పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/జగన్మోహిని వర్ణన
జగన్మోహిని వర్ణన
←ధన్వంతర్యామృతజననము | తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/) రచయిత: పోతన |
అమృతము పంచుట → |
తెభా-8-300-వ.
అంత.
టీక:- అంత = ఆ సమయమునందు.
భావము:- ఇలా రాక్షసులు అమృతకలశం కోసం పెనగులాడుతున్నారు. ఈలోగా. . .
తెభా-8-301-సీ.
మెత్తని యడుగుల మెఱుఁగారు జానువు-
లరఁటి కంబములదో యైన తొడలు
ఘనమగు జఘనంబుఁ గడు లేత నడుమును-
బల్లవారుణకాంతి పాణియుగము
గడు దొడ్డ పాలిండ్లుఁ గంబుకంఠంబును-
బింబాధరముఁ జంద్రబింబముఖముఁ
దెలిగన్నుఁ గవయును నలికుంతలంబును-
బాలేందు సన్నిభ ఫాలతలము
తెభా-8-301.1-తే.
నమరఁ గుండల కేయూర హార కంక
ణాదు లేపార మంజీర నాద మొప్ప
నల్ల నవ్వులఁ బద్మదళాక్షుఁ డసుర
పతుల నడగింప నాఁడు రూపంబుఁ దాల్చి.
టీక:- మెత్తని = సున్నితమైన; అడుగులన్ = అడుగులు; మెఱుగారు = నిగనిగలాడెడి; జానువుల్ = మోకాళ్ళు; అరటి = అరటి; కంబములన్ = స్తంభములకు; తోడు = సమానము; అగు = అయ్యెడి; తొడలు = తొడలు; ఘనము = మిక్కిలి పెద్దవి; అగు = అయిన; జఘనంబున్ = పిరుదులు; లేత = సన్నని; నడుమును = నడుము; పల్లవ = చిగురువంటి; అరుణ = ఎఱ్ఱని; కాంతి = ప్రకాశముగల; పాణి = అరచేతుల; యుగమున్ = జంట (2); కడు = మిక్కిలి; దొడ్డ = పెద్దవైన; పాలిండ్లున్ = స్తనములు; కంబు = శంఖమువంటి; కంఠంబును = కంఠము; బింబ = దొండపండువంటి; అధరమున్ = కిందిపెదవి; చంద్రబింబ = చంద్రబింబమువంటి; ముఖము = మొగము; తెలి = తెల్లని; కన్ను = కళ్ళ; గవయునున్ = జంట (2); అలి = తుమ్మెదలవంటి; కుంతలంబును = శిరోజములు; బాలేందు = నెలవంక; సన్నిభ = సరపోలెడి; ఫాలతలము = నుదురు; అమరన్ = ఒప్పారియుండగా; కుండల = చెవికుండలములు.
కేయూర = బాహుపురులు; హార = హారములు; కంకణ = కంకణములు; ఆదులు = మున్నగునవి; ఏపార = అతిశయించగా; మంజీర = కాలి అందెల; నాదము = రవములు; ఒప్పన్ = చక్కగనుండగా; నల్ల = చిరు; నవ్వులన్ = నవ్వులతో; పద్మదళాక్షుడు = విష్ణుమూర్తి; అసుర = రాక్షస; పతులన్ = రాజులను; అడగింపన్ = అణచివేయుటకు; ఆడు = స్త్రీ; రూపంబున్ = ఆకృతిని; తాల్చి = ధరించి.
