పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/గజేంద్రుని వర్ణన

గజేంద్రుని వర్ణన

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-36-క.
తొండంబుల మదజలవృత
గండంబులఁ గుంభములను ట్టన చేయం
గొంలు దలక్రిందై పడు
బెండుపడున్ దిశలు చూచి బెగడున్ జగముల్.

టీక:- తొండంబులన్ = తొండలములతో; మదజల = మదజలముతో; వృత = నిండిన; గండంబులన్ = చెక్కిళ్ళతో; కుంభములను = కుంభస్థలములతో; ఘట్టనన్ = ఢీకొట్టుట; చేయన్ = చేసినచో; కొండలు = కొండలు; తలక్రింద = కిందుమీద; ఐ = అయ్యి; పడున్ = పడిపోవును; బెండుపడున్ = బ్రద్ద లగును; దిశలున్ = దిక్కులు; చూచి = చూసి; బెగడున్ = భయపడును; జగముల్ = లోకములు.
భావము:- తొండాలతో మదజలం నిండిన చెక్కిళ్ళతో కుంభస్థలాలతో ఆ మదగజాలు ఢీకొంటుంటే కొండలు తలకిందులౌతాయి దిక్కులు బద్ధలౌతాయి. లోకాలు భయపడిపోతాయి. (ఎంత చక్కటి అతిశయోక్తి అలంకారం)
రహస్యార్థం: జీవుడు అహంభావంతో ఇంద్రియ వ్యాపారలకు ఆజ్ఞలను ఇచ్చే స్థానం ఆజ్ఞా చక్రం. గండస్థలం అను ఆజ్ఞా చక్రం. అందుండే మదజలం, మదించిన చలం అంటే పట్టుదల. అదే కర్తృత్వకాది అహంభావం. తొండం అంటే ఉచ్వాసం అంటే ప్రాణాయామం. అలా ప్రాణాయామంతో అహంభావాన్ని ఘట్టన అంటే నిరోధం చేస్తుంటే, జగములు అంటే శరీరం గగుర్పాటు పొందింది.

తెభా-8-37-క.
క్కడఁ జూచిన లెక్కకు
నెక్కువ యై యడవి నడచు నిభయూధములో
నొక్క కరినాథుఁ డెడతెగి
చిక్కె నొక కరేణుకోటి సేవింపంగన్.

టీక:- ఎక్కడన్ = ఎక్కడ; చూచినన్ = చూసినను; లెక్కకునెక్కువ = చాలా ఎక్కువ ఉన్నవి; ఐ = అయ్యి; అడవిన్ = అడవిలో; నడచున్ = వర్తించెడి; ఇభ = ఏనుగుల; యూధము = సమూహము; లోన్ = లోని; ఒక్క = ఒక; కరి = గజ; నాథుడు = రాజు; ఎడతెగి = విడిపోయి; చిక్కెన్ = చిక్కిపోయెను; ఒక = ఒక; కరేణు = ఆడ యేనుగుల; కోటి = సమూహము; సేవింపంగన్ = సేవిస్తుండగా.
భావము:- ఆ అడవిలో ఎక్కడ చూసినా లెక్కలేనన్ని ఏనుగులు తిరుగుతున్నాయి. వాటిలో ఒక గజేంద్రుడు విడిపోయి వెనక బడ్డాడు. ఆడఏనుగులు అనేకం సేవిస్తు అతని వెంట ఉన్నాయి.
రహస్యార్థం: సమిష్టి ఆత్మతత్వం నుండి వ్యష్టిరూపమును పొందడమే, ఆత్మ వలన ఎడబాటు పొందుట, సంసారణ్యంలో చిక్కుట, తప్పిపోవుట.

