పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/హరి హర సల్లాపాది

హరిహరసల్లాపాది

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-384-సీ.
"కైలాసగిరి మీఁద ఖండేందు భూషణుం-
డొకనాఁడు గొలువున నున్న వేళ
నంగన యై విష్ణుఁ సురుల వంచించి-
సురలకు నమృతంబు సూఱ లిడుట
విని దేవియును దాను వృషభేంద్ర గమనుఁడై-
డు వేడ్క భూత సంములు గొలువ
ధుసూదనుం డున్న మందిరంబున కేగి-
పురుషోత్తమునిచేతఁ బూజ పడసి

తెభా-8-384.1-తే.
తానుఁ గూర్చుండి పూజించె నుజ వైరిఁ
గుశలమే మీకు మాకునుఁ గుశల మనుచు
ధురభాషల హరిమీఁద మైత్రి నెఱపి
రుఁడు పద్మాక్షుఁజూచి యిట్లనియెఁ బ్రీతి.

టీక:- కైలాసగిరి = కైలాసపర్వతము; మీద = పైన; ఖండేందుభూషణుండు = శంకరుడు; ఒక = ఒక (1); నాడు = దినమున; కొలువునన్ = సభతీరి; ఉన్న = ఉన్నట్టి; వేళన్ = సమయమునందు; అంగన = స్త్రీ; ఐ = అయ్యి; విష్ణుడు = విష్ణుమూర్తి; అసురులన్ = రాక్షసులను; వంచించి = మాయజేసి; సురల్ = దేవతల; కున్ = కు; అమృతంబున్ = అమృతమును; సూఱలిడుట = పంచిపెట్టుట; విని = విని; దేవియును = భార్య; తాను = తను; వృషభేంద్ర = శ్రేష్ఠమైన వృషభముపై; గమనుడు = వెళ్ళువాడు; ఐ = అయ్యి; కడు = మిక్కిలి; వేడ్కన్ = ఉత్సుకతో; భూత = ప్రమథ; సంగములున్ = గణములు; కొలువన్ = కొలుచుచుండగ; మధుసూదనుండు = నారాయణుడు; ఉన్న = ఉన్నట్టి; మందిరమున్ = నివాసమున; కిన్ = కి; ఏగి = వెళ్ళి; పురుషోత్తముని = విష్ణుమూర్తి; చేతన్ = వలన; పూజ = అర్చనలు; పడి = పొంది.
తానున్ = తనుకూడ; కూర్చుండి = కూర్చొని; పూజించెన్ = అర్చించెను; దనుజవైరిన్ = విష్ణుమూర్తిని; కుశలమే = క్షేమమేకదా; మీకు = మీకు; మాకునున్ = మాకుకూడ; కుశలము = క్షేమమే; అనుచున్ = అనుచు; మధుర = తీయని; భాషలన్ = మాటలతో; హరి = విష్ణుమూర్తి; మీద = ఎడల; మైత్రి = స్నేహము; నెఱపి = చూపి; హరుడు = శంకరుడు; పద్మాక్షున్ = హరిని; చూచి = చూసి; ఇట్లు = ఇలా; అనియెన్ = పలికెను; ప్రీతిన్ = స్నేహముతో.
భావము:- శివుడు కైలాసపర్వతంపై ఒకనాడు కొలువుతీరి ఉన్నాడు. ఆ సమయంలో విష్ణువు మోహినీరూపంలో రాక్షసులను మోసగించి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టిన సంగతి విన్నాడు. అతడు పార్వతీదేవితోపాటు నందీశ్వరునిపై కూర్చుని ప్రమథగణ సమేతుడై వైకంఠానికి వెళ్ళాడు. విష్ణువు శివుణ్ణి గౌరవించాడు. శివుడుకూడా విష్ణువును గౌరవించాడు. విష్ణువు క్షేమం అడిగి తమ క్షేమాన్ని తెలిపి తియ్యని మాటలతో తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. తరువాత శివుడు చనువుగా విష్ణువుతో ఇలా అన్నాడు.

