పదబంధ పారిజాతము/కృత మెఱుగు

కృత____కృత 512 కృతి____కృప

  • "కూళమారి విధాత చేకూర్చె నిటుల." ప్రబంధ. 655.

కృతపడు

  • 1. కడచు.
  • "కృతపడినకార్యంబు గ్రమ్మఱం బొడమునే...." భార. కర్ణ. 1. 226.
  • 2. మరణించు
  • "పనిచి కృతపడిన గాంగేయునిదెస." భార. ద్రోణ. 1. 6.
  • 3. వే ఱగు.
  • "సురకరి యీయద్రి జరియించు నేనిక, కొదమల గృతపడ్డకొదమ యొక్కొ." మార్క. 1. 97.

కృతపడ్డ తప్పు కాదు

  • వెనకటి తప్పులను మాఫీచేయు - మన్నించు.
  • "కృతపడ్డ తప్పు గాచితి నేడు." జైమి. 8. 94.

కృతపఱుచు

  • గడపు.
  • "...దినంబులు కడంద్రోచి....ఋతువులు కృతపఱచి..." సాంబో. 1. 173.

కృత మెఱుగు

  • చేసినమేలు జ్ఞప్తి కుంచుకొను.
  • "కృత మెఱుగుదు రుపకార,వ్రతమున వర్తింతురు...." భార. విరా. 3. 64.

కృతయుగపుమాటలు

  • సత్య కాలపు మాటలు. తాతలనాటి సంగతులు.
  • "....కృతయుగపు మాట లిపు డేల." నందక. 29.

కృతి యిచ్చు

  • గ్రంథం అంకిత మిచ్చు.
  • "కృతు లిచ్చినసుకవుల." రుక్మాం. 3. 66.

కృత్యాద్యవస్థ పడు

  • మిక్కిలి కష్టముతో కూడినట్టి. ప్రారంభదశలోని ఇబ్బందులు పడు.
  • కావ్యరచనలో ప్రారంభం చాలా క్లిష్టం అనుటపై యేర్పడిన పలుకుబడి.
  • "అతగాడు వేలమీద పెట్టుబడి పెట్టాడు. ఎప్పుడో బాగానే వస్తుంది. ఇప్పు డేదో కృత్యాద్యవస్థ పడుతున్నా డంతే." వా.

కృప ఉట్టిపడగా

  • దయారసము వెల్లివిరియగా.
  • "ఆ బాలుర గృప, యుట్టి పడగ జూచి నృపతి యొయ్యన నగుచున్." కళా. 6. 160.

కృప చేయు

  • అనుగ్రహించి యిచ్చు.
  • "నీవు కృప చేసిన వీ రథచాపతూణముల్." జైమి. 4. 25.

కృపవాడు

  • అనుగ్రహపాత్రుడు.
  • "ఎవ్వడు తేజరిల్లు నత డెప్పుడు నీ కృప వాడు భార్గవీ!" వి.పు. 1. 203.

కృప సేయు

  • అనుగ్రహించు; ఇచ్చు.
  • "వి వేక పరిపాటియునుం గృప సేసె." హర. పీఠిక. 30.

కృష్టపచ్యము

  • దున్నిననేలలో విత్తి పండించే ధాన్యం.
  • ధాన్యం రెండు రకాలు-కృష్టపచ్యము; అకృష్టపచ్యము= తా నంతట పండే గడ్డిగింజల వంటివి.

కృష్ణా అనుకొను

  • చచ్చిపోవు.
  • "ఆ ముసలిది కాస్తా కృష్ణా అనుకొంటే ఆ ఆస్తి అంతా వీడిదే." వా.

కృష్ణార్పణ మగు

  • తనది కాకుండా ఇతరులకు దత్త మై పోవు.
  • "ఏ దయినా దానంగా యిచ్చినప్పుడు కృష్ణార్పణం అనీ, రామార్పణం అనీ దైవప్రీతిగా యిచ్చే అలవాటు కలదు. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "వాడు చదివి తెచ్చిస్తాను అంటే పుస్తకం ఇచ్చాను. అది కృష్ణార్పణం అయి పోయింది." వా.

కృష్ణాష్టమి

  • శ్రావణ బహుళ అష్టమి. ఇదే గోకులాష్టమి. కృష్ణుడు పుట్టిన రోజు.
  • "కృష్ణాష్టమినాడు గౌడీయమఠలో బ్రహ్మాండంగా చేస్తారు." వా.

క్లప్తంగా

  • సంక్షిప్తంగా.
  • "మీరు చెప్పే దేదో కలుప్తంగా చెప్తే మంచింది." వా.

కెం పగు

  • ఎఱ్ఱ నయిన.
  • అనగా కోపోద్రిక్త మయిన.
  • "కెం పగుకన్నుదోయితో." జైమి. 2. 53.

కెం పగుచూడ్కి

  • కోపదృష్టి.
  • "జనపరంపర కెం పగుమాడ్కి జూచి." పాండు. 3. 95.

కెంపు దేఱు

  • ఎఱు పెక్కు.
  • "కన్నుదోయి, తుది గెంపుదేఱు నిద్దుర మంపుతోడ." వర. రా. సుం. పు. 67. పంక్తి. 8.

కెంబసుపు

  • కుంకుమ.
  • "నునుపుగా దువ్వి తీర్చిన కెంపు బాలేందు, పస మీఱు నొసటి కెంబసుపు బొట్టు." శుక. 2. 425.

కెక్కరలు కొట్టు

  • ఆశ్చర్యమును ప్రకటించు. 'గెగ్గరలు కొట్టు' అని నేడు వినబడదు.
  • ధ్వన్యనుకరణము.
  • కుక్కు. 52.
  • "ఆ పిల్ల అత్త నలా అన్నిమాట లంటుంటే అంతా కెక్కరలు కొడుతూ విన్నారు." వా. కెక్క____కెడ్బె 514 కెర_____కెల

కెక్కరించి

  • కోడిలా అటూ ఇటూ చెలికి.
  • "వాడు కోడి కెక్కరించినట్టు కెక్కరించి రెండు మెతుకులు తిన్నాడు." వావిళ్ల ని.

కెడగూడు

  • 1. గుమికూడు. కాశీ. 3. 138.
  • 2. కలిసి యుండు.
  • "నెఱి లేక నీతోడినీడ యై గెడగూడి, పరగినన న్నింత."
  • 3. భోగించు.
  • "మగనికి వెఱవక యింటికి, దగ దానే కర్త యగుచు దత్పరవృత్తిన్, వగ గల దై వెలి దిరిగెడు, మగువం గెడ గూడువాడు మదనుడు గాడే." మల్ల. 2. 173.

కెడ్బెరయు

  • అడ్డదిడ్డముగా పడి యుండు, కలగాపులగ మగు.
  • "మృగంబుల యెలుంగుల తోడం గెడ్బెరసి." కాశీ. 1. 93.
  • "సొంపు మిగులంగ జోదుల యంప పొదుల, దీప్తులును లేతనవ్వుల దీధితులును హారిరశ్ములు గెడ్బెర సగుచు వెలుగ, దేరు లరిగె నుద్దామత గౌరవేంద్ర!" భార. శల్య. 1. 104.
  • చూ. కెడ్బెర సగు.

కెడ్బెరసు అగు

  • అటూ ఇటూ చెల్లా చెదరుగా అడ్డదిడ్డంగా పడు.
  • "కె, డ్బెర సై పీనుగులు పడువు బ్రేకయు బడియెన్." కుమా. 11. 127.

కెరలి పడు

  • త్వరపడు.
  • "కెరలిపడి జనని దూఱుట, ధరణీపతి ననుట వెఱ్ఱితనము." సారం. 3. 32.

కెరలి యాడు

  • ఆనందముతో తాండవించు.
  • "బాణాసురుండు దనుజసుందరీసహితు డై....కెరలి యాడుచు మధుపాన కేళి దేలి." ఉత్త. హరి. 5. 47.

కెరలుకొను

  • తేరుకొను; ఏపుగా పెరుగు.
  • "వాడక వ్రాలక తెవుళుల, గూడక తగ నల్ల గెరలు కొని నవకము లై... వీడెన్ సస్యంబు లిడుమ వీడెన్ బ్రజకున్." భాగ. 10. పూ. 757.

కెరలు వొడుచు

  • కెరలుకొను.
  • "అతనిచేత నున్న యమృతకుంభము సూచి, కెరలువొడిచి సురల గికురువెట్టి, పుచ్చుకొనిరి యసురపుంగవు లెల్లను." భాగ. 8. 295.

