పదబంధ పారిజాతము/చెప్పుకాలు

చెప్పి చూప వశము కాదు

  • ఇంత అంత అని వర్ణింప నలవి కాదు.
  • "శ్రీకాంతుఁడ నీ మహిమ చెప్పి చూప వశమా!" తాళ్ల. సం. 7. 28.

....చెప్పి చెప్పగ వలె

  • ఈ విషయంలో వీరే ముఖ్యులు అనుపట్ల వారి నెవరినో పే రెత్తి - చెప్పి ఇంకొకరిని చెప్పవలెను అను రీతిగా ఉపయోగించే పలుకు బడి.
  • "ముని భీతిలో మునిఁగినరాజు నుద్ధరిం, పఁగ మమ్ముఁ జెప్పి చెప్పవలెఁ గాదె." శ్రవ. 2. 80.
  • "వ్యాకరణశాస్త్రంలో తాతా రాయుడుశాస్త్రిగారిని చెప్పి ఇం కెవరి నైనా చెప్పాలి." వా.

చెప్పుకాలు

  • చెప్పు వేసుకొన్న కాలు. బసవ. 3. 72.
  • రూ. చెప్పుగాలు.

చెప్పుకింది తేలు లాగా

  • కిమక్కు మనకుండా, చచ్చి నట్టు, అతివిధేయంగా.
  • "అత్తగారి పేరు చెబితే చాలు. వీడు చెప్పుకింది తేలులాగా పడి ఉంటాడు." వా.
  • చూ. కుక్కిన పేనులాగా.

చెప్పుగాలు

  • చెప్పు వేసుకొన్న కాలు.
  • "పావన నిర్మాల్యము చెప్పుఁగాలఁ గొని పోవం ద్రోచి." కా. మా. 3. 105.
  • చూ. చెప్పుకాలు.

చెప్పుటట్టలు

  • చెప్పుల కడుగున నున్న చర్మంరేకులను అట్టలు అంటారు.
  • "చెప్పుటట్టలు శోధించి సిగలు విప్పి." ఆము. 7. 14.
  • "దళమైన అట్టలు వేసి కుడితే చెప్పులు నాలుగునెల లుంటాయి." వా.

చెప్పుడుమాటలు

  • దుర్బోధలు.
  • "చెప్పుడు మాటలు విని వాడు చెడి పోయాడు. మనం ఇప్పు డేం చెప్పినా వాడి చెవి కెక్కదు." వా.

చెప్పులలోని కాళ్లు

  • ఎప్పుడూ ఒకచోట నిలువని వా రనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "చెప్పులలోని కా ళ్లనుప్రసిద్ధికి లోనయి యేను బోయితిన్." నానా. 222.

చెప్పుల్లో కాళ్లు పెట్టుకొని

  • వెంటనే తిరిగి పోవుటకు సిద్ధంగా ఉండి. తొందరపడుతూ అనుట.
  • "నువ్వు ఎప్పుడు వచ్చినా చెప్పుల్లో కాళ్లు పెట్టుకొని వస్తావు. ఒక పూట హాయిగా కబుర్లు చెప్పుకుందా మంటే కుదరడం లేదు." వా.
  • "అత నెప్పుడు వచ్చినా చెప్పుల్లో కాళ్లు పెట్టుకొని వస్తాడు. ఏం మాట్లాడతాం? ఏం చేస్తాం?" వా.

చెప్పెడి దేమి?

  • చెప్పడాని కే ముంది? ఏం చెప్పగల మిక?
  • "చెప్పెడి దేమి లతాంగి...." కళా. 6. 265.

చెమట ఓడ్చు

  • శ్రమించు.
  • "ఆ పొలం వాడు చెమటోడ్చి సంపాయించాడు." వా.

చెమటకాయలు

  • చెమటవలన ఒంటిపై లేచే పొక్కులు.

చెమటకోక

  • వేటలో ఉపయోగించే ఒక విధమైన బట్ట.
  • "అచటఁ జెమటకోక యమరించి కుడి చేతఁ, గడిఁదిడేగఁ బట్టి." ద్వా. 1. 235.
  • ఇదే చేతిగుడ్డ, చేతి రుమాలు అయినా కావచ్చును.

చెమటగొట్టు

  • చెమట కంపు కొట్టేవాడు. మోటు.

చెమటచిత్తడి

  • విపరీత మైన చెమట.
  • 'చిత్తడిజల్లు' లోని చిత్తడి వంటిది.
  • "....చెమటచిత్తడిఁ గ్రొత్త చెలువు గాంచిన వళుల్, మొలనూళ్ల కాంతికి బలిమి నొసఁగ." కళా. 1. 147.

చెమట నెత్తురుగ తలచు

  • అతి గారాబంతో చూచు. ఒక్కచుక్క చెమట పట్టినా 'అయ్యో మా వానికి ఒక్క చుక్క నెత్తురు పోయెనే' అన్నంత గారాబంతో చూచు - అనుట.
  • "చెమట నెత్తురు గాఁగఁ జిత్తమ్మునఁ దలంచి, యర్మిలిఁ బెనుచు మదంబఁ దలఁచి." విక్ర. 6. 59.
  • చూ. చెమట నెత్తురు గాగ దలచు.

చెమట నెత్తురు గాగ దలచు.

  • అతిప్రేమతో చూచు.
  • చెమట పట్టినా రక్తము కారి నట్లుగా తలచుట అతి ప్రేమ సూచకము కదా.
  • "నెఱి నాదు చెమట నెత్తురు గాఁగఁ దలఁచెడు, మఱఁది కానలఁ గాడుపఱచె నెట్టు." పద్మపు. 9. 17.
  • చూ. చెమట నెత్తురుగ తలచు.

