పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/అనిరుద్ధుని నాగపాశ బద్ధంబు

అనిరుద్ధుని నాగపాశబద్ధంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/అనిరుద్ధుని నాగపాశ బద్ధంబు)
రచయిత: పోతన



తెభా-10.2-380-సీ.
నియె శుభోపేతుఁ, గందర్పసంజాతు-
మానితదేహు, నాజానుబాహు,
కరకుండలకర్ణు, హితప్రభాపూర్ణుఁ-
జిరయశోల్లాసుఁ, గౌశేయవాసుఁ,
స్తూరికాలిప్తు, నకాంతికుముదాప్తు-
హారశోభితవక్షు, నంబుజాక్షు,
దువంశతిలకు మత్తాలినీలాలకు-
వపుష్పచాపుఁ, బూర్ణప్రతాపు,

తెభా-10.2-380.1-తే.
భినవాకారు, నక్షవిద్యావిహారు,
హితగుణవృద్ధు, మన్మథమంత్రసిద్ధుఁ,
లితపరిశుద్ధు, నఖిలలోప్రసిద్ధుఁ,
తురు, ననిరుద్ధు, నంగనాననిరుద్ధు.

టీక:- కనియెన్ = చూసెను; శుభ = శుభములతో; ఉపేతున్ = కూడుకొన్నవానిని; కందర్ప = మన్మథుని, ప్రద్యుమ్నుని; సంజాతున్ = పుత్రుని; మానిత = ఉన్నతమైన; దేహున్ = దేహము కలవానిని; ఆజానబాహున్ = ఆజానుబాహుని {ఆజానుబాహుడు - మోకాళ్ళానునట్లు వేలాడెడి చేతులు కలవాడు}; మకరకుండల = మకరకుండలములు కల; కర్ణున్ = చెవులు కలవానిని; మహిత = గొప్ప; ప్రభా = తేజస్సుతో; ఆపూర్ణున్ = నిండుగా ఉన్నవానిని; చిర = మిక్కిలి; యశః = కీర్తిచేత; ఉల్లాసున్ = ప్రకాశించువానిని; కౌశేయవాసున్ = పట్టు బట్టలు కలవానిని; కస్తూరికా = కస్తూరి గంధము; ఆలిప్తున్ = పూసుకొన్నవానిని; ఘన = గొప్ప; కాంతిన్ = ప్రకాశము చేత; కుముదాప్తున్ = చంద్రుని వంటివానిని; హార = ముత్యాలపేర్లుచేత; శోభిత = ప్రకాశించునట్టి; వక్షున్ = వక్షస్థలము కలవానిని; యదు = యాదవ; వంశ = వంశమునకు; తిలకున్ = అలంకారమైన వానిని; మత్త = మదించిన; అలి = తుమ్మెదల వంటి; నీల = నల్లని; అలకున్ = ముంగురులు కలవానిని; నవ = నవ, కొత్త; పుష్పచాపున్ = మన్మథుని; పూర్ణ = కొరతలేని; ప్రతాపున్ = పరాక్రమము కలవానిని; అభినవ = నవనవాన్వితమైన; ఆకారున్ = స్వరూపము కలవాడు; అక్షవిద్యా = జూదమునందు; విహారున్ = తిరుగువాడు; మహిత = గొప్ప; గుణ = సుగుణములచే; వృద్ధున్ = గొప్పవానిని; మన్మథమంత్ర = రతితంత్రమునందు; సిద్ధున్ = సిధ్దిపొందినవానిని; కలిత = కూడి యున్న; పరిశుద్ధున్ = పరిశుద్ధము కలవానిని; అఖిల = సర్వ; లోక = లోకములందు; ప్రసిద్ధున్ = పేరుపొందినవానిని; చతురున్ = నేర్పరి; అనిరుద్ధున్ = అనిరుద్ధుని; అంగానాజన = స్త్రీలవద్ద; అనిరుద్ధు = అడ్డగింపబడనివాడు;
భావము:- (అక్కడ అంతఃపురంలో) శుభకరుడు, మన్మథావతారుడు, చక్కటి రూపువాడు, ఆజానుబాహుడు, మకరకుండలాలతో నిండు తేజస్సుతో విరాజిల్లుచున్నవాడు, గొప్పయశోమూర్తి, పట్టుబట్టలు కస్తూరికాగంధము ధరించి చంద్రుడి వలె ప్రకాశిస్తున్న వాడు, వక్షస్థలమున ముత్యాల హారాలు ధరించిన వాడు, మదించిన తుమ్మెదల వలె నుదుట వాలిన నల్లని ముంగురులు గలవాడు, నవమన్మథ రూపుడు, నిండు పరాక్రమంతో విలసిల్లుతున్నవాడు, నననవాన్వితాకారుడు, సుగుణోపేతుడు, రతితంత్ర సిద్ధుడు, అమలినుడు, మానినుల వద్ద మసలుకొను మర్యాద తెలిసిన వాడు, బహు చతురుడు అని పేరుపొందిన వాడు, యాదవ వంశోత్తముడు అయిన అనిరుద్ధుడు విలాసంగా జూదము ఆడుతుండాగా ఆ రాక్షసరాజు చూసాడు.

