పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/జాంబవతి పరిణయంబు

జాంబవతి పరిణయంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/జాంబవతి పరిణయంబు)
రచయిత: పోతన



తెభా-10.2-63-వ.
అంత నా ధ్వని విని బలవంతుండైన జాంబవంతుఁడు వచ్చి తన స్వామి యని కృష్ణు నెఱుంగక ప్రాకృత పురుషుండని తలంచి కృష్ణునితో రణంబు చేసె; నందు.
టీక:- అంతన్ = అప్పుడు; ఆ = ఆ; ధ్వనిన్ = శబ్దమును; విని = విని; బలవంతుండు = మిక్కిలి బలము కలవాడు; ఐన = అగు; జాంబవంతుడు = జాంబవంతుడు; వచ్చి = వచ్చి; తన = తన యొక్క; స్వామి = ఏలిక, ప్రభువు; అని = అని; కృష్ణున్ = కృష్ణుని; ఎఱుంగక = తెలిసికొనలేక; ప్రాకృత = సామాన్య; పురుషుండు = మానవుడు; అని = అని; తలంచి = భావించి, ఎంచి; కృష్ణుని = కృష్ణుని; తోన్ = తోటి; రణంబున్ = యుద్ధము; చేసెన్ = చేసెను; అందు = ఆ సమయములో.
భావము:- దాది వేసిన కేక విని మహాబలశాలి అయిన జాంబవంతుడు అక్కడకు వచ్చాడు. శ్రీకృష్ణుడు తన ప్రభువే (శ్రీరాముడే) అని గ్రహించక, సామాన్య మానవు డని భావించి కృష్ణుడితో యుద్ధం చేయడానికి తలపడ్డాడు. అప్పుడు....

తెభా-10.2-64-క.
లమునకుఁ బోరెడు డే
క్రియ శస్త్రములఁ దరులఁ రముల విజయే
చ్ఛ నిరువదియెనిమిది దిన
ములు వోరిరి నగచరేంద్రముఖ్యుఁడు హరియున్.

టీక:- పలలము = మాంసము; కున్ = కొఱకు; పోరెడు = పోరాటము చేసెడి; డేగల = డేగల; క్రియన్ = వలె; శస్త్రములన్ = కత్తులతోటి; తరులన్ = చెట్లతోటి; కరములన్ = చేతులతోటి; విజయ = గెలువవలె ననెడి; ఇచ్ఛలన్ = కోరికలతో; ఇరువదిఎనిమిది = ఇరవైఎనిమిది (28); దినములున్ = రోజులపాటు; పోరిరి = యుద్ధము చేసిరి; నగచరేంద్రముఖ్యుడు = జాంబవంతుడు {నగచరేంద్ర ముఖ్యుడు - నగచర (కొండల మీద తిరిగెడిది, భల్లూకము) లలో ఇంద్ర (శ్రేష్ఠులలో) ముఖ్యమైనవాడు, జాంబవంతుడు}; హరియున్ = కృష్ణుడు.
భావము:- మాంసం కోసం పోరాడే డేగల లాగ; కృష్ణుడు, జాంబవంతుడు ఆ శమంతకమణి కోసం ఆయుధాలతో, చెట్లతో, చేతులతో ఒకరి నొకరు జయించాలనే కోరికతో ఇరవైఎనిమిది రోజులు పోరాడారు.

తెభా-10.2-65-క.
డిదములుఁ దరులు విఱిగిన
బెడిదము లగు మగతనములు బిఱుతివక వడిం
బిడుగులవడువునఁ బడియెడి
పిడికిటిపోటులను గలన బెరసి రిరువురున్.

టీక:- అడిదములున్ = కత్తులు; తరులున్ = చెట్లు; విఱిగినన్ = విరిగిపోగా; బెడిదములు = కఠినములు; అగు = ఐన; మగతనములున్ = శూరత్వములుతో; పిఱుతివక = వెనుదీయక; వడిన్ = వేగముగా; పిడుగుల = పిడుగుల; వడుపునన్ = వలె; పడియెడి = పడుతున్నట్టి; పిడికిటి = పిడికిళ్ళతో; పోటులన్ = కొట్టుటలచేత; కలనన్ = యుద్ధములో; బెరసిరి = అతిశయించిరి; ఇరువురున్ = ఇద్దరు (2).
భావము:- కత్తులు, చెట్లు విరిగిపోయినా, వెనుకంజ వేయకుండా మిక్కిలి పౌరుషంతో పిడుగుల వంటి పిడికిలిపోట్లతో వారిరువురూ క్రూరంగా పోరాడారు.

