పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కృష్ణుని భార్యాసహస్ర విహారంబు

కృష్ణుని భార్యాసహస్రవిహారంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కృష్ణుని భార్యాసహస్ర విహారంబు)
రచయిత: పోతన


తెభా-10.2-1323-వ.
అట్లు కృష్ణుండు ద్వారకానగరంబునఁ బూజ్యం బగు రాజ్యంబు సేయుచుఁ బురందరవిభవంబున నిరవొంది కనక మణిమయ విమాన, మండప, గోపుర, ప్రాసాద, సౌధ, చంద్రశాలాంగణాది వివిధ భవనంబు లందును రంగదుత్తుంగతరంగ డోలావిలోల కలహంస, చక్రవాక, కారండవ, సారస, క్రౌంచముఖ జలవిహంగ విలసదుచ్చలిత గరు దనిల దరదమల కమల, కుముద, కహ్లార సందోహ నిష్యంద మకరందరసపాన మదవదిందిందిరకుల కల గాయక ఝంకార నినదంబులును, నిరంతర వసంతసమయ సముచిత పల్లవిత, కోరకిత బాలరసాలజాల లాలిత కిసలయ విసర ఖాదన జాత కుతూహలాయమాన కషాయకంఠ కలకంఠ కలరవ మృదంగ ఘోషంబులును, నిశిత నిజచంచూపుట నిర్దళిత సకలజన నయనానంద సుందరనందిత మాకంద పరిపక్వ ఫలరంధ్ర విగళిత మధుర రసాస్వాదనముదిత రాజకీర శారికా నికర మృదు మధురవచన రచనావశకృత్యంబులును నమరఁ, బురపురంధ్రీజన పీన పయోధర మండల విలిప్త లలిత కుంకుమ పంక సంకుల సౌగంధ్యానుబంధ బంధురగంధానుమోదితుండును, జందనాచల సానుదేశసంజాత మంజుల మాధవీలతానికుంజ మంజుల కింజల్క రంజిత నివాస విసర విహరమాణ శబరికా కబరికా పరిపూర్ణ సురభి కుసుమమాలికా పరిమళ వహుండును, గళిందకన్యకా కల్లోల సందోహ పరిస్పంద కందళిత మందగమనుండును నగు మందానిల విదూషకునిచేఁ బోషితాభ్యాసిత లాలిత లగు నేలాలతా వితాన నటుల నటనంబుల విరాజితంబులగు కాసారతీర భాసురోద్యానంబులందును, జారు ఘనసార పటీర బాలరసాల సాల నీప తాపింఛ జంబూ జంబీర నింబ కదంబప్రముఖ ముఖ్య శాఖి శాఖాకీర్ణ శీతలచ్ఛాయా విరచిత విమల చంద్రకాంతోపల వేదికాస్థలంబులందును, నుదంచిత పింఛవిభాసిత బాలనీలకంఠ కేకార వాకులీకృత కృతక మహీధరంబు లందును, లలితమణి వాలుకానేక పులినతలంబు లందును, గప్పురంపుం దిప్పలను, గురువేరు చప్పరంబులను, విరచిత దారు యంత్ర నిబద్ధ కలశ నిర్యత్పయో ధారాశీకర పరంపరా సంపాదిత నిరంతర హేమంత సమయ ప్రదేశంబులందును, నిందిరారమణుండు షోడశ సహస్ర వధూయుక్తుండై యందఱ కన్ని రూపులై లలితసౌదామినీలతా సమేత నీలనీరదంబుల విడంబించుచుఁ గరేణుకాకలిత దిగ్గజంబు నోజ రాజిల్లుచు, సలిలకేళీవిహారంబులు మొదలుగా ననేక లీలా వినోదంబులు సలుపుచు, నంతఃపురంబునఁ గొలువున్న యవసరంబున వివిధ వేణువీణాది వాద్యవినోదంబులను, మంజుల గానంబులను, గవి గాయక సూత వంది మాగధజన సంకీర్తనంబులను, నటనటీజన నాట్యంబులను, విదూషక పరిహాసోక్తులను సరససల్లాప మృదుమధుర భాషణంబులను బ్రొద్దుపుచ్చుచు నానందరసాబ్ధి నోలలాడు చుండె; నంత.
టీక:- అట్లు = అలా; కృష్ణుండు = కృష్ణుడు; ద్వారకానగరంబునన్ = ద్వారకాపట్టణము నందు; పూజ్యంబు = గౌరవింపదగినట్టిది; అగు = ఐన; రాజ్యంబున్ = రాజ్యమును; చేయుచున్ = చేస్తు; పురందర = ఇంద్ర; విభవంబునన్ = వైభవముతో; ఇరవొంది = స్థిరముగా ఉండి; కనక = బంగారము; మణి = రత్నాలతో; మయ = నిండిన; విమాన = మహారాజభవనములు; మండప = మండపములు; గోపుర = గోపురములు; ప్రాసాద = దేవాలయములు; సౌధ = భవనములు; చంద్రశాల = డాబా {చంద్రశాల - ఏడంతస్తులమీది ఒంటిస్తంభపు మేడ, పైమేడ}; అంగణ = ముంగిళ్ళు; ఆది = మున్నగు; వివిధ = నానావిధములైన; భవనంబులు = గృహములు; అందును = అందు; రంగత్ = చలించుచున్న; ఉత్తుంగ = ఎత్తైన; తరంగ = అలలు అనెడి; డోలా = ఉయ్యాల యందు; విలోల = ఊగుతున్న; కలహంస = రాజహంస {కలహంస - ధూమ్రవర్ణములైన ముక్కు కాళ్ళు ఱెక్కలు కల హంస}; చక్రవాక = చక్రవాకములు; కారండవ = కారండపక్షులు; సారస = బెగ్గురుపక్షులు; క్రౌంచ = కొక్కిరాయి పక్షులు; ముఖ = మొదలగు; జలవిహంగ = నీటిపక్షులు; విలసత్ = విచ్చుకొన్న; ఉచ్చలిత = బాగా చలిస్తున్న; గరుత్ = ఱెక్కల; అనిల = గాలిచేత; దరద = వెఱచు; అమలకమల = తెల్ల తామరల; కుముద = తెల్ల కలువలు; కహ్లార = ఎఱ్ఱ కలువలు; సందోహ = సమూహము లందలి; నిష్యంద = స్రవించుచున్న; మకరంద = పూతేనె; పాన = తాగుటచేత; మదవత్ = మత్తెక్కిన; ఇందిందిర = తుమ్మెదల; కుల = సమూహముల; కల = మధురమైన; గాయక = పాటలు అను; ఝంకార = ఝమ్మనెడి; నినదంబులును = శబ్దములు; నిరంతర = ఎడతెగని; వసంత = వసంత; సమయ = ఋతువునకు; సముచిత = తగిన; పల్లవిత = చిగిర్చినవి; కోరకిత = మొగ్గలు తొడిగినవి; బాల = లేత; రసాల = మామిడిచెట్ల; జాల = సమూహము లందు; లాలిత = లాలన చేయబడిన; కిసలయ = చిగుళ్ళ; విసర = సమూహములను; ఖాదన = తినుట వలన; జాత = కలిగిన; కుతూహలాయమాన = వేడుక పడుచున్న; కషాయ = వగరెక్కిన; కంఠ = గొంతులు కలిగిన; కలకంఠ = కోయిలల యొక్క; కల = మధురమైన; రవ = ధ్వను లనెడు; మృదంగ = మద్దెలల; ఘోషంబులును = శబ్దములు; నిశిత = వాడియైన; నిజ = తమ; చంచూపుట = ముక్కులతో; నిర్దళిత = పొడవబడిన; సకల = ఎల్ల; జన = వారి; నయన = కన్నులకు; ఆనంద = ఆనందమును కలిగించు; సుందర = అందమైన; నందిత = కొనియాడబడెడి; మాకంద = తియ్యమామిడిపండ్ల; పరిపక్వ = బాగా ముగ్గిన; ఫల = పండ్ల; రంధ్ర = కన్నములనుండి; విగళిత = కారుతున్న; మధుర = తియ్యని; రసా = రసములను; ఆస్వాదిత = తాగుటచేత; ముదిత = సంతోషించిన; రాజకీర = రామచిలుకల; శారికా = గోరువంకల; నికర = సమూహముల; మృదు = మెత్తని; మధుర = తియ్యని; వచన = మాటల; రచనా = కూర్పులచేత; వశ = లొంగిపోయిన; కృత్యంబులును = పనులును; అమరపుర = దేవతా; పురంధ్రీ = స్త్రీ; జన = జనుల యొక్క; పీన = బలిసిన; పయోధర = స్తనముల; మండల = ప్రదేశము లందు; విలిప్త = బాగా పూయబడిన; లలిత = మనోజ్ఞమైన; కుంకుమ = కుంకుమపువ్వుతో చేసిన; పంక = గంధముచేత; సంకుల = దళసరి వలన; సౌగంధ = పరిమళముల; అనుబంధ = సంబంధముచేత; బంధుర = ఘనమైన; గంధ = సువాసనలచేత; అనుమోదితుండును = సంతోషించినవాడు; చందన = మలయ; అచల = పర్వతపు; సానుదేశ = కొండచరియ లందు; సంజాత = పుట్టిన; మంజుల = మనోజ్ఞమైన; మాధవీ = గురివింద; లతా = తీగల; నికుంజ = పొదరిండ్లల యందలి; మంజుల = మనోజ్ఞమైన; కింజల్క = కేసరములచేత; రంజిత = అందగించుచున్న; నివాస = ఉనికిపట్ల; విసర = సమూహము లందు; విహరమాణ = విహరిస్తున్న; శబరికా = శబరస్త్రీల; కబరికా = కొప్పుల యందు; పరిపూర్ణ = నిండైన; సురభి = సువాసనలు గల; కుసుమ = పూల; మాలికా = దండల యొక్క; పరిమళ = సువాసనలను; వహుండును = వహించినవాడును; కళిందకన్యకా = యమునానది అందలి; కల్లోల = గొప్ప అలల; సందోహ = సమూహముచేత; పరిస్పంద = మిక్కిల కదులుట వలన; కందళిత = వికసించిన; మంద = మెల్లని; గమనుండును = నడక కలవాడు; అగు = ఐన; మందానిల = మందమారుతము అను; విదూషకునిన్ = విదూషకునిచేత; పోషిత = పోషింపబడిన; అభ్యాసిత = అభ్యాసము చేయబడిన; లాలితలు = లాలింపబడినవారు; అగున్ = ఐన; ఏలా = ఏలకి; లతా = తీగల; వితాన = సమూహములు అను; నటుల = ఆట కత్తెల; నటనంబులన్ = ఆటలచేత; విరాజితంబులు = ప్రకాశించునవి; అగు = ఐన; కాసార = సరస్సుల; తీర = గట్టులందలి; భాసుర = మిక్కిలి ప్రకాశించునట్టి; ఉద్యానంబులన్ = ఉద్యానవనములు; అందున్ = లోను; చారు = అందమైన; ఘనసార = కర్పూరము చెట్లు; పటీర = గంధపుచెట్లు; బాల = లేత; రసాల = మామిటిచెట్లు; సాల = మద్దిచెట్లు; నీప = నల్లఇరుగుడు చేవచెట్లు; తాపింఛ = చీకటిచెట్లు; జంబూ = నేరేడుచెట్లు; జంబీర = నిమ్మచెట్లు; నింబ = వేపచెట్లు; కదంబ = కడిమిచెట్లు; ప్రముఖ = మొదలగు; ముఖ్య = ప్రధానమైన; శాఖి = చెట్ల; శాఖా = కొమ్మలచేత; ఆకీర్ణ = నిండిపోయిన; శీతల = చల్లని; ఛాయా = నీడ లందు; విరచిత = వేయబడిన; విమల = స్వచ్ఛమైన; చంద్రకాంత = చంద్రకాంత; ఉపల = రాళ్ళతో చేయబడిన; వేదికాస్థలంబుల = అరుగుల; అందు = పైన; ఉదంచిత = పైకెత్తబడిన; పింఛ = పింఛములచేత; విభాసిత = మిక్కిలి ప్రకాశించునట్టి; బాల = పిల్ల; నీలకంఠ = నెమళ్ళ; కేకా = కేకల యొక్క {కేక - నెమలి కంఠధ్వని}; రవ = ధ్వనులచే; ఆకులీకృత్ = కలతనొందిన; కృతక = కృత్రిమముగా ఏర్పరచిన; మహీధరంబులు = కొండల; అందును = అందును; లలిత = మనోజ్ఞమైన; మణి = మెరుస్తున్న; వాలుకా = ఇసుకనైన; అనేక = పెక్కు; పులినతలంబులన్ = ఇసుకతిప్పల; అందును = అందు; కప్పురంపు = కర్పూరపు; తిప్పలను = దిబ్బల యందును; కురువేరు = వట్టివేళ్ళ; చప్పరంబులను = పందిళ్ళలోను; విరచిత = చేయబడిన; దారు = కొయ్య, కఱ్ఱ; యంత్ర = యంత్రములకు; నిబద్ధ = కట్టబడిన; కలశ = కుండల యందుండి; నిర్యత్ = స్రవిస్తున్న; పయః = నీటి; ధారా = ధారల యొక్క; శీకర = తుంపరల; పరంపరా = వరుసలచేత; సంపాదిత = కలుగజేయబడిన; నిరంతర = ఎడతెగని; హేమంతసమయ = హేమంతఋతువు కల; ప్రదేశములు = చోటులు; అందును = అందు; ఇందిరారమణుండు = కృష్ణుడు; షోడశసహస్ర = పదహారువేల (16,000); వధూ = వధువులతో; యుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి; అందఱ = అందరి; కున్ = కి; అన్ని = అన్ని; రూపులు = ఆకృతులు కలవాడు; ఐ = అయ్యి; లలిత = మనోజ్ఞమైన; సౌదామినీ = మెరుపు; లతా = తీగలతో; సమేత = కూడిన; నీల = నల్లని; నీరదంబులన్ = మేఘములను; విడంబించుచు = సరిపోలుతు; కరేణుకా = ఆడ ఏనుగులతో; కలిత = కూడి ఉన్న; దిగ్గజంబున్ = దిగ్గజము; ఓజన్ = వలె; రాజిల్లుతు = ప్రకాశించుచు; సలిల = జల; కేళీ = క్రీడలలో; విహారంబులున్ = విహరించుటలు; మొదలుగాన్ = మున్నగు; అనేక = పెక్కు; లీలా = క్రీడలు; వినోదంబులున్ = వేడుకలు; సలుపుచున్ = చేయుచు; అంతఃపురంబునన్ = అంతఃపురంబు నందు; కొలువున్న = కొలువుతీరి ఉన్న; అవసరంబునన్ = సమయము నందు; వివిధ = నానా విధములైన; వేణు = పిల్లనగ్రోవులు; వీణా = వీణలు; ఆది = మున్నగు; వాద్య = వాయిద్యపు; వినోదంబులనున్ = వేడుకలను; మంజుల = మృదువైన; గానంబులను = పాటలను; కవి = కావ్యకర్తల; గాయక = పాటగాళ్ళ; సూత = బట్టువాళ్ళ; వంది = స్తుతి పాఠకుల; మాగధ = వంశావళి చదువువారి; జన = సమూహముల; సంకీర్తనంబులను = స్తోత్రములను; నట = నాట్యగాళ్ళ; నటీ = నాట్యకత్తెల; జన = సమూహముల; నాట్యంబులను = నాట్యములను; విదూషక = విదూషకుల యొక్క; పరిహాస = నవ్వుటాలకైన; ఉక్తులను = మాటలను; సరస = రసవంతమైన; సల్లాప = మాటలచేత; మృదు = మెత్తని; మధుర = తియ్యని; భాషణంబులను = మాటలతోను; ప్రొద్దుపుచ్చుచున్ = కాలక్షేపము చేయుచు; ఆనంద = సంతోష; అబ్ధిన్ = సాగరము నందు; ఓలలాడుచు = ఈదులాడుతు; ఉండెన్ = ఉండెను; అంతన్ = అప్పుడు;
భావము:- అలా శ్రీకృష్ణుడు దేవేంద్రవైభవంతో సగౌరవంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ద్వారకానగరంలో చాలా కాలం ఉన్నాడు. ఆ నగరంలో రత్నాలు పొదిగిన బంగారు మయమైన విమానాలు, మండపాలు, గోపురాలు, ప్రాసాదాలు, డాబాలు, సౌధాలు, రాజభవనాలు ముంగిళ్ళు ఉన్నాయి. అక్కడి సరోవరాలలో ఉత్తుంగ తరంగాలలో ఊయలలూగే కలహంసలు, కారండాలు, చక్రవాకాలు, బెగ్గురులు, క్రౌంచాలు మున్నగు నీటి పక్షులు విహరిస్తున్నాయి. తెల్ల తామరలు, తెల్ల కలువలు, ఎఱ్ఱ కలువలు యందు స్రవిస్తున్న మకరందాన్ని త్రాగి మత్తిల్లిన తుమ్మెదల ఝంకార గానాలు మారుమోగుతున్నాయి. ఎడతెగని వసంత ఋతువు విరాజిల్లుతున్నట్లు సదా చిగురించి, మొగ్గలు తొడిగిన లేత మామిడి పల్లవాలను తిని కుతూహలంతో వగరెక్కిన గొంతులతో కూసే కోయిలల కమ్మని కూజితాలు వినిపిస్తున్నాయి. అందరూ ఇష్టపడె సుందరమైన తియ్య మామిడిపళ్ళ రసాన్ని త్రాగి ఆనందంతో పలికే చిలుకల గోరువంకల తియ్యని పలుకులు వీనుల విందుచేస్తున్నాయి. మెత్తని పలుకులతో అలరించే అప్సరసల బలిష్ఠమైన స్తనములపై పూయబడిన కుంకుమాది సుగంధ ద్రవ్యాల సువాసనలు మనోజ్ఞంగా వస్తున్నాయి. మలయ పర్వత సానువుల్లో సంచరించే శంబర స్త్రీల కొప్పులలోని పూలమాలలు సురభి పరిమళాలుతో కూడిన మందమారుతాలు వీస్తున్నాయి. ఏలకి ఆది లతలు మనోహరంగా పోషింపబడుతున్నాయి. సరస్సు తీర ప్రాంతాలు, ఉద్యానవనాలు యందు విదూషకుల, నాట్యకత్తెల ఆటపాటలుతో మనోజ్ఞంగా ఉన్నాయి. కర్పూరము, చందనము, లేత మామిడి, మద్ది, నీప, చీకటి మాను, నేరేడు, నిమ్మ, వేప, కడిమి మున్నగు అందమైన చెట్ల నీడలలో చంద్రకాంత శిలా వేదికలు మీద పింఛాలు ఎత్తి నెమళ్ళు నాట్యాలు చేస్తున్నాయి. కృత్రిమ కొండలు, ఇసుక తిన్నెలు వద్ద వేసిన వట్టివేళ్ళ పందిరులు అలరిస్తున్నాయి. నీళ్ళుతోడే కొయ్య యంత్రాలకు కట్టిన కుండల నుండి జలజల మంటూ నీళ్ళు జాలువారుతున్నాయి. అట్టి దివ్యశోభాన్వితమైన ద్వారకలో, నిరంతరం హేమంతమే అనిపించే ప్రదేశాలలో శ్రీకృష్ణుడు తన పదహారువేలనూరు మంది మానినీమణులతో కలగలిసి అందరికి అన్ని రూపుల వాడు అయి, మెరుపు తీగల నడుమ నీలిమేఘంలా మెరుస్తున్నాడు. ఆడ ఏనుగులతో విహరించే దిగ్గజమును పోలి జలక్రీడాది అనేక క్రీడలతో విహరిస్తున్నాడు. మురళి, వీణ మున్నగు రక రకాల వాయిద్య వినోదాలతో అంతఃపురంలో కొలువుతీరి మంజుల గానాలు ఆస్వాదిస్తున్నాడు. కవి, గాయక, సూత, వంది, మాగధాదుల స్తోత్రాలకు పరవశాలు పొందుతున్నాడు. నటనటీజనుల నాట్యాలతో, విదూషకుల సరస పరిహాస పలుకులు, మృదు మధురోక్తులతో పొద్దుపుచ్చుతూ ద్వారకలో ఆనందంగా ఉన్నాడు. అప్పుడు

