పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/బలి ప్రతాపము
బలిప్రతాపము
←సురాసుర యుద్ధము | తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/) రచయిత: పోతన |
హరి అసురులశిక్షించుట → |
తెభా-8-328-క.
శుద్ధముగ సురల కమృతము
సిద్ధించిన నసుర వరులు సిడిముడిపడుచున్
క్రుద్ధులు నానాయుధ స
న్నద్ధులు నయి యుద్ధమునకు నడచిరి బలిమిన్.
టీక:- శుద్ధముగన్ = సంపూర్ణముగా; సురల్ = దేవతల; కున్ = కు; అమృతమున్ = అమృతమును; సిద్ధించినన్ = సమకూరినందువల్ల; అసుర = రాక్షస; వరులు = వీరులు; సిడిముడి = చీకాకు; పడుచున్ = చెందుతూ; క్రుద్ధులు = కోపముగలవారు; నానా = వివిధ; ఆయుధ = ఆయుధములతో; సన్నద్ధులు = సంసిద్ధమైనవారు; అయి = ఐ; యుద్ధమున్ = పోరుట; కున్ = కు; నడచిరి = బయలుదేరిరి; బలిమిన్ = బలవంతముగా.
భావము:- దేవతలకే మొత్తం అమృతం అంతా చిక్కడం వలన రాక్షస వీరులకు చీకాకు పుట్టింది. వారు అనేక రకాల ఆయుధాలతో సేనలతో యుద్ధానికి సిద్ధపడి బయలుదేరారు.
అమృతం సాధించటంలోని కష్టం, ఆ కష్టానికి ఫలం దక్కకపోవడంతో చీకాకు మనసుతో పెట్టుకున్న కృద్ధత తీవ్రతను కష్టసాధ్యమైన “ద్ధ” కార ప్రాసతో సూచించిన తీరు బావుంది.
తెభా-8-329-క.
ధన్యులు వైరోచని శత
మన్యుప్రముఖులు మదాభిమానులు దమలో
నన్యోన్యరణము బాహా
సిన్యాసంబులను బేర్చి చేసిరి కడిమిన్.
టీక:- ధన్యులు = పుణ్యులు; వైరోచని = బలిచక్రవర్తి (వైరోచనుడు = ప్రహ్లాదుని కొడుకు అయిన విరోచనుని పుత్రుడు, విశిష్టమైన ప్రకాశం కలవాడు, బలిచక్రవర్తి); శతమన్యు = ఇంద్రుడు (శతమన్యుడు = శత (నూరు, 100) యజ్ఞములు చేసినవాడు, ఇంద్రుడు); ప్రముఖులు = మొదలగువారు; మద = మదము; అభిమానులు = గర్వములుగలవారు; తమ = వారి; లోన్ = లోపల; అన్యోన్య = ఒకరితోఒకరుచేయు; రణము = యుద్ధము; బాహ = చేతి; అసి = కత్తి; న్యాసంబులన్ = విన్యాసములతో; పేర్చి = అతిశయించి; చేసిరి = చేసితిరి; కడిమిన్ = పరాక్రమముతో.
భావము:- విరోచనుని (ప్రహ్లాదుని కొడుకు) కొడుకు అయిన బలిచక్రవర్తి, నూరు యజ్ఞములు చేసి పదవి పొందిన ఇంద్రుడు మొదలైన బలవంతులు ఖడ్గాలు చేబూని మదించిన స్వాభిమానాలు కలవారై, చెలరేగి బాహాబాహి పోరాటాలు సాగించారు.
న్యూనఫలదాయక పోరాటాలు కనుక కఠినతరమైన “న్య” కార ప్రాస.
తెభా-8-330-మ.
అరుదై కామగమై మయాసురకృతంబై లోకితాలోక్యమై
వరశస్త్రాస్త్ర సమేతమై తరళమై వైహాయసంబై మహా
సురయోధాన్వితమైన యానమున సంశోభిల్లెఁ బూర్ణేందు సు
స్థిరకాంతిన్ బలి చామరధ్వజ చమూదీప్తస్థితిన్ ముందటన్.
టీక:- అరుదు = అపూర్వమైనది; ఐ = అయ్యి; కామగము = కోరినట్లుపయనించెడిది; ఐ = అయ్యి; మయ = మయుడు యనెడి; అసుర = రాక్షసునిచే; కృతంబు = చేయబడినది; ఐ = అయ్యి; లోకిత = చూపులకు; అలోక్యము = కనబడనిది; ఐ = అయ్యి; వర = శ్రేష్ఠమైన; శస్త్ర = శస్త్రములు; అస్త్ర = అస్త్రములు; సమేతము = కలిగినది; ఐ = అయ్యి; తరళము = ప్రకాశించునది; ఐ = అయ్యి; వైహాయసంబు = ఆకాశలోవెళ్ళునది; ఐ = అయ్యి; మహా = గొప్ప; అసుర = రాక్షస; యోధ = వీరులతో; ఆన్వితము = కూడినది; ఐన = అయిన; యానమునన్ = వాహనమునందు; సంశోభిల్లెన్ = మిక్కిలి శోభించెను; పూర్ణ = నిండు; ఇందు = చంద్రుని; సుస్థిర = నిలకడైన; కాంతిన్ = ప్రకాశముతో; బలి = బలి; చామర = వింజామరలతో; ధ్వజ = జండాలతో; చమూ = సైన్యముల; దీప్తస్థితిన్ = ప్రకాశించుతుండగా; ముందటన్ = ముందుపక్కన.