తెభా-10.2-66-శా.
స్పష్టాహంకృతు లుల్లసిల్ల హరియున్ ల్లూకలోకేశుఁడున్
ముష్టాముష్టి నహర్నిశంబు జయసమ్మోహంబునం బోరుచోఁ
బుష్టిం బాసి ముకుంద ముష్టిహతులం బూర్ణశ్రమోపేతుఁడై
పిష్టాంగోరు శరీరుఁడై యతఁడు దా భీతాత్ముఁడై యిట్లనున్.

టీక:- స్పష్ట = బాగుగా తెలియబడుచున్న; అహంకృతులున్ = అహంకారములు; ఉల్లసిల్ల = ప్రకాశింపగా; హరియున్ = కృష్ణుడు; భల్లూకలోకేశుడున్ = జాంబవంతుడు {భల్లూక లోకేశుడు - ఎలుగు బంట్లలోకమున ప్రభువు, జాంబవంతుడు}; ముష్టాముష్టిన్ = పిడికిటి గుద్దులతో {ముష్టాముష్టి - పరస్పరము గుద్దులతో చేయు యుద్ధము}; అహర్నిశంబున్ = అహోరాత్రులు; జయ = గెలువవలె ననెడి; సమ్మోహంబునన్ = కోరికలతో; పోరుచోన్ = యుద్ధము చేస్తుండగా; పుష్టిన్ = బలము; పాసి = తొలగి; ముకుంద = కృష్ణుని; ముష్టి = పిడికిటి; హతులన్ = గుద్దులచేత; పూర్ణ = పూర్తిగా; శ్రమ = అలసటతో; ఉపేతుడు = కూడినవాడు; ఐ = అయ్యి; పిష్ట = పిండిపిండిచేయబడిన; అంగ = అవయవములు కల; ఉరు = పెద్ద దయిన; శరీరుడు = దేహము కలవాడు; ఐ = అయ్యి; అతడు = అతను; తాన్ = తను; భీత = భయపడిన; ఆత్ముడు = మనసు కలవాడు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అనున్ = పలికెను.
భావము:- కృష్ణ జాంబవంతులు ఇలా విజయం పొందాలనే కోరికతో అహోరాత్రాలు ముష్టాముష్టిగా పోరాడగా పోరాడగా. (ఇరవై ఎనిమిది రోజులకు) శ్రీకృష్ణుడి పిడికిలిపోట్లకు జాంబవంతుడి బలం తరిగిపోయింది. అలసట అధికమైంది. అవయవాలన్నీ పిండి పిండి అయిపోయాయి. అప్పుడు జాంబవంతుడు భయకంపితుడై కృష్ణపరమాత్మునితో ఇలా అన్నాడు.

తెభా-10.2-67-వ.
“దేవా! నిన్నుఁ బురాణపురుషు నధీశ్వరు విష్ణుం బ్రభవిష్ణు నెఱుంగుదు; సర్వభూతంబులకుం బ్రాణ ప్రతాప ధైర్యబలంబులు నీవ; విశ్వంబునకు సర్గస్థితిలయంబు లెవ్వరాచరింతురు, వారికి సర్గ స్థితిలయంబులఁ జేయు నీశ్వరుండవు నీవ; యాత్మవు నీవ” యని మఱియును.
టీక:- దేవా = స్వామీ {దేవుడు - దివయంతి దేవా, స్వయంప్రకాశుడు}; నిన్నున్ = నిన్ను; పురాణపురుషున్ = కృష్ణుని {పురాణ పురుషుడు - సృష్టికి పూర్వమునుండి ఉన్న పురుషుడు (కారణభూతుడు), విష్ణువు}; అధీశ్వరున్ = కృష్ణుని {అధీశ్వరుడు - సర్వోన్నత ఈశ్వరుడు, విష్ణువు}; విష్ణున్ = కృష్ణుని {విష్ణువు - సృష్టికి అంతర్బహిః వ్యాప్తించెడి శీలము కలవాడు, విష్ణువు}; ప్రభవిష్ణున్ = కృష్ణుని {ప్రభవిష్ణువు - సర్వమును ప్రభవించు (సృజియించుట) శీలము కలవాడు, విష్ణువు}; ఎఱుంగుదు = తెలిసి ఉంటిని; సర్వ = సకల; భాతంబుల = ప్రాణుల; కున్ = కు; ప్రాణ = ప్రాణము; ప్రతాప = ప్రతాపము; ధైర్య = ధైర్యము; బలంబులు = బలములు; నీవ = నీవే; విశ్వంబున్ = జగత్తున; కున్ = కు; సర్గ = సృష్టించుట; స్థితి = రక్షించుట; లయంబులు = నాశముచేయుటలు; ఎవ్వరు = ఎవరు; ఆచరింతురు = చేయుదురో (బ్రహ్మవిష్ణుమహేశ్వరులు); వారి = వారల; కిన్ = కు; సర్గ = సృష్టించుట; స్థితి = స్థితి; లయంబులన్ = లయములను; చేయున్ = చేసెడి; ఈశ్వరుండవు = సర్వనియామకుడవు; నీవ = నీవే; ఆత్మవున్ = పరబ్రహ్మవు; నీవ = నీవే; అని = అని; మఱియును = ఇంకను.
భావము:- “దేవా! పురాణపూరుషుడవు; జగన్నాయకుడవు; విష్ణుడవు; ప్రభవిష్ణుడవు; నీవని నేను తెలుసుకున్నాను; సర్వప్రాణులకూ ప్రాణము, ప్రతాపము, ధైర్యము, బలము నీవే; ఈ ప్రపంచము సృష్టికి, స్థితికీ, వినాశనానికి ఎవరు కారకులో వారి సృష్టి స్థితి లయాలు చేసే పరమేశ్వరుడవు; ఆత్మస్వరూపుడవు నీవే.” అని ఇంకా ఇలా స్తుతించాడు

