పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/దక్షధ్వర ధ్వంసంబు
తెభా-4-105-శా.
ఆద్యుం డుగ్రుఁడు నీలకంఠుఁ డిభదైత్యారాతి దష్టోష్ఠుఁడై
మాద్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమప్రక్రియన్ నవ్వుచున్
విద్యుద్వహ్ని శిఖాసముచ్చయరుచిన్ వెల్గొందు చంచజ్జటన్
సద్యః క్రోధముతోడఁ బుచ్చివయిచెన్ క్ష్మాచక్ర మధ్యంబునన్.
టీక:- ఆద్యుండు = శివుడు {ఆద్యుండు - మొదటివాడు, శంకరుడు}; ఉగ్రుడు = శివుడు {ఉగ్రుడు - భయంకరుడు, శంకరుడు}; నీలకంఠుడు = శివుడు {నీలకంఠుడు - నల్లని కంఠము కలవాడు, శంకరుడు}; ఇభదైత్యారాతి = శివుడు {ఇభదైత్యారాతి - ఇభ (గజ) దైత్య (అసురుని) సంహరించినవాడు, శంకరుడు}; దష్ట = కరచిన; ఓష్ఠుడు = పెదవి కలవాడు; ఐ = అయ్యి; మాద్యత్ = మధించిన; భూరి = బాగా పెద్ద; మృగ = జంతువులలో; ఇంద్ర = శ్రేష్ఠుని (సింహపు); ఘోషమునన్ = గర్జనముల; భీమ = భయంకర; ప్రక్రియన్ = విధముగ; నవ్వుచున్ = నవ్వుతూ; విద్యుత్ = మెఱపుల; వహ్ని = నిప్పు; శిఖా = మంటల; సముచ్చయ = గుంపుల; రుచిన్ = వలె; వెల్గొందు = ప్రకాశిస్తున్న; చంచత్ = చలిస్తున్న; జటన్ = శిరోజముల జటను; సద్యత్ = అప్పటికప్పుడు పుట్టిన; క్రోధము = కోపము; తోడన్ = తోటి; పుచ్చి = పెఱకి; వయిచెన్ = వైచెను, విసిరెను; క్ష్మాచక్ర = భూమి, నేల; మధ్యంబునన్ = మధ్యలో.
భావము:- ఆదిదేవుడు, ఉగ్ర రూపుడు, నీలగ్రీవుడు, గజాసుర సంహారి అయిన శివుడు పెదవి కరచుకొని, మదించిన సింహంవలె గర్జించి, భయంకరంగా నవ్వుతూ మెరుపువలె అగ్నిజ్వాల వలె ప్రకాశించే జటను మహాకోపంతో పెరికి భూమిపైన విసరికొట్టాడు.
తెభా-4-106-వ.
ఇట్లు పెఱికి వైచిన రుద్రుని జట యందు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; పెఱికి = పీకి; వైచినని = పడవేయగ; రుద్రుని = శివుని; జట = జట; అందు = నుండి.
భావము:- ఈవిధంగా పెరికివేసిన శివుని జటనుండి...
తెభా-4-107-సీ.
అభ్రంలిహాదభ్ర విభ్ర మాభ్రభ్రమ-
కృన్నీలదీర్ఘ శరీర మమరఁ
బ్రజ్వలజ్జ్వలన దీప్తజ్వాలికా జాల-
జాజ్వల్యమాన కేశములు మెఱయఁ
జండ దిగ్వేదండ శుండాభ దోర్దండ-
సాహస్ర ధృత హేతిసంఘ మొప్ప
వీక్షణత్రయ లోకవీక్షణ ద్యుతి లోక-
వీక్షణతతి దుర్నిరీక్ష్యముగను
తెభా-4-107.1-తే.
గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ
ఘన కపాలాస్థి వనమాలికలును దనర
నఖిలలోక భయంకరుఁ డగుచు వీర
భద్రుఁ డుదయించె మాఱట రుద్రుఁ డగుచు.
టీక:- అభ్రంలిహ = ఆకాశమును నాకుచున్న; అదభ్ర = మహావిస్తారమై; విభ్రమ = పరిభ్రమిస్తున్న; అభ్ర = మేఘముల వంటి; భ్రమకృత్ = సుడులు తిరుగుచున్న; నీల = నల్లని; దీర్ఘ = పొడవైన; శరీరము = దేహము; అమరన్ = అమరి యుండగ; ప్రజ్వల = బాగా మండుతున్న; జ్వలన = మంటల; దీప్త = వెలుగుతున్న; జ్వాలికా = మంటల; జాల = సమూహముల వలె; జాజ్వల్యమాన = మండిపోతున్నట్టున్న; కేశములు = శిరోజములు; మెఱయన్ = మెరుస్తుండగ; చండ = భయంకరమైన; దిగ్వేదండ = దిగ్గజముల యొక్క; శుండా = తొండములు; అభ = వంటి; దోర్దండ = చేతులు; సాహస్ర = వేనవేలు; ధృత = ధరింపబడిన; హేతి = ఆయుధముల; సంఘము = సమూహము; ఒప్ప = ఒప్పుతుండగ; వీక్షణ = కన్నుల; త్రయ = మూడింటి; లోక = లోకములను; వీక్షణ = చూసెడి చూపుల; ద్యుతిన్ = కాంతి; లోక = లోకము లందలి; వీక్షణ = చూసేవారి; తతి = సమూహమునకు; దుర్నిరీక్ష్యముగను = చూడ శక్యము కాకుండగ.
క్రకచ = ఱంపము వలె; కఠిన = కరుకైన; కరాళ = వంకర్లు తిరిగిన; దంష్ట్రలు = కోరలు; వెలుంగ = ప్రకాశిస్తుండగ; ఘన = పెద్ద; కపాల = పుఱ్ఱెలు; అస్థి = ఎముకలు కూర్చిన; వనమాలికలు = ఆకులు పూలు కూర్చిన; మాలికలు = దండలు; తనరన్ = అతిశయించగ; అఖిల = సమస్తమైన; లోక = లోకములకు; భయంకరుడు = భీకరుడు; అగుచున్ = అవుతూ; వీరభద్రుడు = వీరభద్రుడు; ఉదయించెన్ = పుట్టెను; మాఱట = కలహాల; రుద్రుడు = భయంకరుడు; అగుచున్ = అవుతూ.
