పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/హిరణ్యాక్షుని దిగ్విజయము
తెభా-3-612-వ.
అయ్యవసరంబున, నతుల తేజోవిరాజితుం డైన హిరణ్యకశిపుండు హిరణ్యగర్భ వరదాన గర్వంబునను; దుర్వార పరిపంథి గర్వ నిర్వాపణాఖర్వ భుజావిజృంభణంబునను; నిఖిల లోకపాలాదుల జయించి స్వవశం బొనర్చి సంతుష్టాంతరంగుం డై యెందునుం దనకు మృత్యుభయంబు లేక నిర్భయుండై సుఖం బుండెఁ; దత్సోదరుం డైన హిరణ్యాక్షుండు ప్రతిదినంబుఁ జండవేదండశుండాదండమండిత భుజాదండంబున గదాదండంబు ధరియించి తన్ను నెదిరి కదనంబు సేయం జాలిన యరివీరునిం గానక; భూలోకం బెల్లఁ గ్రుమ్మరి దివంబునకు దాడి వెట్టి; యందు సమర విముఖులయిన బర్హిర్ముఖులం గనుంగొని వనజాసన వరప్రదానంబుఁ జింతించి; హితులు సెలంగ నహితులు గలంగ మహిత వైజయంతికాదామం బభిరామంబై వెలుంగం జరణంబుల మణినూపురంబులు మొరయ; నిజదేహద్యుతి దిక్కులం బిక్కటిల్లం జనుదెంచు వానిం గని; భీతచిత్తు లయి దేవతాగణంబులు గరుడునిం గని పఱచు నురగంబులుంబోలె నిజనివాసంబు లర్కనివాసంబులు గాంచనావాసంబులుంగా నొనర్చి యెక్కడికేనిం జనిన.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో; అతుల = సాటిలేని; తేజస్ = తేజస్సుతో; విరాజితుండు = ప్రకాశిస్తున్నవాడు; ఐన = అయిన; హిరణ్యకశిపుండు = హిరణ్యకశిపుడు; హిరణ్యగర్భ = బ్రహ్మదేవునిచేత; వర = వరమును; దాన = ఇవ్వబడుటవలని; గర్వంబునను = గర్వముతోను; దుర్వార = వారింరాని; పరిపంథి = ప్రతిపక్షుల; గర్వ = గర్వమును; నిర్వాపణ = పోగొట్టుటలో; అఖర్వ = కురచ కానట్టి; భుజా = బాహుబల; విజృంభణమునన్ = అతిశయముతో; నిఖిల = సమస్తమైన; లోక = లోకములను; పాల = పాలించువారు; ఆదుల = మొదలగువారిని; జయించి = జయించి; స్వ = తన; వశంబున్ = వశము; ఒనర్చి = చేసికొని; సంతుష్ట = సంతృప్తి పొందిన; అంతరంగుడు = మనసు కలవాడు; ఐన = అయ్యి; ఎందునున్ = దేనిలోను; తనకున్ = తనకు; మృత్యు = చావువలని; భయంబు = భయము; లేక = లేకపోవుటచే; నిర్భయుడు = భయము లేనివాడు; ఐ = అయ్యి; సుఖంబున్ = సౌఖ్యముగా; ఉండెన్ = ఉండెను; తత్ = అతని; సోదరుండు = సహోదరుడు; ఐన = అయినట్టి; హిరణ్యాక్షుండు = హిరణ్యాక్షుడు; ప్రతి = ప్రతి ఒక్క; దినంబున్ = రోజూ; చండ = భయంకరమైన; వేదండ = ఏనుగు; శుండాదండ = తొండమువలె; మండిత = అలంకరింపబడిన; భుజా = భుజము అను; దండంబునన్ = దండము నందు; గదాదండంబున్ = గదాయుధమును; ధరియించి = ధరించి; తన్నున్ = తనను; ఎదిరి = ఎదిరించి; కదనంబున్ = యుద్ధమును; చేయన్ = చేయుటకు; చాలిన = సరిపడు; అరి = శత్రు; వీరునిన్ = వీరుడిని; కానక = కనుగొనలేక; భూలోకంబున్ = భూలోకము; ఎల్లన్ = అంతయు; క్రుమ్మరి = తిరిగి; దివంబున్ = స్వర్గమున; కున్ = కు; దాడివెట్టి = దండెత్తి; అందు = అక్కడ; సమర = యుద్ధమునకు; విముఖులు = అంగీకరింపనివారు; అయిన = అయిన; బర్హిర్ముఖులన్ = దేవతలను {బర్హిర్ముఖుడు – వ్యు. 1. (బర్హిముఖన్ అస్య -పృషో), బ.వ్రీ., వ్యాపించు మోము కలవాడు, దేవత; 2. (బర్హిః ముఖ అస్య), బ.