పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/ధృవయక్షుల యుద్ధము
తెభా-4-323-మ.
ఘనశౌర్యోన్నతి తోడ సర్వ కకుభాకాశంబు లందుం బ్రతి
ధ్వనులోలిన్ నిగుడంగ శంఖము మహోద్యల్లీలఁ బూరింపఁ ద
న్నినదంబున్ విని యక్షకాంతలు భయాన్వీతాత్మలై రుగ్ర సా
ధనులై యక్షభటుల్ పురిన్ వెడలి రుత్సాహంబు సంధిల్లగన్.
టీక:- ఘన = గొప్ప; శౌర్య = శూరత్వ; ఉన్నతిన్ = అతిశయము; తోడన్ = తోటి; సర్వ = అన్ని; కకుభ = దిక్కుల; ఆకాశంబు = ఆకాశము; అందున్ = అందు; ప్రతిధ్వనులు = ప్రతిధ్వనులు; ఓలిన్ = క్రమముగ; నిగుడంగ = వ్యాపించగ; శంఖమున్ = శంఖము; మహ = గొప్పగ; ఉద్యత్ = గట్టి శబ్దము కలిగెడి; లీలన్ = విధముగ; పూరింన్ = పూరించగ; తత్ = దాని; నినదంబున్ = శబ్దమును; విని = విని; యక్ష = యక్ష; కాంతలు = స్త్రీలు; భయ = భయముతో; ఆన్విత = కూడిన; ఆత్ములు = మనసులు కలవారు; ఐరి = అయిరి; ఉగ్ర = భయంకరమైన; సాధనులు = ఆయుధములు కలవారు; ఐ = అయ్యి; యక్ష = యక్షుల; భటుల్ = సైనికులు; పురిన్ = పురము నుండి; వెడలి = బయటకు వచ్చి; ఉత్సాహంబున్ = ఉత్సాహము; సంధిల్లగన్ = కలుగునట్లు.
భావము:- ధ్రువుడు ప్రతాపాతిశయంతో సర్వదిక్కులు, ఆకాశం మారుమ్రోగే విధంగా శంఖాన్ని పూరించాడు. ఆ శంఖధ్వనిని విని యక్షకాంతలు భయపడ్డారు. యక్షవీరులు భయంకరాలైన ఆయుధాలను ధరించి ఉత్సాహంతో పురంనుండి బయటికి వచ్చారు.
తెభా-4-324-వ.
ఇట్లు వెడలి యా ధ్రువునిం దాఁకిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; వెడలి = బయలుదేరి; ఆ = ఆ; ధ్రువునిన్ = ధ్రువుని; తాకినన్ = ఎదిరింపగా.
భావము:- యక్షులు అలా వచ్చి ధ్రువుణ్ణి ఎదుర్కొనగా…
తెభా-4-325-చ.
కరము మహారథుండు భుజగర్వ పరాక్రమశాలియున్ ధను
ర్ధరుఁడును శూరుఁడౌ ధ్రువుఁడు దన్ను నెదిర్చిన యక్షకోటిఁ జె
చ్చరఁ బదుమూఁడువేల నొకచీరికిఁ గైకొన కొక్కపెట్ట భీ
కరముగ మూఁడు మూఁడు శితకాండములం దగ గ్రువ్వనేసినన్
టీక:- కరము = మిక్కిలి; మహారథుండు = గొప్పశూరుడు {మహారథుడు - పదకొండువేలమంది (11000) విలుకాండ్రతో పోరాడెడి యోధుడు, తనను సారథిని గుఱ్ఱములను కాపాడుకొనుచు పోరాడెడి యోధుడు 2)అతిరథుడు - పెక్కువిలుకాండ్రతో పోరాడెడి యొధుడు 3)సమరథుడు - ఒకవిలుకానితో సరిగనిలిచి పోరాడెడి యోధుడు 4)అర్థరథుడు - ఒక్కవిలుకానితో పోరాడెడి యోధుడు}; భుజ = బాహు; గర్వ = బలము; పరాక్రమ = శౌర్యము; శాలియున్ = స్వాభావికముగ కలవాడు; ధనుర్ధరుడును = విలుకాడు {ధనుర్ధరుడు - ధనుస్సును ధరించినవాడు, విలుకాడు}; శూరుడు = రణసాహసము కలవాడు; ఔ = అగు; ధ్రువుడు = ధ్రువుడు; తన్నున్ = తనను; ఎదిర్చిన = ఎదిరించిన; యక్ష = యక్షుల; కోటిన్ = సమూహమును; చెచ్చెరన్ = వెంటవెంటనే; పదుమూడువేలన్ = పదమూడువేలమందిని (13000); ఒకచీరికిన్ = ఇంచుకేని; కైకొనక = లక్ష్యపెట్టక; ఒక్క = ఒకే; పెట్టన్ = మారుగ; భీకరముగ = భయంకరముగ; మూఁడుమూఁడు = మూడేసి (3); శితకాండములన్ = వాడియైన బాణములతో; తగ = తెగ, మిక్కిలి; క్రువ్వన్ = గ్రుచ్చియెత్తి, గుత్తంగా; ఏసినన్ = కొట్టగా.
భావము:- మహారథుడు, వీరాధివీరుడు, ధనుర్ధారి, శూరుడు అయిన ధ్రువుడు తనను ఎదిరించిన పదమూడు వేల యక్షవీరులనూ లెక్కచేయకుండా భయకరంగా మూడు వాడి బాణాలతో గాయపరిచాడు.
తెభా-4-326-ఉ.
వారు లలాటముల్ పగిలి వారక సోలియుఁ దేఱి యమ్మహో
దారు పరాక్రమప్రకట ధైర్యముఁ దత్కర లాఘవంబుఁ బ
ల్మాఱు నుతించుచుం గుపితమానసులై పదతాడితప్రదు
ష్టోరగకోటిఁ బోలెఁ జటులోగ్ర భయంకర రోషమూర్తులై.
టీక:- వారు = వారు; లలాటముల్ = నుదుర్లు; పగిలి = పగిలిపోయి; వారక = బెదరక; సోలియున్ = ఒరిగినను; తేఱి = మరల తేరుకొని; ఆ = ఆ; మహోదారుడు = మిక్కిలి గొప్పవాని; పరాక్రమ = శత్రువులను ఆక్రమించుటలో; ప్రకట = ప్రసిద్ధమగు; ధైర్యమున్ = ధైర్యమును; తత్ = అతని; కర = చేతుల; లాఘవంబున్ = ఒడుపును; పలు = అనేక; మాఱు = పర్యాయములు; నుతించుచున్ = మెచ్చకొనుచు; కుపిత = కోపించిన; మానసులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; పద = కాలితో; తాడిత = తొక్కబడిన; ప్రదుష్ట = మహచెడ్డ; ఉరగ = పాముల; కోటిన్ = సమూహము; పోలెన్ = వలె; చటుల = మిక్కిలి; ఉగ్ర = కోపముతో ఊగిపోతున్న; భయంకర = భీకరమైన; రోష = రోషము కల; మూర్తులు = స్వరూపములు కలవారు; ఐ = అయ్యి.
భావము:- ఆ యక్షులు నొసళ్ళు పగిలి, మూర్ఛపోయి, తిరిగి తేరుకొని ఆ మహావీరుని పరాక్రమాన్ని ధైర్యాన్ని హస్తలాఘవాన్ని పలుమార్లు మెచ్చుకొంటూ కాళ్ళచేత త్రొక్కబడ్డ కాలసర్పాలవలె పట్టరాని రోషంతో భయంకరాకారాలు కలవారై…
తెభా-4-327-ఉ.
ఆ రథికోత్తముం దొడరి యందఱు నొక్కటఁ జుట్టుముట్టి పెం
పారఁగ బాణషట్కముల నంగములం బగులంగనేసి వి
స్ఫార గదా శరక్షురిక పట్టిసతోమర శూలఖడ్గముల్
సారథియుక్తుడైన రథిసత్తముపైఁ గురిపించి రేపునన్.
టీక:- ఆ = ఆ; రథిక = రథముపైన యుద్ధము చేయువారిలో; ఉత్తమున్ = ఉత్తముని; తొడరి = సమీపించి; అందఱున్ = అందరును; ఒక్కటన్ = ఒకేమారు; చుట్టుముట్టి = చుట్టుముట్టి; పెంపారగ = అతిశయించగ; బాణ = బాణముల; షట్కములన్ = ఆరేసింటితో; అంగములన్ = అవయవములను; పగులంగన్ = పగలిపోయేలా; ఏసి = కొట్టి; విస్ఫార = బాగా పెద్ద; గదా = గదలు; శర = బాణములు; క్షురిక = చురకత్తులు, ఛురిక; పట్టిస = ఆయుధ విశేషము, అడ్డకత్తి; తోమర = ఆయుధ విశేషము, చిల్లకోల; శూల = శూలములు; ఖడ్గముల్ = కత్తులు; సారథి = సారథి {సారథి – రథము తోలువాడు}; యుక్తుడు = కూడినవాడు; ఐన = అయిన; రథసత్తము = రథయుద్ధము చేయుటలో బహునేర్పరి; పై = పైన; కురిపించిరి = వర్షము వలె కురిపించిరి; ఏపునన్ = చెలరేగి.
భావము:- ఆ మహాయోధుడైన ధ్రువుణ్ణి యక్షులందరు ఒక్కసారిగా చుట్టుముట్టి ఆరేసి బాణాలతో అతని అవయవాలను భేదించారు. పెద్ద పద్ద గదలను, బాణాలను, చురకత్తులను, పట్టిసాలను, చిల్లకోలలను, శూలాలను, ఖడ్గాలను ధ్రువునిపైన, అతని సారథిపైన ఎడతెగకుండా కురిపించారు.
తెభా-4-328-వ.
అట్లు గురియించిన నతండు.
టీక:- అట్లు = అలా; కురియించినన్ = కురిపించగ; అతండు = అతడు.
భావము:- ఆ విధంగా యక్షులు బాణాలను కురిపించగా ఆ ధ్రువుడు …
తెభా-4-329-క.
పెంపఱి యుండెను ధారా
సంపాతచ్ఛన్నమైన శైలము భంగిన్
గుంపులు కొని యాకసమునఁ
గంపించుచు నపుడు సిద్ధగణములు వరుసన్.
టీక:- పెంపు = విజృంభణము; అఱి = తగ్గిపోయి; ఉండెను = ఉండెను; ధారా = వర్షపు ధారలు; సంపాత = అధికముగ పడుటచే; ఛన్నము = కప్పబడినది; ఐన = అయిన; శైలమున్ = కొండ; భంగిన్ = వలె; గుంపులు = గుంపులు; కొని = కూడి; ఆకసమునన్ = ఆకాశమునందు; కంపించుచున్ = వణికిపోతూ; అపుడున్ = అప్పుడు; సిద్ద = సిద్ధుల; గణములు = సమూహములు; వరుసన్ = వరుసగా.
భావము:- (ధ్రువుడు) ఎడతెగని వర్షధారలతో కప్పబడిన కొండవలె యక్షుల ఆయుధ వర్షంలో మునిగిపోయాడు. అది చూచి ఆకాశంలోని సిద్ధులు వణికిపోతూ…
తెభా-4-330-క.
హాహాకారము లెసఁగఁగ
"నోహో యీ రీతి ధ్రువపయోరుహహితుఁడు
త్సాహము చెడి యిటు దైత్య స
మూహార్ణవమందు నేఁడు మునిఁగెనె యకటా!"
టీక:- హాహాకారములు = హాహా యనెడి రవములు; ఎసగగన్ = అతిశయించగ; ఓహో = ఓహో; ఈ = ఈ; రీతిన్ = విధముగ; ధ్రువ = ధ్రువుడు అనెడి; పయోరుహహితుడు = సూర్యుడు {పయోరుహహితుడు - పయస్ (నీటి) యందు ఈరుహ (పుట్టినవి) పద్మములకు హితుడు (ఇష్టుడు), సూర్యుడు}; ఉత్సాహము = విజృంభణము; చెడి = నశించి; ఇటు = ఇలా; దైత్య = రాక్షసుల {దైత్యులు - దితిసంతానము, రాక్షసులు}; సమూహ = సమూహము అనెడి; ఆర్ణవము = సముద్రము; అందున్ = లో; నేడు = ఈనాడు; మునిగెనె = మునిగిపోయెనే; అక్కటా = అయ్యె.
భావము:- హాహాకారాలు చేస్తూ “అయ్యో! ధ్రువుడు అనే సూర్యుడు రాక్షస సమూహం అనే సముద్రంలో మునిగిపోయాడు కదా!”
తెభా-4-331-వ.
అని చింతించు సమయంబున.
టీక:- అని = అని; చితించు = విచారించు; సమయంబునన్ = సమయ మందు.
భావము:- అని చింతించే సమయంలో…
తెభా-4-332-క.
తామాతని గెలిచితి మని
యా మనుజాశనులు పలుక నట నీహార
స్తోమము సమయించు మహో
ద్దా ముండగు సూర్యుఁ బోలి తద్దయుఁ దోఁచెన్.
టీక:- తాము = తాము; అతనిన్ = అతనిని; గెలిచితిమి = గెలిచాము; అని = అని; ఆ = ఆ; మనుజా = మానవులను, నరమాంస; అశనలు = భుజించువారు, భక్షకులు; పలుకన్ = పలుకగా; అటన్ = అప్పుడు; నీహారస్తోమము = మంచుతెర; సమయించు = మాయము చేయు; మహ = గొప్ప; ఉద్దాముండు = బంధన రహితుడు; అగు = అయిన; సూర్యున్ = సూర్యుని; పోలి = వలె; తద్దయున్ = మిక్కిలి; తోచెన్ = తలపించెను.