భావము:- నిండు పున్నమి నాటి చంద్రునికి సాటివచ్చే ప్రకాశంతో బలిచక్రవర్తి, మయాసురు డంతటి వానిచే నిర్మింపబడినది; చూపులకు అందనిది; ఎన్నో విశిష్టమైన శస్త్ర అస్త్రాది ఆయుధాలు కలది; ఆకాశంలోకూడా వెళ్ళగలది; గొప్ప గొప్ప రాక్షస యోధుల ఎందరో సిద్ధంగా గలది అయిన గొప్ప వాహనంపై బయలుదేరాడు. అలా వస్తున్న బలిచక్రవర్తి వాహనం ముందు వింజామరలతో, జండాలతో ప్రకాశిస్తున్న దానవ సైన్యాలు నడుస్తున్నాయి.
తెభా-8-331-వ.
మఱియు నముచి శంబర బాణ ద్విమూర్ధ కాలనాభ శకుని జంభాయోముఖ ప్రహేతి హేతి భూతసంత్రాస హయగ్రీవ కపిలేల్వలోత్కళ మేఘదుందుభి మయత్రిపురాధిప విప్రచిత్తి విరోచన వజ్ర దంష్ట్ర తారకారిష్టారిష్టనేమి శుంభ నిశుంభ శంకుశిరః ప్రముఖులును బౌలేయ కాలకేయులును, నివాతకవచ ప్రభృతులును, దక్కిన దండయోధులునుం గూడికొని యరదంబులం దురగంబుల మాతంగంబుల హరిణంబుల హరి కిరి శరభ మహిష గవయ ఖడ్గ గండభేరుండ చమరీ జంబుక శార్దూల గో వృషాది మృగంబులను, గంక గృధ్ర కాక కుక్కుట బక శ్యేన హంసాది విహంగంబులను, దిమి తిమింగ లాది జలచరంబులను, నరులను, నసుర సుర నికర వికృత విగ్రహ రూపంబులగు జంతువులను నారోహించి తమకు నడియాలంబులగు గొడుగులు పడగలు జోడుఁగైదువలు పక్కెరలు బొమిడికంబులు మొదలగు పోటుము ట్లాయితంబుగఁ గైకొని వేఱు వేఱ మొనలై విరోచననందనుం డగు బలిముందట నిలువంబడిరి; దేవేంద్రుండును నైరావతారూఢుండై వైశ్వానర వరుణ వాయు దండధరాద్యనేక నిర్జర వాహినీ సందోహంబునుం, దాను నెదురుపడి పిఱుతివియక మోహరించె; నట్లు సంరంభసన్నాహ సముత్సాహంబుల రెండుదెఱంగుల వారునుం బోరాడు వేడుకల మీఁటగు మాటల సందడించుచున్న సమయంబున.
టీక:- మఱియున్ = ఇంకను; నముచి = నముచి; శంబర = శంబరుడు; బాణ = బాణుడు; ద్విమూర్ధ = ద్విమూర్ధుడు; కాలనాభ = కాలనాభుడు; శకుని = శకుని; జంభ = జంభుడు; అయోముఖ = అయోముఖుడు; ప్రహేతి = ప్రహేతి; హేతి = హేతి; భూతసంత్రాస = భూతసంత్రాసుడు; హయగ్రీవ = హయగ్రీవుడు; కపిల = కపిలుడు; ఇల్వల = ఇల్వలుడు; ఉత్కళ = ఉత్కళుడు; మేఘ = మేఘుడు; దుందుభి = దుందుభుడు; మయ = మయుడు; త్రిపురాధిప = త్రిపురాధిపుడు; విప్రచిత్తి = విప్రచిత్తి; విరోచన = విరోచనుడు; వజ్ర = వజ్రదంష్ట్రుడు; తారక = తారకుడు; అరిష్టనేమి = అరిష్టనేమి; శుంభ = శుంభుడు; నిశుంభ = నిశుంభుడు; శంకుశిరస్ = శంకుశిరసుడు; ప్రముఖులునున్ = మొదలైనవారు; పౌలోమ = పౌలోములు; కాలకేయులును = కాలకేయులు; నివాతకవచులు = నివాతకవచులు; ప్రభృతులును = మున్నగువారు; తక్కిన = మిగిలిన; దండయోధులునున్ = సేనానాయకులను; కూడికొని = కలుపుకొని; అరదంబులన్ = రథములను; తురగంబులన్ = గుఱ్ఱములను; మాతంగంబులన్ = ఏనుగులను; హరిణంబులన్ = లేళ్ళను; హరి = సింహములు; కిరి = అడవిపందులు; శరభ = శరభమృగములు; మహిష = దున్నపోతులు; గవయ = గురుపోతులు; ఖడ్గ = ఖడ్గమృగములు; గండభేరుండ = గండభేరుండపక్షులు; చమరీ = ఆడుసవరపు మృగము; జంబుక = నక్కలు; శార్దూల = పెద్దపులులు; గో = ఆవులు; వృష = ఎద్దులు; ఆది = మున్నగు; మృగంబులను = జంతువులను; గృధ్ర = గద్దలు; కాక = కాకులు; కుక్కుట = కోళ్ళు; బక = కొంగలు; శ్యేన = డేగలు; హంస = హంసలు; ఆది = మొదలైన; విహంగంబులను = పక్షులను; తిమి = తిములు; తిమింగల = తిమింగలములు; ఆది = మున్నగు; జలచరంబులను = నీటిజంతువులను; నరులను = నరులు; అసుర = రాక్షసులు; సుర = దేవతల; నికర = గుంపుల; వికృత = వికారమైన; విగ్రహ = ఆకృతములుగల; రూపంబులు = స్వరూపములు గలవి; అగు = అయిన; జంతువులను = జంతువులను; ఆరోహించి = ఎక్కి; తమ = వారి; అడియాలంబులు = సంకేతములు; అగు = అయిన; గొడుగులు = గొడుగులు; పడగలు = ధ్వజములు, టెక్కెములు; జోడుకైదువలు = జోడు కైదువలు; పక్కెరలు = వాహనములమీది బట్టలు; బొమిడికంబులు = కిరీటములు; మొదలగు = మొదలగు; పోటుముట్లు = యుద్ధసాధనములను; ఆయితంబుగన్ = సిద్ధముచేయబడినవిగా; కైకొని = తీసుకొని; వేఱువేఱ = వేరేవేరే; మొనలు = వ్యూహములుగలవారు; ఐ = అయ్యి; విరోచన = విరోచనుడను రాక్షసుని; నందనుండు = కొడుకు; అగు = అయిన; బలి = బలి; ముందటన్ = ముందు; నిలువంబడిరి = నిలబడిరి; దేవేంద్రుండునున్ = ఇంద్రుడు; ఐరావత = ఐరావతమును; ఆరూఢుండు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; వైశ్వానర = అగ్నిదేముడు; వరుణ = వరుణుడు; వాయు = వాయుదేవుడు; దండధర = యమధర్మరాజు; ఆది = మున్నగు; అనేక = అనేకమైన; నిర్జర = దేవతల; వాహినీ = సేనా; సందోహంబునున్ = సమూహములతో; తాను = అతను; ఎదురుపడి = ఎదుర్కొని; పిఱుతివియక = వెనుదీయక; మోహరించెన్ = వ్యూహములుపన్నెను; అట్లు = అలా; సంరంభ = వేగిరపాటులతో; సన్నాహ = సంసిద్ధత; సముత్సాహంబుల = మిక్కిలిఉత్సాహముతో; రెండు = రెండు (2); తెఱంగులన్ = పక్షముల; వారునున్ = వారు; పోరాడు = యుద్ధముచేసెడి; వేడుకలన్ = ఉత్సుకతతో; మీటు = ఉద్రేకపువి; అగు = అయిన; మాటలన్ = పలుకులతో; సందడించుచున్న = సందడిచేయుచున్న; సమయంబునన్ = సమయమునందు.
భావము:- అలా వస్తున్న బలిచక్రవర్తి ముందు భాగంలో నముచీ, శంబరాసురుడు, బాణాసురుడు, ద్విమూర్థుడు, శకుని, జంభాసురుడు, అయోముఖుడు, ప్రహేతి, హేతి, భూతసంత్రాసుడు, హయగ్రీవుడు, కపిలుడు, ఇల్వలుడు, ఉత్కలుడు, మేఘదుందుభి, మయుడు, త్రిపురాసురుడు, విప్రచిత్తి, విరోచనుడు, వజ్రదంష్ట్రుడు, తారకుడు, అరిష్టుడు, అరిష్టనేమి, శంభుడు, నిశంభుడు, శంకుశిరుడు మొదలైనవారు; పౌలోములు, కాలకేయులూ, నివాతకవచులు మున్నగువారు; మిగిలిన సేనానాయకులు అందరూ వారి వారి సేనలను నడుపుకుంటూ వస్తున్నారు. వారు రథాలూ, గుఱ్ఱాలు, ఏనుగులు, జింకలు, సింహాలు, పందులు, శరభాలు, దున్నపోతులు, గురుపోతులు, ఖడ్గమృగాలు, గండభేరుండాలు, సవరపుమృగాలు, నక్కలు, పులులు, ఎద్దులు మొదలైన జంతువులను; రాంబందులు, గ్రద్దలు, కాకులు, కోడిపుంజులు, కొంగలు, డేగలు, హంసలు మున్నగు పక్షులను; తిములు, తిమింగలాలు మున్నగు జలచరాలనూ; నరవాహనాలను; రాక్షసాకారాలతో, దేవతాకారాలతో వికారాలైన ఆకారాలు గల జంతువులనూ వాహనాలుగా చేసికొని ఎక్కి వస్తున్నారు. తమతమ సంకేతాలైన గొడుగులు, జండాలూ, కవచాలూ, ఆయుధాలు, వాహనాలపై వేసే అంగీలు, శిరస్త్రాణాలు మున్నగు సమస్త సాధనాలతో సిద్ధంగా వస్తున్నారు.