తెభా-8-38-వ.
ఇట్లు వెనుక ముందట నుభయ పార్శంబులఁ దృషార్థితంబులై యరుగుదెంచు నేనుంగు గములం గానక తెఱంగుదప్పి తొలంగుడుపడి యీశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబు గాకుండుటంజేసి తానును దన కరేణుసముదయంబును నొక్కతెరువై పోవుచు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; వెనుక = వెనుకపక్క; ముందటన్ = ముందుపక్క; ఉభయ = రెండు; పార్శంబులన్ = పక్కలను; తృష = దప్పిక తీర్చుకొనుటను; అర్థితంబులు = కోరునవి; ఐ = అయ్యి; అరుగుదెంచు = కూడ వచ్చుచున్న; ఏనుగు = ఏనుగుల; గములన్ = గుంపులను; కానక = చూడలేక; తెఱంగు = దారి; తప్పి = తప్పిపోయి; తొలంగుడుపడి = ఎడబాసి; ఈశ్వరాయత్తంబు = దైవవశము; ఐన = అయిన; చిత్తంబున్ = మనసు; సంవిత్తంబున్ = తెలివి గలదిగా; కాకుండుట = లేకపోవుట; చేసి = వలన; తానున్ = తను; తన = తన యొక్క; కరేణు = ఆడు యేనుగుల; సముదయంబును = గుంపు; ఒక్క = వేరొక; తెరువు = దారిపట్టినవి; ఐ = అయ్యి; పోవుచు = వెళ్ళుచు.
భావము:- ఆ గజరాజు దైవవశం చేత బుద్ధి సరిగా పనిజేయక తనకు ఎటుపక్క దప్పికతో వచ్చే ఇతర ఏనుగుగుంపులు కనబడక విడిపోయి దారితప్పాడు. తన గుంపులోని ఏనుగుల గుంపుతో వేరేదారి పట్టి పోసాగాడు.
రహస్యార్థం: జీవుడు స్వస్థానాన్ని తప్పి, అన్నమయాది కోశం అనే భౌతిక దేహంతో; జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం మున్నగు ఆవరణల ఉపాధులతో కూడి పరిభ్రమణ శీలుడు అయ్యి.

తెభా-8-39-సీ.
ల్వలంబుల లేఁత చ్చిక మచ్చికఁ-
జెలుల కందిచ్చు నచ్చికము లేక;
నివురుజొంపములఁ గ్రొవ్వెలయు పూఁగొమ్ములఁ-
బ్రాణవల్లభలకుఁ బాలువెట్టు;
నదానశీతల ర్ణతాళంబుల-
యితల చెమటార్చుఁ నువు లరసి;
మృదువుగాఁ గొమ్ముల మెల్లన గళములు-
నివురుచుఁ బ్రేమతో నెఱపు వలపు;

తెభా-8-39.1-తే.
పిఱుదు చక్కట్ల డగ్గఱి ప్రేమతోడ
డాసి మూర్కొని దివికిఁ దొండంబు జాఁచు
వెద వివేకించుఁ గ్రీడించు విశ్రమించు
త్తమాతంగ మల్లంబు హిమతోడ.