భావము:- తాము ఆ ధ్రువుణ్ణి జయించామని అనుకుంటూ గంతులు వేస్తూ రాక్షసులు చెప్పుకొంటుండగా దట్టమైన మంచును పటాపంచలు చేస్తూ బయటపడిన సూర్యునివలె ధ్రువుడు కనిపించాడు.
తెభా-4-333-వ.
అట్లు దోఁచిన.
టీక:- అట్లు = ఆ విధముగ; తోచినన్ = కనిపించిన.
భావము:- అలా కనిపించి…
తెభా-4-334-మ.
అరి దుఃఖావహమైన కార్ముకము శౌర్యస్ఫూర్తితోఁ దాల్చి భీ
కర బాణావళిఁ బింజపింజఁ గఱవంగా నేసి ఝంఝానిలుం
డురు మేఘావళిఁ బాఱఁదోలుగతి నత్యుగ్రాహితక్రూరబం
ధుర శస్త్రావళి రూపుమాపె విలసద్దో ర్లీల సంధిల్లఁగన్.
టీక:- అరి = శత్రువులకు; దుఃఖ = దుఃఖమును; ఆవహము = కలిగించునది; ఐన = అయిన; కార్ముకము = విల్లు; శౌర్య = శూరత్వము; స్ఫూర్తిన్ = స్పురించుట; తోన్ = కలిగి; తాల్చి = ధరించి; భీకర = భయంకరమైన; బాణ = బాణముల; ఆవళిన్ = సమూహమును; పింజపింజగఱవంగన్ = వరుసలువరుసలుగ { పింజపింజ కఱవగా - పింజ (బాణమునకు వెనుక చివర) పింజను తగులుతూ వెళ్ళేలా (బాణములు వేగంగా వేయుట)}; వేసి = వేసి; ఝంఝానిలుండు = వాయుదేవుడు, పెనుగాలి; ఉరు = విరివియైన; మేఘా = మేఘముల; ఆవళిన్ = సమూహమును; పాఱదోలు = చెదరగొట్టు; గతిన్ = విధముగ; అతి = మిక్కిలి; ఉగ్ర = భయంకరత్వము; ఆహిత = కలిగిన; క్రూర = క్రూరత; బంధుర = నిండిన; శస్త్రా = శస్త్రముల; ఆవళిన్ = సమూహముతో; రూపుమాపె = నశింపజేసెను; విలసత్ = విలసిల్లుతున్న; దోః = బాహువుల; లీల = లాఘవము; సంధిల్లగన్ = కలుగునట్లు.
భావము:- (ధువుడు) శత్రువుల మనస్సులకు సంతాపాన్ని కలిగించే ధనుస్సును చేపట్టి, భయంకరంగా బాణపరంపరను కురిపించి, పెనుగాలి మేఘాలను పారద్రోలే విధంగా భుజబలంతో శత్రువీరుల శస్త్రాస్త్రాలను చెల్లాచెదరు చేసాడు.
తెభా-4-335-చ.
మఱి యపు డమ్మహాత్ముఁ డసమానబలుండు మహోగ్రబాణముల్
గఱిగఱిఁ దాఁక నేసి భుజగర్వ మెలర్ప విరోధి మర్మముల్
పఱియలు చేసి యంగములు భంగమునొందఁగఁజేసె వ్రేల్మిడిన్
గిఱికొని పర్వతంబుల నొగిం దెగఁ గొట్టెడు నింద్రు కైవడిన్.
టీక:- మఱి = మరి; అపుడున్ = అప్పుడు; ఆ = ఆ; మహాత్ముడు = గొప్పవాడు; అసమాన = సమానులు లేనంత; బలుండు = బలము కలవాడు; మహా = గొప్ప; ఉగ్ర = భయంకరమైన; బాణముల్ = బాణములను; గఱిగఱిన్ = బాణము రెక్కను బాణము రెక్క; తాకన్ = తాకుతున్నట్లు, తాకేలా; ఏసి = వేసి; భుజ = బాహు; గర్వము = గర్వము; ఎలర్పన్ = ప్రసిద్ద మగునట్లు; విరోధి = శత్రువుల; మర్మముల్ = జీవస్థానములు {మర్మములు - ప్రాణములు దాగిన దేహభాగములు, జీవస్థానములు}; పఱియలు = బద్దలు; చేసి = కొట్టి; అంగములు = అవయవములు; భంగము = విరుగుటను; ఒందగన్ = పొందునట్లు; చేసెన్ = చేసెను; వ్రేల్మిడిన్ = చిటికలో; గిఱికొని = చుట్టుముట్టి; పర్వతంబులన్ = పర్వతములను; ఒగిన్ = వరసగ; తెగగొట్టెడి = రెక్కలు విరిచెడి; ఇంద్రున్ = ఇంద్రుని; కైవడిన్ = వలె.
భావము:- మహాత్ముడు, సాటిలేని మేటి వీరుడు అయిన ధ్రువుడు భయంకరాలైన బాణాలను వరుసపెట్టి ప్రయోగించి శత్రువుల జీవ స్థానములను బద్దలుకొట్టాడు;వారి అవయవాలను తునాతునకలు కావించాడు; పర్వతాలను బ్రద్దలు కొట్టే ఇంద్రునివలె ధ్రువుడు శత్రువులను చుట్టుముట్టి క్షణంలో మట్టుబెట్టాడు.
కఠినసాధ్యమైన "ఱి"ప్రాసను అలవోకగా ప్రయోగించిన సహజకవికి కరములు మోడ్చుచున్నాను.
తెభా-4-336-వ.
అయ్యవసరంబున.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో.
భావము:- ఆ సమయంలో…
తెభా-4-337-చ.
అలఘు చరిత్రుఁ డమ్మనుకులాగ్రణిచే వికలాంగు లైనవా
రల సకిరీట కుండల విరాజిత మస్తక కోటిచే సము
జ్జ్వల మణికంకణాంగద లసద్భుజవర్గముచేత సంగర
స్థల మతిరమ్యమై తనరె సంచిత వీరమనోహరాకృతిన్.
టీక:- అలఘు = గొప్ప; చరిత్రుడు = వర్తనము కలవాడు; ఆ = ఆ; మను = మనువు యొక్క; కుల = వంశమునందు; అగ్రణి = గొప్పవాని; చేన్ = చేత; వికలాంగులు = అవయవములు విరిగినవారు; ఐన = అయిన; వారల = వారి; స = కలిగిన; కిరీట = కిరీటములు; కుండల = చెవికుండలముల; విరాజిత = విలసిల్లుతున్న; మస్తక = తలలు; కోటిన్ = అనేకము; చేన్ = తో; సముజ్జ్వల = మిక్కిలి ప్రకాశిస్తున్న; మణి = మణులు పొదిగిన; కంకణ = మురుగులు; అంగద = బాహుపురులు కలిగిన; సత్ = మంచి; భుజ = బాహువుల; వర్గమున్ = సమూహము; చేతన్ = తో; సంగర = యుద్ధ; స్థలము = భూమి; అతి = మిక్కిలి; రమ్యము = అందమైనది; ఐ = అయ్యి; తనరెన్ = అతిశయించెను; సంచిత = కలగలిసిన; వీర = వీరత్వము; మనోహర = మనోజ్ఞత్వముల; ఆకృతిన్ = రూపముతో.
భావము:- మహనీయుడు మనువంశంలో శ్రేష్ఠుడు అయిన ధ్రువునిచేత వికలాంగులైనవారి కిరీటాలతో కుండలాలతో ప్రకాశించే శిరస్సులు, మణికంకణాలతో భుజకీర్తులతో ప్రకాశించే బాహువులు నిండి ఉన్న ఆ యుద్ధభూమి వీర మనోహరంగా విరాజిల్లింది.
తెభా-4-338-వ.
అంత హతశేషులు.
టీక:- అంత = అంతట; హత = మరణించగా; శేషులు = మిగిలినవారు.
భావము:- అప్పుడు చావగా మిగిలినవారు…
తెభా-4-339-క.
వరబలుఁడగు మను మనుమని
శరసంఛిన్నాంగు లగుచు సమరవిముఖులై
హరిరాజముఁ గని పఱచెడు
కరిబృందముఁ బోలెఁ జనిరి కళవళపడుచున్.
టీక:- వర = శ్రేష్ఠమైన, వరసిద్దిచే; బలుడు = బలము కలవాడు; అగు = అయిన; మను = మనువు యొక్క; మనుమని = మనుమడు యొక్క; శర = బాణములువలన; సంఛిన్న = బాగుగా చితికిన; అంగులు = అవయనములు కలవారు; అగుచున్ = అవుతూ; సమర = యుద్ధము చేయుటకు; విముఖులు = వ్యతిరేకులు; ఐ = అయ్యి; హరి = సింహములలో; రాజమున్ = గొప్పదానిని; కని = చూసి; పఱచెడు = పారిపోయెడి; కరి = ఏనుగుల; బృందమున్ = గుంపును; పోలెన్ = వలె; చనిరి = వెళ్ళిపోయిరి; కళవళ = తొట్రుపాటు; పడుచున్ = పడుతూ.
భావము:- వరబలం కలవాడు, స్వాయంభువ మనువు మనుమడు అయిన ధ్రువుని బాణాలచేత శరీరాలు తూట్లు పడగా యుద్ధం మానుకొని సింహాన్ని చూచిన ఏనుగులవలె భయపడి పారిపోయారు.
తెభా-4-340-క.
అప్పుడు రాక్షసమాయలు
గప్పిన ధ్రువుఁ డసురవరుల కార్యం బెఱుఁగం
జొప్పడక, వారిఁ బొడగన
దెప్పర మగుటయును సారథిం గని, యంతన్.
టీక:- అప్పుడు = అప్పుడు; రాక్షస = రాక్షసుల యొక్క; మాయలు = మాయలు; కప్పిన = ముసురుకొనగ; ధ్రువుడు = ధ్రువుడు; అసుర = రాక్షసులలో {అసుర – సురలు కానివారు, రాక్షసులు}; వరుల = శ్రేష్ఠుల; కార్యంబున్ = పనులను; ఎఱుగన్ = తెలియు; చొప్పడక = దారి తెలియక; వారిన్ = వారిని; పొడగనన్ = కనగొన; దెప్పరము = దుస్సహము; అగుటయును = అవుటచేత; సారథిన్ = రథసారథిని; కని = చూసి; అంతన్ = అంతట.
భావము:- అప్పుడు రాక్షసుల మాయలు ధ్రువుణ్ణి కప్పివేశాయి. రాక్షసుల మాయాకృత్యాలను అతడు తెలిసికొనలేకపోయాడు. వాళ్ళు అతని కంటికి కనిపించలేదు. అందువల్ల ధ్రువుడు తన సారథిని చూచి …
తెభా-4-341-క.
“తలపోయఁగ, భువి మాయా
వుల కృత్యంబెఱుఁగనెవరువోలుదు” రనుచుం
బలుకుచుఁ, దత్పురిఁజొరఁగాఁ
దలఁపఁగ, నదిగానరాక తద్దయు మానెన్
టీక:- తలపోయగన్ = ఆలోచించినచో; భువిన్ = భూమ్మీద; మాయావుల = మాయలు చేయువారి; కృత్యంబులు = పనులు; ఎఱుగన్ = తెలియుటకు; ఎవరు = ఎవరు; పోలుదురు = సమర్థులు; అనుచున్ = అంటూ; పలుకుచు = మాట్లాడుతూ; తత్ = ఆ; పురిన్ = పురమును; చొరగన్ = ప్రవేశింపవలెనని; తలపగన్ = అనుకొంటుండగ; అది = అది; కానరాక = కనబడక; తద్ధయున్ = పూర్తిగా; మానెను = మాయమైపోయెను.
భావము:- “ఆలోచించి చూస్తే ఈ భూమిమీద మాయావుల మాయలను తెలిసికొనడం ఎవరికీ సాధ్యం కాదు.” అంటూ శత్రునగరంలోకి ప్రవేశించాలని ఉత్సాహపడ్డాడు. కాని శత్రువుల పట్టణం ధ్రువుని కంటికి కనిపించలేదు.
తెభా-4-342-వ.
అట్లు పురంబున కరుగుట మాని చిత్రరథుండైన యా ధ్రువుండు సప్రయత్నుం డయ్యును బరప్రతియోగశంకితుండై యుండె; నయ్యెడ మహాజలధి ఘోషంబు ననుకరించు శబ్దంబు వినంబడె; నంత సకల దిక్తటంబుల వాయుజనితం బయిన రజః పటలంబు దోఁచె; దత్క్షణంబ యాకాశంబున విస్ఫురత్తటిత్ప్రభా కలిత గర్జారవయుక్త మేఘంబు లమోఘంబులై భయంకరాకారంబులై తోఁచె; నంత.
టీక:- అట్లు = ఆ విధముగ; పురంబున్ = పురమునకు; అరుగుట = వెళ్ళుట; మాని = మాని; చిత్ర = విశిష్టమైన; రథుండు = రథముపై ఎక్కినవాడు; ఐన = అయిన; ఆ = ఆ; ధ్రువుండు = ధ్రువుడు; సప్రయత్నుండు = ప్రయత్నముతో కూడినవాడు; అయ్యున్ = అయినప్పటికిని; పర = శత్రువుల; ప్రతియోగ = ప్రతిక్రియలందు; శంకితుండు = సందేహపడుతున్నవాడు; ఐ = అయ్యి; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ; ఎడన్ = స్థలములో; మహా = గొప్ప; జలధి = సముద్రమును; అనుకరించు = పోలెడి; శబ్దంబున్ = సవ్వడి; వినంబడెన్ = వినబడెను; అంత = అంతలోనే; సకల = అన్ని; దిక్తటంబులు = దిగంతములందు; వాయు = గాలిచే; జనితంబున్ = పుట్టినది; అయిన = అయిన; రజస్ = ధూళి; పటలంబు = తెరలు; తోచెన్ = కనబడిన ట్లనిపించెను; తత్క్షణంబ = వెంటనే; ఆకాశంబునన్ = ఆకాశములో; విస్ఫుర = మెరుస్తున్న; తటత్ = మెరుపుల; ప్రభా = కాంతులతో; కలిత = కూడిన; గర్జా = ఘర్జనల; రవ = శబ్దములతో; యుక్త = కలిసిన; మేఘంబులు = మేఘములు; అమోఘంబులు = అమోఘంబులు; ఐ = అయ్యి; భయంకర = భీకరమైన; ఆకారంబులు = రూపములు కలవి; ఐ = అయ్యి; తోచెన్ = కనబడిన ట్లనిపించెను; అంత = అంతట.