దేవేంద్రుడు ఐరావతంపై ఎక్కి వస్తున్నాడు. అతనితోపాటు అగ్ని, వరుణుడు, వాయువు, యముడు మొదలైన అనేక దేవతులు తమ సైన్య సమూహాలతో వచ్చి వెనుదీయకుండా దానవులను ఎదిరించారు. రెండు పక్షాల వారూ అమిత ఉత్సాహంతో, వేగిరిపాటుతో, గట్టిగా పూని యుద్ధం చేయడానికి సన్నద్ధులు అయ్యారు. క్రోధోద్రేకాలతో పరస్పరం అధిక్షేపించుకుంటున్నారు.
తెభా-8-332-సీ.
వజ్రదంష్ట్రాంచిత వ్యజనంబులును బర్హ-
చామరంబులు సితచ్ఛత్త్రములును
జిత్రవర్ణధ్వజచేలంబులును వాత-
చలితోత్తరోష్ణీష జాలములును
జప్పుళ్ళ నెసఁగు భూషణ కంకణంబులుఁ-
జండాంశురోచుల శస్త్రములును
వివిధ ఖేటకములు వీరమాలికలును-
బాణపూర్ణములైన తూణములును
తెభా-8-332.1-ఆ.
నిండి పెచ్చురేఁగి నిర్జరాసురవీర
సైన్యయుగ్మకంబు చాల నొప్పె
గ్రాహతతుల తోడఁ గలహంబునకు వచ్చు
సాగరములభంగి జనవరేణ్య!
టీక:- వజ్ర = వజ్రమువలెకఠినమైన; దంష్ట్ర = కోరలు; అంచిత = అందమైన; వ్యజనంబులును = అలపట్టాలు; బర్హ = నెమలియీకల; చామరములు = వింజామరలు; సిత = తెల్లని; ఛత్రములును = గొడుగులు; చిత్ర = రంగురంగుల; వర్ణ = రంగుల; ధ్వజ = జండా; చేలంబులునున్ = గుడ్డలు; వాత = గాలిచేత; చలిత = చలింపబడిన; ఉత్తర = అలంకరాములు; ఉష్ణీష = కిరీటముల; జాలములునున్ = సమూహములు; చప్పుళ్ళను = శబ్దములను; ఎసగు = అతిశయించు; భూషణ = ఆభరణములు; కంకణంబులు = కంకణములు; చండాంశు = సూర్యునివంటి; రోచులన్ = మెరిసెడి; శస్త్రములును = ఆయుధములు; వివిధ = రకరకముల; ఖేటకములున్ = డాళ్ళు; వీర = వీరుల; మాలికలు = హారములు; బాణ = బాణములతో; పూర్ణములు = నిండినవి; ఐన = అయిన; తూణములును = అమ్ములపొదులు.
నిండి = నిండుగా; పెచ్చురేగి = చెలరేగి; నిర్జర = దేవతల; అసుర = రాక్షస; వీర = వీరుల; సైన్య = సైన్యముల; యుగ్మకంబు = ఉభయములుగలిగి; చాలన్ = మిక్కిలి; ఒప్పెన్ = చక్కగానుండెను; గ్రాహ = మొసళ్ళ; తతుల = సమూహముల; తోడన్ = తోటి; కలహంబున్ = పోరాటమున; కున్ = కు; వచ్చు = వచ్చుచున్న; సాగరముల = సముద్రముల; భంగిన్ = వలె; జనవరేణ్య = మహారాజ.
భావము:- ఓ మహారాజా! అప్పుడు ఆ రెండు పక్షాల సైన్యాలూ, కఠినమైన కోరలూ, అందమైన అలపజ్జాలూ, నెమలి పురులూ, వింజామరలు, వెల్లగొడుగులు, రంగురంగుల జండాలు, గాలికి కదలాడుతుండే తలపాగాలు, ధ్వనించే కంకణాలు మున్నగు ఆభరణాలు, సూర్యకాంతికి మెరుస్తుండే ఆయుధాలూ, రకరకాల డాలువార్లు, వీర హారాలు, బాణాలతో నిండిన అమ్ముపొదులు కలిగి చెలరేగాయి. ఆ ఉభయసైన్యాలు మొసళ్ళ గుంపులతో కూడి పోరాడటానికి వచ్చిన రెండు సముద్రాలవలె ఒప్పి ఉన్నాయి.
తెభా-8-333-క.
భేరీ భాంకారంబులు
వారణ ఘీంకారములును వరహరి హేషల్
భూరి రథనేమి రవములు
ఘోరములై పెల్లగించెఁ గులశైలములన్.
టీక:- భేరి = భేరీ వాద్యాలనుండి; భాంకారంబులున్ = భం యనెడి శబ్దములు; వారణ = ఏనుగుల; ఘీంకారములును = ఘీంకారములు; వర = శ్రేష్ఠమైన; హరి = గుఱ్ఱముల; హేషల్ = సకిలింపులు; భూరి = మిక్కిలిపెద్దవైన; రథ = రథముల; నేమి = చక్రముల ఇరుసుల; రవములున్ = శబ్దములు; ఘోరములు = భయంకరమైనవి; ఐ = అయ్యి; పెల్లగించెన్ = తల్లకిందులుచేసెను; కులశైలములన్ = కులపర్వతములను.
