పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/మత్స్యావతార కథా ప్రారంభం
మత్స్యావతారకథాప్రారంభం
←బలియఙ్ఞమువిస్తరించుట | తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/) రచయిత: పోతన |
మీనావతారుని ఆనతి → |
తెభా-8-692-సీ.
"విమలాత్మ! విన మాకు వేడ్క యయ్యెడి; మున్ను-
హరి మత్స్యమైన వృత్తాంతమెల్లఁ;
గర్మబద్ధుని భంగి ఘనుఁ డీశ్వరుఁడు లోక-
నిందితంబై తమోనిలయమైన
మీనరూపము నేల మే లని ధరియించె?-
నెక్కడ వర్తించె? నేమి చేసె?
నాద్యమై వెలయు న య్యవతారమునకు నె-
య్యది కారణంబు? గార్యాంశ మెట్లు?
తెభా-8-692.1-ఆ.
నీవు దగుదు మాకు నిఖిలంబు నెఱిఁగింపఁ
దెలియఁ జెప్పవలయు, దేవదేవు
చరిత మఖిలలోక సౌభాగ్య కరణంబు
గాదె? విస్తరింపు క్రమముతోడ."
టీక:- విమల = నిర్మలమైన; ఆత్మ = ఆత్మకలవాడా; వినన్ = వినుటకు; మా = మా; కున్ = కు; వేడ్కన్ = కుతూహలము; అయ్యెడిన్ = కలుగుచున్నది; మున్ను = పూర్వము; హరి = విష్ణుడు; మత్య్యము = మత్స్యావతారము; ఐన = ఎత్తిన; వృత్తాంతము = కథ; ఎల్లన్ = సమస్తమును; కర్మబద్దుని = భవబంధములుకలవాని; భంగిన్ = వలె; ఘనుడు = గొప్పవాడు; ఈశ్వరుడు = భగవంతుడు; లోక = లోకమున; నిందితంబున్ = అగౌరవమైనది; ఐ = అయ్యి; తమస్ = తమోగుణముతో; నిలయము = నిండినది; ఐన = అయిన; మీనరూపమున్ = మీనావతారమును; ఏలన్ = ఎందులకు; మేలు = మంచిది; అని = అని; ధరియించెన్ = స్వీకరించెను; ఎక్కడన్ = ఎక్కడ; వర్తించెన్ = ఉండెను; ఏమి = ఏమిటి; చేసెన్ = చేసెను; ఆద్యము = పురాతనమైనది; ఐ = అయ్యి; వెలయున్ = ప్రకాశించెడి; ఆ = ఆ; అవతారమున్ = అవతారమున; కున్ = కు; ఎయ్యది = ఏమిటి; కారణంబున్ = కారణము; కార్యాంశము = కార్యక్రమములు; ఎట్లు = ఏమిటి.
నీవు = నీవు; తగుదు = తగినవాడవు; మా = మా; కున్ = కు; నిఖిలంబున్ = సమస్తమును; ఎఱిగింపన్ = తెలుపుటకు; తెలియజెప్పవలయు = విశదముగాచెప్పుము; దేవదేవు = విష్ణుని; చరితము = కథ; అఖిల = సర్వ; లోక = లోకములకు; సౌభాగ్య = శుభములను; కరణంబు = కలిగించెడిది; కాదె = కాదా అవును; విస్తరింపు = వివరించుము; క్రమము = క్రమము; తోడన్ = ప్రకారముగ.
భావము:- “సూతమహర్షి! నీవు బహునిర్మల హృదయం కలవాడవు. పూర్వం విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు కదా, ఆ కథ అంతా వినాలని బాగా ఆసక్తిగా ఉంది. కర్మానికి కట్టుబడి ఉండే జీవుడు లోకంలో గౌరవమూ, జ్ఞానమూ లేని చేపగా పుడుతూ ఉండవచ్చు గానీ, భగవంతుడు అయిన విష్ణుమూర్తి ఎందుకు అలాంటి చేపరూపు ఏదో మంచిది అన్నట్లు ధరించాడు? అలా ధరించి ఎక్కడ ఉన్నాడు? ఏమి కార్యాలు సాధించాడు? అవతారాలలో మొదటి వరుసలోది అయిన ఆ మీనావతారం ఎత్తడానికి కారణం ఏమిటి? దాని అవసరం ఏమిటి? ఇవన్నీ వివరంగా తెలుపడానికి నివే సమర్థుడవు. దేవాధిదేవుడు విష్ణుమూర్తి కథలు సకల లోకాలకూ మేలు చేకూర్చేవి కదా, కనుక ఈ వృత్తాంత సవివరంగా విశదీకరించు.”