చెమట నెత్తురు గాగ సేవించు

  • అతిప్రేమతో చూచు.
  • "చెమట నెత్తురు గాఁగ సేవించు మిత్రులును." శృం. శా. 3. 77.
  • చూ. చెమట నెత్తురుగ తలచు.

చెమట పట్టు

  • చెమ్మటలు పోయు.
  • "బాగా చెమట పట్టేదాకా బస్కీలు తీస్తే బలం వస్తుంది." వా. చెమటపాత
  • బ్రౌన్.
  • చూ. చెమటకోక.

చెమట పోయు

  • చూ. చెమట పట్టు.

చెమటియావు

  • చిత్రవర్ణము గల గోవు. ఆంధ్ర. భా. ద్వి. 262.

చెమరుకాకి

  • బొంతకాకి.
  • ద్రోణకాకము. పార్వ. 6. 66.

చెమరుగాయ

  • బ్రౌన్.
  • చూ. చెమటకాయ.

చెమరు నెత్తురు గాగ దలచు

  • అత్యాదరంతో చూచు.
  • "...పతియెడ, భక్త్యనురాగ సంభ్రమము లెసఁగ, సమసుఖదు:ఖుఁ డై చెమరు నెత్తురు గాఁగఁ, దలఁచుచు." భార. శాం. 2. 369.
  • చూ. చెమట నెత్తురుగా దలచు.

చెమరు నెత్తురు నగు

  • రక్తబాంధవ్యము కల.
  • "చెమరు నెత్తురు నవు బంధు సమితి గరము, బ్రీతి నఱకాళులకు నఱచేతు లొగ్గ, నునికి యెక్కడ?" నిర్వ. రా. 5. 104.

చెమరుబోతు

  • చూ. చెమరుకాకి

చెమ్మ యుఱుకు

  • చెమ్మగిల్లు.
  • "బహుళ జలప్లవమాన, ద్రుహిణాం డము చెమ్మ యురికి..." మను. 3. 18.

చెయికావలి

  • చేదోడు.
  • సమయానికి పనికి వచ్చునది. కాశీయా. 31.
  • "దూరాభారం పోతున్నావు. పది రూపాయలు చెయి కావలిగా ఉంచుకో." వా.

చెయి గాచు

  • అభయ మిచ్చు.
  • "పాపాత్మురాలిఁ, జెయి గాచునేరమిం జింతిల్ల వలసె." వర. రా. బా. పు. 96. పంక్తి. 10.
  • చూ. చే కాచు.

చెయి చాచు

  • అడుగుకొను; కోరు.
  • "అ, బ్బిసరుహచిత్రవంశ్యుఁ డొక బిత్తరికై చెయి చాఁచెఁ గామినీ, వ్యసనపరాయణుం డెఱుఁగునా? నిజ గౌరవవైభవోన్నతిన్." సుద. 5. 156.
  • "నే నింతకు ముం దెన్నడూ ఒకరి ముందు చెయి చాచి యెఱుగను." వా.

చెయి చేసుకొను

  • దండించు; తన్ను.
  • "చెయిఁ జేసుకొన్నది సీత నా మీఁద." వర. రా. యు. పు. 40. పంక్తి. 12.

చెయి దప్పి పోవు

  • చేయి జాఱిపోవు.
  • "ఎసలార మ్రొక్కించి యింపులఁ బొదలె, పురిటిలోఁ జెయి దప్పి పోయిన కొడుకు." ద్విప. కల్యా. పు. 39. చెయి పట్టు
  • కాపాడు; పెండ్లాడు. బ్రౌన్.

చెయిపట్టుగా పట్టి యిచ్చు

  • పట్టించి యిచ్చు.
  • "చెయిపట్టుగా పట్టి నాకు ఒప్పించక." కాశీయా. 107.

చెయి మించు

  • తన్ను మించి పోవు.
  • "తనకు చెయి మించినట్టిఁడు ధరణి లేని, ఘనుఁడు." చిత్రభా. 2. 107.
  • 2. తనవశం దాటి పోవు.
  • "చెయి మించిన తరువాత ఏ మనుకునీ ఏం లాభం రా." వా.

చెయి మీఱు

  • 1. తన్ను; కొట్టు.
  • "మేలముతోడఁ బిల్చి చెయి మీఱెద నంచును వేంకటేశ్వరా." తాళ్ల. శృం. శ.
  • 2. వశం దాటి పోవు.

చెయి వ్రేసి హసించు

  • చేతులు తట్టి పరిహాసము చేయు.
  • "అనుచు నొండొరుఁ జెయి వ్రేసి యపహసింప." ఉ. హరి. 4. 161.

చెయ్యి కాల్చుకొను

  • సొంతగా వంట చేసుకొను.
  • "మా ఆవిడ పుట్టింటికి వెళ్లడంతో నేనే చెయ్యి కాల్చుకో వలసి వస్తూ ఉంది." వా.
  • రూ. చెయి కాల్చుకొను.
  • చూ. చేయి కాల్చుకొను.

చెయ్యి చూచు

  • హస్తరేఖలను పరీక్షించి భవిష్యత్తు చెప్పు.
  • "నాకు చాలా డబ్బు వస్తుందని వాడు చెయ్యి చూచి చెప్పాడు."

చెయ్యిచ్చు

  • ఆసరా యిచ్చు.
  • చూ. చే యిచ్చు.

చెయ్యి తడి చేయు

  • లంచ మిచ్చు.
  • "ఆ గుమాస్తా చెయ్యి తడి చేస్తేనే కానీ, ఆ కాగితం బయట పడేటట్టు లేదు." వా.

చెయ్యి తడి యగు

  • లంచము దొరకు. కొత్త. 188.

