పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/ఈశ్వర దక్షుల విరోధము
తెభా-4-35-సీ.
దక్షప్రజాపతి తనయ యా భవుని భా-
ర్యయు ననఁ దగు సతి యను లతాంగి
సతతంబుఁ బతిభక్తి సలుపు చుండియుఁ దనూ-
జాతలాభము నందఁ జాలదయ్యె;
భర్గుని దెసఁ జాలఁ బ్రతికూలుఁ డైనట్టి-
తమ తండ్రిమీఁది రోషమునఁ జేసి
వలనేది తా ముగ్ధవలె నిజయోగ మా-
ర్గంబున నాత్మదేహంబు విడిచె;"
తెభా-4-35.1-తే.
నని మునీంద్రుఁడు వినిపింప నమ్మహాత్ముఁ
డైన విదురుండు మనమున నద్భుతంబు
గదురఁ దత్కథ విన వేడ్క గడలుకొనఁగ
మునివరేణ్యునిఁ జూచి యిట్లనియె మఱియు.
టీక:- దక్షప్రజాపతి = దక్షప్రజాపతి యొక్క; తనయ = పుత్రిక; ఆ = ఆ; భవుని = శివుని; భార్య = భార్య; అనన్ = అనుటకు; తగు = తగిన; సతి = సతీదేవి {సతి - సత్ అను అస్తిత్వము యైన శక్తిరూపి}; అను = అనెడి; లతాంగి = స్త్రీ {లతాంగి - లతవంటి అంగి (అంగములు, దేహము) కలామె, స్త్రీ}; సతతంబున్ = ఎల్లప్పుడును; పతిభక్తి = పతియెడలిభక్తి; సలుపుచుండియున్ = చేస్తున్నప్పటికిని; తనూజాత = సంతాన {తనూజాత - తనువు (దేహమున) జాతము (పుట్టినది), సంతానము}; లాభమున్ = సాఫల్యమును; అందజాలదు = పొందలేనిది; అయ్యెన్ = ఆయెను; భర్గుని = శివుని; దెసన్ = వైపు; చాలన్ = మిక్కిలి; ప్రతికూలుడు = వ్యతిరిక్తము కలవాడు; ఐనట్టి = అయినట్టి; తమ = తమ యొక్క; తండ్రి = తండ్రి; మీది = అందు కలిగిన; రోషమునన్ = రోషము; చేసి = వలన; వలనేది = వేరుపాయములేనిదై; తాన్ = తను; ముగ్ధ = అమాయకురాలు; వలె = వలె; నిజ = తన; యోగ = యోగమునకు చెందిన; మార్గంబునన్ = విధానములో; ఆత్మ = తన; దేహంబున్ = శరీరమును; విడిచె = వదిలెను; అని = అని.
ముని = మునులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; వినిపింపన్ = చెప్పగా; ఆ = ఆ; మహాత్ముడు = గొప్పఆత్మ కలవాడు; ఐన = అయిన; విదురుండు = విదురుడు; మనమునన్ = మనసులో; అద్భుతంబు = ఆశ్చర్యకరమైన యాసక్తి; కదురన్ = విజృంభించగ; తత్ = ఆ; కథన్ = కథను; వినన్ = వినుటకు; వేడ్క = కుతూహలము; కడలుకొనగా = ఉప్పొంగగ {కడలుకొను - కడ (చివర) వరకు కొను (తీసుకుపోవు), మిక్కిలి వ్యాపించు}; ముని = మునులలో; వరేణ్యునిన్ = ఉత్తముని; చూచి = చూసి; ఇట్లు = ఇలా; అనియెన్ = పలికెను; మఱియున్ = ఇంకను.
భావము:- దక్షప్రజాపతి కూతురు, పరమశివుని భార్య అయిన సతీదేవి తన పతిని అనునిత్యం మిక్కిలి భక్తితో సేవించినా ఆమెకు సంతానం కలుగలేదు. పరమేశ్వరునిపట్ల పగబూనిన తన తండ్రిమీద కోపించి ఆ ఉత్తమ ఇల్లాలు యోగమార్గంలో తన శరీరాన్ని పరిత్యజించింది.” అని మైత్రేయుడు విదురునితో చెప్పాడు. విదురుడు ఆశ్చర్యపడి ఆ వృత్తాంతమంతా తెలుసుకోవాలనే కుతూహలం కలుగగా ఆ మునీంద్రుని ఇలా ప్రశించాడు.
తెభా-4-36-సీ.
"చతురాత్మ! దుహితృవత్సలుఁడైన దక్షుండు-
దన కూఁతు సతి ననాదరము చేసి
యనయంబు నఖిలచరాచర గురుఁడు ని-
ర్వైరుండు శాంతవిగ్రహుఁడు ఘనుఁడు
జగముల కెల్లను జర్చింప దేవుండు-
నంచితాత్మారాముఁ డలఘుమూర్తి
శీలవంతులలోన శ్రేష్ఠుండు నగునట్టి-
భవునందు విద్వేషపడుట కేమి
తెభా-4-36.1-తే.
కారణము? సతి దా నేమి కారణమున
విడువరానట్టి ప్రాణముల్ విడిచె? మఱియు
శ్వశుర జామాతృ విద్వేష సరణి నాకుఁ
దెలియ నానతి యిమ్ము సుధీవిధేయ!"
టీక:- చతురాత్మ = చతురమైన స్వభావము కలవాడ; దుహితృ = పుత్రిక లందు; వత్సలుండు = వాత్సల్యము అధికముగ కలవాడు; ఐన = అయిన; దక్షుండు = దక్షుడు; తన = తన యొక్క; కూతున్ = పుత్రికను; సతి = సతీదేవిని; అనాదరము = అనాపేక్ష; చేసి = చేసి; అనయంబున్ = అవశ్యము; అఖిల = సమస్తమైన; చరాచర = చరాచరములు అన్నిటికిని; గురుడు = కాపాడువాడు; నిర్వైరుండు = శత్రుత్వము లేనివాడు; శాంతవిగ్రహుడు = శాంతమైన స్వరూపము కలవాడు; ఘనుడు = గొప్పవాడు; జగముల్ = భువనముల; ఎల్లన్ = అన్నిటికిని; చర్చింపన్ = తరచిచూసిన; దేవుండు = దేవుడు; అంచిత = ఒప్పుతున్న; ఆత్మారాముడు = ఆత్మ యందు విహరించువాడు; అలఘుమూర్తి = గొప్పవాడు {అలఘుమూర్తి - అలఘు (చిన్నదికాని, పెద్దదైన) మూర్తి (మూర్తిత్వము కలవాడు), గొప్పవాడు}; శీలవంతులు = శీలము కలవారి; లోనన్ = అందు; శ్రేష్ఠుండు = ఉత్తముడు; అగునట్టి = అయినట్టి; భవుని = శివుని; అందున్ = ఎడల; విద్వేష = మిక్కిలి ద్వేషము; పడుటకున్ = చెందుటకు; ఏమి = ఏమిటి.
కారణము = కారణము; సతి = సతీదేవి; ఏమి = ఏమి; కారణమున = కారణమువలన; విడువరాని = వదలకూడని; ప్రాణముల్ = ప్రాణములను; విడిచెన్ = వదలెను; మఱియున్ = ఇంకను; శ్వశుర = మామ; జామాతృ = అల్లుళ్ళ; విద్వేష = విరోధము యొక్క; సరణి = తీరు; నాకున్ = నాకు; తెలియన్ = తేలియునట్లు; ఆనతిమ్ము = సెలవు; ఇమ్ము = చేయుము; సుధీవిధేయ = సద్బుద్ధి కలవారికి విధేయుడ.