తెభా-8-385-సీ.
"దేవ! జగన్మయ! దేవేశ! జగదీశ! ;
కాలజగద్వ్యాపస్వరూప!
ఖిల భావములకు నాత్మయు హేతువు-
నైన యీశ్వరుఁడ వాద్యంతములకు
ధ్యంబు బహియును ఱి లోపలయు లేక-
పూర్ణమై యమృతమై భూరిసత్య
మానంద చిన్మాత్ర వికార మాద్య మ-
న్య మశోకంబు గుణ మఖిల

తెభా-8-385.1-తే.
సంభవస్థితిలయముల దంభకంబు
నైన బ్రహ్మంబు నీవ; నీ యంఘ్రియుగము
నుభయ సంగ విసృష్టులై యున్నమునులు
గోరి కైవల్యకాములై కొల్తు రెపుడు.

టీక:- దేవ = విష్ణుమూర్తి; జగన్మయ = విష్ణుమూర్తి; దేవేశ = విష్ణుమూర్తి; జగదీశ = విష్ణుమూర్తి; కాలజగద్వ్యాపకస్వరూప = విష్ణుమూర్తి; అఖిల = సమస్తమైన; భావముల్ = భావింగల వస్తువుల; కున్ = కు; ఆత్మయున్ = అంతర్వాపివి; హేతువున్ = కారణభూతుడవు; ఐన = అయిన; ఈశ్వరుడవు = భగవంతుడవు; ఆది = మొదలు; అంతముల్ = తుదిల; కున్ = కు; మధ్యంబున్ = మధ్యభాగమున; బహియును = వెలుపల; మఱి = ఇంకను; లోపలయున్ = లోపల యనునవి; లేక = లేకుండగ; పూర్ణము = అంతయుతానైనవాడవు; ఐ = అయ్యి; అమృతము = నాశములేనివాడవు; ఐ = అయ్యి; భూరి = అత్యధికమైన; సత్యము = సత్యస్వరూపము; ఆనంద = ఆనందస్వరూపము; చిన్మాత్రము = చిద్రూపుడవు; అవికారము = మార్పులేనివాడవు; ఆద్యమున్ = మూలవస్తువవు; అనన్యమున్ = సాటిలేనివాడవు; అగుణము = గుణాతీతుడవు; అఖిల = సమస్తమైన;
సంభవ = సృష్టి; స్థితి = స్థితి; లయముల = లయము లనెడి; దంభకంబున్ = మాయకు కారణమవు; ఐన = అయిన; బ్రహ్మంబున్ = పరబ్రహ్మమవు; నీవ = నీవే; నీ = నీ యొక్క; అంఘ్రి = పాదముల; యుగమున్ = జంటను; ఉభయ = పర అపరములు రెంటి; సంగ = తగులములను; విసృష్టులు = విడిచినవారు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; మునులు = మునులు; కోరి = యత్నించి; కైవల్య = మోక్షమును; కాములు = కోరువారు; ఐ = అయ్యి; కొల్తురు = సేవించెదరు; ఎపుడుని = ఎల్లప్పుడు.
భావము:- దేవదేవా! వాసుదేవా! జగదీశ్వరా! ఎల్లప్పుడూ సర్వ లోకాలలో నిండి ఉండేవాడవు. సమస్త వస్తువులకూ కారణ భూతుడవు అయిన ప్రభువు నీవే. ఆదిమధ్యాంతాలు లేకుండా, లోపలా వెలుపలా.అంతటా నిండినవాడవు నీవు. పరిపూర్ణమైన సత్యం నీవు. ఆనందంతో కూడిన జ్ఞానం నీవు. మార్పులేని మూలవస్తువు నీవు. సాటిలేనివాడవు నీవు. దుఃఖదూరుడవు నీవు. గుణాతీతుడవు నీవు. అన్నింటి పుట్టుటకూ మనుగడకూ నాశనానికి కారణం నీవు. మాయతో కూడిన పరమాత్మవు నీవు. మోక్షాన్ని కోరేవారు స్వార్దాన్ని అహంకారాన్ని విడిచి ఎల్లప్పుడూ నీ పాదాలను సేవిస్తారు.