వ్రీ., అగ్ని ముఖముగా కలవాడు, దేవత (ఆంధ్ర శబ్దరత్నాకరము)}; కనుగొని = చూసి; వనజాసన = బ్రహ్మదేవునిచేత; వర = వరముగ; ప్రదానంబున్ = ప్రసాదింపబడిన దానిని; చింతించి = తలచుకొని; హితులు = ఇష్టులు; చెలంగన్ = చెలరేగగా; అహితులు = అయిష్టులు; కలంగన్ = కలతపడగా; మహిత = గొప్ప; వైజయంతిక = విజయసూచికమైన; దామంబున్ = దండను; అభిరామంబున్ = మనోజ్ఞముతో; వెలుగన్ = ప్రకాశిస్తుండగ; చరణంబులన్ = పాదములకు; మణి = మణులు పొదిగిన; నూపురంబులు = అందెలు; మొరయ = చప్పుడు చేస్తుండగ; నిజ = తన; దేహ = శరీరము యొక్క; ద్యుతి = కాంతి; దిక్కులన్ = దిక్కులంతా; పిక్కటిల్లన్ = మోగిపోతుండగ; చనుదెంచు = వచ్చు; వానిన్ = వానిని; కని = చూసి; భీత = భయపడిన; చిత్తులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; దేవతా = దేవతల; గణంబులున్ = గణములు; గరుడునిన్ = గరుత్మంతుని; కని = చూసి; పఱచు = పారిపోవు; ఉరగంబులన్ = పాములు; పోలె = వలె; నిజ = తమ; నివాసంబులున్ = గృహములను; అర్క = జిల్లెళ్ళు; నివాసంబులున్ = మొలిచిన ప్రదేశముగా; కాంచన = ఉమ్మెత్తచెట్లకు; ఆవాసంబులున్ = నివాసములును; కాన్ = అగునట్లు; ఒనర్చి = చేసి; ఎక్కడికేనిన్ = ఎక్కడకో; చనిన = వెళ్లిపోగ;
భావము:- అప్పుడు సాటిలేని తేజస్సుతో విరాజిల్లుతున్న హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని వల్ల వరాలు పొందిన గర్వంతోను, వారింపరాని శత్రువుల ఉక్కడగించే అవక్రపరాక్రమం యొక్క అతిశయంతోను సమస్త లోకపాలకులను జయించి తనవశం చేసుకొని తన కెక్కడా మృత్యుభయం లేక నిర్భయుడై సుఖంగా ఉన్నాడు. అతని సోదరుడైన హిరణ్యాక్షుడు ప్రతిరోజూ మదపుటేనుగు తొండంవంటి తన భుజాదండం మీద గదాదండాన్ని ధరించి తనను ఎదిరించి యుద్ధం చేయగలిగిన శత్రువీరుడు ఎక్కడా కనిపించక భూలోకమంతా తిరిగి స్వర్గంపై దండెత్తి అక్కడ యుద్ధచేయడానికి ఇష్టపడని దేవతలను చూచాడు. హితులు చెలరేగగా, శత్రువులు కలతపడగా అందమైన వైజయంతీమాలను ధరించి, కాలి గండపెండేరాలు మ్రోగుతుండగా, తన దేహకాంతి నాలుగుదిక్కుల్లో పిక్కటిల్లగా వస్తున్న హిరణ్యాక్షుని చూచి దేవతలు బ్రహ్మ వరాన్ని గుర్తుకు తెచ్చుకొని భయపడి గరుత్మంతుని చూచి పారిపోయే పాములవలె తమ మందిరాలను జిల్లేళ్ళకు, ఉమ్మెత్తలకు నివాసాలుగా చేసి ఎక్కడెక్కడికో పారిపోయారు.
తెభా-3-613-ఉ.
శౌర్యము వోవఁదట్టి నిజసాధనముల్ దిగనాడి విక్రమౌ
దార్యపరాక్రమక్రమము దప్పఁగ భీతిలి పాఱి రక్కటా
కార్యముఁ దప్పి నాకులని గైకొని యార్చి సుమేరుపర్వత
స్థైర్యుఁడు వార్థిఁ జొచ్చె నతి దర్పిత భూరి భుజావిజృంభియై.
టీక:- శౌర్యమున్ = పౌరుషమును; పోవదట్టి = పోగొట్టుకొని; నిజ = తమ; సాధనములన్ = ఆయుధములను; దిగనాడి = విడిచిపెట్టి; విక్రమ = శౌర్యము; ఔదార్య = ఉదారబుద్ధి; పరాక్రమక్రమము = శత్రువులను జయించు సామర్థ్యములు; తప్పగన్ = తొలగిపోగా; భీతిలి = భయపడిపోయి; పాఱిరి = పారిపోయిరి; అక్కటా = అయ్యో; కార్యమున్ = వివాదమును; తప్పిన్ = పోగొట్టుకొనిన; నాకులు = దేవతలు; అని = అని; కైకొని = పూనుకొని; ఆర్చి = అరచి; సుమేరు = సుమేరు అను; పర్వత = పర్వతమంత; స్థైర్యుడు = స్థైర్యము కలవాడు; వార్థిన్ = సముద్రమును; చొచ్చెన్ = చొరబడెను; అతి = మిక్కిలి; దర్పిత = గర్వించిన; భూరి = బహుమిక్కిలి; భుజా = బాహుబలము; విజృంభి = అతిశయించినవాడు; ఐ = అయ్యి.
