పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/కూర్మావతారము

కూర్మావతారము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-201-క.
నిధి జలముల లోపల
మునిఁగెడి గిరిఁ జూచి దుఃఖమునఁ జింతాబ్ధిన్
మునిఁగెడి వేల్పులఁ గనుఁగొని
జాక్షుఁడు వార్ధినడుమ వారలు చూడన్.

టీక:- వననిధి = సముద్రము {వననిధి - వనము (నీటి)కి నిధి, సముద్రము}; జలము = నీటి; లోపలన్ = అందు; మునిగెడి = మునిగిపోతున్న; గిరిన్ = కొండను; చూచి = చూసి; దుఃఖమునన్ = శోకముతో; చింత = శోకమనెడి; అబ్ధిన్ = సముద్రమువ; మునిగెడి = మునిగిపోతున్న; వేల్పులన్ = దేవతలను; కనుగొని = చూసు; వనజాక్షుడు = హరి; వార్ధిన్ = సముద్రపు; నడుమన్ = మధ్యలో; వారలు = వారు; చూడన్ = చూచుచుండగ.
భావము:- దేవతలు అందరూ అలా ములిగిపోతున్న మందరపర్వతాన్ని చూస్తూ అంతులేని దుఃఖసాగరంలో మునిగిపోతుంటే చూసిన విష్ణుదేవుడు, వారు చూస్తుండగానే సముద్రం మధ్య లోకి దిగాడు.

తెభా-8-202-సీ.
వరనై లక్ష యోనముల వెడలుపై-
డుఁ గఠోరమునైన ర్పరమును
దనైన బ్రహ్మాండమైన నాహారించు-
నతరంబగు ముఖహ్వరంబు
కల చరాచర జంతురాసుల నెల్ల-
మ్రింగి లోఁగొనునట్టి మేటి కడుపు
విశ్వంబుపై వేఱు విశ్వంబు పైఁబడ్డ-
నాఁగినఁ గదలని ట్టి కాళ్ళు

తెభా-8-202.1-తే.
వెలికి లోనికిఁ జనుదెంచు విపుల తుండ
మంబుజంబులఁ బోలెడు క్షి యుగము
సుందరంబుగ విష్ణుండు సురలతోడి
కూర్మి చెలువొంద నొక మహా కూర్మ మయ్యె.

టీక:- సవరన్ = చక్కనిది, చదునైనది; ఐ = అయ్యి; లక్ష = లక్ష (1,00,000); యోజనంబుల = యోజనముల; వెడలుపు = వెడల్పుగలది; ఐ = అయ్యి; కడు = మిక్కిలి; కఠోరమున్ = గట్టిది; ఐన = అయిన; కర్పరమును = తాబేటిడిప్ప; అదనైనన్ = ఆకలివేస్తే; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; ఐనన్ = అయినను; ఆహారించు = తినగలిగెడి; ఘనతరంబు = బహుపెద్దది; అగు = అయిన {ఘనము - ఘనతరము - ఘనతమము}; ముఖ = నోరు యనెడి; గహ్వరంబు = గుహ; సకల = అఖిలమైన; చరాచర = జగత్తునందలి; జంతు = జీవ; రాసులన్ = జాలమును; ఎల్లన్ = సర్వమును; మ్రింగి = మింగేసి; లోగొనున్ = ఇముడ్చుకొనగలిగిన; అట్టి = అటువంటి; మేటి = పెద్ద; కడుపు = కడుపు; విశ్వంబు = విశ్వము; పైన్ = మీద; వేఱు = మరొక; విశ్వంబు = విశ్వము; పైన్ = మీద; పడ్డన్ = పడుట; ఆగినన్ = మొదలిడినను; కదలని = చలించని; అట్టి = లాంటి; కాళ్ళు = కాళ్ళు.
వెలి = బయట; కిన్ = కు; లోని = లోపలి; కిన్ = కి; చనుదెంచు = కదలాడెడి; విపుల = పెద్ద; తుండమంబు = తొండము, తాబేలుతల; అంబుజంబులన్ = పద్మములను {అంబుజము - అంబువు (నీటియందు) జము (పుట్టునది), పద్మము}; పోలెడు = వంటి; అక్షి = కన్నుల; యుగమున్ = జంటతో; సుందరంబుగన్ = అందముగా; విష్ణుండు = హరి; సురల = దేవతల; తోడి = తోటి ఉన్న; కూర్మి = ప్రేమ; చెలువొందన్ = బయల్పడగ; ఒక = ఒక; మహా = పెద్ద; కూర్మమున్ = తాబేలుగా; అయ్యెన్ = అవతరించెను.
భావము:- విష్ణుమూర్తి దేవతలపై గల ప్రేమను వెల్లడిచేస్తూ, మహాకూర్మావతారం ఎత్తాడు. ఆ పెద్ద తాబేలు పైడిప్ప చక్కగా గట్టిగా లక్ష యోజనాల వెడల్పుతో ఉంది. దాని నోరు ఆకలేసిందంటే మొత్తం బ్రహ్మాండాన్ని సైతం మింగగలంత పెద్దది. కడుపు లోకంలోని జీవరాశి అంతటిని లోపల ఇముడ్చుకోగలంతటిది. కాళ్ళు విశ్వగోళం మీద విశ్వగోళం పడ్డా తట్టుకోగలంతటి బలమైనవి. లోపలికి బయటకు కదలాడే పెద్ద తల, కమలాల వంటి చక్కనైన రెండు కళ్ళు ఉన్నాయి. అలా బహు సుందరమైన రూపంతో మహావిష్ణువు అందగిస్తున్నాడు.