కెరలెత్తు

  • చూ. కెరలుకొను.

కెర్లుకొను

  • కలవరించు; కేకలు వేయు.
  • "పిల్లవాడు నిద్రలో కెర్లుకొని లేచాడు." వా.
  • "మేలును దెల్పుచు గేక లిడుచు గెర్లు కొనుచును వచ్చె.....డు బుడక్కి వాడు." హంస. 2. 27.

కెలవాడి

  • కిలాడి, టక్కరి. కెల్లు____కేకి 515 కేడీ____కేల
  • "రసికు డగు కెలవాడి, అప్ప డగు కెలవాడి." తాళ్ల. సం. 12. 14.

కెల్లు రేగు

  • విజృంభించు.
  • "కెల్లు రేగె దేహ మందే కిమ్ముల చుట్టిరి." తాళ్ల. సం. 7. 256.

కేకట కెమ్మట లాడు

  • పరిహాసము లాడు.
  • కేకే యని అఱచుచు పరియాచకము లాడు అని వావిళ్ళ ని.
  • " గిరిజేశు గ్రేకట గెమ్మట లాడి, యును సరసము సేసియును గేలి సేసియును." పండితా. ద్వితీ. మహి. పుట. 111.

కేకలు వేయు

  • కోపించు.
  • "చేకొని యొనరుతు మనుచున్, గేకలు వేసెడిని సమర కేళీరతి యై." దేవీ. 12. 138.

కేకసలాడు

  • నవ్వుతూ చప్పట్లు కొట్టు
  • చూ. కేకిసలు కొట్టు.

కేకిసలు కొట్టు

  • కేరింతలు కొట్టు.
  • ధ్వన్యనుకరణము.
  • "నాట గెలిచి పోనీక పట్టుచు గేకిసలు గొట్టుచు నొకరొకరి జీరుచు..." కళా. 6. 225.
  • "చే,కొని హరి జూచె గేకిసలు గొట్టుచు బోటులు దాని నవ్వగన్." పారి. 3. 16.
  • చూ. కేకసలాడు.

కేడీలాడు

  • చాడీలు చెప్పు. రమా. 13.

కేరడము లాడు

  • వక్రోక్తులాడు; హాస్యమాడు.
  • "కేరడము లాడుసతి మధ్య ధీర." నరస. 2. 29.
  • "కేరడము లాడుచుండిరేని, గవియు పాండవబాణాగ్ని గాదు సువ్వె,తమ్ము తమ లోభ మనుచిచ్చు దరికొనంగ, దెగినవా రయి పోదు రింతియ తలంప." భార. ఉద్యో. 1. 353.

కేరియలు వాఱు

  • కెక్కర్లు కొట్టు.
  • "జీఱిక కల్లు ద్రావి మదసింధుర గామిను లన్ని కేఱియల్, వారుచు గౌడు గీతములు వాడుచు." కుమా. 6. 45.

కేల కపోలము లూదు

  • చెక్కిట చేయి చేర్చు. చింతా సూచక మైన అంగ విక్రియ.
  • "ఎన్నిభవంబులన్ గలుగు నిక్షుశరాసనసాయకవ్యధా, ఖిన్నత వాడివత్తలయి కేల గపోలము లూది." మను. 2. 57.

కేల నోరు మూసికొను

  • ఏ దైనా అలా చేయతగదు సుమా అని చెప్పునపుడు ఆడవాళ్ళు నోరు మూసుకొనుటపై వచ్చిన పలుకుబడి.
  • "అనుచు నొయ్య బలుకుచును జూపె బ్రియు నొక్క, ముగుద కేల నోరు మూసికొనుచు." కళా. 7. 146. కేలు____కేలొ 516 కేల్కే____కేళి

కే లుట్టిపడు

  • చేతు లదరు.
  • ఒకపని చేయుటకై తహతహ పడుటను సూచించు అంగ విక్రియ.
  • "...రాజసుతుడు చరమాంబునిధిన్, మునుగ రవి నెఱయు చీకటి, గ్నుగొని కే లుట్టిపడగ గట్టాయిత మై." శుక. 2. 219.

కేలుదండ

  • కైదండ, చేయూత. దశా. 7. 28.

కేలు మోడ్చు

  • నమస్కరించు.

కేలు మోడ్పు

  • నమస్కారము.

కేలు విడుచు

  • చేయి ఊపి ఆరంభించు డని సూచించు.
  • "పోర నొండొకంటి బొడుచుట కవ నీశ, విబుధరిపులు కేలు విడుచుటయును." కవిక. 2. 151.

కేలు సాచు

  • చేయి సాచు; అర్థించు.
  • "శ్రీకాంత దా నయ్యు బ్రియు నిరోధింపదు, క్రిం దై విరోధికి గేలు సాపదు." వసు. 1. 65.

కేలొసగు

  • నమస్కరించు.
  • "వ్యాఘ్రపురస్థలియందు మహాబాహు స్వామికి గేలొసగె దహితముగ." హంస. 4. 213.

కేల్కేల దట్టించు

  • చేయి పట్టుకొను; చప్పట్లు కొట్టు.
  • "క్రేవల్ కన్పడజేయు నెచ్చెలియతో గేల్కేల దట్టించి వా, చావైచిత్రిని ముచ్చటాడుసకి...." హంస. 1. 32.

కేల్మోడ్చు

  • చూ. కేలు మోడ్చు.

కేశాకేశి

  • జుట్లు జుట్లు పట్టుకొని.
  • "కేశా కేశి బెనంగుచు." కుమా. 12. 168.

కేళిక సేయు

  • పొగడు, స్తుతించు, ఒకా నొక కవిత్వము సేయు.
  • బొమ్మలాటలో నేటికీ కేళిక చేస్తారు. ఎవరో బహుమతి ఇస్తే ఆ మాట చెప్పి వారిని పొగుడుతారు.
  • ఇట్లే - కేళిక యొనర్చు, కేళిక సలుపు మొ.
  • "....సెంబళి కోల, నలి దూసికొని కేళికలు సేయువారు." పండితా. ప్రథ. దీక్షా. పుట. 160.
  • "వఱలుచు బాలుని వామపాదంబు, గిఱగిట గాబట్టి కేళికల్ సేయు." పండితా. ప్రథ. పురా. పుట. 481.
  • "జక్కిణిరవండి మేళముల గేళిక సల్పిరి." రామా.
  • "కేళిక జోకయు లీల నటింప." బస. 7. 154. కైంక____కైకొ 517 కైకొ____కైచె


కైంకర్యము చేయు

  • కాజేయు; సేవ చేయు.
  • సేవ చేయు అసలు అర్థం అయినా వ్యంగ్యంగా కాజేయు అనే అర్థంలోనే ఉపయోగిస్తారు. వైష్ణవులలో మాత్రం మంచి అర్థంలోనే ఇది అలవాటులో ఉంది.
  • "వాడు ఇంట్లో ఉన్నట్టే ఉండి, పెట్టెలో నాలుగు రూపాయలూ కైంకర్యం చేశాడు." వా.

కై కానుక చేయు

  • కానుక లిచ్చు.
  • "జవాదిపిల్లులు మొదల్గా గానలో వాని గుం, పులు గైకానుక చేసి.." యయా. 1. 104.
  • చూ. కైకాన్క సేయు.

కైకాన్క సేయు

  • బహుమతి యిచ్చు.
  • "గుండ్ల పేరును కైకాన్క కోరి సేతు." హంస. 2. 37.
  • చూ.కైకానుక చేయు.

కైకూలి వడు

  • దినకూలి చేసుకొని బ్రతుకు; కూలి నాలి చేసుకొను.
  • "కొడవలి గడియించుకొనుచు గై కూలి, వడి రాజనములకు నొడ బాటు చేసి." బస. 4. 117.

కై కొను

  • 1. గ్రహించు.
  • "జగత్త్రయంబు గావం బ్రోవం, గైకొన్ననీవు." ఉత్త. హరి. 4. 96.
  • 2. లక్ష్యపెట్టు.
  • "కైకో డతండు సురల." హర. 3. 8.
  • 3. పెండ్లి చేసుకొను.
  • "జయలక్ష్మీసతితో ననంగవతి నిచ్చం గైకొనం గోరి..." విక్ర. 4. 54.
  • 4. పట్టు, అనుసరించు.
  • "చరమాశాంతరవీధి గైకొని." విక్ర. 2. 115.
  • ఇలాంటి ఇతర చ్ఛాయలలోనూ ప్రయుక్తం. అవన్నీ వీనిలోనే చేరనూ చేరును.