తెభా-8-693-వ.
అని మునిజనంబులు సూతు నడిగిన నతం డిట్లనియె "మీర లడిగిన యీ యర్థంబుఁ బరీక్షిన్నరేంద్రుం డడిగిన భగవంతుం డగు బాదరా యణి యిట్లనియె .
టీక:- అని = అని; ముని = మునులైన; జనంబులు = వారు; సూతున్ = సూతుని; అడిగినన్ = అడుగగా; అతండు = అతడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను; మీరలు = మీరు; అడిగిన = అడిగినట్టి; ఈ = ఈ; అర్థంబున్ = విషయమును; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రుండు = మహారాజు; అడిగినన్ = అడుగగా; భగవంతుండు = మహామహిమాన్వితుడు; అగు = అయిన; బాదరాయణి = శుకుడు {బాదరాయణి - బాదరాయణుని (వ్యాసుని) పుత్రుడు, శుకుడు}; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:- అంటూ మీనావతారం కథ వివరించమని శౌనకాదులు అడిగారు. అంతట సూతమహర్షి వారితో ఇలా అన్నాడు “మీరు అడిగినట్లే పరీక్షిత్తు అడిగితే, భగవత్స్వరూపుడు అయిన శుకమహర్షి ఇలా చెప్పాడు.
తెభా-8-694-సీ.
"విభుఁ డీశ్వరుఁడు వేదవిప్రగోసురసాధు-
ధర్మార్థములఁ గావఁ దనువుఁ దాల్చి,
గాలిచందంబున ఘనరూపములయందుఁ-
దనురూపములయందుఁ దగిలియుండు;
నెక్కువఁ దక్కువ లెన్నఁడు నొందక-
నిర్గుణత్వంబున నెఱియు ఘనుఁడు;
గురుతయుఁ గొఱఁతయు గుణసంగతివహించు-
మనుజేశ! చోద్యమే మత్స్య మగుట?
తెభా-8-694.1-తే.
వినుము; పోయిన కల్పాంతవేళఁ దొల్లి
ద్రవిళదేశపురాజు సత్యవ్రతుండు
నీరు ద్రావుచు హరిఁగూర్చి నిష్ఠతోడఁ
దపముఁ గావించె నొకయేటి తటము నందు .
టీక:- విభుడు = విష్ణువు; ఈశ్వరుడు = విష్మువు; వేద = వేదములను; విప్ర = బ్రాహ్మణులను; గో = గోవులను; సుర = దేవతలను; సాధు = మంచివారిని; ధర్మార్థములన్ = ధర్మమును, అర్థమును; కావన్ = కాపాడుటకై; తనువు = అవతారము; తాల్చెన్ = ధరించెను; గాలి = వాయువు; చందంబునన్ = వలె; ఘన = గొప్పవైన; రూపముల = జీవుల; అందున్ = లోను; తను = చిన్ని; రూపముల = జీవుల; అందున్ = లోను; తగిలి = పూని; ఉండున్ = ఉండును; ఎక్కువ = గొప్పదనము; తక్కువ = నీచత్వభావములను; ఎల్లడున్ = ఎప్పుడు; ఒందక = చెందక; నిర్గుణత్వంబునన్ = గుణరహితమున; నెఱియు = అతిశయించెడి; ఘనుడు = గొప్పవాడు; గురుతయున్ = గొప్పవైన; కొఱతయున్ = నీచమైన; గుణ = గుణములతో; సంగతిన్ = కలిగుండుటను; వహించున్ = పొందుతుండును; మనుజేశ = రాజా; చోద్యమే = విచిత్రమా కాదు; మత్యము = చేప; అగుట = అగుట.
వినుము = వినుము; పోయిన = జరిగిపొయిన; కల్ప = కల్పము; అంత = అంతమయ్యెడి; వేళన్ = సమయమునందు; తొల్లి = పూర్వము; ద్రవిళ = ద్రవిడ; దేశపు = దేశము యొక్క; రాజు = రాజు; సత్యవ్రతుండు = సత్యవ్రతుడు; నీరున్ = నీరు మాత్రమే; త్రావుచున్ = తాగుతూ; హరిన్ = విష్ణుని; గూర్ఛి = గురించి; నిష్ఠ = నియమబద్దత; తోడన్ = తోటి; తపమున్ = తపస్సు; కావించెన్ = చేసెను; ఒక = ఒక; ఏటి = కాలువ; తటమున్ = గట్టు; అందున్ = మీద.