భావము:- తనలో తాను చిరునవ్వులు నవ్వుకున్నాడు. రాక్షస వీరులును అణచడానికి మాయా మోహినీ రూపం ధరించాడు. ఆ మోహినికి మెత్తని అడుగులూ, నిగనిగ మెరసే మోకాళ్ళూ, అరటిబోదెలవంటి తొడలూ, పెద్ద పెద్ద పిరుదులూ, బాగా సున్నితమైన నడుము, చిగురుటాకుల వంటి ఎఱ్ఱని అరచేతులూ, పెద్ద వక్షోజాలూ, శంఖంవంటి కంఠం, దొండపండులాంటి పెదవీ, చంద్రబింబం వంటి ముఖమూ, తెల్లని కన్నులు రెండూ, నల్లని తుమ్మెదలవంటి శిరోజాలు, నెలవంక వంటి నుదురూ చక్కగా అమరి ఉన్నాయి. ఆమె అలంకరించుకున్న చెవిలోలకులూ, బాహుపురులూ, హారాలూ, కంకణాలూ, వాటిని మించిన చిరు సవ్వళ్ళు చేసే కాలి అందెలూ ఎంతో శోభిస్తున్నాయి.
తెభా-8-302-వ.
అయ్యవసరంబున జగన్మోహనాకారంబున.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు; జగన్మోహన = జగన్మోహిని; ఆకారంబున = రూపముతో.
భావము:- ఆ సమయంలో, శ్రీమహావిష్ణువు, అలా లోకాన్ని అంతటినీ మొహింపజేసే రూపంతో మాయామోహినీ అవతారం ధరించి. . . . .
తెభా-8-303-సీ.
పాలిండ్లపై నున్న పయ్యెద జాఱించు-
జాఱించి మెల్లన చక్క నొత్తు
దళ్కు దళ్కను గండఫలకంబు లొలయించు-
నొలయించి కెంగేల నుజ్జగించుఁ
గటు మెఱుంగులు వాఱు కడకన్ను లల్లార్చు-
నల్లార్చి ఱెప్పల నండఁ గొలుపు
సవరని దరహాస చంద్రికఁ జిలికించుఁ-
జిలకించి కెమ్మోవిఁ జిక్కుపఱచు
తెభా-8-303.1-తే.
దళిత ధమ్మిల్ల కుసుమ గంధమ్ము నెఱపుఁ
గంకణాది ఝణంకృతుల్ గడలు కొలుపు
నొడలి కాంతులు పట్టులే కులుకఁ బాఱు
సన్నవలిపంపుఁ బయ్యెద చౌకళింప.
టీక:- పాలిండ్ల = స్తనముల; పైన్ = మీదను; ఉన్న = ఉన్నట్టి; పయ్యెదన్ = పైటను; జాఱించు = తొలగునట్లుచేయును; జాఱించి = జారునట్లుచేసి; మెల్లన = మెల్లిగా; చక్కనొత్తు = సరిచేయును; తళ్కుదళ్కను = తళతళలాడెడి; గండఫలకంబును = చెక్కిళ్ళు; ఒలయించున్ = నిగుడించును; ఒలయించి = ని9ుడించి; కెంగేలన్ = వేలిచివర్లతో; ఉజ్జగించున్ = బుజ్జగించును; కటు = చిక్కని; మెఱుంగులు = తళుకులు; వాఱు = ప్రసరించెడి; కడకన్నులు = పక్కచూపులకళ్లను; అల్లార్చున్ = చలింపచేయును; అల్లార్చి = చలింపజేసి; ఱెప్పలన్ = కనురెప్పలను; అండ = ఆశ్రయము; కొలుపు = కలిపించును; సవరని = చక్కని; దరహాస = చిరునవ్వుల; చంద్రికలన్ = వెన్నెలలను; చిలికించున్ = జల్లును; చిలికించి = చిలకరించి; కెంపు = ఎఱ్ఱని; మోవిన్ = పెదవిని; చిక్కుపఱచున్ = మెలిపెట్టును.