భావము:- “పౌరుషం పోగొట్టుకొని, తమ ఆయుధాలను విడిచిపెట్టి దేవతలు భయపడి కర్తవ్యాన్ని విస్మరించి పారిపోయారు కదా” అని సింహగర్జన చేసి మేరుపర్వతం వంటి స్థైర్యం కలిగిన హిరణ్యాక్షుడు గొప్ప భుజబలంతో, విజృంభించిన గర్వాతిశయంతో సముద్రంలో ప్రవేశించాడు.
తెభా-3-614-వ.
ఇట్లు సొచ్చిన.
టీక:- ఇట్లు = ఈవిధముగ; చొచ్చినన్ = చొరబడగా.
భావము:- ఈ విధంగా ప్రవేశించగా...
తెభా-3-615-క.
వరుణుని బలములు దనుజే
శ్వరుతేజముఁ దేఱి చూడజాలక శౌర్య
స్ఫురణము సెడి యెందేనిని
బఱచెం దజ్జలధి మధ్యభాగము నందున్.
టీక:- వరుణుని = వరుణదేవుని; బలములు = సైన్యములు; దనుజ = రాక్షస; ఈశ్వరు = ప్రభువు; తేజమున్ = తేజస్సును; తేఱి = తేరిపార; చూడన్ = చూడ; చాలక = లేక; శౌర్య = శౌర్యము; స్ఫురణన్ = స్ఫురించుటకూడ; చెడి = చెడిపోయి; ఎందేనినిన్ = ఎక్కడకైన; పఱచెన్ = పారిపోయెను; తత్ = ఆ; జలధి = సముద్రము యొక్క {జలధి - జలము (నీటి)కి నిధి (నివాసము) ఐనది, సముద్రము}; మధ్య = మధ్యలోని; భాగము = ప్రదేశము; అందున్ = లోపలికి;
భావము:- వరుణదేవుని సైనికులు హిరణ్యాక్షుని తేజాన్ని తేరిపార చూడలేక, పౌరుషం కోల్పోయి సముద్రం మధ్యభాగంలో ఎక్కడికో పారిపోయారు.
తెభా-3-616-క.
అమరారి విపుల నిశ్శ్వా
సములం బ్రభవించి నట్టి జలనిధి కల్లో
లములను విపుల గదాదం
డంబునఁ బోనడచె నతి దృఢం బగు శక్తిన్.
టీక:- అమరారి = హిరణ్యాక్షుడు {అమరారి - అమరులు (దేవతలు)కు అరి (శత్రువు), రాక్షసుడు, హిరణ్యాక్షుడు}; విపుల = దీర్ఘమైన; నిశ్వాసములన్ = నిట్టూర్పులవలన; ప్రభవించినన్ = పుట్టిన; అట్టి = అటువంటి; జలనిధి = సముద్రము నందలి; కల్లోలములనున్ = కల్లోలములను; విపుల = పెద్దదైన; గదాదండంబున్ = గదతో; పోనడచెన్ = పోగొట్టెను; అతి = మిక్కిలి; దృఢంబు = గట్టిది; ఐన = అయిన; శక్తిన్ = శక్తితో.
భావము:- హిరణ్యాక్షుడు తన నిట్టూర్పులవల్ల పుట్టిన సముద్రకల్లోలాన్ని తన గదాదండంతో దృఢమైన శక్తితో అణచివేశాడు.
తెభా-3-617-చ.
మఱియును నమ్మహాజలధి మధ్యమునన్ సురవైరి పెక్కు వ
త్సరములు గ్రీడసల్పి రిపు సైన్య విదారణ శౌర్యఖేలనా
పరతఁ జరించి యవ్వరుణపాలిత మైన లసద్విభావరీ
పురమున కేఁగి యందుఁ బరిపూర్ణత నున్న పయోధినాథునిన్.
టీక:- మఱియునున్ = ఇంకనూ; ఆ = ఆ; మహాజలధి = మహాసముద్రము; మధ్యమునన్ = మధ్య; సురవైరి = రాక్షసుడు; పెక్కు = అనేక; వత్సరములు = సంవత్సరములు; క్రీడన్ = యుద్ధక్రీడను; సల్పి = జరిపి; రిపు = శత్రు; సైన్య = సైన్యమును; విదారణ = చీల్చిచెండాడు; శౌర్య = విక్రమ; ఖేలనా = క్రీడ యందు; పరతన్ = నిమగ్నమగుటలో; చరించి = వర్తించి; ఆ = ఆ; వరుణ = వరుణునిచే; పాలితము = పాలింపబడునది; ఐన = అయిన; లసత్ = ప్రకాశిస్తున్న; విభావరి = విభావరి అను {విభావరి - వరుణుని ముఖ్యపట్టణము (విభా (వైభవముతో) వరి (శ్రేష్ఠమైనది))}; అందున్ = దానిలో; పరిపూర్ణతన్ = నిండుదనముతో; ఉన్న = ఉన్నట్టి; పయోధినాథునిన్ = వరుణుని {పయోధి నాథుడు - పయస్ (నీటి)కి అధి (నివాసమైనది) (సముద్రము)నకు నాథుడు (ప్రభువు), వరుణుడు}.