తెభా-10.2-381-చ.
ని కన లగ్గలింప సురకంటకుఁ డుద్ధతి సద్భటావళిం
నుఁగొని "యీనరాధమునిఁ ట్టుఁడు; పట్టుఁడు; కొట్టుఁ"డన్న వా
నుపమ హేతిదీధితు లర్పతి తేజము మాయఁజేయ డా
సి నృపశేఖరుండు మదిఁ జేవయు లావును నేర్పు దర్పమున్.

టీక:- కని = కని; కనలు = కోపము; అగ్గలింపన్ = అతిశయించగా; సురకంటకుడు = బాణాసురుడు {సుర కంటకుడు - దేవతలకు శత్రువు, రాక్షసుడు}; ఉద్ధతిన్ = అతిశయముతో; సద్భట = కావలి యోధుల; ఆవళిన్ = సమూహమును; కనుగొని = చూసి; ఈ = ఈ; నర = మానవులలో; అధమునిన్ = అల్పుడిని; కట్టుడు = బంధించండి; పట్టుడు = పట్టుకొనండి; కొట్టుడు = కొట్టండి; అన్నన్ = అనగా; వారు = వారు; అనుపమ = సాటిలేని; హేతి = కత్తుల; దీధితులన్ = కాంతులతో; అహర్పతి = సూర్యుని; తేజమున్ = తేజస్సును; మాయన్ = మాసిపోవునట్లు; చేయన్ = చేయుచుండగా; డాసినన్ = సమీపించగా; నృప = రాజులలో; శేఖరుండు = శ్రేష్ఠుడు; మదిన్ = మనసు నందు; చేవయున్ = సామర్థ్యము; లావునున్ = బలము; నేర్పు = చాతుర్యము; దర్పమున్ = దర్పము.
భావము:- విపరీతమైన కోపంతో మండిపడుతూ ఆ దేవద్వేషి బాణుడు భటులతో “ఈ మానవాధముడిని బంధించండి! కొట్టండి!” అని ఆజ్ఞాపించాడు. ఆ రాక్షసభటులు సూర్యకాంతిని ధిక్కరించే కాంతులతో శోభించే ఆయుధాలతో అనిరుద్ధుని బంధించడానికి వెళ్ళారు. ఆ రాజశేఖర కుమారకుడు తన చేవ, బల, దర్పములు చూపుతూ....

తెభా-10.2-382-చ.
లిగి మహోగ్రవృత్తిఁ బరిఘంబు గరంబున లీలఁ దాల్చి దో
ర్బ ఘనవిక్రమప్రళయభైరవు భంగి విజృంభణక్రియా
న నెదిర్చె దానవ నికాయముతోఁ దలపాటుఁబోటునుం
ముబలంబు ధైర్యమునుశౌర్యము వ్రేటునువాటుఁజూపుచున్