తెభా-10.2-68-సీ.
"బాణాగ్ని నెవ్వఁడు ఱపి పయోరాశి-
నింకించి బంధించి యేపు మాపెఁ
రఁగ నెవ్వఁడు ప్రతాప్రభారాశిచే-
దానవగర్వాంధమస మడఁచెఁ
గంజాతములు ద్రెంచు రిభంగి నెవ్వఁడు-
శకంఠుకంఠబృంములు ద్రుంచె
నా చంద్రసూర్యమై మరు లంకారాజ్య-
ముకు నెవ్వఁడు విభీణుని నిలిపె

తెభా-10.2-68.1-తే.
న్ను నేలిన లోకాధినాథుఁ డెవ్వఁ
డంచితోదారకరుణారసాబ్ధి యెవ్వఁ
డాతఁడవు నీవ కావె; మహాత్మ! నేఁడు
మాఱుపడి యెగ్గు సేసితి ఱవవలయు. "

టీక:- బాణ = బాణములనెడి; అగ్నిన్ = అగ్నిని; ఎవ్వడు = ఎవరైతే; పఱపి = ప్రయోగించి; పయోరాశిన్ = సముద్రమును; ఇంకించి = ఆవిరిచేసి; బంధించి = కట్ట (వంతెన) కట్టి; ఏపు = గర్వము; మాపెన్ = పోగొట్టెనో; పరగన్ = ప్రసిద్ధముగ; ఎవ్వడు = ఎవరు; ప్రతాప = ప్రతాపము అనెడి; ప్రభా = కాంతి; రాశి = సమూహముల; చేన్ = చేత; దానవ = రాక్షసుల; గర్వ = గర్వము అనెడి; అంధ = గుడ్డి; తమసమున్ = చీకటిని; అడచెన్ = అణచివేసెనో; కంజాతములున్ = పద్మములను {కంజాతము - కం (నీటిలో) జాతము (పుట్టినది), పద్మము}; త్రెంచు = పెరకునట్టి; కరి = ఏనుగు; భంగిన్ = వలె; ఎవ్వడు = ఎవరు; దశకంఠు = రావణాసురుని {దశకంఠుడు - పది తలలు కలవాడు, రావణుడు}; కంఠ = కంఠముల; బృందములున్ = సమూహమును; త్రుంచెన్ = తెంచివేసెనో; ఆచంద్రసూర్యము = ఎప్పటికి ఉండునది {ఆచంద్రసూర్యము - సూర్య చంద్రులున్నంత వరకు ఉండునది, ఎప్పటికి ఉండునది}; ఐ = అయ్యి; అమరు = ఒప్పునట్టి; లంకా = లంక అందు; రాజ్యమున్ = రాజ్యమునేలు అధికారము; కున్ = కు; ఎవ్వడు = ఎవరు; విభీషణుని = విభీషణుని; నిలిపెన్ = ఏర్పరచెనో; నన్నున్ = నన్ను; ఏలిన = పాలించిన; లోక = సకల లోకములకు; అధినాథుడు = ఉన్నతమైన ప్రభువు; ఎవ్వడు = ఎవరో; అంచిత = చక్కటి; ఉదార = గొప్పగా ఇచ్చెడి; కరుణారస = దయ అనెడి; అబ్ధిన్ = సముద్రము వంటివాడు; ఎవ్వడు = ఎవరో; ఆతడవు = అతడవు; నీవ = నీవే; కావె = కదా, అవును; మహాత్మ = మహిమాన్వితుడా; నేడు = ఇవాళ; మాఱుపడి = పొరబడి; ఎగ్గు = తప్పు; చేసితిన్ = చేసితిని; మఱవవలయు = మరచిపొమ్ము.
భావము:- “ఎవరు బాణాగ్నిచే సముద్రాన్ని ఇంకించి, సేతువు కట్టి సాగరుని గర్వం మాపెనో; రాక్షసుల గర్వమనే చీకటిని ప్రతాపమనే కాంతిరాశిచే అణచివేసెనో; పద్మాలను త్రెంచే ఏనుగులాగ రావణాసురుని శిరస్సులు త్రెంచెనో; ఆచంద్రార్క మైన లంకారాజ్యానికి విభీషణుని రాజుచేసెనో; ఆ నన్నేలిన కరుణాసముద్రుడు, లోకనాథుడు నీవే కదా మహాత్మా! పొరబడి నీకు అపచారం చేసాను. నన్ను మన్నించు.”