తెభా-10.2-1324-మ.
విందాక్ష పదాంబుజాత యుగళధ్యానానురాగక్రియా
సాలాప విలోకనానుగత చంత్సౌఖ్య కేళీరతిం
రుణుల్ నూఱుపదాఱువేలు మహితోత్సాహంబునం జొక్కి త
త్పలై యొండు దలంప కుండిరి సవిభ్రాంతాత్మ లై భూవరా!

టీక:- అరవిందాక్ష = కృష్ణుని; పద = పాదములు అను; అంబుజాత = పద్మముల; యుగళ = జంట లందు; ధ్యాన = ధ్యానము చేయు; అనురాగ = అనురాగము కల; క్రియా = పను లందు; సరస = రసవంతములైన; ఆలాప = ముచ్చటల యందు; విలోకన = చూపులను; అనుగత = అనుసరించి మెలగు టందు; చంచత్ = చక్కటి; సౌఖ్యకేళీ = సుఖక్రీడల యందు; రతిన్ = ఆసక్తిచేత; తరుణుల్ = కృష్ణుని భార్యలు; నూఱుపదాఱువేలు = పదహారువేలవందమంది (16,100); మహిత = మిక్కుటమైన; ఉత్సాహంబునన్ = కుతూహలముతో; చొక్కి = పరవశులై; తత్ = అతని యందే; పరులు = లగ్నమైనవారు; ఐ = అయ్యి; ఒండున్ = ఇతరమేమి; తలంపకన్ = తలవకుండా; ఉండిరి = ఉన్నారు; సవిభ్రాంత = విభ్రమముకల; ఆత్మలు = మనసులు కలవారు; ఐ = అయ్యి; భూవరా = రాజా.
భావము:- ఓ రాజా! ఆ పదహారువేలవంద మంది శ్రీకృష్ణసతులు పద్మాక్షుని పాదారవిందాలపై అనురాగాలతో, సరససల్లాపాలుతో, మధుర వీక్షణలతో, మహా సౌఖ్యాలతో, కేళీరతులతో గొప్ప ఉత్సాహాలతో సొక్కి సోలుతూ ఉన్నారు. సంపూర్ణంగా శ్రీకృష్ణ తత్పరులై ఇతర ధ్యాసలు లేకుండా ఉన్నారు.