చెయ్యి తిరిగిన

  • ఆరితేరిన.
  • "వాడు కవిత్వంలో బాగా చెయ్యి తిరిగినవాడు." వా.
  • రూ. చేయి తిరిగిన.

చెయ్యి విదిలించని

  • ఏదో కొంతయినా యివ్వని; అతిలుబ్ధు డైన.
  • "అతను అంత ఆస్తి ఉన్నా ఎవ రడిగినా యింత చెయ్యి విదిలించనివాడు." వా.

చెయ్యి విప్పుకొలుపు

  • నమస్కారం.

చెయ్యి వూరికే లేదు

  • ఏదో పనిమీదున్నాను అనుట. కొత్త. 37. చె య్యీడు
  • రెండుమూర లున్న బట్ట.

చెయ్యెత్తి చూపు

  • తప్పు పట్టు.
  • "అమరులు మమ్ముఁ, జెయ్యెత్తి చూప నొచ్చిన నోరఁ బలుక, నేరుతురొ." వర. రా. యు. పు. 249. పంక్తి. 16.

చె య్యొగ్గు

  • అంజలించు, ప్రార్థించు.
  • "చేకొని నీవే మన్నించఁ జెయ్యొగ్గేఁ గాని." తాళ్ల. సం. 10. 2.

చెరకుపన్నిద మాడుతెఱగున

  • పందాలు వేసుకొని చెఱకును నఱకినట్లు.
  • "చెఱకు పన్నిద మాడు తెఱఁగున గొడ్డండ్ల, నడుములు రెండుగా నఱికి నఱికి." కవిక. 2. 169.

చెరగున ముడి వేసుకొను

  • వశవర్తినిగా చేసుకొను. బాల. 184.

చెరచెర

  • త్వరగా, శీఘ్రంగా.
  • "చెర చెరా నడిస్తే గానీ మనం వేళకు వెళ్ళ లేము." వా.

చెరపనచేట

  • వెధవ. కుక్కు. 40.
  • చూ. చెఱపనచేట.

చెరలాట లాడు

  • చెరలాడు, సరస మాడు.
  • "చిలుకలు పిల్లులు చెరలాట లాడు." వా.

చెరలాడు

  • 1. సరస మాడు; ఆడుకొను.
  • "మత్తిల్లు వ్యాఘ్రడింభములతోఁ జెరలాడు." రుక్మాం. 3. 104.
  • 2. జీరాడు.
  • "చెక్కుటద్దములపైఁ జెరలాడునప్పుడు, కస్తూరికాపత్రకములఁబోలె." శృం. నైష. 6. 103.

చెరలు కొట్టు

  • బుసకొట్టు, ఉత్సాహంతో చెలరేగు. శ్రీరం. 2. 295.

చెరవు వెట్టు

  • బలి చేయు, నఱకు.
  • "అని గొఱియలఁ జెరవు వెట్టి." సింహ. 1. 189.

చెర వెట్టుకొను

  • చెఱ పట్టు.

చెరువుకోడి '*నీటికోడి. హంస. 3. 12. చెర్లాట మాడు

  • సరసము లాడు.
  • 'పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం.' ఇక్కడ చెలగాటమే చెర్లాటం.
  • "చెర్లాట మాడు మోహము, లేర్లయి వర్తిల్ల." పాండు. 3. 63.

చెర్లు గట్టు

  • చెరలు గొట్టు, చెర గొట్టు మారిన రూపం. బుస కొట్టుచు, కోపంతో చీదరించుకొనుచు అని కూడ. నేటికీ వాడుకలో 'మహా చెర కొడుతున్నాడే' అంటారు దక్షిణసీమలో.
  • "ప్రవాహోదకంబుల దరి జెర్లు గట్టి యాడంగ." పండితా. ద్వితీ. మహి. పుట. 155.
  • "క్రొన్ననమునికోలఁ గదల్చినం గెరలి చెరలు కొట్టుచు మన్నులపైఁ బాఱు చిలుకవారువంబుల...." శ్రీరం. 2. 295.
  • "ఇక్కడ జెర్లు గట్టి, కొనియాడునట్టి యెక్కుడుముద్దుపట్టి, గొనిపోయె పుత్రు గ్రక్కునఁ బట్టి మొసలి." పండి. మహిమ. ద్వితీయ. పుట. 164.
  • అదే. ద్వితీ. 166.
  • చూ. చెరలుకొట్టు.

చెఱకడము

  • బెల్లము.

చెఱకున పం డొదవినట్లు

  • చెఱకే మధురము. దానికి పండే పుడితే ఇం కెంత మధురముగా ఉండునో అనుటపై వచ్చినపలుకుబడి.
  • ఇలాంటిదే 'బంగారానికి తావి అబ్బు.'
  • చెఱకునకు పం డ్లుండక పోవుట ప్రసిద్ధము.
  • "అఱువదినాలుగు విద్యల, నెఱవాది త్రికాలవేది నీ వీ చిలుకన్, నెఱపుగఁ జేపట్టిన నది, చెఱకునఁ బం డొదవినట్లు చిరకీర్తినిధీ!" విక్ర. 7. 20.

చెఱకుల పందెము

  • చూ. చెఱకుపందెము.

చెఱకు పండినపండు

  • అసంభవము. తాళ్ల. సం. 12. 75.

చెఱకుపండు

  • అసంభవము.
  • కుందేటికొమ్ము వంటిది.
  • "అక్కటా!, చెఱకునఁ బండు పండిన భుజింప దలంపమి గాక ప్రాయపుం, దెఱవలతోడ..." రాజగో. 1. 100.