భావము:- భేరీ వాద్యాలనుండి వెలువడే భం అనే శబ్దాలూ, ఏనుగుల ఘీంకారాలూ, గుఱ్ఱాల సకిలింపులూ, పెద్ద పెద్ద రథచక్రాల శబ్దాలూ ఎంత భయంకరంగా ఉన్నాయంటే, కులపర్వతాలు సైతం తలకిందులేపోతున్నాయి.
తెభా-8-334-వ.
ఇవ్విధంబున నుభయబలంబులును మోహరించి బలితో నింద్రుండును, దారకునితో గుహుండును, హేతితో వరుణుండును, బ్రహేతితో మిత్రుండును, గాలనాభునితో యముండును, మయునితో విశ్వకర్మయు, శంబరునితోఁ ద్వష్టయు, విరోచనితో సవితయు, నముచితోఁ బరాజితుండును, వృషపర్వునితో నశ్విదేవతలును, బలిసుతబాణాది పుత్రశతంబుతో సూర్యుండును, రాహువుతో సోముండును, బులోమునితో ననిలుండును, శుంభ నిశుంభులతో భద్రకాళీదేవియు, జంభునితో వృషాకపియును, మహిషునితో విభావసుండును, నిల్వల వాతాపులతో బ్రహ్మపుత్రులును, దుర్మర్షణునితోఁ గామదేవుండును, నుత్కలునితో మాతృకాగణంబును, శుక్రునితో బృహస్పతియు, నరకునితో శనైశ్చరుండును, నివాతకవచులతో మరుత్తులును, గాలేయులతో వసువులు, నమరులును, బౌలోములతో విశ్వేదేవగణంబును, గ్రోధవశులతో రుద్రులును, నివ్విధంబునం గలిసి పెనంగి ద్వంద్వయుద్ధంబు చేయుచు మఱియు రథికులు రథికులను, పదాతులు పదాతులను, వాహనారూఢులు వాహనారూఢులనుం, దాఁకి సింహనాదంబులు చేయుచు, నట్టహాసంబు లిచ్చుచు, నాహ్వానంబు లొసంగుచు, నన్యోన్యతిరస్కారంబులు చేయుచు, బాహునాదంబుల విజృంభించుచుఁ, బెనుబొబ్బల నుబ్భిరేగుచు, హుంకరించుచు, నహంకరించుచు, ధనుర్గుణంబులఁ డంకరించుచు, శరంబుల నాటించుచుఁ, బరశువుల నఱకుచుం, జక్రంబులం జెక్కుచు, శక్తులం దునుముచుఁ, గశలంబెట్టుచుఁ, గుఠారంబులఁ బొడుచుచు, గదల నడచుచుఁ, గరంబులఁ బొడుచుచుఁ, గరవాలంబుల వ్రేయుచుఁ, బట్టిసంబుల నొంచుచుఁ, బ్రాసంబులం ద్రెంచుచుఁ, బాశంబులం గట్టుచుఁ, బరిఘంబుల మొత్తుచు, ముసలంబుల మోఁదుచు, ముద్గరంబుల జదుపుచు, ముష్టివలయంబుల ఘట్టించుచుఁ, దోమరంబుల నుఱుముచు శూలంబులఁ జిమ్ముచు, నఖంబులం జీరుచుఁ, దరు శైలంబుల ఱువ్వుచు, నుల్ముకంబులం జూఁడుచు నిట్లు బహువిధంబులం గలహ విహారంబులు సలుపు నవసరంబున భిన్నంబు లయిన శిరంబులును, విచ్ఛిన్నంబులైన కపాలంబులును, వికలంబులైన కపోలంబులును, జిక్కుపడిన కేశబంధంబులును, భగ్నంబులైన దంతంబులును, గృత్తంబులైన భుజంబులును, ఖండితంబులైన కరంబులును, విదళితంబు లైన మధ్యంబులును, వికృతంబులైన వదనబింబంబులును, వికలంబు లైన నయనంబులును, వికీర్ణంబు లయిన కర్ణంబులును, విశీర్ణంబు లైన నాసికలును, విఱిగిపడిన యూరుదేశంబులును, విసంధులయిన పదంబులునుఁ, జిరిగిన కంకటంబులును, రాలిన భూషణంబులును, వ్రాలిన కేతనంబులును, గూలిన ఛత్రంబులును, మ్రగ్గిన గజంబులును, నుగ్గయిన రథంబులును, నుఱుమైన హయంబులునుఁ, జిందఱవందఱలైన భటసమూహంబులును, నొఱలెడు కొఱప్రాణంబులును, బొఱలెడు మేనులును, నుబ్బి యాడెడు భూతంబులును, బాఱెడు రక్త ప్రవాహంబులును, గుట్టలుగొన్న మాంసంబులును, నెగసి తిరిగెడి కబంధంబులునుఁ, గలకలంబులు జేయు కంక గృధ్రాది విహంగంబులు, నయి యొప్పు నప్పోరతిఘోరంబయ్యె నప్పుడు.