పదబంధ పారిజాతము/కట్టుకంబము

కట్టి_____కట్టి 347 కట్టు_____కట్టు

కట్టిన ముడుపు

  • అందుబాటులో నున్న అమూల్యవస్తువు. కొంగుపసిడివంటిది.
  • "కట్టినముడుపు వెంకటనిలయుడు." తాళ్ల. సం. 11. 55.

కట్టిపెట్టు

  • 1. చాలించు.
  • "నీ మాటలు కట్టిపెట్టి చనుమా." రసిక. 3. 45/
  • "మీ వారి నడతలు గట్టి పెట్టి... న్యాయంబు లాడె దౌర. శశాం. 3. 81.
  • "గర్వసంరంభంబు గట్టిపెట్టు." భీమ. 1. 62.
  • "ఆ గంధర్వముపై వాంఛలు గట్టిపెట్టి." జైమి. 4. 9.
  • "నీ కాని తలపులు గట్టిపెట్టి." జైమి. 1. 61. శివ. 2. 102.
  • "నీ డంబా లింక కట్టిపెట్టు - ఎవరికి తెలియవు?" వా.
  • 2. కట్టించి యిచ్చు.
  • "కలుమఠం బొండె నిల్లొండె గట్టిపెట్టి." భీమ. 6. 55.

కట్టివేయు

  • ఆగు; త్రాళ్ళు మొదలగు వానితో బంధించు.
  • "వానికి నిన్నటినుంచీ మూత్రం కట్టి వేసింది." వా.
  • "రాత్రంతా ఉండిన వాంతులూ, భేదులూ ఒక్క మాత్రతో కట్టివేశాయి." వా.
  • "యజమాని కాళ్లూ చేతులూ కట్టివేసి దొంగలు పారిపోయారు." వా.

కట్టుకంబము

  • ఆలాన స్తంభము. ఏనుగులను కట్టునట్టి స్తంభము.
  • "కట్టుకంబము డుంఠి గంధద్విపమునకు." కాశీ. 5. 135.

కట్టు కట్టు

  • 1. ఒక మాటపై నిలబడు, సమ్మె చేయు.
  • "ఆ మిల్లులో కార్మికు లంతా కట్టు కట్టినారు." వా.
  • 2. మంత్రములతో దిగ్బంధ నాదులు చేయు.
  • "ఆ మంత్రగాడు కట్టు కట్టేసరికి పాడుతున్నవా డల్లా అలా ఆగిపోయాడు." వా.

కట్టుకథ

  • కల్పితకథ; పుకారు. మాటా. 58.

కట్టు కాపించు

  • ...........పరిపాలించు.
  • "కట్ట గాపింప దక్షత లేమి నూరూర, బందెల బడిపోయె బశుగణంబు." మను. 3. 129.
  • వాడుకలోరూపం మారుతుంది.
  • "కట్టేవాడూ కాసేవాడూ లేక పశువులు దిక్కు కొకటి పోతున్నవి." వా.

కట్టుకొంగు

  • చీర తొలిచుట్టు చుట్టి ముడి వేసుకొను కొంగు. కట్టు____కట్టు 348 కట్టు____కట్టు
  • "ఒక యిసుమంత వీడె గట్టుం గొంగున్." విజ. 2. 178. దశా. 3. 89.
  • "ఈ చీర కట్టుకొంగుకంటే పైకొంగే భాగా ఉండి." వా.

కట్టుకొను

  • 1. వివాహ మాడు. ఇది దక్షిణాంధ్రంలో ఈ అర్థంలో విశేషంగా వాడుకలో ఉన్నది.
  • "మన పక్కింటి అమ్మాయిని వాడు కట్టుకొన్నాడు." వా.
  • 2. ధరించు.
  • "ఆవిడ చీర కట్టుకొని వచ్చేసరికి బండివేళ కాస్తా దాటిపోయింది." వా.

కట్టుకొమ్మ

  • అడ్డుకట్ట, ఆనకట్ట.

కట్టుకోక

  • మామూలుగా రోజువారీ కట్టుకొనే చీర.
  • "దానికి కట్టుకోకలే లేవు. ఇంక దాపుడు కోకలు ఎక్కడనుంచి వస్తాయి." వా.
  • చూ. కట్టుచీర; దాపుడుకోక.

కట్టుగడ

  • దాపుడుధనము. బ్రౌను.

కట్టుగడ సేయు

  • దాచు. బ్రౌను.

కట్టుగుండు

  • 1. రాళ్లను పగులగొట్టుగుండు.
  • "కొంద గట్టెడుకట్టుగుండ్లరవము." పరమయో. 5. 40. చంద్రా. 4. 214.
  • 2. తూనిక రాయి.
  • "ఈ కట్టుగుం డేమీ సరిగా ఉన్నట్టు లేదు. తాలూకా కచ్చేరిముద్ర ఉన్నదైతే కానీ నేను ఒప్పుకోను." వా.

కట్టుగుడ్డలతో

  • వస్త్రమాత్ర నిర్వి శేషముగా. దేవీ. 7. 512.