కై కొలుపు

  • ఒప్పించు; ధైర్యము గొల్పు.

కై కొల్పు

  • పురికొల్పు. భాగ. 10. ఉ. 300.

కై కోలు

  • ప్రతిజ్ఞ; సమ్మతి; అనుమతి.
  • "నా కై,కో లిదె రెం డాడగ నా, నాలుక మీకులము వారి నాలుక లటులే?" సింహా. 5. 198.

కై చాపు

  • నమస్కరించు.

కై చెఱ యిచ్చు.

  • తనంత పట్టుబడు, వశ మగు.
  • "ఏచిన తన నిడువాలు వి,లోచనముల చెలువమునకు లొంగి జలజముల్, కై చెఱ యిచ్చె ననం గే, లీచాలితనళిన మా కలికి ధరియించున్." వరాహ. 11. 50. కైజా___కైదు 518 కైప___కైవ

కై జా చేయు

  • గుఱ్ఱం కళ్ళెం బిగించు.
  • "విభుండు హయము డిగి హుసా, రై కైజా చేసి మహా, నోకహతలమున నిలిచి." చంద్రా. 2. 111.

కై జీతగాడు

  • జీతాని కున్న సైనికుడు. భార. ఆశ్ర. 1. 73.

కై జీతములవారు

  • కై జీతగాండ్రు. కువ. 2. 143.
  • చూ. కై జీతగాడు.

కై తప్పుగా పడు

  • చేయి జాఱి పడిపోవు; తప్పి పోవు.
  • "కంగు కంగున నేల గైతప్పుగా బడు, వేటమ్ము లేఱక దాటి దాటి." మను. 4. 103.
  • "దేవ నిన్న కై తప్పున జేరె నీ హయము." జైమి. 5. 168.

కై దండ యొసగు

  • చేయూత నిచ్చు.
  • "ఱవిక కట్టడపు దోరపు నిగ్గుజంటీలు, తనుల తాద్యుతికి గైదండ యొసగ." శుక. 1. 289.
  • "ఆదరమున శతమన్యుడు, కైదండ యొసంగ." పారి. 3. 23.

కై దువు పెట్టినవాడు

  • ఆయుధమును వదలినవాడు.
  • "జోడు వుచ్చినవానిని గైదువు బెట్టిన వానిని." భార. భీష్మ. 3. 303.

కై పదము

  • సమస్య.
  • "కైపద మిచ్చువారలును గ్రక్కున బద్యము చెప్పువారలున్." భోజ. 2. 50.

కై పెక్కు

  • పొగ రెక్కు; మత్తెక్కి తూలు.

కైపు మిగులు

  • కై పెక్కు.

కై మోడుపు

  • నమస్కారము.

కై లా గిచ్చు

  • చేయూత నిచ్చు.
  • "తన పాణిపల్లవము కైలా గిచ్చి." విప్ర. 4. 86.
  • "పరి, జనములు కైలా గొసంగ స్నానోన్ముఖు డై." విజయ. 1. 55.

కై లా గొసగు

  • చేయూత నిచ్చు.
  • "చిగురాకు వంటి కెంగేలు, గారము మీఱంగ గైలా గొసంగి." వర. రా. అయో. పు. 286. పంక్తి. 15.

కై వశముగా నుంచు

  • అధీనములో నుంచు.
  • "రఘుపతి తనచేతి విల్లు, వరుణుని యందు గైవశముగా నుంచి." వర. రా. బా. పు. 237. పంక్తి. 10.

కై వస మగు

  • లోబడు, వశ మగు.
  • "దానవైఖరిన్, హేమనగేంద్ర మొ కైవ్రా___కొంక 519 కొంకి___కొంకు
  • క్కనిక యిత్తురు కైవస మై చెలంగినన్." విప్ర. 2. 10.

కై వ్రాల బండు

  • వాలి పోవునట్లు నిండుగా పండు.
  • "కైవ్రాల బండె కలమవనంబుల్." కుమా. 6. 119.

కై వ్రాలు

  • వాలిపోవు; పడు.
  • వాలడం మీది పొద్దు వాలినటుగా అన్న అర్థంలో వయసును పోల్చుట అలవాటు కూడా ఉన్నది. 'నేను పెద్దవా ణ్ణయి పోయాను. సాయంత్రం కావచ్చింది.'
  • "ప్రాయ మింతకు మిగుల గైవ్రాల కుండ." కాశీ. 1. 7.

కై సేయు

  • అలంకరించు, అర్చించు.
  • "ఆ సమయమున గుమారిం గై సేసి..." విక్ర. 4. 192.
  • "ఏ, మును పూజించితి బిమ్మటన్ హరియు నంభోజాతగర్భుండునున్, గని కై సేసిరి." భీమ. 4. 203.

కొంకనక్క

  • ఒకరక మైన నక్క.
  • "చీమలు గాకులుం గ్రిములు జింకలు నక్కలు గొంకనక్కలున్." భార. అశ్వ. 2. 117.

కొంకరలు పోవు

  • చలితో సొట్టలు పోవు.
  • "కొంకరలు పోయిన నీ మెయి చక్క నొక్కి." రామా. 7. 258.
  • "అబ్బ! ఈ చలితో వేళ్ళు కొంకరలు పోతున్నవి." వా.

కొంకి కొంకక

  • జంకు కొంకులు లేక.
  • "వల చంగునను దాటివడి నేగు నొక లేటి, గొంకి కొంకక త్రొక్కి కూల్చె నొకడు." శుక. 1. 263.
  • చూ. కొంకికొను.

కొంకికొను

  • సంకోచించు.
  • "అనుమానముతో నొక కొంత కొంకి కొంచు." హంస. 1. 89.

కొంకి తెంచి ముడి గొంటే కుఱుచ

  • చెడిపోయి, సరి చేసికొంటూ కూర్చుంటే ఉన్నది తక్కువై పోతుంది అనుట.
  • దారాన్ని తెంచి తెంచి ముడి వేసిన ట్లెల్ల కురు చై పోతుంది కదా! తాళ్ల. సం. 8. 175.

కొంకు కొసరు

  • సంకోచము. జం.
  • "తొడలపై నిద్ర వోయెడు దుష్ట మృగము, గొంకు కొసరు లే కిటు లేల గూల ద్రోవు. విక్ర. 3. 97.
  • "కొంకు కొస రించుకయు లేక కూల దాచె." విరా. 2. 128.

కొంకుపడు

  • సంకోచించు. బ్రౌన్. కొంకు____కొంగ 520 కొంగ____కొంగు

కొంకుపాటు

  • సంకోచము.

కొంకు పెట్టు

  • సంకోచించు.
  • "కొంకు పెట్టక పెనుగద బెట్టు వ్రేయ." భార. సౌప్తి. 1. 169.

కొంకు వోవు

  • కొంకరలు వోవు.
  • "ఆపదం, బొరయక యుండ్ జేయుము ప్రభూతపు సీతున గొంకు వోయెడున్." భార. శాం. 3. 313.

కొంగకాళ్లు

  • పొడుగాటికాళ్ళున్న మనుష్యులను వెక్కిరింపుగా అనే మాట.
  • "ఆ కొంగకాళ్లకు పిల్ల నెవ్వ రిస్తారు రా?" వా.

కొంగజపం

  • ఒకధ్యానం.
  • పైకి మహాసాధువుగా నటిస్తూ లోన కుట్రలు పన్ను వారి యెడ ఉపయోగిస్తారు.
  • పంచతంత్రంలోని కొంగ - చేపల కథపై యేర్పడిన పలుకుబడి.
  • "వాడి దంతా కొంగజపం. ఆ యింట్లో కాస్త చనువు చిక్కితే ఆపిల్ల నెప్పుడో లేపుకొని పోతాడు." వా.

కొంగని బొడిచి వంగని వ్రాలంగ దివియు

  • గొప్పవానిని తగ్గించి తక్కువ వాని నెక్కువ చేయు అని కావచ్చు నేమో? సరిగా తేల లేదు.
  • "పోలంగ గొంగని బొడిచి వంగనిని, వ్రాలంగ దిగిచితి రేల బింకంబు." బస. 7. 185.

కొంగమెడ

  • పొడ వైన మెడ.
  • కాస్త నిరసనగానే అంటారు.
  • "ఆ! ఏ మందం? ఆ కొంగమెడా అదీ!" వా.

కొంగల మల్లయ్య

  • వట్టి డాబు మనిషి.