తెభా-8-203-మ.
ఠంబై జలరాశిఁ జొచ్చి లఘు ముక్తాశుక్తి చందంబునన్
దద్రీంద్రము నెత్తె వాసుకి మహానాగంబుతో లీలతో
రేంద్రాదులు మౌళికంపములతో "నౌనౌఁగదే! బాపురే!
లాక్షా! శర"ణంచు భూదిశలు నాకాశంబునున్ మ్రోయఁగన్.

టీక:- కమఠంబు = తాబేలు {కమఠము - జలమునందు వసించునది, తాబేలు}; ఐ = అయ్యి; జలరాశిన్ = సముద్రమునందు; చొచ్చి = ప్రవేశించి; లఘు = చిన్న; ముక్తా = ముత్యపు; శుక్తి = చిప్ప; చందంబునన్ = వలె; నమతన్ = సుళువుగా; అద్రి = పర్వత; ఇంద్రమున్ = శ్రేష్ఠమును; ఎత్తె = పైకెత్తెను; వాసుకి = వాసుకి యనెడి; మహా = గొప్ప; నాగంబున్ = సర్పము; తోన్ = తోపాటు; లీల = క్రీడించుట; తోన్ = తోటి; అమరేంద్ర = దేవేంద్రుడు; ఆదులు = మొదలగువారు; మౌళి = తలల; కంపముల్ = ఊపుటలు; తోన్ = తో; ఔఔ = మేలుమేలు; కదే = కదా; బాపురే = ఔరా; కమలాక్ష = శ్రీహరి {కమలాక్షుడు - కమలములవంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; శరణు = శరణు; అంచున్ = అని కేకలిడిరి; భూ = భూమండలము; దిశలు = దిక్కులు; ఆకాశంబున్ = ఆకాశము; మ్రోయగన్ = మారుమోగునట్లు.
భావము:- చిన్న ముత్తంచిప్పంత సుళువుగా, కూర్మరూపధారి అయిన విష్ణువు సముద్రం లోపలకి వెళ్ళాడు.వాసుకి భూరి నాగేంద్రునితో సహా మందర మహాపర్వతాన్ని అవలీలగా పైకెత్తాడు. ఇది చూసి దేవేంద్రుడు మున్నగువారంతా సంతోషంతో తబ్బిబ్బై, తలలు ఊపుతూ భూమండలం నలుదిక్కులా, ఆకాశం అంతా మారుమ్రోగేలా “ఆహా! ఓహో! మేలు మేలు శ్రీహరీ! పద్మాక్షా! శరణం శరణం” అంటూ జయధ్వానాలు చేయసాగారు. . .

తెభా-8-204-వ.
ఇవ్విధంబున.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగా.
భావము:- ఇలా మందర పర్వతాన్ని ఎత్తి. . .

తెభా-8-205-క.
రిగాండ్రలోన నొకఁడట
రి గడవకుఁ గుదురు నాఁక త్రాడఁట చేరుల్;
రి గవ్వంబును దా నఁట
రిహరి! హరిచిత్రలీల రియే యెఱుఁగున్.