భావము:- సకల లోకాలకూ భయం కలిగించే రెండవ రుద్రుని వలె వీరభద్రుడు ఉదయించాడు. ఆయన సుదీర్ఘమైన నల్లని శరీరం ఆకాశాన్ని అంటుతూ కాలమేఘ మేమో అనే భ్రాంతి కలిగిస్తున్నది. తల వెంట్రుకలు భగభగమండే మంటల ప్రజ్వలనంలా ప్రకాశిస్తున్నాయి. దిగ్గజాల తొండాల వంటి వెయ్యి బాహుదండాలలో అసంఖ్యాకాలైన ఆయుధాలు మెరుస్తున్నాయి. ఆయన మూడు కన్నులు చండప్రచండ మార్తాండుల వంటి ప్రకాశంతో కళ్ళెత్తి తేరి చూడరాకుండా ఉన్నాడు. మెడనిండా కపాలమాలలు వ్రేలాడుతుండగా. వంకర్లు తిరిగి రంపాల్లా కరకు దేలిన కోరలుతో మిక్కిలి భయంకరంగా ఉన్నాడు.
దక్షయజ్ఞంలో ఉమాదేవి యోగాగ్ని యందు దగ్ధమయింది. పరమశివుడు మహాకోపంతో తన జటాజూటం నుంచి ఒక జట పెరికి భూమి మీద విసిరి కొట్టాడు. ఆ మహారుద్రుని జట నుంచి వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసార్థమై ఉదయించాడు. ఈ సందర్భంలో పదౌచిత్యం వృత్తౌచిత్యం భావౌచిత్యం శబ్దాడంబరం అర్థగాంభీర్యాలతో అలవోకగా అలరించే మన సహజకవి ఈ పోతనామాత్యల సీసపద్యం వీరభద్రుని బహుదీర్ఘదేహాన్ని సూచిస్తున్న మణిరత్మం.
తెభా-4-108-తే.
వీరభద్రుండు విహత విద్వేషి భద్రుఁ
డగుచుఁ దన వేయి చేతులు మొగిచి వినయ
మెసఁగ "నే నేమి సేయుదు? నెఱుఁగ నాకు
నానతి"మ్మన్న నతని కయ్యభవుఁ డనియె.
టీక:- వీరభద్రుండు = వీరభద్రుడు; విహత = చంపబడిన; విద్వేషి = శత్రువులను కూర్చుట వలన; భద్రుడు = క్షేమము కలిగించువాడు; అగుచున్ = అవుతూ; వేయి = వెయ్యి (1000); చేతులు = చేతులు; మొగిచి = ముడిచి; వినయుము = వినయము; ఎసగ = అతిశయించగ; నేను = నేను; ఏమి = ఏమి; చేయుదున్ = చేయవలెను; ఎఱుగన్ = తెలియునట్లు; నాకు = నాకు; ఆనతిమ్ము = ఆజ్ఞాపించుము; అన్న = అనగా; అతని = అతని; కినే = కి; ఆ = ఆ; అభవుడు = శివుడు; అనియె = పలికెను.
భావము:- వీరభద్రుడు శత్రు సంహారాన్ని తలపెట్టినవాడై తన వేయి చేతులు మోడ్చి వినయంతో “నేను ఏం చేయాలో ఆజ్ఞాపించండి” అని అడిగాడు. అప్పు డతనితో శివుడు ఇలా అన్నాడు.
తెభా-4-109-చ.
"గురుభుజశౌర్య! భూరిరణకోవిద! మద్భటకోటి కెల్ల నీ
వరయ వరూధినీవరుఁడవై చని యజ్ఞము గూడ దక్షునిన్
బరువడిఁ ద్రుంపు; మీ వచట బ్రాహ్మణతేజ మజేయమంటివే
నరిది మదంశసంభవుఁడవై తగు నీకు నసాధ్య మెయ్యెడన్?"
టీక:- గురు = మిక్కిలి; భుజ = బాహు; శౌర్య = బల మతిశయించినవాడ; భూరి = బహు మిక్కిలి; రణ = యుద్ధము చేయుటలో; కోవిద = నేర్పరి; మత్ = నా యొక్క; భట = సేనా; కోటి = సమూహము; ఎల్లన్ = అంతటకును; నీవు = నీవు; అరయ = పూని; వరూధినీ = సేనా; వరుడవు = నాయకుడవు; ఐ = అయ్యి; చని = వెళ్ళి; యజ్ఞమున్ = యజ్ఞమున; కూడన్ = తో పాటు; దక్షునిన్ = దక్షని; పరువడిన్ = వెంటనే; త్రుంపుము = సంహరించుము; ఈవు = నీవు; అచటన్ = అక్కడ; బ్రాహ్మణతేజము = బ్రాహ్మణతేజము; అజేయము = జయింప శక్యము కానిది; అంటివేమి = అంటే; అరిదిని = దుర్లభముగ; మత్ = నా యొక్క; అంశ = అంశతో; సంభవుడవు = పుట్టినవాడవు; ఐ = అయ్యి; తగు = తగినవాడవు; నీకున్ = నీకు; అసాధ్యము = అసాధ్యము; ఎయ్యెడన్ = ఎక్కడిది.
భావము:- “యుద్ధవిద్యా విశారదుడవైన భుజపరాక్రమశాలీ! నా ప్రమథగణాల కంతటికీ నీవు సేనానివై వెంటనే వెళ్ళి యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుని సంహరించు. బ్రాహ్మణతేజం అజేయమని సందేహించకు. నా అంశతో జన్మించిన నీకు అసాధ్య మెక్కడిది?”
తెభా-4-110-వ.
అని కుపిత చిత్తుండై యాజ్ఞాపించిన "నట్లకాక"యని.
టీక:- అని = అని; కుపిత = కోపించిన; చిత్తుండు = చిత్తము కలవాడు; ఐ = అయ్యి; ఆజ్ఞాపించినన్ = ఆజ్ఞాపించగా; అట్లకాక = అలానే అగు గాక; అని = అని.
భావము:- అని కోపంతో ఆజ్ఞాపించగా అలాగే అని...
తెభా-4-111-చ.
అనఘుఁడు రుద్రుఁ జేరి ముదమారఁ బ్రదక్షిణ మాచరించి వీ
డ్కొని యనివార్య వేగమునఁ గుంభిని గ్రక్కదలన్ ఝళంఝళ
ధ్వని మణినూపురంబులు పదంబుల మ్రోయఁగ భీషణప్రభల్
దనరఁ గృతాంత కాంతకశితస్ఫుట శూలముఁ బూని చెచ్చెరన్.