భావము:- అందువల్ల ధ్రువుడు మహా ప్రయత్నశాలి అయినా శత్రువుల ప్రతిక్రియలు అంతుపట్టక, పట్టణంలోకి ప్రవేశించే ప్రయత్నాన్ని మానుకున్నాడు. అప్పుడు మహాసముద్రఘోష వంటి ధ్వని వినిపించినట్లు. దిక్కులన్నీ పెనుగాలి రేపిన ధూళితో కప్పబడ్డట్లు. ఆకాశంలో మెరుపులు తళతళ మెరిసినట్లు. మేఘాలు భయంకరంగా గర్జించినట్లు తోచసాగింది.
తెభా-4-343-మ.
అనయంబున్ ధ్రువుమీఁద దైత్యకృతమాయాజాలమట్లేచి, బో
రన మస్తిష్కపురీష మూత్ర పల దుర్గంధాస్థి మేదశ్శరా
సన నిస్త్రింశ శరాసి తోమర గదా చక్రత్రిశూలాది సా
ధన భూభృద్భుజగావళిం గురిసె నుద్దండక్రియాలోలతన్.
టీక:- అనయంబున్ = అధికముగా; ధ్రువు = ధ్రువుని; మీదన్ = పైన; దైత్య = రాక్షసులచే; కృత = ప్రయోగింపబడిన; మాయా = మాయల; జాలమున్ = వల, సమూహము; అట్లు = ఆవిధముగ; ఏచి = చికాకు పరచి; బోరన = ధారాపాతముగ; మస్కిష్క = పుఱ్ఱెలు; పురీష = మలము; మూత్ర = మూత్రము; ఫల = మాంసము; దుర్గంధ = దుర్గంధము కల; అస్థి = ఎముకలు; మేదస్ = మెదళ్ళు; శరాసన = విల్లులు; నిస్తింశ = ఖడ్గములు; శర = బాణములు; అసి = కత్తులు; తోమర = ఈటెలు; గదా = గదలు; చక్ర = చక్రాయుధములు; త్రిశూల = త్రిశూలములు; ఆది = మొదలైన; సాధన = సాధనములు; భూభృత్ = పర్వతములు; భుజగ = సర్పముల; ఆవళిన్ = సమూహములు; కురిసెన్ = కురిపించెను; ఉద్దండ = భయంకరమైన; క్రియాలోలతన్ = విధముగ.
భావము:- రాక్షసులు ఎడతెరపి లేకుండా ప్రయోగించిన మాయాజాలాలు ధ్రువుని మీద మెదడు, మలము, మూత్రము, మాంసము, క్రుళ్ళిన ఎముకలు, క్రొవ్వు కురిపించాయి; విండ్లు, కత్తులు, బాణాలు, కటారులు, చిల్లకోలలు, గదలు, చక్రాలు, త్రిశూలాలు మొదలైన ఆయుధాలు, కొండలు, సర్పాలు వర్షింపించాయి.
తెభా-4-344-వ.
మఱియు, మత్తగజ సింహవ్యాఘ్ర సమూహంబులును, నూర్మి భయంకరంబై సర్వతః ప్లవనం బయిన సముద్రంబును గానంబడియె; వెండియుం గల్పాంతంబునందుంబోలె భీషణంబైన మహాహ్రదంబునుం దోఁచె; నవ్విధంబున నానా విధంబులు ననేకంబులు నవిరళ భయంకరంబులు నయిన యసురమాయలు గ్రూర ప్రవర్తునులగు యక్షుల చేత సృజ్యమానంబులై యడరె; నా సమయంబున.
టీక:- మఱియున్ = ఇంకను; మత్త = మదించిన; గజ = ఏనుగులు; సింహ = సింహములు; వ్యాఘ్ర = పెద్దపులుల; సమూహంబులును = గుంపులును; ఊర్మి = అలలతో; భయంకరంబు = భయంకరము; ఐ = అయ్యి; సర్వతః = అన్ని వైపులకును; ప్లవనంబు = ప్రవహిస్తున్నది, దుముకునది; అయిన = అయినట్టి; సముద్రంబున్ = సముద్రమును; కానంబడియె = కనిపించెను; వెండియున్ = తరవాత; కల్ప = కాలకల్పము; అంతంబున్ = అంతము; అందున్ = లో; పోలెన్ = వలె; భీషణంబు = భయంకరము; ఐన = అయిన; మహా = గొప్ప; హ్రదంబునున్ = సరస్సును; తోచెన్ = కనబడిన ట్లనిపించెను; ఆ = ఆ; విధంబునన్ = విధముగ; నానా = రకరకాల; విధంబులున్ = విధములుగను; అనేక = అనేకమైనవియును; అవిరళ = ఎడతెగని; భయంకరంబులును = భీకరములును; అయిన = అయిన; అసుర = రాక్షసుల; మాయలు = మాయలు; క్రూర = క్రూరమైన; వర్తనులు = నడవడిక గలవారు; అగు = అయిన; యక్షుల = యక్షుల; చేతన్ = చేత; సృజ్యమానంబు = సృష్టింపబడినవి; ఐ = అయ్యి; అడరెన్ = అతిశయించెను; ఆ = ఆ; సమయంబునన్ = సమయములో.
భావము:- ఇంకా మదపుటేనుగులు, సింహాలు, పెద్దపులులు చుట్టుముట్టినట్లు. కెరటాలతో సముద్రం భయంకరంగా పొంగిపొరలుతున్నట్లు కనిపించింది. ప్రళయకాలంలో వలె భయంకరమైన గొప్ప మడుగు కనిపించింది. ఈ విధంగా క్రూరులైన ఆ యక్షలు అనేక విధాలైన భీకరమైన మాయలను సృజించారు. అప్పుడు…
తెభా-4-345-క.
అనయంబును నయ్యక్షుల
ఘనమాయ నెఱింగి మునినికాయము వరుసన్
మనుమనుమని మను మను మని
మనమునఁ దలఁచుచును దత్సమక్షంబునకున్.
టీక:- అనయంబున్ = అవశ్యము; ఆ = ఆ; యక్షుల = యక్షుల; ఘన = గొప్ప; మాయన్ = మాయలను; ఎఱింగి = తెలిసి; ముని = మునుల; నికాయము = సమూహము; వరుసన్ = వరుసగా; మను = మనువు యొక్క; మనుమని = మనుమడిని; మను = జీవింపుము; మనుము = జీవింపుము; అని = అని; మనమునన్ = మనసులలో; తలచుచున్ = దీవిస్తూ; తత్ = అతని; సమక్షంబున్ = ఎదురన; కున్ = కు.
భావము:- విరామం లేని యక్షుల మాయలను గ్రహించిన మునులందరూ మనువు మనుమడైన ధ్రువుణ్ణి “మనుము!... మనుము!” అని దీవిస్తూ అతని ముందుకు వచ్చి…
తెభా-4-346-వ.
చనుదెంచి యా ధ్రువుం గని యిట్లనిరి.
టీక:- చనుదెంచి = వచ్చి; ఆ = ఆ; ధ్రువున్ = ధ్రువుని; కని = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- వచ్చి ఆ ధువుణ్ణి చూచి ఇలా అన్నారు.
తెభా-4-347-సీ.
"అనఘాత్మ లోకు లెవ్వని దివ్య నామంబు-
సమత నాకర్ణించి సంస్మరించి
దుస్తరంబైన మృత్యువు నైన సుఖవృత్తిఁ-
దరియింతు; రట్టి యీశ్వరుఁడు పరుఁడు
భగవంతుఁడును శార్ఙ్గపాణియు భక్తజ-
నార్తిహరుండును నైన విభుఁడు
భవదీయ విమతులఁ బరిమార్చుఁగా"కని-
పలికిన మునుల సంభాషణములు
తెభా-4-347.1-తే.
విని కృతాచమనుఁడయి మావిభుని పాద
కమలముఁ దలంచి రిపుభయంకరమహోగ్ర
కలిత నారాయణాస్త్రంబుఁ గార్ముకమునఁ
బూనఁ దడవఁ దదీయ సంధానమునను.
టీక:- అనఘాత్మ = పుణ్యాత్మ; లోకులు = జనులు; ఎవ్వని = ఎవని; దివ్య = దివ్యమైన; నామంబున్ = పేరును; సమతన్ = చక్కగా; ఆకర్ణించి = విని; సంస్మరించి = చక్కగా; స్మరించి = ధ్యానించి; దుస్తరంబు = దాటరాని; మృత్యువున్ = మృత్యువును; ఐనన్ = అయినప్పటికిని; సుఖ = సుళువైన; వృత్తిన్ = విధముగ; తరియింతురు = దాటెదరు; అట్టి = అటువంటి; ఈశ్వరుడు = విష్ణువు {ఈశ్వరుడు - ప్రభువు, విష్ణువు}; పరుడు = విష్ణువు {పరుడు - అతీతమైనవాడు, విష్ణువు}; భగవంతుడును = విష్ణువు {భగవంతుడు - మహామహిమాన్వితుడు, విష్ణువు}; శార్ఙ్గపాణి = విష్ణువు {శార్ఙ్గపాణి - శార్ఙ్గము అనెడి విల్లు ధరించువాడు, విష్ణువు}; భక్తజనార్తిహరుండునున్ = విష్ణువు {భక్తజనార్తిహరుండు - భక్తులైనవారి ఆర్తి (బాధలను) హరించువాడు, విష్ణువు}; ఐన = అయిన; విభుడు = విష్ణువు; భవదీయ = నీ యొక్క; విమతులన్ = శత్రువులను; పరిమార్చుగాక = సంహరించుగాక; అని = అని; పలికిన = పలికిన; మునుల = మునుల యొక్క; సంభాషణములు = మాటలు.
విని = విని; కృత = చేసిన; ఆచమనుండు = ఆచమనము చేసినవాడు; అయి = అయ్యి; మావిభుని = విష్ణుమూర్తి యొక్క {మావిభుడు - మా (లక్ష్మీదేవి) విభుడు (ప్రభువు), హరి}; పాద = పాదములు అనెడి; కమలమున్ = పద్మములను; తలంచి = తలచుకొని; రిపు = శత్రు; భయంకర = భయంకరము; మహా = మిక్కిలి; ఉగ్ర = భీషణములు; కలిత = కలిగిన; నారాయణా = నారాయణము అనెడి; అస్త్రంబున్ = అస్త్రమును; కార్ముకమునన్ = వింటిని; పూనన్ = ఎక్కుపెట్టడము; తడవు = ఆలస్యము; తదీయ = దాని యొక్క; సంధానమునన్ = ఎక్కుపెట్టడమువలన.
భావము:- “ఓ పుణ్యాత్ముడా! లోకులు ఎవ్వని దివ్యనామాన్ని విన్నా, స్మరించినా దాటరాని మృత్యువును కూడా దాటగలరో అటువంటి ఈశ్వరుడు, పరాత్పరుడు, భగవంతుడు, శార్ఙ్గపాణి, భక్తజనుల బాధలను తొలగించేవాడు అయిన ఆ జగన్నాథుడు నీ శత్రువులను సంహరించుగాక!” అన్నారు. ఆ మాటలు విని ధ్రువుడు ఆచమించి శ్రీహరి పాదపద్మాలను స్మరించి శత్రు భయంకరమైన నారాయణాస్త్రాన్ని వింట సంధించాడు
తెభా-4-348-తే.
కడఁగి గుహ్యక మాయాంధకార మపుడు
వెరవుచెడి దవ్వుదవ్వుల విరిసిపోయె
విమలమైన వివేకోదయమునఁ జేసి
సమయు రాగాదికంబుల సరణి నంత.
టీక:- కడగి = పూని; గుహ్యక = గుహ్యకుల; మాయా = మాయ యొక్క; అంధకారము = చీకటి; అపుడున్ = అపుడు; వెరవు = యుక్తి; చెడి = చెడిపోయి; దవ్వుదవ్వులన్ = దూరందూరంగా; విరిసిపోయెన్ = విరిగి (చెదిరి) పోయెను; విమలము = నిర్మలమైన; వివేక = జ్ఞానము; ఉదయమునన్ = కలుగుట; చేసి = వలన; సమయు = నశించు; రాగ = రాగము; ఆదికంబుల = మోదలైనవాని; సరణిన్ = వలె; అంత = అంతట.
భావము:- ఆ విధంగా ధ్రువుడు నారాయణాస్త్రాన్ని సంధించగానే అచ్చమైన జ్ఞానం ఉదయించగానే అజ్ఞానం సమసిపోయినట్లు యక్షుల మాయలు అనే కారుచీకట్లు క్షణంలో చెదరిపోయాయి.
తెభా-4-349-మ.
వరనారాయణ దేవతాస్త్ర భవ దుర్వారప్రభాహేమపుం
ఖ రుచిస్ఫార మరాళ రాజసిత పక్షక్రూరధారాపత
చ్ఛర సాహస్రము లోలి భీషణ విపక్షశ్రేణిపై వ్రాలె భీ
కరరావంబునఁ గానఁ జొచ్చు శిఖిసంఘాతంబు చందంబునన్.