భావము:- “వినుము పరీక్షిత్తు మహారాజా! ప్రభువు అయిన విష్ణుమూర్తి వేదాలనూ, బ్రాహ్మణులనూ, గోవులనూ, దేవతలనూ, సజ్జనులనూ, ధర్మాన్నీ, అర్థాన్ని రక్షించడం కోసం అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. వాయువులాగే గొప్పరూపాలలోనూ, సూక్ష్మరూపాలలోనూ చేరి ఉంటాడు. ఎక్కువ తక్కువలు లేని గుణరహితుడై శాశ్వత నిర్గుణ పరబ్రహ్మము అయినప్పటికీ, అతను గొప్పదనాన్నీ, తక్కువతనాన్నీ, గుణాల కలయికనూ పొందుతూ ఉంటాడు. అందువలన అతడు మత్స్యావతారం ధరించడంలో ఆశ్చర్యం లేదు. పోయిన కల్పం పూర్తి అవుతున్న సమయంలో సత్యవ్రతుడు అనే ద్రవిడదేశపు రాజు కేవలం నీళ్ళే ఆహారంగా తీసుకుంటూ నది గట్టుమీద విష్ణుని గూర్చి తపస్సు చేసేవాడు.
తెభా-8-695-వ.
మఱియు, నొక్కనాఁ డమ్మేదినీ కాంతుండు గృతమాలిక యను నేటి పొంత హరిసమర్పణంబుగా జలతర్పణంబు జేయు చున్న సమయంబున నా రాజు దోసిట నొక్క మీనుపిల్ల దవిలివచ్చిన నులికిపడి, మరలం దరంగిణీ జలంబు నందు శకుల శాబకంబు విడిచె; నట్లు విడి వడి నీటిలో నుండి జలచరపోతంబు భూతలేశ్వరున కి ట్లనియె .
టీక:- మఱియున్ = మరి; ఒక్క = ఒక; నాడు = దినమున; ఆ = ఆ; మేదినీకాంతుడు = రాజు; కృతమాలిక = కృతమాలిక; అను = అనెడి; ఏటి = కాలువ; పొంతన్ = దగ్గర; హరి = విష్ణునికి; సమర్పణంబు = సమర్పించినిది; కాన్ = అగునట్లు; జలతర్పణంబున్ = సంధ్యవార్చుట; చేయుచున్న = చేసెడి; సమయంబునన్ = సమయమునందు; ఆ = ఆ; రాజు = రాజుయొక్క; దోసిటన్ = దోసిలి లోనికి {దోసిలి - పాత్రవలె వంపబడిచేర్ఛినచేతులజంట, దోయిలి}; ఒక్క = ఒక; మీను = చేప; పిల్ల = పిల్ల; తవిలి = తగుల్కొని; వచ్చినన్ = రాగా; ఉలికిపడి = ఉలిక్కిపడి; మరలన్ = తిరిగి; తరంగిణీ = ఏటి {తరంగిణి - నీటి అలలుగలది, నది}; జలంబునన్ = నీటి; అందున్ = లో; శకుల = బేడిస చేప; శాబకంబు = పిల్ల; విడిచెన్ = వదలెను; అట్లు = అలా; విడివడి = విడువబడి; నీటి = నీటి; లోన్ = లోపల; ఉండి = ఉండి; జలచర = చేప {జలచరము - నీటతిరుగునది, చేప}; పోతంబు = పిల్ల; భూతలేశ్వరున్ = రాజున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఒకనాడు సత్యవ్రతుడు కృతమాలిక అనే నది వద్ద విష్ణువుకు ప్రీతి కలిగేలా నీళ్ళతో తర్పణం వదులు తున్నాడు. ఆ సమయంలో అతని దోసిలిలోనికి ఒక చేపపిల్ల వచ్చి చేరింది. అతను ఉలిక్కిపడి, ఆ చేపపిల్లను మరల నదినీటిలోకి వదలిపెట్టాడు. ఆ చేపపిల్ల నీటిలోనుండి రాజు సత్యవ్రతుడితో ఇలా అన్నది.
తెభా-8-696-మత్త.