తెభా-10.2-1325-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండా.
భావము:- అంతేకాకుండా...

తెభా-10.2-1326-మ.
రినామాంకితమైన గీత మొకమా టాలించి మూఢాత్ములున్
వితిం బొందఁగఁజాలి యుందురట; యా విశ్వాత్ము నీక్షించుచుం
రిరంభించుచు, నంటుచున్నగుచుసంభాషించుచున్నుండు సుం
రు లానంద నిమగ్ను లౌట కిలఁ జోద్యం బేమి? భూవల్లభా! "

టీక:- హరి = కృష్ణుని; నామ = పేరులకు; అంకితము = గురుతుగా కలవి; ఐన = అయిన; గీతమున్ = పాటను; ఒక = ఒక; మాటు = మాటు; ఆలించి = విని; మూఢాత్ములున్ = తెలివిమాలినవారు; విరతిన్ = వైరాగ్యమును; పొందగన్ = పొందను; చాలి = సమర్థులై; ఉందురు = ఉంటారు; అట = అట; ఆ = ఆ; విశ్వాత్మున్ = కృష్ణుని; ఈక్షించుచున్ = చూస్తు; పరిరంభించుచున్ = ఆలింగనములు చేయుచు; అంటుచున్ = తాకుతు; నగుచున్ = పరిహాసములు చేయుచు; సంభాషించుచున్ = మాట్లాడుతు; ఉండు = ఉండెడి; సుందరులు = అందగత్తెలు; ఆనంద = ఆనందము నందు; మగ్నులు = మునిగిన వారు; ఔట = అగుట; కున్ = కి; ఇలన్ = ఈ లోకములో; చోద్యంబు = విచిత్రము; ఏమి = ఏమున్నది; భూవల్లభా = రాజా.
భావము:- మహారాజ! ఎంతటి మూఢాత్ములైనా హరినామ సంకీర్తనం ఒక్కసారి వింటేనే ముక్తిని పొందుతారుట. అలాంటిది ఆ మహానీయుడినే చూస్తూ; అతడిని కౌగలిస్తూ, తాకుతూ; అతనితో నవ్వుతూ, సంభాషిస్తూ; ఆ అంగనలు ఆనందపారవశ్యులు కావడంలో ఆశ్చర్యం ఏముంది?”

తెభా-10.2-1327-వ.
అని చెప్పి మఱియు నిట్లనియె.
టీక:- అని = అని; చెప్పి = చెప్పి; మఱియున్ = కను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని చెప్పి శుకమహర్షి మరల ఇలా అన్నాడు.

తెభా-10.2-1328-ఉ.
"వాక కృష్ణుఁ డిప్పగిది వైదికవృత్తి గృహస్థధర్మ మే
పారఁగఁ బూని ధర్మమును ర్థముఁ గామము నందుఁ జూపుచుం
గోరికమీఱ సజ్జనులకుం గతి దాన యనంగ నొప్పి సం
సారిగతిన్ మెలంగె నృపత్తమ! లోకవిడంబనార్థమై.

టీక:- వారక = ఎడతెగకుండ; కృష్ణుడు = కృష్ణుడు; ఈ = ఈ; పగిదిన్ = విధముగ; వైదిక = వేదములందు చెప్పబడిన; వృత్తిన్ = విధానము నందు; గృహస్థధర్మము = గృహస్థాశ్రమ ధర్మము {చతురాశ్రమములు - 1బ్రహ్మచర్యము 2గృహస్థ 3వానప్రస్థము 4సన్యాసము}; ఏపారగన్ = పెంపుదీరగా; పూని = అవలంబించి; ధర్మమును = ధర్మము, విధినిర్వహణ {చతుర్విధ పురుషార్థములు - 1ధర్మము (విధి నిర్వహణ) 2అర్థము (ప్రయోజనము) 3కామము (ఫలితము) 4మోక్షము (అంతిమ లక్ష్యము)}; అర్థమున్ = అర్థము, ప్రయోజనము; కామమున్ = కామమును, ఫలితము; అందున్ = దానిలో; చూపుచున్ = కనబరచుచు; కోరిక = ఇచ్చలు; మీఱన్ = తీరునట్లుగా; సజ్జనుల = సత్పురుషుల; కున్ = కు; గతి = దిక్కు; తాన = తనే; అనంగన్ = అనునట్లు; ఒప్పి = తగి ఉండి; సంసారి = గృహస్థుని; గతిన్ = వలె; మెలంగెన్ = వర్తించెను; నృపసత్తమ = రాజా; లోక = లౌకిక ధర్మములను; విడంబన = అనుసరించి మెలగుట; అర్థమై = కోసమై.
భావము:- “రాజోత్తమా! పరీక్షిత్తూ! ఈ విధంగా వేదోక్తమైన పద్ధతిలో గృహస్థధర్మాన్ని స్వీకరించి, ధర్మార్ధ కామాదులను సాధిస్తూ, ఉత్తములకు తానే దిక్కు అయి ఉంటూ, లోకం తనను అనుసరించి ఇలా నడవాలి అని తెలుసుకునేలా, తానూ ఒక సంసారిలా శ్రీకృష్ణుడు నటించాడు.