భావము:- “చతురస్వభావం కలవాడా! సజ్జనవిధేయా! తన పుత్రికలపై ప్రేమ గల దక్షుడు సతీదేవిని ఎందుకు అవమానించాడు? సమస్త చరాచరాలకు గురువు, ఎవరినీ ద్వేషింపనివాడు, ప్రశాంతమూర్తి, మహానుభావుడు, ఎల్ల లోకాలకు దేవుడు, ఆత్మారాముడు, విశ్వేశ్వరుడు, శీలవంతులలో అగ్రేసరుడు అయిన మహాదేవుని దక్షుడు ద్వేషించడానికి కారణం ఏమిటి? ఏ కారణంగా సతీదేవి తన ప్రాణాలు విడిచింది? మామయైన దక్షునికి, అల్లుడైన శివునికి విరోధం ఎలా సంభవించింది? నాకు ఈ కథను దయచేసి సెలవీయండి.”
తెభా-4-37-క.
అని యడిగిన నవ్విదురునిఁ
గనుఁగొని మైత్రేయుఁ డనియెఁ గౌతుక మొప్పన్
"విను మనఘ! తొల్లి బ్రహ్మలు
జన నుతముగఁ జేయునట్టి సత్రముఁ జూడన్.
టీక:- అని = అని; అడిగిన = అడగగ; ఆ = ఆ; విదురునిన్ = విదురుని; కనుగొని = చూసి; మైత్రేయుడు = మైత్రేయుడు; అనియెన్ = పలికెను; కౌతుకము = కుతూహలము; ఒప్పన్ = అతిశయించగ; వినుము = వినుము; అనఘ = పుణ్యుడ; తొల్లి = పూర్వము; బ్రహ్మలు = బ్రహ్మవేత్తలు; జన = ప్రజలు; నుతముగ = స్తుతింపబడునట్లు; చేయున్ = చేస్తున్న; అట్టి = అటువంటి; సత్రమున్ = యజ్ఞము; చూడన్ = చూచుటకు.
భావము:- అని అడిగిన విదురునకు మైత్రేయ మహర్షి ఇలా చెప్పాడు. “పుణ్యాత్మా! విను. పూర్వం బ్రహ్మవేత్తలు ప్రారంభించిన మహాయజ్ఞాన్ని చూడటానికి....
తెభా-4-38-చ.
సరసిజగర్భ యోగిజన శర్వ సుపర్వ మునీంద్ర హవ్యభు
క్పరమ ఋషిప్రజాపతులు భక్తిఁ మెయిం జనుదెంచి యుండ న
త్తరణిసమాన తేజుఁడగు దక్షుఁడు వచ్చినఁ దత్సదస్యు లా
దరమున లేచి; రప్పుడు పితామహ భర్గులు దక్క నందఱున్.
టీక:- సరసిజగర్భ = బ్రహ్మదేవుడు {సరసిజగర్భుడు - సరసిజ (పద్మము)న గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; యోగి = యోగులైన; జన = జనులు; శర్వ = శివుడు; సుపర్వ = దేవతలు; మునీంద్ర = మునులలో శ్రేష్ఠులు; హవ్యభుక్ = అగ్నిహోత్రుడు {హవ్యభుక్కు - హవ్యములను భుజించువాడు, అగ్నిహోత్రుడు}; పరమఋషి = గొప్పఋషులు; ప్రజాపతులున్ = ప్రజాపతులు; భక్తిన్ = భక్తి; మెయిన్ = కలిగి; చనుదెంచి = వచ్చి; ఉండన్ = ఉండగ; ఆ = ఆ; తరణి = సూర్యునితో; సమాన = సమానమైన; తేజుడు = తేజస్సు కలవాడు; అగు = అయినట్టి; దక్షుడు = దక్షుడు; వచ్చినన్ = రాగా; తత్ = ఆ; సదస్యులు = సభ్యులు; ఆదరమునన్ = ఆదరముతో; లేచిరి = నిలబడిరి; అప్పుడు = అప్పుడు; పితామహ = బ్రహ్మదేవుడు; భర్గులున్ = శంకరులు; తక్క = తప్పించి; అందఱున్ = అందరు.
భావము:- శివుడు, బ్రహ్మ, యోగీశ్వరులు, దేవతలు, మునీంద్రులు, మహర్షులు, ప్రజాపతులు మొదలైన వారంతా పరమాసక్తితో వచ్చారు. అప్పుడు అక్కడికి సూర్యతేజస్సుతో ప్రకాశిస్తూ దక్షుడుకూడ వచ్చాడు. దక్షుని చూడగానే బ్రహ్మ, శివుడు తప్ప సభలోనివారందరూ లేచి నిలబడ్డారు.
తెభా-4-39-క.
చనుదెంచిన యా దక్షుఁడు
వనజజునకు మ్రొక్కి భక్తివశులై సభ్యుల్
తన కిచ్చిన పూజలు గై
కొని యర్హాసనమునందుఁ గూర్చుండి తగన్.
టీక:- చనుదెంచిన = వచ్చిన; ఆ = ఆ; దక్షుడు = దక్షుడు; వనజుజున్ = బ్రహ్మదేవుని {వనజజుడు - వనజము (పద్మము)న జుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; కున్ = కి; మ్రొక్కి = నమస్కరించి; భక్తిన్ = భక్తికి; వశులు = చెందినవారు; ఐ = అయ్యి; సభ్యుల్ = సభలోనివారు; తనకున్ = తనకు; ఇచ్చిన = చేసిన; పూజలు = గౌరవములను; కైకొని = స్వీకరించి; అర్హ = అర్హమైన; ఆసనమున్ = పీఠమున; అందున్ = లో; కూర్చొండి = కూర్చుని; తగన్ = తగినట్లు.
భావము:- వచ్చిన దక్షుడు బ్రహ్మకు నమస్కరించాడు. సభ్యులు భక్తితో తనకు చేసిన పూజలను అందుకున్నాడు. తనకు తగిన పీఠంపై కూర్చొని...
తెభా-4-40-తే.
తన్నుఁ బొడగని సభ్యు లందఱును లేవ
నాసనము దిగనట్టి పురారివలను
గన్నుఁ గొనలను విస్ఫులింగములు సెదరఁ
జూచి యిట్లను రోషవిస్ఫురణ మెఱయ.
టీక:- తన్నున్ = తనను; పొడగని = చూసి; సభ్యులు = సభలోనివారు; అందఱునున్ = అందరు; లేవన్ = లేవగా; ఆసనమున్ = ఆసనమును; దిగని = లేవని; అట్టి = అటువంటి; పురారి = శంకరుని; వలను = వైపు; కన్ను = కళ్ళ; గవలను = జంటయందు; విస్ఫులింగములు = అగ్నికణములు; చెదరన్ = గ్రక్కుతుండగ; చూచి = చూసి; ఇట్లు = ఇలా; అను = అనెను; రోష = రోషము; విస్ఫురణ = అతిశయము; మెఱయ = బయల్పడుతుండగ.
భావము:- తనను చూచి సభ్యులందరూ లేచి నిలబడగా గద్దె దిగని శివునివైపు తన కంటికొనలనుండి మంటలు విరజిమ్ముతూ చూచి కోపంతో (ఇలా అన్నాడు).
తెభా-4-41-తే.
"వినుఁడు మీరలు రొదమాని విబుధ ముని హు
తాశనాది సురోత్తములార! మోహ
మత్సరోక్తులు గావు నా మాట"లనుచు
వారి కందఱ కా పురవైరిఁ జూపి.
టీక:- వినుడు = వినండి; మీరలు = మీరు; రొద = శబ్దముచేయుట; మాని = మాని; విబుధ = దేవతలు; ముని = మునులు; హుతాశన = అగ్నిహోత్రుడు; ఆది = మొదలైన; సురోత్తములార = దేవతలలో ఉత్తములార; మోహ = మోహముతోను; మత్సర = మత్సరముతోను కూడిన; ఉక్తులు = చెప్పుతున్నవి; కావు = కావు; నా = నా యొక్క; మాటలు = మాటలు; అనుచున్ = అంటూ; వారి = వారి; కిన్ = కి; అందఱ = అందఱి; కిన్ = కి; ఆ = ఆ; పురవైరి = శివుని {పురవైరి - త్రిపురాసురుని వైరి, శంకరుడు}; చూపి = చూపిస్తూ.