టీక:- పల్వలంబుల = నీళ్లుగల చిన్నపల్లములలోని; లేత = లేత; పచ్చిక = పచ్చిగడ్డి పరకలను; చెలుల్ = ప్రియురాండ్ర; కున్ = కు; అందిచ్చున్ = అందించును; అచ్చికము = కొరత; లేక = లేకుండగ; ఇవురు = చిగుళ్ళ; జొంపములన్ = గుత్తులను; క్రొవ్వెలయు = అధికముగ పూసిన; పూ = పూవులతో నున్న; కొమ్మలన్ = కొమ్మలను; ప్రాణ = ప్రాణముతో సమానమైన; వల్లభల్ = భార్యల; కున్ = కు; పాలువెట్టు = పంచిపెట్టును; ఘన = అత్యధికముగ; దాన = మదజలముచే; శీతల = చల్లగా నున్న; కర్ణ = చెవు లనెడి; తాళంబులన్ = విసనకఱ్ఱలతో; దయితల = భార్యల; చెమటన్ = చెమటను; ఆర్చున్ = ఆరబెట్టును; తనువుల్ = దేహములను; అరసి = చూసి; మృదువుగా = మెల్లగా; కొమ్ములన్ = దంతములతో; మెల్లన = మృదువుగా; గళములున్ = మెడలను; నివురుచున్ = రాయుచు; ప్రేమ = ప్రీతి; తోన్ = తోటి; నెఱపు = సాగించును; వలపు = వలపులను.
పిఱుదు = పిఱ్ఱల; చక్కట్ల = భాగముల; డగ్గఱి = దగ్గరకు; ప్రేమ = ప్రీతి; తోడన్ = తోటి; డాసి = చేరి; మూర్కొని = వాసనచూసి; దివి = ఆకాశము; కిన్ = మీదికి; తొండంబున్ = తొండమును; చాచున్ = చాచును; వెద = పశుఋతుధర్మమును; వివేకించున్ = తరచిచూచును; క్రీడించున్ = విహరించును; విశ్రమించున్ = విశ్రాంతి తీసుకొనును; మత్త = మదించిన; మాతంగ = ఏనుగు; మల్లంబు = శ్రేష్ఠము; మహిమ = గొప్పదనముతోటి.
భావము:- అప్పుడా గజేంద్రుడు బల్లిదుడై తన ప్రియురాళ్ళకి నీటి గుంటల పక్కన ఉండే లేతపచ్చికలు మచ్చికతో అందిస్తోంది. చిగుళ్ళు పూలకొమ్మల గుత్తులు పంచిపెడుతోంది. మదజలంతో తడిసిన విసనకఱ్ఱల్లాంటి పెద్దపెద్ద చెవులతో వాటి చెమటలు ఆర బెడుతోంది. వాటి మెడలకింద మెల్లగా తన దంతాలతో గోకుతు వలపుల ప్రేమ చూపుతుంది. వాటి వెనక్కి ప్రేమగా చేరి వాసన చూసి తొండాన్ని పైకెత్తి ఆకాశానికి చాచి ఋతు సమయాన్ని గుర్తిస్తోంది. క్రీడించి విశ్రమిస్తోంది.
రహస్యార్థం: బలిష్టమైన ఆ గజరాజు అను జీవుడు తన ప్రియురాలు అనగా మనస్సునకు సంతోషం కలిగించాలి అని, ఇంద్రియ విషయాలను నేరవేరుస్తూ, వృత్తులు అనే దంతాలతో అవిద్యను ఆనందింపజేస్తూ ఉన్నాడు.

తెభా-8-40-సీ.
న కుంభముల పూర్ణకు డిగ్గి యువతుల-
కుచములు పయ్యెదకొంగు లీఁగఁ;
న యానగంభీరకుఁ జాల కబలల-
యానంబు లందెల నండగొనఁగఁ;
న కరశ్రీఁ గని లఁకి బాలల చిఱు-
దొడలు మేఖలదీప్తిఁ దోడు పిలువఁ;
న దంతరుచి కోడి రుణుల నగవులు-
ముఖచంద్ర దీప్తుల ముసుఁగు దిగువఁ;

తెభా-8-40.1-తే.
నదు లావణ్యరూపంబుఁలఁచిచూఁడ
నంజనాభ్రము కపిలాది రిదిభేంద్ర
యిత లందఱుఁ దనవెంటఁ గిలినడవఁ;
గుంభివిభుఁ డొప్పె నొప్పులకుప్ప బోలె.