టీక:- అనఘుడు = పుణ్యుడు; రుద్రున్ = రుద్రుని; చేరి = చేరి; ముదమార = సంతోషపూర్వకముగ; ప్రదక్షిణము = ప్రదక్షిణ {ప్రదక్షిణ - కుడివైపుగా (సవ్యముగ) చుట్టును తిరుగుట}; ఆచరించి = చేసి; వీడ్కొని = సెలవుతీసుకొని; అనివార్య = వారింపరాని; వేగమునన్ = వేగముతో; కుంభిని = భూమి; క్రక్ = మిక్కిలి; కదలన్ = కదిలిపోగా; ఝళంఝళ = ఝళంఝళ యనెడి; ధ్వని = చప్పుడు; మణినూపురంబులు = మణులు తాపడము చేసిన అందెలు; పదంబులన్ = అడుగులతో; మ్రోయగ = మోగుతుండగ; భీషణ = భయంకరమైన; ప్రభల్ = కాంతులు; తనరన్ = అతిశయించగ; కృతాంతక = యముని సైతం; అంతక = అంతము చేయునట్టి; శిత = వాడితనము; స్ఫుట = స్పష్ట మగుచున్న; శూలమున్ = శూలమును; పూని = ధరించి; చెచ్చెరన్ = అతివేగముగ.
భావము:- పుణ్యాత్ముడైన వీరభద్రుడు శివుని సమీపించి ప్రదక్షిణం చేసి అతని సెలవు తీసుకొని అడ్డులేని మహావేగంతో భూమి అదిరిపోతుండగా, పాదాలకు తొడిగిన మణులు తాపిన అందెలు ఝళంఝళమంటూ మ్రోగుతుండగా, యముణ్ణి సైతం అంతం చేయగల్గిన వాడిశూలాన్ని ధరించి వెంటనే...
తెభా-4-112-చ.
సరభసవృత్తి నట్లరుగు సైన్యపదాహత ధూత ధూళి ధూ
సరిత కుబేరదిక్తటము సభ్యులు దక్షుఁడుఁ జూచి "యెట్టి భీ
కర తమ"మం చనం "దమముగాదు, రజఃపటలం"బటంచు ని
వ్వెఱపడి పల్కి రాత్మల వివేకవిహీనతఁ బొంది వెండియున్.
టీక:- సరభస = తొందరపడుతున్న; వృత్తిన్ = విధముగ; అట్లు = ఆ విధముగ; అరుగు = వెళుతున్న; సైన్య = సైన్యము యొక్క; పదా = అడుగుల; హత = తాకిడిచే; ధూత = ఎగురకొట్టబడిన; ధూళి = దుమ్మువలన; ధూసరిత = దుమ్ముకొట్టుకుపోయిన; కుబేరదిక్తటము = ఉత్తర దిక్కును {కుబేరదిక్తటము – ఉత్తరపు (దిక్పాలకుడు కుబేరుని దిక్కు) దిక్కు (దిక్కు తటము), ఉత్తరపు దిక్కు}; సభ్యులు = దక్షయజ్ఞ సభలోని వారు; దక్షుఁడున్ = దక్షుడూ; చూచి = చూసి; ఎట్టి = ఎంతటి; భీకర = భయంకరమైన; తమము = కారుచీకటో; అంచు = అని; అనన్ = అనుకొనగా; తమము = కారుచీకటి; కాదు = కాదు; రజఃపటలంబు = ధూళి సమూహము; అటన్ = అని; అంచున్ = అంటూ; నివ్వెఱపడి = భయపడిపోయి; పల్కిరి = అనుకున్నారు; ఆత్మలన్ = మనసులలో; వివేకవిహీనతఁబొంది = వివేకం కోల్పోయి; వెండియున్ = మరల.
భావము:- మహావేగంగా వస్తున్న వీరభద్రుని సైన్యం కాళ్ళ తొక్కిళ్ళచేత రేగిన ధూళికి కమ్మిన ఉత్తరపు దిక్కును, యజ్ఞశాలలోని సభ్యులూ, దక్షుడూ చూసారు; “అబ్బా! ఎంత భయంకరమైన కారుచీకటో” అని అనుకున్నారు; మళ్ళీ “కారుచీకటి కాదు, రేగిన దుమ్ము” అనుకుంటూ భయపడ్డారు; వివేకం కోల్పోయారు; ఇంకా ఇలా అనుకోసాగారు.
తెభా-4-113-సీ.
ఈ ధూళి పుట్టుట కెయ్యది హేతువో? -
విలయ సమీరమా? పొలయ దిపుడు;
ప్రాచీనబర్హి ధరాపతి మహితోగ్ర-
శాసనుఁ డిపుడు రాజ్యంబు సేయఁ
జోర సంఘములకో రారాదు; మఱి గోగ-
ణాళి రాకకు సమయంబు గాదు;
కావున నిప్పుడు కల్పావసానంబు-
గాఁబోలుఁ; గా దటు గాక యున్న
తెభా-4-113.1-తే.
నిట్టి యౌత్పాతిక రజ మెందేనిఁ గలదె?'
యనుచు మనముల భయమంది రచటి జనులు
సురలు దక్షుఁడు; నంతఁ బ్రసూతి ముఖ్యు
లయిన భూసురకాంత లిట్లనిరి మఱియు.
టీక:- ఈ = ఈ; ధూళి = ధూళి యొక్క; పుట్టుట = జనించుట; కున్ = కు; ఎయ్యది = ఏది; హేతువో = కారణమో; విలయ = ప్రళయమునకు చెందిన; సమీరమా = వాయువులా; పొలయదు = సమీపించదు; ఇపుడు = ఇప్పుడు; ప్రాచీనబర్హి = ప్రాచీనబర్హి; ధరాపతి = రాజుగ; మహిత = అత్యంత; ఉగ్ర = గట్టిగ; శాసనుడు = పాలించువాడు; ఇపుడు = ఇప్పుడు; రాజ్యంబున్ = రాజ్యమును; చేయన్ = చేస్తుండగ; చోర = దొంగల; సంఘముల్ = గుంపుల; కో = కు ఐతే; రారాదు = వచ్చుటకు వీలులేదు; మఱి = మరి; గో = గోవుల; గణాళి = గణముల సమూహములు; రాక = వచ్చుట; కున్ = కు; సమయంబున్ = సమయము; కాదు = కాదు; కావున = అందుచేత; ఇప్పుడు = ఇప్పుడు; కల్ప = కాలకల్పము; అవసానంబున్ = అంతము; కాబోలు = అవ్వచ్చు; అటు = అలా; కాక = కాకుండగ; ఉన్న = ఉంటే.