భావము:- “దేవతలారా! మునులారా! మీరందరూ సద్దు చేయకుండా వినండి. నా మాటలు అజ్ఞానంతో, అసూయతో పలికేవి కావు” అని వారందరికీ శివుని చూపించి...
తెభా-4-42-సీ.
"పరికింప నితఁడు దిక్పాలయశోహాని-
కరుఁ డీ క్రియాశూన్యపరుని చేతఁ
గరమొప్ప సజ్జనాచరితమార్గము దూషి-
తం బయ్యె; నెన్న గతత్రపుండు
మహితసావిత్రీ సమానను సాధ్వి న-
స్మత్తనూజను మృగశాబనేత్ర
సకల భూమీసుర జన సమక్షమున మ-
ర్కటలోచనుఁడు కరగ్రహణ మర్థిఁ
తెభా-4-42.1-తే.
జేసి తా శిష్యభావంబుఁ జెందు టాత్మఁ
దలఁచి ప్రత్యుద్గమాభివందనము లెలమి
నడపకుండిన మాననీ; నన్నుఁ గన్న
నోరిమాటకుఁ దన కేమి గోరువోయె.
టీక:- పరికింపన్ = చర్చించి చూడ; ఇతడు = ఇతను; దిక్పాల = దిక్పాలకుల యొక్క {దిక్పాలకులు - అష్టదిక్పాలకులు - 1 ఇంద్రుడు తూర్పు దిక్కునకు 2 అగ్ని ఆగ్నేయ దిక్కునకు 3 యముడు దక్షిణ దిక్కునకు 4 నిరృతి నైఋతి దిక్కునకు 5 వరుణుడు పడమటి దిక్కునకు 6 వాయువు వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు ఈశాన్య దిక్కునకు పరిపాలకులు}; యశస్ = కీర్తికి; హాని = నష్టము; కరుడు = కలిగించువాడు; ఈ = ఈ; క్రియా = చేయు పనులు; శూన్య = ఏమిలేక; పరుని = ఉండువాని; చేతన్ = చేత; కరమొప్పన్ = నిశ్చయముగ; సజ్జన = మంచివారిచే; ఆచరిత = ఆచరింపబడుతున్న; మార్గము = విధానము; దూషితంబు = దూషింపబడినది; అయ్యెన్ = అయినది; ఎన్నన్ = ఎంచిచూడగ; గతత్రపుండు = సిగ్గు లేనివాడు {గతత్రపుడు - గత (పోయిన) త్రపుడు (సిగ్గు కలవాడు)}; మహిత = గొప్ప; సావిత్రీ = సావిత్రీదేవికి; సమాననున్ = సమానమైనామెను; సాధ్విన్ = స్త్రీని {సాధ్వి - సాధుస్వభావురాలు, స్త్రీ}; అస్మత్ = నా యొక్క; తనూజనున్ = పుత్రికను; మృగశాబనేత్రన్ = స్త్రీని {మృగశబనేత్ర - లేడివంటి కన్నులు కలామె, స్త్రీ}; సకల = సమస్తమైన; భూమీసుర = బ్రాహ్మణ {భూమీసురులు - భూమి మీది దేవతలు, బ్రాహ్మణులు}; జన = జనముల; సమక్షమున = సమక్షములో; మర్కట = ఎగుడుదిగుడు; లోచనుడు = కన్నులు కలవాడు; కరగ్రహణము = చేపట్టుట {కరగ్రహణము - చేతిని గ్రహించి, వివాహము చేసికొనుట}; అర్థిన్ = కోరి; చేసి = చేసి.
తాన్ = తను; శిష్యభావమున్ = శిష్య సమాన భావము; చెందుటన్ = చెందుటను; ఆత్మన్ = మనసున; తలచి = తలచుకొని; ప్రత్యుద్గమ = లేచివచ్చి; అభివందనములున్ = గౌరవపూర్వక నమస్కారములు; ఎలమిన్ = ఆసక్తిగ; నడపకుండినన్ = చేయకపోతే; మాననీ = పోనీ; నన్నున్ = నన్ను; కన్న = చూసినందుకు; నోరిమాట = నోటిమాటకు; తనకున్ = తనకి; ఏమి = ఏమి; గోరు = చిన్నతనము; పోయెన్ = అయిపోతుంది.
భావము:- “ఈ శివుడు దిక్పాలకుల కీర్తికి హాని చేసేవాడు. ఇతడు క్రియాశూన్యుడు. సత్పురుషులు నడిచే మార్గం ఇతనివల్ల చెడిపోయింది. ఇతనికి సిగ్గు లేదు. లేడి కన్నులు కలిగి, సావిత్రీదేవివంటి సాధ్వీశిరోమణి అయిన నా కుమార్తెను ఈ కోతికన్నులవాడు పెద్దల సమక్షంలో కోరి పెండ్లి చేసుకున్నాడు. తన శిష్యభావాన్ని తలచుకొని నాకు ఎదురువచ్చి నమస్కరించకపోతే పోనీయండి. నన్ను చూచి పలుకరిస్తే తన నోటి ముత్యాలు రాలిపోతాయా?
తెభా-4-43-సీ.
అనయంబు లుప్తక్రియాకలాపుఁడు మాన-
హీనుఁడు మర్యాదలేని వాఁడు
మత్తప్రచారుఁ డున్మత్తప్రియుఁడు దిగం-
బరుఁడు భూతప్రేత పరివృతుండు
దామస ప్రమథ భూతములకు నాథుండు-
భూతిలిప్తుం డస్థిభూషణుండు
నష్టశౌచుండు నున్మదనాథుఁడును దుష్ట-
హృదయుఁ డుగ్రుఁడును బరేతభూ ని
తెభా-4-43.1-తే.
కేతనుఁడు వితతస్రస్తకేశుఁ డశుచి
యయిన యితనికి శివనాముఁ డను ప్రవాద
మెటులు గలిగె? నశివుఁ డగు నితని నెఱిఁగి
యెఱిఁగి వేదంబు శూద్రున కిచ్చినటులు.
టీక:- అనయంబున్ = ఎప్పుడు, నీతి కానట్టి; లుప్త = శూన్యమైమపోయిన; క్రియా = పనులు, యజ్ఞకర్మములు; కలాపుడు = చేయుటలు కలవాడు; మాన = శీలము, అభిమానము; హీనుడు = లేనివాడు; మర్యాద = మర్యాద, నియమములు; లేనివాడు = లేనట్టివాడు; మత్తప్రచారుడు = మత్తెక్కి తిరుగువాడు, మిక్కిలి ప్రచారము కల వాడు; ఉన్మత్తప్రియుడు = పిచ్చివారి కిష్ఠుడు, మిక్కిలి (వెఱ్ఱి) ప్రేమస్వభావి; దిగంబరుడు = దిక్కులే అంబరముగా కలవాడు; భూతప్రేత = భూతప్రేతములుచేత; పరివృతుండు = చుట్టబడి యుండువాడు; తామస = తమోగుణము కల; ప్రమథ = ప్రమథ; భూతముల్ = గణముల; కున్ = కి; నాథుండు = నాయకుడు; భూతి = బూడిద, విభూతి; లిప్తుండు = పూసుకొనువాడు; అస్థి = ఎముకలు; భూషణుండు = అలంకారములుగ కలవాడు; నష్టశౌచుండు = కోల్పోయిన శుచిత్వము కలవాడు; ఉన్మదనాథుఁడును = అమితమైన మదము కలవారికి నాయకుడు, ఉన్మత్తులకు(పిచ్చివారికి) నాయకుడు; దుష్టహృదయుడు = దుష్టమైన మనసు కలవాడు; ఉగ్రుడు = ఉగ్రరూపము కలవాడు; పరేతభూమినికేతనుడు = శ్మశానవాసి;
వితతస్రస్త = మిక్కిలి విరబోసుకొన్న; కేశుడు = కేశములు కలవాడు; అశుచి = శుచిత్వము లేనివాడు; అయిన = అయినట్టి; ఇతని = ఇతని; కిన్ = కి; శివ = శివ యనెడి; నాముడు = పేరుబడ్డవాడు; అను = అనెడి; ప్రవాదము = తప్పుడు ప్రచారము; ఎటులన్ = ఎలా; కలిగెన్ = కలిగినది; అశివుడు = అశుభమైనవాడు; అగు = అయినట్టి; ఇతనినన్ = ఇతనిని; ఎఱిగియెఱిగి = బాగ తెలిసి కూడ; వేదంబున్ = వేదములను; శూద్రున్ = శూద్రుని; కిన్ = కి; ఇచ్చినటుల = ఇచ్చినట్లు.