భావము:- ఇంకా ఆ పైన ఆ రాక్షసేశ్వరుడు ఆ మహాసముద్రంలోపల శత్రురాజులను చీల్చిచెండాడి అనేక సంవత్సరాలు విహరించాడు. పరిపూర్ణ ప్రభావంతో అక్కడ ఉన్న వరుణుని పట్టణం అయిన ఆ చక్కటి విభావరి నగరానికి వెళ్ళి . . .
తెభా-3-618-వ.
మఱియునున్
టీక:- మఱియునున్ = ఇంకనూ.
భావము:- ఇంకనూ.
తెభా-3-619-సీ.
యాదోగణాధీశుఁ డగుచుఁ బాతాళభు-
వన పరిపాలుఁ డై తనరుచున్న
వరుణునిఁ గనుగొని పరిహసితోక్తుల-
నిట్లను "విశ్వ మం దెన్నఁగలుగు
సకల లోకైకపాలకులలో నతిబలా-
ధికుఁడని జగము నుతింపఁదగిన
శూరుండ విపుడు నీ పౌరుష మొప్పంగఁ-
గదనరంగమున నన్నెదిరి చూడు
తెభా-3-619.1-తే.
నీ భుజావిక్రమంబును బ్రాభవంబు
నడఁతు"నని పల్కుటయు విని యబ్ధివిభుఁడు
పగతు జయమును వృద్ధియు బలము నాత్మ
బలము దలపోసి దనుజుతో బవరమునకు.
టీక:- యాదో = జలచర; గణా = జాలములకు; అధీశుడు = ప్రభువు; అగుచున్ = అవుతూ; పాతాళ = పాతాళ; భువన = లోకమునకు; పరిపాలకుడు = రాజు; ఐ = అయ్యి; తనరుచున్న = విలసిల్లుతున్న; వరుణునిన్ = వరుణదేవుని; కనుంగొని = చూసి; పరిహసిత = ఎగతాళి; ఉక్తులన్ = మాటలతో; ఇట్లు = ఈ విధముగ; అనున్ = పలికెను; విశ్వము = భువనముల; అందు = లో; ఎన్నన్ = ఎంచిచూడగ; కలుగు = ఉన్నట్టి; సకల = సమస్త; లోక = లోకములయొక్క; ఏక = ముఖ్యమైన; పాలకుల = పరిపాలకులలో; అతి = మిక్కిలి; బల = శక్తితో; అధికుడని = గొప్పవాడు; అని = అని; జగమున్ = ప్రపంచమున; నుతింపన్ = కీర్తించుబడుటకు; తగిన = తగ్గ; శూరుండవు = వీరుడవు; ఇపుడు = ఇప్పుడు; నీ = నీ యొక్క; పౌరుషము = శౌర్యము; ఒప్పంగన్ = ఒప్పునట్లు; కదన = యుద్ధ; రంగమునన్ = భూమిలో; నన్నున్ = నన్ను; ఎదిరి = ఎదుర్కొని; చూడు = చూడు;
నీ = నీ యొక్క; భుజా = బాహుబల; విక్రమంబునున్ = పరాక్రమమును; ప్రాభవంబున్ = వైభవమును; అడంతును = అణచెదను; అని = అని; పల్కుటయున్ = పలుకగా; విని = విని; అబ్ధివిభుడు = వరుణుడు {అబ్దివిభుడు - సముద్రమునకు ప్రభువు, వరుణుడు}; పగతు = శత్రువు యొక్క; జయమును = జయశీలమును; వృద్ధియున్ = అభివృద్ధిని; బలమున్ = శక్తిని; ఆత్మ = తన; బలమున్ = శక్తిని; తలపోసి = ఆలోచించుకొని; దనుజు = రాక్షసుని; తోన్ = తో; బవరము = యుద్ధమున; కున్ = కు.
భావము:- జలచర సమూహాలకు రాజై పాతాళ లోకాన్ని పాలిస్తున్న వరుణుని చూచి హిరణ్యాక్షుడు పరిహసిస్తూ “ఈ విశ్వంలో సమస్త లోకపాలకులలో పేరెన్నిక గల మహాబలవంతుడవని లోకం నిన్ను పొగడుతున్నది కదా! ఇప్పుడు నీ పౌరుషాన్ని ప్రదర్శిస్తూ యుద్ధంలో నన్ను ఎదిరించి చూడు. నీ బాహుబలాన్ని, పేరు ప్రతిష్ఠలను అణచివేస్తాను” అని పలుకగా విని సముద్రరాజైన వరుణుడు శత్రువుయొక్క విజయాలను, అభివృద్ధిని, శక్తిని, తన బలాన్ని అంచనా వేసికొని ఆ రాక్షసునితో యుద్ధానికి....