టీక:- వర = శ్రేష్ఠమైన; నారాయణ = నారాయణము అనెడి; దేవతా = దివ్య; అస్త్ర = అస్త్రమున; భవ = పుట్టిన; దుర్వార = వారింపరాని; ప్రభా = కాంతులుగల; హేమ = బంగారు; పుంఖ = పిడులతో; రుచిస్ఫార = కాంతులు వెదజల్లుతున్న; మరాళరాజ = రాజహంసల; సిత = తెల్లని; పక్ష = ఈకలుగల; క్రూర = నిర్ధాక్షిణ్యమైన; ధారాపతత్ = ధారాపాతముగ; శర = బాణముల; సాహస్రములు = వేనవేలు; ఓలిన్ = వరుసగా; భీషణన్ = భయంకరమైన; విపక్ష = శత్రుపక్ష; శ్రేణి = వరుసల; పైన్ = పైన; వ్రాలెన్ = పడెను; భీకర = భీషణమైన; రావంబున్ = శబ్దముతో; కానన్ = అడవిని; చొచ్చు = చొచ్చుకుపోవు; శిఖి = మంటల; సంఘాతంబు = సమూహము; చందంబునన్ = వలె.
భావము:- వారింప శక్యం కాని ఆ నారాయణాస్త్రం నుండి బంగారు అంచులు, రాయంచ రెక్కలవంటి రెక్కలు కల వాడి బాణాలు వేలకొలది పుట్టి, అడవిని చుట్టుముట్టిన అగ్నిజ్వాలల వలె భయంకరమైన ధ్వనితో శత్రుసైనికుల పైన ఎడతెగకుండా వచ్చి పడ్డాయి.
తెభా-4-350-వ.
అట్లేసిన.
టీక:- అట్లు = ఆ విధముగ; ఏసినన్ = వేయగ.
భావము:- ఆ విధంగా నారాయణాస్త్రం ప్రయోగించగా…
తెభా-4-351-చ.
ఖరనిశితప్రదీప్త ఘన కాండపరంపర వృష్టిచేఁ బొరిం
బొరి వికలాంగులై యడరి పుణ్యజనుల్ పృథుహేతిపాణులై
గరుడునిఁ జూచి భూరిభుజగప్రకరంబు లెదిర్చి పేర్చి చె
చ్చెర నడతెంచు చందమునఁ జిత్రరథున్ బలుపూని తాఁకినన్.
టీక:- ఖర = కఠినమైన, గట్టిదైన; నిశిత = వాడియైన; ప్రదీప్త = ప్రకాశమానమైన; ఘన = పెద్ద; కాండ = బాణముల; పరంపర = వరుసల; వృష్టి = వర్షము; చేన్ = చేత; పొరింబొరి = వరుసవరుసలుగ, కట్టలుకట్టలుగ; వికలాంగులు = అవిటివారు; ఐ = అయ్యి; అడరి = భయపడి; పుణ్యజనుల్ = రాక్షసులు; పృథు = స్థూలములైన; హేతి = ఆయుధములు; పాణులు = ధరించినవారు; ఐ = అయ్యి; గరుడునిన్ = గరత్మతుని; చూచి = చూసి; భూరి = బహు మిక్కిలి; భుజగ = సర్పముల; ప్రకరంబులు = సమూహములు; పేర్చి = విజృంభించి; చెచ్చెరన్ = వేగముగ; అడతెంచు = బయలుదేరు; చందమునన్ = విధముగ; చిత్ర = చిత్రమైన; రథంబులున్ = రథములను; పూని = కట్టుకొని; తాకినన్ = ముట్టడించగా.
భావము:- నారాయణాస్త్రం నుండి ఉద్భవించిన వాడి బాణాలు తళతళ మెరుస్తూ రాక్షసులను వికలాంగులను చేశాయి. వారు రెచ్చిపోయి పెద్ద పెద్ద కత్తులను చేతుల్లో ధరించి గరుత్మంతుణ్ణి సర్ప సమూహాలు ఎదిరించినట్లు ధ్రువుణ్ణి ఎదుర్కొన్నారు.
తెభా-4-352-ఉ.
వారలఁ జండతీవ్ర శరవర్గము చేత నికృత్తపాద జం
ఘోరు శిరోధరాంబక కరోదర కర్ణులఁ జేసి యోగి పం
కేరుహమిత్ర మండల సకృద్భిద నెట్టి పదంబుఁ జెందు నా
భూరిపదంబునం బెలుచఁ బొందఁగఁ బంపె భుజావిజృంభియై.
టీక:- వారలన్ = వారిని; చండ = భయంకరమైన; తీవ్ర = వాడియైన; శర = బాణముల; వర్గమున్ = సమూహము; చేతన్ = చేత; నికృత్త = కత్తిరింపబడిన; పాద = పాదములు; జంఘా = పిక్కలు; ఊరు = తొడలు; శిరస్ = తలలు; అధర = పెదవులు; అంబక = కన్నులు; కర = చేతులు; ఉదర = పొట్టలు; కర్ణులన్ = చెవులును కలవారిని; చేసి = చేసి; యోగి = యోగి యైనవాడు; పంకేరుహమిత్ర = సూర్య {పంకేరుహ మిత్రుడు - పంకేరుహము (పద్మము)నకు మిత్రుడు, సూర్యుడు}; మండల = మండలమును; సకృత్ = అరుదుగా; భిదన్ = భేదించుటవలన; ఎట్టి = ఎటువంటి; పదంబున్ = స్థానమును; చెందున్ = చెందునో; ఆ = ఆ; భూరి = అతిగొప్ప; పదంబున్ = స్థానమునకు; పెలుచన్ = సుళువుగా; పొందగన్ = పొందునట్లు; పంపెన్ = పంపెను; భుజా = బాహుబలము; విజృంభి = విజృంభించినవాడు; ఐ = అయ్యి.
భావము:- అప్పుడు ధ్రువుడు పదునైన భయంకర బాణాలను ప్రయోగించి యక్షుల పాదాలను, పిక్కలను, తొడలను, మెడలను, చేతులను, చెవులను ఖండించాడు; కన్నులను పెకలించాడు; పొట్టలను చీల్చాడు; సూర్యమండలాన్ని భేదించుకొని యోగులు పొందే ఉత్తమ లోకానికి వారిని పంపించాడు.
తెభా-4-353-వ.
ఇవ్విధంబున నా చిత్రరథుండగు ధ్రువునిచేత నిహన్యమానులును నిరపరాధులును నయిన గుహ్యకులం జూచి యతని పితామహుండైన స్వాయంభువుండు ఋషిగణ పరివృతుం డై చనుదెంచి ధ్రువునిం జూచి యిట్లనియె “వత్సా నిరపరాధులైన యీ పుణ్యజనుల నెట్టి రోషంబున వధియించితి, వట్టి నిరయహేతువైన రోషంబు చాలు; భ్రాతృవత్సల! భ్రాతృవధాభితప్తుండవై కావించు నీ యత్నం బుడుగుము.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగ; ఆ = ఆ; చిత్రరథుండు = సూర్యనివంటివాడు; అగు = అయినట్టి; ధ్రువుని = ధ్రువుని; చేతన్ = చేత; నిహన్యమానులును = చంపబడినవారును; నిరపరాధులును = అపరాధములు లేనివారును; అయిన = అయినట్టి; గుహ్యకులన్ = గుహ్యకులను; చూచి = చూసి; అతని = అతని యొక్క; పితామహుండు = తాత; ఐన = అయినట్టి; స్వాయంభువుండు = స్వాయంభువ మనువు; ఋషి = ఋషుల; గణ = సమూహముచే; పరివృతుండు = చుట్టును యున్నవాడు; ఐ = అయ్యి; చనుదెంచి = వచ్చి; ధ్రువునిన్ = ధ్రువుని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; వత్సా = పుత్రా; నిరపరాధులును = అపరాధములు లేనివారు; ఐన = అయినట్టి; ఈ = ఈ; పుణ్యజనులన్ = రాక్షసులను; ఎట్టి = ఎటువంటి; రోషంబునన్ = రోషముతో; వధియించితివి = సంహరించావో; అట్టి = అటువంటి; నిరయ = దుర్గతికి, నరకానికి; హేతువు = కారణము; ఐన = అయినట్టి; రోషంబున్ = రోషము; చాలు = చాలు; భాతృవత్సల = సోదరప్రేమ కలవాడ; భాతృ = సోదరుని; వధా = సంహారమునకు; అభితప్తుండవు = మిక్కిలి బాధపడినవాడవు; ఐ = అయ్యి; కావించు = చేసెడి; నీ = నీ; యత్నంబు = ప్రయత్నమును; ఉడుగుము = మానుము.
భావము:- ఈ విధంగా చిత్రరథుడైన ధ్రువుడు సంహరిస్తున్న నిరపరాధులైన యక్షులను చూచి ధ్రువుని తాత అయిన స్వాయంభువ మనువు ఋషులతో కూడి వచ్చి ధువునితో ఇలా అన్నాడు “నాయనా! తప్పు చేయని యక్ష రాక్షసులను కోపంతో వధించావు. నరక కారణమైన క్రోధాన్ని చాలించు. తమ్ముని చావునకు పరితపించి నీవు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని విరమించు.
తెభా-4-354-క.
అనఘా! మనుకులమున కిది
యనుచిత కర్మంబ; యొకనికై పెక్కండ్రి
ట్లని మొనఁ ద్రుంగిరి; యిది నీ
కనయంబును వలవ; దుడుగు మయ్య! కుమారా!
టీక:- అనఘా = పుణ్యుడా; మను = మనువుల; కులమున్ = వంశస్థుల; కున్ = కి; ఇది = ఇది; అనుచిత = తగని; కర్మంబ = పని; ఒక్కని = ఒక్కని; కై = కోసము; పెక్కండ్రిన్ = చాలామందిని; ఇట్లు = ఈ విధముగ; అని = యుద్ధము; మొనన్ = ముఖమున; త్రుంగిరి = ఖండింపబడిరి; ఇది = ఇది; నీ = నీ; కున్ = కు; అనయంబునున్ = ఎప్పుడూ; వలవదు = వద్దు; ఉడుగుము = మానుము; అయ్య = తండ్రి; కుమారా = పుత్రా.
భావము:- పుణ్యాత్ముడవైన ఓ ధ్రువకుమారా! మనుకులానికి ఇది తగని పని. ఒక్కనికోసం పెక్కుమందిని వధించావు. ఇట్టి కార్యం నీవు చేయరాదు. దీనిని విరమించు.
తెభా-4-355-వ.