ఇట్టి = ఇటువంటి; ఔత్పాదిక = జనించిన; రజము = ధూళి; ఎందేని = ఎక్కడేనా; కలదే = ఉందా ఏమి; అనుచున్ = అంటూ; మనముల్ = మనసులలో; భయమున్ = భయమును; అందిరి = చెందిరి; అచటి = అక్కడి; జనులు = మానవులు; సురలు = దేవతలు; దక్షుడు = దక్షుడు; అంతన్ = అంతట; ప్రసూతి = ప్రసూతి; ముఖ్యులు = మొదలైన ప్రముఖులు; అయిన = అయిన; భూసుర = బ్రాహ్మణ {భూసురులు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; కాంతలు = స్త్రీలు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; మఱియు = ఇంక.
భావము:- “ఈ దుమ్ము పుట్టడానికి కారణమేమిటి? ప్రళయ వాయువులా? కాని ఇది ప్రళయకాలం కాదు. చండశాసనుడైన ప్రాచీనబర్హి రాజ్యం చేస్తున్నందున దొంగలగుంపు వచ్చే అవకాశం లేదు. ఆవుల మంద వచ్చే సాయంకాల సమయం కాదు. ఇది కల్పాంతమే కావచ్చు. కాకుంటే ఉత్పాతాన్ని సూచించే ఇంతటి ధూళి ఎలా వస్తుంది?” అని అక్కడి జనులు, దేవతలు, దక్షుడు తమ మనస్సులలో భయపడ్డారు. అప్పుడు ప్రసూతి మొదలైన బ్రాహ్మణస్త్రీలు ఇలా అన్నారు.
తెభా-4-114-క.
"తన కూఁతులు సూడఁగ నిజ
తనయను సతి ననపరాధఁ దగవఱి యిట్లె
గ్గొనరించిన యీ దక్షుని
ఘనపాప విపాక మిదియుఁ గాఁదగు ననుచున్."
టీక:- తన = తన యొక్క; కూతులు = పుత్రికలు; చూడగన్ = చూస్తుండగ; నిజ = తన యొక్క; తనయను = పుత్రికను; సతిన్ = సతీదేవిని; అనపరాధన్ = అపరాధము లేనిది; తగవఱి = న్యాయము తప్పి; ఇట్లు = ఈ విధముగ; ఎగ్గు = అవమానము; ఒనరించిన = చేసిన; ఈ = ఈ; దక్షునిన్ = దక్షుని యొక్క; ఘన = అత్యధికమైన; పాప = పాపము యొక్క; విపాకము = గట్టిఫలము; కాదగు = అయ్యుండవచ్చు; అనుచున్ = అంటూ.
భావము:- “ఈ విధంగా తన కుమార్తెలు చూస్తుండగా ఏ అపరాధమూ ఎరుగని తన కూతురు సతీదేవిని అన్యాయంగా అవమానించిన ఈ దక్షుని మహాపాపానికి ఫలితం ఈ ధూళి అయి ఉంటుంది” అంటూ...
తెభా-4-115-వ.
వెండియు నిట్లనిరి "కుపితాత్ముండైన దక్షుండు దన కూఁతుతో విరోధంబు చాలక జగత్సంహార కారణుం డయిన రుద్రునిం గ్రోధింప జేసె; నమ్మహాత్ముం డెంతటివాఁ డన్నం బ్రళయకాలంబున
టీక:- వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; కుపిత = కోపముతో కూడిన; ఆత్ముండు = మనసు కలవాడు; ఐన = అయిన; దక్షుండు = దక్షుడు; తన = తన యొక్క; కూతున్ = కూతురు; తోన్ = తోటి; విరోధంబున్ = శత్రుత్వము; చాలక = సరిపోక; జగత్ = భువనము యొక్క; సంహార = లయమునకు; కారణుండు = కారణభూతుడు; అయిన = అయిన; రుద్రునిన్ = శివుని; క్రోధింపన్ = కోపించునట్లు; చేసెన్ = చేసెను; ఆ = ఆ; మహాత్ముండు = గొప్పవాడు; ఎంతటివాడు = ఎంతవాడు; అన్నన్ = అనగా; ప్రళయ = విలయ; కాలంబునన్ = సమయములో.
భావము:- ఇంకా ఇలా అన్నారు “దక్షుడు కోపంతో తన కుమార్తెతో వైరం తెచ్చుకొనడమే కాక ప్రళయకారకుడైన రుద్రునకు కోపం తెప్పించాడు. మహాత్ముడైన ఆ శివుడు ఎంతటివాడంటే ప్రళయకాలంలో...
తెభా-4-116-సీ.
సుమహిత నిశిత త్రిశూలాగ్ర సంప్రోత-
నిఖిల దిక్కరి రాజనివహుఁ డగుచుఁ
జటులోగ్రనిష్ఠుర స్తనిత గంభీరాట్ట-
హాస నిర్భిన్నాఖిలాశుఁ డగుచు
భూరి కరాళవిస్ఫార దంష్ట్రా హతి-
పతిత తారాగణ ప్రచయుఁ డగుచు
వివిధ హేతివ్రాత విపుల ప్రభాపుంజ-
మండిత చండ దోర్దండుఁ డగుచు
తెభా-4-116.1-తే.
వికట రోష భయంకర భ్రుకుటి దుర్ని
రీక్ష్య దుస్సహ తేజోమహిమఁ దనర్చి
ఘన వికీర్ణ జటాబంధ కలితుఁ డగుచు
నఖిల సంహార కారణుఁ డయి నటించు.
టీక:- సుమహిత = చాలా గొప్పదైన; నిశిత = వాడి యైన; త్రిశూల = త్రిశూలము; అగ్ర = కొన లందు; సంప్రోత = గుచ్చబడిన; నిఖిల = సమస్తమైన; దిక్కరిరాజ = దిగ్గజముల; నివహుడు = గుంపు కలవాడు; అగుచున్ = అవుతూ; చటుల = మిక్కిలి; ఉగ్ర = భయంకరమైన; నిష్ఠుర = వినుటకు కఠినమైన; స్తనిత = ఉరుముల శబ్దములవలె; గంభీర = గంభీరమైన; అట్టహాస = విరగబడి నవ్వుటచేత; నిర్భిన్న = బాగా పగిలిపోయిన; అఖిల = సమస్తమైన; ఆశుడు = దిక్కులు కలవాడు; అగుచున్ = అవుతూ; భూరి = అతి పెద్దవైన; కరాళ = వంపులు తిరిగిన; విస్ఫార = విప్పారిన; దంష్ట్రా = కోరలచే; హతి = కొట్టబడుటచేత; పతిత = పడిపోయిన; తారా = తారల; గణ = గుంపుల; ప్రచయుడు = సమూహము కలవాడు; అగుచున్ = అవుతూ; వివిధ = రకరకములైన; హేతి = ఆయుధముల; వ్రాత = సమూహము యొక్క; విపుల = విశాలమైన; ప్రభా = కాంతుల; పుంజ = గుంపులచే; మండిత = అలంకరింపబడిన; చండ = భయంకరమైన; దోర్దండుడు = బాహుదండములు కలవాడు; అగుచున్ = అవుతూ.