"పాటువచ్చిన జ్ఞాతి ఘాతులు పాపజాతి ఝషంబు లీ
యేటఁ గొండొక మీనుపిల్లల నేఱి పట్టి వధింప న
చ్చోటు నుండక నీదు దోసిలి చొచ్చి వచ్చిన నన్ను న
ట్టేటఁ ద్రోవఁగఁ బాడియే? కృప యింత లేక దయానిధీ!
టీక:- పాటువచ్చిన = తోడబుట్టిన; జ్ఞాతి = దాయదులను; ఘాతులు = మింగేసెడి; పాప = పాపపు; జాతి = జాతివి; ఝషంబులు = చేపలు; ఈ = ఈ; ఏటన్ = నదిలో; కొండొక = తనయొక్క; మీనుపిల్లలన్ = చేపపిల్లలనే; ఏఱి = వేటాడి; పట్టి = పట్టుకొని; వధింపన్ = సంహరిస్తుండగా; ఆ = ఆ; చోటున్ = ప్రదేశమునందు; ఉండక = ఉండకుండ; నీదు = నీ యొక్క; దోసిలిన్ = దోసిట్లోకి; చొచ్చి = దూరి; వచ్చిన = వచ్చినట్టి; నన్నున్ = నన్ను; నట్టేటన్ = ఏటిమధ్యలో; త్రోవగన్ = తోసివేయుట; పాడియే = న్యాయమా; కృప = దయ; ఇంత = కొంచెముకూడ; లేక = లేకుండ; దయానిధీ = కృపకిసాగరమైనవాడా.
భావము:- “ఓ దయామయా! దయమాలి దాయాదులను చంపే పాపపు జాతి చేపలు ఈ ఏటిలో ఉన్నాయి. అవి చిన్న చేపలను పట్టి మింగేస్తాయి. అందుకే ఇక్కడ ఉండలేక నీ దోసిలి లోనికి వచ్చి చేరాను. దయలేకుండా ఇలా నన్ను నట్టేటిలో వదిలేయడం న్యాయం కాదు.
తెభా-8-697-ఆ.
వలలు దారు నింక వచ్చి జాలరి వేఁట
కాఱు నేఱు గలఁచి కారపెట్టి
మిడిసి పోవనీక మెడఁ బట్టుకొనియెద;
రప్పు డెందుఁ జొత్తు? ననఘచరిత!
టీక:- వలలున్ = వలలు; తారున్ = వారు; ఇంక = మరి; వచ్చి = వచ్చి; జాలరి = చేపలుపట్టుజాతి; వేటకాఱు = వేటగాళ్ళు; ఏఱున్ = నదిని; కలచి = అల్లకల్లోలముచేసి; కారపెట్టి = చెరబట్టి; మిడిసిపోవనీక = విదిలించుకోనిపోనీకుండ; మెడన్ = మెడను; పట్టుకొనియెదరు = పట్టుకొనెదరు; అప్పుడు = అప్పుడు; ఎందు = ఎక్కడ; చొత్తున్ = దాక్కొనగలను; అనఘచరిత = పుణ్యుడా;
భావము:- ఓ పుణ్య చరితుడా! ఇంక చేపలు పట్టే జాలారి వాళ్ళు వలలు పట్టుకు వేస్తారు. నదిని కలతపెట్టి నన్ను పట్టుకుంటారు. తప్పించుకుని పోకుండా, మెడ పట్టుకుంటారు అప్పడు ఎక్కడకని పోగలను.
తెభా-8-698-క.
భక్షించు నొండె ఝషములు
శిక్షింతురు ధూర్తు లొండెఁ; జెడకుండ ననున్
రక్షింపు దీనవత్సల!
ప్రక్షీణులఁ గాచుకంటె భాగ్యము గలదే? "
టీక:- భక్షించున్ = తినివేసెయును; ఒండెన్ = ఇతర; ఝషముల్ = చేపలు; శిక్షింతురు = పట్టుకొనెదరు; ధూర్తులు = దుష్టులు; ఒండెన్ = లేకపోతే; చెడకుండన్ = చచ్చిపోకుండ; ననున్ = నన్ను; రక్షింపు = కాపాడుము; దీనవత్సల = ఆపన్నులనుకాపాడువాడ; ప్రక్షీణులన్ = ఆపన్నులను {ప్రక్షీణులు - మిక్కిలి క్షీణించినవారు (ఆపదలవలన), ఆపన్నులు}; కాచు = కాపాడుట; కంటెన్ = కంటె; భాగ్యము = మంచిపని; కలదె = ఉన్నదా లేదు.