చెఱకుపందెము

  • చెఱకుగడలను నఱుకుటలో ప్రావీణ్యం చూపుతూ వేసుకునే పందెం.
  • "పికిలిపిట్టలఁ గొట్లాటఁ బెట్టి చూచు, దిట్టతనమునఁ జెఱకుపందెంబు లాడు." కువల. 5. 9.

చెఱకుపాలు

  • చెఱకురసం.

చెఱగున ముడుచుకొను

  • కొంగున కట్టుకొను.
  • ఏదైనా డబ్బును కొంగులో ముడి వేసుకోవడం నేటికీ చాలా చోట్ల అలవాటులో ఉన్నదే.
  • "చెఱంగున ముడుచుకొని." హర. 1. 19.

చెఱగు పెనచు

  • స్త్రీలు సిగ్గూ, తత్తరపాటూ మొదలయినవి కలిగినప్పుడు పైటచెఱగును వేలికి చుట్టుకొని నులిపెట్టుట అలవాటు. దానిపై వచ్చిన పలుకుబడి.
  • "తన చేతి చెఱఁగు బిగియన్, బెనఁచుచుఁ దల వాంచి నగవు బెరయఁగఁ బలికెన్." మను. 3. 106.

చెఱగు మాయు

  • ము ట్టగు; బహిష్ఠు అగు.
  • "చెఱఁగు మాసిన మూనాళ్లు సిగ్గుతోడఁ, బతి విలోకనమార్గంబు పరిహరించి." కాశీ. 2. 72.
  • "చెఱగు మాసిన నాల్నాళ్లు జరుగ నిచ్చి, స్నాన మొనరించి ధౌత వస్త్రంబు గట్టి." సానందో. 3. 53.
  • "చెఱగు మాసె నేమి సేతురా, దఱి జేర నీయ వీలు కాదు." క్షేత్రయ్య.

చెఱగొను

  • చెఱపట్టు, బంధించు.
  • "నన్నుఁ జెఱగొని గంధర్వనాయకుండు." భార. అర. 6. 9.

చెఱచెఱ లాడు

  • కోపంతో మండిపడు.
  • "ఏమిటో పొద్దున్నుంచీ మహా చెఱ చెఱ లాడుతున్నావే?" వా.

చెఱ దెచ్చు

  • బందీగా పట్టుకొని వచ్చు.
  • "తొల్లి చెఱ దెచ్చిన వారిఁ బదాఱువేల ధా,త్రీజనమాన్యలన్." భాగ. 10. ఉ. 206.

చెఱపట్టు

  • బందీగా చేయు.
  • "శతమన్యుఁ జెఱపట్టఁ జాలిరే పరవార, లని." ఉత్త. రా. 5. 6.

చెఱపనచేట

  • తిట్టు. నాశకారి అనుట.
  • "పఱతెంచితి రెం డిండ్లకుఁ, జెఱపనచేట వయి తేమి చేసెడి దనుచున్." జైమి. 4. 69.
  • చూ. చెరపనచేట.

చెఱపోవు

  • పట్టుబడి పోవు, బందీ యగు.
  • "సైంధవుచేతం బాంచాలి చెఱపోయె నని పలుకుచు..." భార. అర. 6. 196.

చెఱ యిచ్చు

  • స్త్రీలను బానిసలుగా నిచ్చు.
  • "దండుగ లిచ్చి వేల గొని దానిపయిం జెఱ లిచ్చుకన్న నిం, దుండగ నిచ్చెఁ గాక దనుజోత్తముఁ డల్గినఁ జంపఁ బెద్దయే?" కుమా. 10. 163.

చెఱ లిచ్చు

  • బందీలనుగా ఇచ్చు.
  • "సురపతి వచ్చి నా శరణుఁ జొచ్చి తగం జెఱ లిచ్చి యున్న నేఁ, గరుణము వుట్ట." కుమా. 10. 139.

చెఱలు

  • బందీలు.
  • "పరుల చెఱలు వృత్తులు నర్థంబులు మగుడ నిచ్చి." కుమా. 10. 194.

చెఱలు గొను

  • చెఱ పట్టు.
  • "పుణ్యస్త్రీలఁ జెఱలు గొనిరి." విష్ణు. 2. 123. చెఱలు చూఱలు పుట్టు శని
  • బందీ గొనుటలు, దోపిడీలు దాపురించిన దుష్కాలము.
  • "చెఱలు చూఱలుఁ బుట్టు శని మానుపు మటన్న, వెస నదే మఱియుఁ గావించె దీవు." సింహాద్రినా. శ. 45.

చెఱలు దెచ్చు

  • చెఱపట్టి తెచ్చు. హరి. ఉ. 4. 45.

చెఱలు పట్టు

  • చెఱ పట్టు, బందీలుగా పట్టుకొను. సమీర. 1. 150.

చెఱవడు

  • బందీ అగు.
  • "ఖలుచేఁ జెఱవడి భీతిం, గలఁగెడు సీతఁ గని." భాస్క. ఆర. 2. 163.

చెఱసాల

  • బందిఖానా.

చెఱి ఒకటి

  • చెఱి సగము, తలా ఒకటి.
  • ఒక్కొక్కరూ ఒక్కొక్క సగం, ఒక్కొక్క వేయి అనుటలో - చెఱి సగం, చెఱి వేయి అనడం వాడుక.

చెఱి సహాయ స్వాహా

  • వాళ్లిద్దరూ కలిసి దానిని అపహరించిరి అనుపట్ల ఉపయోగిస్తారు.
  • చెఱిసగం కాజేశా రనుట.
  • "ఆ మామగారి ఆస్తిని కాస్తా, ఆ యిద్దరు అల్లుళ్లూ చెఱి సహాయ స్వాహా చేశారు." వా.

చెఱుపరి

  • చెఱుచువాడు. చంద్రా. 5. 108.