కట్టుగుఱ్ఱము

  • కట్టివేసిన గుఱ్ఱము. బ్రౌను.

కట్టుగొయ్య

  • పశువులు మొదలయినవానిని కట్టివేయుటకై పాతిన కొయ్య.
  • "కట్టుకొయ్యకు జేరి కామధేనువు దప్పె." కామా. 4. 111.

కట్టుగొట్టు

  • కట్టుగొయ్య.
  • చూ. కట్టుగొయ్య.

కట్టుగొఱ్ఱె

  • చంపుటకై కట్టివేసిన గొఱ్ఱె. బ్రౌను.

కట్టుచీర

  • రోజువారీ కట్టుకునే మామూలు చీర.
  • చూ. కట్టుకోక.

కట్టు చెడు

  • కట్టు తప్పు; విచ్చలవిడిగా ప్రవర్తించు. కట్టు____కట్టు 349 కట్టు____కట్టు
  • "అదెంత కట్టు చెడినన్ రాకుందురే?" పాణి. 4. 24.
  • చూ. కట్టుతప్పు.

కట్టు చేయు

  • నియతి యేర్పరచు.
  • "ఆ గ్రామంలో ఎవరూ కల్లు గీయకూడదని కట్టు చేసినారు." వా.

కట్టు తప్పు

  • ఈడేరి స్వేచ్ఛగా తిరుగు.
  • "ఇ, ట్లీడేరి కట్టుతప్పిన, చేడియ నికనైన బెండ్లి సేయందగదే?" యయాతి. 3. 100.
  • "కట్టు తప్పిన పిల్ల నింట్లో పెట్టుకొని ఎన్నాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటారు?" వా.

కట్టుదిట్టము చేయు

  • తగినఏర్పాట్లు చేయు.
  • "వాడు ఆ పొలం వ్యవహారం అంతా కట్టుదిట్టం చేసి వెళ్లాడు." వా.

కట్టుదిట్టములు

  • కట్టుబాట్లు; అదుపాజ్ఞలు.
  • "ఆ పిల్లలు కట్టుదిట్టాలు లేకుండా పెరిగారు." వా.

కట్టుదొన

  • కొండలో పారు నీరు ఒక చోట నిలిచినప్పుడు కట్టుదొన అంటారు.
  • కన్నడంలో కోనేరునే కట్టు దొణె అంటారు.
  • "తన చరిత్రాంబునకును ముజ్జగమ్ముల, జనుల వీనులు కట్టుదొనలు గాగ." చంద్రా. 5. 14.

కట్టుపకాసి

  • వీరుడు; ధీరుడు; శూరుడు; క్రూరుడు.
  • "కట్టుపకాసి దీర్ఘదృఢకాయుడు తత్ప్రతిహారపాలకుండు." హరి. పూ. 8. 47.
  • నిర్వ. 4. 54.
  • "ద్రుపదుండు వచ్చి యా, కట్టుపకాసు లిద్దఱకు గ్రక్కున నడ్డము సొచ్చి." భార. భీష్మ. 1. 260.
  • "రావుతుల్ గట్టుపకాసు లై నరుని గప్పిరి." భార. శల్య. 1. 7.
  • "కట్టుపకాసు లై గగనాంగణంబున, మందేహు లింతకు మాఱుకొంద్రు." నైష. 8. 13.
  • బీమ. 4. 47.

కట్టుపడు

  • 1. బందీ యగు.
  • "వల్లభు డిట్లు కట్టుపడువార్త చెవింబడ." దశా. 5. 128.
  • 2. ఏమీ చేయలేని స్థితిలో నుండు.
  • "నే నేదో ఆ పెద్దమనిషి మాటకు కట్టుపడి ఉండిపోవలసి వచ్చింది." వా.
  • 3. తక్కు వగు.
  • ".....శూరుడు, భూమీదాతకు బ్రభావమున గట్టువడున్." భీమ. 5. 65.

కట్టుపఱచు

  • ఆటంకపఱచు, అడ్డగించు.
  • "భానుశశిమార్గములు కట్టు పఱచి." శాకుం. 2. 113.
  • రూ. కట్టుపఱచు. కట్టు____కట్టు 350 కట్టు_____కట్టు

కట్టుపాటు

  • ఏర్పాటు.
  • చూ. కట్టుబాటు.

కట్టుబంట్లు

  • మృగాదులను కట్టుటకై పన్నిన పన్నాగములు. వలలు, ఉరులు వంటివి.
  • "లోలాక్షిదృగ్రుచులో కట్టుబంట్లొ, బాలవీక్షణములో పన్నినవలలొ." పండితా. ప్రథ. పురా. పుట. 333.

కట్టుబండి

  • సరకు నింపినబండి. దీనినే బరువుబండి అని కూడా అంటారు.