తెభా-3-620-క.
సమయము గాదని తన చి
త్తమునం గల రోషవహ్నిఁ దాలిమి యను తో
యములం దగనార్చుచు నుప
శమితోక్తులఁ బలికె దనుజసత్తముతోడన్.
టీక:- సమ = సరియైన; సమయము = వేళ; కాదు = కాదు; అని = అని; తన = తన యొక్క; చిత్తమునన్ = మనసున; కల = ఉన్నట్టి; రోష = పౌరుషము అను; వహ్నిన్ = అగ్నిని; తాలిమి = ఓర్పు; అను = అనెడి; తోయములన్ = నీటితో; తగన్ = తగ్గట్టుగ; ఆర్చుచున్ = ఆర్పుకొనుచూ; ఉపశమిత = శాంతింపజేయు; ఉక్తులన్ = మాటలతో; పలికె = పలికెను; దనుజ = రాక్షస; సత్తము = శ్రేష్ఠుని; తోడన్ = తోటి.
భావము:- సమయం కాదనుకొని తన మనస్సులోని కోపాగ్నిని సహనం అనే నీళ్ళతో చల్లార్చుకొంటూ ఆ హిరణ్యాక్షునితో ప్రశాంతవాక్కులతో ఈ విధంగా అన్నాడు.
తెభా-3-621-చ.
"మనమున శాంతిఁ బూని నియమంబున సంగర ముజ్జగించి యే
ననయము నున్నవాఁడని పుడాహవకేళిఁ జరింపరాదు నీ
ఘన భుజ విక్రమస్ఫురిత గాఢ విజృంభణమున్ జయింపఁ జా
లిన ప్రతివీరు లెవ్వరును లేరు ముకుందుడు దక్క నెక్కడన్.
టీక:- మనమునన్ = మనసులో; శాంతిన్ = శాంతిని; పూని = అభ్యసిస్తూ; నియమంబునన్ = నియమములలో; సంగరమును = యుద్ధమును; ఉజ్జగించి = విడిచి; యేన్ = నేను; అనయమున్ = సతతమును; ఉన్నవాడను = ఉన్నాను; ఇపుడు = ఇప్పుడు; ఆహవ = యుధ్ధ; కేళిన్ = క్రీడలో; చరింపన్ = వర్తింప; రాదు = కూడదు; నీ = నీ యొక్క; ఘన = గొప్ప; భుజ = బాహుబల; విక్రమ = పరాక్రమముచే; స్ఫురిత = ప్రకటమౌతున్న; గాఢ = గాఢమైన; విజృంభణమున్ = అతిశయమును; జయింపన్ = జయించుటకు; చాలిన = సరిపడ; ప్రతి = ప్రతిపక్ష; వీరులు = శూరులు; ఎవ్వారునున్ = ఎవరూ కూడ; లేరు = లేరు; ముకుందుడు = నారాయణుడు; తక్కన్ = తప్పించి; ఎక్కడన్ = ఎక్కడా కూడా.
భావము:- “నేను ప్రశాంతమైన మనస్సుతో యుద్ధం చేయకూడదనే నియమంతో ఉన్నాను. ఇప్పుడు యుద్ధం చేయలేను. నీ భుజబలం యొక్క ఆటోపాన్ని జయింపగల ప్రతివీరులు ఎక్కడా లేరు, ఒక్క విష్ణువు తప్ప.
తెభా-3-622-చ.
గొనకొని యమ్మహాత్ముఁడు వికుంఠపురంబున నున్నవాడు దా
ననిమొనఁ బెక్కుమాఱు లభియాతుల నోలి జయించి శక్తి పెం
పున సడిసన్నవీరు డని భూజనకోటి నుతించు నందు వే
చను మత డిచ్చు నీకు నని సర్వము దీఱెడు నంతమీదఁటన్.
టీక:- గొనకొని = పూని; ఆ = ఆ; మహాత్ముండు = గొప్పవాడు; వికుంఠ = వైకుంఠము అను; పురంబునన్ = పురములో; ఉన్నవాడు = ఉన్నాడు; తాన్ = అతను; అని = యుద్ధ; మొనన్ = రంగములో; పెక్కు = అనేక; మాఱులు = పర్యాయములు; అభియాతులన్ = శత్రువులను; ఓలిన్ = క్రమముగ; జయించి = జయించి; శక్తిన్ = బలము యొక్క; పెంపునన్ = అతిశయమున; సడిసన్న = ప్రసిద్ధికెక్కిన; వీరుడు = శూరుడు; అని = అని; భూ = భూమి మీది; జన = జనులు; కోటి = అందరును; నుతించున్ = స్తుతింతురు; అందున్ = అక్కడకు; వేచనుము = శ్రీఘ్రముగ పొమ్ము; అతడు = అతడు; ఇచ్చు = ఇచ్చును; నీకున్ = నీకు; అనిన్ = యుద్ధమును; సర్వమున్ = అంతయు; తీఱెడున్ = తీరిపోతాయి; అంతమీద = ఆతరువాత.