కొంగవాలు

  • ఒక రకమైన కత్తి.

కొంగవాల్నఱకులు

  • కత్తితో పడిన గాయములు. కొంగవా లనగా ఒక రకమైన కత్తి.
  • "కొంగ వాల్నఱకు లంగుళుల బట్టుచు జబ్బ, లంట గుట్టిడ వెజ్జు నరయు వారు." ఆము. 7. 21.

కొంగు ఈడ్చు

  • బట్ట పట్టి నిలవేయు. ఒంటిమిట్ట. 84.

కొంగు జారు

  • పైట జారు. తాళ్ల. సం. 6. 156.

కొంగుధనము

  • కొంగుబంగారము వంటిమాట.
  • "కోరి భజించు వారలకు గొంగుధనం బయి." పాండు. 2. 93. కొంగు____కొంగు 521 కొంగు____కొంగు

కొంగున కట్టుకొని తిరుగు

  • తన వశవర్తినిగా, తన వెనువెంటనే ఉంచుకొను.
  • ఇది ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో ప్రయుక్త మవుతుంది.
  • "ఆ పిల్ల మొగుణ్ణి కొంగున కట్టుకొని తిరుగుతూ ఉంటుంది. వాడు బయటికేం వస్తాడు?" వా.

కొంగున నగ్ని దాచినట్లు

  • దాచగూడని దానిని దాచగూడనిచోట దాచినట్లు.
  • ఆత్మ వ్యాఘాత మొనర్చు కొనె ననుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "మమ్ము నందఱ నెవ్వని మహితశక్తి, యెక్కు డై సంగరంబున జిక్కు పఱిచె, నట్టి కర్ణుని గొంగున నగ్ని డాచి, నట్టు లెమ్మెయి దాచితో యమ్మ చెపుమ!" భార. స్త్రీ. 2. 178.

కొంగున నున్న చిచ్చు

  • వినాశ కారి.
  • ఒడిలోని అగ్ని కాల్చి తీరును కదా!
  • "సురలకు గుండెతల్లడము, నూరుల డెందములోని కొఱ్ఱు, ఖే,చరతతి కంటిలో నలుసు, సాధ్యుల కొంగున నున్న చిచ్చు, భూ,సురులకు నెల్లనాడు మెడ జుట్టినపాము..." భాస్క. యుద్ధ.

కొంగున ముడిచిన మణి

  • అందుబాటులో నుండు అపూర్వవస్తువు; మనోరథ పూరకము.
  • "నొడువుల పడతుక మగనికి, బొడ చూపని తనదురూపు పొడగనిపించెన్, జడినిధిశయనుడు కొంగున ముడిచిన మణి గాదె భక్తముఖ్యుల కెల్లన్." పాండు. 2. 48.
  • చూ. కొంగుబంగారము.

కొంగు పట్టు

  • దేహి అను.
  • "ఎవ రెంత మాట రానిచ్చిన గొంగు వట్టితి మునీశ్వరులార!" పాండవో. 51.
  • "నే నెన్ని కష్టాలువచ్చినా ఒకరిముందు కొంగుపట్టి యెరగ నమ్మా తల్లీ." వా.

కొంగు పట్టుకొని తిరుగు

  • విధేయు డై ఆజ్ఞానువర్తి యై యుండు.
  • "వా డెప్పుడూ పెళ్లాం కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు." వా.

కొంగు పట్టుకొని నిలుచు

  • భిక్ష అడుగు, యాచించు.
  • "ఆవిడ ఒకరిముం దెన్నడూ కొంగు పట్టుకొని నిలిచి యెరుగదు. ముసలి తనంలో యాచిస్తూ ఉంది." వా.

కొంగు పఱచికొని

  • కోపమును, దు:ఖమును సూచిస్తూ పైట క్రింద పఱచికొని (పరుండు.)
  • పడక వేసుకొనకుండా పైట చెఱగునే పఱచుకొనుట సహజంగా కోపాన్ని సూచిస్తుంది. కొంగు____కొంగు 522 కొంగు____కొంగు
  • "గుబ్బకవమీది పయ్యెదకొంగు పఱచి, నేల బవళించు మగువ కన్నీరు దొరగ." శుక. 3. 483.

కొంగు పఱచు

  • 1. వ్యభిచరించు.'
  • దొంగచాటుగా వ్యభిచరించు వారు సామాన్యంగా ఎక్కడో ఒకచోట మంచాలూ, పరుపులూ లేకుండా కొంగునే పరుచుకొని పడుకొంటా రనుటపై వచ్చిన పలుకుబడి.
  • "వార లెల్లను బంగారువంటి నిన్ను, బాసి పలుగాకులకు గొంగుపఱచు చెలుల, నంటి..." శుక. 2. 120.
  • చూ. కాలెత్తు.
  • 2. కొంగు పట్టు.
  • ఏ దైనా భిక్షకు పాత్రకు బదులు కొంగు పట్టుట కూడా అలవాటు. అందుపై వచ్చిన అర్థం.
  • "కొంగు పఱచిరి నృపతు లాకూటి కొఱకు." రామలి. 23.
  • ఈ అర్థంలో ఈమాట వాడుకలో లేదు. వాడుకలో దీని రూపం కొంగు పట్టు.
  • చూ. కొంగు పట్టు.

కొంగుపసిడి

  • అందుబాటులో ఉన్న అమూల్య వస్తువు; సులభ లభ్యము.
  • "కోప మొకింత లేదు బుధకోటికి గొంగుబసిండి." విజ. 1. 88.
  • చూ. కొంగుబంగారము.

కొంగుపైడి

  • అందుబాటు లోనిది, కొంగు బంగారము.
  • "కోరి నుతించినవారి కొంగుపైడి." తాళ్ల. సం. 6. 173.
  • "కొలిచినవారల కొంగుపై డితడు." తాళ్ల. సం. 9. 130.

కొంగుపైడి యగు

  • అందుబాటులోని దగు.
  • "కోరినవరాలే కొంగుపైడి గాదా." తాళ్ల. సం. 7. 233.

కొంగుబంగార మగు

  • సులభలభ్య మగు.
  • అందుబాటులో నుండి ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించు కొన వీలయిన ధనము వంటి దగు.
  • కొంగునందు కట్టుకొన్న బంగారము అంతే కదా.
  • "రామానుజయ్య దాన, ప్రామాణిక ముద్ర కొంగుబంగార మగున్." పాండు. 1. 65.
  • చూ. కొంగుపసిడి; కొంగుపైడి.

కొంగుబత్తెము

  • కూలి గింజలు.
  • సామాన్యంగా కూలి గింజలను కూలీలు కొంగులో కొంగు____కొంగు 523 కొంగు____కొంగొ
  • పోసుకునే ఇళ్ళకు వెడతారు, అందుపై వచ్చినది.
  • "నిలిచిన కుప్ప కావలికి నిల్పుదు రప్పురి గొంగు బత్తెపుం, గొలువున కీయకొల్పి హలికుల్ బికిరంబు పొసంగు వేలుపున్." చంద్రా. 1. 25.

కొంగు మాయు

  • ము ట్టగు. బ్రౌన్.
  • చూ. చెఱగు మాయు.

కొంగుముడి

  • 1. వశవర్తిని అయినది.
  • "అంగన నాకు గొంగుముడి యై తగు నీ విపు డిచ్చునీవి..." రామా. 4. 162.
  • 2. ఇష్ట మైనది.
  • అందుబాటులో నుండునది.
  • ".......శుభప్రసంగ మంగనకు నొసంగ గొంగుముడి గాదె భవద్వచనంబు..." వసు. 3. 43.

కొంగుముడి వేసికొను

  • తప్పక అవుతుంది అన్న నమ్మకంతో ఉండు.
  • "మది తహతహ విడిచి యికన్, ముదమున సతులార~ కొంగుముడి వేసికొనుం, డిదె నేటి మాపటికి గూ,ర్చెద వాలాయముగ నేను బ్రియులను మిమ్మున్." ప్రభా. 5. 85.

కొంగుముడులు

  • పుణ్యతీర్థాలలో స్నానాదులు నిర్వర్తించేటప్పుడు భార్యా భర్తలు కొంగుముళ్లు వేసుకోవడం ఆచారం. అతని పంచకొనకూ, ఆవిడ చీరకొంగుకూ వేసే ముడులు కొంగుముడులు.
  • ఇ దెప్పుడూ బహువచనంలోనే ఉంటుంది.
  • "తిరుమల కంచి పుష్పగిరి తీర్థములుం జని కొంగుముళ్లతో, వరములు దంపతుల్ వడయ..." హంస. 2. 85.

