పల్లెపదాలు/గొడ్డలిపాట

గొడ్డలిపాట

నరకవయ్య నరకవయ్య నరకవయ్య
'వాడేమికొట్టాడు?' 'చింత చెట్టు'
'వీడేమికొట్టాడు' 'చిన్న చెట్టు '
'నీవేమికొట్టివు' 'ములగ చెట్టు '
నరకవయ్య నరకవయ్య నరకవయ్య
వాడేమికొట్టాడు ఓహో చింత చెట్టు
వీడేమికొట్టాడు అయ్యో చిన్న చెట్టు
నీవేమికొట్టావు ఇహిహీములగచెట్టు

ములగ చెట్టు మహా పెళుసు. కొమ్మనట్టిన పటుక్కుమని విరుగును. మొదటివాడు వస్తాదు చింత చెట్టును కొట్టినాడు. అడిగినవాడు ములగ చెట్టు కొట్టినాడని "ఇహిహీ " నవ్వుతున్నారందరూ. వ్యవసాయముకొరకు అడివినరుకుతున్న దృశ్యమిది.

దమ్మిడీ

అన్నిటికి నీవేగతి దమ్మిడీ
నీవెంతపని చేశావె దమ్మిడీ
నిను పెట్టెలోనే పెట్టినానె దమ్మిడీ
నను మోసగించి పోయినావె దమ్మిడీ
అందరికి నీవెగదా దమ్మిడీ
ఏకాదశినాడు, రాకాసినాడు
నీకోసం వచ్చినానె దమ్మిడీ

పాపము రాళ్లుకొట్టి సంపాదించిన సొమ్ము ! పోయినచో కష్టముకదా ! అందరికీ దమ్మిడియే గతియట!

పార పదము

——ఇదిగో ఈ పారపదము వినండి. సారను ముంచినపుడు మొదటి భాగమున్నూ మట్టిని విసరినప్పుడు రెండోభాగమున్నూ పాట ! ఊపిరి శరగవద్దా మరి?

ఏయూరు, భామా
గుంటూరు. నాది
ఏమినీ, పేరు
పేరుగు, న్నమ్మ

ఈ పాటలో కూడా ఆదేలయ. ఒక పాదము పూర్తి అయ్యే వరకు రెండు పాదాల మన్ను పోగవు తుంది.

పార పదం

వచ్చె వచ్చె వానజల్లు జాలమదియేల
గుచ్చుకొనే రేగుముల్లు జాలమదియేల
చక్కగొట్టే చిన్నవాడా జాలమదియేల
చక్కవిరిగి చంపదగిలే జాలమదియేల
వచ్చే వచ్చె వానజల్లు జాలమదియేల
గుచ్చుకొనె రేగుముల్లు జాలమది యేల

చక్క విరిగి చెంపదగులుటలూ, ముళ్లు గుచ్చు కొనుకలూ ఈ పాటలలో తరుచు వినబడుతాయి. ముల్లు గుచ్చుకొనుట పరిపాటియే. చెక్కలు ఎగురుట కూడా సకృత్తు చెంపదగులుట వింత.