భావము:- ఆ మహాత్ముడు వైకుంఠంలో ఉన్నాడు. ఎన్నోసార్లు యుద్ధరంగంలో శత్రువులను ఓడించి శక్తి సామర్థ్యాలలో పేరుమోసిన వీరుడని భూజనులంతా పొగడుతారు. వెంటనే ఆ వైకుంఠానికి వెళ్ళు. అప్పుడు ఆ హరి నీతో యుద్ధం చేసి నీ కోరిక తీరుస్తాడు.
తెభా-3-623-ఉ.
నిందకునోర్చి యాజిమొన నిల్వఁగనోపక వీఁగిపాఱు నీ
పందల వెంటఁబడ్డ మగపంతమె సర్వశరణ్యుఁడైన గో
విందుఁడు దీర్చు నీపని వివేకవిహీన! చనంగనోపుదే
నందుల కేఁగు మాతఁ డమరారులఁ బోర జయించు నిచ్చలున్.
టీక:- నింద = నిందింపబడుట; కున్ = కు; ఓర్చి = ఓర్చుకొని; ఆజి = యుద్ధ; మొనన్ = రంగమున; నిల్వగన్ = నిలబడుటకు; ఓపకన్ = చాలక; వీగి = ఓడిపోయి; పాఱు = పారిపోవు; ఈ = ఈ; పందల = పిరికిపందల; వెంటన్ = వెనుక; బడ్డ = తగిలిన; మగపంతమే = మగతనమా ఏమి; సర్వశరణ్యుడు = హరి {సర్వశరణ్యుడు - సర్వులకును శరణు కోరదగినవాడు, విష్ణువు}; ఐన = అయినట్టి; గోవిందుడు = హరి {గోవిందుడు - గో(జీవులకు) ఒడయుడు, విష్ణువు}; తీర్చున్ = నెరవేర్చును; నీ = నీ యొక్క; పని = పనిని; వివేక = వివేకము; హీన = లేనివాడ; చనగన్ = వెళ్ళుటకు; ఓపుదేన్ = చాలినచో; అందులకున్ = అక్కడకు; ఏగుము = వెళ్ళుము; అతడు = అతడు; అమరారులన్ = రాక్షసులను {అమరారులు - దేవతల శత్రువులు, రాక్షసులు}; పోరన్ = యుద్ధములో; జయించున్ = జయించును; నిచ్చలున్ = నిత్యము.
భావము:- నిందకు లొంగి యుద్ధరంగంలో నిల్వలేక పారిపోయే పిరికిపందలను వెంటాడడం మగతనమా? బుద్ధిహీనుడా! అందరూ శరణు కోరే గోవిందుడు నీ పని పడతాడు. పోగలిగితే అక్కడికి వెళ్ళు. ఆ హరి ఎప్పుడూ రాక్షసులతో పోరాడుతూ జయిస్తూ ఉంటాడు.
తెభా-3-624-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతేకాక...
తెభా-3-625-క.
పురుషాకృతిఁ బ్రతియుగమునఁ
బురుషోత్తముఁ డవతరించి భూరిభుజా వి
స్ఫురణన్ దుష్టనిశాటుల
హరియించుచు నుండు మునిగణార్చితపదుఁడై.
టీక:- పురుష = పురుషుని; ఆకృతిన్ = రూపముతో; ప్రతి = ప్రతి ఒక్క; యుగమునన్ = యుగములోను; పురుషోత్తముడున్ = విష్ణుమూర్తి {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, హరి}; అవతరించి = అవతరించి; భూరి = అతి మిక్కిలి; భుజా = బాహుబల; విస్ఫురణన్ = అతిశయమున; దుష్ట = చెడ్డ; నిశాటుల = రాక్షసులను {నిశాటులు - నిశ (రాత్రి) అందు చరించువారు, రాక్షసులు}; హరియించుచున్ = సంహరిస్తూ; ఉండున్ = ఉండును; ముని = మునుల; గణా = సమూహములచే; అర్చిత = అర్చింపబడిన; పదుడు = పాదములు కలవాడు; ఐ = అయ్యి.
భావము:- పురుషోత్తముడూ, మునులు పూజించే పాదపద్మాలు గలవాడూ అయిన విష్ణువు ప్రతియుగంలోనూ పురుషరూపంతో భూమిమీద అవతరించి పరాక్రమవంతులూ దుష్టులూ ఐన రాక్షసులను సంహరిస్తాడు.
తెభా-3-626-ఉ.
కావున నా విభుం దొడరి కయ్యము దయ్య మెఱుంగఁ జేసి ర
క్షోవర నీ భుజాబలము సొంపఱి మేదినిఁ గూలి సారమే
యావళి కాశ్రయం బగుదు వచ్చటి కిప్పుడ యేఁగుదేని నీ
చేవయు లావు నేర్పడును జెప్పఁగ నేటికి మీఁది కార్యముల్."