కొంగురొక్కము

  • ధనము; ఈవలసిన డబ్బు. మామూలుగా పూర్వం డబ్బును కొంగున కట్టుకొనే వారు. అందుపై వచ్చినది.
  • "కొలది పుణ్యపాపాలే కొంగురొక్కములు వెట్టి, వెల దెంచి బేర మాడ వేగిరమె రారో!" తాళ్ల. సం. 8. 170.

కొంగొంగు రను

  • కొంగలు అలా అఱచు.
  • ధ్వన్యనుకరణము.
  • "కొంగలు చెలగి కొంగొంగు రనగ." హర. 5. 16.

కొంగొడ్డు

  • కొంగు పఱచు; సంభోగ సుఖ మిచ్చు.
  • ఇది కా లెత్తు అన్నట్లు నీచమునకు లోబడు అనే అర్థం లోనే ఉపయుక్త మవుతుంది.
  • "ఆడుపుట్టువు లోకంబునందు గష్ట, మందు గాసువీసములకై యబ్బినట్టి, పురుషులకు నెల్ల గొంగొడ్డి పొట్టపోసి, కొనెడి వెలయాలి బ్రదు కిట్టి దనగ నేల?" పరమ. 3. 207.
  • చూ. కొంగుపఱచు. కొంగో____కొంచు 524 కొంచె____కొంచె

కొంగోడు వడు

  • ఒఱిగిపోవు, ఒడ్డిగిల్లు.
  • "కులపర్వతములు కొంగోడు వడియె." మైరా. 2. 33.

కొంగోడు వోవు

  • ఒక మచంకోడు వదలిన దగు; ఒఱిగి పోవు.
  • "కుక్కి వడిన మిగుల గొంగోడు వోయిన...నుల్కమంచ మొప్పదండ్రు." వి. పు. 3. 215.

కొంచపడు

  • అల్పత చెందు; న్యూనపడు.
  • "కొంచపడితి నొక కొన్నాళ్లు, ఇంచు కంచు కిపు డెఱిగితినే." తాళ్ల. సం. 11. 2. భా. 17.
  • చూ. కొంచెపడు.

కొంచపఱుచు

  • కించపఱచు.
  • "తను గొంచ పఱతురె తరుణుల లోన." వర. రా. కిష్కి. పు. 357. పం. 17.
  • చూ. కొంచెపఱచు.

కొంచపాఱు

  • సంశయించు. బ్రౌన్.

కొంచియము చేయు

  • కించపఱచు, న్యూనతపఱచు; తక్కువ పఱచు.
  • "శ్యామోదయము కొంచియము చేయ నేతెంచి, శ్యామోదయము హెచ్చగ దనర్చె." చంద్రి. 4. 45.

కొంచుబోవు

  • తీసికొని పోవు.
  • "కూర్మినందన నింటికి గొంచు బోయె." హర. 3. 83.
  • వైదికులలో - ముఖ్యంగా పెద్దవారిలో ఈ రూపం నేటికీ అలవాటులో ఉంది.
  • అయితే ఈ 'చు' 'చ' గా మారడం కద్దు.
  • "వారసీ, మంతిని కీయనో వెలకు మార్చనొ యేటికి గొంచు బోయె ద,త్యంతరయాన..." హంస. 5. 233.
  • "ఈ ఆర్ఘ్యపాత్ర కొంచబోరా." వా.

కొంచెకత్తె

  • సామాన్యురాలు.
  • "ఉవిద నీ వెంత కొంచెకత్తెవె జయం తు, గాపు జేసినగరితవు కావె నీవు." కువల. 4. 173.
  • ఇదే అర్థంలో నేడు 'నీ వేం తక్కువ దానివా? - 'నీ వేం సామాన్యురాలివా' అంటారు. శ. ర. చెప్పిన 'సామాన్యురాలు' సరికాదని వావిళ్ళ ని. అమాయకురా లనుట సరికాదు.

కొంచెకాడు

  • సామాన్యుడు.
  • "కొంచెకాడవె, యన్నన్న నఖాగ్ర నిర్జితారివి గాదే." శుక. 3. 285.
  • వాడుకలో రూపం:
  • "నీ వేం సామాన్యుడవా? దేశాలుజయించినవాడివి." వా.
  • "వా డేం తక్కువవాడా? దేశం తిరిగిన వాడు." వా.
  • చూ. కొంచెకత్తె.

కొంచెపడు

  • 1. కిందపడు, న్యూనపడు.
  • "ఒరు నొద్ద కేగి హైన్యము, పరికింపంగ వేడి కొంచెపడియెడుకన్నన్, మరణం బుత్కృష్టము..." శివధ. 5. 94.
  • 2. అసంపూర్ణ మగు.
  • "తరుణి నీచేత మదనతంత్రంబు లెఱుగ, గోరి యున్నాడునాయాస కొంచెపడక, యుండ సురతసుఖాంబుధి నోల లార్చి, యింపు సొంపార నన్ను మన్నింప వలయు." వి.పు. 2. 217.
  • 3. తక్కు వగు.
  • "తండ్రీ నీ ప్రాసాదంబున నన్నియు సమకూరెడుం గాక కొంచెపడి యెడునే." భోజ. 6. 191.

కొంచెపఱుచు

  • న్యూనపఱచు.
  • "వాసి గను మమ్మ కులశీలవర్తనములు, కొంచెపఱుపక..." వరాహ. 2. 124.

కొంచెపు కవులు

  • కుకవులు. అల్పు లనుట.
  • "వంచకు లగు కొంచెపుంగవుల రవళి యదలించి." పాండు. 1. 16.

కొంచెపునరుడు

  • అల్పుడు. సుమతి. 40.

కొంచెపువాడు

  • అల్పుడు.
  • "పరిమార్తు గొంచెపువా రై యున్నెడన..." భార. ఉద్యో. 1. 14.

కొంచె మగు

  • తక్కు వగు.
  • "ది,క్సీమాగోళము నంతకంతకును గొంచెం బయ్యె లేజీకటిన్." జైమి. 5. 155.

కొంచెమా

  • సామాన్యమా.
  • "అమ్మానినితో పొందు కొంచెమా." శుక. 4. 16.

కొంచెమా నంచెమా?

  • అదేం తక్కువా? జం.
  • "పోతే పోయిందనుకోడాని కదేం కొంచెమా నంచెమా? పదివేల రూపాయలే!" వా.
  • రూ. కొంచెం నంచెమా?

కొంచెము గొప్ప

  • ఏ కొంచెమో.
  • "కొంచెము గొప్ప సంతసము గొల్పిన." పాణి. 1. 15.
  • చూ. కొంచెమో గొప్పో.

కొంచెమో గొప్పో

  • ఏ కొంచెమో.
  • "కొంచెమో గొప్పో ఒకరికి సాయపడితే వారూ మనకు సాయం చేస్తారు." వా.
  • చూ. కొంచెము గొప్ప.

కొంటెకోణంగి

  • కొంటెవాడు.
  • "వాడు ఒట్టి కొంటెకోణంగి." వా.
  • చూ. కొంటెకోణాలు.

కొంటెకోణాలు

  • చూ. కొంటెకోణంగి.

కొంటెపాడి కట్ట

  • ధూర్తుడు, దుష్టుడు. బ్రౌన్. కొంటెభాగోతులు
  • కొంటెకోణంగులు. కుక్కు. 22.

కొండ !

  • అదే గొప్ప, ఘనకార్యం.
  • "రండల కొడుకులు యాచక, తండంబుల కేమి త్రవ్వి తల కెత్తేరా, రెండాకు లొక్క పోకయు, గొండ సుమీ దానశర్వ కోమటి గుర్వా!" - చాటువు.
  • "కొండధరించుట నాకొక కొండా ?" హరి. పూ. 7. 179.

కొండంత.....

  • ఎక్కు వైన; గొప్ప అయిన.
  • "కొడుకు పుట్టెడు నని కొండంత యాసతో, నుండంగ దుది గూతు రుద్భవించె." భోజ. 3. 140.

కొండంత కనకము పోకకు వెలా

  • అసంభవ మనుట, పోక కంత వెలా? తాళ్ల. సం. 9. 285.

కొండంతటి దేవర

  • గొప్ప దైవము. సారం. 1. 16.

కొండంత దేవరకు కొండంత పత్రి పెట్ట గలమా ?