భావము:- దక్షుడు శివుని ఇలా నిందిస్తున్నా స్తుతి కూడ స్పురిస్తున్న చమత్కారం ఉన్న పద్యం యిది – ఇతను ఎప్పుడు వేదకర్మ లాచరించని వాడు. (కర్మలు చేయని వాడు అంటే పూర్తిగా కర్మలకు అతీతుడు); మానాభిమానాలు లేని వాడు. (మానం లేనివాడు అంటే గౌరవ అగౌరవాలు పట్టని వాడు); నియమాలు లేని వాడు. (మర్యాద లేదంటే దేశకాలాలకి తరతమ భేదాలకి అతీతుడు); మత్తెక్కి తిరుగు వాడు. (ఆత్మానందంలో మెలగు వాడు); పిచ్చివారి కిష్టుడు. (ఉన్నత్తాకారంలో మెలగే సిద్ధులకు ఇష్టుడు); నగ్నంగా ఉంటాడు. (దిగంబరుడు ఆకాశ అంతరిక్షాలు దేహంగా కలవాడు); భూతాలు ప్రేతాలు ఎప్పుడు చుట్టూ ఉంటాయి. (పంచభూతాలు మరణానంతర జీవాత్మలు కూడ ఆశ్రయించి ఉంటాయి); తమోగుణం గల ప్రమథ గణాలకు నాయకుడు. బూడిద పూసుకుంటాడు. (ఆది విరాగి కనుక వైరాగ్య చిహ్న మైన విభూతి రాసుకుంటాడు); ఎముకలు అలంకారాలుగా ధరిస్తాడు. (అస్థి భూషణుడు అంటే బ్రహ్మ కపాలాలు ధరిస్తాడు); అపవిత్రుడు. (శౌచాశౌచాలకి అతీత మైన వాడు); మదించి తిరుగువారికి, పిచ్చి వారికి నాయకుడు (ఉన్మత్తులనే భూతగణాలకి అధిపతి. లౌకిక విలువలు లెక్కచెయ్యని వాడు;). దుష్టబుద్ధి. (దుష్ట అర్థచేసుకోరాని నిగూఢ మనస్సు కలవాడు);. ఉగ్రమైన స్వభావం కల వాడు. (ఉగ్రుడు అంటే రుద్రుడు); శ్మశాన వాసి. (మరణ స్థితులకు అవ్వల నుండు వాడు); జుట్టు విరబోసుకొని ఉంటాడు. (సంకోచ సందేహాదులకు అతీతుడు); శుచి శుభ్రం లేకుండా మలినదేహంతో ఉంటారు. (అశుచి అంటే సర్వం తానే కనుక శుచి అశుచి భేదాలు లేని వాడు); అలాంటి వాడికి శివుడు అని ఎందుకో అసందర్భంగా పిలుస్తారు. శివుడు అంటే శుభాలను కలిగించే వాడు అని చూడొద్దా. (శివనాముడను ప్రవాదము పేరుకు మాత్రమే శివుడు అనటం అసందర్భం); ఇంతటి అశివుడు అని తెలిసికూడ, శూద్రునికి వేదాలు చెప్పినట్లు, శివుడు అని పేరు పెట్టారు.
తెభా-4-44-వ.
ఇతనికి నస్మత్తనూజను విధిప్రేరితుండనై యిచ్చితి.”
టీక:- ఇతని = ఇతని; కిన్ = కి; అస్మత్ = నా యొక్క; తనూజనున్ = పుత్రికను {తనూజ - దేహమున పుట్టినది, సుత}; విధి = కర్మచేత, బ్రహ్మదేవునిచేత; ప్రేరితుడను = ప్రేరేపింపబడినవాడను; ఐ = అయ్యి; ఇచ్చితి = వివాహము చేసితి.
భావము:- ఇతనికి బ్రహ్మ మాట విని నా పుత్రికను ఇచ్చాను.”
తెభా-4-45-క.
అని యిట్టులు ప్రతికూల వ
చనములు దక్షుండు పలికి శపియింతును శ
ర్వుని నని జలములు గొని కర
మున నిలిపి యిటులనె రోషమున ననఘాత్మా!
టీక:- అని = అని; ఇట్టుల = ఈ విధముగ; ప్రతికూల = వ్యతిరేకపు; వచనములు = మాటలు; దక్షుండు = దక్షుడు; పలికి = పలికి; శపియింతును = శపిస్తాను; శర్వుని = శంకరుని; అని = అని; జలములు = నీరు; కొని = తీసుకొని; కరమున = చేతిలో; నిలిపి = ఉంచుకొని; ఇటుల = ఇలా; అనెన్ = పలికెను; రోషమునన్ = రోషముతో; అనఘాత్మా = పుణ్యాత్మా.
భావము:- అని ఈ విధంగా దక్షుడు నిందించి “శంకరుని శపిస్తాను” అంటూ శాపజలాలను చేతిలో తీసికొని రోషంతో ఇలా అన్నాడు.
తెభా-4-46-క.
"ఇతఁ డింద్రోపేంద్ర పరీ
వృతుఁడై మఖసమయమున హవిర్భాగము దే
వతలం గూడఁగ మహిత ని
యతిఁ బొందక యుండుఁగాక యని శపియించెన్."
టీక:- ఇతడు = ఇతడు; ఇంద్ర = ఇంద్రునిచేతను; ఉపేంద్ర = విష్ణువుచేతను; పరీవృతుడు = పరివేష్టింబడినవాడు; ఐ = అయ్యి; మఖ = యజ్ఞముల; సమయమునన్ = సమయములలో; హవిర్భాగము = హవిస్సునందలి భాగము; దేవతలన్ = దేవతలతో; కూడగ = కలిసి గ్రహించు; మహిత = గొప్ప; నియతిన్ = భాగ్యమును; పొందకన్ = పొందకుండగ; ఉండుగాక = పోవుగాక; అని = అని; శపియించెన్ = శపించెను.
భావము:- “ఈ శివుడు ఇంద్రుడు, విష్ణువు మొదలైన దేవతలతోపాటు యజ్ఞంలో హవిర్భాగం పొందకుండు గాక!” అని శపించాడు.
తెభా-4-47-వ.