భావము:- ఓ దీనవత్సలా! సత్యవ్రతా! నన్ను పెద్ద చేపలు అయినా తినేస్తాయి. లేదంటే, ధూర్తులు అయిన జాలరులైనా పట్టుకుంటారు. అలా చచ్చిపోకుండా నన్ను కాపాడు. బలహీనులను కాపాడగలిగే అవకాశం కంటే గొప్ప అదృష్టం ఏముంటుంది.”
తెభా-8-699-వ.
అనిన విని కరుణాకరుండగు న వ్విభుండు మెల్లన య య్యంభశ్చర డింభకంబునుఁ గమండలు జలంబునం బెట్టి తన నెలవునకుం గొని పోయె, నదియు నొక్క రాత్రంబునం గుండిక నిండి తనకు నుండ నిమ్ము చాలక రాజన్యున కి ట్లనియె .
టీక:- అనినన్ = అనగా; విని = విని; కరుణాకరుడు = దయామయుడు; అగున్ = అయిన; ఆ = ఆ; విభుండు = రాజు; మెల్లన = మెల్లిగా; ఆ = ఆ; అంభశ్చర = చేప {అంభశ్చరము - అంభస్ (నీటిలో) చరించెడిది, చేప}; డింభకంబున్ = పిల్లను; కమండలు = కమండలపు; జలంబునన్ = నీటిలో; పెట్టి = పెట్టి; తన = తన యొక్క; నెలవున్ = నివాసమున; కున్ = కు; కొనిపోయెన్ = తీసుకుని వెళ్ళను; అదియున్ = అది; ఒక్క = ఒక; రాత్రంబునన్ = రాత్రిలో; గుండికన్ = దాక {గుండిగ - వెడల్పుగా ఉండెడి లోహపాత్ర, దాక}; నిండి = నిండిపోయి; తన = తన; కున్ = కు; ఉండన్ = ఉండుటకు; ఇమ్ము = చోటు; చాలక = సరిపోక; రాజన్యున్ = రాజున; కున్ = కు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:- అలా చేప పిల్ల పలికిన మాటలు విని కరుణాహృదయుడైన ప్రభువు సత్యవ్రతుడు, దానిని తన కమండలంలోని నీళ్ళలోకి ఎక్కించి, తన నివాసానికి తీసుకుని వెళ్ళాడు. ఆ చేప పిల్ల రాత్రి గడిచేసరికి పెరిగి కమండంలం నిండి పోయింది. దానికి ఉండటానికి కమండంలంలో చోటు చాలక రాజుతో ఇలా అన్నది.
తెభా-8-700-క.
"ఉండ నిదిఁ గొంచె మెంతయు
నొండొకటిం దెమ్ము భూవరోత్తమ!"యనుడున్
గండకముఁ దెచ్చి విడిచెను
మండలపతి సలిల కలశ మధ్యమున నృపా!
టీక:- ఉండన్ = ఉండుటకు; కొంచము = చిన్నది; ఎంతయున్ = ఎంతో; ఒండొకటిన్ = ఇంకొకదానిని; తెమ్ము = తీసురావలసినది; భూవర = రాజ; ఉత్తమ = శ్రేష్ఠుడా; అనుడును = అనగా; గండకమున్ = పెద్దదానిని; తెచ్చి = తీసుకొని వచ్చి; విడిచెను = వదలెను; మండలపతి = రాజు; సలిల = నీళ్ళ; కలశ = బాన; మధ్యమునన్ = లోపల; నృపా = రాజా.
భావము:- “ఓ రాజేంద్రా! ఈ కమండలం నేను ఉండటానికి సరిపోదు. ఇంకొక దానిని తీసుకురా” అని చేప పిల్ల అంది. సత్యవ్రతుడు దానిని పెద్ద నీళ్ళ గంగాళంలోకి మార్చాడు.
తెభా-8-701-వ.