టీక:- కలిగి = ఉండుటచేత; మహా = మిక్కిలి; ఉగ్ర = భయంకరమైన; వృత్తిన్ = రీతిగా; పరిఘంబున్ = ఇనపకట్ల గుదియ; లీలన్ = విలాసముగా; తాల్చి = ధరించి; దోర్బల = భుజబలము యొక్క; ఘన = గొప్ప; విక్రమ = పరాక్రమముచేత; ప్రళయ = ప్రళయ కాలపు; భైరవు = భైరవుని; భంగిన్ = వలె; విజృంభణ = విజృంభించెడి; క్రియా = విధమైన; కలనన్ = యుద్ధమున; ఎదిర్చెన్ = ఎదిరించెను; దానవ = రాక్షసుల; నికాయము = సమూహము; తోన్ = తోటి; తలపాటున్ = తలపడుట; పోటునున్ = పరాక్రమము; చలమున్ = పట్టుదల; బలంబున్ = శక్తి; ధైర్యమున్ = ధైర్యము; శౌర్యము = శూరత్వము; వ్రేటును = కొట్టుటను; పాటున్ = పడవేయుట; చూపుచున్ = చూపించుచు.
భావము:- అప్పుడు ఆ అనిరుద్ధుడు అనివార్య శౌర్యసాహసాలతో ఇనుపకట్ల గుదియను చేపట్టి, ప్రళయకాల భైరవుడిలా మహోగ్రంగా విజృంభించి, మిక్కిలి పోరాట పటిమతో దానవసేనను ఎదిరించాడు. తన శక్తియుక్తులను శౌర్యధైర్యాలనూ ప్రదర్శించాడు...

తెభా-10.2-383-చ.
ములుబాహులుందలలు ప్రక్కలుచెక్కులుజానుయుగ్మముల్‌
ములుగర్ణముల్‌ మెడలురంబులుమూఁపులువీఁపులూరువుల్‌
చిదురుపలై ధరం దొఱఁగఁ జిందఱవందఱ సేయ సైనికుల్‌
న పరాఙ్ముఖక్రమముఁ గైకొని పాఱిరి కాందిశీకులై.

టీక:- పదములున్ = కాళ్ళు; బాహులున్ = చేతులు; తలలు = శిరస్సులు; ప్రక్కలు = పక్కభాగములు; చెక్కులున్ = చెక్కిళ్ళు; జాను = మోకాళ్ళ; యుగ్మముల్ = జంటలు; రదములున్ = దంతములు; కర్ణముల్ = చెవులు; మెడలు = కంఠములు; ఉరంబులున్ = వక్షస్థలములు; మూపులు = భుజములు; వీపులు = వీపులు; ఊరువుల్ = తొడలు; చిదురుపలు = చిన్నచిన్నముక్కలు; ఐ = అయ్యి; ధరన్ = భూమిమీద; తొఱగన్ = పడగా; చిందఱవందఱ = ఛిన్నాభిన్నము; చేయన్ = చేయగా; సైనికుల్ = భటులు; కదన = యుద్ధమునకు; పరాఙ్ముఖ = పెడముఖము అగు; క్రమమున్ = విధమును; కైకొని = అవలంబించి; పాఱిరి = పారిపోయిరి; కాందిశీకులు = వెఱపుతో పారిపోవు వారు; ఐ = అయ్యి.
భావము:- అనిరుద్ధుడి యుద్ధకౌశలానికి ఆ రాక్షససైనికుల పాదాలు, చేతులు, మోకాళ్ళు, తొడలు, మెడలు, వీపులు, మూపులు, తలలు, పండ్లు, చెవులు చిన్నచిన్న ముక్కలుగా నేలంతా చిందరవందరగా పడ్డాయి. ఆ వీరుడితో యుద్ధం చేయలేక దైత్యసైనికులు రణరంగం నుండి వెనుదిరిగి పారిపోయారు.