తెభా-8-386-సీ.
భావించి కొందఱు బ్రహ్మంబు నీ వని-
లపోసి కొందఱు ర్మ మనియుఁ
ర్చించి కొందఱు దసదీశ్వరుఁడని-
రవిఁ గొందఱు శక్తి హితుఁ డనియుఁ
జింతించి కొందఱు చిరతరుం డవ్యయుఁ-
డాత్మతంత్రుఁడు పరుం ధికుఁ డనియు
దొడరి యూహింతురు తుది నద్వయద్వయ-
దసద్విశిష్ట సంశ్రయుఁడ వీవు;

తెభా-8-386.1-తే.
లఁప నొక్కింత వస్తుభేదంబుఁ గలదె
కంకణాదులు బసిఁడి యొక్కటియ కాదె?
డలు పెక్కైన వార్థి యొక్కటియ కాదె?
భేద మంచును నిను వికల్పింప వలదు.

టీక:- భావించి = అనుకొని; కొందఱు = కొంతమంది; బ్రహ్మంబున్ = పరబ్రహ్మమవు; నీవు = నీవే; అని = అని; తలపోసి = అనుకొని; కొందఱు = కొంతమంది; ధర్మము = ధర్మస్వరూపమవు; అనియున్ = అని; చర్చించి = అనుకొని; కొందఱు = కొంతమంది; సత్ = సద్రూప; అసత్ = అసద్రూప; ఈశ్వరుండు = ప్రభువవు; అని = అని; సరవిన్ = క్రమముగా; కొందఱు = కొంతమంది; శక్తి = శక్తితో; సహితుడు = కూడినవాడవు; అనియున్ = అని; చింతించి = అనుకొని; కొందఱు = కొంతమంది; చిరతరుండు = శాశ్వతుడు; అవ్యయుడు = నాశరహితుడు; ఆత్మతంత్రుడు = సర్వస్వతంత్రుడు; పరుండు = సర్వాతీతమైనవాడు; అధికుడు = గొప్పవాడవు; అనియున్ = అని; తొడరి = అతిశయించి; ఊహింతురు = అనుకొనెదరు; తుదిన్ = చివరకు; అద్వయ = అద్వితీయమైన; ద్వయ = సర్వాతీతమైన; సత్ = సత్తు; అసత్ = అసత్తుల; విశిష్ట్ = శ్రేష్ఠమైన; సంశ్రయుడవు = నిలయమైనవాడవు; ఈవు = నీవు.
తలపన్ = తరచిచూసిన; ఒక్కింత = కొంచమైన; వస్తు = వాస్తవమైన; భేదంబున్ = భేదము; కలదె = ఉన్నదా లేదు; కంకణ = కంకణములు; ఆదులు = మొదలగునవి; పసిడిన్ = బంగారము; ఒక్కటియన్ = ఒక్కటే; కాదె = కదా; కడలు = అలలు; పెక్కు = అనేకము; ఐనన్ = అయియున్నను; వార్థి = సముద్రము; ఒక్కటియ = ఒక్కటే; కాదె = కదా; భేదము = భేదము; అంచును = అంటూ; నినున్ = నిన్ను; వికల్పింపన్ = భ్రాంతి; వలదు = వద్దు.
భావము:- నీవు పరబ్రహ్మ వని కొందరు భావిస్తారు. నీవు ధర్మ మని కొందరు తలుస్తారు. నీవు ప్రకృతి పురుషుల కంటె పరుడ వని కొంద రంటారు. నీవు శక్తిరూపుడ వని కొందరు ధ్యానిస్తారు. విష్ణువుగా, శాశ్వతుడుగా, స్వతంత్రుడుగా, పరమపురుషుడుగా, ఉత్తముడుగా కొందరు నిన్ను ఊహిస్తారు. అన్నింటినీ మించి సాటిలేనివాడవు నీవు. సదసత్తులకు పవిత్రమైన నిలయం నీవు. ఆలోచించి చూస్తే కంకణం మొదలైన బంగారు నగలూ బంగారమూ వాస్తవంగా ఒకటే కదా. అనంతమైన అలలూ సముద్రమూ ఒకటేకదా. అలాగే, పైకి భేధం కనిపిస్తున్నా నీకు ఈ సృష్టికి వాస్తవంగా భేదం ఉంది అని భావించే పని లేనేలేదు.