తెభా-10.2-69-వ.
అని యిట్లు పరమభక్తుండయిన జాంబవంతుండు వినుతించిన నతని శరీర నిగ్రహ నివారణంబుగా భక్తవత్సలుండైన హరి దన కరంబున నతని మేను నిమిరి గంభీరభాషణంబుల నిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; పరమ = అత్యుత్తమమైన; భక్తుండు = భక్తుడు; అయిన = అగు; జాంబవంతుడు = జాంబవంతుడు; వినుతించిన = స్తుతించగా; అతని = అతని; శరీర = దైహిక; నిగ్రహ = ఇబ్బందిని, శ్రమమును; నివారణంబు = తొలగించుటకై; భక్త = భక్తుల యెడ; వత్సలుండు = వాత్సల్యము కలవాడు; ఐన = అయిన; హరి = కృష్ణుడు; తన = తన యొక్క; కరంబునన్ = చేతితో; అతని = అతని; మేనున్ = శరీరము; నిమిరి = మెల్లగా రాసి; గంభీర = గంభీరమైన; భాషణంబులన్ = పలుకులతో; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని ఈ విధంగా పరమభక్తుడైన ఆ జాంబవంతుడు శ్రీకృష్ణుడిని స్తుతించాడు. అంత, భక్తవత్సలుడైన శ్రీహరి తన చేతితో జాంబవంతుడి శరీరం నిమిరి యుద్ధంవలన కలిగిన శ్రమను తొలగించి గంభీరమైన కంఠస్వరంతో ఇలా అన్నాడు.

తెభా-10.2-70-క.
"ఈ ణి మాచేఁ బడె నని
తాసు లొనరించు నింద ప్పెడు కొఱకై
నీ మందిర మగు బిలమున
కే రుదెంచితిమి భల్లుకేశ్వర! వింటే! "

టీక:- ఈ = ఈ యొక్క; మణి = రత్నము; మా = మా యొక్క; చేబడెను = చేత గ్రహింపబడెను; అని = అని; తామసులు = అజ్ఞానులు; ఒనరించు = చేసెడి; నిందన్ = నిందను; తప్పెడు = తొలగించుట; కొఱకై = కోసము; నీ = నీ యొక్క; మందిరము = నివాసము; అగు = ఐన; బిలమున్ = గుహ; కున్ = కు; ఏము = మేము; అరుదెంచితిమి = వచ్చితిమి; భల్లూకేశ్వర = జాంబవంతుడా {భల్లూకేశ్వరుడు - భల్లూకముల (ఎలుగుబంట్ల)కు ప్రభువు, జాంబవంతుడు}; వింటే = వినుము.
భావము:- “ఓ భల్లూకరాజా! ఈ శమంతకమణిని నేను అపహరించాను అని అజ్ఞానులు నాపై అపనింద వేసారు. దానిని తొలగించుకోవడానికి నీ మందిరమైన ఈ గుహకు నేను వచ్చాను.”