ఇట్లు దక్షుండు పల్కిన గర్హితవాక్యంబులు వినిందితంబు లగుం గాని యాథార్థ్యంబున వాస్తవంబు లగుచు భగవంతుండగు రుద్రునందు ననిందితంబులై గాక స్తుతి రూపంబున నొప్పెఁ; దదనంతరంబ రుద్రునకు శాపం బిచ్చిన కారణంబున దక్షుండు సదస్యముఖ్యులచే 'నకృత్యం' బని నిషేధింపబడి ప్రవృద్ధంబయిన క్రోధంబుతోడ నిజనివాసంబునకుం జనియె; అంత గిరిశానుచరాగ్రేసరుం డగు నందికేశ్వరుండు దక్షుండు నిటలాక్షుని శపియించిన శాపంబు, నతనిఁ బల్కిన యనర్హ వాక్యంబులును విని కోపారుణితలోచనుండై యిట్లను “నీ దక్షుండు మర్త్యశరీరంబు శ్రేష్ఠంబు గాఁ దలఁచి యప్రతిద్రోహియైన భగవంతునందు భేదదర్శియై యపరాధంబుఁ గావించె; ఇట్టి మూఢాత్ముండు దత్త్వ విముఖుం డగు; మఱియుం గూటధర్మంబు లయిన నివాసంబుల గ్రామ్యసుఖకాంక్షలం జేసి సక్తుండై యర్థవాదంబు లైన వేదంబులచేత నష్టమనీషం గలిగి కర్మతంత్రంబు విస్తృతంబు చేయు; వెండియు దేహాదికంబు లుపాదేయంబులు గాఁ దలఁచుచు బుద్ధిచేత నాత్మతత్త్వంబు మఱచి వర్తించుచుఁ బశుప్రాయుండై స్త్రీకాముండు నగు; నిదియునుం గాక దక్షుం డచిరకాలంబున మేషముఖుం డగు"నని మఱియు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; దక్షుండు = దక్షుడు; పల్కిన = పలికినట్టి; గర్హిత = నిందాపూర్వక; వాక్యంబులు = పలుకులు; వినిందితంబులు = మిక్కిలి నిందించుటలు; అగున్ = అవుతాయి; కాని = కాని; యథార్థ్యంబునన్ = నిజానికి, అర్థానుసారము; వాస్తవంబులున్ = వాస్తవములు; అగుచున్ = అవుతూ; భగవంతుండు = భగవంతుడు; అగు = అయిన; రుద్రున్ = శివుని {రుద్రుడు - రౌద్రము (కోపము) కలవాడు, శివుడు}; అందున్ = ఎడల; అనిందితంబులు = నిందింపబడనివ; ఐ = అయి; స్తుతి = పొగడుచున్న; రూపంబునన్ = విధముగ; ఒప్పెన్ = ఒప్పినవి; తదనంతరంబ = తరువాత; రుద్రున్ = శివుని; కున్ = కి; శాపంబున్ = శాపమును; ఇచ్చిన = ఇచ్చిన; కారణంబునన్ = కారణమువలన; దక్షుండు = దక్షుడు; సదస్య = సభలోని; ముఖ్యుల = పెద్దల; చేన్ = చేత; అకృత్యంబు = కానిపని; అని = అని; నిషేధింపబడి = నిషేధింపబడి; ప్రవృద్ధంబున్ = పెచ్చుమీరినది; అయిన = అయిన; క్రోధంబున్ = కోపము; తోడన్ = తోటి; నిజ = తన; నివాసంబున్ = గృహమున; కున్ = కు; చనియె = వెళ్ళెను; అంత = అంతట; గిరిశ = శివుని {గిరిశుడు - గిరి (కైలసగిరి)కి ఈశుడు, శంకరుడు}; అనుచర = అనుచరులలో; అగ్రేసరుండు = మొదటివాడు; అగు = అయిన; నందికేశ్వరుండు = నందీశ్వరుడు; దక్షుండు = దక్షుడు; నిటలాక్షుని = శివుని {నిటలాక్షుడు - నిటలమున (నుదుట) అక్షి (కన్ను) కలవాడు, శంకరుడు}; శపియించిన = శపించిన; శాపంబున్ = శాపమును; అతనిన్ = అతనిచేత; పల్కిన = పలుకబడిన; అనర్హ = తగని; వాక్యంబులును = పలుకులు; విని = విని; కోపారుణితలోచనుండు = కోపముచేత యెఱ్ఱబడిన కన్నులు కలవాడు; ఐ = అయ్యి; ఇట్లు = ఇలా; అను = అనెను; ఈ = ఈ; దక్షుండు = దక్షుడు; మర్త్య = మృతిచెందు, మానవ; శరీరంబున్ = భౌతిక దేహమును; శ్రేష్ఠంబు = ఉత్తమమైనది; కాన్ = అగునట్లు; తలచి = అనుకొని; అప్రతిద్రోహి = ద్రోహిపై ప్రతీకారము చేయనివాడు; ఐన = అయినట్టి; భగవంతుని = మహామహిమాన్వితుండు; భేదదర్శి = వైమనస్యము చూపువాడు; ఐ = అయ్యి; అపరాధంబు = తప్పు; కావించెన్ = చేసెను; ఇట్టి = ఇటువంటి; మూఢాత్ముండు = అవివేకపు మనసున్నవాడు; తత్త్వ = నిజస్వరూపమును; విముఖుండు = తిరస్కరించువాడు; అగు = అయిన; మఱియున్ = ఇంకను; కూటధర్మంబులు = కపటవిధానములు కలవి; అయిన = అయినట్టి; నివాసంబులన్ = గృహములందు; గ్రామ్యసుఖకాంక్షలన్ = మోటుకామములపై కాంక్షల; చేసి = అందు; సక్తుండు = చిక్కుకొన్నవాడు; ఐ = అయ్యి; అర్థవాదంబులు = స్తుతిమాత్రములు; ఐన = అయినట్టి; వేదంబుల్ = వేదముల; చేతన్ = వలన; నష్టమనీషన్ = కోల్పోయిన ప్రజ్ఞ; కలిగి = కలిగి; కర్మతంత్రంబు = వ్రత విధానములను; విస్త్రుతముచేయున్ = ఎక్కువగా చేయును; వెండియున్ = ఇంకను; దేహ = శరీరము; ఆదికంబులున్ = మొదలైనవానినే; ఉపాదేయంబులున్ = గ్రహించదగినవి; కాన్ = అగునట్లు; తలచుచున్ = అనుకొనుచు; బుద్ధి = మనసు; చేతన్ = అందు; ఆత్మతత్త్వంబున్ = అసలు సత్యమును; మఱచి = మరచిపోయి; వర్తించుచు = ప్రవర్తిస్తూ; పశుప్రాయుండు = జంతు సమానుడు; ఐ = అయ్యి; స్త్రీకాముండున్ = అమితంగా స్త్రీ సాంగత్యం కోరువాడు, స్త్రీలోలుడు; అగున్ = అగును; ఇదియునున్ = ఇంతే; కాక = కాకుండగ; దక్షుండు = దక్షుడు; అచిర = కొద్ధి; కాలంబునన్ = కాలములోనే; మేషముఖుండు = గొఱ్ఱె తల కలవాడు; అగున్ = అవును; అని = అని; మఱియు = ఇంకా.
భావము:- ఈ విధంగా దక్షుడు పలికిన నిందావాక్యాలు పైకి అనుచితాలుగా తోచినా మరొక అర్థంలో వాస్తవాలై, సముచితాలై పూజ్యుడైన శివునికి పొగడ్తలే అయ్యాయి. ఆ తరువాత శివుని శపించిన దక్షుణ్ణి చూచి సభ్యులు “నీవు చేసినది చెడ్డపని” అని అడ్డుకోగా, దక్షుడు ఆగ్రహోదగ్రుడై తన గృహానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శివుని సేవకులలో శ్రేష్ఠుడైన నందికేశ్వరుడు దక్షుడు పరమేశ్వరుని నిందించడం, శపించడం విని కోపంతో కన్నులెఱ్ఱవారగా ఇలా అన్నాడు “ఈ దక్షుడు తన మర్త్యశరీరం గొప్పది అని భావించాడు. తనకు తిరిగి కీడు చేయకుండా శాంతుడై ఉన్న దేవదేవునికి అపరాధం చేసాడు. వీడు భేదదర్శి. ఇటువంటి మూర్ఖునికి తత్త్వదర్శనం లభించదు. వీడు కుటిల ధర్మాలను ఆశ్రయించి నీచసుఖాలపై కోర్కెలు పెంచుకున్నాడు. వేదాలలోని అర్థవాదాలను నిజమని నమ్మాడు. దేహమునే ఆత్మగా భావిస్తాడు. అందుచేత వీడు సత్యమైన ఆత్మతత్త్వాన్ని విస్మరించి పశువుతో సమానమౌతాడు. వీడు స్త్రీలోలుడై చెడిపోతాడు. అంతేకాదు, ఈ దక్షుడు తొందరలోనే గొఱ్ఱెతలవాడు అగుగాక” అని ఇంకా...
తెభా-4-48-మ.
"అనయంబుం దన మానసంబున నవిద్యన్ ముఖ్యతత్త్వంబు గాఁ
గని గౌరీశుఁ దిరస్కరించిన యసత్కర్మాత్ము నీ దక్షుని
న్ననువర్తించినవాఁరు సంసరణకర్మారంభుఁలై నిచ్చలున్
జననం బందుచుఁ జచ్చుచున్ మరల నోజం బుట్టుచున్ వర్తిలున్.