చెఱువుకట్ట తెగిన బిరుసుతో

  • చెఱువుకట్ట తెగినట్లు. అతి వేగముగా - పెద్ద ఉరవడితో.
  • చెఱువుకట్ట తెగినప్పుడు నీళ్లు మహావేగంతో ముంచుకు రావడంపై వచ్చిన పలుకుబడి.
  • "అతని వింట వెడలు నమ్ముల వేగవై, చిత్రి యేమి చెప్పఁ ? జేవలసిన, మురువు బిరుసుఁ గ్రోవి ముట్టించిన తెఱంగుఁ, జెఱువుకట్ట తెగినబిరుసుఁ దోఁచె." కళా. 8. 127.

చెఱువుపా లగు

  • చెఱువున కాహుతి అగు, గంగపా లగు వంటిది. బస. 6. 165 పుట.

చెఱువు విడిచి కాలువ పొగడు

  • పెద్దదానిని వదలి చిన్న దానిని స్తోత్రము చేయు.
  • "అనుటయు హంసుఁడు గమగమఁ, గనలి మదిం జెఱువు విడిచి కాలువఁ బొగడం, జను నే వీనికి నని యి, ట్లను." ఉ. హరి. 4. 186.

చెలదితెర

  • సాలెపట్టు.
  • "నెలపూఁదాలుపు మన పూ,జలు మెచ్చునె యని మదిన్ విచారింపకు చీ,కిలిమాకిలిగా నల్లిన, చెలఁదితెఱల్ సూచి సంతసించుట లేదే." సారం. 1. 15.

చెలదినేత

  • అశాశ్వతము.
  • సాలెపురుగు నేసిన నేత ఒక్క నిమిషంలో గాలి కెగిరి పోతుంది.
  • "ఊఁతనీరు చెలఁదినేత మూటాయిటి, దూదియెండపసుపు దొఱ్ఱియక్క,రంబు మేను." ఆము. 6. 62.

చెలదిపుర్వు

  • సాలెపురుగు. కళా. 3. 83.

చెలరేగు

  • విజృంభించి, ఉల్లాసంతో ఉప్పొంగు.
  • "అనుచుఁ జెలరేఁగి మంత్రులు, గొని యాడుచు నుండిరి." సా. 1. 32.
  • ఇలాంటి భావచ్ఛాయలలో కొన్ని మార్పులతోనూ ప్రయుక్త మవుతుంది.

చెలామణి అగు

  • 1. నాణ్యములు చెల్లుబడి అగు.
  • 2. తద్వారా మాట ఇత్యాదులు చెల్లుబడి అగు.
  • "అతనిమాట ఆ ప్రాంతంలో బాగా చెలామణి అవుతుంది." వా.

చెలిక త్తియ

  • చెలి, స్నేహితురాలు.

చెలికత్తె

  • చూ. చెలిక త్తియ.

చెలికపట్టు

  • చేను.
  • "సారంగంబుల ఖురళికారంగంబులనన్ గనుపట్టుచెలికపట్టులును." మను. 4. 37.

చెలికారము

  • స్నేహం.
  • "ఆబ్ధితోఁ జెలికారమంది మైనాకంబు, రచియించె నిజపక్షరక్షణంబు." సాంబో. 1. 134.

చెలిమరి

  • మిత్రము.

చెలిమిక త్తియ

  • చెలిమికత్తె.

చెలిమికత్తె

  • చూ. చెలిక త్తె.

చెలిమికాడు

  • చెలికాడు.

చెలిమిచెలువ

  • చెలికత్తె. కృష్ణ. 4. 49.

చెలిమివాడు

  • చెలికాడు, వలపుకాడు.
  • "బలిమి వాసవు బెట్టు నులిమి వాకిటఁ బెట్టు, కలిమివాలుగకంటి చెలిమి వాని." చంద్రా. 1. 84. చెలియలికట్ట
  • సముద్రతీరము, వేల. కవిక. 2. 146.

చెలువారు

  • ఒప్పు.
  • "గోడలఁ జెలువారఁ గృష్ణలీలలు లిఖించి." రుక్మాం. 1. 118.

చెలువు మిగులు

  • ఒప్పు; అందము అతిశయించు.
  • "కలిగి కంసవైరి కన్నుల పండు వై, చెలువు మిగిలె." ఉ. హరి. 2. 109.
  • "మహనీయ కురువింద మాణిక్య కాంతుల, చేతఁ బల్లవిత మై చెలువు మీఱ." కళా. 2. 10.

చెల్ల గట్టు

  • చెల్లించు.
  • "ఈ రూపాయలు తీసుకొని పోయి ఆ బాకీకి చెల్లగట్టి రా." వా.
  • పత్రంలో జమను రాసుకొనుటకు కూడా 'చెల్లు' రాసుకొనుట అంటారు.
  • "ఈ రూపాయలను నీ బాకీకింద 'చెల్లు' వేసుకో." వా.
  • "ఆ రోజుతో 'చెల్లు' . మళ్లీ వాడీప్రక్క తిరిగి చూచి ఉంటే ఒట్టు." వా.
  • ఇక్కడ ఇదే ఆఖరు. తర్వాత రాలేదు అని అర్థం.
  • చూ. చెల్లుచీటి.

చెల్లచెద రగు

  • చెల్లాచెద రై పోవు.
  • "అరయ దెస లేక నీ ధనం బడవిలోనఁ, జెల్లచెద రయ్యె." హరి. పూ. 7. 39.

చెల్ల దిరుగు

  • పూర్తిగా తిరుగు.
  • చెడ దిరుగు అన్న మాటే నేడు విన వస్తుంది.
  • "పుడమి యెల్లం జెల్లం దిరిగి యలబ్ధ మనోరథుం డై యుండి..." శుక. 2. 160.