తెభా-10.2-71-వ.
అనిన విని సంతసించి జాంబవంతుఁడు మణియునుం, దన కూఁతు జాంబవతి యను కన్యకామణియునుం దెచ్చి హరికిం గానికఁగా సమర్పించె; నటమున్న హరివెంట వచ్చిన వారలు బిలంబువాకిటం బండ్రెండు దినంబులు హరిరాక కెదురుచూచి వేసరి వగచి పురంబునకుం జని; రంత దేవకీవసుదేవులును రుక్మిణియును మిత్ర బంధు జ్ఞాతి జనులును గుహ సొచ్చి కృష్ణుండు రాక చిక్కె నని శోకించి.
టీక:- అనినన్ = అనగా; విని = విని; సంతసించి = సంతోషించి; జాంబవంతుడు = జాంబవంతుడు; మణియునున్ = శమంతకమణిని; తన = తన; కూతున్ = కుమార్తెను; జాంబవతి = జాంబవతి; అనున్ = అనెడి; కన్యకా = కన్యలలో; మణియునున్ = ఉత్తమురాలిని; తెచ్చి = తీసుకువచ్చి; హరి = కృష్ణుని; కిన్ = కి; కానిక = బహుమతి; కాన్ = అగునట్లు; సమర్పించెన్ = ఇచ్చెను; అట = అంతకు; మున్న = పూర్వము; హరి = కృష్ణుని; వెంటన్ = కూడా; వచ్చినన్ = వచ్చినట్టి; వారలు = జనులు; బిలంబు = గుహ; వాకిటన్ = గుమ్మం ముందు; పండ్రెండు = పన్నెండు; దినంబులున్ = రోజులపాటు; హరి = కృష్ణుని; రాక = వచ్చుట; కిన్ = కు; ఎదురుచూచి = ప్రతీక్షించి; వేసరి = విసిగిపోయి; వగచి = దుఃఖించి; పురంబున్ = నగరమున; కున్ = కు; చనిరి = వెళ్ళిపోయిరి; అంతన్ = అంతట; దేవకీ = దేవకీదేవి; వసుదేవులును = వసుదేవుడు; రుక్మిణియునున్ = రుక్మిణీదేవి; మిత్ర = హితులు; బంధు = బంధువులు; జ్ఞాతి = జ్ఞాతులు; జనులున్ = ప్రజలు; గుహన్ = బిలమునందు; చొచ్చి = ప్రవేశించి; కృష్ణుండు = కృష్ణుడు; రాక = తిరిగిరాలేక; చిక్కెను = చిక్కుబడిపోయెను; అని = అని; శోకించి = దుఃఖించి.
భావము:- అలా శ్రీకృష్ణుడు చెప్పడంతో. జాంబవంతుడు సంతోషించి, శమంతకమణిని ఆ మణితోపాటే తన కుమార్తె అయిన జాంబవతి అనే పేరు కల కన్యకామణిని తెచ్చి హరికి కానుకగా ఇచ్చాడు. అక్కడ శ్రీకృష్ణుడితో పాటు వచ్చి గుహద్వారం దగ్గర నిలచిన వారందరూ పన్నెండు రోజులు శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూసి, వేసారి, దుఃఖించి, ద్వారకకు తిరిగివెళ్ళారు. దేవకీ వసుదేవులు రుక్మిణి తక్కిన బంధుమిత్రులు దాయాదులు గుహలో ప్రవేశించిన కృష్ణుడు తిరిగిరా నందుకు శోకించి...

తెభా-10.2-72-క.
"దుర్గమ మగు బిలమున హరి
నిర్గతుఁడై చేరవలయు నేఁ" డని పౌరుల్‌
ర్గములై సేవించిరి
దుర్గం గృతకుశలమార్గఁ దోషితభర్గన్.

టీక:- దుర్గమము = చొరరానిది; అగు = ఐన; బిలమునన్ = గుహ నుండి; హరి = కృష్ణుడు; నిర్గతుడు = వెలుపలికు వచ్చినవాడు; ఐ = అయ్యి; చేరవలయున్ = రావలెను; నేడు = ఇవాళ; అని = అని; పౌరుల్ = ప్రజలు; వర్గములు = గుంపులు కట్టినవారు; ఐ = అయ్యి; సేవించిరి = పూజించిరి; దుర్గన్ = దుర్గాదేవిని; కృత = ఏర్పరచబడిన; కుశల = క్షేమకరమైన; మార్గన్ = దారి నిచ్చు నామె; తోషిత = సంతోషింపజేయబడిన; భర్గన్ = శివుడు కలామెను.
భావము:- దుర్గమమైన ఆ బిలంలో ప్రవేశించిన శ్రీకృష్ణుడు క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ పౌరులంతా, క్షేమకర మైన దారిని అనుగ్రహించే తల్లి, దుర్గాదేవిని ప్రార్థించారు.