  • గొప్పవారిని అంత గొప్పగానూ గౌరవించ లే మనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "కొండికలము మన కెంతటి, దండి గలుగు నధికవస్తుతతి హరి కొసగన్, గొండంత దేవునకు మఱి, కొండంతయు బత్రి యిడెడు కుశలులు గలరే?" కుచే. 1. 110.

కొండంత పని

  • పెద్ద పని.
  • "అకట ! మోసంబు లేదు కొండంత పనికి, నైన బతిమాలి నీవు పొ మ్మన్న వెడలి." శుక. 2. 376.
  • కొండంత అన్నది గొప్ప అనే అర్థంలో చాలా రూపాలలో కానవస్తుంది.
  • చూ. కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టగలమా? సా.
  • "కొండంత రెడ్డి వచ్చి కొంగు పట్టుకొంటే ఊ అనగుడీనా (గూడునా?) ఆ అనగుడీనా? (గూడునా?)" సా.

కొండకోతి

  • 1. కొంటె కోణంగి.
  • "దానితో నేం లే. అది వట్టి కొండకోతి. అలాగే వెక్కిరిస్తుంది." వా.
  • 2. ఒక పిల్లల ఆట.
  • "దాగిలిమూతలు...గురిగింజ కొండకోతి." హంస. 3. 146.
  • ఇలా కొండతో చేరి అక్కడి - కొండలోని - అనే అర్థంలో చాలా పదా లున్నవి. కొండ కంది, కొండకాకి, కొండగుమ్ముడు, కొండగొఱ్ఱె...ఇత్యాదులు. ప్రత్యేకించి విశేషార్థ మున్న వే ఇట ఉట్టంకి తాలు. మిగతవి ఊహ్యములు.

కొండగా గను

  • గొప్పగా భావించు.
  • "అణుమాత్ర మైన యొక కానుక దెచ్చినఁ గొండగాఁ గనున్. విజయ. 1. 33.
  • "ఆ కొడుకునే కొండగా చూసు కుంటూ బతుకుతున్న దా తల్లి." వా.

కొండగా తలచు

  • గొప్పగా భావించు.
  • "తా నెఱింగియు నీ జాతి గాని దాని, మాట లెల్లను గొండగా మదిఁ దలంచి." విప్ర. 4. 77

కొండ చేయు.

  • గొప్ప చేయు.
  • "గట్టి చన్గవ చేత ముట్టి చూచెద మన్నఁ జెలి యది యొక కొండఁ జేసుకొనెదు." సారంగ. 2. 224.
  • "ఈ కొండమణి కాంచనాకారరుచిఁ గాంచెఁ గొండ లెల్లను దనుఁ గొండ చేయ." విక్ర. 2. 15.

కొండ దాకు

  • అధిక మగు.
  • "నిండువేడుక మిన్నంది కొండ దాఁకె." విజయ. 2. 20.

కొండదాసరి

  • దాసరులలో ఒకభేదం. తర్వాత దాసరికంటె తక్కువైన నీచభిక్షుకుడుగా మారినది.
  • చూ. కొండదాసరితనము.

కొండదాసరితనము

  • నీచభిక్షావృత్తి.
  • "తనదు చెల్లెలి దొడ్డభూధవున కిచ్చి, యతనివలనను సిరి గాంచు నంతకంటె, సార మై తోఁచుఁ గొండదాసరితనంబు." రామలిం. 78.
  • వివరం. చూ. కొండదాసరి.

కొండనాలుక

  • చిఱునాలుక, కిఱునాలుక.
  • "ఎచ్చోట ముచ్చిచ్చు నేడేసి నాల్కలు, కొండనాల్కల దాఁకఁ గోఁతవడియె." భీమ. 3. 37.

కొండను తగరు డీకొన్నట్లు

  • అల్పుడు అధికునిపై విజృంభించేపట్ల ఉపయోగించే పలుకుబడి. పొట్టేలు కొండను డీకొన్నట్లనుట.
  • "గాంఢీవధన్వు నాహవ, పాండిత్యము దలఁప నతని భండనమున మా,ర్కొండు నని యొకఁడు గడఁగుట, కొండం గని తగరుఁ దాఁకఁ గోరుట గాదే." భార. ఉద్యో. 1. 237.

కొండను తవ్వి యెలుకను పట్టు

  • ఎంతో పని చేసి స్వల్ప లాభము పొందు.
  • "ఎంత దవ్వులనుండియో యేఁగుదెంచి, కడెడు మెతుకులకై యింత కష్టపడెడు, కటకటా! యమ్మహీసురాగ్రణి విధంబు, కొండ ద్రవ్వియు నెలుకను గొనుట యయ్యె." కుచే. 2. 112.

కొండ పట్టు

  • దేశాంతరగతు డగు.
  • "గద్దియ డిగ్గి కౌశికుఁడు గాదిలి నూనుఁడు కొండ పట్టినన్." కాశీ. 6. 21.
  • చూ. కొండలు పట్టు.

కొండ పిండి గావించు

  • కొండలను పిండి కొట్టు; అసాధ్య కార్యాలు నిర్వర్తించు.
  • "పిండి గావింతుమో వెండికొండ." కా. మా. 2. 24.
  • ఎట్టి దుష్కరకార్య మైనను చేయుటకు మేము సిద్ధ మనుటను సూచించును. ఇది కొన్ని భిన్నరూపాలలో కనబడుతుంది.
  • "కొండ లన్ని పిండి గొట్ట వచ్చు." వేమన.

కొండపిండి కూరు

  • ఒకానొక చెట్టుపూత దూదికి బదులు పరుపుల్లో దిండ్లలో పెడతారు. ఆ పని చేయు.
  • "బూరుగుదూది కాదు కొండపిండి దిండ్లలో కూరారు." వా.

కొండపొడవు

  • అత్యధికముగా ; రాసులుగా.
  • "కొండపొడవు దెచ్చి వైచిరి." విజయ. 2. 90.

కొండమంగలి క్షౌరం

  • సగం సగం చేసిన పని; ఎగుడు దిగుడుగా చేసినపని.
  • తిరుపతికొండ - తిరుమలపై వెంట్రుక లిచ్చేవా రెక్కువ. అక్కడి మంగళ్ళు బేరం పోకుండా ఒకొకరికి కొంచెం కొంచెం క్షౌరం చేసి కూచుండ పెడతా రని ఒక ప్రతీతి. ఆ జనం ఎక్కువ గనుక ఎగుడు దిగుడుగా నాలుగు బరుకులు బరికి వదిలి పెడతా రన్నది మరొకటి. ఇలాంటివానిపై ఏర్పడిన పలుకుబడి.

కొండమనిషి

  • అనాగరకుడు.
  • "అత నేం కొండమనిషిలా ఆడాళ్ళు కనబడితే అలా నోరు తెరుచుకొని చూస్తా డేం ?" వా.

కొండమల్ల య్య

  • శ్రీశైలమల్లి కార్జునుడు.
  • "కొండమల్లయ్యచే నుండు నందురు గాని, జింకను గాన మే వంక నైన." యయా. 1. 105.

కొండమీద కోతి దిగి వచ్చు

  • ఎలాంటి దైనా అందుబాటులోనికి వచ్చు.
  • "చేతిలో డబ్బు ఉంటే కొండమీద కోతి దిగి వస్తుంది." వా.

కొండముచ్చు

  • కొండముచ్చువలె మూతి ముడుచుకొని ఏమీ అనకుండా ఉండేవారి నంటారు.
  • "ఆపిల్ల కొండముచ్చులా కూచుంటుంది." వా. కొండముసవ
  • మూతి ముడుచుకొని ఏమీ తెలియనట్లు నటించే మనిషి.
  • "అదా అమ్మా కొండముసవ. లోపల కావలసినన్ని బుద్దు లున్నాయి గానీ." వా.

కొండ యెంత వజ్ర మెంత ?

  • చురు కైనది చిన్న దైనా చాలును అనుట.
  • "కొండ పెద్ద దైనా వజ్రం చిన్న దైనా భేదిస్తుంది. నారాయణదాసు భీష్మచరిత్ర.

కొండ యెక్కు

  • 1. గొప్పకు పోవు; విఱ్ఱవీగు.
  • "కొండ యెక్కెదు బతిమాలుకొనిన కొలఁది" సిం. నార. 17
  • "వానిదగ్గరికి పదే పదే వెళ్ళి అడిగామంటే కొండెక్కు తాడు." వా.
  • రూ. కొండెక్కు.
  • 2. దీపం అరిపోవు.
  • "దీపం కొండ యెక్కుతూందిరా. కాస్త ఎగదొయ్యి." వా.