కట్టుబడి

  • చేను పట్టాదారుకు, కౌలుకు చేసుకున్న వారు ఏటా యింత అని యిచ్చే ధాన్యాదులు.
  • "ఇరుగుకై జీతంపు టెక్కటీలకు గుజ్జు, పఱపు మామిడి గట్టుబడిగ జేసి." చంద్రా. 4. 84.
  • "మా చేను ఈ సారి కట్టుబడికి ఇచ్చాము. కోరుకు ఇచ్చినప్పు డల్లా వాడు సరిగా లెక్క చూపడం లేదు." వా.
  • చూ. కట్టుపడు; కట్టువడు.

కట్టుబడు

  • లోబడు - నియమబద్ధు డగు.
  • "ధర్మానికి కట్టుబడినాడు." వా.
  • "వాడు మాటకు కట్టుబడి ఉంటాడు." వా.
  • చూ. కట్టుపడు, కట్టువడు.

కట్టుబోతు

  • 1. స్వేచ్ఛాచారి.
  • "కట్టుబోతుల బొడగన్న గౌగిలించు." మల్హ. 3. 4.
  • 2. మంత్రగాడు. మంత్రవేత్తలు వాకట్టు, కను కట్టు మొదలయినవి చేస్తారు. కనుక అట్లా వచ్చిన పలుకుబడి.

కట్టుమట్టుగా

  • నివాసస్థానంగా.
  • "కావించె నెవ్వడు కట్టుమట్టుగ హస్త, తలము సంతతదాతృ తా సురభికి." ఉదయనోదయము. 1. 56.

కట్టుమట్టు చేయు

  • ఏర్పాటు చేయు, కట్టుబాటు చేయు.
  • "సుగ్రీవాజ్ఞ నడవం గట్టుమట్టు చేసి." రామా. 5. 325.
  • వావిళ్ల ని. లో ఈ మాటకు పసులసాల, ఉనికిపట్టు అన్న అర్థాలు కూడా ఉన్నట్లు ఇచ్చారు.

కట్టుమాను

  • తెప్ప. (తమి) కట్టుమరం.

కట్టుమామిడి

  • అంటుమామిడి. విత్తనం వేయకుండా మామిడికొమ్మను నఱికి కట్టు____కట్టె 351 కట్టె____కట్టె
  • వేఱుచోట అంటు కట్టిన మామిడి. చిలుకలు మొదలైనవి కొట్టకుండా బుట్టలు కట్టిన మామిడిచె ట్టని శ. ర. లో చూపిన అర్థం సరి అని తోచదు.

కట్టువడ జేయు

  • కట్టి పెట్టు - ఆపు.
  • "భస్మాంగరాగంబు పని కట్టువడ జేసి." హర. 5.5

కట్టువడు

  • ఆగిపోవు, మూతపడు.
  • "క్రమము దప్పిన మరణముల్ గట్టు వడియె." రుక్మాం. 1. 136.
  • "ఖచరుల త్రోవలు కట్టువడియె." ఉ. రా. 1. 285.
  • "ఆమాట అనేసరికి వాడినోరు కట్టు పడింది." వా.

కట్టు వదలినక్రేపు

  • స్వేచ్ఛాచారి. తాళ్ల. సం. 12. 75.

కట్టె గిట్టె

  • కసవు గట్రా. జం.

కట్టెగుఱ్ఱము

  • ఒక పిల్లల ఆట. ఒక వెదురు కర్రను కాళ్ల సందున పెట్టుకొని దానినే గుఱ్ఱంగా భావించి అదిలిస్తూ పిల్ల లు ఆడుకొనే ఆట.

కట్టెదురు

  • ఎట్టయెదురు.
  • "ఇందుల లే బెయ్య లీకు కట్టెదుర, మంద లై యున్నగోమాతృసంఘంలు..." పండితా. ద్వితీ. పర్వ, పుట. 240. (అదే పుట. 304.)

కట్టెర్ర

  • ఎఱ్ఱదనము.
  • "కట్టెర్ర సోకినట్టి." క్రీడా. పు. 20.

కట్టెవంపు పొయి తీరుస్తుంది

  • ఒక దుర్మార్గునికి ఆ పెద్ద దుర్మార్గుడే సరి అనుపట్ల ఉపయోగించే మాట. కట్టెలు ఎంత వంకరగా ఉన్నా ఆ వంపు మనకు తీయడం ఎటూ సాధ్యంకాదు. పొయ్యిలో పెడితే అంతా భస్మ మై పోతుంది - వంకర ఎలాగూ చక్క నవుతుంది - అన్న వాక్యార్థంపై యేర్పడిన పలుకుబడి.
  • "వీ డిక్కడ అందరనీ యేడిపించుకుని తింటున్నాడు. ఇప్పు డేమో పొరుగూరి కరణమయ్య తగులుకున్నాడు. ఇక వీడిపని సరి. కట్టెవంపు పొయి తీరుస్తుంది మ లే." వా.

కట్టె విఱిచి పొయ్యిలో పెట్టి నట్లు

  • పెడసరముగా.
  • "వా డెప్పుడు మాట్లడినా కట్టె విఱిచి పొయ్యిలో పెట్టినట్లు మాట్లాడుతాడు." వా.