టీక:- అనయంబున్ = అవశ్యము; తన = తన యొక్క; మానసంబునన్ = మనసులో; అవిద్యన్ = అవిద్యను; ముఖ్యతత్వంబు = ముఖ్యమైన జ్ఞానము; కాన్ = అగునట్లు; కని = దర్శించి; గౌరీశున్ = శివుని {గౌరీశుడు - గౌరీదేవి భర్త, శంకరుడు}; తిరస్కరించిన = తెగడినట్టి; అసత్కర్మాత్మున్ = అబద్దపు కర్మలు కలవానిని; ఈ = ఈ; దక్షునిన్ = దక్షుని; అనువర్తించువారు = అనుసరించి వర్తించువారు; సంసరణ = సాంసారిక; కర్మారంభులు = కర్మాసక్తులు; ఐ = అయ్యి; నిచ్చలున్ = ఎల్లప్పుడున్; జననంబున్ = పుడుతూ; చచ్చున్ = మరణిస్తూ; మరలన్ = మళ్లీ; ఓజన్ = క్రమముగా; పుట్టుచున్ = పుడుతూ; వర్తిల్లున్ = ప్రవర్తించును.
భావము:- “ఎల్లప్పుడు అజ్ఞానాన్నే జ్ఞానంగా భ్రమించి దేవదేవుడైన మహాదేవుని నిందించిన ఈ మహాపాపిని అనుసరించేవారు సర్వదా సంసారంలో చిక్కుకుని పుడ్తూ చస్తూ మళ్ళీ పుడ్తూ ఉందురు గాక!
తెభా-4-49-వ.
అదియునుం గాక యీ హరద్వేషులైన ద్విజు లర్థవాద బహుళంబు లైన వేదవాక్యంబుల వలన మధుగంధ సమంబైన చిత్తక్షోభంబుచేత విమోహిత మనస్కులై కర్మాసక్తు లగుదురు; మఱియును భక్ష్యాభక్ష్య విచారశూన్యులై దేహాది పోషణంబుకొఱకు ధరియింపఁ బడిన విద్యా తపోవ్రతంబులు గలవారలై ధన దేహేంద్రియంబుల యందుఁ బ్రీతిం బొంది యాచకులై విహరింతురు;” అని నందికేశ్వరుండు బ్రాహ్మణజనంబుల శపియించిన వచనంబులు విని భృగుమహాముని మరల శపి యింపం బూని యిట్లనియె.
టీక:- అదియున్ = అంతే; కాక = కాకుండగ; ఈ = ఈ; హరద్వేషులు = శివుని ద్వేషించువారు; ఐన = అయిన; ద్విజులు = బ్రాహ్మణులు; అర్థవాద = స్తుతి మాత్రము, పురుషార్థ మాత్రము; బహుళంబులు = పెచ్చుమీరినట్టివి; ఐన = అయిన; వేదవాక్యంబుల్ = వేదసూత్రాలు; వలనన్ = వలన; మధుగంధ = కల్లు కంపుకి; సమంబు = సమానము; ఐన = అయిన; చిత్తక్షోభంబు = మానసికక్షోభ; చేతన్ = చేత; విమోహిత = మిక్కిలిగ మోహముచెందిన; మనస్కులు = మనసు కలవారు; అ = అయ్యి; కర్మా = కర్మల యందు; సక్తులు = చిక్కుకొన్నవారు; అగుదురు = అవుతారు; మఱియును = ఇంకను; భక్ష్యాభక్ష్య = తిని దగినవి తగనివాటి గురించి; విచారశూన్యులు = భేదములు తెలియనివారు; ఐ = అయ్యి; దేహ = శరీరము; ఆదిన్ = మొదలైనవాటి; పోషణంబున్ = పోషించుకొనుటకు; ధరియింపబడిన = గ్రహించిన; విద్యా = విద్యలు; తపస్ = తపస్సులు; వ్రతంబులు = వ్రతములను; కలవారలు = చెందువారు; ఐ = అయ్యి; ధన = సంపదలు; దేహ = శారీరకము; ఇంద్రియంబుల = ఇంద్రియముల; అందున్ = అందు; ప్రీతిని = మమకారమును; పొంది = పెంపొందించుకొని; యాచకులు = అడుగుకొనువారు; ఐ = అయ్యి; విహరింతురు = ప్రవర్తింతురు; అని = అని; నందికేశ్వరుండు = నందీశ్వరుడు; బ్రాహ్మణజనంబులన్ = బ్రాహ్మణులను; శపియించినన్ = శపించినట్టి; వచనంబులు = పలుకులు; విని = విని; భృగు = భృగువు అనెడి; మహాముని = గొప్పముని; మరలన్ = మారు; శపియింపన్ = శపించుటకు; పూని = పూనుకొని; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:- అంతేకాక శివుని ద్వేషించే ఇందలి బ్రాహ్మణులు అర్థవాదాలతో నిండిన వేదవాక్యాలవల్ల కల్లుకైపు వంటి మనోమాలిన్యంతో కలత చెంది మోహపడి అసత్కర్మలపై ఆసక్తి పెంచుకుంటారు. తినదగినవి, తినదగనివి అనే ఆలోచన నశించి అన్నింటినీ ఆరగిస్తారు. విద్యను, తపస్సును, వ్రతాలను పొట్టకోసమే అవలంబిస్తారు. ధనంమీద, దేహంమీద, ఇంద్రియాలమీద ఆదరాభిమానాలు కలవారై యాచకులై సంచరిస్తారు” అని నందికేశ్వరుడు అచ్చటి బ్రాహ్మణులను శపించాడు. నంది శాపవాక్కులు విని భృగుమహర్షి తిరిగి ఇలా శపించాడు.
తెభా-4-50-తే.
"వసుధ నెవ్వారు ధూర్జటివ్రతులు వారు
వారి కనుకూలు రగుదు రెవ్వారు వారు
నట్టి సచ్ఛాస్త్ర పరిపంథు లైన వారు
నవనిఁ బాషండు లయ్యెద"రని శపించె.
టీక:- వసుధన్ = భూమిపైన; ఎవ్వారు = ఎవరైతే; దూర్జటి = శివుని; వ్రతులు = దీక్షాపరాయణులో; వారు = వారు; వారి = వారి; కిన్ = కి; అనుకూలురు = అనుకూలముగ వర్తించువారు; అగుదురు = అయినవారు; ఎవ్వరు = ఎవరో; వారున్ = వారును; అట్టి = అటువంటి; సత్ = మంచి; శాస్త్ర = శాస్త్రములకు; పరిపంథులున్ = శత్రువులు; ఐన = అయినట్టి; వారు = వారు; అవనిని = భూమ్మీద; పాషండులు = పాషండులు; అయ్యెదరు = అగుదురు; అని = అని; శపించె = శపించెను.
భావము:- ఈ లోకంలో ఎవరు శివదీక్షాపరాయణులో, ఎవరు వారిని అనుసరిస్తారో వారంతా శాస్త్రాలకు విరోధులై పాషండులు అగుదురు గాక!
తెభా-4-51-సీ.
"సకల వర్ణాశ్రమాచార హేతువు, లోక-
మునకు మంగళమార్గమును, సనాత
నముఁ, బూర్వఋషిసమ్మతము, జనార్దనమూల-
మును, నిత్యమును, శుద్ధమును, శివంబు,
నార్యపథానుగం బగు వేదమును విప్ర-
గణము నిందించిన కారణమున
నే శివదీక్ష యందేని మధ్యమ పూజ్యుఁ-
డై భూతపతి దైవ మగుచు నుండు
తెభా-4-51.1-తే.
నందు మీరలు భస్మజటాస్థిధార
ణములఁ దగి మూఢబుద్ధులు నష్టశౌచు
లై నశింతురు పాషండు లగుచు"ననుచు
శాప మొనరించె నా ద్విజసత్తముండు.