టీక:- తన = తన; కుంభముల = కుంభముల యొక్క; పూర్ణత = నిండుదనమున; కున్ = కు; డిగ్గి = ఓడిపోయి; యువతుల = స్త్రీల; కుచములు = వక్షోజములు; పయ్యెద = పమిట; కొంగులు = కొంగులందు; ఈగన్ = చొరబడగ; తన = తన; యాన = నడకల; గంభీరత = గంభీరత; కున్ = కు; చాలక = సాటిరాలేక; అబలల = స్త్రీల; యానంబుల్ = నడకలు; అందెలన్ = కాలి యందెలను; అండకొనగ = సహాయము పొందగ; తన = తన; కర = తొండము యొక్క; శ్రీన్ = సౌందర్యమును; కని = చూసి; తలకి = చలించిపోయి; బాలల = పిల్లల; చిఱు = చిన్ని; తొడలు = తొడలు; మేఖల = బంగారు మొలతాళ్ళ; దీప్తిన్ = కాంతులను; తోడు = సహాయమును; పిలువన్ = అర్థించగ; తన = తన; దంత = దంతముల; రుచికిన్ = కాంతులకు; ఓడి = సాటిరాలేక; తరుణుల = స్త్రీల; నగవులు = నవ్వులు; ముఖ = మొహము యనెడి; చంద్ర = చంద్రుని; దీప్తులన్ = కాంతులను; ముసుగుదిగువన్ = ముసుగువేసికొనగ; తనదు = తన యొక్క.
లావణ్య = సుందరమైన; రూపంబున్ = రూపమును; తలచి = భావించికొని; చూడన్ = చూచుటకు; అంజన = ఈశాన్య దిగ్గజము భార్య అంజనావతి {అంజనావతి ఆది - దిగ్గజముల భార్యలు, 1తూర్పు అభ్రము 2ఆగ్నేయము కపిల 3దక్షిణము పింగళ 4నైఋతి అనుపమ 5పడమర తామ్రపర్ణి 6వాయవ్యము శుభ్రదంతి 7ఉత్తరము అంగన 8ఈశాన్యము అంజనావతి}; అభ్రము = తూర్పు దిగ్గజము భార్య; కపిల = ఆగ్నేయ దిగ్గజము భార్య; ఆది = మొదలగు; హరిదిభేంద్ర = దిగ్గజముల {హరిదిభేంద్రము - హరిత్ (దిక్కు లందలి) ఇభ (గజము) ఇంద్రము (శ్రేష్ఠమైనది), దిగ్గజము}; దయితలు = భార్యలు; అందఱున్ = ఎల్ల; తన = తన; వెంటదగిలి = వెంటబడి; నడవన్ = రాగా; కుంభి = గజ; విభుడు = రాజు; ఒప్పెన్ = చక్కగా ఉండెను; ఒప్పులకుప్ప = అందాలరాశి; పోలెన్ = వలె;
భావము:- గజేంద్రుని కుంభస్థలాల నిండుదనానికి సరితూగలేక లోకం లోని స్త్రీల స్తనాలు పైటకొంగుల మాటు కోరాయి. అతని నడకల ఠీవికి సరితూగలేక అతివల పాదాలు అందెల అండ తీసుకొన్నాయి. అతని తొండం సిరికి తూగలేక కన్నెల చిన్ని తొడలు ఒడ్ఢాణాల కాంతులను తోడు తెచ్చుకొన్నాయి. అతని దంతాల కాంతికి సరితూగలే నందుకే ఉవిదల చిరునవ్వులు ముఖ చంద్రకాంతుల ముసుగు వేసుకొన్నాయి. అతని లావణ్య స్వరూపాన్ని చూడగోరి అంజనావతి, అభ్రమువు, కపిల మొదలైన దిగ్గజాల భార్యలు వెంటబడ్డాయా అన్నట్లు ఆడ ఏనుగులు అనుసరిస్తుండగా ఒప్పులకుప్పలా ఆ గజరాజు ఒప్పి ఉన్నాడు. (చక్కటి స్వభావోక్తి అలంకారం ఆస్వాదించండి)
రహస్యార్థం: గజేంద్రుడు అను జీవుడు పంచకోశయుక్తుడు అయీ; సప్తధాతువులతోనూ, బహిరంతర ఇంద్రియాలతోనూ, దశవిధ ప్రాణాలతోనూ, శబ్దాది విషయాలతోనూ; శరీరత్రయాన్వితుడు అయీ; అవిద్య అనే కన్యకతో పరిణయం కోసం అలంకృతుడైన పెళ్ళికొడుకులా కనబడుతున్నాడు.

తెభా-8-41-వ.
మఱియు నానాగహన విహరణ మహిమతో మదగజేంద్రంబు మార్గంబుఁ దప్పి, పిపాసాపరాయత్త చిత్తంబున మత్తకరేణువుల మొత్తంబునుం దానునుం జని చని.
టీక:- మఱియున్ = ఇంకను; నానా = అనేకమైన; గహన = అడవుల యందు; విహరణ = సంచరించుటల; మహిమ = అధిక్యము; తోన్ = తోటి; మద = మదించిన; గజ = ఏనుగు; ఇంద్రము = శ్రేష్ఠము; మార్గంబున్ = దారి; తప్పి = తప్పిపోయి; పిపాసా = దప్పికకు; పరాయత్త = లోబడిన; చిత్తంబునన్ = మనసుతో; మత్త = మదించిన; కరేణువుల = ఆడ యేనుగుల; మొత్తంబునున్ = సమూహము; తానున్ = తను; చనిచని = ప్రయాణంబు సాగించి;
భావము:- ఇంకా గజరాజు అనేక అడవులలో తిరిగిన ఆయాసం వలన దప్పికతో స్వాధీనం తప్పిన మనస్సుతో దారి తప్పాడు. అలా ఆడ ఏనుగులు అన్నిటితోపాటు చాలా దూరం వెళ్ళాడు.
రహస్యార్థం: జీవుడు పునరపి జననం అనుకుంటూ అనేక జన్మలు పొందడానికి సిద్ధపడి, నివృత్తి మార్గం నుండి తప్పిపోయి, ప్రవృత్తి మార్గంలో ప్రవేశించాడు

