పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/వామన విప్రుల సంభాషణ
వామనునివిప్రులసంభాషణ
←వామనుడవతరించుట | తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/) రచయిత: పోతన |
వామనునిబిక్షాగమనము → |
తెభా-8-520-వ.
ఇట్లు కృతకృత్యుండైన మాయామాణవకుండు దేశాంతర సమాగతు లగు బ్రాహ్మణులం గొందఱ నవలోకించి యిట్లనియె .
టీక:- ఇట్లు = ఈ విధముగ; కృతకృత్యుండు = కార్యక్రమము పూర్తిచేసినవాడు; ఐన = అయిన; మాయా = కపట; మాణవకుడు = బాలకుడు {మాణవకుడు - వ్యు. మను + అణ్ (అల్పార్థే) + క. ణత్వమ్, నిపా, త.ప్ర., పిల్లవాడు, ఆంధ్ర శబ్ధ రత్నాకరము}; దేశాంతర = ఇతర ప్రాంతముల నుండి; సమాగతులు = వచ్చినవారు; అగు = అయిన; బ్రాహ్మణులన్ = విప్రులను; కొందఱన్ = కొంతమందిని; అవలోకించి = చూసి; ఇట్లు = ఇలా; అనియె = అడిగెను.
భావము:- ఈ విధంగా ఉపనయనం పూర్తై కృతకృత్యుడు అయిన మాయాబ్రహ్మచారి ఇతర దేశాలనుండి వచ్చిన కొందరు బ్రాహ్మణులను చూసి ఇలా అడిగాడు.
తెభా-8-521-క.
”వత్తురె విప్రులు? వేఁడఁగ
నిత్తురె దాతలును వేడ్క నిష్టార్థములం?
దెత్తురె మీరును సంపద?
లిత్తెఱఁగున దాన వీరుఁ డెవ్వఁడొ చెపుడా” .
టీక:- వత్తురె = వస్తుంటార; విప్రులు = బ్రాహ్మణులు; వేడగన్ = యాచించుటకు; ఇత్తురె = ఇస్తుంటారా; దాతలును = దానములిచ్చువారు; వేడ్కన్ = సంతోషముతో; ఇష్ట = కోరిన; అర్థములన్ = కోరికలను; తెత్తురె = తెచ్చుకొన్నారా; మీరును = మీరుకూడ; సంపదలున్ = సంపదలను; ఈ = ఈ; తెఱంగునన్ = విధమైన; దాన = దానముచేసే; వీరుడు = శూరుడు; ఎవ్వడొ = ఎవరో; చెపుడా = చెప్పండి.
భావము:- “దానాలు అందుకోవడానికి బ్రాహ్మణులు దాతల చెంతకు వెళ్తున్నారా? వారు కోరిన ధనాలను దాతలు ఇస్తున్నారా? మీరుకూడా అలా ధనాన్ని తెచ్చుకుంటారా? ఈవిధంగా అర్థులకు అడిగినది ఇచ్చే మహా దాత ఎవరో చెప్పండి.”
తెభా-8-522-వ.
అనిన నఖిల దేశీయు లగు భూసురు లిట్లనిరి .
టీక:- అనినన్ = అనగా; అఖిల = అన్ని; దేశీయులు = దేశములవారు; అగు = అయిన; భూసురులు = విప్రులు {భూసురులు - భూమిపైని దేవతలు, బ్రాహ్మణులు}; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- ఇలా ధనమిచ్చే మహాదాత ఎవరో చెప్పండి అని అడిగిన, వామనుడితో వివిధ దేశాలకు చెందిన బ్రాహ్మణులు ఇలా అన్నారు.
తెభా-8-523-మ.
"కలరున్ దాతలు; నిత్తురున్ ధనములుం; గామ్యార్థముల్ గొంచు వి
ప్రులు నేతెంతురు; గాని యీవిని బలిం బోలన్ వదాన్యుండు లేఁ
డలఘుండై యొనరించె నధ్వరశతం బా భార్గవానుజ్ఞచే;
బలివేఁడం బడయంగ వచ్చు బహుసంపల్లాభముల్ వామనా! "
టీక:- కలరున్ = ఉన్నారు; దాతలున్ = దాతలు; ఇత్తురున్ = ఇచ్చెదరు; ధనములున్ = సంపదలను; కామ్య = కోరిన; అర్థముల్ = సంపదలను; కొంచున్ = తీసుకొనుచు; విప్రులు = బ్రాహ్మణులు; ఏతెంతురు = వస్తుంటారు; కాని = కాని; ఈవిని = దానమిచ్చుగుణమున; బలిన్ = బలిచక్రవర్తితో; పోలన్ = సరిపోలగల; వదాన్యుండు = దాత; లేడు = లేడు; అలఘుండు = గొప్పవాడు; ఐ = అయ్యి; ఒనరించెన్ = చేసెను; అధ్వర = యాగములు; శతంబున్ = నూరింటిని (100); ఆ = ఆ; భార్గవ = శుక్రాచార్యుని {భార్గవుడు - భర్గుని వంశము వాడు, శుక్రుడు}; అనుజ్ఞ = అనుమతి; చేన్ = తో; బలిన్ = బలిని; వేడన్ = యాచించినచో; పడయంగవచ్చున్ = పొందవచ్చును; బహు = అనేకమైన; సంపత్ = సంపదలు; లాభముల్ = లభించుటను; వామనా = వామనుడా.
భావము:- “ఓ! వామనుడా! ధనమిచ్చేదాతలు అనేకులు ఉన్నారు. బ్రాహ్మణులు కోరిన సంపదలను పొందుతున్నారు. కానీ ఆ దాతలలో బలిచక్రవర్తితో సమానమైన మహాదాత లేడు. అతను శుక్రాచార్యుని అనుమతితో గొప్ప యాగాలు నూరు చేసాడు. అతనిని అడిగితే నీవు గొప్ప సంపద సంపాదించుకోవచ్చు.”
తెభా-8-524-వ.
అని తెలియంజెప్పిన బ్రాహ్మణులవచనంబు లాలకించి లోకంబులకుం బ్రీతి పుట్టింపఁ బయనంబై లాభవచనంబులుఁ గైకొని తల్లిఁదండ్రుల వీడ్కొని శుభముహూర్తంబునం గదిలి .
టీక:- అని = అని; తెలియన్ = తెలియునట్లు; చెప్పిన = చెప్పగా; బ్రాహ్మణుల = విప్రుల; వచనంబులన్ = మాటలను; ఆలకించి = విని; లోకంబుల్ = లోకముల; కున్ = కు; ప్రీతి = మేలు; పుట్టింపన్ = కలిగించుటకై; పయనంబు = ప్రయాణము; ఐ = అయ్యి; లాభవచనంబులు = ఆశీర్వాదములు; కైకొని = తీసుకొని; తల్లిదండ్రులన్ = తల్లిదండ్రులనుండి; వీడ్కొని = పోవననుజ్ఞపొంది; శుభ = శుభకరమైన; ముహూర్తంబునన్ = సమయమునందు; కదిలి = బయలుదేరి.
భావము:- ఆ విధంగా తెలియపరచిన బ్రాహ్మణుల మాటలు విని లోకాలకు మేలు కలిగించడంకోసం వామనుడు ప్రయాణం అయ్యాడు. మంచి ముహుర్తములో, పెద్దల దీవనలూ తల్లితండ్రుల అనుమతి పొంది బయలుదేరాడు.