టీక:- కావునన్ = అందుచేత; ఆ = ఆ; విభున్ = ప్రభువును; తొడరి = సమీపించి; కయ్యమున్ = యుద్ధమును; దయ్యమున్ = దయ్యమును; ఎఱుంగన్ = తెలియునట్లు; చేసి = చేసి; రక్షస్ = రాక్షసులలో; వర = శ్రేష్ఠుడ; నీ = నీ యొక్క; భుజాబలమున్ = బాహుబలమును; సొంపఱి = రూపుమాసిపోయి; మేదినిన్ = నేలమీద; కూలి = కూలి; సారమేయ = కుక్కల; ఆవళి = సమూహముల; కిన్ = కి; ఆశ్రయంబున్ = ఆశ్రయము; అగుదువు = అవుతావు; అచ్చటి = అక్కడ; కిన్ = కు; ఇప్పుడ = ఇప్పుడే; ఏగుదేని = బయలుదేరినచో; నీ = నీ యొక్క; చేవయున్ = శక్తియును; లావున్ = బలమును; ఏర్పడును = వేరుగ ఎంచి; చెప్పగన్ = చెప్పుట; ఏటికిని = ఎందులకు; మీది = తరువాత జరగబోవు; కార్యముల్ = పనులను.
భావము:- కనుక ఓ రాక్షసరాజా! కయ్యమో దయ్యమో ఏదో ఆ హరికే చెప్పుకో"అని హేళనగా అంటూ "నీ భుజబలం తరిగి నేల కూలుతావు. కుక్కలు నిన్ను చుట్టుముట్టుతాయి. ఇప్పుడే అక్కడికి వెళ్ళినట్లైతే నీ బలం, సామర్థ్యాలు బయటపడతాయి. తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేము”
తెభా-3-627-చ.
అని వరుణుండు వల్కిన దురాగ్రహ మెత్తి హిరణ్యలోచనుం
డనయము మానసంబున భయం బొక యించుక లేక సంగరా
వని నెదిరింతు నేఁ డమరవర్ధను దుష్టవిమర్దనున్ జనా
ర్దను ననుచున్ వికుంఠనగరస్ఫుట నంచితమార్గవర్తియై.
టీక:- అని = అని; వరుణుండు = వరుణుడు; పల్కినన్ = పలుకగ; దురాగ్రహము = చెడ్డకోపము; ఎత్తి = పొంది; హిరణ్యలోచనుండు = హిరణ్యాక్షుడు; అనయమున్ = అవశ్యము; మానసంబునన్ = మనసులో; భయంబున్ = భయమును; ఒక = ఒక; ఇంచుక = కొంచెము కూడ; లేక = లేకుండగ; సంగర = యుద్ధ; అవనిన్ = భూమిలో; ఎదిరింతు = ఎదిరించెదను; నేడు = ఈనాడు; అమరవర్థనున్ = నారాయణుని {అమ రవర్థనుడు - అమరుల (దేవతల)ను వర్ధనుడు (వృద్ధి చేయువాడు), విష్ణువు}; దుష్టవిమర్దనున్ = నారాయణుని {దుష్ట విమర్దనుడు - దుష్టుల (చెడ్డవారి)ని విమర్దనుడు (శిక్షించువాడు), విష్ణువు}; జనార్దనున్ = నారాయణుని {జనార్దనుడు - జనములను రక్షించునాడు, విష్ణువు}; అనుచూ = అంటూ; వికుంఠ = వైకుంఠ; నగర = పురమునకు; స్ఫుటన్ = సరియగు; అంచిత = ఉద్దేశించిన; మార్గ = మార్గమున; వర్తి = వర్తించువాడు; ఐ = అయ్యి.
భావము:- అని వరుణుడు చెప్పగా హిరణ్యాక్షుడు కోపించి, తన మనస్సులో ఏమాత్రం భయం లేనివాడై “ఈరోజే దేవతల మిత్రుడూ, రాక్షసుల శత్రువూ అయిన ఆ జనార్దనుని యుద్ధభూమిలో ఎదిరిస్తాను” అంటూ వైకుంఠ నగర మార్గం పట్టి....
తెభా-3-628-క.
చను నవసరమున నారద
మునివరుఁ డెదు రేఁగుదెంచి ముదము దలిర్పన్
"దనుజేంద్ర! యెందుఁ బోయెద"
వని యడిగిన నారదునకు నతఁ డిట్లనియెన్.
టీక:- చను = వెళ్ళు; అవసరంబున = సమయమున; నారద = నారదుడు అను; ముని = మునులలో; వరుడు = శ్రేష్ఠుడు; ముదము = సంతోషము; తలిర్పన్ = ఉప్పొంగగా; దనుజ = రాక్షసులలో; ఇంద్ర = శ్రేష్ఠుడ; యెందున్ = ఎక్కడకు; పోయెదవు = వెళ్ళుతుంటివి; అని = అని; అడిగినన్ = అడుగగా; నారదున్ = నారదున; కున్ = కు; అతడు = అతడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చి “ఓ రాక్షసరాజా! ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగిన నారదునితో హిరణ్యాక్షుడు ఇలా అన్నాడు.