తెభా-8-387-సీ.
ద్విలాసము మరీచ్యాదు లెఱుంగరు-
నిత్యుఁడ నై యున్న నేను నెఱుఁగ
న్మాయ నంధులై మరాసురాదులు-
నరెద రఁట! యున్నవారలెంత?
యే రూపమునఁ బొంద కేపారుదువు నీవు-
రూపివై సకలంబు రూపుచేయ
క్షింపఁ జెఱుపఁ గాణమైన సచరాచ-
రాఖ్యమై విలసిల్లు దంబరమున

తెభా-8-387.1-తే.
నిలుఁ డే రీతి విహరించు ట్ల నీవు
లసి వర్తింతు సర్వాత్మత్వ మొప్ప;
గములకు నెల్ల బంధమోక్షములు నీవ
నీవ సర్వంబుఁ దలపోయ నీరజాక్ష!

టీక:- యత్ = నీ యొక్క; విలాసమున్ = లీలలను; మరీచి = మరీచిమహర్షి; ఆదులు = మున్నగువారు; ఎఱుంగరు = తెలియలేరు; నిత్యుడను = శాశ్వతుడను; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; నేనున్ = నేనుకూడ; ఎఱుగన్ = తెలియలేను; యత్ = నీయొక్క; మాయన్ = మాయవలన; అంధులు = గుడ్డివారు; ఐ = అయ్యి; అమర = దేవతలు; అసుర = రాక్షసులు; ఆదులు = మొదలగువారు; వనరెదరు = కష్టపడెదరు; అటన్ = అట; ఉన్న = ఇతరమైన; వారలు = వారనగా; ఎంత = ఎంత; ఏ = ఎట్టి; రూపమున్ = ఆకృతిని; పొందకన్ = స్వీకరించకనే; ఏపారుదువు = అతిశయించెదవు; నీవున్ = నీవు; రూపివి = ఆకృతిదాల్చినవాడవు; ఐ = అయ్యి; సకలంబున్ = సర్వమును; రూపుచేయన్ = సృష్టించ; రక్షింపన్ = కాపాడుటకు; చెఱపన్ = నశింపజేయుటకు; కారణము = కారణభూతము; ఐన = అయిన; సచరాచరాఖ్యము = జగత్తనబడువాడవు; ఐ = అయ్యి; విలసిల్లుదు = ప్రకాశించెదవు; అంబరమునన్ = ఆకాశమునందు; అనిలుడు = వాయువు; ఏ = ఎట్టి; రీతిన్ = విధముగ.
విహరించున్ = విహరించునో; అట్ల = ఆ విధముగ; నీవు = నీవు; కలసి = కూడి; వర్తింతు = వర్తించెదవు; సర్వ = సర్వమునందు; ఆత్మకత్వము = తానైయుండుట; ఒప్పన్ = ఒప్పునట్లుగ; జగముల్ = లోకముల; కున్ = కు; ఎల్లన్ = అన్నిటియందు; బంధ = ఘటితము; మోక్షంబులన్ = వికలములు; నీవ = నీవే; నీవ = నీవే; సర్వంబున్ = సమస్తమును; తలపోయ = తరచిచూసిన; నీరజాక్ష = హరి.
భావము:- ఓ కమలలోచనా! నీలీలను మరీచి మొదలైన మహర్షులు సైతం తెలియలేరు. నీతోపాటూ ఉండే నేను కూడా తెలుసుకోలేను. నీమాయ తెలియక దేవతలు, రాక్షసులు కష్టపడతారు. ఇంక తక్కినవారెంత. నీవు ఏరూపాన్ని పొందకుండా పెంపొందుతావు. రూపాన్ని పొంది, అన్నింటినీ పుట్టించి కాపాడి అంతం చేయడానికి కారణమవుతావు. సకలచరాచర రూపుడవై వెలుగొందుతావు. ఆకాశంలో గాలి విహరించేవిధంగా సర్వాత్మకుడవై అన్నింటిలోనూ నీవు చేరే వుంటావు. లోకాలు పుట్టడమూ విడిపోవడమూ రెండూ నీవె. ఆలోచిస్తే అన్నీ నీవే.