టీక:- తరిగాండ్ర = చిలికెడివారి; లోనన్ = లోపల; ఒకడు = ఒకడు; అటన్ = అక్కడ; తరిగడవ = మజ్జిగకుండైనసముద్రము; కున్ = అందలి; కుదురున్ = కుదురు; నాక = సర్పపు; త్రాడు = తాడు; అటన్ = అక్కడ; చేరుల్ = చేరినవారు; తరి = చిలికెడి; కవ్వంబున్ = కవ్వము; తాన్ = తనే; అటన్ = అట; హరిహరి = ఆహా; హరి = విష్ణుని; చిత్ర = విచిత్రమైన; లీలన్ = లీలలను; హరియే = విష్ణువునకే; యెఱుగున్ = తెలియును.
భావము:- ఆహా! ఎంతటి విచిత్రమైన విష్ణులీలలు? సముద్రాన్ని చిలికేవారిలో ఒకడిగా ఉన్నాడట, పాల సముద్రం అనే పెరుగుకుండకు కుదురు తానేనట, చిలికే కవ్వంగా ఉన్న మందరపర్వంతం, కవ్వానికి కట్టిన చిలుకుతాడుగా ఉన్న మహానాగుడు వాసుకి తానేనట. ఆహా! విష్ణువు లీలలు విష్ణువుకే తెలుసు.

తెభా-8-206-ఆ.
లధిఁ గడవ చేయ శైలంబుఁ గవ్వంబు
చేయ భోగిఁ ద్రాడు చేయఁ దరువ
సిరియు సుధయుఁ బడయ శ్రీవల్లభుఁడుఁ దక్క
నొరుఁడు శక్తిమంతుఁ డొకఁడు గలఁడె?

టీక:- జలధి = సముద్రము; కడవన్ = కుండగా; చేయ = చేయుటకు; శైలంబున్ = కొండను; కవ్వంబున్ = కవ్వముగా; చేయన్ = చేయుటకు; భోగిన్ = పామును; త్రాడున్ = తాడుగా; చేయన్ = చేయుటకు; తరువన్ = చిలుకుటకు; సిరియున్ = లక్ష్మీదేవి; సుధయున్ = అమృతము; పడయన్ = పొందుటకు; శ్రీవల్లభుడున్ = హరి {శ్రీవల్లుడు - శ్రీ (లక్ష్మీదేవికి) వల్లభుడు (పతి), విష్ణువు}; తక్కన్ = తప్పించి; ఒరుడు = ఇతరుడు; శక్తిమంతుడు = సామర్థ్యముగలవాడు; ఒకడు = ఇంకొకడు; కలడె = ఉండగలడా, లేడు.
భావము:- సముద్రాన్ని కుండగానూ, పర్వతాన్ని కవ్వంగానూ, సర్పాన్ని కవ్వంతాడుగానూ చేయగలవారూ. ఆపై చిలికి వెన్నతీసినట్లు లక్ష్మిని, అమృతాన్ని సంపాదించగల సమర్థత కలవారూ ఆ లక్ష్మీపతి శ్రీమన్నారాయణుడు తప్ప మరొకరు ఎవ్వరూ లేరు కదా!

తెభా-8-207-ఆ.
గొల్లవారి బ్రతుకు గొఱఁతన వచ్చునె
గొల్లరీతిఁ బాలకుప్ప ద్రచ్చి
గొల్లలైరి సురలు గొల్లయ్యె విష్ణుండు
చేటు లేని మందు సిరియుఁ గనిరి.

టీక:- గొల్లవారి = గోల్లవారి; బ్రతుకు = జీవితము; కొఱత = తక్కువది; అనన్ = అనుట; వచ్చునె = సాధ్యమా, కాదు; గొల్ల = గొల్లవారి; రీతిన్ = వలె; పాలకుప్పన్ = పాలసముద్రమును {పాలకుప్ప - పాలు+కుప్ప, సముద్రము}; త్రచ్చి = చిలికి; గొల్లలు = గొల్లవారు; ఐరి = అయ్యారు; సురలు = దేవతలు; గొల్ల = గొల్లవాడు; అయ్యెన్ = అయ్యెను; విష్ణుండు = హరి; చేటు = మరణము; లేని = లేకపోవుటను కలిగించెడి; మందు = ఔషధమును; సిరియున్ = లక్ష్మీదేవిని; కనిరి = పొందగలిగిరి.
భావము:- గొల్ల వారి వృత్తి దేనికి తీసిపోయేది కాదు. పాలసముద్రాన్ని చిలికి, దేవతలు గొల్లవారు అయి అమరత్వాన్ని అందించే అమృతాన్నీ; శ్రీమహావిష్ణువు గొల్ల అయి శ్రీమహాలక్ష్మినీ పొందగలిగారు.