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగ; ఉభయ = రెండు (2); బలంబులును = సైన్యములు; మోహరించి = గుమిగూడి; బలి = బలి; తోన్ = తోటి; ఇంద్రుండును = ఇంద్రుడు; తారకుని = తారకుడి; తోన్ = తోటి; గుహుండును = గుహుడు; హేతి = హేతి; తోన్ = తోటి; వరుణుండును = వరుణుడు; ప్రహేతి = ప్రహేతి; తోన్ = తోటి; మిత్రుండును = మిత్రుడు; కాలనాభుని = కాలనాభుడి; తోన్ = తోటి; యముండును = యముడు; మయుని = మయుడి; తోన్ = తోటి; విశ్వకర్మయు = విశ్వకర్మ; శంబరుని = శంబరుడి; తోన్ = తోటి; త్వష్టయున్ = త్వష్ట; విరోచని = విరోచనుడి; తోన్ = తోటి; సవితయున్ = సవిత; నముచి = నముచి; తోన్ = తోటి; పరాజితుండును = పరాజిత్తు; వృషపర్వుని = వృషపర్వుడి; తోన్ = తోటి; అశ్వనీదేవతలున్ = అశ్వనీదేవతలు; బలి = బలి యొక్క; సుత = పుత్రుడు; బాణ = బాణుడు; ఆది = మున్నగు; పుత్ర = కొడుకులు; శతంబున్ = నూరుమంది; తోన్ = తోటి; సూర్యుండును = సూర్యుడు; రాహువు = రాహువు; తోన్ = తోటి; సోముండును = చంద్రుండు; పులోముని = పులోముడి; తోన్ = తోటి; అనిలుండును = వాయువు; శుంభ = శుంభుడు; నిశుంభుల = నిశుంభుడుల; తోన్ = తోటి; భద్రకాళీదేవియున్ = భద్రకాళి; జంభుని = జంభుడి; తోన్ = తోటి; వృషాకపియును = వృషాకపి; మహిషుని = మహిషుడి; తోన్ = తోటి; విభావసుండును = విభావసుడు; ఇల్వల = ఇల్వలుడు; వాతాపుల = వాతాపిల; తోన్ = తోటి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; పుత్రులును = పుత్రులును; దుర్మర్షణుని = దుర్మర్షణుడి; తోన్ = తోటి; కామదేవుండును = మన్మథుడు; ఉత్కలుని = ఉత్కలుడి; తో = తోటి; మాతృగణంబును = మాతృగణములు; శుక్రుని = శుక్రుడి; తోన్ = తోటి; బృహస్పతియు = బృహస్పతి; నరకుని = నరకుడి; తోన్ = తోటి; శనైశ్చరుండును = శనీశ్వరుడు; నివాతకవచుల = నివాతకవచుల; తోన్ = తోటి; మరుత్తులును = మరుద్దేవతలు; కాలేయుల = కాలకేయుల; తోన్ = తోటి; వసువులున్ = వసువులు; అమరులునున్ = దేవతలు; పౌలోముల = పులోముని పుత్రుల; తోన్ = తోటి; విశ్వేదేవ = విశ్వేదేవతా; గణంబును = సమూహములు; క్రోధవశుల్ = క్రోధవశుల; తోన్ = తోటి; రుద్రులును = రుద్రులు; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; కలిసి = కూడి; పెనంగి = చుట్టుముట్టి; ద్వంద్వయుద్ధంబు = ద్వంద్వయుద్ధములు; చేయుచున్ = చేస్తూ; మఱియున్ = ఇంకను; రథికులు = రథికులు; రథికులను = రథికులను; పదాతులు = కాల్బలము, బంటులు; పదాతులను = కాల్బలములను; వాహనారూఢులు = వాహనాలమీదివారు; వాహనారూఢులను = వాహనాలమీదివారిని; తాకి = ఎదుర్కొని; సింహనాదంబులు = గర్జనలు; చేయుచున్ = చేస్తూ; అట్టహాసంబులున్ = బిట్టునవ్వులు; ఇచ్చుచున్ = చేయుచు; ఆహ్వానంబులు = పిలుపులు; ఒసంగుచున్ = ఇస్తూ; అన్యోన్య = ఒకరినొకరు; తిరస్కారంబులున్ = ధిక్కారములు; చేయుచున్ = చేస్తూ; బాహునాదంబులన్ = భుజములచరుపులతో; విజృంభించుచున్ = మించుతూ; పెను = పెద్దపెద్ద; బొబ్బలన్ = కేకలతో; ఉబ్బి = ఉప్పొంగి; రేగుచున్ = చెలరేగుతూ; హుంకరించుచున్ = హుంకారములుచేయుచు; అహంకరించుచున్ = గర్వములుచూపుతూ; ధనుస్ = విల్లుల; గుణంబులన్ = తాళ్ళను; టంకరించుచు = టంటమ్మనిమోగించుచు; శరంబులన్ = బాణములను; నాటించుచున్ = నాటుతూ; పరశువులన్ = గండ్రగొడ్డళ్ళతో; నఱకుచున్ = నరుకుతూ; చక్రంబులన్ = చక్రములతో; చెక్కుచున్ = చెక్కుతూ; శక్తులన్ = శక్తి ఆయుధములతో; తునుముచున్ = తరుగుతూ; కశలన్ = కొరడాలతో; పెట్టుచున్ = కొడుతూ; కుఠారంబులన్ = గొడ్డళ్లతో; పొడుచుచున్ = పొడుస్తూ; గదలన్ = గదలతో; అడచుచున్ = అణచివేస్తూ; కరంబులన్ = చేతులతో; పొడుచుచన్ = పొడుస్తూ; కరవాలంబులన్ = కత్తులతో; వ్రేయుచున్ = వేస్తూ; పట్టిసంబులన్ = అడ్డకత్తులతో; ఒంచుచున్ = వంచుతూ; ప్రాసంబులన్ = ఈటెలతో; తెంచుచున్ = తెంపేస్తూ; పాశంబులన్ = తాళ్ళతో; కట్టుచున్ = కట్టుతూ; పరిఘంబులన్ = ఇనపగొలుసుగుండ్లతో; మొత్తుచున్ = మొత్తుతు; ముసలంబులన్ = రొకళ్ళతో; మోదుచున్ = దంచుతూ; ముద్గరంబులన్ = సమ్మెటలతో; చదుపుచున్ = బాదుతూ; ముష్టివలయంబుల = పిడికిళ్ళతో; ఘట్టించుచున్ = పొడుస్తూ; తోమరంబులన్ = చర్నాకోళ్ళతో; ఉఱుముచున్ = కొడుతూ; శూలంబులన్ = శూలములతో; చిమ్ముచున్ = చిమ్ముతూ; నఖంబులన్ = గోర్లతో; చీరుతున్ = గీరుతూ; తరు = చెట్లు; శైలంబులన్ = కొండరాళ్ళను; ఱువ్వుచున్ = విసరుతూ; ఉల్ముకంబులన్ = కొరవులతో; చూడుచున్ = కాల్చుతూ; ఇట్లు = ఇలా; బహు = అనేక; విధంబులన్ = రకములుగా; కలహ = యుద్ధ; విహారంబులున్ = విన్యాసములు; సలుపు = చేయు; అవసరంబునన్ = సమయమునందు; భిన్నంబులు = పగిలిపోయిన; అయిన = ఐన; శిరంబులును = తలలు; విచ్చింన్నంబులు = బద్ధలు; ఐన = అయిన; కపాలంబులును = పుఱ్ఱెలు; వికలంబులు = చిట్లిపోయినవి; ఐన = అయిన; కపోలంబులును = చెక్కిళ్ళు; చిక్కుపడిన = చిక్కుపడినట్టి; కేశబంధంబులును = జుట్టుముళ్ళు; భగ్నంబులున్ = రాలిన; ఐన = అయిన; దంతంబులును = పళ్ళు; కృత్తంబులు = తెగినవి; ఐన = అయిన; భుజంబులును = భుజములును; ఖండితంబులున్ = ముక్కలైనవి; ఐన = అయిన; కరంబులును = చేతులు; విదళితంబులున్ = ఖండింపబడినవి; ఐన = అయిన; మధ్యంబులును = నడుములు; వికృతంబులు = రూపుమాపబడినవి; ఐన = అయిన; వదన = ముఖ; బింబంబులునున్ = బింబములు; వికలంబులు = లొట్టబోయినవి; ఐన = అయిన; నయనంబులునున్ = కళ్ళు; వికీర్ణంబులు = చెదరినవి; అయిన = ఐన; కర్ణంబులును = చెవులు; విశీర్ణంబులు = తెగినవి; ఐన = అయిన; నాసికలునున్ = ముక్కులు; విఱిగి = విరిగిపోయి; పడిన = పడిపోయిన; ఊరుదేశంబులును = తొడలు; విసంధులు = కీళ్ళువదలినవి; ఐన = అయిన; పదంబులును = కాళ్ళు; చిరిగిన = చిరిగిపోయిన; కంకటంబులును = కవచములు; రాలిన = రాలిన; భూషణంబులును = ఆభరణములు; వ్రాలిన = వాలిపోయిన; కేతనంబులునున్ = జండాలు; కూలిన = కూలినట్టి; ఛత్రంబులును = గొడుగులు; మ్రగ్గిన = క్రుంగిన; గజంబులును = ఏనుగులు; నుగ్గు = నలిగినవి; అయిన = ఐన; రథంబులునున్ = రథములు; ఉఱుము = పొడిగాయైనవి; ఐన = అయిన; హయంబులును = గుఱ్ఱములు; చిందఱవందఱలు = చెల్లాచెదరు; ఐన = అయిన; భట = సేనా; సమూహంబులున్ = సమూహములు; ఒఱలెడు = కొట్టికుంటున్న; కొఱప్రాణంబులును = కొనప్రాణములు; పొఱలెడు = దొర్లుతున్న; మేనులు = దేహములు; ఉబ్బి = సంతోషముతోనుబ్బి; ఆడెడు = ఆడుతున్న; భూతంబులును = పిశాచములు; పాఱెడు = పారుతున్న; రక్త = రక్తపు; ప్రవాహంబులునున్ = ఏరులు; గుట్టలుగొన్న = రాశులుపడిన; మాంసంబులును = మాంసములు; ఎగసితిరిగెడి = ఎగిరిపడెడి; కబంధంబులును = పీనుగులు; కలకలంబులున్ = రొదలు; చేయు = చేయెడి; కంక = రాబందులు; గృధ్ర = గద్దలు; ఆది = మున్నగు; విహంగంబులును = పక్షులును; అయి = కలిగినదై; ఒప్పు = ఒప్పెడి; ఆ = ఆ; పోరు = యుద్ధము; అతి = మిక్కిలి; ఘోరంబు = భయంకరమైనది; అయ్యెన్ = అయినది; అప్పుడు = ఆ సమయమునందు.