అదియునుం గాక, దేహాభిమానంబునం బశుప్రాయులై భూతహింస గావించుట హృషీకేశానువర్తను లైన సాధువులకుం దగదు; నీవ సర్వభూతంబుల నాత్మభావంబునఁ దలంచి సర్వభూతావాసుండును దురారాధ్యుండును నైన విష్ణుని పదంబులఁ బూజించి తత్పరమపదంబును బొందితి; వట్టి భగవంతుని హృదయంబున ననుధ్యాతుండవు, భాగవతుల చిత్తంబులకును సమ్మతుండవు మఱియు సాధువర్తనుండ వన నొప్పు నీ వీ పాపకర్మం బెట్లు చేయ సమకట్టితి? వే పురుషుండైననేమి మహాత్ముల యందుఁ దితిక్షయు, సముల యందు మైత్రియు, హీనుల యందుఁ గృపయు, నితరంబులగు సమస్త జంతువుల యందు సమత్వంబును గలిగి వర్తించు వానియందు సర్వాత్మకుం డైన భగవంతుడు ప్రసన్నుం డగు; నతండు ప్రసన్నుం డయిన వాఁడు ప్రకృతి గుణంబులం బాసి లింగశరీరభంగంబు గావించి బ్రహ్మానందంబునుం బొందు; నదియునుం గాక, కార్య కారణ సంఘాత రూపంబైన విశ్వం బీశ్వరునందు నయస్కాంత సన్నిధానంబు గలిగిన లోహంబు చందంబున వర్తించు; నందు సర్వేశ్వరుండు నిమిత్తమాత్రంబుగాఁ బరిభ్రమించు; నట్టి యీశ్వరుని మాయా గుణ వ్యతికరంబున నారబ్ధంబు లైన పంచభూతంబుల చేత యోషిత్పురుషవ్యవాయంబు వలన యోషిత్పురుషాదిరూప సంభూతి యగు; నివ్విధంబునఁ దత్సర్గంబుఁ దత్సంస్థానంబుఁ దల్లయంబు నగుచు నుండు; నిట్లు దుర్విభావ్యం బైన కాలశక్తిం జేసి గుణక్షోభంబున విభజ్యమాన వీర్యుండు ననంతుండు ననాదియు నై జనంబులచేత జనంబులం బుట్టించుచుండుటం జేసి యాదికరుండును, మృత్యుహేతువున జనంబుల లయంబు నొందించుటం జేసి యంతకరుండును, ననాది యగుటంజేసి యవ్యయుండును నైన భగవంతుండు జగత్కారణుం డగుం; గావున నీ సృష్టి పాలన విలయంబులకుం గర్తగానివాని వడుపున దానిఁ జేయుచుండు; నిట్లు మృత్యరూపుండును బరుండును సమవర్తియు నైన యీశ్వరునికి స్వపక్ష పరపక్షంబులు లేవు; కర్మాధీనంబులైన భూతసంఘంబులు రజంబు మహావాయువు ననుసరించు చాడ్పున నస్వతంత్రంబు లగుచు నతని ననువర్తించు; నీశ్వరుండును జంతుచయాయు రుపచయాపచయ కరణంబులం దస్పృష్టుండును నగు జీవుండు గర్మబద్ధుం డగుటంజేసి కర్మంబ వానికి నాయురుపచయాపచయంబులం జేయుచుండు; మఱియు సర్వజగత్కర్మసాక్షి యగు సర్వేశ్వరుని.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ; దేహా = శరీరముపైని; అభిమానంబునన్ = అభిమానమువలన; పశుప్రాయులు = పశువుల వంటివారు; ఐ = అయ్యి; భూత = జీవులను; హింస = హింస; కావించుట = చేయుట; హృషీకేశ = విష్ణుని {హృషీకేశుడు - హృషీకములు (ఇంద్రియములు)కు ఈశుడు, విష్ణువు, వ్యు. హృషీకేశః – హృషీకాణాం (ఇంద్రియాణాం) ఈశః (నియామకుడు), విష్ణుసహస్రనామాలులోని 47వ నామం, సూర్య చంద్రుల (హృష్టముల) కేశములు (కిరణములు) చే జగత్తునకు ప్రబోధము, స్వాపము కలిగించువాడు, ఇంద్రియాలకు క్షేత్రజ్ఞరూపుడు}; అనువర్తులు = మార్గ మనుసరించువారు; ఐన = అయినట్టి; సాధువుల్ = మంచివారి; కున్ = కి; తగదు = తగిన పనికాదు; నీవు = నీవు; సర్వ = అన్ని; భూతంబులన్ = జీవులను; ఆత్మ = తానను; భావమునన్ = భావముతో; తలంచి = తలచి; సర్వ = అన్ని; భూత = జీవు లందును; ఆవాసుండు = వసించువాడును; దురారాధ్యుండును = ఆరాధించుట కష్టమైనవాడును; ఐన = అయినట్టి; విష్ణుని = విష్ణుమూర్తి యొక్క; పదంబులన్ = పాదములను; పూజించి = పూజించి; తత్ = అతని యొక్క; పరమ = అత్యుత్తమమైన; పదంబునున్ = స్థానమును; పొందితివి = పొందితివి; అట్టి = అటువంటి; భగవంతుని = విష్ణువుని; హృదయంబునన్ = హృదయమందు; అనుధ్యాతుండవు = అనుకూలముగ ధ్యానము చేయబడిన వాడవు; భాగవతుల = భాగవతుల యొక్క; చిత్తంబుల్ = మనసుల; కున్ = కు; సమ్మతుండవు = అంగీకారము పొందిన వాడవు; మఱియున్ = ఇంకను; సాధు = మంచి; వర్తనుండవు = నడవడిక కలవాడవు; అనన్ = అనుటకు; ఒప్పు = తగనట్టి; నీవు = నీవు; ఈ = ఈ విధమైన; పాప = పాపపు; కర్మంబున్ = కర్మమును; ఎట్లు = ఏ విధముగ; చేయన్ = చేయుటకు; సమకట్టితివి = పూనుకొంటివి; ఏ = ఏ; పురుషుండు = మానవుడు; ఐననేమి = అయితే; మహాత్ముల = గొప్పవారి; అందున్ = ఎడల; తితిక్షయున్ = సహనము; సముల = సమానమైనవారి; అందున్ = ఎడల; మైత్రియున్ = స్నేహము; హీనులు = తక్కువ వారి; అందున్ = ఎడల; కృపయున్ = దయ; ఇతరంబులు = ఇతరము; ఐన = అయినట్టి; సమస్త = సమస్తమైన; జంతువులు = ప్రాణుల; అందున్ = ఎడల; సమత్వంబును = సమత్వము; కలిగి = ఉండి; వర్తించు = నడచు; వాని = వాని; అందున్ = ఎడల; సర్వ = అందరిలోను; ఆత్మకుండు = ఆత్మరూపమున ఉండువాడు; ఐన = అయినట్టి; భగవంతుండు = నారాయణుడు; ప్రసన్నుండు = ప్రసన్నత కలవాడు; అగు = అగును; అతండు = అతడు; ప్రసన్నుండు = ప్రసన్నుండు; అయిన = అయినచో; వాడు = వాడు; ప్రకృతిగుణంబులన్ = ప్రకృతి గుణములను {ప్రకృతి గుణములు - త్రిగుణ సమ్మేళనము వలన పుట్టిన వ్యక్తిగతమైన ప్రత్యేక స్వభావము నందలి గుణములు}; పాసి = తొలగి; లింగశరీర = లింగశరీరమును {లింగశరీరము - తన ప్రత్యేక స్వభావ సంస్కారముల గుర్తులుగల ప్రవర్తనాత్మకమయిన దేహము}; భంగంబున్ = బద్దలుకొట్టుటను; కావించి = చేసి; బ్రహ్మానందబునున్ = బ్రహ్మానందమును; పొందున్ = పొందును; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; కార్య = కార్యము; కారణ = కారణముల; సంఘాత = కూడిన; రూపంబు = రూపము కలది; ఐన = అయినట్టి; విశ్వంబు = జగత్తు; ఈశ్వరుని = భగవంతుని; అందున్ = లో; అయస్కాంత = అయస్కాంతము యొక్క; సన్నిధానంబు = సామీప్యము; కలిగిన = ఉన్నట్టి; లోహంబున్ = ఇనుము; చందంబునన్ = వలె; వర్తించు = ప్రవర్తించును; అందున్ = అందులో; సర్వేశ్వరుండు = భగవంతుడు, {విష్ణుసహస్రనామాలులో 96వ నామం, ఈశ్వరులందరికి ఈశ్వరుడు}; నిమిత్తమాత్రంబుగా = నిమిత్తమాత్రముగా; పరిభ్రమించు = తిరుగుతుండును; అట్టి = అటువంటి; ఈశ్వరుని = భగవంతుని; మాయా = మాయ యొక్క; గుణ = గుణముల; వ్యతికరంబున్ = అల్లిక, పరస్పర మేళనంబువలన; ఆరబ్ధంబులు = ఆరంభింపబడినవి, కల్పింపబడినవి; ఐన = అయినట్టి; పంచభూతంబుల = పంచభూతముల {పంచభూతంబులు - 1.భూమి 2.జలము 3తేజస్సు 4.వాయువు 5,ఆకాశము "పృథివ్యాపస్తేజో వాయురాకాశమితి భూతాని"[గౌతమన్యాయసూత్రములు 1-1-13]}; చేతన్ = చేత; యోషిత్ = స్త్రీ; పురుష = పురుష; వ్యవాయంబున్ = లక్షణముల సమ్మేళనము; వలనన్ = వలన; యోషిత్ = స్త్రీ; పురుష = పురుషులు; ఆది = మొదలగు; రూప = రూపముల; సంభూతి = పుట్టుకలు; అగు = అగును; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; తత్ = ఆ; సర్గంబును = సృష్టి; తత్ = దాని; సంస్థానంబున్ = స్థితి; తత్ = దాని; లయంబున్ = లయమును; అగుచున్ = అవుతూ; ఉండున్ = ఉండును; ఇట్లు = ఈ విధముగ; దుర్విభావ్యంబు = భావింప శక్యము కానిది; ఐన = అయినట్టి; కాలశక్తిన్ = కాలము అనెడి శక్తి; చేసి = వలన; గుణ = గుణముల; క్షోబంబునన్ = సమ్మేళనము నందు; విభజ్యమాన = విభజింపబడుతున్న; వీర్యుండు = శక్తి కలవాడు; అనంతుడు = అంతము లేనివాడు, {అనంతః - విష్ణుసహస్రనామాలులో 659వ నామం, 886వ నామం, అంతములేనివాడు, సర్వత్రా సర్వకాలము లందు ఉండువాడు}; అనాదియున్ = మొట్టమొదటినుండి ఉన్నవాడు {అనాదిః - విష్ణుసహస్రనామాలులో 941వ నామం, ఆది లేని వాడు, తనకు కారణము లేనివాడు}; ఐ = అయ్యి; జనంబుల = జనముల; చేతన్ = చేత; జనంబులన్ = జనులను; పుట్టించుచున్ = పుట్టిస్తూ; ఉండుటన్ = ఉండుట; చేసి = వలన; ఆదికరుండును = మొదలు అనెడి దానిని చేయువాడు; మృత్యు = మరణము అనెడి; హేతువున్ = కారణముచే; జనంబులన్ = జనములను; లయంబున్ = లయమును; ఒందించుటన్ = పొందిస్తుండుట; చేసి = వలన; అంతకరుండును = అంతము అనెడి దానిని కలిగించువాడు; అనాది = మొదలు అనెడిది లేనివాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; అవ్యయుండును = వ్యయము కానివాడు {అవ్యయః విష్ణుసర్వనామాలులో 13వ నామం, 900వ నామం వినాశముకాని, వికారము కాని లేనివాడు}; ఐన = అయిన; భగవంతుండు = భగవంతుడు; జగత్ = లోకములకు; కారణుండు = కారణము యైనవాడు; అగున్ = అగును; కావునన్ = అందుచేత; ఈ = ఈ; సృష్టి = సృష్టి; పాలన = స్థితి; విలయంబుల = లయముల; కున్ = కు; కర్తకానివాని = కర్త కాని వాని; వడుపునన్ = విధముగ; దానిన్ = దానిని; చేయుచుండు = చేస్తుండును; ఇట్లు = ఈ విధముగ; మృత్యు = మృత్యువు యొక్క; రూపుండును = రూపము కలవాడును; పరుండును = అతీతుడును; సమవర్తియున్ = సమత్వముతో వర్తించువాడును; ఐన = అయిన; ఈశ్వరుని = ఈశ్వరుని; కిన్ = కి; స్వ = తన; పక్షంబున్ = వారు; పర = ఇతరులు యైన; పక్షంబున్ = వారు; లేవు = అనెడి భేదములు లేవు; కర్మ = కర్మకు; ఆధీనంబులు = ఆధీనము యైనవి; ఐన = అయిన; భూత = జీవ; సంఘంబులున్ = సమూహములు; రజంబున్ = ధూళిరేణులు; మహా = గొప్ప; వాయువు = గాలిని; అనుసరించు = అనుసరించెడి; చాడ్పున = విధముగ; అస్వతంత్రంబులు = స్వతంత్రము లేనివి; అగుచున్ = అవుతూ; అతనిన్ = అతనిని; అనువర్తించు = అనుసరించును; ఈశ్వరుండును = భగవంతుడును; జంతు = జంతువుల; చయ = సమూహములు; ఆయుః = ఆయుర్దాయములను; ఉపచయ = సమకూర్చుట; అపచయ = రూపుమాపుట; కరణంబులు = చేయుటల; అందున్ = లో; అస్పృష్టుండును = తాకనివాడును; అగున్ = అగును; జీవుండు = ప్రాణి; కర్మ = కర్మలచే; బద్ధుండు = కట్టబడినవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; కర్మంబ = కర్మమే; వాని = వాని; కిన్ = కి; ఆయుః = ఆయుర్దాయములను; ఉపచయ = సృష్టించుటయునప; అపచయంబులన్ = లయంబును; చేయుచుండు = చేస్తుండును; మఱియున్ = ఇంకను; సర్వ = అన్ని; జగత్ = లోకములకు; కర్మ = కర్మములకు; సాక్షి = తెలిసి చూచెడివాడు; అగు = అయిన; సర్వేశ్వరుని = సర్వేశ్వరుని.
భావము:- అంతేకాక దేహం మీది అభిమానంతో పశువులవలె ప్రాణి హింస చేయడం శ్రీహరి భక్తులైన సజ్జనులకు తగదు. నీవు సర్వప్రాణులను నీవలె భావించి సర్వప్రాణి స్వరూపుడైన శ్రీహరిని కొలిచి ఆయన స్థానాన్ని సాధించావు. ఆయన మనస్సుకు ఎక్కావు. హరిభక్తులను మెప్పించావు. నీవు మంచి నడవడి కలవాడవు. తనకంటే గొప్పవారియందు సహనభావం, తనతో సమానులయందు స్నేహభావం, తనకంటే తక్కువ వారియందు దయ, మిగిలిన సమస్త ప్రాణులయందు సమభావం కలిగి వర్తించే వానిని సర్వాంతర్యామి అయిన భగవంతుడు కరుణిస్తాడు. భగవంతుడు కరుణిస్తే మానవుడు ప్రాకృత గుణాలనుండి విముక్తుడై లింగ శరీరాన్ని విడిచి బ్రహ్మానందాన్ని పొందుతాడు. అయస్కాంతం సన్నిధిలో లోహం భ్రమించినట్లు పరమాత్ముని సన్నిధిలో కార్యకారణ స్వరూపమైన ప్రపంచం భ్రమిస్తుంది. సర్వేశ్వరుడు నిమిత్తమాత్రంగా ఉంటాడు. అటువంటి భగవంతుని మాయాగుణ సంబంధంవల్ల పంచభూతాల వల్ల దేహాది ఆకారాలను పొందిన స్త్రీ పురుషుల కలయిక చేత స్త్రీపురుషుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ విధంగా సృష్టి, స్థితి, నాశము జరుగుతూ ఉంటాయి. ఊహింప శక్యం కాని కాలశక్తి ద్వారా జనములనుండి జనములను పుట్టించడం వల్ల ఆద్యుడు, నశింపజేయటం వల్ల అంతకుడు, అనాది కావటం వల్ల అవ్యయుడు అయి భగవంతుడు జగత్తుకు కారణం అవుతాడు. అందువల్ల సృష్టి స్థితి లయాలను చేయనట్లే ఉండి చేస్తుంటాడు. ఈ విధంగా మృత్యుస్వరూపుడు, పరుడు, సమవర్తి అయిన భగవంతునకు తనవారనీ, పరులనీ భేదం లేదు. కర్మలకు లోబడిన జీవులు స్వతంత్రత లేనివారై ధూళికణాలు గాలిని అనుసరించిన విధంగా భగవంతుని అనుసరిస్తారు. ఉపచయం, అపచయం కలిగిస్తాడు. సర్వేశ్వరుడు కర్మసాక్షి.
తెభా-4-356-క.
కొందఱు స్వభావ మందురు,
కొందఱు కర్మం బటండ్రు, కొందఱు కాలం
బందురు, కొందఱు దైవం
బందురు, కొంద ఱొగిఁ గామ మండ్రు మహాత్మా!