వికట = వికృతమైన; రోష = రోషము వలన; భయంకర = భయంకరమైన; భ్రుకుటిన్ = కనుబొమముడితో; దుర్నిరీక్ష్య = చూడ శక్యము గాని; దుస్సహ = భరింప శక్యము గాని; తేజస్ = తేజస్సు యొక్క; మహిమన్ = గొప్పదనముచే; తనర్చి = అతిశయించి; ఘన = గొప్ప; వికీర్ణ = విరబోసుకొన్న; జటా = జటల; బంధ = కట్టబడులుతో; కలితుడు = కూడినవాడు; అగుచున్ = అవుతూ; అఖిల = సమస్తము; సంహార = సంహరింపబడుటకు; కారణుడు = కారణమైనవాడు; అయి = అయ్యి; నటించున్ = నాట్యము చేయును.
భావము:- మహోగ్రమైన తన త్రిశూలాగ్రాన దిగ్గజాల నన్నిటిని గుది గ్రుచ్చేవాడై, దిక్కులన్నీ దద్దరిల్లి బీటలువారే విధంగా ఉరుమినట్లుగా గంభీరంగా అట్టహాసం చేస్తూ, తన వాడియైన గొప్ప కోరల ఘాతాలతో నక్షత్రమండలాన్ని నేల రాలుస్తూ, తన భయంకరమైన చేతులతో ధగధగ మెరిసే రకరకాల ఆయుధాలను ధరిస్తూ, ప్రచండ కోపంతో కనుబొమలను ముడివేసి, తేరి చూడరాని తేజస్సుతో, జడలను విరబోసుకొని ప్రళయనాట్యం చేస్తూ సర్వాన్ని సంహరిస్తాడు.
తెభా-4-117-తే.
అట్టి దేవునిఁ ద్రిపుర సంహార కరునిఁ
జంద్రశేఖరు సద్గుణసాంద్రు నభవు
మనము రోషింపఁ జేసిన మంగళములఁ
బొంద వచ్చునె పద్మగర్భునకునైన?"
టీక:- అట్టి = అటువంటి; దేవుని = దేవుని; త్రిపురసంహారకుని = శివుని {త్రిపురసంహారకుడు - త్రిపురములను కూల్చివేసినవాడు, శివుడు}; చంద్రశేఖరు = శివుని {చంద్రశేఖరుడు - చంద్రవంక సిగదండగ కలవాడు, శివుడు}; సత్ = మంచి; గుణ = గుణములు; సాంద్రున్ = మిక్కిలిగా కలవాని; అభవున్ = శివుని {అభవుడు - పుట్టుక లేనివాడు, శివుడు}; మనమున్ = మానసమును; రోషింపన్ = కోపింపను; చేసిన = చేసినచో; మంగళములన్ = శుభములను; పొంద = పొందుట; వచ్చునె = శక్యమా ఏమి; పద్మగర్భున్ = బ్రహ్మదేవుని; కున్ = కి; ఐనన్ = అయినప్పటికిని.
భావము:- అటువంటి దేవదేవునికి, త్రిపురసంహారికి, చంద్రచూడునకు, సకల సద్గుణ విభవునకు, అభవుని మనస్సుకు ఆగ్రహం తెప్పించి బ్రహ్మదేవుడైనా శుభాలను పొందగలడా?”
తెభా-4-118-వ.
అని యి వ్విధంబున భయవిహ్వలలోచనలై పలుకుచున్న సమయంబున మహాత్ముండైన దక్షునకు భయావహంబులై సహస్ర సంఖ్యాతంబు లైన మహోత్పాతంబులు భూనభోంతరంబులఁ గానంబడుచుండె; నా సమయంబున రుద్రానుచరులు నానావిధాయుధంబులు ధరియించి కపిల పీత వర్ణంబులు గలిగి వామనాకారులు, మకరోదరాననులు నై యజ్ఞశాలాప్రదేశంబునం బరువులుపెట్టుచుఁ గదియం జనుదెంచి దక్షాధ్వర వాటంబులు విటతాటంబులు చేయుచుం, గొందఱు ప్రాగ్వంశంబును, గొందఱు పత్నీశాలయు, కొందఱు సదస్య శాలయుఁ, గొంద ఱాగ్నీధ్ర శాలయు, కొందఱు యజమాన శాలయుఁ, గొందఱు మహానస గృహంబును విధ్వంసంబులు గావించిరి; మఱియుఁ గొందఱు యజ్ఞపాత్రంబుల నగ్నులం జెఱచిరి; వెండియుఁ గొందఱు హోమాగ్ను లార్చిరి; పదంపడి కొందఱు హోమకుండంబుల యందు మూత్రంబులు విడిచిరి; కొంద ఱుత్తరవేదికా మేఖలలు ద్రెంచిరి; కొందఱు మునుల బాధించిరి; కొందఱు తత్పత్నుల వెఱపించిరి; మఱికొందఱు దేవతా నిరోధంబుఁ గావించి; రంత మణిమంతుండు భృగువును, వీరభద్రుండు దక్షునిఁ, జండీశుండు పూషుని, భగుని నందీశ్వరుండును బట్టి; రివ్విధంబున సదస్య దేవ ఋత్విఙ్నికాయంబుల శిలల ఱువ్వియు, జానువులఁ బొడిచియు, నఱచేతుల నడచియు, గుల్ఫంబులఁ బొడిచియు వివిధ బాధలు పఱచిన వారు కాందిశీకు లై యెక్కడెక్క డేనిం జనిరి; మఱియును.