తెభా-10.2-1329-సీ.
రి యిట్లు గృహమేధి గుచు శతోత్తర-
షోడశసాహస్ర సుందరులను
మును నీకు నెఱుఁగఁ జెప్పిరీతి నందఱ-
న్నిరూపములు దా ర్థిఁ దాల్చి
కైకొని యొక్కక్క కామినీమణి యందు-
మణ నమోఘ వీర్యమునఁ జేసి
దురేసి కొడుకులం డసె రుక్మిణ్యాది-
ట్టమహిషులకుద్భవులు నైన

తెభా-10.2-1329.1-తే.
నందనులలోన ధరణి నెన్నంగ బాహు
ల పరాక్రమ విజయ సంద్విశేష
మాని తాత్ములు పదునెనమండ్రు; వారి
నెఱుఁగ వినిపింతు, వినుము రాజేంద్రచంద్ర! "

టీక:- హరి = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; గృహమేధి = గృహస్థుడు {గృహమేధి - గృహస్థాశ్రమ ధర్మమున కట్టుబడినవాడు, గృహస్థుడు}; అగుచున్ = వలెనుంటు; శతోత్తరషోడశసాహస్ర = పదహారువేలవందమంది (16,100); సుందరులను = అందగత్తెలను; మును = ఇంతకుముందు; నీ = నీ; కున్ = కు; ఎఱుగ = తెలియ; చెప్పిన = చెప్పనట్టి; రీతిన్ = విధముగ; అందఱన్ = అందరికి; అన్ని = అన్ని; రూపములున్ = ఆకృతులను; తానన్ = తనే; అర్థిన్ = కోరి; తాల్చి = ధరించి; కైకొని = చేపట్టి; ఒక్కొక్క = ప్రతి యొక్క; కామినీ = స్త్రీ; మణి = రత్నము; అందున్ = తోను; రమణనన్ = చక్కగా; అమోఘ = వ్యర్థముగాని; వీర్యమునన్ = వీర్యము; చేసి = వలన; పదురేసి = పదిమంది (10) చొప్పున; కొడుకులన్ = పుత్రులను; పడసెన్ = పొందెను; రుక్మిణి = రుక్మిణీదేవి; ఆది = మొదలగు; పట్టమహిషుల్ = పట్టముగట్టిన భార్యల; కున్ = కు; ఉద్భవులున్ = కలిగినవారు; ఐన = అయినట్టి.
నందనుల = కొడుకుల; లోన = అందు; ధరణిన్ = భూమ్మీద; ఎన్నంగన్ = ఎంచిచూడగా; బాహుబల = భుజబలము; పరాక్రమ = విక్రమము; విజయ = జయశీలము; సంపత్ = కలిమి యొక్క; విశేష = అధిక్యముచేత; మానిత = గౌరవింపదగిన; ఆత్ములు = స్వభావములు కలవారు; పదునెనమండ్రు = పద్దెనిమిది (18)మంది; వారిన్ = వారిని; ఎఱుగన్ = తెలియునట్లు; వినిపింతున్ = చెప్పెదను; వినుము = వినుము; రాజేంద్రచంద్ర = మహారాజా {రాజేంద్రచంద్రుడు - రాజులలో ఇంద్రుని వంటి చంద్రుని వంటి వాడు, మహారాజు}.
భావము:- పరీక్షిత్తు మహారాజా! ఈ విధంగా పదహారువేల సుందరీమణులకు అందరకూ అన్నిరూపాలు ధరించి గృహస్థుడై శ్రీకృష్ణుడు ఏలుకున్నాడు. అమోఘ వీర్యుడైన ఆ మహానుభావుడికి, వారిలో ఒక్కొక్కరి యందు పదిమంది చొప్పున పుత్రులు పుట్టారు. రుక్మిణి మొదలైన పట్టమహిషులకు పుట్టిన పుత్రులలో పదునెనిమిదిమంది భుజబల, పరాక్రమ, వైభవాలతో ప్రసిద్ధులయ్యారు. వారి పేర్లను చెప్తాను. శ్రద్ధగా విను.”