భావము:- ఇలాగ రెండు పక్షాల సైన్యాలూ గుమిగూడాయి. బలిచక్రవర్తితో దేవేంద్రుడూ; తారకునితో కుమార స్వామీ; హేతితో వరుణుడూ; ప్రహేతితో మిత్రుడూ; కాలనాభునితో యముడూ; మయాసురునితో విశ్వకర్మా; శంబరునితో త్వష్టా, విరోచనునితో సవితా; నముచితో పరాజిత్తూ; వృషపర్వునితో అశ్వనీదేవతలూ; బాణుడూ మొదలైన బలి కొడుకులతో సూర్యుడూ; రాహువుతో చంద్రుడూ; పులోమునితో వాయువూ; శుంభ నిశుంభులతో భద్రా కాళీ; జంభునితో వృషాకపీ; మహిషునితో విభావసుడూ; ఇల్వలునితోను వాతాపితోనూ బ్రహ్మపుత్రులూ; దుర్మర్షుణునితో మన్మథుడూ; ఉత్కలునితో సప్తమాతృకలూ; శుక్రునితో బృహస్పతీ; నరకునితో శనైశ్వరుడూ; నివాతకవచులతో మరుత్తులూ; కాలకేయులతో వసువులూ, దేవతలూ; పౌలోములతో విశ్వేదేవులూ; క్రోధవశులతో రుద్రులూ; ద్వంద్వ యుద్ధాలలో ఎదిరించారు. అంతేకాకుండా, కాలిబంట్లు కాలిబంట్లతోనూ; రథాలవారు రథాలవారితోనూ; వాహనాలవారు వాహనాల వారితోనూ; ఎదిరించి పోరాడారు. ఆ సేనావాహినులు సింహనాదాలు చేస్తూ, బిట్టుగా నవ్వుతూ, ఒకరినొకరు కేకేస్తూ, ధిక్కారాలు చేస్తూ, భూజాలు తట్టి ముందుకురుకుతూ, గావుకేకలతో ఉప్పొంగిపోతూ, హుంకారాలు చేస్తూ, గర్విస్తూ, అల్లెత్రాళ్ళు మ్రోగిస్తూ; బాణాలను నాటుతూ, గండ్రగొడ్డళ్ళతో నరుకుతూ, చక్రాలతో ఖండిస్తూ, శక్తులతో ముక్కల చేస్తూ, కొరడాలతో కొడుతూ, గొడ్డళ్ళతో నరుకుతూ, గదలతో మొత్తుతూ, చేతులతో చరుస్తూ, కత్తులతో ఉత్తరిస్తూ, అడ్డకత్తులతో నొప్పిస్తూ, ఈటెలతో తెగవేస్తూ, తాళ్ళతో కట్టేస్తూ, గుదియలతో అదరగొడుతూ, రోకళ్ళతో దంచుతూ, సమ్మెటలతో బాదుతూ, పిడికిళ్ళతో పొడుస్తూ, తోమరాలతో పిండిచేస్తూ, శూలాలతో కుమ్ముతూ, గోళ్ళతో చీలుస్తూ, చెట్లూ కొండలూ విసురుతూ, కొరవులతో కాల్చుతూ పలు విధాలుగా పోరాటాలు చేసారు.
ఆ యుద్ధం పగిలిపోయిన తలలు, బ్రద్దలయిపోయిన పుఱ్ఱెలు, చీలిపోయిన చెక్కిళ్ళు, చిక్కుపడిపోయిన కొప్పులు, విరిపోయిన పండ్లు, తెగిపోయిన భుజాలు, తునాతునకలయిపోయిన చేతులు, విరిగిపోయిన నడుములు, వికారమైపోయిన ముఖాలు, లొట్టపోయిన కన్నులు, తెగిపోయిన చెవులు, ముక్కలైపోయిన ముక్కులు, విరిగిపోయిన తొడలు, తెగిపోయిన పాదాలుతోనూ; చినిగిపోయిన కవచాలు, రాలిపోయిన నగలు, పడిపోయిన జండాలు, విరిగిపోయిన గొడుగులు, కృంగిపోయిన ఏనుగులు, నుగ్గునుగ్గయిపోయిన రథాలు, కూలిపోయిన గుఱ్ఱాలు, చెల్లాచెదురయిపోయిన సైన్యసమూహాలుతోనూ; కొట్టుకుంటున్న కొనప్రాణాలు, పొర్లాడుతున్న శరీరాలుతోనూ; సంతోషంతో చిందులు తొక్కుతున్న పిశాచాలు; పారుతున్న నెత్తురు ఏరులు, పోగులు పడుతున్న మాంసాలు, పెరుగుతున్న పీనుగులు పెంటలుతోనూ; రాబందులూ, గ్రద్దలూ మున్నగు పక్షులు చేస్తున్న రొదలుతోనూ మిక్కిలి భయంకరంగా రూపొందింది.