తెభా-10.2-384-వ.
ఇవ్విధంబున సైన్యంబు దైన్యంబునొంది వెఱచియుం, బఱచియు, విచ్చియుం, జచ్చియుఁ, గలంగియు, నలంగియు, విఱిగియు, సురిఁగియుఁ, జెదరియు బెదరియుఁ, జేవదఱిఁగి నుఱుములై తన మఱుఁగు సొచ్చిన, బాణుండు శౌర్యధురీణుండును, గోపోద్దీపిత మానసుండునై కదిసి యేసియు, వ్రేసియుఁ, బొడిచియు, నడిచియుఁ, బెనంగి
టీక:- ఈ = ఈ; విధంబునన్ = రీతిగా; సైన్యంబు = సైన్యము; దైన్యంబున్ = దీనత్వమును; ఒంది = పొంది; వెఱచియున్ = భయపడిపోయి; పఱచియున్ = పారిపోయి; విచ్చియున్ = విడిపోయి; కలంగియున్ = కలతచెంది; విఱిగియున్ = వెనుదీసి; సురిగియున్ = దాగి; చెదరియున్ = చెదిరిపోయి; బెదరియున్ = బెదిరిపోయి; చేవన్ = బలము; తఱిగి = తగ్గిపోయి; నుఱుములు = నలిచేయబడుట, పొడిచేయబడుట; ఐ = చెంది; తన = అతని; మఱుగునన్ = చాటుకి; చొచ్చినన్ = చేరగా; బాణుండు = బాణుడు; శౌర్య = పరాక్రమము; ధురీణుండును = వహించినవాడు; కోప = కోపముచేత; ఉద్దీపిత = ఉద్రేకించిన; మానసుండున్ = మనస్సు కలవాడు; ఐ = అయ్యి; కదిసి = చేరి; ఏసియున్ = బాణములు వేసి; వ్రేసియున్ = కత్తితో కొట్టి; పొడిచియున్ = శూలముతో పొడిచి; అడచియున్ = గదతో అణచి; పెనంగి = పెనుగులాడి;
భావము:- ఈ విధంగా దానవసైన్యం చేవచచ్చి, నొచ్చి, విచ్చి, భయంతో, చెదరి బెదరి, పారిపోయి వచ్చి బాణాసురుని అండకై వెనుక చేరింది. పరమ పరాక్రమశాలి అయిన బాణాసురుడు శౌర్యక్రోధాలతో అనిరుద్ధుని ఎదిరించి భీకర యుద్ధం చేసాడు.

తెభా-10.2-385-క.
క్రుద్ధుండై యహిపాశ ని
ద్ధుం గావించె నసురపాలుఁడు రణ స
న్నద్ధున్, శరవిద్ధు, న్నని
రుద్ధున్, మహితప్రబుద్ధు, రూపసమృద్ధున్.

టీక:- క్రుద్ధుండు = కోపించినవాడు; ఐ = అయ్యి; అహిపాశ = నాగపాశముచేత {నాగ పాశము - వరుణుని ఆయుధము, (ఇది ప్రయోగింపబడిన వాని చలనములు బంధింపబడును)}; నిబద్ధున్ = కట్టుబడ్డవాని; కావించెన్ = చేసెను; అసురపాలుడు = బాణాసురుడు; రణ = యుద్ధమునకు; సన్నద్ధున్ = సిద్ధముగా ఉన్నవానిని; శరవిద్ధున్ = బాణములు నాటినవానిని; అనిరుద్ధున్ = అనిరుద్ధుని; మహిత = గొప్ప; ప్రబుద్ధున్ = మంచి బుద్ధులు కలవానిని; రూప = అందము; సమృద్ధున్ = అధికముగా కలవానిని.
భావము:- ఈవిధంగా బాణాసురుడు కోపంతో విజృంభించి, వంటినిండా నాటిన బాణాలతో ఉన్న రూపసమృద్ధుడూ, రణసన్నద్ధుడూ, బుద్ధిమంతుడు అయిన అనిరుద్ధుడిని నాగపాశంతో బంధించాడు.

తెభా-10.2-386-వ.
ఇట్లు కట్టిత్రోచిన నుషాసతి శోకవ్యాకులితచిత్తయై యుండె నంత.
టీక:- ఇట్లు = ఈ విధముగ; కట్టి = బంధించి; త్రోచినన్ = తోసివేయగా; ఉషాసతి = ఉషాదేవి; శోక = దుఃఖముచేత; వ్యాకులిత = కలత చెందిన; చిత్త = మనస్సు కలామె; ఐ = అయ్యి; ఉండెను = ఉండెను; అంతన్ = అప్పుడు.
భావము:- తన ప్రియుడైన అనిరుద్ధుడిని తన తండ్రి ఈవిధంగా బంధించటం చూసిన ఉషాకాంత శోకసంతప్త హృదయరాలైంది. ఇంతలో...