అదియును ముహూర్తమాత్రంబునకు మూఁడు చేతుల నిడుపై యుదంచంబు నిండి పట్టు చాలక వేఱొండుఁ దె మ్మనవుడు నా రాచ పట్టి కరుణాగుణంబునకు నాటపట్టుఁ గావున గండకంబు నొండొక్క చిఱుతమడుఁగున నునిచె; నదియు నా సరోవర జలంబునకు నగ్గలం బై తనకు సంచరింప నది గొంచెం బని పలికినం బుడమిఱేడు మంచి వాఁడగుటం జేసి యా కంచరంబు నుదంచిత జలాస్పదంబైన హ్రదంబునందు నిడియె; నదియు నా సలిలాశయంబునకును నధికంబై పెరుఁగ నిమ్ము చాలదని చెప్పికొనిన నప్పుణ్యుం డొప్పెడి నడవడిం దప్పని వాఁడైన కతంబున న మ్మహామీనంబును మహార్ణవంబున విడిచె; నదియును మకరాకరంబునం బడి రాజున కిట్లను "పెను మొ సళ్ళు ముసరికొని కసిమసంగి మ్రింగెడి; నింతకాలంబు నడపి కడపట దిగవిడువకు వెడలఁ దిగువు"మని యెలింగింప దెలిసి కడపట యన్నీటితిరుగుడు ప్రోడకుం బుడమిఱేఁ డిట్లనియె .
టీక:- అదియునున్ = అదికూడ; ముహూర్తమాత్రంబున్ = కొద్దిసమయమున; కున్ = కే; మూడు = మూడు (3); చేతుల = చేతులంత, జానల; నిడుపు = పొడువు; ఐ = అయ్యి; ఉదంచంబున్ = బాన; నిండి = నిండిపోయి; పట్టుచాలక = పట్టకపోవుటచేత; వేఱొండు = ఇంకొకటి; తెమ్ము = తీసుకురమ్ము; అనవుడున్ = అనగా; ఆ = ఆ; రాచపట్టి = రాకుమారుడు; కరుణాగుణంబున్ = దయకు; ఆటపట్టు = నిలయమైనవాడు; కావునన్ = కనుక; గండకంబున్ = పెద్దచేపను; ఒండొక్క = ఒకానొక; చిఱుత = చిన్న; మడుగునన్ = సరస్సునందు; ఉనిచెన్ = ఉంచెను; అదియునున్ = అది; ఆ = ఆ; సరోవర = సరస్సుయొక్క; జలంబున్ = నీళ్ళ; కున్ = కి; అగ్గలంబు = పెద్దది; ఐ = అయ్యి; తన = తన; కున్ = కు; సంచరింపన్ = మెలగుటకు; అది = అది; కొంచంబు = చిన్నది; అని = అని; పలికినన్ = అనగా; పుడమిఱేడు = రాజు; మంచివాడు = మంచివాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; ఆ = ఆ; కంచరంబున్ = జలచరమును; ఉదంచిత = ఎక్కువ; జల = నీరు; ఆస్పదంబు = ఉండెడిది; ఐన = అయిన; హ్రదంబున్ = పెద్దచెరువు; అందున్ = లో; ఇడియెన్ = ఉంచెను; అదియున్ = అది; ఆ = ఆ; సలిలలాశయంబున్ = జలాశయమున; కును = కుకూడ; అధికంబు = పెద్దది; ఐ = అయ్యి; పెరుగన్ = పెరిగిపోగా; ఇమ్ము = చోటు; చాలదు = సరిపోలేదు; అని = అని; చెప్పికొనిన = చెప్పగా; ఆ = ఆ; పుణ్యుండు = పుణ్యాత్ముడు; ఒప్పెడి = చక్కటి; నడవడిన్ = ప్రవర్తన; తప్పని = వదలని; వాడు = వాడు; ఐన = అయినట్టి; కతంబునన్ = కారణముచేత; ఆ = ఆ; మహా = గొప్ప; మీనంబును = చేపను; మహార్ణవంబునన్ = మహాసముద్రమునందు {మహార్ణవము - మహా (గొప్ప) అర్ణవము (ఉదకమునకు స్థానము, సముద్రము), మహాసముద్రము}; విడిచెన్ = వదలెను; అదియునున్ = దానితో; మకరాకరంబునన్ = సముద్రములో {మకరాకరము - మకరముల (మొసళ్ళ)కి ఆకరము (నివాసము), సముద్రము}; పడి = పడి; రాజున్ = రాజున; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అను = అనెను; పెను = పెద్ద; మొసళ్ళు = మొసళ్ళు; ముసురుకొని = చుట్టుముట్టి; కసిమెసంగి = చెలరేగి; మ్రింగెడిన్ = మింగేస్తాయి; ఇంతకాలంబు = ఇన్నాళ్ళు; నడపి = నడిపించి, కాపాడి; కడపట = చివరకు; దిగవిడువకున్ = వదలిపెట్టకు; వెడలన్ = బయటకు; తిగువుము = పడవేయుము; అని = అని; ఎలింగింపన్ = మొరపెట్టుకొనగా; తెలిసి = అర్థముచేసికొని; కడపటన్ = చివరకు; ఆ = ఆ; నీటితిరుగుడు = జలచరములలో; ప్రోడ = వివేకి; కున్ = తో; పుడమిఱేడు = రాజు; ఇట్లు = ఇలా; అనియె = అనెను.