టీక:- కొందఱు = కొంతమంది; స్వభావము = అంతః ప్రకృతి; అందురు = అంటారు; కొందఱున్ = కొందరు; కర్మంబున్ = కర్మము; అట = అట; అండ్రు = అంటారు; కొందఱు = కొంతమంది; కాలంబు = కాలము; అందురు = అంటారు; కొందఱు = కొందరు; దైవంబున్ = దైవము; అందురు = అంటారు; కొందఱు = కొంతమంది; ఒగిన్ = వరుసగా; కామము = కామము; అండ్రు = అంటారు; మహాత్మ = గొప్పవాడ.
భావము:- కొందరు ఆయనను స్వభావం అంటారు. మరికొందరు కర్మం అంటారు. ఇంకా కొందరు కాలం అంటారు. కొందరు దైవం అంటారు. మరికొందరు కామం అనికూడ అంటారు.
తెభా-4-357-వ.
ఇట్టు లవ్యక్తరూపుండును, నప్రమేయుండును, నానాశక్త్యుదయ హేతుభూతుండును నైన భగవంతుండు చేయు కార్యంబులు బ్రహ్మరుద్రాదు లెఱుంగ రఁన నతని తత్త్వంబు నెవ్వ రెఱుంగ నోపుదురది గావునఁ బుత్రా! యిట్లుత్పత్తి స్థితి లయంబులకు దైవంబు కారణం బై యుండ నీ ధనదానుచరులు భవదీయ భాతృహంత లగుదురే? భూతాత్మకుండు, భూతేశుండు, భూతభావనుండు, సర్వేశ్వరుండుఁ, బరాపరుండు నగు నీశుండ మాయాయుక్తుండై స్వశక్తిచే సృష్టి స్థితి లయంబులం జేయు; నైన ననహంకారంబునం జేసి గుణకర్మంబులచే నస్పృశ్యుం డగుచు వర్తించు; నదియునుం గాక, యీ ప్రజాపతులు విశ్వసృణ్ణామంబుల నియంత్రితు లై ముకుద్రాళ్ళు పెట్టిన పశువులుం బోలె నెవ్వని యాజ్ఞాధీనకృత్యులై వర్తింతు రట్టి దుష్టజన మృత్యువును, సుజనామృత స్వరూపుండును, సర్వాత్మకుండును, జగత్పరాయణుండును నైన యీశ్వరుని సర్వప్రకారంబుల శరణంబుఁ బొందు; మదియునుం గాక.
టీక:- ఇట్టులు = ఈ విధముగ; అవ్యక్తరూపుండును = వ్యక్తముకాని రూపము కలవాడు; అప్రమేయుండును = యదార్థ స్వరూప మెరుగ రానివాడు {అప్రమేయుండు - శ్రీశ్రీ శంకరాచార్యుల వారి విష్ణుసహస్రనామ భాష్యం 46 వ నామం, షట్ప్రమాణ పరమ దూరుడు కనుక అప్రమేయుడు; 1 ప్రత్యక్ష, 2. అనుమాన, 3. ఉపమాన, 4. అర్థాపత్తి, 5 అభావ, 6. శాస్త్రరూప ప్రమాణములు షట్ప్రమాణములు అనబడును}; నానా శక్త్యుదయ హేతుభూతుండునున్ = సర్వశక్తులు పుట్టుటకు కారణమైనవాడు; ఐన = అయిన; భగవంతుడు = వీర్యవంతుడు; చేయు = చేసెడి; కార్యంబులు = పనులు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; రుద్ర = శివుడు {రుద్రుడు – రౌద్రము కలవాడు, శివుడు}; ఆదులు = మొదలగువారు; ఎఱుంగరు = ఎరుగరు; అనన్ = అనగా; అతనిన్ = అతని; తత్త్వంబు = తత్త్వమును; ఎవ్వరు = ఎవరు; ఎఱుంగన్ = తెలియుటకు; నోపుదురు = సమర్థులు అగుదురు; అదిగావున = అందుచేత; పుత్రా = పుత్రుడా; ఇట్లు = ఈ విధముగ; ఉత్పతి = సృష్టి; స్థితి = స్థితి; లయంబుల = లయముల; కున్ = కు; దైవంబున్ = దైవము; కారణంబున్ = కారణము; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; ఈ = ఈ; ధనద = కుబేరుని; అనుచరులు = అనుచరులు; భవదీయ = నీ యొక్క; భాతృ = సోదరుని; హంతలు = సంహరించినవారు; అగుదురే = అవుతారా ఏమి; భూతాత్మకుండు = నారాయణుడు {భూతాత్మకుండు - సకల జీవుల యందు ఆత్మగ ఉండువాడు, విష్ణువు, {భూతాత్మః - విష్ణుసహస్రనామములులో 8వ నామం, సర్వ జీవ కోటి యందు అంతర్యామిగ ఉండువాడు}; భూతేశుండు = నారాయణుడు {భూతేశుండు - సర్వ భూతములకు ప్రభువు, విష్ణువు}; భూతభావనుండును = నారాయణుడు {భూత భావనః - విష్ణుసహస్రానామాలులో 9వ నామం, జీవులను కల్పన జేయువాడు, జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు, విష్ణువు}; సర్వేశ్వరుండున్ = నారాయణుడు {సర్వేశ్వరః - విష్ణుసహస్రానామాలులో 96వ నామం, ఈశ్వరులు సర్వులకును ఈశ్వరుడు, విష్ణువు}; పరాపరుండున్ = నారాయణుడు {పరాపరుండున్ – అతీతుడును అంతర్యామివి, విష్ణువు}; అగున్ = అయిన; ఈశుండ = ఈశ్వరుడే; మాయా = మాయతో; యుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి; స్వ = తన యొక్క; శక్తి = శక్తి; చేతన్ = వలన; సృష్టి = సృష్టి; స్థితి = స్థితి; లయంబులన్ = లయములను; చేయును = కలుగజేయును; ఐనన్ = అయినప్పటికిని; అహంకారంబునన్ = అహంకారము; చేసి = వలన; గుణ = గుణముల; కర్మంబులన్ = కర్మముల; చేన్ = చేత; అస్పృశ్యుండు = తాకనివాడు; అగుచున్ = అవుతూ; వర్తించు = ప్రవర్తించును; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ఈ = ఈ; ప్రజాపతులు = ప్రజాపతులు; విశ్వ = విశ్వమును; సృట్ = సృష్టించువారు; నామంబులన్ = అను పేర్లతో; నియంత్రితులు = నియమించబడినవారు; ఐ = అయ్యి; ముకుద్రాళ్ళు = ముక్కు తాళ్ళుతో; పెట్టిన = కట్టబడిన; పశువులన్ = పశువుల వంటివారు; పోలెన్ = వలె; ఎవ్వని = ఎవని; ఆజ్ఞా = ఆజ్ఞకు; ఆధీన = లొంగి; కృత్యులు = పనులు చేయువారు; ఐ = అయ్యి; వర్తింతురు = నడచెదరో; అట్టి = అటువంటి; దుష్ట = దుష్టులు యైన; జన = వారికి; మృత్యువును = మరణమును; సు = మంచి; జన = వారికి; అమృత = అమృత; రూపుండును = స్వరూపుడును; సర్వాత్మకుండును = సర్వమునందును ఉండువాడును; జగత్ = లోకములకు; పరాయణుండును = ఉత్తమమైన గతి యైన వాడును; ఐన = అయిన; ఈశ్వరుని = భగవంతుని; సర్వ = అన్ని; ప్రకారంబులన్ = విధములుగను; శరణంబు = శరణ్యము; పొందుము = పొందుము; అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- ఈ విధంగా నిర్గుణుడు, అప్రమేయుడు, అనేక శక్తులకు హేతుభూతుడు అయిన భగవంతుడు చేసే పనులను బ్రహ్మ రుద్రాదులు సైతం తెలుసుకోలేరు. ఇక అతని తత్త్వాన్ని ఎవరు తెలుసుకోగలరు? కాబట్టి నాయనా! పుట్టుకకు, మరణానికి దైవమే కారణం. అందుచేత ఈ కుబేరుని భటులు నీ తమ్ముణ్ణి చంపారని భావించవద్దు. భూతాత్మకుడు, భూతేశుడు, భూతభావనుడు, సర్వేశ్వరుడు, పరాత్పరుడు అయిన భగవంతుడు తన మాయచేత సృష్టి స్థితి లయాలను చేస్తూ ఉంటాడు. అయినా అహంకార రాహిత్యం వల్ల గుణకర్మలకు అంటరానివాడై ఉంటాదు. ముక్కుత్రాళ్ళతో కట్టబడిన పశువుల వలె ఈ ప్రజాపతులు భగవంతుని ఆజ్ఞలను పాటించి ప్రవర్తిస్తారు. కాబట్టి దుష్టులకు మృత్యుస్వరూపుడు, శిష్టులకు అమృతస్వరూపుడు, సర్వాత్మకుడు, జగత్పరాయణుడు అయిన భగవంతుణ్ణి అన్ని విధాల శరణు పొందు. అంతేకాక…
తెభా-4-358-సీ.
అనఘాత్మ! నీవు పంచాబ్ద వయస్కుండ-
వై పినతల్లి నిన్నాడినట్టి
మాటల నిర్భిన్నమర్ముండ వగుచును-
జనయిత్రి దిగనాడి వనము కేగి
తప మాచరించి యచ్చపు భక్తి నీశ్వరుఁ-
బూజించి మహితవిభూతి మెఱసి
రమణఁ ద్రిలోకోత్తరంబైన పదమును-
బొందితి, వది గాన భూరిభేద
తెభా-4-358.1-తే.
రూప మైన ప్రపంచంబు రూఢి నే మ
హాత్మునందుఁ బ్రతీతమై యలరు నట్టి
యగుణుఁ డద్వితీయుండును నక్షరుండు
నైన యీశ్వరుఁ బరమాత్ము ననుదినంబు.
టీక:- అనఘాత్మ = పుణ్యాత్ముడా; నీవు = నీవు; పంచ = ఐదు (5); అబ్ద = సంవత్సరముల; వయస్కుండవు = వయసుకలవాడవు; ఐ = అయ్యి; పినతల్లి = పినతల్లి; నిన్ను = నిన్ను; ఆడిన = పలికిన; అట్టి = అటువంటి; మాటలన్ = మాటలచే; నిర్భిన్న = బాగుగ చితికిపోయిన; మర్ముండవు = మనసు కలవాడవు; అగుచునున్ = అవుతూ; జనయిత్రి = తల్లిని; దిగనాడి = విడచిపెట్టి; వనమున్ = అడవికి; ఏగి = వెళ్ళి; తపము = తపస్సు; ఆచరించి = చేసి; అచ్చపు = నిజమైన; భక్తిన్ = భక్తితో; ఈశ్వరున్ = నారాయణుని; పూజించి = పూజించి; మహిత = మహా; విభూతిన్ = వైభవముతో; మెఱసి = విరాజిల్లి; రమణన్ = మనోజ్ఞముగ; త్రిలోక = ముల్లోకముల; ఉత్తరంబు = పైది; ఐన = అయిన; పదమునున్ = స్థానమును; పొందితివి = పొందితివి; అదిగాన = అందుచేత; భూరి = అత్యధికమైన; భేద = భేదములు కలిగిన.
రూపము = స్వరూపములుకలది; ఐన = అయిన; ప్రపంచంబున్ = ప్రపంచము; రూఢిన్ = నిశ్చయముగ; ఏ = ఏ; మహాత్మున్ = మహాత్ముని; అందు = అందు; ప్రతీతము = ప్రసిద్ధము; ఐ = అయ్యి; అలరున్ = విలసిల్లు; అట్టి = అటువంటి; అగుణుడు = హరి {అగుణుడు - గుణములు లేనివాడు, త్రిగుణాతీతుడు, విష్ణువు}; అద్వితీయుండు = హరి {అద్వితీయుండు - రెండవవాడులేనివాడు, అంతాతానైనవాడు, విష్ణువు}; అక్షరుండును = హరి {అక్షరుండును - క్షయములేనివాడు, శాశ్వతుడు, విష్ణువు, విష్ణుసహస్రనామాలులో 17వ నామం, 481వ నామం నాశరహితుడు}; ఐన = అయిన; ఈశ్వరున్ = హరి {ఈశ్వరః - ఈశత్వము కలవాడు, ఒకరి సాహాయము లేకనే కార్యములు నేరవేర్చగలవాడు, నిరుపాధికమైన ఐశ్వర్యము కలవాడు, విష్ణుసహస్రనామాలులో 36వ నామం, 74 వ నామం, విష్ణువు}; పరమాత్మున్ = హరి {పరమాత్మః - పరమమైన ఆత్మకలవాడు, విష్ణువు, విష్ణుస్హస్రనామాలులో 11వ నామం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు}; అనుదినంబును = ప్రతిదినము.
భావము:- నాయనా! నీవు అయిదేండ్ల వయస్సులో పినతల్లి నిన్నాడిన మర్మాంతకాలైన మాటలచేత లోలోపల ఎంతో నొచ్చుకొని, కన్నతల్లిని విడిచి, అడవికి పోయి తపస్సు చేశావు. అచ్చమైన భక్తితో భగవంతుణ్ణి పూజించి మూడు లోకాలకూ మీదిదైన ధ్రువపదాన్ని పొందావు. భేదరూపమైన ఈ ప్రపంచం ఏ మహాత్మునియందు ప్రతీతమై ఉంటుందో అటువంటి త్రిగుణాతీతుడు, అద్వితీయుడు, శాశ్వతుడు అయిన ఆ భగవంతుని కోసం ప్రతిదినం….
తెభా-4-359-సీ.
కైకొని శుద్ధంబు గతమత్సరంబును-
నమలంబు నగు హృదయంబునందు
సొలయ కన్వేషించుచును బ్రత్యగాత్ముండు-
భగవంతుఁడును బరబ్రహ్మమయుఁడు
నానందమాత్రుండు నవ్యయుఁ డుపపన్న-
సకలశక్తియుతుండు సగుణుఁడజుఁడు
నయిన సర్వేశ్వరునం దుత్తమంబైన-
సద్భక్తిఁ జేయుచు సమత నొప్పి
తెభా-4-359.1-తే.