తెభా-10.2-1330-వ.
అని మఱియు నిట్లను; “వారలు ప్రద్యు మ్నానిరుద్ధ, దీప్తిమ ద్భాను, సాంబ, మిత్ర, బృహద్భాను, మిత్రవింద, వృ కారుణ, పుష్కర, దేవబాహు, శ్రుతదేవ, సునందన, చిత్రబాహు, వరూధ, కవి, న్యగ్రోధ, నామంబులం బ్రసిద్ధు లైరి; వెండియుఁ ద్రివక్ర యందు సంభవించిన యుపశ్లోకుం డనువాఁడు దన జనకుండైన కృష్ణు పాదారవింద సేవారతుండగుచు నారదయోగీంద్రునకు శిష్యుండై యఖండిత దివ్యజ్ఞాన బోధాత్మకుం డగుచు, స్త్రీ శూద్ర దాసజన సంస్కారకంబై స్మరణమాత్రంబున ముక్తిసంభవించునట్టి సాత్త్వత తంత్రం బను వైష్ణవస్మృతిం గల్పించె; నిట్లు మధుసూదననందనులు బహుప్రజలును, నధికాయురున్నతులును, ననల్పవీర్యవంతులును, బ్రహ్మణ్యులునై విఖ్యాతింబొందిరి; వారిని లెక్క వెట్టఁ బదివేల వత్సరంబులకైనం దీఱదు, మున్ను నీకెఱింగించి నట్లు తత్కుమారులకు విద్యావిశేషంబుల నియమించు గురు జనంబులు మూఁడుకోట్లునెనుబదెనిమిదివేలనూర్గు రనం గల్గి యుందు; రక్కుమారుల లెక్కింప నెవ్వరికి శక్యం? బదియునుం గాక యొక్క విశేషంబు సెప్పెద విను"మని యిట్లనియె.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనున్ = చెప్పెను; వారలు = వారు; ప్రద్యుమ్నా = ప్రద్యుమ్నుడు; అనిరుద్ధ = అనిరుద్ధుడు; దీప్తిమత్ = దీప్తిమంతుడు; భాను = భానుడు; సాంబ = సాంబుడు; మిత్ర = మిత్రుడు; బృహద్భాను = బృహద్భానుడు; మిత్రవింద = మిత్రవింద; వృక = వృకుడు; అరుణ = అరుణుడు; పుష్కర = పుష్కరుడు; దేవబాహు = దేవబాహుడు; శ్రుతదేవ = శ్రుతదేవుడు; సునందన = సునందనుడు; చిత్రబాహు = చిత్రబాహుడు; వరూధ = వరూధుడు; కవి = కవి; న్యగ్రోధ = న్యగ్రోధుడు; నామంబులన్ = అను పేర్లతో; ప్రసిద్ధులు = పేరుపొందినవారు; ఐరి = అయ్యారు; వెండియున్ = ఇంకను; త్రివక్ర = త్రివక్ర; అందున్ = అందు; సంభవించిన = పుట్టిన; ఉపశ్లోకుండు = ఉపశ్లోకుడు; అను = అనెడి; వాడు = వాడు; తన = తన యొక్క; జనకుండు = తండ్రి; ఐన = అయినట్టి; కృష్ణున్ = కృష్ణుని; పాద = పాదములు అను; అరవింద = పద్మముల; సేవా = సేవించు టందు; రతుండు = ఆసక్తి కలవాడు; అగుచున్ = ఔతు; నారద = నారదుడు అను; యోగి = ఋషి; ఇంద్రున్ = ఉత్తముని; కున్ = కి; శిష్యుండు = శిష్యుడు; ఐ = అయ్యి; అఖండిత = సమస్తమైన; దివ్యజ్ఞాన = బ్రహ్మవిద్యను; బోధా = బోధించెడి; ఆత్మకుండు = బుద్ధి కలవాడు; అగుచున్ = ఔతు; స్త్రీ = స్త్రీలకు; శూద్ర = శూద్రులకు; దాస = పరిచారకులు; జన = ఐనవారి; సంస్కారకంబు = సంస్కరించునది; ఐ = అయ్యి; స్మరణ = స్మరించుట, తలచుట; మాత్రంబునన్ = మాత్రము చేతనే; ముక్తిన్ = మోక్షము; సంభవించునట్టి = కలుగునట్టి; సాత్త్వతతంత్రంబు = సాత్త్వతతంత్రము; అను = అనెడి; వైష్ణవ = వైష్ణవ; స్మృతిన్ = ధర్మశాస్త్రమును; కల్పించెన్ = ఏర్పరచెను; ఇట్లు = ఈ విధముగ; మధుసూదన = కృష్ణుని; నందనులు = కొడుకులు; బహు = అధికమైన; ప్రజలును = పిల్లలు కలవారు; అధిక = ఎక్కువ; ఆయుః = ఆయుస్సుచేత; ఉన్నతులు = గొప్పవారు; అనల్ప = అధికమైన; వీర్యవంతులును = వీరత్వము కలవారు; బ్రహ్మణ్యులును = వేదధర్మము నడపువారు; ఐ = అయ్యి; విఖ్యాతిన్ = ప్రసిద్ధిని; పొందిరి = పొందారు; వారిని = వారలను అందరను; లెక్కపెట్టన్ = లెక్కపెట్టుటకు; పదివేల = పదివేల (10000); వత్సరంబుల్ = సంవత్సరముల; కైనన్ = కి అయినను; తీఱదు = పూర్తికాదు; మున్ను = ఇంతకు ముందు; నీ = నీ; కున్ = కు; ఎఱింగించిన = తెలిపిన; అట్లు = విధముగా; తత్ = ఆ; కుమారుల = బాలుర; కున్ = కు; విద్యా = విద్యలలోని; విశేషంబులన్ = నానా రకములకు; నియమించు =నేర్పెడి; గురు = ఉపాధ్యాయులైన; జనంబులు = వారు; మూడుకోట్ల = మూడు (3) కోట్ల; ఎనుబదెనిమిదివేల = ఎనభైఎనిమిది (88) వేల; నూర్గురు = వంద (100) మంది; అనన్ = వరకు; కల్గి = ఉండి; ఉందురు = టారు; ఆ = ఆ; కుమారులన్ = బాలురను; లెక్కింపన్ = లెక్కపెట్టుటకు; ఎవ్వరికిన్ = ఎవరికి మాత్రం; శక్యంబు = వశము అగును; అదియునున్ = అంతే; కాక = కాకుండా; ఒక్క = ఒకానొక; విశేషంబున్ = వృత్తాంతమును; చెప్పెదన్ = చెప్తాను; వినుము = వినుము; అని = అని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని శుకుడు పరీక్షుత్తుతో మళ్ళీ ఇలా అన్నాడు. “రుక్మిణి మున్నగు ఆ అష్టపట్టమహిషలకు కలిగిన పుత్రులలో ప్రసిద్ధులైనవారు పద్దెనిమిది మంది, వారు 1.ప్రద్యుమ్నుడు, 2.అనిరుద్ధుడు, 3.దీప్తిమంతుడు, 4.భానుడు, 5.సాంబుడు, 6,బృహద్భానుడు, 7.మధుడు, 8.మిత్రవిందుడు, 9.వృకుడు, 10.అరుణుడు, 11.పుష్కరుడు, 12.దేవబాహుడు, 13.శ్రుతదేవుడు, 14.సునందుడు, 15.చిత్రబాహువు, 16.వరూధుడు, 17.కవి, 18.న్యగ్రోధుడు అనేవారు. త్రివక్ర అనే ఆమెకి కృష్ణుని వలన పుట్టిన ఉపశ్లోకు డనేవాడు శ్రీకృష్ణభక్తుడై నారదునికి శిష్యుడై సాత్వతతంత్రం అనే వైష్ణవ స్మృతిగ్రంథాన్ని రచించాడు. స్త్రీలకూ శూద్రులకూ దాసజనానికి ఈ గ్రంథం పఠన మాత్రం చేతనే ముక్తిమార్గాన్ని అందిస్తుంది. ఈ విధంగా కృష్ణుడి పుత్రులు అసంఖ్యాకులై ఆయురార్యోగ్యాలతో, మహాబలంతో, బ్రహ్మణ్యులై, మహోన్నతులై ప్రకాశించారు. వారందరినీ లెక్కపెట్టడానికి పదివేలసంవత్సరాలైనా చాలవు. వారి కోసం నియమించబడిన గురువులే మూడుకోట్లఎనభైఎనిమిదివేలనూరుమంది ఉన్నారు ఇక శ్రీకృష్ణుని సంతతి లెక్కించడం ఎవరికి మాత్రం సాధ్యము అవుతుంది. అంతే కాదు మరొక మరొక విశేషం ఉంది చెప్తాను.” అని శుకుడు మళ్ళీ ఇలా చెప్పసాగాడు.

