పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/భద్రసావర్ణిమనువుచరిత్ర
12భద్రసావర్ణిమనువుచరిత్ర
←11వ మనువు ధర్మసావర్ణి చరిత్ర | తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/) రచయిత: పోతన |
13వ మనువు దేవసావర్ణి చరిత్ర → |
తెభా-8-423-వ.
మఱియుఁ దద్భవిష్యత్సమయంబున భద్రసావర్ణి పండ్రెండవ మను వయ్యెడి; నతని నందనులు దేవవం దుపదేవ దేవజ్యేష్ఠాదులు వసుధాధిపతులును; ఋతుధాముం డను వాఁ డింద్రుండును హరితాదులు వేల్పులునుఁ; దపోమూర్తి తపాగ్నీధ్ర కాదులు ఋషులును నయ్యెదరు; అందు.
టీక:- మఱియున్ = ఇంకను; తత్ = ఆతరువాత; భవిష్యత్ = రాబోవు; సమయంబునన్ = కాలమునందు; భద్రసావర్ణి = భద్రసావర్ణి; పండ్రెడవ = పన్నెండవ (12); మనువు = మనువు; అయ్యెడిని = అవుతాడు; అతని = అతని యొక్క; నందనులు = పుత్రులు; దేవవత్ = దేవవంతుడు; ఉపదేవ = ఉపదేవుడు; దేవజ్యేష్ఠ = దేవజ్యేష్ఠుడు; ఆదులున్ = మొదలగువారు; వసుధాధిపతులు = రాజులు; ఋతుధాముండు = ఋతుధాముడు; అను = అనెడి; వాడు = వాడు; ఇంద్రుంను = ఇంద్రుడు; హరిత = హరితులు; ఆదులున్ = మొదలగువారు; వేల్పులునున్ = దేవతలు; తపోమూర్తి = తపోమూర్తి; తపః = తపస్వీ; అగ్నీధ్రక = అగ్నీధ్రకుడు; ఆదులున్ = మొదలగువారు; ఋషులునున్ = ఋషులు; అయ్యెదరు = అవుతారు; అందు = ఆకాలమున.
భావము:- పరీక్షిన్మహారాజా! ఆ తరువాత రాబోయేకాలంలో భద్ర సావర్ణి పన్నెండవ మనువు అవుతాడు. అతని కొడుకులైన దేవవంతుడూ, ఉపదేవుడూ, దేవజ్యేష్ఠుడూ మొదలైనవారు రాజులు అవుతారు. ఋతుధాముడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. హరితులూ మొదలైనవారు దేవతలు అవుతారు. తపోమూర్తి, తపస్వి, అగ్నీధ్రకుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు.
తెభా-8-424-ఆ.
జలజలోచనుండు సత్యతపస్సూనృ
తలకు సంభవించుఁ దనయుఁ డగుచు
ధరణిఁ గాచు నంచితస్వధామాఖ్యుఁడై
మనువు సంతసింప మానవేంద్ర!
టీక:- జలజలోచనుండు = విష్ణువు; సత్యతపస్ = సత్యతపుడు; సూనృతల్ = సృనృతల; కున్ = కు; సంభవించున్ = జన్మించును; తనయుడు = పుత్రుడు; అగుచున్ = అగుచు; ధరణిన్ = భూమండలమును; కాచున్ = రక్షించును; అంచిత = అందమైన; స్వధామ = స్వధాముడు; ఆఖ్యుడు = అనెడి పేరుగలవారు; ఐ = అయ్యి; మనువు = మనువు; సంతసింపన్ = సంతోషించగా; మానవేంద్ర = రాజా.
భావము:- ఆకాలంలో విష్ణువు సత్యతపునికి సూనృతకూ స్వధాముడు అనే పేరుతో జన్మిస్తాడు. మనువు సంతోషించేటట్లు లోకాన్ని రక్షిస్తాడు.