రూఢి సోహమ్మమేతి ప్రరూఢ మగుచు
ఘనత కెక్కు నవిద్యయన్ గ్రంథి నీవు
ద్రెంచివైచితి; కావున ధీవరేణ్య!
సర్వశుభహాని యైన రోషంబు వలదు.
టీక:- కైకొని = చేపట్టి; శుద్ధంబు = పరిశుద్ధమైనది; గత = పోయిన; మత్సరంబును = మత్సరము యైనది; అమలంబును = మలములు లేనివాడు; హృదయంబున్ = హృదయము; అందు = అందు; సొలయకన్ = అలసిపోకుండగ; అన్వేషించుచున్ = వెదకికొనుచు; ప్రత్యగాత్ముండు = హరి {ప్రత్యగాత్ముడు - ఎదురుగకనబడువాడు, విష్ణువు}; భగవంతుడును = హరి {భగవంతుడు - ఐశ్వర్యవంతుడు, విష్ణువు}; పరబ్రహ్మమయుడున్ = హరి {పరబ్రహ్మమయుడు - పరబ్రహ్మముయైనవాడు, విష్ణువు}; ఆనందమాతృండున్ = హరి {ఆనందమాతృండు - ఆనందము తానే ఐన వాడు, విష్ణువు}; అవ్యయుడు = హరి {అవ్యయుడు - తరుగుటలేనివాడు, అనంతుడు, విష్ణువు}; ఉపపన్నసకలశక్తియుతుండు = హరి {ఉపపన్నసకలశక్తియుతుండు - ఉపపన్న (ఎదుట సిద్ధమైన) సకల (సమస్తమైన) శక్తులు కలవాడు, విష్ణువు}; సగుణుడు = హరి {సగుణుడు - దివ్యగుణములు కలవాడు, విష్ణువు}; అజుడు = హరి {అజుడు - జన్మములేనివాడు, విష్ణువు}; అయిన = అయిన; సర్వేశ్వరున్ = హరి {సర్వేశ్వరుడు - సర్వులకును ఈశ్వరుడు, విష్ణువు}; అందున్ = ఎడల; ఉత్తమంబు = ఉత్తమమైనది; ఐన = అయిన; సత్ = మంచి; భక్తిన్ = భక్తితో; చేయుచున్ = చేస్తూ; సమతన్ = సమత్వముతో; ఒప్పి = ఒప్పియుండి.
రూఢిన్ = నిశ్చయముగ; సోzహమ్మమేతి = భేదభావములతో {సోzహమ్మమేతి - సోzహం (వాడు నేను) మమ (నాది) ఇతి (అనెడి), భేదభావము}; ప్రరూఢమున్ = మిక్కిలి ప్రసిద్ధమైనది; అగుచున్ = అవుతూ; ఘనతన్ = పేరుపొందినట్టి; అవిద్యన్ = అవిద్య; అన్ = అనెడి; గ్రంథిన్ = పీటముడిని, బంధనమును; నీవు = నీవు; త్రెంచివైతివి = తెంపేసికొన్నావు; కావునన్ = అందుచేత; ధీవరేణ్య = బుద్ధిబలముకలవాడ; సర్వ = సకల; శుభ = శౌభాగ్యమునకు; హాని = నష్టము కలిగించునది; ఐన = అయిన; రోషంబున్ = రోషము; వలదు = వద్ధు.
భావము:- పవిత్రమైన, పగను వీడిన నిష్కల్మషమైన మనస్సుతో అలుపు లేకుండా అన్వేషించు. ఈ విధంగా ప్రత్యగాత్ముడు, భగవంతుడు, పరబ్రహ్మ, ఆనందస్వరూపుడు, అనంతుడు, సమస్త శక్తిమంతుడు, సగుణుడు, అజుడు అయిన ఆ సర్వేశ్వరుణ్ణి పూజిస్తే వాడు, నేను, నాది అనే అవిద్యారూపమైన పీటముడిని త్రెంచుకొన్నావు. కావున ధీశాలీ! సర్వశుభాలను హరించే కోపాన్ని విడిచిపెట్టు.
తెభా-4-360-క.
విను రోషహృదయు చేతను
ననయము లోకము నశించు; నౌషధములచే
ఘనరోగములు నశించిన
యనువున; నది గాన రోష మడఁపు; మహాత్మా!
టీక:- విను = వినుము; రోష = రోషముతో కూడిన; హృదయున్ = హృదయము కలవాని; చేతనున్ = వలన; అనయమున్ = అవశ్యము, ఎల్లప్పుడు; లోకమున్ = లోకము; నశించున్ = నశించును; ఔషధముల = మందుల; చేన్ = వలన; ఘన = పెద్దపెద్ద; రోగములు = జబ్బులు; నశించిన = తగ్గిపోయిన; అనువునన్ = విధముగ; అదిగాన = అందుచేత; రోషమున్ = రోషమును; అడపు = అణచికొనుము; మహాత్మా = గొప్పవాడ.
భావము:- మహాత్మా! మందులవల్ల రోగాలు నశించినట్లు కోపం కలవాని వలన లోకం నశిస్తుంది. కాబట్టి కోపాన్ని అణచివేసుకో.
తెభా-4-361-తే.
అనఘ! నీదు సహోదరహంత లనుచుఁ
బెనఁచి యీ పుణ్యజనులఁ జంపితి కడంగి
పరఁగ నిదియె సదాశివ భ్రాత యైన
యర్థవిభునకు నపరాధ మయ్యెఁ గాన.
టీక:- అనఘ = పుణ్యుడ; నీదు = నీ యొక్క; సహోదర = సోదరుని; హంతలు = సంహరించినవారు; అనుచున్ = అంటూ; పెనచి = పెనగులాడి; ఈ = ఈ; పుణ్యజనులన్ = యక్షులను; చంపితి = సంహరించితివి; కడగి = పూని; పరగన్ = ప్రసిద్ధముగ; ఇదియె = ఇదె; సదాశివభ్రాత = కుబేరుడు {సదాశివ భ్రాత - సదాశివుని భ్రాత (సోదరుడు), కుబేరుడు}; ఐన = అయిన; అర్థవిభున్ = కుబేరుని {అర్థవిభుడు - అర్థము (ధనము)నకు అధిపతి (ప్రభువు), కుబేరుడు}; కున్ = కి; అపరాధము = అపకారము; అయ్యెన్ = అయ్యెను; కానన్ = కనుక.
భావము:- పుణ్యాత్మా! నీ తమ్ముని చంపినవాళ్ళు అని ఈ యక్షులను చంపావు. ఇది శివుని సోదరుడైన కుబేరుని పట్ల నీవు చేసిన అపరాధం. కావున…
తెభా-4-362-క.
నతి నుతులచేత నీ విపు
డతనిఁ బ్రసన్నునిఁగఁ జేయు మని మనువు దయా
మతిఁ జెప్పి ధ్రువునిచే స
త్కృతుఁడై నయ మొప్పఁ జనియె ఋషియుక్తుండై.
టీక:- నతి = నమస్కారములు; నుతుల = స్తోత్రముల; చేతన్ = వలన; నీవు = నీవు; అతనిన్ = అతనిని; ప్రసన్నునిన్ = ప్రసన్నమైనవాని; కాన్ = అగునట్లు; చేయుము = చేయుము; అని = అని; మనువు = మనువు; దయా = కృపగల; మతిన్ = మనసుతో; చెప్పి = చెప్పి; ధ్రువునిన్ = ధ్రువుని; చేన్ = చేత; సత్కృతుడు = సత్కరింపబడినవాడు; ఐ = అయ్యి; నయము = న్యాయము; ఒప్పన్ = ఒప్పునట్లు; చనియెన్ = వెళ్ళెను; ఋషి = ఋషులతో; యుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి.
భావము:- నమస్కారాల చేత, స్తోత్రాల చేత కుబేరుని ప్రసనుని చేసుకో” అని చెప్పి ధ్రువునిచేత పూజ లందుకొని స్వాయంభువ మనువు ఋషులతో కలిసి వెళ్ళిపోయాడు.
తెభా-4-363-వ.
అంత.
టీక:- అంతన్ = అంతట.
భావము:- అప్పుడు…
తెభా-4-364-తే.
యక్షచారణసిద్ధ విద్యాధరాది
జనగణస్తూయమానుఁడై ధనదుఁ డంతఁ
బుణ్యజన వైశస నివృత్తు భూరిరోష
రహితుఁ డైనట్టి ధ్రువునిఁ జేరంగ వచ్చె
టీక:- యక్ష = యక్షులు; చారణ = చారణులు; సిద్ధ = సిద్ధులు; విద్యాధర = విద్యాధరులు; ఆది = మొదలగు; జన = వారి; గణ = సమూహముచే; స్తూయమానుండు = స్తుతింపబడువాడు; ఐ = అయ్యి; ధనదుడు = కుబేరుడు {ధనదుడు - ధనము ఇచ్చువాడు, కుబేరుడు}; అంతన్ = అంతట; పుణ్యజన = గుహ్యకులను; వైశసన్ = హానిచేయుటను; నివృత్తున్ = చాలించినవానిని; భూరి = మిక్కిలి; రోష = రోషము; రహితుడు = లేనివాడు; ఐనట్టి = అయినట్టి; ధ్రువునిన్ = ధ్రువుని; చేరంగ = దగ్గరకు; వచ్చె = వచ్చెను.
భావము:- కోపాన్ని తగ్గించుకొని, యక్షులను సంహరించడం మానుకొన్న ధ్రువుని దగ్గరకు యక్షులు, చారణులు, సిద్ధులు, విద్యాధరులు మొదలైనవారు స్తుతిస్తుండగా కుబేరుడు వచ్చాడు.
తెభా-4-365-సీ.
చనుదెంచి వెసఁ గృతాంజలి యైన ధ్రువుఁ జూచి-
తివుట నిట్లనియె క్షత్రియకుమార!
తగ భవదీయ పితామహాదేశంబు-
నను దుస్త్యజంబైన ఘనవిరోధ
ముడిగితి! వటు గాన నొనరంగ నిపుడు నీ-
యందుఁ బ్రసన్నుండనైతి, భూత
జనన లయంబుల కనయంబుఁ గాలంబె-
కర్త యై వర్తించుఁగాన యుష్మ
తెభా-4-365.1-తే.
దనుజుఁ జంపినవార లీ యక్షవరులు
గారు! తలపోయ నీ యక్షగణము నిట్లు
నెఱి వధించిన వాఁడవు నీవు గావు
వినుతగుణశీల! మాటలు వేయునేల!
టీక:- చనుదెంచి = వచ్చి; వెసన్ = వెంటనే; కృతాంజలి = నమస్కారము చేసినవాడు; ఐన = అయిన; ధ్రువున్ = ధ్రువుని; చూచి = చూసి; తివుటన్ = కోరి; ఇట్లు = ఈవిధముగ; అనియె = పలికెను; క్షత్రియకుమార = రాకుమార; తగ = చక్కగ; భవదీయ = నీయొక్క; పితామహ = తాత యొక్క; మహా = గొప్పగ; ఆదేశంబు = చెప్పినప్రకారము; దుస్త్యజంబు = విడుచుటకుకష్టమైనది; ఐన = అయిన; ఘన = అతిమిక్కిలి; విరోధమున్ = పగను; ఉడిగితివి = వదిలితివి; అటుగాన = అందుచేత; ఒనరంగన్ = చక్కగ; ఇపుడు = ఇప్పుడు; నీ = నీ; అందున్ = ఎడల; ప్రసన్నుడన్ = ప్రసన్నతకలవాడను; ఐతి = అయితిని; భూత = జీవుల; జనన = పుట్టుకకు; లయంబుల్ = మరణముల; కున్ = కు; అనయంబు = అవశ్యము; కాలంబె = కాలమె; కర్త = కారణము; ఐ = అయ్యి; వర్తించున్ = ఉండును; కాన = కావున; యుష్మత్ = నీ యొక్క; అనుజున్ = తోబుట్టువును; చంపిన = సంహరించిన; వారలు = వారు; ఈ = ఈ.
యక్ష = యక్షులలో; వరులు = ఉత్తములు; కారు = కారు; తలపోయన్ = తరచిచూసిన; ఈ = ఈ; యక్ష = యక్షులను; ఇట్లు = ఈవిధముగ; నెఱి = మిక్కిలి; వధించినవాడవు = సంహరించినవాడవు; నీవు = నీవు; కావు = కావు; వినుత = స్తుతింపబడిన; గుణ = సద్గుణములుగల; శీల = నడవడికకలవాడ; మాటలు = మాటలు; వేయున్ = వెయ్యి (1000); ఏల = ఎందులకు.
భావము:- వచ్చి తనకు నమస్కరించిన ధ్రువునితో ఇలా అన్నాడు “రాకుమారా! నీ తాత ఆదేశించగా విడువరాని పగను విడిచావు. అందువల్ల నీపట్ల నేను ప్రసన్నుడనైనాను. జీవుల జనన మరణాలకు కాలమే కారణం. కావున ఓ సుగుణాత్మా! వేయి మాట లెందుకు? నీ తమ్ముణ్ణి చంపినవాడు యక్షుడు కాడు. యక్షులను చంపినది నీవు కాదు.
తెభా-4-366-వ.