తెభా-10.2-387-క.
నీపటాంచితమై సువి
శాలంబై వాయునిహతిఁ జండధ్వని నా
భీమగు నతని కేతన
మాలోన నకారణంబ వనిం గూలెన్.

టీక:- నీల = నల్లని; పట = బట్టచేత; అంచితము = అలంకరింపబడినది; ఐ = అయ్యి; సు = మిక్కిలి; విశాలంబు = పెద్ధది; ఐ = అయ్యి; వాయు = గాలి; నిహతిన్ = తగులుటచేత; చండ = గట్టి; ధ్వనిన్ = శబ్దముతో; ఆభీలము = భయంకరము; అగు = ఐన; అతని = అతని (బాణుని); కేతనము = జండా; ఆలోనన్ = అంతలోనే; అకారణంబ = కారణము లేకుండ; అవనిన్ = నేలపై; కూలెన్ = పడిపోయెను.
భావము:- ఆ సమయంలో, ఏ కారణం లేకుండానే బలంగా వీచిన గాలిదెబ్బకే నీలవస్త్రంతో సువిశాల మైన బాణాసురుని జెండా భయంకర ధ్వని చేస్తూ నేలకూలింది.

తెభా-10.2-388-క.
ది చూచి దనుజపాలుఁడు
నాంతకుఁ డాడినట్టి మాట నిజముగాఁ
నంబు గలుగు ననుచును
నెదురెదురే చూచుచుండె నెంతయుఁ బ్రీతిన్.

టీక:- అది = దానిని; చూచి = చూసి; దనజపాలుడు = బాణాసురుడు; మదనాంతకుడు = శివుడు {మద నాంతకుండు - మన్మథుని దేహము అంతము చేసినవాడు, శివుడు}; ఆడినట్టి = పలికినట్టి; మాట = పలుకు; నిజము = తథ్యమైనది; కాన్ = అగునట్లు; కదనంబున్ = యుద్ధము; కలుగున్ = జరుగును; అనుచునున్ = అంటు; ఎదురు = ప్రతివిరోధికై; ఎదురేచూచుచుండె = ప్రతీక్షించుచుండెను; అంతయున్ = అంతట; ప్రీతిన్ = ఇష్టపూర్వకముగా;
భావము:- అలా పడిన తన జెండాకొయ్యను చూసిన ఆ దానవరాజు సంతోషపడి, “ఆ మన్మథహారి మహేశ్వరుడు పలికిన మాటలు నిజమయ్యే సమయం వచ్చింది; ఇక తనకు తగిన వాడితో పోరు దొరుకుతుం” దని భావించి ఎంతో ఆశక్తితో ఎదురుచూడసాగాడు.

తెభా-10.2-389-వ.
అంత నక్కడ.
టీక:- అంతన్ = ఆ సమయము నందు; అక్కడ = అక్కడ.
భావము:- ఆ సమయంలో అక్కడ ద్వారకలో......

తెభా-10.2-390-క.
ద్వాకలో ననిరుద్ధకు
మారుని పోకకును యదుసమాజము వగలం
గూరుచు నొకవార్తయు విన
నేక చింతింప నాల్గునెల లరిగె నృపా!

టీక:- ద్వారక = ద్వారకానగరము; లోనన్ = అందు; అనిరుద్ధ = అనిరుద్ధుడు అను; కుమారునిన్ = పిల్లవాని యొక్క; పోక = వెళ్ళిపోవుట; కునున్ = కు; యదు = యాదవ; సమాజము = సమూహము అంతా; వగలన్ = విచారము లందు; కూరుచున్ = చెందుతూ; ఒక = ఒక్కటైనా; వార్త = విషయము; విననేరక = వినజాలక పోవుటచేత; చింతింపన్ = దుఃఖించుచుండగా; నాల్గు = నాలుగు (4); నెలలు = మాసములు; అరిగెన్ = గడచినవి; నృపా = పరీక్షిన్మహారాజా.
భావము:- ఓ రాజా! పరీక్షిత్తూ! ఇక అక్కడ ద్వారకానగరంలో అనిరుద్ధుడు మాయమై నందుకు యాదవులు అంతా విచారించారు. వారికి నాలుగు నెలల గడచినా అనిరుద్ధుడిని గురించి ఏ వార్తే తెలియ లేదు.