టీక:- అని = అని; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; భయ = భయముచే; విహ్వల = చలిస్తున్న; లోచనులు = కన్నులు కలవారు; ఐ = అయ్యి; పలుకుచున్ = పలుకుతూ; ఉన్న = ఉన్నట్టి; సమయంబునన్ = సమయములో; మహాత్ముండు = గొప్పవాడు; ఐన = అయినట్టి; దక్షున్ = దక్షుని; కున్ = కి; భయ = భయమును; ఆవహంబులు = కలిగించునవి; ఐ = అయ్యి; సహస్ర = వేనవేల; సంఖ్యాతంబులు = సంఖ్యలలో ఉన్నవి; ఐన = అయిన; మహా = గొప్ప; ఉత్పాతంబులు = అపశకునములు; భూ = భూమి; నభస్ = ఆకాశముల; అంతరంబులన్ = లోపల; కానంబడుచున్ = కనబడుతూ; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ; సమయంబునన్ = సమయములో; రుద్ర = రుద్రుని యొక్క; అనుచరులు = అనుచరులు; నానవిధ = రకరకములైన; ఆయుధంబులున్ = ఆయుధములను; ధరియించి = ధరించి; కపిల = గోరోజనమువంటి చామనఛాయ; పీత = పసుపు; వర్ణంబులు = రంగులు; కలిగి = కలిగి ఉండు; వామన = పొట్టి; ఆకారులు = ఆకారములు కలవారు; మకర = మొసలి వంటి; ఉదర = పొట్ట; ఆననులు = ముఖములు కలవారు; ఐ = అయ్యి; యజ్ఞశాలా = యజ్ఞశాలలు ఉన్న; ప్రదేశంబునన్ = స్థలములలో; పరువులు = పరుగులు; పెట్టుచు = పెడుతూ; కదియన్ = దగ్గరకు; చనుదెంచి = చేరి; దక్షా = దక్షుని; అధ్వర = యజ్ఞము యొక్క; వాటంబులు = వాటికలు; విటతాటంబులు = చెల్లాచెదురు; చేయుచున్ = చేస్తూ; కొందఱు = కొంతమంది; ప్రాగ్వంశంబు = ప్రాగ్వంశమును {ప్రాగ్వంశము - యజ్ఞశాల ప్రాంత గృహము}; కొందఱు = కొంతమంది; పత్నీశాలయు = పత్నీశాలను {పత్నీశాల - యజమాని భార్య యొక్క శాల}; కొందఱు = కొంతమంది; సదస్యశాలయున్ = సభాస్థలి {సదస్యశాల - సభాస్థలిగల శాల}; కొందఱు = కొంతమంది; అగ్నీధ్రశాలయున్ = అగ్నీధ్రశాల {అగ్నీధ్రశాల -అగ్నిని ధరించు ఋత్విక్కు యొక్క శాల}; కొందఱు = కొంతమంది; యజమానశాలయున్ = యజమానశాల {యజమానశాల - యజమాని (యజ్ఞమును చేయువాని) యొక్క శాల}; కొందఱు = కొంతమంది; మహానసగృహంబును = వంటశాల; విధ్వంసంబు = నాశనము; కావించిరి = చేసిరి; మఱియున్ = ఇంకను; కొందఱు = కొంతమంది; యజ్ఞపాత్రంబులన్ = యజ్ఞపాత్రలను; అగ్నులన్ = అగ్నికుండములను; చెఱచిరి = పాడుచేసిరి; వెండియున్ = అటుతరువాత; కొందఱు = కొంతమంది; హోమ = హోమములందలి; అగ్నులు = అగ్నులను; ఆర్పిరి = ఆర్పివేసారు; పదంపడి = అటుతరువాత; కొందఱు = కొంతమంది; హోమకుండంబులన్ = హోమకుండముల; అందున్ = లో; మూత్రంబులు = మూత్రములు, నీరుడులు; విడిచిరి = వదిలిరి; కొందఱు = కొంతమంది; ఉత్తర = ఉత్తరపు దిక్కునకల; వేదికా = వేదికల యందలి; మేఖలలు = తోరణములు; త్రెంచిరి = తెంపివేసారు; కొందఱు = కొంతమంది; మునుల = మునులను; బాధించిరి = బాధపెట్టిరి; కొందఱు = కొంతమంది; తత్ = వారి; పత్నులన్ = భార్యలను; వెఱపించిరి = బెదిరించిరి; మఱికొందఱు = మరికొంతమంది; దేవతా = దేవతలను; నిరోధంబున్ = అడ్డుపెట్టుటలు; కావించిరి = చేసిరి; అంతన్ = అంతట; మణిమంతుండు = మణిమంతుడు; భృగువును = భృగువును; వీరభద్రుండు = వీరభద్రుడు; దక్షునిన్ = దక్షుని; చండీశుండు = చండీశుడు; పూషుని = పూషుని; భగుని = భగుని; నందీశ్వరుండును = నందీశ్వరుడును; పట్టిరి = పట్టుకొనిరి; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; సదస్య = సభ్యుల; దేవ = దేవతల; ఋత్విక్ = ఋత్విక్కుల; నికాయంబులన్ = సమూహములను; శిలల్ = రాళ్ళు; ఱువ్వియున్ = విసిరి; జానువుల్ = మోకాళ్ళ; పొడిచియున్ = పొడిచి; అఱచేతులన్ = అరచేతుల; అడచియున్ = నలగ్గొట్టి; గుల్ఫంబులన్ = చీలమండల; పొడిచియున్ = పొడిచి; వివిధ = రకరకములైన; బాధలు = బాధలు; పఱచిన = పెట్టిన; వారు = వారు; కాందిశీకులు = భయముచేత పారిపోవువారు; ఐ = అయ్యి; ఎక్కడెక్కడేని = ఎక్కెక్కడికో; చనిరి = వెళ్ళిపోయిరి; మఱియును = ఇంకను.
భావము:- అని ఈ విధంగా భయంతో వెఱ్ఱిచూపులు చూస్తూ పలుకుతుండగా గొప్పవాడైన దక్షునకు భయాన్ని కలిగిస్తూ వేలకొలది అపశకునాలు భూమిపైనా ఆకాశంలోనూ కనిపించసాగాయి. ఆ సమయంలో గోరోజనం వంటి రంగు కలవారు, పసుపుపచ్చని రంగు కలవారు, పొట్టివారు, మొసలిపొట్ట వంటి ముఖాలు కలవారు అయిన ప్రమథగణాలు రకరకాలైన ఆయుధాలను ధరించి పరుగున వచ్చి దక్షుని యజ్ఞశాలను సమీపించి, యజ్ఞవాటికలను చెల్లాచెదరు చేశారు. కొందరు ప్రాగ్వంశాన్ని (యజ్ఞశాల ప్రాంత గృహాన్ని), కొందరు పత్నీశాలను (యజ్ఞ యజమాని భార్య ఉండే శాలను), కొందరు సదస్యశాలను (సభాస్థలి శాలను), కొందరు అగ్నీధ్రశాలను (అగ్నిని ధరంచే ఋత్విక్కుల శాలను), కొందరు యజమానశాలను (యజ్ఞ యజమాని అయిన దక్షుని శాలను), కొందరు వంటశాలను నాశనం చేశారు. మరికొందరు యజ్ఞపాత్రలను, అగ్నిగుండాలను ధ్వంసం చేశారు. ఇంకా కొందరు హోమాగ్నులను ఆర్పివేశారు. ఆ తరువాత కొందరు హోమకుండాలలో మూత్రవిసర్జన చేశారు. కొందరు ఉత్తర దిక్కున ఉన్న వేదిక యొక్క తోరణాలను త్రెంచివేశారు. కొందరు మునులను బాధించారు. కొందరు వారి భార్యలను భయపెట్టారు. మరికొందరు దేవతలను అడ్డుకున్నారు. అప్పుడు మణిమంతుడు భృగువును, వీరభద్రుడు దక్షుని, చండీశుడు పూషుని, నందీశ్వరుడు భగుని పట్టుకొన్నారు. ఈ విధంగా సదస్యులైన దేవతల, ఋత్విక్కుల సమూహాన్ని రాళ్ళతో కొట్టి, మోకాళ్ళతో పొడిచి రకరకాల బాధలు పెట్టగా వాళ్ళంతా కాందిశీకులై ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. ఇంకా...