తెభా-8-388-మ.
తన్ నీ మగపోఁడుముల్ పలుమఱుం న్నారఁ గన్నార; మే
నిను విన్నారము చూడమెన్నఁడును మున్ నీయాఁడుఁజందంబు మో
హినివై దైత్యులఁ గన్నుఁ బ్రామి యమృతం బింద్రాది దేవాళి కి
చ్చి నీ రూపముఁ జూపుమా! కుతుకముం జిత్తంబునం బుట్టెడిన్.

టీక:- ఘనతన్ = గొప్పతనమును; నీ = నీ యొక్క; మగ = పురుష రూపు; పోడుముల్ = చక్కదనములు; పలు = అనేక; మఱున్ = సార్లు; కన్నారము = చూసితిమి; కన్నారన్ = కంటినిండుగా; మే = మేము; నినున్ = నీగురించి; విన్నారము = వినియున్నాము; చూడము = చూడలేదు; ఎన్నడునున్ = ఎప్పుడుకూడ; మున్ = ఇంతకుపూర్వము; నీ = నీ యొక్క; ఆడు = ఆడురూపపు; చందంబున్ = చక్కదనములను; మోహినివి = జగన్మోహినీరూపివి; ఐ = అయ్యి; దైత్యుల = రాక్షసుల; కన్నున్ = కళ్ళు; ప్రామి = కప్పి; అమృతంబున్ = అమృతమును; ఇంద్ర = ఇంద్రుడు; ఆది = మున్నగు; దేవ = దేవతా; అళి = సమూహమున; కున్ = కు; ఇచ్చిన = సమకూర్చినట్టి; నీ = నీ యొక్క; రూపమున్ = స్వరూపమును; చూపుమా = చూపెట్టుము; కుతుకమున్ = కుతూహలము; చిత్తంబునన్ = మనసునందు; పుట్టెడిన్ = కలుగుచున్నది.
భావము:- మాధవా! మహిమతో కూడిన నీమగసోయగాన్ని పెక్కుసార్లు కన్నాము. విన్నాము. నీఆడరూపాన్ని ఏనాడూ చూడలేదు. మోహినిగా నీవు రాక్షసులను మోసగించి ఇంద్రాది దేవతలకు అమృతాన్ని పంచిఇచ్చిన ఆరూపాన్ని చూపించు. దాన్ని చూడాలని, నామనసు కుతూహలపడుతున్నది.

తెభా-8-389-క.
వాఁడ వై జగంబులఁ
గిలిఁచి చిక్కులను బెట్టు దంటకు నీకున్
గువ తనంబున జగములఁ
గులము బొందింప నెంతడవు ముకుందా! "

టీక:- మగవాడవు = పురుష రూపుడవు; ఐ = అయ్యి; జగంబులన్ = లోకమును; తగిలిచి = తగులములుకలిగించి; చిక్కులను = ఇబ్బందులను; పెట్టుదు = పెట్టెదవు; అంట = అంతటివాడి; కున్ = కి; నీ = నీ; కున్ = కు; మగువ = స్త్రీ; తనంబునన్ = ఆకృతితో; జగములన్ = లోకములను; తగులమున్ = మోహమునందు; పొందింపన్ = చెందించుటకు; ఎంత = ఏమి; తడవు = తడబాటు; ముకుందా = హరి.
భావము:- ముకుందా! మగవాడిగా మోహంలో పడవేసి నీవు లోకాలను ఎన్నో చిక్కులకు గురిచేస్తావుట. అటువంటి నీవు ఆడరూపంలో లోకాలను ఆకర్షించడంలో ఆశ్చర్యం ఏముంది.”

తెభా-8-390-వ.
అని పలుకుచున్న శూలపాణిచే నపేక్షితుండై విష్ణుండు భావ గంభీరంబగు నవ్వు నివ్వటిల్ల న వ్వామదేవున కిట్లనియె.
టీక:- అని = అని; పలుకుచున్న = అడుగుతున్న; శూలపాణి = శంకరుని; చేన్ = వలన; అపేక్షితుండు = కోరబడినవాడు; ఐ = అయ్యి; విష్ణుండు = విష్ణుమూర్తి; భావగంభీరంబు = భావగర్భం, రహస్యార్థం; అగు = కాన్; నవ్వు = నవ్వు; నివ్వటిల్లన్ = అతిశయించగా; ఆ = ఆ; వామదేవున్ = శంకరున; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- పైవిధంగా పలుకుతున్న పరమేశ్వరుని మాటలకు గంభీరంగా నవ్వుతూ విష్ణువు ఇలా అన్నాడు.