దళిత = విరసిన; ధమిల్ల = కొప్పునందలి; కుసుమ = పూల; గంధమ్మున్ = పరిమళమును; నెఱపున = వ్యాపింపజేయును; కంకణ = కంకణములు; ఆది = మున్నగువాని; ఝణంకృతులు = ఝణఝణరవములను; కడలుకొలుపున్ = వెదజల్లును; ఒడలి = దేహముయొక్క; కాంతులున్ = ప్రకాశములను; పట్టులేక = పట్టలేక; కులుకుబాఱున్ = వయ్యారాలుపోవును; సన్న = పల్చటి; వలిపంపు = తెల్లని; పయ్యెదన్ = పైట; చౌకళింపన్ = అల్లల్లాడగా.
భావము:- పైటకొంగును వక్షోజాలపైనుండి జార్చి, మెల్లగా సర్దుకుంటోంది. తళతళ మెరుస్తున్న చెక్కిళ్ళను చేతిపై చేర్చి మరల వదిలివేస్తోంది. జిగేలుమని మెరుస్తున్న కడగంటి చూపులను ప్రసరించి, మళ్ళీ కనురెప్పలు మూస్తోంది. అందంగా చిరునవ్వులు చిలకరించి, ఎఱ్ఱని పెదవుని మెలిపెడుతోంది, కొప్పులోని వికసించిన పూలపరిమళాలు వ్యాపింపజేసి, కంకణాదులను మ్రోగేలా చేస్తోంది. నిలకడ లేకుండా మెలగుతూ నెమ్మేని కాంతులను పొంగిపొరలేలా చేస్తూ, పల్చగా ఉన్న తెల్లని పైటను ఆడిస్తోంది.
కాంతులను పొంగిపొరలేలా చేస్తూ , పల్చగా ఉన్న తెల్లని పైటను ఆడిస్తోంది. జాఱించు; జా ఱించి, లొలయించు; నొలయించి, . . అంటూ పూర్వపాదాంత పదాన్ని గ్రహించి, ఉత్తరపాదం ఆరంభించడం ప్రయోగిస్తూ, ముక్తపదగ్రస్త అలంకారాన్ని అత్యద్భుతంగా మథురాతి మథురంగా ప్రయోగించిన మా పోతన్న గారికి శతకోటి పాదాభివందనాలు . . .
తెభా-8-304-వ.
ఇవ్విధంబున న క్కపట యువతీరత్నంబు జగన్మోహన దేవతయునుంబోలె నెమ్మొగంబు తావికి మత్తిల్లిన తేఁటి మొత్తంబులన్ గెలిచి చిగురు జొంపంబుల నెడగలుగ జడియుచు ముఱియుచుండ రాక్షసవరులు గనుంగొని.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగా; ఆ = ఆ; కపట = మాయా; యువతీరత్నము = శ్రేష్ఠమైనస్త్రీ; జగన్మోహన = జగన్మోహినీ; దేవతయునున్ = దేవి; పోలెన్ = వలె; నెఱ = నిండు; మొగంబున్ = ముఖము; తావి = సుగంధమున; కిన్ = కు; మత్తిల్లిన = మత్తెక్కినట్టి; తేటి = తుమ్మెదల; మొత్తంబులన్ = గుంపులను; గెలిచి = అదలించి; చిగురు = చిగురుటాకుల; జొంపంబులన్ = పొదరిండ్ల; ఎడగలుగన్ = దూరుటకు; జడియుచున్ = బెదురుతూ; ముఱియుచుండన్ = మురిసిపోతుండగా; రాక్షస = రాక్షస; వరులు = ఉత్తములు; కనుంగొని = చూసి.
భావము:- ఇలా ఆ మాయలమారి జవరాలు, జగత్తుని మోహింపజేసే దేవతలాగ ఒప్పి ఉండి, తన అందమైన ముఖ సుగంధానికి ఆకర్షితమై ముసురుతున్న తుమ్మెదలను అదలిస్తూ, మురిసిపోతూ, చిగురాకుల పొదల వెంట సంచరిస్తున్న ఆమెను అసుర వీరులు చూసి, మోహంలో పడిపోయి, ఆమెతో ఇలా అనసాగారు. . . . . .
తెభా-8-305-సీ.