కొండల కేగు

  • అడవుల బట్టు; అనాథ మగు.
  • "కొండల కేఁగెను సత్యము." తాళ్ల. సం. 5. 63.
  • చూ. అడవుల బట్టు.

కొండల నునుపులు

  • పైపై మెఱుగులు; తాళ్ల. సం. 5. 24

కొండలు కోటలు చేసి చెప్పు

  • గోరంతలు కొండంతలు చేసి చెప్పు. తక్కువ వానిని ఎక్కువ చేసి చెప్పు.
  • ".......నీ యపకారకృత్యముల్, గుఱి గడవం బ్రియంబుతమిఁ గొండలు కోటలు చేసి చెప్పితిన్." పంచ. (వేం) 4. 147.

కొండలు దొంతి పేర్చ నేర్చు

  • కొండలను ఒకటిపై ఒకటి పేర్చ నేర్చు.
  • అసాధ్య కార్యములను చేయగల నేర్పరు లని నిరసనగా అనుటలో ఏర్పడిన పలుకుబడి. పండితా. ప్రథ. పురా. పుట. 359.

కొండలు పట్టు

  • దిక్కు కొక రై చెదరిపోవు. దేశాలపా లయి పోవు.
  • "ఆ ఆఢ్యుడు కాస్తా పోయేసరికి యావత్ కుటంబమూ కొండలు పట్టి పోయింది." వా.
  • చూ. కొండపట్టు.

కొండలు పెరుగు

  • ఎక్కు వగు; కొండలుగా పెరుగు.
  • "కోరేటి కోర్కెలు కొండలు పెరుగు." తాళ్ల. సం. 8. 50.

కొండ లేర్లు పండు

  • ఎక్కువగా పండు.
  • కొండలూ, ఏర్లూ పంటకు అనువు గానివి కనుక అవికూడా పండుట సహజంగా సర్వసిద్ధిసూచకం కదా! "కోరినసస్యముల్ కొండలేర్లును బండు." రుక్మాం. 1. 136.
  • ముద్రిత పాఠమున ;కొండ వేలును బండు' అని యున్నది. అది సరి యయిన దనిపించదు.

కొండవీటి చేంతాడు

  • సుదీర్ఘ మని యెత్తి పొడుపుగా అనుమాట.
  • "ఈ ఉపన్యాసం కొండవీటి చేంతాడులా ఉంది. తొమ్మి దైనా ముగిసేట్టు లేదు." వా.
  • నీళ్లు దొరకని ఊళ్ళలో బావులు లోతుగా ఉండడం, సహజంగా అక్కడి చేంతాళ్లు పొడవుగా ఉండడం పురస్కరించుకొని కొండవీటికి బదులు అక్కడక్కడి వారు ఆ యా ఊళ్లను చేర్చి ఈ చేంతాడు నుపయోగించడం కూడా ఆయా ప్రాంతాలలో కానవస్తుంది.
  • రామలింగాయపల్లె చేంతాడు; కొల్లేటి చేంతాడు.

కొండవేలును పండు

  • సమృద్ధిగా పండు.
  • "కోరిన సస్యముల్ కొండవేలును బండు, నెల్లకాలము ఫలియించుఁ దరులు." రుక్మాం. 1. 14.
  • ఈ పాఠం సరికా దనిపిస్తుంది. అర్థం ఎలా వచ్చిందో కుదరదు. వివరానికి...
  • చూ. కొండ లేర్లు పండు.

కొండాటముగా

  • ప్రోత్సాహకముగా.
  • "గండారన్ మదసౌరభంబునకు బింకం బెక్కఁ గ్రోధాగ్నికిన్, గొండాటంబుగ దానసంపదకు నా ఘోషంబుగా..." కుమా. 1. 86.
  • కొండాట. కొండాటము = స్తుతి, వ్యాసంగము, కలహము, కలహశీలము అను అర్థములలో కోశములు ప్రయోగము లిచ్చినవి. ఇక్కడ ఇది విభిన్నార్థద్యోతక మై పైన యిచ్చిన తీరున ఉన్నది.

కొండాటము సేయు

  • పొగడు.
  • "కుచ్చితకాం డ్రన్నఁ గొండాటములు సేయు." మల్హ. 3. 4.

కొండాడు

  • గొప్పగా స్తుతించు. 'కొండ అని ఆడు' అనురీతిగా ఏర్పడి ఉండవచ్చును.
  • "చేడియ యీ నృపాలకుల శేఖరు ... కొండాడఁగ వేయినోళ్లు వలె..." రాజ. చ. 3. 132.

కొండికవాడు

  • చిన్నవాడు, బాలుడు.
  • "ఇప్పు డీ, కొండికవాని నమ్మి పగ గో లిది కార్యమె?" కుమా. 10. 162.

కొండుకవాడు

  • చిన్న వాడు.
  • "వానికిం గొండుకవాని విచిత్రవీర్యు రాజ్యాభిషిక్తుం జేసి..." భార. ఆది. 4. 113.
  • "పరశురాముడు ....దండితాహితుండు గొండుక యయ్యును, దద్ద గుణము లందుఁ బెద్ద యయ్యె." భార. ఆది. 3. 70.

కొండెకత్తె

  • కొండెములు చెప్పునది.

కొండెకాడు

  • కొండెములు చెప్పేవాడు.

కొండెకు నీ రెక్కు

  • పొగ రెక్కు.
  • "వీడి కీ ఊరు నీళ్లు తాగేటప్పటికి కొండెకు నీ రెక్కింది. వీ డింక మనమాట వింటాడా?" వా.

కొండెక్కి కూర్చుండు

  • కలిసి రాక ఉండు. గర్వించి పైన కూర్చొను.
  • "ఏదో నలుగురం కలిసి ఈ వ్యవహారం పరిష్కరించి వేద్దా మనుకుంటే వాడు కొండెక్కి కూర్చుంటున్నాడు." వా.
  • "పిల్ల నిస్తామని మనం వెళ్లే కొద్దీ వాళ్లు కొండెక్కి కూర్చుంటున్నారు." వా.
  • చూ. కొఱ్ఱెక్కి కూర్చుండు; కొండ యెక్కు; కొండెక్కు.

కొండెక్కు

  • తా నేదో మరీ గొప్పవాని వలె పై కెక్కి కూర్చొను.
  • "కొండ యెక్కెదు బ్రతిమాలుకొనిన కొలఁది." సింహాద్రి. శత. 17.
  • "వాని వెనకబడేకొద్దీ వాడు కొండెక్కు తున్నాడు." వా.
  • చూ. కొండ యెక్కు.

కొండెము లల్లు

  • చాడీలు చెప్పు.
  • "వాడిమీదా వీడిమీద కొండేలు అల్లుతూ ఉండడమే వీడిపని." వా.

కొండెములు చెప్పు

  • చాడీలు చెప్పు.
  • "కొండెముల్ చెప్పక యుండ విరాట భూ,వరుని వాకిటి చనవరుల కిచ్చి." శుక. 4. 111.

కొండొక

  • ఒకానొక; చిన్నని... కాస్త...
  • కొండొకడు, కొండొక ప్రొద్దు, కొండొక తొలంగి... ఇత్యాదుల్లో విభిన్న చ్ఛాయలలో ఈ మాట కలిసి వినిపిస్తుంది ఆ యా సందర్భాల బట్టి ఊహించుకొనవలెను.

కొండొక నవ్వు

  • చిఱునవ్వు అని నిఘంటువులు. ఒకనొక విలక్షణ మైన నవ్వు కావచ్చును.
  • "అనినఁ గొండొక న వ్వొలయంగఁ జూచి." భార. విరా. 5. 114.

కొండొక ప్రొద్దు

  • కాసేపు; కొంత సేపు. బస. 5. 127.

కొండొకవాడు

  • చిన్న వాడు.
  • "వీఁడు కొండొకవాఁడు విపినభూములకుఁ, గనికరింపక పంపఁగా నెట్లు వచ్చు ?" గౌర. హరి. ఉ. భా. పం. 1861 - 1862 పం.

కొండ్ర చేయు

  • వ్యవసాయము చేయు. బ్రౌన్.

కొండ్రపోతు

  • ఎలుగుబంటి. బ్రౌన్.

కొంతముకాడు

  • బల్లెం ధరించిన యుద్ధంలోని సైనికుడు. కుమా. 11. 40.
  • చూ. సవడికాడు.

కొందలపడు

  • కలత చెందు.
  • "మనంబు గొందలపడఁగా." భార. ద్రో. 2. 292.