భావము:- ఒక్క క్షణంలో ఆ మీనం మూడు చేతుల పొడవు పెరిగిపోయి, (ఆంధ్ర వాచస్పతము చెయ్యి అంటే - రెండు మూరల పొడవు అంటే మూడడుగులు) ఆ గంగాళం అంతా నిండిపోయింది. చోటు సరిపోక ఇంకొకటి తెమ్మంది. దయానిధి అయిన ఆ రాకుమారుడు ఆ మత్స్యాన్ని చిన్న మడుగులోకి మార్పించాడు. ఆ మడుగుకూడా సరిపోనంత పెరిగిపోయి “నాకు తిరగడానికి చోటు చాలటం లేదు” అంది. ఆ భూపాలకుడు మంచివాడు కనుక ఆ జలచరాన్ని నీరు సమృద్ధిగా ఉన్న పెద్ద సరస్సులో ఉంచాడు. అది కూడా సరిపోనంతా పెరిగిపోయి ఆ మహామత్స్యం చోటు చాలటంలేదని చెప్పుకుంది. బహు దొడ్డ సన్మార్గ చరితుడూ, పుణ్యశీలీ కనుక ఆ మహా మీనాన్ని తీసుకుని వెళ్ళి మహా సముద్రంలో వదిలాడు. సముద్రానికి మొసళ్ళకు నెలవు అని పేరుకదా. “ఈ సముద్రంలో పడ్డ నన్ను పెద్ద మొసళ్ళు చుట్టుముట్టి చంపి తినేస్తాయి. ఇన్నాళ్ళూ కాపాడి, ఇవాళ నన్ను ఇలా వదలివేయకు, బయటకు తీసుకురా” అని మొరపెట్టుకుంది. ప్రాజ్ఞుడైన ఆ మహా జలచరంతో రాజు ఇలా అన్నాడు.
తెభా-8-702-సీ.
"ఒక దినంబున శతయోజనమాత్రము-
విస్తరించెదు నీవు; వినము చూడ
మిటువంటి ఝషముల నెన్నఁడు నెఱుఁగము-
మీనజాతుల కిట్టి మేను గలదె?
యేమిటి కెవ్వఁడ? వీ లీలఁ ద్రిప్పెదు-
కరుణ నాపన్నులఁ గావ వేఁడి
యంభశ్చరంబైన హరివి నే నెఱిఁగితి-
నవ్యయ! నారాయణాభిధాన!
తెభా-8-702.1-తే.
జనన సంస్థితి సంహార చతురచిత్త!
దీనులకు భక్తులకు మాకు దిక్కు నీవ;
నీదు లీలావతారముల్ నిఖిలభూత
భూతి హేతువుల్ మ్రొక్కెదఁ బురుషవర్య!
టీక:- ఒక = ఒక్క; దినంబునన్ = రోజులోనే; శత = నూరు; యోజన = యోజనముల; మాత్రము = మేర; విస్తరించెదు = పెరుగెదవు; నీవు = నీవు; వినము = వినలేదు; చూడము = చూడలేదు; ఇటువంటి = ఇలాంటి; ఝషములన్ = చేపలను; ఎన్నడున్ = ఎప్పుడుకూడ; మీనజాతుల్ = చేపలజాతుల; కున్ = కు; ఇట్టి = ఇంతటి; మేను = దేహము; కలదె = ఉంటుందా, ఉండదు; ఏమిటి = దేని; కిన్ = కోసము; ఎవ్వడవు = ఎవరవు; ఈ = ఈ; లీలన్ = విధముగ; త్రిప్పెడున్ = తిప్పలుపెడుతుంటివి; కరుణన్ = దయతో; ఆపన్నులన్ = దీనులను; కావన్ = కాపాడుటకు; వేడి = కోరి; అంభశ్చరంబు = జలచరము; ఐన = అయిన; హరివి = నారాయణుడవు; నేన్ = నేను; ఎఱిగితిన్ = తెలిసికొంటిని; అవ్యయ = నాశములేనివాడ; నారాయణ = నారాయణుడు; అభిదాన = అనెడిపేరు కలవాడ.