"అవుఁగదే లావణ్య; మవుఁగదే మాధుర్య-
మవుఁగదే సతి! నవయౌవనాంగి!
యెటనుండి వచ్చితి? వేమి యిచ్చించెదు?-
నీ నామమెయ్యది? నీరజాక్షి!
యమర గంధర్వ సిద్ధాసుర చారణ-
మనుజకన్యలకు నీ మహిమ గలదె?
ప్రాణ చిత్తేంద్రియ పరిణామ దాయియై-
నిర్మించెఁ బో విధి నిన్ను గరుణ;
తెభా-8-305.1-తే.
వనిత! గశ్యపు సంతతి వార మేము
భ్రాతలము సురలకు నిద్ధపౌరుషులము
జ్ఞాతులకు మాకు నేకార్థసంగతులకుఁ
బాలు దీరని యర్థంబు బంచి యిమ్ము.
టీక:- అవుగదే = చాలాబాగుంది; లావణ్యము = చక్కటిముఖకాంతి; అవుగదే = చాలాబాగుంది; మాధుర్యము = సౌందర్యము; అవుగదే = చాలాబాగుంది; సతి = స్త్రీ; నవయౌవనాంగి = సుందరీ; ఎట = ఎక్కడ; నుండి = నుంచి; వచ్చితివి = విచ్చేసినావు; ఏమి = దేనిని; ఇచ్చించెదు = ఇష్టపడెదవు; నీ = నీ యొక్క; నామము = పేరు; ఎయ్యది = ఏది; నీరజాక్షి = అందగత్తె; అమర = దేవతా; గంధర్వ = గంధర్వ; సిద్ధ = సిద్ధుల; అసుర = రాక్షస; చారణ = చారణుల; మనుజ = మానవ; కన్యల్ = స్త్రీల; కున్ = కు; నీ = నీ యొక్క; మహిమ = గొప్పదనము; కలదె = ఉన్నదా, లేదు; ప్రాణ = ప్రాణములకు; చిత్త = మనసునకు; ఇంద్రియ = ఇంద్రియములకు; పరిణామ = నిండుదనమును; దాయి = ఇచ్చువాడు; ఐ = అయ్యి; నిర్మించెన్ = సృష్టించెను; పో = కాబోలు; విధి = బ్రహ్మదేవుడు; నిన్ను = నిన్ను; కరుణన్ = కృపకలిగి.
వనిత = స్త్రీ; కశ్యపు = కశ్యపుని యొక్క; సంతతివారము = పిల్లలము; మేము = మేము; భ్రాతలము = సోదరులము; సురల్ = దేవతల; కున్ = కు; ఇద్ద = ప్రసిద్ధమైన; పౌరుషులము = పౌరుషముగలవారము; జ్ఞాతల్ = సహోదరులపిల్లల; కున్ = కు; మా = మా; కున్ = కు; పాలు = పంపకములు; తీరని = కుదరకున్నట్టి; అర్థంబున్ = ఈ పదార్థమును; పంచి = పంచి; ఇమ్ము = పెట్టుము.
భావము:- “ఓ కమలాల వంటి కన్నులున్న కోమలాంగీ! చక్కదనాల జవరాలా! ఓ వన్నెలాడీ! ఏమి లావణ్యం! ఏమి మాధుర్యం! ఎక్కడి నుండి వచ్చావు? ఏమి కావాలి? నీ పేరేమిటి? గంధర్వ, సిద్ధ, దేవత, రాక్షస, చారణ, మానవ కన్యలలో ఎవరి యందూ నీ అంత అందచందాలు లేవు. నీ మిక్కిలి ప్రియమైన మనసుకీ, అవయవాలకూ నిండుదనం సమకూర్చిన బ్రహ్మదేవుడు నిన్ను ప్రీతితో సృష్టించాడు కాబోలు! మేము కశ్యపుని సంతతి వారము, దేవతలకు సోదరులము. ఎదురులేని పౌరుషం కలవారము. ఒకే ప్రయోజనాన్ని ఆశించి శ్రమించి సంపాదించిన ఈ పదార్థాన్ని పంచుకోడంలో జ్ఞాతులమైన మాలో మాకు పంపకాలు కుదరటం లేదు. నువ్వు పంచు.