అదియునుం గాక, యే బుద్ధింజేసి కర్మ సంబంధ దుఃఖాదికంబులు దేహాత్మానుసంధానంబునం జేసి సంభవించు, నట్టి యహంత్వమ్మను నపార్థజ్ఞానంబు స్వప్నమందుంబోలెఁ బురుషునకుం దోఁచు; నదిగావున సర్వభూతాత్మవిగ్రహుండును, నధోక్షజుండును, భవచ్ఛేదకుండును, భజనీయ పాదారవిందుండును, ననంతామేయశక్తి యుక్తుండును, గుణమయి యగు నాత్మమాయచే విరహితుండును నైన యీశ్వరుని సేవింపుము; నీకు భద్రం బయ్యెడు; భవదీయ మనోగతం బైన వరంబుఁ గోరుము; నీ వంబుజనాభ పాదారవింద సేవనంబుఁ దిరంబుగఁ జేయుదు వని యెఱుంగుదు” నని రాజరాజుచేత నట్లు మహామతియు, భాగవతోత్తముండునైన ధ్రువుండు ప్రేరేపింపంబడి “యే హరిస్మరణంబు చేత నప్రయత్నంబున దురత్యయంబైన యజ్ఞానంబుఁ దరియింతు రట్టి హరిస్మరణం బచలితం బగునట్లొసంగు” మని యడగిన “నట్లగాక” యని యంగీకరించి యంతం గుబేరుండు సంప్రీత చిత్తుండయి, ధ్రువునికి శ్రీహరిస్మరణం బట్ల యనుగ్రహించి యంతర్థానంబు నొందె; నంత ధ్రువుండు యక్ష కిన్నర కింపురషగణ సంస్తూయమాన వైభవుం డగుచు నాత్మీయ పురంబునకు మరలి చనుదెంచి.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ఏ = ఏ; బుద్ధిన్ = సంకల్పమును; చేసి = అనుసరించి; కర్మ = కర్మమమునకు; సంబంధ = సంబంధించిన; దుఃఖ = దుఃఖము; ఆదికంబులు = మొదలైనవి; దేహ = శరీరమునకు; ఆత్మ = ఆత్మకును; సంధానమునన్ = జతపరచుట; చేసి = వలన; సంభవించున్ = జరుగునో; అట్టి = అటువంటి; అహం = నేను; త్వం = నీవు; అనున్ = అనెడి; అపార్థ = పొరపాటుగ; జ్ఞానము = గ్రహించుట; స్వప్నము = కల; అందున్ = లో; పోలెన్ = వలె; పురుషున్ = మానవుని; కున్ = కి; తోచున్ = అనిపించును; అదిగావున = అందుచేత; సర్వభూతాత్మవిగ్రహుండును = హరి {సర్వ భూతాత్మ విగ్రహుండు - సర్వమైన భూత (జీవుల) ఆత్మ (ఆత్మలను) విగ్రహుండు (నియమించువాడు), విష్ణువు}; అధోక్షజుండును = హరి {అధోక్షజుండు –వ్యు. అక్షజం – ఇంద్రియ జ్ఞానం, అధి – అధరమ్, అధి+అక్షజం యస్య – అధోక్షజం, బ.వ్రీ. ఎవనిని తెలియుటకు ఇంద్రియజ్ఞానము అసమర్థమైనదో అతడు, విష్ణువు, (ఆంధ్రశబ్దరత్నాకరము)}; భవచ్ఛేదకుండును = హరి {భవ చ్ఛేదకుండు - భవత్ (సంసార బంధములను) చేదించువాడు, విష్ణువు}; భజనీయ పాదారవిందుండును = హరి {భజనీయ పాదారవిందుండు - భజనీయ (పూజింప దగిన) పాదపద్మములు కలవాడు, విష్ణువు}; అనంతామేయశక్తియుక్తుండును = హరి {అనం తామేయ శక్తి యుక్తుండు - అనంతమైన అమేయమైన (పరిమితిలేని) శక్తులు యుక్తి (సమర్థతలు) కలవాడు, విష్ణువు}; గుణమయియగునాత్మమాయచేవిరహితుండును = హరి {గుణ మయి యగు నాత్మ మాయచే విరహితుండు - త్రిగుణములతో నిండిన ఆత్మమాయ (తన యొక్క మాయ) వలన విరహితుండు (అసలు లేకుండెడివాడు), విష్ణువు}; ఐన = అయినట్టి; ఈశ్వరుని = హరిని; సేవింపుము = కొలువుము; నీకున్ = నీకు; భద్రంబున్ = క్షేమము; అయ్యెడున్ = అగును; భవదీయ = నీ యొక్క; మనస్ = మనస్సునందు; గతంబు = ఉన్నది; ఐన = అయిన; వరంబున్ = వరమును; కోరుము = కోరుకొనుము; నీవున్ = నీవు; అంబుజనాభ = నారాయణుని {అంబుజనాభుడు - అంబుజము (పద్మము) నాభిన కలవాడు, విష్ణువు}; పాద = పాదములనెడి; అరవింద = పద్మముల; సేవనంబు = పూజించుటలు; తిరంబుగన్ = స్థిరముగా; చేయుదువు = చేసెదవు; అని = అని; ఎఱుంగుదున్ = ఎరుగుదును; అని = అని; రాజరాజు = కుబేరుడు; చేతన్ = చేత; అట్లు = ఆ విధముగ; మహామతియున్ = గొప్ప బుద్ధిబలము కలవాడు; భాగవత = భాగవతులలో; ఉత్తముండు = శ్రేష్ఠుడు; ఐన = అయిన; ధ్రువుండు = ధ్రువుడు; ప్రేరేపింపబడి = ప్రోత్సహించబడి; ఏ = ఏ; హరి = విష్ణుని; స్మరణంబు = స్మరించుట; చేతన్ = వలన; అప్రయత్నంబునన్ = ప్రయత్నము లేకనే; దురత్యయంబు = దాటుటకు కష్టమైనది; ఐన = అయిన; అజ్ఞానంబున్ = అజ్ఞానమును; తరియింతురు = దాటెదరు; అట్టి = అటువంటి; హరి = నారాయణుని; స్మరణంబు = ధ్యానించుట; అచలితంబు = నిశ్చలమైనది; అగున్ = అయ్యెడి; అట్లు = విధమును; ఒసంగుము = ఇమ్ము; అని = అని; అడిగినన్ = అడుగగా; అట్లకాక = అలానే ఆగుగాక; అని = అని; అంగీకరించి = సమ్మతించి; అంతన్ = అంతట; కుబేరుండు = కుబేరుడు; సంప్రీత = ప్రీతితోకూడిన; చిత్తుండు = మనసు కలవాడు; ఐ = అయ్యి; ధ్రువునిన్ = ధ్రువుని; కిన్ = కి; శ్రీహరి = విష్ణుని; స్మరణంబు = ధ్యానము; అట్ల = ఆ విధముగ; అనుగ్రహించి = ప్రసాదించి; అంతర్థానంబున్ = కనుమరుగు; ఒందెన్ = అయ్యెను; అంత = అంతట; ధ్రువుండు = ధ్రువుడు; యక్ష = యక్షులు; కిన్నర = కిన్నరలు; కింపురుష = కిపురుషులచే; సంస్తూయమాన = చక్కగ స్తుతింపబడిన; వైభవుండు = విభవములు కలగినవాడు; అగుచున్ = అవుతో; ఆత్మీయ = స్వంత; పురంబున్ = నగరమున; కున్ = కు; మరలి = తిరిగి; చనుదెంచి = వచ్చి.
భావము:- అంతేకాక కర్మ సంబంధాలైన దుఃఖం మొదలైనవి దేహాభిమానం కారణంగా మానవునికి కలుగుతూ ఉంటాయి. స్వప్నంలో వలె ‘నేను, నీవు’ అనే భేదబుద్ధి అజ్ఞానం వల్ల కలుగుతుంది. సర్వభూత స్వరూపుడు, అధోక్షజుడు, సంసార బంధ విమోచకుడు, పూజింపదగిన పాదపద్మాలు కలవాడు, అంతము లేని అపరిమితమైన శక్తి కలవాడు, త్రిగుణాలతో నిండిన మాయ లేనివాడు అయిన భగవంతుని సేవించు. నీకు మేలు కలుగుతుంది. నీ మనస్సులో ఉన్న కోరికను కోరుకో. నీవు విష్ణుదేవుని పాదపద్మాలను స్థిరంగా పూజించేవాడవని నాకు తెలుసు” అని కుబేరుడు బుద్ధిమంతుడు, భాగవతోత్తముడు అయిన ధ్రువుణ్ణి ప్రోత్సహించాడు. ధ్రువుడు “ఏ హరి స్మరణం వల్ల దురంతమూ దుస్తరమూ అయిన అజ్ఞానాన్ని అవలీలగా తరింపగలమో ఆ శ్రీహరి స్మరణం నా మనస్సులో సుస్థిరంగా ఉండేటట్లు అనుగ్రహించు” అని కోరుకొన్నాడు. కుబేరుడు సంతోషించి ధ్రువునికి ఆ వరాన్ని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత ధ్రువుడు యక్షులు, కిన్నరులు, కింపురుషులు తన వైభవాన్ని కీర్తిస్తుండగా నిజ రాజధానికి మరలి వచ్చి…
తెభా-4-367-సీ.
గణుతింప భూరిదక్షిణల చేఁ గడునొప్పు-
యజ్ఞముల్ చేయ నయ్యజ్ఞ విభుఁడు
ద్రవ్యక్రియా దేవతాఫల రూప స-
త్కర్మఫలప్రదాత యయి యొప్పు
పురుషోత్తముని నర్థిఁ బూజించి మఱియు స-
ర్వోపాధివర్జితుఁ డుత్తముండు
సర్వాత్మకుఁడు నగు జలజాక్షునందుఁ దీ-
వ్రంబై ప్రవాహరూపంబు నైన
తెభా-4-367.1-తే.
భక్తి సలుపుచు నఖిల ప్రపంచమందు
నలరఁ దనయందు నున్న మహాత్ము హరినిఁ
జిదచిదానందమయుని లక్ష్మివరుఁ బరము
నీశ్వరేశ్వరుఁ బొడఁ గనె నిద్ధచరిత!
టీక:- గణుతింపన్ = ఎంచిచూసిన; భూరి = అత్యధికమైన; దక్షిణలు = దక్షిణలు {దక్షిణ - యజ్ఞాదుల యందు క్రియలు చేసినవారికి ఇచ్చెడు ధనాదులు}; చేన్ = చేత; కడున్ = మిక్కిలి; ఒప్పు = చక్కనైన; యజ్ఞముల్ = యాగములను; చేయన్ = చేయుటలో; ఆ = ఆ; విభుండు = విభుడు; ద్రవ్య = పదార్థములు; క్రియ = యజ్ఞక్రియలు; దేవతా = దేవతలు; ఫల = ఫలితములు; రూప = అనెడి రూపములుగల; సత్ = మంచి; కర్మ = పనుల; ఫల = ఫలితమును; ప్రదాత = చక్కగ ఇచ్చువాడు; అయి = అయ్యి; ఒప్పు = ఒప్పెడి; పురుషోత్తముని = నారాయణుని; అర్థిన్ = కోరి; పూజించి = పూజించి; మఱియున్ = ఇంకను; సర్వోపాధివర్జితుడు = హరి {సర్వోపాధివర్జితుడు - సమస్తమైన ఉపాధులను (ఆధారములను, జాతి గుణ క్రియా సంజ్ఞా రూపమైనవి) వర్జితుండు (వదలినవాడు), విష్ణువు}; ఉత్తముండు = హరి; సర్వాత్మకుడు = హరి {సర్వాత్మకుడు - సర్వజీవులకును ఆత్మయైనవాడు, విష్ణువు}; అగు = అయిన; జలజాక్షున్ = హరి {జలజాక్షుడు - జలజము (పద్మము)ల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; అందున్ = ఎడల; తీవ్రంబు = తీవ్రమైనది; ఐ = అయ్యి; ప్రవాహ = పారెడి, నిత్యనూతనమైన; రూపంబునన్ = స్వరూపముకలిగినది; ఐన = అయిన.
భక్తిన్ = భక్తిని; సలుపుచున్ = చేస్తూ; అఖిల = సమస్తమైన; ప్రపంచమున్ = జగత్తు; అందున్ = లోను; అలరన్ = విలసిల్లుతూ; తన = తన; అందున్ = లో; ఉన్న = ఉన్నట్టి; మహాత్మున్ = గొప్పవానిని; హరినిన్ = నారాయణుని; చిదచిదానందమయుని = నారాయణుని {చిదచిదానందమయుడు - చిత్ (చైతన్యవంతములు) అచిత్ (జడములు) సర్వములోను మయుడు, విష్ణువు}; లక్ష్మీవరున్ = నారాయణుని {లక్ష్మీవరుడు - లక్ష్మీదేవి భర్త, విష్ణువు}; పరమున్ = నారాయణుని {పరము - సర్వమునకు అతీతమైనవాడు, విష్ణువు}; ఈశ్వరేశ్వరున్ = నారాయణుని {ఈశ్వరేశ్వరుడు - శ్రేష్ఠమైన ఈశ్వరుడు, విష్ణువు}; పొడగనె = చూడగలిగె, దర్శించెను; ఇద్ధచరిత = ప్రసిద్ధమైన వర్తన కలవాడ.
భావము:- ధ్రువుడు ఎంతో అధికమైన దక్షిణ లిస్తూ లెక్కలేనన్ని యజ్ఞాలు చేసాడు. యజ్ఞవిభుడు, కర్మఫలప్రదాత అయిన పురుషోత్తముణ్ణి పూజించాడు. జాతి గుణ క్రియా సంజ్ఞా రూపాలైన సమస్త ఉపాధులను వదలినవాడు, ఉత్తముడు, సర్వాత్మకుడు, కమలనయనుడు అయిన భగవంతునిపై తీవ్రమైన భక్తిని ప్రవాహరూపంగా ప్రసరింప జేశాడు. తనలోని మహాత్ముడు, చరాచరములన్నింట ఉండేవాడు, లక్ష్మీపతి, పరాత్పరుడు, దేవదేవుడు అయిన హరిని సర్వజీవులయందు సందర్శించాడు.