చెల్లని

  • కాని పోని.
  • "చెల్లనిపూనిక లవి నెఱప నేల?" సింహా. 6. 56.

చెల్లనికాసు

  • పనికి రానిది, మారకం లేనిది.
  • "కల్లగు జ్ఞానం బేలా, చెల్లనికా సెచట నైనఁ జెల్లనికాసే." సంపంగిమన్న. శ. 36.

చెల్ల పిళ్లలు

  • ముద్దుబిడ్డలు.
  • సెల్వం - (తమి) అంద మని అర్థము. పిళ్ళ - (తమి) సంతానము.
  • "తల్లిదండ్రులు గలవారు తమ లేము లెఱుఁగక, చెల్లపిళ్ల లై యాటలఁ జెందినయట్టు." తాళ్ల. సం. 8. 54.

చెల్ల బెట్టు

  • వదలి వేయు.
  • "విషనిభంబు లైనవిషయాభిలాషంబు, లెల్లఁ జెల్లఁబెట్టి..." పాండు. 5. 208.

చెల్లబో....!

  • ప్రశంసాద్యర్థాదులలో ఉపస్కారకం.
  • 1. ప్రశంసలో.
  • "చెల్లంబో యితనికరుణ..." భార. అశ్వ. 4.
  • 2. సంతాపార్థంలో.
  • "దీనికిఁ జెల్లంబో యిట్టి మగడు సేకుఱె ననఁగన్." భోజ. 5. 326.
  • 3. ఆక్షేపార్థంలో.
  • "రాజసూయకర్త బ్రహ్మదత్తుఁ డట్టె, రభస మెసఁగ హం సడిభకు లట్టె, చేయఁ బనుచువారు చెల్లఁబో...." ఉత్త. హరి. 4. 154.

చెల్ల రా!

  • ఉపస్కారకపదం.

చెల్ల రె!

  • చెల్ల రా.

చెల్ల రే !

  • చెల్ల రె.

చెల్ల విడుచు

  • తెగ విడుచు, స్వేచ్ఛగా అడ్డు విడిచి పెట్టు.
  • "ఆతఁ డిల్లాలిపై మోహ మతిశయిల్లఁ, బెల్లుగాఁ జెల్లవిడిచి వర్తిల్లుకతన." శుక. 2. 203.

చెల్లాకు చెద రగు

  • చెల్లాచెదరు లగు.
  • "చెల్లాకుం జెద రైనసైన్యసమితిం జే సాఁచి రావించి." రంగా. 3. 68.

చెల్లాకు చెదరు చేయు

  • చెల్లాచెదరు చేయు.
  • "చెల్లాకుం జెదరు చేతు శీఘ్రమె వానిన్." రంగ. 2. 247.

చెల్లాచెద రగు

  • చెదరి పోవు.
  • "లావు చాలించి చెల్లాచెద రైరి సా, రణులు గుహ్యకులు తురంగ ముఖులు." వరాహ. 3. 50.
  • "పోలీసులు వచ్చేసరికి జన మంతా చెల్లా చెద రై పోయారు." వా.

చెల్లింప గను

  • ముగింప గలుగు.
  • "నెలకొని రఘురామ నీ ప్రసాదమున, కలఁగక చెల్లింపఁ గంటి నీ క్రతువు." రంగ. రా. బాల. పు. 36. పం. 2.

చెల్లి పోవు

  • 1. చనిపోవు, దాటిపోవు.
  • "మేది నీతనయ, చెల్లి పోవుటయును జెప్ప నేర్పరివి." వర. రా. అర. పు. 218. పం. 24.
  • 2. తీరిపోవు.
  • "ఈ పదిరూపాయలతో నీ బాకీ పూర్తిగా చెల్లిపోయింది." వా.
  • 3. ఖర్చు అగు. మాటా. 75.

చెల్లుచీటి

  • బాకీ యెంతో కొంత చెల్లించి నప్పుడు ఆ చెల్లును గుర్తు వేసుకొని వ్రాసియిచ్చు రసీదు.

చెల్లుచీటి యిచ్చు

  • వదలి వేయు.
  • "క్షితినాథుచే సొమ్ము చెల్లించి నందులకు...నితని కిప్పింపు డిట చెల్లుచీటి." ద్విప. పరమ. 6. 480. చెల్లుబడి అగు
  • మాట సాగు.
  • తద్వారా వచ్చిన ధీమా. ఈ 'చెల్లు' నాణ్యాల మారకం పై వచ్చినది.
  • ఏదైనా నాణెం చెల్లుతుం దంటే అది మారకంలో ఉన్న దనుట. అనగా దానికి విలువ ఉన్న దనే కదా!
  • "తన యత్యధికం బగురూపసంపదం, జెలువుఁడు కైవసం బనుచుఁ జెల్లుఁబడిం బచరించి పల్కె." కళా. 1. 173.
  • "ఆ జిల్లాలో ఆయన మాట బాగా చెల్లుబడి అవుతుంది." వా.
  • "ఆ అధికారిదగ్గఱ ఆ కార్యదర్శి మాటకు చెల్లుబడి ఉంది." వా.

చెల్లుబడి వాడు

  • మాట చెల్లువాడు, ప్రసిద్ధుడు.
  • "ఎ,వ్వాఁడును నింత చెల్లుబడివాఁడు నరేశ్వర! లంకలోపలన్, లేఁడు." భాస్క. యుద్ధ. 747.

చెల్లెలికట్ట

  • హద్దు.
  • ఆపుదల చేయున దనుట.
  • తీరము అని వాచ్యార్థము.
  • "చింతామహాంబురాశికిని జెల్లెలికట్ట." విప్ర. 1. 84.
  • చూ. చెలియలికట్ట.