తెభా-3-629-చ.
"సరసిరుహోదరుం దొడరి సంగరమే నొనరించి యిందిరా
వరుని ననంతుఁ ద్రుంచి సురవైరికులంబుల కెల్ల మోద వి
స్ఫురణ ఘటింపఁ జేయుటకుఁ బూని వికుంఠపథానువర్తి నై
యరిగెద"నన్న నమ్మునికులాగ్రణి దానవనేత కిట్లనున్.
టీక:- సరసిరుహోదరున్ = హరిని {సరసిరు హోదరుడు - సరసి (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; తొడరి = ఎదిర్చి; సంగరమున్ = యుద్ధమును; ఏను = నేను; ఒనరించి = చేసి; ఇందిరావరుని = హరిని {ఇందిరావరుడు - ఇందిర (లక్ష్మీదేవి) వరుడు (భర్త), విష్ణువు}; పరుని = హరిని {పరుడు - సమస్తమునకు పైన ఉండువాడు, విష్ణువు}; అనంతున్ = హరిని {అనంతుడు - అంతము లేని వాడు, విష్ణువు}; త్రుంచి = సంహరించి; సురవైరి = రాక్షసుల; కులంబుల్ = సమూహమునకు; ఎల్లన్ = అంతటికిని; మోద = సంతోషము; విస్ఫురణన్ = విలసిల్లునట్లు; ఘటింపన్ = జరుగునట్లు; చేయుటకున్ = చేయడానికి; పూని = స్వీకరించి; వికుంఠ = వైకుంఠానికి; పథా = దారిని; అనువర్తిని = అనుసరించువాడను; ఐ = అయ్యి; అరిగెదన్ = వెళ్ళెదను; అన్నన్ = అనగా; ఆ = ఆ; ముని = మునుల; కుల = సమూహమునకు; అగ్రణి = శ్రేష్ఠుడు; దానవ = రాక్షస; నేత = నాయకుని; కిన్ = కి; ఇట్లు = ఈవిధముగ; అనున్ = పలికెను.
భావము:- “పద్మనాభుడూ, శ్రీపతీ, అనంతుడూ అయిన హరిని ఎదుర్కొని యుద్ధంలో అతణ్ణి అంతం చేసి మొత్తం రాక్షసజాతికి సంతోషం కలిగించాలనే పట్టుదలతో వైకుంఠం దారి పట్టాను”. ఆ మాట విని నారదుడు ఇలా అన్నాడు.
తెభా-3-630-చ.
"గురుభుజుఁ డమ్మహాత్ముఁడు వికుంఠపురంబున నేడు లేఁడు భూ
భరము వహింప నాదికిటి భావముఁ దాల్చి రసాతలంబునం
దిరవుగ నున్నవాఁ డచటి కేఁగఁగనోపుదువేని నేఁగు మం
దరయఁగ గల్గు నీకు నసురాంతకుతోడి రణం బవశ్యమున్."
టీక:- గురు = గొప్ప; భుజుడు = బాహుబలము కలవాడు; ఆ = ఆ; మహాత్ముడు = గొప్పవాడు; వికుంఠ = వైకుంఠము అను; పురంబునన్ = నగరమున; నేడు = ఈనాడు; లేడు = లేడు; భూ = భూమండలము యొక్క; భరమున్ = భారమును; వహింపన్ = మోయుటకు; ఆదికిటి = ఆదివరాహము; భావమున్ = అవతారమును; తాల్చి = ధరించి; రసాతలంబున్ = పాతాళము; అందున్ = అందు; ఇరవుగన్ = స్థిరముగా; ఉన్నవాడు = ఉన్నాడు; అచటికిన్ = అక్కడికి; ఏగగన్ = వెళ్ళ; ఓపుదువేని = కలుగుదువేని; ఏగుము = వెళ్ళుము; అందున్ = అక్కడ; అరయన్ = పొంద; కల్గు = కలుగును; నీకున్ = నీకు; అసురాంతకున్ = విష్ణుమూర్తి {అసు రాంతకుడు - అసుర (రాక్షసు)లకు అంతకుడు (నాశము చేయువాడు), విష్ణువు}; తోడిన్ = తోటి; రణంబున్ = యుద్ధము; అవశ్యంబున్ = తప్పక.
భావము:- “గొప్ప భుజబలం కల ఆ మహాత్ముడు ఇప్పుడు వైకుంఠంలో లేడు. భూభారాన్ని వహించడానికి ఆదివరాహ రూపాన్ని ధరించి రసాతలంలో ఉన్నాడు. నీవు అక్కడికి వెళ్ళగలిగితే వెళ్ళు. అక్కడ నీకు విష్ణువుకు యుద్ధం తప్పక జరుగుతుంది.”