టీక:- సకల = సమస్తమైన; వర్ణ = వర్ణముల {చాతుర్వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర}; ఆశ్రమ = ఆశ్రమముల {చతురాశ్రమములు - 1బ్రహ్మచర్య 2గృహస్త 3వానప్రస్త 4సన్యాస}; ఆచార = ఆచారముల {ఆచారములు - 1విధి 2నిషేధములు అని ద్వి విధములు}; హేతువు = కారణమైనది; లోకమున్ = జగమున; కున్ = కు; మంగళ = శుభకరమైన; మార్గమునున్ = విధానము; సనాతనము = శాశ్వతము పురాతనము; పూర్వ = పూర్వకాలపు; ఋషి = ఋషుల; సమ్మతము = అంగీకారము కలది; జనార్దన = విష్ణువే; మూలమును = మూలాధారముగ కలది; నిత్యమును = శాశ్వతమును; శుద్ధమును = పరిశుద్ధమైనదియును; శివంబున్ = శుభకరమైనదియును; ఆర్య = పూజ్యుల; పథా = మార్గమునకు; అనుగంబున్ = అనుగుణమైనదియును; అగు = అయిన; వేదమునున్ = వేదమును; విప్ర = బ్రాహ్మణుల; గణమున్ = సమూహమంతటిని; నిందించిన = శపించిన; కారణమున = కారణమువలన; ఏ = ఏ; శివదీక్ష = శివదీక్ష; అందేని = లోనైనా; మధ్యమపూజ్యుడు = మధ్యమ పూజ్యుడు {మధ్యమ పూజ్యుడు - మధ్యముడైన పూజ్యుడు, మధ్యమ పురుషలో పూడింపబడువాడు, మధ్యమ స్వరంలో (వ్యాకరణ శాస్త్రంలో పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేవి నాలుగు విధాలైన వాక్ రూపాలలో ఒకటి) పూజింపబడువాడు}; ఐ = అయ్యి; భూతపతి = శివుడు {భూతపతి - సమస్త భూతములకు నాథుడు, శివుడు}; దైవము = దేవుడు; అగుచున్ = అవుతూ; ఉండున్ = ఉండును; అందున్ = వానిలో.
మీరలు = మీరు; భస్మ = విభూది; జట = జటలుగట్టినశిరోజములు; అస్థి = ఎముకలు; ధారణములున్ = ధరించుటలుతో; తగి = కలిగి; మూఢ = మూర్ఖపు; బుద్ధులు = బుద్ధులు; నష్టశౌచులు = పోయిన శుచిత్వము కలవారు; ఐ = అయ్యి; నశింతురు = నాశనమైపోతారు; పాషండులు = పాషండులు; అగుచున్ = అవుతూ; అనుచున్ = అంటూ; శాపము = శాపమును; ఒనరించెన్ = ఇచ్చెను; ఆ = ఆ; ద్విజ = బ్రాహ్మణులలో {ద్విజుడు - రెండు జన్మలుగలవాడు, బ్రాహ్మణుడు}; సత్తముండు = శ్రేష్ఠుడు.
భావము:- సమస్తమైన వర్ణాశ్రమాచారాలను విధించే వేదం లోకాలకు మేలును కలిగిస్తుంది. అది సనాతనమైనది. దానిని పూర్వ ఋషిపుంగవులంతా అంగీకరించారు. వేదం విష్ణువునుండి ఆవిర్భవించింది. అది శాశ్వతమైనది, పరిశుద్ధమైనది, మంగళప్రదమైనది. దానిని ఆర్యులైనవారు అనుసరిస్తారు. అటువంటి వేదాన్నీ బ్రాహ్మణులనూ నీవు నిందించావు. అందుచేత శివదీక్షను స్వీకరించేవారికి మధ్యమ పూజ్యు డగుగాక! శివవ్రతులు భస్మాన్నీ, జడలనూ, ఎముకలనూ ధరిస్తారు గాక! మూర్ఖులై శుచిత్వం లేనివారై పాషండులై నశింతురు గాక!” అని భృగుమహర్షి శపించాడు.
తెభా-4-52-వ.
ఇట్లన్యోన్యంబును శాపంబులం బొందియు భగవదనుగ్రహంబు గల వారలగుటం జేసి నాశంబు నొందరైరి; అట్టి యెడ విమనస్కుం డగుచు ననుచర సమేతుం డై భవుండు చనియె నంత.
టీక:- ఇట్లు = ఈ విధముగ; అన్యోన్యంబును = ఒకరినొకరు; శాపంబులన్ = శాపములను; పొందియున్ = పొందినప్పటికిని; భగవత్ = భగవంతుని యొక్క; అనుగ్రహంబున్ = అనుగ్రహము; కలవారు = కలిగినవారు; అగుటన్ = అవుట; చేతన్ = చేత; నాశంబున్ = నాశనమును; ఒందరు = పొందనివారు; ఐరి = అయిరి; అట్టి = అటువంటి; ఎడన్ = సమయములో; విమనస్కుండు = విరిగిన మనసు కలవాడు; అగుచున్ = అవుతూ; అనుచర = అనుచరులతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; భవుండు = శివుడు {భవుడు - భవము (శుభము యైనవాడు), శివుడు}; చనియెన్ = వెళ్ళిపోయెను; అంత = అప్పుడు.
భావము:- ఈ విధంగా నందీశ్వరుడు, భృగుమహర్షి ఒకరినొకరు శపించుకున్నారు. దైవానుగ్రహంవల్ల వారు నశింపలేదు. అప్పుడు వ్యాకుల హృదయుడై శివుడు అనుచరులతో అక్కడినుండి వెళ్ళిపోయాడు.
తెభా-4-53-సీ.
అనఘాత్మ! యే యజ్ఞమందు సర్వశ్రేష్ఠుఁ-
డగు హరి సంపూజ్యుఁడై వెలుంగు
నట్టి యజ్ఞంబు సమ్యగ్విధానమున స-
హస్ర వత్సరములు నజుఁ డొనర్చెఁ
గరమొప్ప నమర గంగాయమునా సంగ-
మావనిఁ గలుగు ప్రయాగ యందు
నవభృథస్నానంబు లతిభక్తిఁ గావించి-
గతకల్మషాత్ములై ఘనత కెక్కి
తెభా-4-53.1-తే.
తగ నిజాశ్రమభూములఁ దలఁచి వార
లందఱును వేడ్కతోఁ జని రనుచు"విదురు
నకును మైత్రేయుఁ డను మునినాయకుండు
నెఱుఁగ వినిపించి వెండియు నిట్టు లనియె.
టీక:- అనఘాత్మా = పుణ్యాత్మా; ఏ = ఏ; యజ్ఞము = యజ్ఞము; అందున్ = లోనైతే; సర్వ = అందరికంటెను; శ్రేష్ఠుడు = గొప్పవాడు; అగు = అయిన; హరి = విష్ణువు; సంపూజ్యుడు = చక్కగ పూజింపబడినవాడు; ఐ = అయ్యి; వెలుంగున్ = ప్రకాశించునో; అట్టి = అటువంటి; యజ్ఞంబు = యజ్ఞము; సమ్యక్ = చక్కటి; విధానమునన్ = పద్ధతిలో; సహస్ర = వెయ్యి; వత్సరములున్ = సంవత్సరములు; అజుడున్ = బ్రహ్మదేవుడు {అజుడు - జన్మము లేనివాడు, బ్రహ్మదేవుడు}; ఒనర్చెన్ = చేసెను; కరము = మిక్కిలి; ఒప్పన్ = చక్కటి; అమరన్ = విధముగ; గంగా = గంగ; యమునా = యమునల; సంగమ = సంగమ, కలియు; ఆవనిన్ = స్థలమున; కలుగు = ఉన్న; ప్రయాగ = ప్రయాగ; అందున్ = లో; అవభృథ = పవిత్ర {అవభృథము - యజ్ఞము కడపట న్యూనాతిరిక్తదోష పరిహారార్థము చేయు కర్మము}; స్నానంబులన్ = స్నానములను; అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; కావించి = చేసి; గత = పోయిన; కల్మషాత్ములు = పాపములు కలవారు; ఐ = అయ్యి; ఘనత = ప్రసిద్ధి; కిన్ = ని; ఎక్కి = పొంది.