కొందలపఱచు

  • కలత చెందించు.
  • "ఇట్లను వగలు మిగిలి కొందలపఱుపన్." భార. విరా. 1. 97.

కొందలపాటు

  • కలత.

కొందల పెట్టు

  • కలత పెట్టు.
  • "దైత్యుఁడు మమ్ము నింక నే, కొలఁదుల సైఁచునే కరము కొందల పెట్టక." హరి. 4. 22.

కొంపకు నిప్పు పెట్టు

  • కొంప ముట్టించు.
  • "వాడు ఉన్నన్ని నాళ్లూ ఉండి ఆ కొంపకు నిప్పు పెట్టి పోయాడు. మగని మీద పెండ్లానికీ, పెండ్లాంమీద మగనికీ నూరి పోశాడు వెధవ." వా.
  • చూ. కొంపలు ముట్టించు.

కొంప కూల్చు

  • కొంప ముంచు, పాడు చేయు.
  • "...నీవగ లెల్లఁ గంటి మిటు నేర్చితివా యతివా కుమారుఁడున్, నీవును గొంప గూల్చితిరి నేర్పరికూఁతలు చాలుఁజాలు..." సానందో. 5. 179. పు.
  • చూ. కొంప చెఱచు.

కొంప గుండ మగు

  • కొంప గుల్ల యగు; సర్వస్వం నాశ మగు.
  • "తినఁగాఁ గొంపయు గుండ మై దొసగు ప్రాప్తించెం గదే జూదమా ?" వ్యస. నాట. 29.

కొంప గుల్ల చేయు

  • కొంప కూల్చు.
  • "ఎన్ని కొంపలో, గుల్లలు చేసి..." పాణి. 2. 19.
  • చూ. ఇల్లు గుల్ల చేయు.

కొంప చెఱుచు

  • సర్వనాశనము చేయు.
  • "అని వారు తన్నుఁ దునుమం, బనుచుటయును వారికొంప చెఱచుటకై దే,వుని వెనుక నుండి..." శుక. 3. 95.
  • "ఆవిడ డబ్బంతా ఆ కంపెనీలో పెట్టించి వాడు కొంప చెఱిచాడు." వా.
  • చూ. కొంప కూల్చు. కొంప లార్పు, కొంప తీయు. కొంపచెఱుపు
  • ధూర్తుడు, దుష్టుడు.
  • "కొంటె కసుమాలమును దూబ కొంప చెఱుపు." హంస. 5. 113.

కొంప తీయు

  • పాడు చేయు.
  • "ఆవిధి యేమి సేయును మహా ముని ముఖ్యుల మంచుఁ గొంద ఱీ, జీవుల కొంప దీయఁ గడుఁ జిక్కుగ వ్రాసిరి..." కవిమాయ. 4. 73.
  • "తియ్యగా మాటలు చెప్పి నమ్మించి ఆ పిల్ల కొంప తీశా డా వెధవ." వా.
  • చూ. కొంపలు తీయు.

కొంప దీసి.....!

  • ఒక వేళ అలాంటి అనాహూతం జరగ లేదు కదా ! అనుపట్ల ఉపస్కారకపదంగా వినవచ్చే పలుకుబడి.
  • "మనం అన్న మాటలు కొంపదీసి వాడు వినలేదు కదా!" వా.

కొంప నట్టేటిలో గట్టు

  • కూడనిపని చేయు. వ్యసన. నాట. 4.

కొంపమీద పడి తిను

  • ఒకరి యింట చేరి వారి తిండితో బతుకు. అలా తినుటకు అధికారం లేనివారి యెడనే ఉపయోగిస్తారు.
  • "వాళ్లంతా ఆ పిల్ల కొంపమీద పడి తింటున్నారు. ఇంక అ దేం ముందు కొస్తుంది ?" వా.

కొంప ముంచు

  • సర్వనాశనం చేయు.
  • "అన్న కదా అని ఆవిడ ఆస్తి అంతా తీసుక వస్తే, వీడు ఆవిడ కొంప ముంచాడు." వా.
  • చూ. కొంప తీయు.

కొంప మునిగిపోవు

  • అనిష్టము సంప్రాప్త మగు.
  • "ఇం కేముంది? కొంప మునిగి పోయింది. మనవాడు వెళ్లి వాళ్లపక్షాన సాక్ష్యమిస్తా నన్నాట్ట." వా.

కొంప మునుగు

  • అనిష్టము సంప్రాప్తించు.
  • "ఏదో కొంప మునిగినట్లు అర్ధరాత్రి పరుగెత్తు కొచ్చాడు. చేబదులు కావాలట చేబదులు!" వా.

కొంపమ్ముకొను

  • ఉన్న ఆస్తి పాస్తులను పాడు చేసుకొను.
  • "సుందరిని గూడి కొంపమ్ముకొనఁగ లేదొ." శ్రవ. 2. 60.
  • వాడుకలో రూపం: 'కొంపమ్ముకొని పోయాడు' అన్నట్లు ఆత్మ నేపదంగానే ఈ క్రియ వినవస్తుంది.

కొంప లంటుకొను

  • అనాహూతము దాపురించు. విపరీత మైన నష్టమో, ఆపదో వచ్చిన దని చెప్పే పట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "నీవు ఏమో ఒకమాట అని వచ్చావు. అక్కడ కొంపలు అంటుకొన్నాయి." వా.
  • "ఇంత అర్ధరాత్రిలో వెళ్లడం ఎందుకురా? ఏం కొంప లంటుకొన్నాయని?" వా.
  • "వాణ్ణి అలా స్వేచ్ఛగా వదిలేశా వంటే కొంప లంటుకుంటాయి. జాగ్రత్త." వా.

కొంప లార్పు

  • కొంపలు తీయు; ఇతరులను నమ్మించి వారిని పాడు చేయు.
  • "వాడు వట్టి కొంపలార్పే రకం. అట్లా వానితో నీకు స్నేహం ఏమిటి ?" వా.
  • చూ. కొంప తీయు; కొంప చెఱుచు.

కొంపలు కాల్చు

  • చూ. కొంప లార్పు.

కొంపలు తీయు

  • కొంపలు నాశనము చేయు.
  • "వాడు ఇప్పటికి ఎన్ని కొంపలు తీశాడో? ఇప్పుడు ఈయిల్లు చేరాడు." వా.
  • చూ. కొంప లార్పు.

కొంపలు ముంచు

  • ఇతరులను నమ్మించి సర్వనాశనము చేయు.
  • "వాడు ఈపాటికి ఎన్ని కొంపలు ముంచాడో? ఇక్కడ తయారయ్యాడూ." వా.
  • చూ. కొంపలు తీయు, కొంప లార్పు.

కొంపలు ముట్టించే కొఱివి

  • తగాదాలు పెట్టే రకం.
  • "అది ఒట్టి కొంపలు ముట్టించే కొఱివి. అ అన్నదమ్ము లిద్దరూ వే ఱయి పోవడానికి ఇదే కారణం." వా.

కొంపా గోడీ లేదు

  • ఆస్తిపాస్తు ల్లేవు. జం.
  • ఈ గోడీ గోరీ కావచ్చును. బతికినప్పుడు కొంప ఎలాగో, చచ్చినప్పుడు గోరీ అలాగు. అది కూడా లే దనుట.
  • "వాడికి కొంపా గోడీ లేదు. ఏమి చూచి పిల్ల నివ్వ మంటావో తెలీదు." వా.

కొంపోవు

  • తీసికొనిపోవు.
  • "చయ్యనఁ గొంపోయి." రుక్మాం. 5. 80.
  • "చంపినను జంపు నన్నటు, గొంపో కుండినను జాలు." ప్రభా. 3. 143.

కొకిబికి

  • కొక్కిరి బిక్కిరి.
  • "కొకిబికి యంగమున." రాధా. 6. 107.

కొక్కిరి బిక్కిరి

  • అస్తవ్యస్త మయిన.
  • "చెప్పఁగాఁ దొడఁగెఁ గొక్కిరి బిక్కిరి పద్యపుంజముల్." గుంటూ. పూ. పు. 17.

కొక్కురోకో అను

  • కోడి కూయు. ధ్వన్యనుకరణము.
  • "అప్సర స్త్రీనికేతనాభ్యంతరములఁ, గొక్కురోకో యటంచును గోళ్ళు కూసె." హర. 7. 137.

కొక్కొక్కో అను

  • కోడి కూయు. ధ్వన్యనుకరణము.