తెభా-4-119-క.
మును దక్షుఁ డభవుఁ బలుకఁ 'గఁ
గను గీఁటిన' భగునిఁ బట్టి కన్నులు పెకలిం
చెను నందీశ్వరుఁ; డచ్చటి
జనములు హాహారవముల సందడి గొలుపన్.
టీక:- మును = ఇంతకుముందు; దక్షుడు = దక్షుడు; అభవున్ = శివుని; పలుకగ = తిడుతుండగ; కనుగీటిన = కనుగీటినట్టి; భగుని = భగుని యొక్క; కన్నులు = కళ్ళు; పెకలించెను = పీకెను; నందీశ్వరుడు = నందీశ్వరుడు; అచటి = అక్కడి; జనములు = జనులు; హాహా = హాహ అనెడి; రవముల = శబ్దములతో; సందడిగొలుపన్ = గగ్గోలుపెట్టగ.
భావము:- పూర్వం దక్షుడు శివుని నిందించినప్పుడు కన్ను గీటిన భృగుని పట్టుకొని నందీశ్వరుడు అక్కడి జనం హాహాకారాలు చేస్తుండగా అతని కన్నులను పెకలించాడు.
తెభా-4-120-తే.
కుపితుఁడై నాఁడు భవుని దక్షుఁడు శపింపఁ
'బరిహసించిన' పూషుని పండ్లు డుల్లఁ
గొట్టె బలభద్రుఁ డా కళింగుని రదంబు
లెలమి డులిచిన పగిదిఁ జండీశ్వరుండు.
టీక:- కుపితుడు = కోపము కలవాడు; ఐ = అయ్యి; నాడు = ఆవేళ; భవుని = శివుని; దక్షుడు = దక్షుడు; శపింపన్ = శపిస్తుండగ; పరిహసించిన = విపరీతముగ నవ్విన; పూషుని = పూషుని; పండ్లు = దంతములు; డుల్లగొట్టెను = ఊడగొట్టెను; బలభద్రుడు = బలభద్రుడు; ఆ = ఆ; కళింగుని = కళింగుడు అనెడివాని; రదంబులు = పండ్లు; ఎలమిన్ = పౌరుషముతో; డులిచిన = ఊడగొట్టిన; పగిదిన్ = విధముగ; చండీశ్వరుండు = చండీశ్వరుడు.
భావము:- ఆనాడు దక్షుడు కోపంతో శివుని శపించినప్పుడు పరిహాసం చేసిన పూషుని దంతాలను బలభద్రుడు కళింగుని దంతాలను రాలగొట్టినట్లు చండీశ్వరుడు రాలగొట్టాడు.
తెభా-4-121-క.
తగవేది దక్షుఁ డా సభ
నగచాపుఁ దిరస్కరించునాఁ డట 'శ్మశ్రుల్
నగుచుం జూపుట' నా భృగు
పగకై శ్మశ్రువులు వీరభద్రుఁడు వెఱికెన్.
టీక:- తగవు = రీతి; ఏది = తప్పి; దక్షుడు = దక్షుడు; ఆ = ఆ; సభన్ = సభలో; నగచాపున్ = శివుని {నగచాపుడు - మేరుపర్వతమును చాపము (ధనుస్సు)గా పట్టినవాడు, శివుడు}; తిరస్కరించు = దూషించు; నాడు = ఆవేళ; అట = అక్కడ; శ్మశ్రువుల్ = మీసములు; నగుచున్ = నవ్వుతూ; చూపుటన్ = చూపించుటచేత; ఆ = ఆ; భృగు = భృగువుపైని; పగ = పగ; కై = కోసము; శ్మశ్రువులు = మీసములు; వీరభద్రుడు = వీరభద్రుడు; పెఱికెన్ = పీకెను.
భావము:- ఆనాడు దక్షుడు అన్యాయంగా శివుని దూషించినప్పుడు నవ్వుతూ మీసాలను చూపించిన భృగువు మీసాలను వీరభద్రుడు పెరికివేశాడు.
తెభా-4-122-సీ.
అతుల దర్పోద్ధతుండై వీరభద్రుండు-
గైకొని దక్షు వక్షంబుఁ ద్రొక్కి
ఘనశితధారాసిఁ గొని మేను వొడిచియు-
మంత్రసమన్విత మహిత శస్త్ర
జాలావినిర్భిన్న చర్మంబు గల దక్షుఁ-
జంపఁగా లేక విస్మయము నొంది
తద్వధోపాయంబు దన చిత్తమునఁ జూచి-
కంఠనిష్పీడనగతిఁ దలంచి
తెభా-4-122.1-తే.
మస్తకముఁ ద్రుంచి యంచితామర్షణమున
దక్షిణాలనమున వేల్చెఁ దదనుచరులు
హర్షమును బొంద; నచటి బ్రాహ్మణజనంబు
లాత్మలను జాల దుఃఖంబు లందుచుండ.
టీక:- అతుల = సాటిలేని; దర్ప = దర్పముతో; ఉద్ధతుండు = చెలరేగినవాడు; ఐ = అయ్యి; వీరభద్రుండు = వీరభద్రుడు; కైకొని = చేపట్టి; దక్షు = దక్షుని; వక్షంబున్ = వక్షస్థలమును; త్రొక్కి = తొక్కి; ఘన = గొప్ప; శిత = వాడియైన; ధారా = పదును కలిగిన; అసిన్ = కత్తిని; కొని = తీసుకొని; మేను = చర్మము; ఒడిచియు = ఒలిచినప్పటికిని; మంత్ర = మంత్రశక్తులతో; సమన్విత = కూడినది; మహిత = గొప్ప; శస్త్ర = శస్త్రముల; జాలా = సమూహములముతోనైనా; అవినిర్భిన్న = చినిగిపోనట్టి; చర్మంబున్ = చర్మము; కల = కలిగిన; దక్షున్ = దక్షుని; జంపగాలేక = చంపలేక; విస్మయమున్ = ఆశ్చర్యమును; ఒంది = పొంది; తత్ = అతనిని; వధ = చంపెడి; ఉపాయంబున్ = ఉపాయమును; తన = తన యొక్క; చిత్తమున = మనసులో; చూచి = కనుగొని; కంఠ = గొంతు; నిష్పీడన్ = నులుము; గతిన్ = విధమును; తలంచి = ఆలోచించుకొని.