తెభా-8-42-మ.
టఁ గాంచెం గరిణీవిభుండు నవఫుల్లాంభోజకల్హారమున్
దిందిందిర వారముం, గమఠ మీగ్రాహ దుర్వారమున్,
హింతాల రసాల సాల సుమనో ల్లీకుటీతీరముం,
టులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబుఁ గాసారమున్.

టీక:- అటన్ = అక్కడ; కాంచెన్ = చూచెను; కరణీ = గజ; విభుండు = రాజు; నవ = తాజా; పుల్ల = విచ్చుకొన్న; అంభోజ = కమలములు; కల్హారమున్ = కలువలు; నటత్ = ఆడుతున్న; ఇందిందిర = తుమ్మెదల {ఇందిందిరము - వ్యు. పద్మసంపదలతో కూడినది (విద్యార్థి కల్పతరువు)}; వారమున్ = సమూహము కలిగినది; కమఠ = తాబేళ్ళు; మీన = చేపలు; గ్రాహ = మొసళ్ళుతోను; దుర్వారమున్ = నివారింపరానిది; వట = మఱ్ఱి; హింతాల = తాడి; రసాల = తియ్యమామిడి; సాల = మద్ది; సుమనో = పువ్వుల; వల్లీ = లతా; కుటీ = కుంజములు గల; తీరమున్ = గట్లు కలిగిన; చటుల = మిక్కిలి వేగముగా; ఉద్ధూత = ఎగిరెడి; మరాళ = హంసలు; చక్ర = చక్రవాకములు; బక = కొంగల; సంచారంబున్ = విహరించుటలు కలిగినది; కాసారమున్ = మడుగును.
భావము:- అక్కడ ఒకచోట గజేంద్రుడు ఒక మడుగుని చూసాడు. ఆ చెరువులో కొత్తగా విచ్చుకున్న కమలాలు ఉన్నాయి. అక్కడ తుమ్మెదల గుంపులు తిరుగుతున్నాయి. అది తాబేళ్ళు చేపలు మొసళ్ళుతో దాటరానిదిగా ఉంది. దాని గట్టు మీద మఱ్ఱి, తాడి, మామిడి, మద్దిచెట్లు పూల తీగలు ఉన్నాయి. ఇంకా హంసలు, చక్రవాకాలు, కొంగలు విహరిస్తున్నాయి.
రహస్యార్థం: కరణీ విభుడు అంటే అంతకరణుడూ, ముఖ్య అహంకార విషయుడు అగు పారమార్దిక జీవుడు. ఆ జీవుడు నవపుల్లాంభోజ అను అనాద్యవిద్యా వాసనలతో పరిమళించే హృదయ కమలాల వలన వికాసం పొందిన తుమ్మెదలు అను తృష్ణ పరంపర. క్షణ క్షణం పాతాళం, అంతరిక్షం, దిగంతాలు పట్టి తిరుగుతూ ఉంటుంది. అలాంటి సంకల్ప బావ పరిగళితమైనట్టి తృష్ణ అను తుమ్మెదలు కల లోభం, మోహం, కామం మున్నగు వాటిచే నివారించబడే జలచరాలు కలది, సుమనో వల్లీ కుటీర తీరం అంటే శుద్ధసాత్వికం అను కుటీర తీరం. భయకారణాలైన మోహం, అసూయ, దర్పం మొదలైనవాటితో చలించిపోచున్న కాసారాన్ని చూశాడు.