తెభా-10.2-1331-క.
"నవర! దేవాసుర సం
మును మును నిహతులైన క్రవ్యాద సము
త్కము నరేశ్వరులై ద్వా
మున జనియించి ప్రజల బాధలఁ బఱుపన్.

టీక:- నరవర = రాజా; దేవ = దేవతల; అసుర = రాక్షసుల; సంగరమున = యుద్ధము నందు; మును = పూర్వము; నిహతులు = చంపబడినవారు; ఐన = అయినట్టి; క్రవ్యాద = రాక్షసుల; సముత్కరము = సమూహములు; నరేశ్వరులు = రాజులు; ఐ = అయ్యి; ద్వాపరమునన్ = ద్వాపరయుగమున; జనియించి = పుట్టి; ప్రజలన్ = లోకులను; బాధలపఱుపన్ = బాధపెట్టగా.
భావము:- “ఓ నరేంద్రా! పూర్వం దేవదానవ సంగ్రామంలో మరణించిన రాక్షసులు అందరు ద్వాపరయుగంలో రాజులుగా పుట్టి ప్రజలను బాధించసాగారు.

తెభా-10.2-1332-క.
రి తద్వధార్థమై ని
ర్జరులను యదుకులము నందు నియింపింపం
నూటొక్క కులం బై
రఁగిరి; వారిని గణింప బ్రహ్మకు వశమే?

టీక:- హరి = కృష్ణుడు; తత్ = వారిని; వధ = చంపు; అర్థమున్ = కోసము; ఐ = అయ్యి; నిర్జరులను = దేవతలను {నిర్జరులు - జర (ముసలితనము) లేనివారు, దేవతలు}; యదుకులము = యదువంశము; అందున్ = అందు; జనియింపింపన్ = పుట్టించగా; ధరన్ = భూమిమీద; నూటొక్క = నూటఒకటి (101); కులంబు = వంశములు; ఐ = కలవారై; పరగిరి = ప్రసిద్ధులైరి; వారిని = వారలను అందరను; గణింపన్ = లెక్కంచుట; బ్రహ్మ = బ్రహ్మదేవున; కున్ = కైనను; వశమే = శక్యమా, కాదు.
భావము:- విష్ణుమూర్తి ఆ రాక్షసులను చంపడం కోసం దేవతలను యదుకులంలో జన్మించేలా చేసాడు. అందువలన, యాదవుల యందు నూటొక్క కులాలు ఏర్పడ్డాయి. వారిని అందరిని లెక్కపెట్టడం బ్రహ్మదేవుడికి కూడ సాధ్యం కాదు.