తగన్ = చక్కగ; నిజ = తమ; ఆశ్రమ = నివాస; భూములన్ = స్థలములను; తలచి = తలచుకొని; వారలు = వారు; అందఱున్ = అందరును; వేడ్క = సంతోషము; తోన్ = తోటి; చనిరి = వెళ్ళిరి; అనుచున్ = అంటూ; విదురున్ = విదురుని; కును = కి; మైత్రేయుండు = మైత్రేయుడు; అను = అనెడి; ముని = మునులకు; నాయకుండు = నాయకుడు; ఎఱుగన్ = తెలియునట్లు; వినిపించి = చెప్పి; వెండియున్ = ఇంకను; ఇట్టుల = ఈవిధముగ; అనియె = పలికెను.
భావము:- పుణ్యాత్మా! సర్వశ్రేష్ఠుడైన నారాయణుడు ఏ యజ్ఞంలో పూజనీయుడో అటువంటి యజ్ఞాన్ని బ్రాహ్మణులు వేయి సంవత్సరాలు యథావిధిగా చేశారు. గంగా యమునలు సంగమించే ప్రయాగక్షేత్రంలో సదస్యులు దీక్షా స్నానాలు చేసి పాపాలు పోగొట్టుకొని తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు” అని మైత్రేయ మహర్షి విదురునితో చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు.
తెభా-4-54-వ.
“అంత శ్వశురుండగు దక్షునకు జామాత యైన భర్గునకు నన్యోన్య విరోధంబు పెరుఁగుచుండ నతిచిరంబగు కాలం బరిగె; నంత దక్షుండు రుద్రవిహీనంబగు యాగంబు లేనిది యైనను శర్వుతోడి పూర్వ విరోధంబునను బరమేష్ఠి కృతంబైన సకల ప్రజాపతి విభుత్వగర్వంబు ననుం జేసి బ్రహ్మనిష్ఠులగు నీశ్వరాదుల ధిక్కరించి యరుద్రకంబుగా వాజపేయ సవనంబు గావించి తదనంతరంబ బృహస్పతిసవన నామకం బైన మఖంబు చేయ నుపక్రమించిన నచ్చటికిం గ్రమంబున.
టీక:- అంత = అంతట; శ్వశురుండు = మామ, భార్యతండ్రి; దక్షున్ = దక్షుని; కున్ = కి; జామాత = అల్లుడు; ఐన = అయినట్టి; భర్గున్ = శివుని; కున్ = కిని; అన్యోన్య = వారిలోవారికి, మధ్యన; విరోధంబున్ = శత్రుత్వము; పెరుగుచున్ = ఎక్కువవుతూ; ఉండన్ = ఉండగా; అతి = మిక్కిలి; చిరంబు = ఎక్కువైనది; అగు = అయినట్టి; కాలంబున్ = కాలము; అరిగెన్ = గడచెను; అంత = అంతట; దక్షుండు = దక్షుడు; రుద్ర = శివుడు {రుద్రుడు - మిక్కిలి కోపిష్టి, శివుడు}; విహీనంబున్ = లేనిది; అగు = అయినట్టి; యాగంబున్ = యజ్ఞము; లేనిది = లేనిది; ఐనను = అయినను; శర్వు = శివుని; తోడి = తోటి; పూర్వ = పూర్వపు; విరోధంబునన్ = శత్రుత్వముచేతను; పరమేష్ఠి = బ్రహ్మదేవుడు {పరమేష్ఠి - అత్యున్నతమైన స్థానమున ఉండువాడు, బ్రహ్మదేవుడు}; కృతంబున = నియమింపబడుటచే; ఐన = అయిన; సకల = సమస్తమైన; ప్రజాపతి = ప్రజాపతులపైన; విభుత్వ = విభుడిగానుండు యధికారపు; గర్వంబున్ = గర్వము; జేసి = వలన; బ్రహ్మనిష్ఠులు = వేదములందు నిష్ఠకలవారు; అగు = అయిన; ఈశ్వర = శివుడు {ఈశ్వరుడు - ఈశత్వము ప్రభుత్వము కలవాడు, శివుడు}; ఆదులన్ = మొదలైనవారిని; ధిక్కరించి = కాదని; అరుద్రకంబున్ = రుద్రుడు లేనిది; కాన్ = అగునట్లు; వాజపేయ = వాజపేయము అనెడి {వాజపేయము - ఆహారస్వీకార ప్రథానమైన యాగము}; సవనంబున్ = యజ్ఞమును; కావించి = చేసి; తదనంతరంబ = తరవాత; బృహస్పతిసవన = బృహస్పతము అనెడి {బృహస్పతిసవనము - వాగుచ్ఛారణ ప్రధానమైన యాగము}; నామకంబు = పేరుకలది; ఐన = అయిన; మఖంబున్ = యజ్ఞమును; చేయన్ = చేయుటకు; ఉపక్రమించిన = ప్రారంభించగా; అచ్చటికిన్ = అక్కడకి; క్రమంబునన్ = క్రమముగా.
భావము:- అప్పుడు మామ అయిన దక్షునికి, అల్లుడైన శివునికి పరస్పర వైరం నానాటికీ పెరుగుచుండగా చాలాకాలం గడిచింది. బ్రహ్మ దక్షుణ్ణి ప్రజాపతులందరికీ అధ్యక్షుణ్ణి చేయగా ఆ అధికారగర్వంచేత, పరమేశ్వరునిపై ఉన్న పగచేత దక్షుడు బ్రహ్మవేత్తలను, పరమేశ్వరుణ్ణి ధిక్కరించి, రుద్రహీనమైన వాయపేయం అనే యజ్ఞాన్ని చేసాడు. తరువాత బృహస్పతి సవనం అనే యజ్ఞాన్ని చేయటానికి పూనుకోగా అక్కడికి క్రమంగా....
తెభా-4-55-చ.
కర మనురక్తి నమ్మఖముఁ గన్గొను వేడుక తొంగలింపఁగాఁ
బరమమునిప్రజాపతి సుపర్వ మహర్షి వరుల్ సభార్యులై
పరువడి వచ్చి యందఱు శుభస్థితి దీవన లిచ్చి దక్షుచేఁ
బొరిఁబొరి నచ్చటన్ విహిత పూజల నొందిరి సమ్మదంబునన్.
టీక:- కరము = మిక్కిలి; అనురక్తిన్ = కూరిమితో; ఆ = ఆ; మఖమున్ = యాగమును; కన్గొను = చూసెడి; వేడుక = కుతూహలము; తొంగలింపగా = తొందరపెట్టగా; పరమ = గొప్ప; ముని = మునులు; ప్రజాపతి = ప్రజాపతులు; సుపర్వ = దేవతలు; మహర్షి = గొప్పఋషులలో; వరుల్ = శ్రేష్ఠులు; సభార్యులు = సదస్యులు {సభార్యులు - సభా (సదస్సునకు) ఆర్యులు (పెద్దలు)}; ఐ = అయ్యి; పరువడిన్ = వరుసగా; వచ్చి = వచ్చి; అందఱున్ = అందరును; శుభస్థితిన్ = శుభమగునట్లు; దీవనలు = ఆశీర్వచనములు; ఇచ్చి = చేసి; దక్షున్ = దక్షుని; చేన్ = చేత; పొరిపొరిన్ = మాటిమాటికిని; విహిత = విధివత్ప్రకారమైన; పూజలన్ = గౌరవములను; ఒందిరి = పొందిరి; సమ్మదంబునన్ = సంతోషముతోకూడి.
భావము:- ఆ యజ్ఞాన్ని చూడాలని వేడుకతో మునులు, ప్రజాపతులు, దేవతలు, మహర్షులు సదస్యులుగా వచ్చి, దక్షుణ్ణి దీవించారు. అతడు చేసిన పూజలను సంతోషంగా అందుకున్నారు.