జననసంస్థితిసంహారచతురచిత్త = నారాయణ {జననసంస్థితిసంహారచతురచిత్త - జనన (సృష్టి) సంస్థితి (స్థితి) సంహార (లయ) చతుర (నైపుణ్యము కల) చిత్త (చిత్తముకలవాడ), విష్ణువు}; దీనుల్ = ఆపన్నుల; కున్ = కు; భక్తుల్ = భక్తుల; కున్ = కు; మా = మా; కున్ = కు; దిక్కు = శరణము; నీవ = నీవే; నీదు = నీ యొక్క; లీలావతారముల్ = క్రీడావతారములు; నిఖిల = సర్వ; భూత = జీవుల; భూతి = మేలు; హేతువుల్ = కలిగించెడివి; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; పురుషవర్య = పురుషోత్తమ.
భావము:- “ఒక్క రోజులో నూరు యోజనాల మేర పెరిగిపోయావు. ఇలాంటి చేపలను మేము ఎప్పుడూ కనివిని ఎరుగము. ఝషజాతులకు ఎక్కడా ఇలాంటి శరీరం ఉండదు. నీవు ఎవరవు? ఎందుకోసం నన్ను తిప్పలమ్మట తిప్పుతున్నావు. దీనులను కాపాడటానికి ఈ మహా మీన రూపం ధరించిన నీవు విష్ణువే అని తెలుసుకున్నాను. అచ్యుతా! నారాయణా! పురుషోత్తమా! లోకాలను సృష్టించి పోషించి లయం చేసుకునే మహానుభావుడవు నీవే. దీనులకు, భక్తులకు నీవే దిక్కు. మహిమాన్వితమైన నీ లీలావతారాలు సర్వ ప్రాణులకూ మేలు కలిగిస్తాయి. అటువంటి నీకు మ్రొక్కుతున్నాను.
తెభా-8-703-క.
ఇతరులముఁ గాము చిత్సం
గతులము మా పాలి నీవుఁ గలిగితి భక్త
స్థితుఁడవగు నిన్ను నెప్పుడు
నతి చేసినవాని కేల నాశముఁ గలుగున్ .
టీక:- ఇతరులము = పరాయివారము; కాము = కాము; చిత్ = సద్బుద్ధి; సంగతులము = కలవారము; మా = మా; పాలిన్ = ఎడల, అండగా; నీవున్ = నీవు; కలిగితి = ఉన్నావు; భక్త = భక్తుల యెడ; స్థితుడవు = అనుకూలుడవు; అగు = అయిన; నిన్నున్ = నిన్ను; ఎప్పుడున్ = ఎప్పుడు; నతి = స్తోత్రము; చేసిన = చెసెడి; వాని = వాడి; కిన్ = కి; ఏలన్ = ఎలా; నాశము = చేటు; కలుగున్ = కలుగుతుంది.
భావము:- మేము నీకు పరాయివాళ్ళం కాదు. నిర్మల జ్ఞానం కలవాళ్ళము. మాకు అండగా నీవు ఉంటావు. భక్తులలో నివసించే వాడవు నీవు. నీకు నిత్యం నమస్కరించే వాడికి చేటు కలుగనే కలుగదు కదా.
తెభా-8-704-క.
శ్రీలలనాకుచవేదికఁ
గేళీపరతంత్రబుద్ధిఁ గ్రీడించు సుఖా
లోలుఁడవు దామసాకృతి
నేలా మత్స్యంబ వైతి వెఱిఁగింపు హరీ!"
టీక:- శ్రీలలనా = లక్ష్మీదేవియొక్క; కుచ = స్తనములనెడి; వేదికన్ = వేదికలపైన; కేళీ = క్రీడించుటయందు; పరతంత్ర = మునుగెడి; బుద్ధిన్ = ఉద్దేశ్యముతో; క్రీడించు = విహరించెడి; సుఖ = సౌఖ్యములందు; ఆలోలుడవు = ఆనందస్వరూపుడవు; తామస = జ్ఞానరహితమైన; ఆకృతిన్ = రూపముకలదానిని; ఏలా = ఎందుకు; మత్స్యంబవు = చేపవు; ఐతివి = అయినావు; ఎఱిగింపు = తెలుపుము; హరీ = నారాయణా.
భావము:- హరీ! లక్ష్మీదేవి వక్షస్థలంపై క్రీడిస్తూ సంతోషంగా విహరించే ఆనందస్వరూపుడవు. తామస ప్రకృతితో తిరిగే చేప రూపాన్ని ఎందుకు ధరించావో తెలుపుమయ్యా!”