తెభా-8-391-శా.
"శ్రీకంఠా! నిను నీవ యేమఱకు మీ చిత్తంబు రంజించెదన్;
నాద్వేషుల డాఁగురించుటకునై నాఁ డేను గైకొన్న కాం
తాకారంబు జగద్విమోహనము నీకై చూచెదేఁ జూపెదం;
గైకో నర్హము లండ్రు కాముకులు సంల్పప్రభావంబులన్. "

టీక:- శ్రీకంఠా = శంకరా; నినున్ = నిన్ను; నీవ = నీవే; ఏమఱకుమీ = పరాకుచెందనీకుము; చిత్తంబున్ = మనసును; రంజించెదన్ = సంతోషింపజేసెదను; నాకద్వేషులన్ = రాక్షసులను; డాగురించుట = మోహింపజేయుట; కున్ = కోసము; ఐ = అయ్యి; నాడున్ = ఆ దినమున; ఏను = నేను; కైకొన్న = స్వీకరించినట్టి; కాంత = స్త్రీ; ఆకారంబున్ = ఆకృతిని; జగత్ = లోకమునందు; విమోహనంబున్ = మిక్కిలి మోహింపజేయునది; నీ = నీ; కై = కోసము; చూచెదు = చూస్తానుఅనిన; ఏని = ఎడల; చూపెదన్ = చూపించెదను; కైకోన్ = అంగీకరించుటకు; అర్హములు = తగినవి; అండ్రు = అనెదరు; కాముకుల్ = కోరికలుగలవారు; సంకల్ప = సంకల్పము యొక్క; ప్రభావంబులన్ = ప్రభావములను.
భావము:- “మహేశ్వరా! క్షీరసాగరం మథన సమయంలో పుట్టిన గరళాన్ని కంఠాన ధరించి లోక క్షేమంకరమైన కంఠం గలవాడవై శ్రీకంఠునిగా ప్రసిద్ధుడైన వాడవు. నీమనస్సుకు సంతోషం కలిగిస్తాను తొందర పడవద్దు ఆనాడు రాక్షసులను మోసగించడం కోసం నేను ధరించిన మోహినీరూపం లోకాన్ని మోహింప జేసేది. దానిని నీవు చూడాలనుకుంటే చూపుతాను. మనసులో సంకల్పంగా పుట్టిన కోరికలు తీర్చుకోదగ్గవే కదా.”

తెభా-8-392-వ.
అని పలికి కమలలోచనుం డంతర్హితుండయ్యె; అ య్యుమాసహితుండైన భవుండు విష్ణుఁ డెటు పోయెనో యెందుఁ జొచ్చెనో యని దశదిశలం గలయ నవలోకించుచుండం దన పురోభాగంబున.
టీక:- అని = అని; పలికి = చెప్పి; కమలలోచనుండు = విష్ణుమూర్తి; అంతర్హింతుండు = మాయమైనవాడు; అయ్యెన్ = అయ్యను; ఆ = ఆ; ఉమా = పార్వతీదేవి; సహితుండున్ = కూడియున్నవాడు; ఐన = అయిన; భవుండు = శంకరుడు; విష్ణుడు = విష్ణుమూర్తి; ఎటు = ఎక్కడకు; పోయెనే = వెళ్ళెనో; ఎందున్ = దేనిలో; చొచ్చెనో = ప్రవేశించెనో; అని = అని; దశదిశలన్ = పదివైపులను; కలయ = కలయ; అవలోకించుచుండన్ = చూచుచుండగా; తన = తనకు; పురోభాగంబునన్ = ఎదుట.
భావము:- ఇలా చెప్పి, అప్పుడు అక్కడ కమలాలవంటి కన్నులు గల ఆ విష్ణుమూర్తి మాయం అయిపోయాడు. కలిసి కూర్చుని ఉన్న పార్వతీ దేవి శంకరుడు విష్ణుమూర్తి ఎక్కడకు వెళ్ళాడా అని అన్ని వైపులకీ చూస్తున్నారు. ఇంతలో శంకరునికి ఎదురుగా. . .