చెవాకు

  • చెవి ఆకు. ముత్తైదువకు ముఖ్య మైన అయిదింటిలో ఒకటి. శృం. శకుం. 4. 78.

చెవికి చవి యగు

  • కర్ణ పర్వ మగు; విన నిం పగు.
  • "వివిధ క్షేత్రచరిత్రలు....చెవికిం జవి యొసఁగెనే." పాండు. 1. 151.

చెవికి చే దగు

  • వినుట కప్రియ మగు.
  • "కావునఁ జెవికిం జేఁ దగు, నీ వాక్యము వినఁగ జాలితేని నిహపర, శ్రీవిభవములకు...." భార. ఉద్యో. 2. 94.

చెవికి తియ్యముగా పల్కు

  • మధురముగా మాట్లాడు.
  • "కర మిద్దేవు కపోల ఫాల చిబుక గ్రైవేయసంక్రీడకుం, దిరుగం జేయుచు నొయ్య నొయ్యఁ జెవికిం దియ్యంబుగాఁ బల్కుచున్." ఉ. హరి. 1. 128.

చెవికి వేడిగ పల్కు

  • మనసు నొవ్వ బలుకు.
  • "ఇ ట్లురు లెవ రొడ్డిరో, వింత యటన్న నీ చెవికి వేఁడిగఁ బల్కుపికాళిఁ బట్టి శి,క్షింతు నటంచు." ప్రభా. 3. 132.

చెవి కెక్కు

  • గ్రహింపు కలుగు. నచ్చు, మనసు కెక్కు.
  • "మనం ఏం చెప్పినా వాడికి చెవి కెక్కదు - పెండ్లాం చెప్తే గానీ." వా.

చెవి కొఱికి పుల్లింగాలు పెట్టు

  • ఒకరిపై రహస్యంగా ఏవేవో చెప్పి ద్వేషము కలిగించు.
  • "వాడి కేం ? ఏదో తినడానికి ఉంది. వాడిదగ్గఱా వీడి దగ్గఱా చేరి చెవి కొఱికి పుల్లింగాలు పెట్టడమే పని." వా.

చెవి కొఱుకు

  • రహస్యము చెప్పు.
  • "గుట్టిడక సెట్టితోఁ జెవి కొఱికి కొఱికి, సరవితోఁ దనకేలికిసానివారి." బహులా. 5. 76.
  • "ఏమిటో వాళ్ళిద్దరూ నన్ను చూచి అలా తిరిగారు. వీడు వాడి చెవి కొఱికాడు." వా.

చెవి కోసుకొను

  • అత్యాసక్తిని చూపు.
  • "వాడు కథ లంటే చెవి కోసుకుంటాడు." వా.

చెవి గూబ లదరు

  • బాగా దెబ్బ తగులు.
  • "చెవిగూబ లదిరేట్టు కొట్టాడు." వా.

చెవి గోసిన మేక వలె

  • మేమే అని అఱచు.
  • శ్రావ్యంగా లేని పాటలు పద్యాలు మొదలగువాని విషయంలో ఉపయోగించే పలుకుబడి.
  • "చెవి గోసినమేకలపోల్కిఁ జాల." గుంటూ. ఉత్త. 32.
  • "చెవి గోసిన మేకలాగా అరుస్తున్నాడు." వా.

చెవిచెంత జేర్చు

  • విను, ఆదరముగా చూచు.
  • "శివచింత చెవిచెంతఁ జేర్ప నతఁడు." జైమి. 1. 86.

చెవి చెక్కు నెఱుగకుండ చెప్పు

  • అతి రహస్యముగా చెప్పు.
  • "చెప్పెద మొకబుద్ధి చెవియుఁ జెక్కు నెఱుంగ,కుండఁ బైతృక మైనయొడమి గలది." భోజ. 6. 144.

చెవిచొరు పాము

  • కర్ణజలూక. శ. ర.

చెవి జెందు

  • వినబడు.
  • "చెవిఁ జెందె వధూమృదుగీతవాదముల్." భోజ. 5.

చెవిటికి పట్టిన సంకు

  • వ్యర్థము.
  • "...అ,క్కట విఫలము గాదే? యె,చ్చటఁ జెవిటికిఁ బట్టినట్టి సంకును బోలెన్." కళా. 2. 96.
  • రూ. చెవిటికి శం కూదినట్లు.

చెవిటి పంచాయితీ

  • అసలు సంగతి తెలియక చెప్పు తీర్పు.
  • "వాడికి సంగతు లేవీ తెలియవు. అనవసరంగా వాడిదగ్గరికి వెడితే ఏదో చెవిటి పంచాయతీ చెబుతాడు. ఏం ప్రయోజనం?" వా.
  • చెవిటి గొల్లవాడు, దారిన పొయ్యే చెవిటి, చెవిటి రాజు కలిసిన కథద్వారా వచ్చినది.

చెవిటి మాలోకం

  • చెవిటి.
  • "మనం ఏ మంటే నేం? పాపం ! ఆమె కేం తెలుస్తుంది? చెవిటి మాలోకం." వా చెవిదండ పల్కు
  • రహస్యముగా చెప్పు.
  • "తాం,బూలము తావి భుగ్గు రని ముంచుకొనం జెవిదండఁ బల్కినన్." కళా. 4. 113.
  • "గో,త్రావిభుఁ డొయ్యఁ బల్కెఁ జెవిదండఁ బెనంగఁ దలంకె నింతయున్." కళా. 7. 154.
  • చూ. చెవిలో చెప్పు.