మస్తకమున్ = శిరస్సును; త్రుంచి = త్రెంచి; అంచిత = మించుతున్న; అమర్షణమున = రోషముతో; దక్షిణాలనమున = దక్షిణాగ్నిలో; వేల్చెన్ = హోమము చేసెను; తత్ = అతని; అనుచరులు = అనుచరులు; హర్షమును = సంతోషమును; పొందన్ = పొందగ; అచటి = అక్కడి; బ్రాహ్మణ = బ్రహ్మణులైన; జనంబులు = జనులు; ఆత్మలనున్ = మనసులలో; చాలన్ = మిక్కిలి; దుఃఖంబులు = దుఃఖములు; అందుచున్ = చెందుతూ; ఉండన్ = ఉండగ.
భావము:- వీరభద్రుడు సాటిలేని దర్పంతో విజృంభించి దక్షుణ్ణి పడవేసి రొమ్ము త్రొక్కిపట్టి వాడి అంచు కలిగిన కత్తితో ఒడలంతా తూట్లు పొడిచాడు. కాని మంత్రపూతాలయిన అనేక శస్త్రాస్త్రాలతో గట్టిపడిన చర్మం కలిగిన దక్షుణ్ణి చంపలేక ఆశ్చర్యపడి, అతణ్ణి చంపే ఉపాయాన్ని ఆలోచించి మెడ నులిమి, శిరస్సు తునిమి దక్షిణాగ్ని కుండంలో వేసి భస్మం చేసాడు. అది చూచి వీరభద్రుని అనుచరులు సంతోషించగా, అక్కడి బ్రాహ్మణులు మనస్సులో ఎంతో బాధపడ్డారు.
తెభా-4-123-వ.
ఇట్లు వీరభద్రుండు దక్షుని యాగంబు విధ్వంసంబు గావించి నిజ నివాసంబైన కైలసంబునకుఁ జనియె నయ్యవసరంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగ; వీరభద్రుండు = వీరభద్రుడు; దక్షునిన్ = దక్షుని; యాగంబు = యజ్ఞమును; విధ్వంసంబున్ = నాశనము; కావించి = చేసి; నిజ = తన యొక్క; నివాసంబు = నివాసము; ఐన = అయినట్టి; కైలాసంబున్ = కైలాసమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో.
భావము:- ఈవిధంగా వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి తన నివాసమైన కైలాసానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో...
తెభా-4-124-చ.
హరభటకోటిచేత నిశి తాసి గదా కరవాల శూల ము
ద్గర ముసలాది సాధనవిదారిత జర్జరితాఖిలాంగులై
సురలు భయాకులాత్ము లగుచున్ సరసీరుహజాతుఁ జేరి త
చ్చరణ సరోరుహంబులకు సమ్మతిఁ జాఁగిలి మ్రొక్కి నమ్రులై.
టీక:- హర = శివుని; భట = భటుల; కోటి = సమూహము; చేతన్ = చేత; నిశిత = వాడియైన; అసి = ఖడ్గములు; గదా = గదలు; కరవాల = పొడవైన కత్తులు; శూల = శూలములు; ముద్గర = ఇనపగుదియలు; ముసల = రోకళ్లు; ఆది = మొదలగు; సాధన = ఆయుధములచే; విదారిత = చీల్చబడిన; జర్జరిత = పెక్కు తూట్లు పరపబడిన; అఖిల = సమస్తమైన; అంగులు = అవయవములు కలవారు; ఐ = అయ్యి; సురలు = దేవతలు; భయ = భయము; ఆకుల = చీకాకుపడిన; ఆత్ములు = మనసులు కలవారు; అగుచున్ = అవుతూ; సరసీరుహజాతున్ = బ్రహ్మదేవుని {సరసీరుహజాతుడు - సరసీరుహము (పద్మము)న జాతుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; చేరి = దగ్గరకువెళ్ళి; తత్ = అతని; చరణ = పాదముల; సరోరుహంబుల్ = పద్మములు {సరోరుహంబులు - సరసున ఈరుహము (పుట్టినది), పద్మము}; కున్ = కు; సమ్మతిన్ = కోరి, మనస్ఫూర్తిగ; జాగిలి = నేలకువాలి; మ్రొక్కి = నమస్కరించి; నమ్రులు = వినయముతో వంగినవారు; ఐ = అయ్యి.
భావము:- శివభటుల చేతుల్లోని వాడి కత్తులు, గదలు, శూలాలు, ఇనుపగుదియలు, రోకళ్ళు మొదలైన ఆయుధాల దెబ్బలకు అవయవాలన్నీ గాయపడగా దేవతలు భయంతో గుండె చెదరి బ్రహ్మదేవుణ్ణి సమీపించి, అతని పాదపద్మాలకు మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారాలు చేసి, వినయంతో....
తెభా-4-125-క.
తము ధూర్జటి సైనికు లగు
ప్రమథులు దయమాలి పెలుచ బాధించుట స
ర్వముఁ జెప్పి"రనుచు మైత్రే
య మునీంద్రుఁడు విదురుతోడ ననియెన్; మఱియున్.
టీక:- తమున్ = తమను; దూర్జటి = శివుని; సైనికులు = సైనికులు; అగు = అయినట్టి; ప్రమథులు = ప్రమథగణములు; దయమాలి = నిర్దాక్షిణ్యముగ; పెలుచన్ = అతిశయించి; బాధించుట = బాధపెట్టుట; సర్వమున్ = అంతయును; చెప్పిరి = చెప్పారు; అనుచున్ = అంటూ; మైత్రేయ = మైత్రేయుడు అనెడి; ముని = మునులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; విదురు = విదురుని; తోడన్ = తోటి; అనియెన్ = పలికెను; మఱియున్ = ఇంకను.
భావము:- శివుని సైనికులైన ప్రమథులు విజృంభించి నిర్దాక్షిణ్యంగా తమను బాధించిన విషయాన్నంతా చెప్పారు” అని మైత్రేయ మునీంద్రుడు విదురునితో చెప్పాడు. ఇంకా...