబులు సలుప, వేల్పులు కుసుమ వర్షంబులు గురియ, దేవతూర్యంబు లవార్యంబులై మొరయ, యదు వృష్ణి ప్రవరులు సేవింపఁ, బరమానందంబునుం బొంది నిజవిజయాంకితంబు లైన గీతంబుల వందిజనంబులు సంకీర్తనంబులు సేయ, నతి మనోహర విభవాభిరామంబును, నూతనాలంకారంబును నైన ద్వారకానగరంబు శుభముహూర్తంబునం బ్రవేశింపం జనునెడ.
టీక:- మఱియున్ = ఇంకను; అప్సరః = అప్సరసస్త్రీల; జనంబులున్ = సమూహములు; నృత్యంబులు = నాట్యములు; సలుపన్ = చేయగా; వేల్పులు = దేవతలు; కుసుమ = పూల; వర్షంబులు = వానలు; కురియన్ = కురిపించగా; దేవ = దివ్యమైన; తూర్యంబులున్ = వాయిద్యములు; అవార్యంబులు = ఆగకుండనివి; ఐ = అయ్యి; మొరయన్ = మోగగా; యదు = యాదవులు; వృష్ణి = వృష్ణి; ప్రవరులు = వంశస్థులు; సేవింపన్ = కొలుచుచుండగా; పరమ = మిక్కిలి; ఆనందంబునున్ = ఆనందమును; పొంది = పొంది; నిజ = తన; విజయ = గెలుపులకు; అంకితంబులు = గురుతింపబడినవి; ఐన = అయిన; గీతంబులన్ = పాటలను; వంది = స్తుతిపాఠకుల; జనంబులున్ = సమూహములు; సంకీర్తనంబులు = పాటలు; చేయన్ = పాడగా; అతి = మిక్కిలి; మనోహర = అందమైన; విభవ = వైభవములతో; అభిరామంబునున్ = చక్కనిది; నూతన = కొత్తగ; అలంకారంబున్ = అలంకరించుకొన్నది; ఐన = అయిన; ద్వారకానగరంబు = ద్వారకాపట్టణము; శుభ = మంగళకరమైన; ముహూర్తంబునన్ = ముహూర్తమునందు; ప్రవేశింపన్ = ప్రవేశించుటకు; చను = వెళ్తున్న; ఎడన్ = సమయము నందు;
భావము:- అప్సరసలు ఆనందంతో నృత్యాలు చేస్తుండగా, దేవతలు పూలవానలు కురిపిస్తుండగా, దేవ దుందుభులు మ్రోగుతుండగా, యాదవ వీరులు సేవిస్తుండగా, వందిమాగధులు తన విజయ గాథలను గానం చేస్తుండగా, బహు మనోజ్ఞములైన వైభవాలతో, నందనందనుడు పరమానందంతో ఒక శుభముహుర్తంలో నవ్యనూతన అలంకారాలతో విరాజిల్లుతున్న ద్వారకానగరం ప్రవేశించాడు.

తెభా-10.2-924-క.
పుసతులు విరులు లాజలు
గురుసౌధాగ్రములనుండి కురియఁగ వికచాం
బురుహాక్షుం డంతఃపుర
మర్థిం జొచ్చె వైభవం బలరారన్.

టీక:- పురసతులు = పౌరకాంతలు; విరులున్ = పూలు; లాజలు = పేలాలు; గురు = పెద్ద; సౌధ = మేడల; అగ్రముల = మీద; నుండి = నుండి; కురియగన్ = కురిపించగా; వికచాంబురుహాక్షుండు = కృష్ణుడు; అంతఃపుర = అంతపుర; వరమున్ = శ్రేష్ఠమును; అర్థిన్ = ప్రీతితో; చొచ్చెన్ = ప్రవేశించెను; వైభవంబు = వైభవము; అలరారన్ = చక్కగానుండగా.
భావము:- ఆ సమయంలో నగరంలోని స్త్రీలు మేడలమీద నుండి శ్రీకృష్ణుడిమీద పూలు అక్షతలు కురిపిస్తుండగా, శ్రీకృష్ణుడు మహావైభవంతో అంతఃపురం ప్రవేశించాడు.

తెభా-10.2-925-వ.
అట్లు యోగీశ్వరేశ్వరుండును, షడ్గుణైశ్వర్యసంపన్నుండును, నిఖిలజగదీశ్వరుండును నైన పురుషోత్తముండు సుఖంబుండె; నంత.
టీక:- అట్లు = ఆ విధముగా; యోగి = ఋషి; ఈశ్వర = ఉత్తములకు; ఈశ్వరుండును = ప్రభువు; షడ్గుణైశ్వర్య = షడ్గుణైశ్వర్యములతో {షడ్గుణైశ్వర్యములు - 1శక్తి 2జ్ఞానము 3బలము 4ఐశ్వర్యము 5వీర్యము 6తేజస్సు అను ఆరు ఐశ్వర్యములు}; సంపన్నుండును = సమృద్ధిగా కలిగినవాడు; నిఖిల = సమస్తమైన; జగత్ = లోకములకు; ఈశ్వరుండును = ప్రభువు; ఐన = అయినట్టి; పురుషోత్తముండు = కృష్ణుడు; సుఖంబున్ = సుఖముగా; ఉండెన్ = ఉండెను; అంత = పిమ్మట;
భావము:- మహాయోగులకు ఈశ్వరుడు, షడ్గుణైశ్వర్యములు సమృద్ధిగా కలవాడు, సకల జగత్తులకు ప్రభువు అయిన శ్రీకృష్ణుడు అలా నగరం ప్రవేశించి, ద్వారకలో సుఖంగా ఉన్నాడు.

తెభా-10.2-926-క.
కౌవ పాండవ పృథు సమ
రారంభ మెఱింగి తీర్థయాత్ర నెపముగా
సీరాంకుఁ డుభయకులులకు
నాయ సముఁ డగుటఁ జేసి రిగె నరేంద్రా!

టీక:- కౌరవ = దుర్యోధనాదులకు; పాండవ = ధర్మరాజాదులకు; పృథు = పెద్ద; సమర = యుద్ధము; ఆరంభము = మొదలగుట; ఎఱింగి = తెలిసికొని; తీర్థయాత్ర = తీర్థయాత్ర అను; నెపమున్ = వంకను; సీరాంకుడు = బలరాముడు; ఉభయ = రెండు; కులుల = వంశములవారల; కున్ = కు; ఆరయన్ = విచారించి చూసినచో; సముడు = సమానుడు; అగుటన్ = అగుట; చేసి = వలన; అరిగి = వెళ్ళెను; నరేంద్రా = రాజా.
భావము:- ఓ పరీక్షిన్మహారాజా! కౌరవ పాండవులకు యుద్ధం ప్రారంభం కానున్నదని తెలుసుకుని ఇరుపక్షాలకూ కావలసిన వాడు కనుక, బలరాముడు బయలుదేరి తీర్ధయాత్ర నెపంతో వెళ్ళిపోయాడు.