చెవిదాకా వచ్చు

  • ఎఱుకకు వచ్చు.
  • "ఆ విష్యం యింకా నా చెవిదాకా రాలేదు." వా.

చెవి దార్చు

  • చెవి యొగ్గు.
  • "చెవి దార్చి విని చీమ చిటుకన్న నొకసారి, సెలవి వెంపఱలాడుఁ జిట్ట లెల్ల." మను. 4. 17.

చెవి దేలగిల నిచ్చు

  • చెవి వాలవేయు.
  • "కనుఁగొని త మ్మతండు కడకంటను జూడక యొక్క చీరికిం,గొనక వచో విలాసములకుం జెవి దేలఁగిలంగ నీక." విప్ర. 2. 70.

చెవి దోరగట్ట జెప్పు

  • చెవి నిల్లు కట్టుకొని పోరు.
  • "జూదపుసిరి మేలు గా దని చెవి దోర, గట్టఁ జెప్పిన క్షత్తఁ గిట్టి విడిచె." శ్రీకృష్ణభారతం. ఉద్యో. 1. 402.

చెవి దోర పెట్టు

  • చెవి యొగ్గు.
  • ".....వినియెను చెవి దోరపెట్టె నాఁగ, నాలకించెను వినె నాలించె ననఁగను." ఆంధ్రభా. 3. 119.

చెవి నాను

  • 1. చెవి యొగ్గు.
  • "తన మాట చెవి నాని తా నట్ల సేయుదు, ననెడి." వర. రా. కిష్కి. పు. 492. పంక్తి. 15.
  • 2. చెవి పెట్టుకొను.
  • "మం,దర బుద్ధి చెవి నాని దాని నీక్షించి." వర. రా. అయో. పు. 270. పంక్తి. 24.

చెవి నిడు

  • విను.
  • "వెడ వెడ యప్పలుకులు చెవి నిడి." భార. శాంతి. 1. 56.

చెవిని పడు

  • ఎఱుకకు వచ్చు.
  • "ఈ విషయం వాడి చెవిని పడిన ట్టా యెనా కొంప లంటుకుంటాయి." వా.

చెవిని పెట్టకుండు

  • మాట వినక పోవు.
  • "వా డెన్ని చెప్పినా చెవిని పెట్టడం లేదు." వా.

చెవి నిల్లు గట్టుక చెప్పు

  • నిరంతరం బోధ చేయు.
  • "ఒరుదులగా వచ్చి యొడి మరుంగు పడంగఁ, జెవి నిల్లు గట్టుక చెప్ప రేని." విప్ర. 5. 40.

చెవి నిల్లు గట్టుక పోరు

  • చూ. చెవి నిల్లు గట్టుక చెప్పు.

చెవి నులుము

  • శిక్షించు.
  • "ఆ పిల్లను చెవి నులిమి కూర్చో పెడితే తప్ప వాళ్లంతట వాళ్లు చదువు కుంటారా?" వా. చెవి పట్టి తెచ్చు
  • బలాత్కారముగా లాగుకొని వచ్చు.
  • "కలగుండు వడఁ జెండు కరి నైనఁ జెవి పట్టి, బలిమి మైఁ దెత్తు నీ పాద మాన." మను. 4. 34.
  • వాడుకలో -
  • "వాణ్ణి చెవి పట్టుకొని లాక్కొని రా." వా.

చెవి పెట్టు

  • విను.
  • "కట్టఁడు యోగ్యశాటిఁ బొడకట్టఁడు రాచనగళ్లకుం జెవిం, బెట్టఁడు కీర్తి...." బహు. 5. 6.
  • చూ. చెవి బెట్టు.

చెవిపోగులు

  • అంటుజోళ్లు.

చెవి బడు

  • వినబడు.
  • "ఏ పలుకుం జెవిం బడఁగ నీక పెనంగుచు మోము దవ్వుగాఁ, జూపుచు." కళా. 7. 157.
  • "అనుకలకలంబు చెవిఁ బడ." కువల. 4. 128.

చెవి బెట్టు

  • విను. బహు. 5. 6.
  • రూ. చెవిపెట్టు.

చెవి మెలివేసి

  • శిక్షించి, బలవంత పెట్టి.
  • "ఆవిడ ఎలాగో వాణ్ణి చెవి మెలివేసి తాను చెప్పినపని చేయించుకుంటుంది." వా.

చెవియాకు

  • చెవికమ్మ.
  • తొలిరోజులలో తాటాకు చుట్టి పెట్టుకునేవారు. అందువల్ల ఏర్పడినదే కమ్మ అను మాట కూడా.
  • పండితా. ప్రథ. దీక్షా. పుట. 215.
  • చూ. చెవ్వాకు.

చెవి యొగ్గు

  • విను, అవధానంతో విను.
  • చూ. చెవి యొడ్డు.

చెవి యొడ్డు

  • చెవి యొగ్గు.
  • "చెవి యొడ్డి వినంగఁ దగదు." కాశీ. 6. 286.

చెవిలో చెప్పు

  • రహస్యముగా చెప్పు.
  • "శా,లీనుఁడు సుగాత్రి దనపై నొరగ వంచి చెవి,లో నొకటి యే మనుచునో నగుచుఁ జెప్పన్." కళా. 4. 50.

చెవిలో నూదు

  • రహస్యముగా దుర్బోధలు చేయు.
  • "ఆ పెళ్లాం కాస్తా చెవిలో ఊదే సరికి అన్నతో భాగపరిష్కా రానికి వాడు తగాదా పెట్టుకొన్నాడు." వా.

చెవిలో వేయు

  • రహస్యముగా తెలియజేయు.
  • "ఎలాగో యీ సంగతి వాడి చెవిలో వేసి రా, తరవాత సంగతి నేను చెప్తాను." వా.