తెభా-8-306-క.
సభ యై యుండెద మిందఱ
మభయంబున వచ్చు కొలఁది నమృతంబును నీ
విభరాజగమన! తప్పక
విభజింపు విపక్షపక్ష విరహితమతి వై."
టీక:- సభ = కొలువుతీరినవారము; ఐ = అయ్యి; ఉండెదము = ఉంటాము; ఇందఱము = మేమందరము; అభయంబునన్ = భయములేకుండగ; వచ్చుకొలది = వంతువచ్చునంత; అమృతంబున్ = అమృతమును; నీవు = నీవు; ఇభరాజగమన = సుందరి; తప్పక = తప్పకుండ; విభజింపు = పంచిపెట్టుము; విపక్షపక్షవిరహిత = పక్షపాతరహితమైన; మతివి = బుద్ధిగలదానవు; ఐ = అయి..
భావము:- గజరాజువంటి చక్కటి నడక గల సుందరీ! మేము ఉభయులమూ బారులు తీరి వరుసగా కూర్చుంటాము. పరాయి వారూ, తన వారూ అనే భేద భావం చూపకుండా మా ఉభయులకూ సరిగా ఈ అమృతాన్ని నువ్వు పంచిపెట్టు.”
తెభా-8-307-వ.
అని మందలించిన దైత్యులం గని మాయాయువతి రూపుం డగు హరి తన వాఁడి వాలు జూపుటంపఱలవలన వారల తాలుముల నగలించి చిఱునగవు లెగయ మొగమెత్తి యిట్లనియె.
టీక:- అని = అని; మదలించిన = చెప్పినట్టి; దైత్యులన్ = రాక్షసులను; కని = చూసి; మాయా = కపట; యువతి = స్త్రీ; రూపుండు = రూపముననున్నవాడు; అగు = అయిన; హరి = విష్ణుమూర్తి; తన = తన యొక్క; వాడి = వాడియైన; వాలుచూపుల = వాలుచూపులనెడి; అంపఱల = తూపుల, బాణముల; వలన = చేత; వారల = వారి యొక్క; తాలుములన్ = ఓర్పులను; అగలించి = పోగొట్టి; చిఱునగవులు = చిరునవ్వులు; ఎగయన్ = చిలుకగా; మొగము = ముఖమును; ఎత్తి = పైకెత్తి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా అమృతం పంచమని హెచ్చరిస్తున్న రాక్షసులను చూసి, మాయా మోహినీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన అందమైన వాలుచూపుల తూపులతో వారి ఓరిమిలను బద్ధలు చేసి, చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నాడు.
తెభా-8-308-క.
"సుందరులగు పురుషులఁగని
పొందెడు నాయందు నిజము పుట్టునె మీకున్?
బృందారకరిపులారా!
చెందరు కామినుల విశ్వసింపరు పెద్దల్.
టీక:- సుందరులు = అందమైనవారు; అగు = అయిన; పురుషులన్ = మగవారిని; కని = కనుగొని; పొందెడు = పొందునట్టి; నా = నా; అందున్ = ఎడల; నిజము = సత్యము; పుట్టునె = కలుగుతుందా; మీకున్ = మీకు; బృందారకరిపులారా = రాక్షసులు; చెందరు = దరిచేరరు; కామినులన్ = స్త్రీలను; విశ్వసింపరు = నమ్మరు; పెద్దల్ = పెద్దలు.
భావము:- “ఓ అసురులారా! నేను అందమైన మగవారిని చూసుకుని పొందగోరే దానను. మీకు నా మీద నమ్మకం కుదురుతోందా? పెద్దలు అందగత్తెలను నమ్మి దరిచేరరు కదా!