తెభా-10.2-73-క.
డోలాయిత మానసులై
జాలింబడి జనులు గొలువఁ జండిక పలికెన్
"బాలామణితో మణితో
హేలాగతి వచ్చు నంబుజేక్షణుఁ" డనుచున్.

టీక:- డోలాయిత = ఊగిసలాడుతున్న; మానసలు = మనస్సులు కలవారు; ఐ = అయ్యి; జాలిన్ = విచారమును; పడి = పొంది; జనులున్ = పౌరులు; కొలువన్ = పూజించగా; చండిక = దుర్గాదేవి {చండిక - చండుడను దనుజుని సంహరించిన దేవి, పార్వతి శరీరమునుండి పుట్టిన దేవి, దుర్గ}; పలికెన్ = పలికెను; బాలా = కన్యకలలో; మణి = ఉత్తమురాలు; తోన్ = తోటి; మణి = శమంతకమణి; తోన్ = తోటి; హేలా = ఒయ్యారపు; గతిన్ = గమనముతో; వచ్చున్ = వస్తాడు; అంబుజాక్షుడు = పద్మాక్షుడు, కృష్ణుడు; అనుచున్ = అని.
భావము:- ప్రజలు ఇలా సంశయాత్మకులై దీనంగా ప్రార్థించగా “మణితో, బాలామణితో పద్మాక్షుడు అనాయాసంగా తిరిగి వస్తా”డని దుర్గాదేవి పలికింది.

తెభా-10.2-74-క.
త్నము సఫలం బయిన స
త్న సమూహములు బెగడఁ ద్మాక్షుం డా
త్నముతోఁ గన్యాజన
త్నముతోఁ బురికి వచ్చె యమున నంతన్.

టీక:- యత్నము = తలపెట్టినపని; సఫలంబు = నెరవేరినది; అయినన్ = కాగా; సపత్న = శత్రువుల {సపత్నలు - భూమికి పత్నలు (భర్తలు) కనుక తోటి (శత్రు) రాజులు సపత్నులు}; సమూహములున్ = మూకలు; బెగడన్ = బెదిరిపోవునట్లు; పద్మాక్షుండు = కృష్ణుడు; ఆ = ఆ ప్రసిద్ధమైన; రత్నము = మణి; తోన్ = తోటి; కన్యా = స్త్రీలు; జన = అందరిలోను; రత్నము = ఉత్తమురాలు; తోన్ = తోటి; పురి = నగరమున; కిన్ = కు; వచ్చెన్ = చేరెను; రయమునన్ = వేగముగా; అంతన్ = అంతట.
భావము:- ఇంతలో విరోధులందరూ బెదరిపోయేలా తన ప్రయత్నాన్ని సఫలం చేసుకుని మణితో, బాలామణితో శ్రీకృష్ణుడు వేగంగా ద్వారకాపురం చేరాడు.

తెభా-10.2-75-క.
మృతుఁ డైనవాఁడు పునరా
తుఁడైన క్రియం దలంచి న్యామణి సం
యుతుఁడై వచ్చిన హరిఁ గని
వితోత్సవ కౌతుకముల వెలసిరి పౌరుల్.

టీక:- మృతుడు = మరణించినవాడు; ఐన = గాఐనట్టి; వాడు = వాడు; పునః = మరల; ఆగతుడు = వచ్చినవాడు; ఐన = అయిన; క్రియన్ = వలె; తలంచి = ఎంచి, భావించి; కన్యా = స్త్రీతోను; మణిన్ = శమంతకమణితోను; సంయుతుడు = కూడి ఉన్నవాడు; ఐ = అయ్యి; వచ్చిన = వచ్చినట్టి; హరిన్ = కృష్ణుని; కని = చూసి; వితత = విస్తారమైన; ఉత్సవ = వేడుకల; కౌతుకములు = కుతూహలములతో; వెలసిరి = ప్రకాశించిరి; పౌరుల్ = ప్రజలు.
భావము:- కన్యాకమణితో వచ్చిన శ్రీహరిని గాంచి మరణించినవాడు తిరిగి వచ్చినంతగా ద్వారకాపుర పౌరులు ఎంతో వేడుకతో సంతోషించారు.